SCERT AP 8th Class Biology Study Material Pdf 10th Lesson పీల్చలేము – తాగలేము Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 10th Lesson Questions and Answers పీల్చలేము – తాగలేము
8th Class Biology 10th Lesson పీల్చలేము – తాగలేము Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
గాలి కాలుష్యం నీటి కాలుష్యానికి ఏ విధంగా దారితీస్తుంది ?
జవాబు:
గాలికాలుష్యం నీటి కాలుష్యానికి ఈ క్రింది విధంగా దారితీయును.
1. గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సెడ్ నీటి ఆవిరిలో కరిగి ఆమ్లాలుగా మారి వర్షం పడినపుడు నీటిలో ఆమ్లం 2. గుణం తెచ్చును.
2. గాలిలో ఉన్న CO2 గ్లోబల్ వార్మింగ్ వలన నీటి ఉష్ణోగ్రత పెరిగి నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి నీటి కాలుష్యం జరుగును.
ప్రశ్న 2.
“పారదర్శకంగా మరియు స్వచ్ఛంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోతుంది” దానిపై మీ అభిప్రాయంను తెలియచేయండి.
జవాబు:
- పారదర్శకంగా మరియు స్వచ్చంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోదు.
- కారణం దానిలో కంటికి కనిపించని సూక్ష్మజీవులు అయిన వైరస్లు, బాక్టీరియాలు, ప్రోటోజోవాలు ఉండవచ్చు.
- అంతేకాక నీటి కలుషితాలు కూడా ఉండవచ్చు.
ప్రశ్న 3.
తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడం గాలి కాలుష్య ప్రభావానికి లోనవుతుంది. దానిని రక్షించటానికి నీవు ఇచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడం గాలి కాలుష్యం నుండి రక్షించడానికి నేను ఇచ్చే సలహాలు :
- మోటారు సైకిలు, కార్లు బదులు ఆ ప్రాంతంలో సైకిళ్ళు, గుర్రపు బండ్లు వాడాలి.
- వాహనాలలో కాలుష్యం తక్కువ వెదజల్లే CNG, LPG ల వంటి ఇంధనాలు వాడాలి.
- సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చి దానితో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.
- తాజ్ మహల్ పరిసరాలలో సీసం లేని పెట్రోల్ ఉపయోగించే వాహనాలనే వాడాలి.
- కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఆగ్రా నగరానికి దూరంగా తరలించాలి
- ఆగ్రా నగర చుట్టుప్రక్కల చెట్లు బాగా పెంచాలి.
ప్రశ్న 4.
గాలి కాలుష్యం, నీటి కాలుష్యం నియంత్రించుటకు తీసుకోదగిన చర్యలు ఏవి ?
జవాబు:
- గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఫ్యాక్టరీల మీద పొడవైన చిమ్నీలు ఏర్పాటుచేయాలి.
- ఇంటిలో గాని, పరిశ్రమలోగాని ఇంధనాలను పూర్తిగా మండించే పరికరాలను ఉపయోగించాలి.
- ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ (Electrostatic precipitaters) పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటుచేయాలి.
- వాహనాల నుండి వెలువడే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సి.ఎన్.జి (Compressed Natural Gas) ని వాడాలి.
- ఇంటిలో వంటకు ఎల్.పి.జి (Liquid Petroleum Gas) ఉపయోగించాలి.
- వాహనాలలో వాడే ఇంధనాలు నాణ్యత కలిగి ఉండాలి.
- పునరుద్దరింపదగిన శక్తి వనరులైన సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తి, జలవిద్యుత్ ను ఉపయోగించాలి.
- కాలుష్య నియంత్రణ నియమాల ప్రకారం అన్ని వాహనాలు తప్పకుండా క్రమపద్ధతిలో నిర్వహించాలి.
- సీసం లేని పెట్రోల్‌ను ఉపయోగించాలి.
- మీ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలలో వీలైనన్ని ఎక్కువ చెట్లను పెంచాలి.
నీటి కాలుష్యం నియంత్రించుటకు తీసుకోదగిన చర్యలు :
- పరిశ్రమల నుండి విడుదల అయ్యే వ్యర్థ పదార్థములను రసాయనికంగా శుద్ధి చేయడం లేదా హానికరమైన దార్థములను లేకుండా చేసి నదులలోనికి, సరస్సులలోనికి విడుదల చేయడం.
- మురుగునీరు ప్రత్యక్షంగా నదులలోనికి విడుదల చేయకూడదు. ముందుగా శుద్ధి చేసే ప్లాంట్ లో శుద్ధిచేసి వాటిలో ఉండే ఆర్గానిక్ పదార్థాలను తీసివేయాలి.
- ఎరువులను, పురుగులను చంపే మందులను ఎక్కువ ఉపయోగించడం తగ్గించాలి.
- సింథటిక్ డిటర్జెంట్ల వినియోగం తగ్గించాలి. నీటిలో, నేలలో కలిసిపోయే డిటర్జెంట్లు ఉపయోగించాలి.
- చనిపోయిన మానవుల శవాలను మరియు జంతు కళేబరాలను నదులలోనికి విసిరివేయరాదు.
- వ్యర్థ పదార్థాలను, జంతువుల విసర్జితాలను బయోగ్యాస్ ప్లాంట్ లో ఇంధనం కోసం ఉపయోగించిన తర్వాత ఎరువుగా వాడుకోవాలి.
- నదులు, చెరువులు, కుంటలు, సరస్సులలోని నీరు తప్పకుండా శుభ్రం చేయాలి. ఈ విధానాన్ని పరిశ్రమల యాజమాన్యాలు మరియు ప్రభుత్వం వారు తప్పకుండా చేపట్టాలి. ఉదాహరణకు భారత ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన గంగానది ప్రక్షాళన పథకం.
- నదుల తీరం వెంబడి చెట్లు, పొదలు తప్పకుండా పెంచాలి.
- నీరు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం నీటి కాలుష్యం వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలి. ముఖ్యంగా ప్లాస్టిక్, వ్యర్థాలు, కాగితాలు, వ్యర్థ ఆహారపదార్థాలు, మురిగిపోయిన ఆహారపదార్థాలు, . కూరగాయలు మొదలైన వాటిని వీధిలోకి విసిరివేయకుండా చూడాలి.
- కాలుష్యాన్ని తగ్గించుటకు 4R (Recycle, Reuse, Recover, Reduce) నియమాలను అమలుపరచి వనరులను పునరుద్ధరించాలి.
