AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

Students can go through AP Board 10th Class Social Notes 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణస్థితులలో ఎన్నో వైవిధ్యతలకు కారణమవుతుంది.

→ పొడవైన భారతదేశ తీరప్రాంతం, హిందూ మహాసముద్రంలోని భారతదేశ స్థానం వల్ల చేపలు పట్టడానికే కాకుండా అనేక వ్యాపార మార్గాలకు కూడా దోహదం చేసింది.

→ భారతదేశానికి 82°30′ తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది ‘అలహాబాదు’ గుండా పోతుంది.

→ భారతదేశ ప్రామాణిక కాలమానానికి (IST- Indian Standard Time) తూర్పు రేఖాంశాన్ని [82°30′) ఆధారంగా తీసుకుంటారు. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి (GMT – Greenwich Mean Time] ఇది 5% గంటలు ముందు ఉంది.

→ గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలాశైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం, నేలలు ఏర్పడ్డాయి.

→ ప్రపంచ భూభాగమంతా రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. ఇవి అంగారా భూమి (లారేసియా), గోండ్వానా భూమి.

→ భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది.

→ 20 కోట్ల సం||రాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి, భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి ‘చాలా పెద్దదయిన యూరేసియా ఫలకం (అంగారా భాగం) తో ఢీకొనటంతో తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సం||రాల క్రమంలో ముడతపడే ప్రక్రియ కారణంగా, ఇప్పటి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవటం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు మేటవేయటంతో ఉత్తర మైదానాలు ఏర్పడ్డాయి.

→ భారతదేశ భూభాగాన్ని ఆరు (6) భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. హిమాలయాలు
  2. గంగా-సింధూ నది మైదానం
  3. ద్వీపకల్ప పీఠభూమి
  4. తీరప్రాంత మైదానాలు
  5. ఎడారి ప్రాంతం
  6. దీవులు.

→ హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పునకు 2400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి.

→ హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో 500 కి.మీ. వెడల్పు ఉండగా, మధ్య తూర్పు ప్రాంతాలలో 200 కి.మీ. వెడల్పుతో ఉంటాయి.

→ హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులు ఉన్నాయి. అవి హిమాద్రి, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణి.

→ అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వతశ్రేణిని “ఉన్నత హిమాలయాలు” లేదా “హిమాద్రి” అంటారు.

→ హిమాద్రి శ్రేణి సగటు ఎత్తు 6100 మీటర్లు ఉంటుంది.

→ హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమానీనదాలు కూడా ఉన్నాయి.

→ హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణిని ‘నిమ్న హిమాలయాలు’ అంటారు. ఇక్కడ బాగా ఒత్తిడికి గురైన రాళ్లు ఉంటాయి. ఈ పర్వతాల ఎత్తు 3700-4500 .మీ!! మధ్య ఉంటుంది.

→ పిర్‌పంజాల్, మహాభారత పర్వతశ్రేణులు ఈ నీమ్న హిమాలయ శ్రేణిలో ముఖ్యమైనవి.

→ నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, కులు, కంగ్ర (హిమాచల్ ప్రదేశ్) లోయలు ఉన్నాయి. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్ వంటి వేసవి విడిది ప్రాంతాలకు, సతతహరిత అరణ్యాలకు ఈ శ్రేణి ప్రఖ్యాతిగాంచింది. మేఘాలయలో మాజోక్ డింపెప్ లోయ కలదు.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. ఇది 10-50 కిలోమీటర్లు వెడల్పు, 900-1100 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది.

→ శివాలిక్ శ్రేణిని జమ్ము ప్రాంతంలో జమ్ము కొండలనీ, అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి కొండలనీ, అసోంలో కచార్ అనీ రకరకాల పేర్లతో పిలుస్తారు.

→ నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా “డూన్” అంటారు. వీటిలో డెహ్రాడూన్, కోట్లిడూన్, పాట్లీడూన్ మొ||నవి ప్రసిద్ధిగాంచిన డూన్లు. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్రలోయ ఉంది.

→ ‘దిహాంగ్’ (బ్రహ్మపుత్ర నది) లోయ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది.

→ భారతదేశానికి ఇక్కడ (ఈశాన్య రాష్ట్రాలలో) తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలను “పూర్వాంచల్” అంటారు.

→ ఇవి (పూర్వాంచల్) అవక్షేప శిలలతోను, ఇసుకతోను ఏర్పడినవి. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను పాట్ కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, ఖాసి కొండలు, జో కొండలు అంటారు.

→ హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది.

→ తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటిగాలులను హిమాలయాలు అడ్డుకుంటాయి.

→ వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం.

→ మూడు హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది.

→ భారతదేశంలోని గంగా-సింధూనదీ మైదానాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి

  1. పశ్చిమభాగం
  2. మధ్యభాగం
  3. తూర్పుభాగం

→ పశ్చిమభాగం సింధూనది, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ లతో ఏర్పడింది.

→ సింధూనది పరీవాహక ప్రాంతం అధికభాగం పాకిస్తాన్లో ఉంది. కొంతభాగం మాత్రమే భారతదేశంలో పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు (Doab) అత్యధికంగా ఉన్నాయి.

→ రెండు నదుల మధ్య ప్రాంతాన్ని “అంతర్వేది” అంటారు.

→ మధ్యభాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్‌లలోను, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలోను ఉంది.

→ ఇక్కడ గంగా, యమునా నదులు వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తాయి.

→ తూర్పుభాగం ప్రధానంగా అసోంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది.

→ హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులక రాళ్లు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8-16 కి.మీ. సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని “భాబర్” అంటారు.

→ భాబర్ సచ్చిద్రంగా (Porus) ఉండి చిన్న నదులు, వాగులు దీని కింది నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్లీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. వీటినే “టెరాయి” ప్రాంతం అంటారు.

→ భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ల కోసం “తరాయి” ప్రాంతంలోని చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూములుగా మార్చారు.

→ భారతదేశ పీఠభూమికి మూడువైపులా సముద్రాలు ఉన్నాయి. కాబట్టి దానిని “ద్వీపకల్ప పీఠభూమి” అని కూడా అంటారు.

→ ఇక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి.

→ ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపునకు కొద్దిగా వాలు కలిగి ఉంది.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు, దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది.

→ ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండుగా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు (మాల్వా పీఠభూమి), దక్కన్ పీఠభూమి.

→ గంగా మైదానానికి దక్షిణాన, నర్మదానదికి ఉత్తరాన ఉన్న ఉన్నత భూములు పశ్చిమం వైపున మాల్వా పీఠభూమి, తూర్పు వైపున చోటానాగపూర్ పీఠభూమి ముఖ్యమైనవి.

→ చోటానాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

→ నర్మదానది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని “దక్కన్ పీఠభూమి” అంటారు.

→ సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి.

→ మహదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి.

→ తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ. ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పునకు వాలి ఉంది.

→ పడమటి కనుమలు అవిచ్చిన్న శ్రేణులుగా ఉన్నాయి. ఇవి 1600 కి.మీ. పొడవున ఉన్నాయి.

→ గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇవి 2000 మీ|| ఎత్తు వరకు ఉన్నాయి.

→ ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన “ఉదకమండలం” నీలగిరి పర్వతాలలో ఉంది. దీనినే “ఊటీ” అంటారు.

→ నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట (2637 మీ11).

→ అనైముడి, పళని (తమిళనాడు), కార్డమం (కేరళ) కొండలు పడమటి కనుమలలోనివే.

→ దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండలలోని “అనైముడి” (2695 మీII) ఎత్తైన శిఖరం.

→ ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి.

→ పశ్చిమకనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణ వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి.

→ తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లను మించదు.

→ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం ‘అరోమ కోండ’ చింతపల్లి (ఆంధ్రప్రదేశ్) దగ్గర ఉంది. దాని ఎత్తు 1680 మీ.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమల్లోని భాగాలు.

→ అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగిన అంశం.

→ ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయ ప్రాంతంలో “థార్” ఎడారీ ఉంది.

→ ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ, సంవత్సర వర్షపాతం 100-150 మి.మీ. మధ్య ఉంటుంది.

→ రాజస్థాన్లోని అధికభాగంలో ‘థార్’ ఎడారి విస్తరించి ఉంది.

→ ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది ‘లూని’. కాలువలలోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సుల లోనికే (అంత స్థలీయ ప్రవాహం) ప్రవహిస్తాయి.

→ దేశంలో అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కాలువ (650 కి.మీ.) థార్ ఎడారికి నీళ్లు అందిస్తోంది.

→ పడమటి తీరమైదానం రాణ్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది.

→ తూర్పు తీరమైదానం కంటే పడమటి తీరమైదానం వెడల్పు తక్కువ.

→ పడమటి తీరమైదానం మూడు భాగాలుగా విభజించవచ్చు.
1) కొంకణ్ తీరప్రాంతం – ఇది ఉత్తరభాగం – మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది.
2) కెనరా తీరప్రాంతం – ఇది మధ్య భాగం – కర్ణాటకలోని తీరం దీని కిందకు వస్తుంది.
3) మలబార్ తీరప్రాంతం – ఇది దక్షిణభాగం – ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది.

