AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు

8th Class Telugu ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం ఒక మారుమూల గిరిజన గ్రామం. యానాదులు, ఎరుకల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన పద్మశ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు గిరిజనులకోసం నిర్మించిన | గ్రామం ఇది. రెక్కాడితేగాని డొక్కాడని వీరు ఊరిపక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టి అమ్ముకుంటూ, వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఆ కుగ్రామంలో మల్లి మస్తానయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ గురించి గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్లలో కూడా చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే పూటగడవడం కూడా కష్టంగా ఉండే ఆ కుటుంబంలోంచి ఆడపిల్లతో సహా నలుగుర్నీ బడికి పంపి చదివిస్తుండడమే. మస్తానయ్య కాస్త అక్షరజ్ఞానం ఉన్నవాడు. చదువు విలువ తెలిసినవాడు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఇంట్లో తిండికి, బట్టకు లేకపోయినా పిల్లల పుస్తకాలకు మాత్రం కొరత రాకూడదనుకునేవాడు. అలాంటి నిరుపేద కుటుంబంలో 1974 సెప్టెంబరు 3వ తేదీన మస్తాన్ బాబు జన్మించాడు.
ప్రశ్నలు :
1. గాంధీ జనసంఘం ఏ జిల్లాలోని ఏ మండలంలో ఉంది?
జవాబు:
గాంధీ జనసంఘం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉంది.

2. గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని ఎవరు నిర్మించారు?
జవాబు:
గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని వెన్నెలకంటి రాఘవయ్య నిర్మించాడు.

3. కాస్త అక్షరజ్ఞానం కలవాడు ఎవరు?
జవాబు:
కాస్త అక్షరజ్ఞానం కలవాడు మస్తానయ్య.

4. మస్తాన్ బాబు ఏ తేదీన జన్మించాడు?
జవాబు:
మస్తాన్ బాబు 3.9. 1974వ తేదీన జన్మించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

2. ఒకరోజు స్నేహితులతో కలిసి గుట్టలు ఎక్కడానికి వెళ్ళాడు. అదే అతడి పర్వతారోహణకు బీజం పడినరోజు. రాళ్ళు, ముళ్ళు దాటుకుంటూ కొండనెక్కడం అతనికి తెలియని ఆనందాన్నిచ్చింది. స్నేహితులంతా వంటచెరకు సేకరిస్తుంటే పొదల మధ్య కాలిబాట చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. చేతిలో ఉన్న కత్తితో నాగజెముడు పొదలు నరుకుతుంటే ఆ చెట్లకుండే తెల్లని పాలు చింది కళ్ళలో పడ్డాయి. అంతే కళ్ళు మండిపోతుంటే ఏడుస్తూ బాధ తట్టుకోలేక కిందపడి దొర్లసాగాడు. ఇంతలో స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి వైద్యశాలకు తీసుకుపోయారు. ఈ వార్త తండ్రికి చేరింది. కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరారు. డాక్టరు మందులిచ్చి | భయపడాల్సిందేమీ లేదని చెప్పి ఇంటికి పంపాడు.

ప్రశ్నలు:
1. మస్తాన్ గుట్టలు ఎక్కడానికి ఎవరితో వెళ్ళాడు?
జవాబు:
మస్తాన్ గుట్టలు ఎక్కడానికి స్నేహితులతో వెళ్ళాడు.

2. స్నేహితులందరూ మస్తాన్ ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు?
జవాబు:
స్నేహితులందరు మస్తాన్ ను వైద్యశాలకు తీసుకొని వెళ్ళారు.

3. ఏ పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి?
జవాబు:
నాగజెముడు పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి.

4. హూటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నది ఎవరు?
జవాబు:
హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

3. 1962వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.ఎ.యస్.కు ఎంపికయిన నాదెళ్ళ యుగంధర్ నాయుడిది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. వీరి శ్రీమతి ప్రభావతి. ఈ దంపతులకు 1967లో సత్య నాదెళ్ళ జన్మించారు. కలెక్టరుగా, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికాసంఘ సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేసిన యుగంధర్ మంచి అధికారిగా మన్ననలు అందుకున్నారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన సత్య బాల్యం నుంచే తెలివితేటలు ప్రదర్శించేవాడు. తండ్రికున్న కార్యదీక్షా లక్షణాల్ని పుణికిపుచ్చుకొని పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా అందరితో కలవిడిగా ఉండడం, అందర్నీ కలుపుకొనిపోవడం, నిజాయితీగా వ్యవహరించడం, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయటం, అవసరాల్లో ఉన్నవారిని ఆదరించటం, చేయూతనివ్వడం లాంటి సర్వోన్నత లక్షణాలను అలవరుచుకున్నాడు. సత్యకు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. క్రికెట్ జట్టులో సభ్యుడిగా, తన ప్రతిభను నిరూపించుకొని కెప్టెన్ గా కొనసాగాడు. క్రికెట్ బృందాన్ని సమన్వయపరిచే క్రమంలోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని ఆటలు ఆడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని అధిగమించడం, విజయం కోసం పోరాడడం వంటి గుణాలు అలవడతాయనీ తాను నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ళ చెప్పారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బి.ఇ డిగ్రీ పొందారు. ఆ తరువాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ డిగ్రీ, షికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ ఏ జిల్లాలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ అనంతపురంలో జన్మించాడు.

2. సత్య నాదెళ్ళ ఏ సంవత్సరంలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ 1967లో జన్మించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏ ఆట అంటే ఇష్టం?
జవాబు:
సత్య నాదేళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

4. షికాగో యూనివర్సిటీ నుండి ఏ డిగ్రీ పొందాడు?
జవాబు:
చికాగో యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మిని స్టేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

4. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించటంతోపాటు మరింత కష్టపడవలసి ఉందని ఈ సందర్భంగా ‘సత్య’ వ్యాఖ్యానించాడు. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ కి సి.ఇ.వో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా తమ సంస్థలో నవకల్పనలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. సత్య నాదెళ్ళ జీవితభాగస్వామి శ్రీమతి అనుపమ. వీరికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటం వల్ల అలాంటి పిల్లల కొరకు హైదరాబాద్ లో ఒక పాఠశాలను స్థాపించారు. ‘నేను నిర్మించటాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతాను. పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలను సాధించినపుడే ఎంతటి క్లిష్టమైన విజయశిఖరాలనైనా అధిరోహించగలుగుతాం” అంటూ ఆ చరిత్రని నిరూపించిన సత్య నాదెళ్ళ నేటి యువతరానికి చక్కని రోల్ మోడల్.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ జీవిత భాగస్వామి పేరు ఏది?
జవాబు:
సత్య నాదేళ్ళ జీవిత భాగస్వామి పేరు శ్రీమతి అనుపమ.

2. సత్య నాదెళ్ళ ఎవరి కోసం హైదరాబాద్ లో పాఠశాలను ప్రారంభించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ బుద్ధిమాంద్యం గల పిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏడాదికి జీతం ఎంత?
జవాబు:
సత్య నాదేళ్ళకు ఏడాదికి జీతం 112 కోట్లు.

4. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ ఏది?
జవాబు:
టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్.

5. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, తుమ్మపూడి గ్రామంలో కీ.శే. సూర్యదేవర రామదేవరాయలు, వెంకాయమ్మ దంపతులకు 1914వ సంవత్సరం జూలై నెల 3వ తేదీన సంజీవ్ దేవ్ జన్మించాడు. నాలుగేళ్ళ వయస్సులోనే అతని తల్లి మరణించింది. కొంతకాలం వారి చిన్నాన్న సూర్యదేవర వెంకటకృష్ణయ్యగారివద్ద పెరిగాడు. ఆ తరువాత కృష్ణాజిల్లాలోని కోనాయపాలెంలో అమ్మమ్మ సంరక్షణలో మేనమామ ఇంట పెరిగాడు. విద్యాభ్యాసమంతా ఇంటి దగ్గరే కొనసాగింది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు. అయితే 13 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి తనను గారాబంగా పెంచుతున్న ” అమ్మమ్మ కూడా చనిపోయింది. మరికొంతకాలానికి తాను అమితంగా ప్రేమించే తన గారాల చెల్లి కూడా చనిపోవడంతో జీవితంలో విషాదం తప్ప మరేమీ మిగలలేదని తల్లడిల్లిపోయాడు. అక్కున చేర్చుకుని అదరించేవారు లేక ఒంటరితనాన్ని భరించలేక 18 సంవత్సరాల వయస్సులో హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
ప్రశ్నలు:
1. సంజీవ్ దేవ్ ఎక్కడ జన్మించాడు?
జవాబు:
సంజీవ్ దేవ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు.

2. సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు ఏమి?
జవాబు:
సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు సూర్యదేవర రామ దేవరాయలు, వెంకాయమ్మ.

3. సంజీవ్ కు ఏ భాషల్లో ప్రావీణ్యం ఉంది?
జవాబు:
సంజీవ్ కు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉంది.

4. సంజీవ్ ఎందుకు హిమాలయాలకు వెళ్ళాడు?
జవాబు:
సంజీవ్ ఒంటరితనాన్ని భరించలేక తన 18వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

6. అనేక భాషలను సొంతంగా నేర్చుకుని బహుభాషావేత్తగా రూపొందినట్లుగానే చిత్రకళను కూడా సొంతంగా అభ్యసించి చిత్రకారుడయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ముందు చిత్రకళా విమర్శకుడై యాభై సంవత్సరాల వయస్సు దాటాక కుంచె చేతపట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమేకాక లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను, తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్ తో సత్కరించింది. కళలు, సాహిత్యం , సమాజ అభ్యున్నతికి దోహదపడేవిగా ఉండాలని కాంక్షించి జీవితాంతం దానికోసమే కృషిచేసిన కళాతత్వవేత్త సంజీవ్ దేవ్ 25-8-1999న ఇహలోక యాత్రను ముగించాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయంకృషితో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సంజీవ్ దేవ్ జీవనవిధానం మనందరికీ ఆనంద దాయకం
ప్రశ్నలు :
1. సంజీవ్ చిత్రకళను ఎలా అభ్యసించాడు?
జవాబు:
సంజీవ్ చిత్రకళను సొంతంగా అభ్యసించి చిత్రకళా కారుడయ్యాడు.

2. దేనిని చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు?
జవాబు:
కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు.

3. సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది?
జవాబు:
సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం.

4. సంజీవ్ ఏ తేదీన మరణించాడు?
జవాబు:
సంజీవ్ 25-8-1999న మరణించాడు.

7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సీతారామరాజు 1897లో పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. గుర్రపుస్వారీ, మూలికావైద్యం, జ్యోతిష్యంలో పట్టు సంపాదించాడు. ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో 1922 నుంచి 1924 మే వరకు తెగువతో పోరాడిన వీరుడు సీతారామరాజు. అన్నవరం, శంఖవరం, రంపచోడవరం పోలీస్ రాణాలపై దాడిచేసి ఆంగ్లేయులకు చెమటలు పట్టించాడు. ఈ మన్యం వీరుని కుతంత్రంతో చుట్టుముట్టి రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలోని సేనలు కాల్చి చంపాయి.
ప్రశ్నలు :
1. సీతారామరాజు జన్మస్థలం ఏది?
జవాబు:
పశ్చిమ గోదావరి జిల్లా ‘మోగల్లు’.

2. సీతారామరాజుకు ఏ విషయాలలో పట్టు ఉంది?
జవాబు:
గుర్రపుస్వారీ, మూలికా వైద్యం, జ్యోతిష్యంలో

3. ఆంగ్లేయులకు ఏ కారణంతో ఆగ్రహం కలిగింది?
జవాబు:
వీరి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి పోలీస్ ఠాణాలపై దాడి చేయడం వల్ల.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సీతారామరాజును ఎవరి నేతృత్వంలోని సేనలు కాల్చాయి?

8. కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పద్మావతి : మిత్రులారా ! బాగున్నారా !
పూజిత : బాగున్నాము. మీ పాఠశాలలో జూలై 4న ఏదో ఉత్సవం జరిపినట్లున్నారు. ఏమిటది?
పద్మావతి : అవును. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించాము.
పూజిత : మీ పాఠశాలలో ఆయన జయంతిని ఎలా నిర్వహించారు?
పద్మావతి : ఆ రోజు ఉదయం పాఠశాల ప్రార్థనా సమావేశంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం.
హరిత : మా ప్రధానోపాధ్యాయుల వారు అల్లూరి వారిని గురించి చెప్పి రంప విప్లవాన్ని వారు నడిపిన తీరు, ధైర్యాన్ని గురించి వివరించారు.
పూజిత : అలాగా ! ఆ మహావీరుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?
పద్మావతి : పాఠశాల గ్రంథాలయాలలో ఆ వీరుని జీవితచరిత్ర గురించి శ్రీ ఎం.వి.ఆర్. శాస్త్రి, శ్రీ ఎం. చలపతిరావు వంటివారు రాసిన పుస్తకాలున్నాయి చదువు.
పూజిత : అలాగే !
హరిత : నా దగ్గర పుస్తకం ఉంది ఇమ్మంటారా?
పూజిత : ఇవ్వు. చదివి మళ్ళీ ఇచ్చేస్తాను. ఉంటాను.
ప్రశ్నలు :
1. పై సంభాషణలో ‘పుట్టిన రోజు’ అనే అర్థం వచ్చే పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జయంతి.

2. అల్లూరి సీతారామరాజు నడిపిన విప్లవోద్యమం ఏది?
జవాబు:
రంప విప్లవోద్యమం.

3. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పద్మావతి, పూజిత, హరితల మధ్య సంభాషణ జరిగింది.

4. చనిపోయిన ప్రముఖుల పట్ల గౌరవం, అభిమానం ప్రకటిస్తూ మాట్లాడే మాటలను ఏమంటారు?
జవాబు:
నివాళులు అర్పించడం.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
సాహసవీరుడు మస్తాన్ బాబు జీవితచరిత్ర నుండి మీరేమి నేర్చుకున్నారు?
జవాబు:
మన రాష్ట్రంలో ఎందరో సాహసవీరులు ఉన్నారు. వారిలో మస్తాన్‌బాబు ప్రసిద్ధుడు. ఈయన జీవిత చరిత్ర అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మస్తాన్‌బాబు నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామంలో 3-9-1974వ తేదీన జన్మించారు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి అక్షర జ్ఞానం కలవాడు. చదువు విలువ తెలిసినవాడు. అందువల్లనే మస్తాన్ బాబు చదువుకోసం ఎంతో కష్టపడ్డారు.

మస్తాన్ బాబు మాత్రం చదువుపట్ల ఆసక్తి చూపేవాడు కాదు. తండ్రి మందలించినా వినిపించుకోలేదు. అల్లరిచిల్లరగా తిరిగేవాడు. తండ్రి ఆందోళన చెంది మస్తాన్ బాబును కోరుకొండ సైనిక స్కూలులో చేర్పించాడు. మస్తాన్ బాబు స్కూల్ లోని ఉదయ్ భాస్కర్ విగ్రహాన్ని తదేకంగా చూశాడు. ఉదయ్ భాస్కర్ ఆ పాఠశాల పూర్వ విద్యార్థి. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహనీయుడు.

మస్తాన్ ఐ.ఐ.టిలో బి.టెక్ లో చేరాడు. తండ్రి ఎన్నో ఇబ్బందులు పడి కుమారుడిని చదివించాడు. చదువు పూర్తికాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే తండ్రి మరణం మస్తాన్ ని బాగా కుంగదీసింది. లక్షలాది జీతాన్ని కూడా వదులుకొని తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు. అందుకోసం గంధోతిలోయను చేరాడు. దాని కోసం కొత్త సాధన చేశాడు. శారీరకంగా శ్రమ చేశాడు. హిమాలయాల్లోని కాంచనగంగ కనుమలను చేరుకున్నాడు. శ్రమించి ఎవరెస్టు శిఖరంపై కాలుమోపాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. నాలుగు శిఖరాలను దాటి తిరిగివస్తుండగా 600 కి.మీ. దిగువన మంచు తుపాను భయంకరంగా వచ్చింది. మస్తాన్ తలదాచుకున్న గుడారాన్ని కబళించి వేసింది. ఏ పర్వతాలను ప్రాణప్రదంగా భావించాడో ఆ పర్వాతాలలోనే తనువు చాలించాడు. దేశమంతా ఆ సాహసవీరునికి నివాళులను అర్పించింది.