- తరిగిపోయే ఇంధనాలను ఉపయోగించడం చాలావరకు తగ్గించాలి. ప్రత్యామ్నాయ శక్తి వనరులను వాతావరణానికి హానికరం కాకుండా ఉపయోగించాలి.
- ప్రాథమిక ఉద్దేశంతో పదార్థాలను ఉపయోగించినపుడు వాటిలో కొన్నింటిని రెండవసారి కూడా ఉపయోగించాలి (తిరిగివాడుకోవడం).
- ఉదా : తెల్ల కాగితానికి ఒకవైపు ప్రింట్ తీసుకోవడం, ఒకే వైపు రాయడం కాకుండా రెండవవైపును కూడా ఉపయోగించినట్లయితే ఎక్కువ కాగితాలు వృథాకాకుండా చూడవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే కాగితం కోసం ఎక్కువ చెట్లు నరకడం తగ్గిపోతుంది.
- వీలైనన్ని ఎక్కువ పదార్థాలు తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా నష్టం జరగనంత వరకు చేస్తూనే ఉండాలి.
ప్రశ్న 5.
నీటిలో పోషకాల స్థాయి పెరగటం వలన నీటి జీవుల మనుగడపై ఏవిధంగా ప్రభావం చూపుతుంది ?
జవాబు:
నీటిలో పోషకాల స్థాయి పెరగడం వలన శైవలాలు, కలుపు మొక్కలు మరియు బాక్టీరియాలు విస్తరించును. నీరు చివరకు ఆకుపచ్చగా, మురికిగా వాసనపట్టిన పెట్టుగా తయారవుతుంది. నీటిలో కుళ్లుతున్న మొక్కలు ఆక్సిజనన్ను ఉపయోగించు కొంటాయి. నీటి జీవులకు సరిపడు ఆక్సిజన్ అందక చివరకు అవి మరణించును. జీవవైవిధ్యం తగ్గును.
ప్రశ్న 6.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు సక్రమంగా పెరగవు. కారణాలు కనుగొని, మీ వాదనను వివరించండి.
జవాబు:
- ఎక్కువ వాహనాలు రోడ్డుపై తిరుగుతాయి. వాహనాల నుండి విడుదలగు కాలుష్య పదార్థాలు మొక్కల పెరుగుదల తగ్గిస్తాయి.
- జనం ఎక్కువగా ఉండటం వలన పచ్చిగా ఉన్నప్పుడే చెట్లను తుంపుతారు.
- మొక్కల ఆకులపై కాలుష్య పదార్థాలు చేరి కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు ఆటంకము ఏర్పడును మరియు బాష్పోత్సేకపు రేటు తగ్గును.
- హైడ్రోకార్బనులు ఆకులు రాలుటకు సహాయపడును మరియు మొక్కల అనేక భాగాల రంగును కోల్పోయేలా చేయును.
- రాత్రిపూట రోడ్లపై ఉన్న ప్రదేశాలలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉండును. మొక్కలకు రాత్రి సమయంలో సరిపడు ఆక్సిజన్ కూడా అందక పెరుగుదల తక్కువగా ఉండును.
- వాటికి నీటి సదుపాయం కూడా సరిగా ఉండకపోవడం వల్ల పెరుగుదల సక్రమంగా ఉండదు.
ప్రశ్న 7.
రసాయనిక పరిశ్రమలో నీవు జనరల్ మేనేజర్ గా ఉంటే నీవు గాలి మరియు నీరు కాలుష్యం కాకుండా తీసుకొను చర్యలు మరియు ముందు జాగ్రత్తలు ఏమి ?
జవాబు:
గాలి మరియు నీరు కాలుష్యం కాకుండా తీసుకొను చర్యలు:
- గాలిలో తేలియాడే రేణువులను తొలగించుట స్థిర విద్యుత్ అవక్షేపాలను ఉపయోగించటం చేస్తాను.
- లెడ్ లేని పెట్రోల్ ను వాహనాలకు ఉపయోగిస్తాను.
- చెట్లను బాగా పెంచుతాను.
- మురుగు నీరు నదులలోకి, చెరువులలోకి కలవకుండా చూస్తాను.
- ఒకవేళ కలిసే పరిస్థితి వస్తే దానిలోని హానికారక పదార్థాలు తొలగిస్తాను.
- పరిశ్రమ నుంచి వచ్చే వేడినీటిని కూలింగ్ టవర్స్ లో చల్లబరచి విడుదల చేస్తాను.
గాలి మరియు నీరు కలుషితం కాకుండా ముందు జాగ్రత్తలు :
- విద్యుత్ దుర్వినియోగం లేకుండా ఉంచుతాను. దీని వలన విద్యుత్ ఆదా అగును. అందువలన థర్మల్, అణు విద్యుత్ తయారీ వలన వచ్చే కాలుష్యం తగ్గించవచ్చును.
- అందరూ పబ్లిక్ ట్రాన్స్పర్ట్ ఉపయోగించేలా చేస్తాను. దీని వలన చాలా కార్లు మరియు బైకులు ఇతర వాహనాల వినియోగం తగ్గి వాయు కాలుష్యం తగ్గును.
- పరిశ్రమలో ఉన్న అంతా సామగ్రి చక్కని నిర్వహణలో ఉంచుతాను. దీని వలన అన్ని యంత్రాలు చక్కగా పనిచేయును. అందువలన కాలుష్య పదార్థాలు గాలిలోకి, నీటిలోకి విడుదల అవ్వవు.
ప్రశ్న 8.
కింది అంశంపై చర్చించండి. కార్బన్ డయాక్సెడ్ కాలుష్యకారకమా ? కాదా ?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో 0.03% ఉంటే కాలుష్య కారకము కాదు. కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో 0.03% కంటే ఎక్కువ ఉంటే కాలుష్య కారకం అంటారు. కారణం కారకం చేరిక వలన వాతావరణంలో సజీవ, నిర్జీవ అంశాలలో వచ్చే మార్పులను కాలుష్యం అంటారు. కాలుష్యం కలుగజేయు కారకాలను కలుషితాలు అంటారు. CO2 వాతావరణంలో 0.03% కంటే ఎక్కువ ఉంటే భూమి ఉష్ణోగ్రత పెరుగును.
అప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చును. CO2 వలన మానవులకు అలసట, చికాకు కలుగును. గ్లోబల్ వార్మింగ్ వలన ధృవ ప్రాంతాలలో మంచు కరిగి భూమిపై పల్లపు ప్రాంతాలను ముంచును. వాతావరణంలో ఏ వాయువు కాని, పదార్థము కాని ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే అది కాలుష్య కారకమే.
