SCERT AP Board 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….! Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….!
6th Class Telugu 12th Lesson ఎంత మంచివారమ్మా….! Textbook Questions and Answers
ప్రశ్నలు – జవాబులు
అ) లఘు ప్రశ్నలు:
ప్రశ్న 1.
యానాది రూపాన్ని వర్ణించండి.
జవాబు:
యానాదుల కళ్లు నిర్మలంగా ఉంటాయి. వీరి కనుబొమ్మలు విల్లుల వలె ఒంపులు తిరిగి ఉంటాయి. వీరిది ఉంగరాల జుట్టు. వీరి పెదవులు సన్నగా ఉంటాయి. వీరు సన్నగా ఉంటారు. వీరు చాలా వేగంగా పరుగెత్తడానికి అనువైన లేసైన కాలిపిక్కలు కలిగి ఉంటారు. సన్నని నడుములు కలిగి ఉంటారు. చిరునవ్వుతో జీవిస్తారు. ఆదివాసులందరిలో యానాదులే అందగాళ్లని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం.
ప్రశ్న 2.
యానాదులు నిరాడంబర భక్తులు – సమర్థించండి.
జవాబు:
వీరు భజనలు, మౌనధ్యానాలు, మంత్రతంత్రాలు ఇష్టపడరు,” యానాదుల దైవం వేంకటేశ్వరస్వామి, ఆయన కొబ్బరి కాయలతో, తులసిదళాలతో సులభంగా తృప్తిపడతాడని వీరి ఉద్దేశం. వీళ్లు వేటకు వెళ్లేముందు కాట్రాయుడికి మొక్కుతారు. అంటువ్యాధులు వస్తే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసియుండే చెట్ల దగ్గర, గ్రామవావిళ్ల దగ్గర ప్రార్థిస్తుంటారు. వీరు యక్షగానం ప్రదర్శిస్తారు.
ప్రశ్న 3.
యానాదుల భాషణం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
యానాదులు మాట్లాడేటపుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారుతాయి. ఒత్తులు లేని పదాలకు ఒత్తులు కల్పించి, భాషకు కొత్త అందాలను తెస్తారు. బావను భావ అని పలికినట్లు. వీరు తక్కువగా మాట్లాడే మిత భాషులు.
ఆ) వ్యాసరూప ప్రశ్నలు:
ప్రశ్న 1.
యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి?
జవాబు:
యానాదులు కష్టజీవులు. కష్టపడి బతుకుతారు. వనమూలికలు, కషాయాలతో వైద్యం చేసుకొంటారు. చిరునవ్వుతో ఆదరిస్తారు. అల్ప సంతోషులు, నిబ్బరంగా జీవిస్తారు. బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగలవారు. నేటి తరంలో యానాదులు సగౌరవంగా జీవిస్తున్నారు. వారి భాషను అభివృద్ధి చేసుకొన్నారు. విద్యావంతులయ్యారు. ఆంధ్ర దేశాభివృద్ధిలో వారూ భాగస్వాములయ్యారు. పరస్పర సహకారంతో జీవిస్తున్నారు. మన తెలుగు వారి పట్ల అభిమానంగా అందరూ నావాళ్లే అనే భావంతో ఉంటారు. సంఘశక్తిని పెంచడంలో భాగస్వాములయ్యారు. అత్యున్నత పదవులను పొందడంలో పౌరుషం, పట్టుదల, దీక్ష చూపించారు. ఇవన్నీ యానాదుల నుండి నేర్చుకొనతగినవి. గర్వించతగిన లక్షణాలు.
ప్రశ్న 2.
“యానాది వేదాంతి” – దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. వారికి ఆస్తి మీద ఆశ ఉండదు. వారి కాయ కష్టం మీద వారు ఆధారపడి జీవిస్తారు. వీరు ఇంటిని కూడా చెట్లకొమ్మలు, చిట్టి వెదుళ్లు, వెదురు బొంగులతో ‘ వలయాకారంగా నిర్మిస్తారు. ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వారి ఇంటికి కుడి ప్రక్కన గుంటపొయ్యి, నీళ్లకుండలు, చెంబు ఉంటాయి. ఎడమ పక్క తట్టలు, బుట్టలు ఉంటాయి. మధ్యలో రోకటి గుంట ఉంటుంది. నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట ఉంటుంది. వాకిలి వెనుక జాజి చెక్కల పెట్టె ఉంటుంది. దానిపై వేలాడ గట్టిన ఈతాకుల చాప ఉంటుంది. చూరులో దూపిన గెసిక కర్ర ఉంటుంది. ఇంత నిరాడంబరంగా జీవిస్తాడు. జీవితం అశాశ్వతం, ఐశ్వర్యం నిలబడదు అనే సందేశం తన జీవన విధానం ద్వారా ఇస్తాడు కనుకనే యానాదిని వేదాంతి అనవచ్చు.