ఈ విధంగా మస్తాన్ ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు లక్ష్యం చేరుకున్నాడు. లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తాను కలలుకన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. వీరమరణం పొందాడు. ఆ మహనీయుని కార్యదక్షత, దృఢసంకల్పం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం కావాలి. తింటానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగులేకపోయినా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉండడం మనం తప్పక నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 2.
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. చర్చించండి.
జవాబు:
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. ఎందుకంటే ఒక పనిని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటిది లక్ష్యం సాధించాలంటే ఎంతో శ్రమచేయవలసి ఉంటుంది. అన్ని పరిస్థితులు, సదుపాయాలు, అవకాశాలు సరిగ్గా ఉంటే లక్ష్యసాధన సులభం అవుతుంది. లక్ష్యం అనేది ఉన్నతంగా ఉంటే, దాన్ని సాధించడానికి ఎన్నో ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని చాకచక్యంగా ఎదుర్కొని విజయాన్ని వరించాలి. కార్యదీక్ష, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయగలమని నమ్మాలి.

ఇలాంటి కార్యదక్షత, దృఢసంకల్పం గల వారిలో పర్వతారోహకుడు మస్తాన్‌వలి ప్రముఖుడు. కుటుంబ పరిస్థితులు బాగులేకపోయిన, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులుగా నిలిచినా వాటిని లెక్కచేయలేదు. లక్షలాది రూపాయల ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా భావించాడు. తాను కలలుగన్న పర్వతారోహణను చేయాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదులుకున్నాడు. శారీరకంగా కృషి చేశాడు. ఎన్నో ఇబ్బందులను పడి చివరకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు.

ఆయన కార్యదీక్ష, దృఢసంకల్పం అందరికి ఆదర్శంగా నిలిచింది. లక్ష్యాన్ని సాధించి తిరుగుప్రయాణంలో తన ప్రాణాలను కోల్పోయాడు. తాను బాగా ప్రేమించిన శిఖరాలపైనే వీరమరణం పొందారు. మస్తాన్‌బాబు నుంచి విద్యార్థులందరు స్ఫూర్తి పొందాలి. కార్యదీక్షపై శ్రద్ధ వహించాలి. కష్టాలను అధిగమించే మనస్సును పెంపొందించుకోవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. ఇదే మన ముందు తరాలకు అందించే గొప్ప కానుక.

ప్రశ్న 3.
సత్య నాదెళ్ళ వ్యాపారదిగ్గజంగా మారడానికి తోడ్పడిన అంశాలేమిటి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది మేధావులు ఉన్నారు. వారు ప్రపంచంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగువారి మేధాసంపత్తిని దశదిశలా విస్తరింపజేశారు. వారిలో సత్య నాదెళ్ళ సుప్రసిద్ధులు. ఈయన వైఫల్యాలను ఎదుర్కొనడమేగాదు, వైఫల్యాల నుండి ఏమి నేర్చుకున్నామనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.

సత్య నాదెళ్ళ 1967లో అనంతపురంలో విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. అందువలనే చిన్నతనం నుండే అన్ని విషయాలలోనూ అసమాన ప్రతిభను కనబరిచేవాడు. తండ్రి నుండి కార్యదక్షను పుణికిపుచ్చుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, అవసరాల్లో ఆదుకోవడం మొదలైన ఉత్తమ లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఒత్తిడిని అధిగమించగలిగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నాడు. దేశవిదేశాల్లో విద్యను పూర్తి చేశాడు. వ్యాపార రంగంలో మాస్టర్ డిగ్రీ పొందారు.

వీరి ప్రతిభను గుర్తించి ఎన్నో సంస్థలు ఉద్యోగంలో చేరమని ఆహ్వానించాయి. 1992లో మైక్రోసాఫ్ట్ వ్యాపార సేవల రంగంలో కీలకపాత్ర పోషించాడు. ఐదేళ్ళలో కంపెనీ వ్యాపారాన్ని 6 వేల కోట్ల నుండి 31 వేల కోట్లకు దాటించాడు. కొంత కాలం బిల్ గేట్సకు టెక్నాలజీ సలహాదారుగా ఉన్నాడు. ఆధునాతన సాఫ్ట్ వేర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈయన కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అకుంఠితమైన సత్య నాదెళ్ళ కార్యదీక్ష అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

ఈయనకు గల అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, నిరంతర దీక్ష, నాయకత్వ ధోరణి ఇవన్నీ అందరినీ ఆకర్షించాయి. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా ఎంతో గర్వించారు. ఈయన సేవల వల్ల సాఫ్ట్ వేర్ ఎంతో ఘనత సాధించింది. కరెంటు బిల్లు నుండి క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ దాకా ప్రతిచోటా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. కంప్యూటర్ అక్షరాస్యత అవసరంగా మారిన కాలం ఇది. ఈయనకు గల పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలే ఈయనకు విజయశిఖరాలు అధిరోహించేలా చేశాయి.