ప్రశ్న 9.
గాలి, నీరు కాలుష్యంపై క్విజ్ ప్రోగ్రామ్ ను నిర్వహించటానికి ఆలోచన రేకెత్తించే 5 ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
- హీమోగ్లోబిన్ ఆక్సిజన్ కంటే దేనిని తొందరగా అంటిపెట్టుకొనును ?
- C.N.G అనగా నేమి?
- యూట్రాఫికేషన్ అనేది ఏ కాలుష్యంలో వింటాము ?
- ఆమ్ల వర్షమునకు కారణమైన వాయువులు ఏవి ?
- భారత పురావస్తుశాఖ ‘నో డ్రైవ్ జోన్”గా ఎక్కడ ప్రకటించినది ?
గమనిక : ఇంకా చాలా ప్రశ్నలు టీచర్స్ పిల్లల చేత తయారు చేయించవచ్చును.
ప్రశ్న 10.
నీకు దగ్గరలో ఉన్న కాలుష్య నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి, వాహనాల కాలుష్యం నిర్ధారించే విధానాన్ని పరిశీలించండి. దిగువ చూపబడిన అంశాలను నమోదు చేయండి. నిర్ణీత సమయములో పరిశీలించిన సరాసరి వాహనాల సంఖ్య, ప్రతి వాహనం తనిఖీ చేయడానికి పట్టు సమయం, ఏయే కాలుష్య కారకాలు తనిఖీ చేశారు ? పరీక్ష పద్ధతి ఏ విధంగా ఉన్నది ?, వివిధ కాలుష్య కారకాలు విడుదల అయ్యే వాటిలో అనుమతించబడిన వాటి పరిధి ఎంత ? విడుదల అయ్యే వాయువుల పరిధి దాటితే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి ?
జవాబు:
- నిర్ణీత సమయంలో. పరిశీలించిన సరాసరి వాహనాల సంఖ్య – 5 లేదా 6 – గంటకు.
- ప్రతి వాహనం తనిఖీ చేయటానికి పట్టిన సమయం – 10 నిమిషాలు
- ఏయే కాలుష్య కారకాలు తనిఖీ చేశారు – కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్స్ (HC) & CO2
- పరీక్ష పద్ధతి – Computer Analysis
- వివిధ కాలుష్య కారకాలు విడుదల అయ్యే వాటిలో అనుమతించబడిన వాటి పరిధి – కార్బన్ మోనాక్సైడ్ 2000 సంవత్సరం ముందు వాహనం అయితే 4.5%, 2000 సంవత్సరం తర్వాత అయితే 3.5% ఉండాలి.
హైడ్రోకార్బన్లు 2000 సంవత్సరం ముందు వాహనం అయితే 9,000, 2000 సంవత్సరం దాటిన తర్వాత అయితే 4,500 వరకు ఉండవచ్చు. విడుదల అయ్యే వాయువుల పరిధి దాటితే తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. ఇంజన్ సరిగా పనిచేసే విధంగా చూడాలి. దీని వలన ఇంధనం పూర్తిగా మండి CO2 విడుదల అవుతుంది.
2. వాయువులు విడుదల చేసే గొట్టంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.
ప్రశ్న 11.
మీ గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువు / సరస్సు /నది దగ్గరకి మీ టీచరుతో కలసి వెళ్ళండి. కింది అంశాలు పరిశీలించి చర్చించండి. చెరువు / సరస్సు / నది గతచరిత్ర, నది / చెరువు / సరస్సు. కాకుండా వేరే నీటి వనరులు ఉన్నాయా ! సాంస్కృతిక అంశాలు, కాలుష్యానికి కారణాలు, కాలుష్యం జరగటానికి మూలం, నది దగ్గరలో మరియు దూరంగా నివసిస్తున్న వారిపై కాలుష్య ప్రభావం ఎంత వరకు ఉన్నది ?
జవాబు:
1. మా గ్రామానికి దగ్గరగా ఉన్నది కృష్ణానది. ఈ నది అంతా నల్లరేగడి నేలలో ప్రవహించుట వలన కృష్ణానది అని పేరు వచ్చినది (కృష్ణా – నలుపు).
2. వేరే నీటి వనరులు ఉన్నాయి. బావులు, కాలువలు.
3. సాంస్కృతిక అంశాలు : ఈ నదిలో స్నానం చేయుట వలన పుణ్యం వస్తుందని భావిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మరియు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో కృష్ణానదిలో కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం జరుగును.
కాలుష్యానికి కారణాలు : కృష్ణానదిలో పరిశ్రమల కాలుష్యాలు కలవడం, పట్టణ జనాభా వలన కొన్ని కలుషితాలు కృష్ణా నదిలోనికి విడుదలవడం, బట్టలు ఉతకడం, మలమూత్రాల విసర్జన, దహన సంస్కారాలు చేయుట, నదిలో పుణ్య స్నానాలు ఆచరించడం, థర్మల్ పవర్ స్టేషన్లోని కలుషితాలు చేరడం.
కాలుష్యం జరగటానికి మూలం : నది దగ్గరలో పరిశ్రమలు ఉంటే అక్కడి వారిపై కాలుష్య ప్రభావం ఎక్కువగాను, నది ప్రవహించుట వలన దూరంగా నివసిస్తున్న వారిపై కాలుష్య ప్రభావం తక్కువగాను ఉండును.
గమనిక : వారి గ్రామంలో / దగ్గరలో ఉన్న దానిపై పై అంశాలు పరిశీలించి చర్చించండి.
ప్రశ్న 12.
గాలి కాలుష్యం అనగానేమి ? గాలి కాలుష్యానికి కారణాలు దానివల్ల తలెత్తే సమస్యలను, చార్ట్ ను తయారుచేయండి.
జవాబు:
మానవ చర్యల వలన గాని, ప్రకృతిలో జరిగే మార్పుల వలన గాని వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దానిని గాలి కాలుష్యం (Air pollution) అంటారు . గాలి కాలుష్యానికి కారణాలు మరియు ప్రభావములతో కూడిన ఫ్లోచార్ట్:
ప్రశ్న 13.
సుధీర్ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇతను ఆరోగ్యవంతంగా ఉండటానికి నీవు ఏమి సూచనలు ఇస్తావు ? ఇతని విధి నిర్వహణలో ఆరోగ్య రక్షణకు నీవు ఇచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
ఇతను ఆరోగ్యవంతంగా ఉండడానికి నేను ఇచ్చే సూచనలు :
1. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే దుమ్ము, ధూళి ఉన్న బట్టలు మార్చుకోవాలి.