→ బంగాళాఖాత (తూర్పు) తీరప్రాంత మైదానాలు వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. ఇది ఒడిశాలోని మహానది నుంచి మొదలయ్యి తమిళనాడులోని కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంది.

→ మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులతో ఏర్పడిన ఈ మైదానప్రాంతాలు చాలా సారవంతమైనవి.

→ ఈ తూర్పు తీరప్రాంత మైదానాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి :

  1. ఉత్కళ్ తీరం – ఒడిశా
  2. సర్కార్ తీరం – ఆంధ్రప్రదేశ్
  3. కోరమండల్ తీరం – తమిళనాడు.

→ ఒడిశాలోని చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేరు, పులికాట్ చెరువులు తీరప్రాంత మైదానంలో ముఖ్యమైన భౌగోళిక అంశాలు.

→ భారతదేశంలో రెండు ద్వీప సమూహాలున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు.

→ మయన్మార్ కొండలు ‘అర్కన్ యోమా’ నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతంలో అండమాన్, నికోబార్ దీవులు.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ ఈ దీవులలోని నార్కొండాం, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి.

→ భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయ్యింది.

→ లక్షద్వీప దీవులు ప్రవాళ భిత్తికల (కోరల్) నుండి ఏర్పడ్డాయి. వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చ.కి.మీ.

→ భారతదేశం ఉత్తర, దక్షిణాలుగా సుమారు 3214 కి.మీ పొడవున, తూర్పు, పడమరలుగా 2933 కి.మీ. వెడల్పున వ్యాపించి ఉంది.

→ జీవనది: నిరంతరము ప్రవహించు నది. హిమాలయ నదులు జీవనదులు. ఇవి సంవత్సరమంతా (వేసవిలో మంచు కరిగి నీరు నదుల్లోకి రావడంతో) ప్రవహిస్తూనే ఉంటాయి.

→ ద్వీపకల్పం: మూడువైపులా నీరు కలిగి ఉన్న త్రిభుజాకార భూభాగాన్ని “ద్వీపకల్పం” అంటారు.
ఉదా : భారత (దక్కన్) ద్వీపకల్పం

→ కోరల్: కొన్ని రకాల సముద్రజీవుల స్రావములతో ఏర్పడిన రంగురాయి. ఇవి తక్కువ లోతు, బురదలేని వెచ్చని నీటిలో ఏర్పడతాయి.
ఉదా : పగడములు

→ డూన్: నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా “డూన్” అంటారు.
ఉదా : డెహ్రాడూన్, కోబ్లీడూన్, పాట్లీడూన్ మొ||నవి.

→ అంగారా భూమి: టెథిస్ సముద్రం (హిమాలయాలున్న ప్రాంతంలో ఒకప్పుడున్న సముద్రం) కు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని “అంగారా భూమి” అంటారు.

→ గోండ్వానా భూమి: టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని “గోండ్వానా భూమి” అంటారు. (ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా)

→ శివాలిక్: హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని “శివాలిక్ శ్రేణి” అంటారు. వీటినే “బాహ్య హిమాలయాలు” అని కూడా అంటారు.

→ పూర్వాంచల్: భారతదేశానికి తూర్పు సరిహద్దుగా (ఈశాన్య రాష్ట్రాలలో) విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల (కొండలు) ను “పూర్వాంచల్” అని అంటారు.

→ లారేసియా: ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్‌ల్యాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేసియా మొత్తాన్ని “లారేసియా” అంటారు. ఇదే అంగారా భూమి.

→ అంతర్వేది: (దో అబ్) రెండు నదుల మధ్య ప్రాంతాన్ని “అంతర్వేది” అంటారు. పంజాబ్, హర్యానా (మైదానాల) ప్రాంతంలో ఇవి అత్యధికంగా ఉన్నాయి.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

→ భాబర్: హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులకరాళ్లు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8-16 కి.మీటర్ల సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని “భాబర్” అంటారు.

→ టెరాయి: భాబర్ మండలం క్రిందుగా చిన్న నదులు, వాగులు ప్రవహిస్తూ అవి తిరిగి భాబర్ నుంచి ఉపరితలానికి వెల్లువై ప్రవహించటం వలన చిత్తడి నేలలు ఏర్పడతాయి. ఈ చిత్తడి ప్రాంతాన్నే “టెరాయి” అంటారు.

AP 10th Class Social Notes Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 1