ప్రశ్న 4.
డా|| సంజీవ్ దేవ్ తమ రచనలు, చిత్రాల ద్వారా సమాజానికి ఏమి తెలియజేస్తున్నారని మీరు భావిస్తున్నారు?
జవాబు:
ప్రకృతే మనకు గురువు, దైవం, ఆప్తమిత్రుడు. మనకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ ప్రకృతి నుండే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రజాజీవితం సాధ్యమవుతుందని విశ్వసించే వారిలో ముఖ్యుడు డా|| సంజీవ్ దేవ్. వీరు 3. 7.1914వ తేదిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం – తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు. వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

18 సంవత్సరాల వయసులో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ స్వామి పవిత్రానంద దగ్గర శిష్యరికం చేస్తూ పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మానవ జీవితం గురించి, ప్రకృతి గురించి పరిశోధన చేశాడు.

డా|| సంజీవ్ దేవ్ ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖులను కలిశాడు. ఈయన గొప్ప ప్రకృతి ప్రేమికుడు కావడంతో కవిగానే కాకుండా చిత్రకళా విమర్శకునిగా కూడా పేరు పొందాడు. కొంతకాలం తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చి సొంత ఊరిని మించిన స్వర్గం లేదని భావించాడు. తనకు సన్నిహితులైన చిత్రకారుడు ఎస్.వి. రామారావు, భావకవి కృష్ణశాస్త్రి, నవలారచయిత చలం, కథారచయిత బుచ్చిబాబు మొదలగువారితో కవిత్వ చర్చలు చేసేవారు.

ఈయన గొప్ప మానవతావాది. దేశవిదేశాల నుండి ఎంతోమంది భిన్న అంశాలపై ఆయనకు ఉత్తరాలు రాసేవారు. గొప్ప లేఖా రచయిత కావడంతో వారందరికీ ఓపికగా ప్రత్యుత్తరాలిస్తూ సందేహ నివృత్తి చేసేవారు. ఈయన మనం ఆనందంగా జీవించడంతోపాటు ఇతరులను కూడా సంతోషపెట్టడమే సర్వమతాలసారం అని ప్రకటించారు. ఈయన కవి, చిత్రకారుడు మాత్రమే కాదు గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కూడా.

డా|| దేవ్ గారు ఎన్నో భాషలను నేర్చుకున్నారు. బహుభాషావేత్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందారు. కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమే కాకుండా లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించు వీరు 25.8.1999న పరమపదించారు. వీరు స్వయంకృషితో, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీరి జీవనవిధానం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మహామనీషి మరణించినా వీరి రచనలు, చిత్రాలు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 5.
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరి గురించి రాయండి.
జవాబు:
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు ఎందరో ఉన్నారు. అలనాటి రాముడు మొదలుకొని గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖులే కాక వెలుగులోకి రాని మహనీయులు ఎందరో ఉన్నారు. ఎందరు ఉన్నా నా తొలి ప్రాధాన్యం మాత్రం అమ్మానాన్నలే. వారే లేకపోతే మనం ఎక్కడున్నాం, ఎవరో ఒకరి పేరు పెట్టి ఏదో ఒకటి రాయవచ్చు. కానీ అమ్మనాన్నల గొప్పదనాన్ని గుర్తించి కూడా వేరొకర్ని కీర్తించడం సబబేనా ? కాదు కదా ! అందుకే మరి మా అమ్మా నాన్నల గురించి చెబితే స్వార్థం అంటారుగా. అందుకే వారిని మనసులో తలుచుకొంటూ వారి స్థానాన్ని, వారి ప్రేమను మీ ముందుంచుతాను.

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు నాన్న. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ. కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న. జీవితం అమ్మది. జీవనం నాన్నది. ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది. ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. అమ్మ భద్రత. నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది. పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు. నడక అమ్మది. నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా అమ్మ బోధిస్తే, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచనైతే, నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకోగలవు. కానీ నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు మిత్రమా !