2. ఎండలో ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి.
3. ఎక్కువ సేపు నుంచొని ఉండాలి కాబట్టి శక్తిని ఇచ్చే పదార్థాలు తీసుకోవాలి.
ఇతని విధి నిర్వహణలో ఆరోగ్య రక్షణకు నేను ఇచ్చే సలహాలు :
1. దుమ్ము, ధూళి, కాలుష్య పదార్థాలు శరీరంలోనికి ప్రవేశించకుండా మ్కాలు వేసుకోవాలి.
2. తలకు ఉష్ణవాహక పదార్థాలతో తయారుచేయబడిన హెల్మెట్ వాడాలి.
3. ఎండ, వాన నుంచి రక్షణకు అతనికి ఇచ్చిన కాబిలో ఉండాలి.
ప్రశ్న 14.
“బైకులు, కార్లు వద్దు సైకిలే ముద్దు” ఈ నినాదాన్ని శ్రీవాణి తయారుచేసినది. మీరు కూడా కాలుష్యం నియంత్రణపై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
బైకులు, కార్లు వద్దు సైకిలే ముద్దు ఈ నినాదాన్ని శ్రీవాణి తయారుచేసింది. నేను కూడా కాలుష్య నియంత్రణపై కొన్ని నినాదాలు తయారుచేశాను. అవి
- చెట్లు పెంచు-కాలుష్యాన్ని తగ్గించు.
- కాలుష్యాన్ని తగ్గించు-మంచి ఫలితాన్ని పొందు.
- మనిషి స్వార్థమే-కాలుష్యానికి మూలం.
- గాలి కాలుష్యం తగ్గించు-ప్రకృతిని కాపాడు.
- చెట్లు పెంచు-కాలుష్యాన్ని పారద్రోలు.
- ఫ్రిజ్ లు తగ్గించు-కుండలు పెంచు.
- కాలుష్యాన్ని తగ్గించు-జీవితకాలం పెంచు.
- కాలుష్య నివారణకు-అందరూ కృషి చేయాలి.
ప్రశ్న 15.
రేష్మ నేల కాలుష్యంపై వక్తృత్వ పోటీలో పాల్గొనదలచింది. ఆమె కోసం ఒక వ్యాసం రూపొందించండి.
జవాబు:
నేల మనతోపాటు వందలాది జీవులకు జీవనాధారం. కానీ మానవుని విచక్షణా రహిత చర్యల వలన నేల కాలుష్యకోరలలో చిక్కుకొనిపోయింది. నేల తన సహజ స్వభావాన్ని కోల్పోవుట వలన నేలలోని సూక్ష్మజీవుల నుండి, నేలపైన నివసించే వేలాది జీవుల వరకు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారాలు, గుల్మనాశకాలు, పరిశ్రమవ్యర్థాలు, భూమిని పాడుచేస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, పాలిథీన్ కవర్లు భూమాత గర్భంలో జీర్ణంకాని పదార్థాలుగా మిగులుతున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే, నేల తన సహజగుణాన్ని కోల్పోయి నిర్జీవ ఆవాసంగా మారుతుంది. ఇది మనం కూర్చున్న కొమ్మను నరుక్కొన్న రీతి అవుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నేలకాలుష్యం గురించి తీవ్రంగా ఆలోచిద్దాం. కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేద్దాం. ప్లాస్టిక్స్, పాలిథిన్ కవర్లను నిషేధిద్దాం. మన భూమాతను రక్షించుకుందాం.
ప్రశ్న 16.
కవిత తన మిత్రుడు కౌశిక్ తో “ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని కన్నా మట్టితో చేసిన వినాయకుని పూజించటం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు” అని చెప్పింది. నీవు ఆమెను ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
మట్టితో చేసిన వినాయకుడు నీటిలో వెంటనే కలిసిపోవును. అందువలన నీటి కాలుష్యం జరగదు. దీని వలన పర్యావరణానికి హాని జరగదు. ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని వలన అనేక నష్టాలు ఉన్నాయి. అవి నీటిలో కరగవు. అంతేకాక వాటిలో ఆస్ బెస్టాస్, ఆంటిమొని, పాదరసం, లెడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. దీని వలన ఆ నీరు మరియు ఆ నీటిలో నివసించు జీవులకు హాని కలిగి కొన్నిసార్లు చాలా జీవులు చనిపోవును.
మట్టి వినాయకుని వలన పై నష్టాలు జరుగవు. కాబట్టి కవిత తన మిత్రుడు కౌశిక్ తో “ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని కన్నా మట్టితో చేసిన వినాయకుని పూజించటం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు” అని చెప్పింది.
పై విషయాలు తెలుసుకొని తన మిత్రుడితో చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా టీచర్ కి చెప్పి స్కూల్లో పిల్లలు అందరికి మట్టి వినాయకుని వలన కలిగే లాభాలు కవిత చేత వివరించి మరియు అసెంబ్లీలో హెడ్ మాష్టారుకి చెప్పి స్కూలు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తాను. 8వ తరగతిలోనే పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగి ఉండుట మాత్రమేకాక దాన్ని నిజజీవిత పరిస్థితులకు అన్వయించినందుకు కవితను నేను మెచ్చుకుంటాను.
ప్రశ్న 17.
మీ గ్రామంలోని లేదా దగ్గరలో ఉన్న చెరువు ఏవిధంగా కాలుష్యానికి గురి అవుతుందో తెలుసుకొని, కాలుష్యానికి గురి కాకుండా నీవేమి చేస్తావు?
జవాబు:
- పశువులను చెరువులో కడుగుట వలన
- చెరువులలో మనుషులు స్నానాలు చేయుట వలన , చెరువులో బట్టలు ఉతుకుట వలన
- చెరువులో మలమూత్రాలు విసర్జించుట వలన
- చెరువులోనికి ఇంట్లో నుంచి వచ్చిన చెత్తా చెదారములను వేయుట వలన
- వ్యవసాయదారులు మొక్కలకు ఉపయోగించిన ఎరువులు మరియు శిలీంధ్రనాశకాలను, డబ్బాలను చెరువులలో కడుగుట వలన, చెరువు గట్టుపై నివసించువారు అంట్లు చెరువులో కడుగుట వలన
- చెరువు దగ్గరగా పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాస్టు పారవేయుట వలన
- చెరువులలో ఇష్టానుసారంగా నీటి మొక్కలు (గుర్రపు డెక్క) పెరుగుట వలన.
పై కారణాల వలన మా ఊరిలో చెరువు కాలుష్యం అగును.