పాఠ్యభాగ సారాంశం
మనదేశంలో ఉన్న ప్రాచీన జాతుల్లో యానాదులు ఒకరు. వీరందరూ నిరాడంబరంగా జీవిస్తారు. కష్టజీవులు. అనాది అనే పదం నుంచి యానాది పదం పుట్టి ఉండొచ్చు. అడవుల్లో దొరికే తేనె, మూలికలు, కలప, వెదురు తెచ్చి గ్రామాల్లో అమ్మి తమకు అవసరమైన వస్తువులను కొనుక్కుంటారు.
యానాదులు నిర్మలమైన కళ్ళు, అందమైన కనుబొమ్మలు, సన్నని పెదవులు, గట్టి శరీరంతో అందంగా ఉంటారు. వీరు జంతువుల జాడలను, మనుషుల జాడలను పసిగట్టడంలో నేర్పరులు. పులులు, చిరుతలు మొదలైన జంతువుల జాడలు తెలుసుకుంటారు. వీళ్ళకు పాములంటే భయం లేదు. మూలికలు వీళ్ళకు బాగా తెలుసు. కుండ కషాయాలు, మూలికలే వీరికి ఔషధాలు.
యానాదులు గొప్ప వేదాంతులు. వీరికి. ఆస్తులు ఉండవు. వీళ్ళ ఇళ్ళు ప్రత్యేకంగా, నిరాడంబరంగా ఉంటాయి. వీళ్ళు అల్ప సంతోషులు అయినందువల్ల వీరికి నిరాశానిస్పృహ, ఈర్షాద్వేషాలు, అసూయలు ఉండవు. మితభాషులు. వీరికి పండుగకు, పస్తుకు తేడా తెలియదు. వీళ్ళు మాంసాహారంతో పాటు శాకాహారం తీసుకుంటారు. మద్యపానం చేయరు. మంచి, మర్యాద వంటి సుగుణాలు వారి పెదవుల పైన చిరునవ్వులో కనిపిస్తాయి. వీరి తెలుగుమాటల్లో ఒత్తులు ఎక్కువగా ఉంటాయి.
యానాదులు తిరునాళ్ళు, తోలుబొమ్మలాటకు ఇంటిల్లిపాది వెళతారు. యక్షగానాలు వీరు ప్రదర్శిస్తారు. యానాదుల భాగవతాలు, యువతుల గొబ్బిపాటలు ఎంతో మధురంగా ఉంటాయి. వీరు వెంకటేశ్వర్లును పూజిస్తారు. వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి మొక్కుతారు. మహాలక్ష్మమ్మను, పోలేరమ్మను ప్రార్థిస్తారు.
యానాదులు అందగాళ్ళేకాదు అమాయకులు, నీతిమంతులు. నేటి తరంలో యానాదులు కూడా చదువుకొని జనంతో జేరి పురోగమిస్తున్నారు. సంఘాభిమానం, సహకారం, పౌరుషం మొదలైన లక్షణాలతో ఉన్నత పదవులు పొందుతున్నారు.
కవి పరిచయం
రచయిత పేరు : వెన్నెలకంటి రాఘవయ్య
కాలం : 4.6.1897 నుండి 24.11.1981.
ప్రత్యేకతలు : 1. వారు నెల్లూరు గాంధీగా ప్రసిద్ధులు
2. వారు స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసేవకులు, చరిత్రకారులు.
3. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని 21 నెలలు జైలుశిక్ష అనుభవించారు.
పురస్కారాలు : 1973లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.
రచనలు : ‘యానాదులు’, ‘భారతదేశంలో ఆదివాసులు’ మొదలైన 22 పుస్తకాలు రాశారు.
అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 తెలుగు పుస్తకాలు రచించారు.