8th Class Biology 10th Lesson పీల్చలేము – తాగలేము InText Questions and Answers
కృత్యములు
1. ప్రకృతి వైపరీత్యాలు – కాలుష్యం :
మీరు పాఠశాల గ్రంథాలయానికి వెళ్ళి ఈ దశాబ్దంలో ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ఈ కింది ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని జాబితా రాయండి.
జవాబు:
2. నూనె కాగిత ప్రయోగం:
5 × 5 సెం.మీ. కొలతలు గలిగిన చతురస్రాకారపు తెల్లకాగితాలను మూడింటిని తీసుకొని నూనెలో ముంచండి. వీటిని మూడు వేర్వేరు ప్రాంతాలలో వ్రేలాడదీయండి. ఒకదానిని మీ ఇంటి దగ్గర, రెండవదానిని పాఠశాలలో, మూడవదానిని ఉద్యానవనం దగ్గర కాని వాహనాలు నిలిపే స్థలంలో గాని వ్రేలాడదీయండి. వాటిని 30 ని||లు వరకు ఉంచి పరిశీలించండి.
ఎ) నూనెలో ముంచిన తెల్ల కాగితాల మీద మీరు ఏమి గమనించారు ?
జవాబు:
నూనెలో ముంచిన తెల్ల కాగితాల మీద మేము దుమ్ము, ధూళి గమనించాము.
బి) ఈ మూడు ప్రాంతాలలో ఉంచిన కాగితాలపై ఏమైనా మార్పులు ఉన్నాయా ?
జవాబు:
ఈ మూడు ప్రాంతాలలో ఉంచిన కాగితాలపై మార్పులు ఉన్నాయి.
సి) వీటికి జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాటి కారణాలు తెలుసుకోండి.
జవాబు:
1. మా ఇంటి దగ్గర ఉంచిన కాగితంపై దుమ్ము, ధూళి కొంచెం తక్కువగా ఉన్నాయి.
2. పాఠశాలలో ఉంచిన కాగితంపై దుమ్ము, ధూళి కొంచెం ఎక్కువగా ఏర్పడినది. కారణం మా పాఠశాల జనం రద్దీ ఉన్నచోట ఉంటుంది.
3. మూడవదానిని నేను వాహనాలు నిలిపిన స్థలంలో ఉంచాను. కాబట్టి కాగితంపై చాలా ఎక్కువ దుమ్ము, ధూళితో పాటు కొంచెము మసి కూడా గమనించాను. కారణం వాహనాల నుండి పొగ ఎక్కువ వస్తుంది కాబట్టి.
3. విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సమాచారము :
విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సమాచారం : మీరు పాఠశాల గ్రంథాలయాన్ని సందర్శించి వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సమాచారంతో పట్టికను తయారుచేయండి. ఇంతే కాకుండా మన దేశంలో అనేక తక్కువ స్థాయి విద్యుదుత్పత్తి కేంద్రాలు కూడా కాలుష్య కారకాలను గాలిలోనికి విడుదల చేసి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వాటిపై చర్చించండి.
జవాబు:
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి.
1. జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలు
2. థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు
3. అణువిద్యుచ్ఛక్తి కేంద్రాలు.
జలవిద్యుత్ శక్తి కేంద్రాలు :
థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు :
అణు విద్యుత్ శక్తి కేంద్రాలు :
తక్కువ స్థాయి విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి (ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు) బూడిద, ధూళి, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి పదార్థాలు, ఇతర వ్యర్థ పదార్థాల ద్వారా గాలి, నీరు, నేల కాలుష్యం అవుతున్నాయి.
4. క్షేత్రపర్యటన :
క్షేత్రపర్యటన : దగ్గరలో ఉన్న పరిశ్రమను (ఇటుకల తయారీ, బియ్యం మిల్లు, ఆయిల్ మిల్లు, ఆహారపదార్థాలను తయారుచేసేవి మొదలగునవి) సందర్శించి దిగువ పేర్కొన్న అంశాలను పరిశీలించండి.
అ) ఇవి గాలి, నీటిని ఏ విధముగా కలుషితం చేస్తున్నాయి ?
జవాబు:
గాలిలోకి బియ్యపు ఊక విడుదల అవుతుంది. ఊక గాలిలో కలిసి కాలుష్యం చేస్తుంది. ఉప్పుడు బియ్యం తయారుచేయుట, నీటిని ఎక్కువగా ఉపయోగించుట వలన కర్బనిక పదార్థాలు నీటిలోకి చేరి నీటిని పాడు (కాలుష్యం) చేస్తాయి.
ఆ) ఫ్యాక్టరీల చుట్టూ పచ్చదనం ఉందా ? ఉంటే వాటి పేర్లను రాయండి.
జవాబు:
ఫ్యాక్టరీల చుట్టూ పచ్చదనం ఉంది. వాటి పేర్లు : అశోక చెట్లు, తురాయి పూలచెట్లు.
ఇ) కాలుష్యం నివారించడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:
- ఊక నిల్వ చేయు గది నిర్మించాలి. దీని వలన ఊక పరిసరాలలోనికి రాదు.
- మిల్లు యొక్క వెంట్లు పైకి ఉండాలి.
- మిల్లు యొక్క గదులకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.
- ఉప్పుడు బియ్యం నుంచి వచ్చే నీటి కాలుష్యం నివారించుట, అవాయుగత బాక్టీరియాను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేయాలి.
- సరైన పరికరాలు ఉపయోగించి దుమ్ము, ధూళి నివారించాలి.
గమనిక : ఎవరి దగ్గరలో ఉన్న పరిశ్రమ గురించి వాళ్లు వ్రాయాలి.
5. ప్రయోగశాల కృత్యం :
స్థానిక నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించు ఒక ప్రయోగశాల కృత్యం చేయండి.
జవాబు:
ఉద్దేశం : స్థానికంగా నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించుట
కావలసిన పరికరాలు : గాజు బీకర్లు, కుళాయి, బావి, సరస్సు, నది నుండి సేకరించిన నీటి నమూనాలు, నీలం, ఎరుపు లిట్మస్ పేపర్, సబ్బు.
పద్ధతి : వేరు వేరు గాజు బీకరులలో కుళాయి, నది, బావి, సరస్సుల నుండి నీటి నమూనాలను సేకరించాలి. వాటి మధ్య వాసన, రంగు, ఉదజని సూచిక pH మరియు కఠినత్వమును పోల్చాలి.
pH కనుగొనుట : లిట్మస్ పేపరుతో నీటి నమూనాలలో ఉదజని సూచిక pH ను కనుగొనవచ్చును. నీలం రంగు లిట్మస్ పేపరు నీటి నమూనాలో ముంచినప్పుడు ఆ పేపరు ఎరుపుగా మారితే ఆ నీటికి ఆమ్లత్వం కలిగి ఉన్నట్లు ! ఎరుపు లిట్మస్ పేపరు నీలం రంగుగా మారితే ఆ నీటికి క్షారత్వం ఉందని భావించాలి.
కఠినత్వం కనుగొనుట : నీటి కఠినత్వమును సబ్బును ఉపయోగించి కనుగొనవచ్చును. ఆ నీరు ఎక్కువ నురగ వస్తే మంచినీరు, తక్కువ నురగ వస్తే ఆ నీటికి కఠినత్వం ఉందని తెలుసుకోవచ్చును.
పరిశీలనలు : మీ పరిశీలనలు దిగువ పట్టికలో నమోదు చేయండి.
ప్రయోగం నిర్వహించేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
- లిట్మస్ పేపరు రంగు మారడాన్ని జాగ్రత్తగా గమనించాలి.
- ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి.
- ఏ నీటి నమూనాను రుచి చూడడానికి ప్రయత్నించవద్దు.
- ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారా ? మీ నోట్స్ లో రాయండి. .
6. మీ దగ్గరలో ఉన్న చెరువు లేదా నదిని సందర్శించి, అక్కడ చేరుతున్న కాలుష్య పదార్థాలను మరియు దాని వలన కలిగే పరిణామాలను పరిశీలించి ఒక ప్రాజెక్ట్ తయారుచేయండి. దాని ఆత్మకథను రాయండి. పాఠశాల ‘థియేటర్ డే’ లో ప్రదర్శించండి.
జవాబు:
పిల్లలూ బాగున్నారా ? నన్ను గుర్తుపట్టలేదా ? అవునులే నేను ఇప్పుడు పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ ముసలిదానినై పోయాను. నాలో గతం నాటి ఉత్సాహం లేదు. ఆనందం లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఎన్నో విధాలుగా మీకు ఉపయోగపడిన నన్ను మీరే అనారోగ్యం పాలుచేశారు. నేను మీకు జీవనాధారమైన నీరు ఇచ్చాను. తాగటానికి మంచినీరు ఇచ్చాను. పంటపొలాలకు నీరు అందించాను. మీ గ్రామ అవసరాలన్నింటినీ తీర్చాను.
కానీ మీరు మాత్రం, నాలోనికి రకరకాల వ్యర్థాలను వదిలి, నన్ను కలుషితం చేసి పాడుచేశారు. ఇప్పుడు నేను ఎవరికీ పనికిరాని వ్యర్థంగా, మురికి కూపంగా మీకు కనిపిస్తున్నాను. నన్ను ఇంత ఇబ్బంది పెట్టి మీరు సుఖంగా ఉన్నది ఏది ? మీరు నాకన్నా ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. తాగునీటికి – మైళ్ళదూరం వెళుతున్నారు. పంటలకు నీరు లేక ఎండబెట్టుకొంటున్నారు. మేత లేక పశువులను అమ్ముకొంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి నా గట్టు వద్దకు వచ్చి ఆలోచించండి. కారణం మీకే తెలుస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోండి. మీ కష్టాలకు మీరే కారణం అని తెలుసుకోండి. సరేనా, ఇంతకూ నన్ను గుర్తుపట్టారా, నేను మీ గ్రామ చెరువును !
7. మీరు కింద ఇచ్చిన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ నమూనాను చూడండి. సర్టిఫికేట్ ను పరిశీలించి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. (పేజీ.నెం.158)
ఎ) కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ఏ డిపార్ట్ మెంట్ పారు జారీచేస్తారు ?
జవాబు:
ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ ఆంధ్రప్రదేశ్ వారు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ జారీ చేస్తారు.
బి) ఈ సర్టిఫికెట్ కాలపరిమితి ఎంత ?
జవాబు:
ఈ సర్టిఫికెట్ కాలపరిమితి ఆరు నెలలు.
సి) ఏ రకమైన వాహనానికి ఈ సర్టిఫికెట్ జారీచేస్తారు ?
జవాబు:
అన్ని డీజిల్, పెట్రోల్ తో నడిచే వాహనాలకు ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
డి) కాలుష్య తనిఖీ కేంద్రాలలో ఏయే వాయువులు పరీక్షిస్తారు ?
జవాబు:
కాలుష్య తనిఖీ కేంద్రాలలో హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు పరీక్షిస్తారు.
ఇ) కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది ?
జవాబు:
కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువ ఉంటే ఆ వాహనానికి అపరాధ రుసుము విధిస్తారు.
ఎఫ్) పై విషయాలపై తరగతి గదిలో చర్చించండి. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఎందుకు ? ఆలోచించండి. చెప్పండి.
జవాబు:
కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఎందుకు అంటే వాహనాల నుంచి పరిమితికి మించి కాలుష్య పదార్థాలు వాతావరణంలోకి విడుదల కాకుండా ఉండుటకు.
8. కింద ఇచ్చిన వార్తను చదవండి. మీరు అవగాహన చేసుకొన్న దానిని బట్టి వాటి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. (పేజీ.నెం. 167)
ఎ) వార్తాపత్రిక క్లిప్పింగ్ చదివిన తరువాత మీకు అర్థమైన విషయం ఏమిటి ? (పేజీ.నెం. 168)
జవాబు:
కొన్ని పరిశ్రమల వలన భూగర్భజలం విషతుల్యంగా మారుతోంది.
బి) వార్తాపత్రికలో ఏ విషయం గురించి చర్చించారు ?
జవాబు:
రసాయన పరిశ్రమల కాలుష్యంతో భూగర్భజలం విషతుల్యంగా మారి తాగుటకు, వ్యవసాయానికి ఏ విధంగా పనికిరాదో, ఆ కాలుష్య నియంత్రణకు తీసుకొన్న చర్య గురించి చర్చించినారు.
సి) దానికి కారణం ఏమిటి ? దాని ప్రభావం ఏమిటి ?
జవాబు:
దానికి కారణం రసాయనిక పరిశ్రమలు. దాని ప్రభావం మునుషుల పైనేగాక జీవరాశులు అన్నింటిపైనా ఉంది.
డి) సమస్య ఏ విధంగా ఉత్పన్నమైనది ?
జవాబు:
ఇష్టానుసారంగా రసాయనిక పరిశ్రమలు స్థాపించుటకు అనుమతి ఇవ్వడం, వాటి కాలుష్యాలను శుద్ధి చేయకుండా నేల, గాలి, నీటిలోకి విడుదల చేయడం వలన ఈ సమస్య ఉత్పన్నమైనది.
ఇ) మీ ప్రాంతంలో ఈ రకమైన సమస్యను ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ? దీనికి వెనుక ఉన్న కారణాలు చెప్పగలరా ?
జవాబు:
ఎదుర్కొనలేదు.
గమనిక : ఎవరికి వారు తమ ప్రాంతంలోని కాలుష్యాలకు గల కారణాలను తెలుసుకొని రాయాలి.
ఆలోచించండి – చర్చించండి
1. టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ ఎక్కడికి పోతాయి ? ఏమవుతాయి? (పేజీ.నెం. 160)
జవాబు:
టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ వాతావరణం (గాలిలోకి) లో చేరి కాలుష్యం కలుగజేయును.
2. మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగుతుంది. ఈ లక్షణాలు ఎందుకు కలుగుతాయో ఆలోచించండి – చర్చించండి. (పేజీ.నెం. 166)
జవాబు:
మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగును. కారణం ఆ పొగలో ఉన్న అతి చిన్న కణాలు రుమాలు ద్వారా ముక్కు లోపలికి వెళ్ళి అక్కడ మనకు. ఎలర్జీ కలుగజేయును. దీనినే మనం డస్ట్ ఎలర్జీ అంటాము.
3. ఈ రకమైన లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే ఏమి జరుగుతుంది ? (పేజీ.నెం. 166)
జవాబు:
ఈ రకమైన లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే శ్వాసవ్యవస్థలో ముఖ్యంగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఆస్తమా వంటి వ్యాధులు వస్తాయి.
4. నీటిలో ఉదజని సూచిక pH మరియు కఠినత్వముల మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించారా ? (పేజీ.నెం. 169)
జవాబు:
నీటిలో ఉదజని సూచిక pH మరియు కఠినత్వముల మధ్య సంబంధాన్ని గుర్తించాను. క్షారత్వం పెరిగేకొలదీ నీటి కఠినత్వం పెరుగును.
5. ఏ నీటి నమూనా రంగు లేకుండా ఉంది ? (పేజీ.నెం. 169)
జవాబు:
కుళాయి నీరు రంగు లేకుండా ఉంది.
6. త్రాగడానికి ఏ నీరు పనికి వస్తుంది ? ఎందుకు ? (పేజీ.నెం. 169)
జవాబు:
తాగడానికి కుళాయి నీరు పనికి వస్తుంది. కారణం కుళాయిలో ఉన్న నీటిని వివిధ దశలలో శుభ్రపరచి పంపిస్తారు. స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండదు.
7. కొన్ని నీటి నమూనాల్లో రంగు, వాసనలో మార్పు రావడానికి గల కారణాలు ఏమిటి ? (పేజీ.నెం. 169)
జవాబు:
కొన్ని నీటి నమూనాల్లో రంగు, వాసనలో మార్పు రావడానికి కారణాలు :
1. నీటిలో ఉన్న బాక్టీరియాలు, శైవలాలు ఇతర సూక్ష్మజీవులు చేరుట వలన
2. నీటిలో కలుషితాలు చేరినప్పుడు కూడా నీటికి రంగు, వాసనలో మార్పు వచ్చును.
8. నీటి నమూనాలో కంటికి కనిపించే కాలుష్య కారకాలు ఏమైనా ఉన్నాయా ? (పేజీ.నెం. 169)
జవాబు:
నీటి నమూనాలో కంటికి కనిపించే కాలుష్య కారకాలు ఏమీ లేవు.
పాఠ్యాంశములోని ప్రశ్నలు
1. హానికరమైన జీవులు లేదా పదార్థాలు మన శరీరంలో ప్రవేశిస్తే ఏమి జరుగుతుంది ? వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ? (పేజీ.నెం. 159)
జవాబు:
హానికరమైన జీవులు లేదా పదార్థాలు మన శరీరంలో ప్రవేశిస్తే మనకు అనారోగ్యం కలుగును.
వాటి ఫలితాలు :
1. చాలామంది ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడతారు.
2. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగును.
3. హానికరమైన జీవుల వలన రోగాలు (సూక్ష్మజీవ సంబంధ) వచ్చును.
2. గాలిలోని వివిధ వాయువుల జాబితాను తయారుచేయండి. (పేజీ. నెం. 159)
జవాబు:
గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి మరియు ఇతర జడవాయువులు ఉంటాయి.
3. కాలుష్య కారకాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ? (పేజీ.నెం. 151)
జవాబు:
కాలుష్య కారకాలు ముఖ్యంగా రెండు రకాలు అవి :
1. ప్రాథమిక కాలుష్య కారకాలు
2. ద్వితీయ కాలుష్య కారకాలు
4. సహజ కారణాల వల్ల ఏర్పడే కాలుష్యం వివరింపుము. (పేజీ.నెం.151)
జవాబు:
సహజ కారణాల వల్ల ఏర్పడే కాలుష్యం :
1. అడవుల దహనం వల్ల కర్బన పదార్థాలు (బూడిద) గాలిలో కలిసి కాలుష్య కారకంగా మారుతున్నాయి.
2. అగ్ని పర్వతములు బద్దలై CO2, SO2 వంటి చాలా రకాలైన విషవాయువులు మరియు బూడిద వాతావరణంలో కలిసి కాలుష్యానికి దారితీస్తోంది.
3. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు విడుదల అయి గాలి కాలుష్యానికి కారణమవుతున్నది.
4. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు విడుదలై కాలుష్య కారకంగా మారుతున్నది.
5. మొక్కల పుష్పాల నుండి విడుదల అయ్యే పుప్పొడి రేణువులు కూడా గాలి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.
5. మానవ చర్యల వల్ల ఏర్పడే కాలుష్యం గురించి వివరింపుము. (పేజీ.నెం. 162)
జవాబు:
1. ఇంధనాలు : వీటిని మండించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ (CO), SO2 పొగ, ధూళి మరియు బూడిద వెలువడును.
2. వాహనాలు : మోటారు వాహనాల నుంచి విడుదలయ్యే పొగలో SO2, NO2, CO పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు మరియు సీసం సంయోగ పదార్థాలు, మసి ఉంటాయి.
3. పరిశ్రమల నుంచి ముఖ్యంగా గ్రానైట్, సున్నపురాయి, సిమెంట్ పరిశ్రమల నుండి విడుదలయ్యే పొగలో నైట్రస్ ఆక్సెడ్, SO2 క్లోరిన్ బూడిద మరియు దుమ్ము ఉంటాయి.
4. అణుశక్తి విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణం.
5. ఎరువులు – పురుగుల మందులు గాలి, నీరు, నేల కాలుష్యానికి కారణం.
6. అడవుల నరికివేత కూడా కాలుష్యానికి ప్రధాన కారణం.
7. క్లోరోఫ్లోరో కార్బనులు, గనుల నుంచి విడుదలైన పదార్థాలు కాలుష్యానికి కారణం.
6. గ్రామాల్లో, పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాల జాబితా రాయండి. (పేజీ.నెం. 162)
జవాబు:
గ్రామాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : కట్టెలు, కిరోసిన్, బయోగ్యాస్, పొట్టు, కంది కంప మొదలైనవి.
పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : గ్యాస్, కిరోసిన్.
7. సి.ఎఫ్.సి ల గురించి వ్రాయండి. (పేజీ.నెం. 163)
జవాబు:
రిఫ్రిజిరేటర్స్, ఎ.సి.లు, విమానాల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను సి.ఎఫ్.సి (క్లోరోఫ్లోరో కార్బన్) లు అంటారు. ఇవి గాలిలోకి విడుదలై వాతావరణంలో ఓజోన్ పొరను దెబ్బతీయును. దీని వలన ఓజోన్ పొరలో అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడును. దీని వలన అతి ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు భూమి మీద పడును. ఈ విధంగా జరుగుట వలన భూమి పైన జీవకోటికి ప్రమాదం జరుగును.
8. అతినీలలోహిత కిరణాలు మనపై పడటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? (పేజీ.నెం. 163)
జవాబు:
అతినీలలోహిత కిరణాలు శక్తివంతమైనవి. ఇవి మన శరీరంపై పడటం వలన
1. చర్మ కణాలు దెబ్బతింటాయి.
2. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
3. జన్యు ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి.
9. వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు రాయండి. (పేజీ.నెం. 166) (లేదా) ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన నివేదిక ఆధారంగా ఏడాదికి 4.3 మిలియన్ల మంది గృహం లోపల వాయు కాలుష్యం వలన, 3.7 మిలియన్ల మంది వాయు కాలుష్యం వలన ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జరిగే పర్యవసానాలను నాలిగింటిని రాయండి.
జవాబు:
వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు :
1. వాయుకాలుష్యం వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, ఛాతి నొప్పి, ముక్కు దిబ్బడ, ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగును.
2. వాయు కాలుష్యం వలన హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్త పీడనం లాంటి వ్యాధులకు గురి అగును.
3. దుమ్ము మరియు పొగ ఆకుల మీద పేరుకున్నప్పుడు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకం మొదలైన జీవక్రియలు ప్రభావితం అగును.
4. హైడ్రోజన్ సల్ఫైడ్ పీల్చడం వలన మానవులకు విపరీతమైన తలనొప్పి వచ్చును.
5. విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని హీమోగ్లోబిన్ తో కలవడం వలన స్థిరమైన కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడి ఆక్సిజన్ శరీర భాగాలకు అందక చనిపోయే ప్రమాదం ఉంది.
10. నీటి కాలుష్యానికి దారితీసే కారణాల జాబితా రాయండి. మీ ప్రాంతంలో జరిగే నీటి కాలుష్యం పోల్చి చూడండి. (పేజీ.నెం. 170)
జవాబు:
- పరిశ్రమల వలన జల కాలుష్యం జరుగును.
- పరిశ్రమల వలన జలాలలో ఉష్ణ కాలుష్యం.
- కబేళా, కోళ్ళ, డెయిరీఫారమ్ ల వలన జల కాలుష్యం జరుగును.
- ఎరువులు, క్రిమి సంహారక రసాయనాల వలన జల కాలుష్యం జరుగును.
- ముడి చమురు వల్ల సముద్ర జల కాలుష్యం జరుగును.
- మానవుని అపరిశుభ్ర అలవాట్ల వల్ల జల కాలుష్యం జరుగును.
మా ప్రాంతంలో కూడా ఇంచుమించు ఇదే రకంగా జరుగును.
11. మూసీ నది కాలుష్య నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి ? (పేజీ. నెం. 170)
జవాబు:
- ఘనరూప వ్యర్థాల నియంత్రణ.
- మురికినీరు శుద్ధిచేయు ప్లాంట్ ను నెలకొల్పడం.
- తక్కువ ఖర్చుతో మురుగునీటి వ్యవస్థ కల్పించడం.
- నదీ తీరాన్ని అభివృద్ధి పరచడం.
- ప్రజలలో అవగాహన కలిగించుటకు కృషిచేయడం.
12. మీ టీచర్ ను అడిగి వాయుసహిత (ఏరోబిక్) బాక్టీరియాల గురించిన సమాచారాన్ని ఉదాహరణలతో రాయండి. (పేజీ.నెం. 171)
జవాబు:
ఆక్సిజన్ కలిగిన వాతావరణంలో నివసించు బాక్టీరియాలు. ఇవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో వినియోగించుకొంటాయి. అందువలన మిగతా జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి. ఏరోబిక్ బాక్టీరియాలకు
ఉదాహరణ :
1. స్టెఫైలో కోకస్ జాతి
2. స్ట్రెప్టో కోకస్
3. ఎంటరో బాక్టీరియాకాక్
4. మైక్రో బాక్టీరియమ్ ట్యూబర్కోలస్
5. బాసిల్లస్
6. సూడోమోనాస్
13. ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటిపై ఏర్పడే నూనెతెట్టు ఏ రకమైన ప్రమాదాన్ని ‘జీవులకు కలుగజేస్తుందో మీకు , తెలుసా ? (పేజీ.నెం. 172)
జవాబు:
ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటిపై ఏర్పడిన నూనె తెట్టు వలన నీటి లోపలకు ఆక్సిజన్ వెళ్ళదు. దీని వలన జలచర జీవుల మనుగడ కష్టమై నీటిలో ఉన్న ఆవరణ వ్యవస్థ దెబ్బతినును.
14. వాతావరణంలో కాలుష్య కారకాలు – వాటి మూలాలు తెలుపు ఒక పట్టిక తయారు చేయండి. (పేజీ.నెం. 164)
జవాబు:
15. మీ ఉపాధ్యాయుడిని అడిగి ద్వితీయ కాలుష్య కారకాలు అని వేటిని, ఎందుకు అంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 164)
జవాబు:
ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడిన పదార్థాలను ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు.