These AP 6th Class Social Important Questions 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు will help students prepare well for the exams.
AP Board 6th Class Social 11th Lesson Important Questions and Answers భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు
ప్రశ్న 1.
‘సంస్కృతి’ భావనను వివరించండి.
జవాబు:
‘సంస్కృతి’ భావన :
- ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకుని దానిని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియే సంస్కృతి.
- ఇది ఒక విలువైన మరియు ప్రత్యేకమైన సంపద, సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ.
- ‘సంస్కృతి’ అను పదం యొక్క అర్థం విస్తృతమైనది. సమగ్రమైనది.
- సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతులు, చట్టం, ఆచారాలు, అలవాట్లు, ఇతర సామర్థ్యాలలో సంస్కృతి ఉంటుంది.
- సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం.
- సంస్కృతి యొక్క ముఖ్యాంశం సమూహంలో ప్రసారం చేయబడిన సంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంది.
ప్రశ్న 2.
లిపి మన దేశంలో ఎలా అభివృద్ధి చెందింది? కొన్ని ప్రసిద్ది రచనలు రాయండి.
జవాబు:
- రాతి లిపి మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు పురాతన కాలంలో బట్టలు, ఆకులు, చెట్ల బెరడు మొదలైన వాటిపై రాసేవారు.
- ఎండిన ఆకులపై రాయడానికి వారు సూది వంటి వాటిని ఉపయోగించేవారు.
- ప్రారంభంలో వారు బొమ్మలు మరియు గుర్తులను గీసేవారు. క్రమక్రమంగా లిపి అభివృద్ధి చెందింది. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ ‘బ్రాహ్మీ’ లిపిని ఉపయోగించాడు.
- ప్రసిద్ధ పురాణాలైన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం సంస్కృతంలో రాయబడ్డాయి.
- భాష అభివృద్ధి చెందటం వల్ల ప్రసిద్ధ రచనలు ఉనికిలోకి వచ్చాయి.
- ఆర్యభట్ట ఆర్యభట్టీయం’ అనే పుస్తకం రాశారు.
- ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలు ‘చరక సంహిత’ మరియు సుశ్రుత సంహిత’. శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథమే సుశ్రుత సంహిత.
ప్రశ్న 3.
‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటే ఏమిటి? భిన్నత్వానికి గల కారణాలు ఏవి?
జవాబు:
భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా పిలవడానికి ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ప్రముఖమైనది. భారతీయ సంస్కృతి క్రియాశీలకం మరియు సమ్మిళితం.
భిన్నత్వానికి గల కారణాలు :
- విశాలమైన దేశం.
- అనేక జాతుల అనుసంధానం.
- భౌగోళిక మరియు శీతోష్ణస్థితి అంశాలలో తేడాల కారణంగా వైవిధ్యం
ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయులమని భావిస్తారు. ఈ ఏకత్వ భావననే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని అంటారు.
ప్రశ్న 4.
భారత రాజ్యాంగం గుర్తించి భాషలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించినది (8వ షెడ్యూల్)
ప్రశ్న 5.
భారతదేశంలో ‘మతం’ పరిణామం గూర్చి రాయండి.
జవాబు:
భారతదేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ భారతీయులంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు.
- ఎక్కడైతే ప్రజలు నివాసముంటారో, అక్కడ కొన్ని రకాల ఆచారాలు మరియు సంప్రదాయాలు ప్రారంభమవుతున్నాయి.
- ఈ ఆచారాలు మరియు సంప్రదాయాలు, వనరులు, పర్యావరణం, వాతావరణ పరిస్థితులు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి.
- నేటి మత విశ్వాసాలు కూడా ఇటువంటి ఆచార సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి.
- అయినప్పటికీ ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కొన్ని ఆచార వ్యవహారాలు సాధారణంగా ఉన్నాయి.
- మతం అనేది ఒక ఆధ్యాత్మిక చింతన. ఇది సుఖమయ జీవితం గడపటానికి కొన్ని విలువులను పాటించమనిబోధిస్తుంది.
ప్రశ్న 6.
హిందూ మతం గురించి, ప్రధాన లక్షణాలు గూర్చి తెల్పండి.
జవాబు:
హిందూ మతం :
- ప్రపంచంలోని మతాలలో హిందూ మతం చాలా పురాతనమైనది. ఇది ఒక జీవన విధానం మరియు దీనిని “సనాతన ధర్మం” అనికూడా పిలుస్తారు.
- విశ్వమానవ మూల సూత్రాలపై ఆధారపడినదే హిందూ మతం.
- హిందూ మతంలో అనేక రకాల పూజా విధానాలు కలవు. అనేక మార్గాల ద్వారా భగవంతుడిని చేరవచ్చు.
- అన్ని జీవులలో మరియు నిర్జీవులలో కూడా భగవంతుడు ఉన్నాడని ఈ మతం తెలియజేస్తుంది.
- వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం మరియు మహాభారతం హిందువుల పవిత్ర గ్రంథాలు.
- విష్ణువు, శివుడు, ఆదిశక్తి, రాముడు మరియు కృష్ణుడు హిందువులు ఆరాధించే దేవతలు.
- సంక్రాంతి, దసరా, దీపావళి మొదలైనవి హిందువులు జరుపుకునే కొన్ని పండుగలు.
- భారతదేశంలోని అమర్‌నాథ్, బద్రీనాథ్, వారణాసి, పూరి, సింహాచలం, శ్రీశైలం, భద్రాచలం, తిరుమల, కంచి మదురై, శబరిమలై, రామేశ్వరం వంటి అనేక దేవాలయాలను హిందువులు సందర్శిస్తారు.
హిందూ మత ప్రధాన లక్షణాలు :
- మానవసేవే మాధవ సేవ.
- విశ్వమానవ కుటుంబం. (వసుదైక కుటుంబం)
- ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం. (తపస్సు)
- చతుర్విధ పురుషార్థాలను అభ్యసించడం (ధర్మం, అర్థం, కామం, మోక్షం వంటి నాలుగు రకాల అభ్యాసాలు) ‘హిందూ’ అనే పదం ‘సింధు’ అనే పదం నుండి వచ్చింది.
- నాలుగు ఆశ్రమాలను ఆచరించడం వాటి పేర్లు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం.
ప్రశ్న 7.
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం గూర్చి నీకు ఏమి తెలుసు?
జవాబు:
- ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశాలలో చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది శేషాచలం కొండలలో కలదు. దీనిని హిందువులు పవిత్ర దేవాలయంగా భావిస్తారు.
- హిందువుల ప్రకారం, విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి.
- ఇక్కడి దేవుణ్ణి శ్రీనివాస, గోవింద మరియు బాలాజీ అని పిలుస్తారు.
- తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రసిద్ది చెందినవి.
ప్రశ్న 8.
జైన మతం ఆవిర్భావం గురించి, సిద్ధాంతాల గురించి వివరించండి.
జవాబు:
జైన మతం :
- జైన మతం ఒక ప్రాచీన భారతీయ మతం.
- ఈ మతాన్ని అనుసరించే వారిని జైనులు అంటారు.
- ఇరవై నాలుగు మంది ‘తీర్థంకరులు’ ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.
- జైన అనే పదం ‘జిన’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది.
- మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధిచెందిన తీర్థంకరుడు అతను ఒక యువరాజు.
- అతను ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అన్నింటినీ వదిలి, 12 సంవత్సరాలు అనేక ప్రదేశాలను సత్యాన్వేషణ కోసం సందర్శించాడు.
- జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం ‘మోక్షం’ సాధించడం.
- కైవల్యం లేదా జినను సాధించినప్పుడు, ఆత్మ కర్మల నుండి విముక్తి పొందుతుంది.
- ఆ ఆనంద స్థితినే ‘మోక్షం’ అంటారు. తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు. మహావీరుడు చివరి తీర్థంకరుడు.
- మహావీరుని బోధనలను అతని అనుచరులు అనేక గ్రంథాలలో సంకలనం చేశారు. ఆ గ్రంథాలను ‘అంగాలు’, అంటారు. ‘అంగాలు’ జైనుల పవిత్ర గ్రంథాలు.
జైన మత సిద్ధాంతాలు : (పంచ వ్రతాలు)
- అహింస – Non violence
- సత్యం – Truthfulness
- ఆస్తేయం – Non-stealing
- అపరిగ్రహం – Non-possessiveness
- బ్రహ్మచర్యం – Centeredness
ఈ జాబితాలో బ్రహ్మచర్యమును మహావీరుడు చేర్చాడు. పై ఐదు సిద్ధాంతాలను అనుసరించడానికి, మహావీరుడు మూడు మార్గాలను సూచించాడు. వాటిని త్రిరత్నాలు అంటారు.
త్రిరత్నాలు :
- సమ్యక్ దర్శనం – సరైన విశ్వాసం
- సమ్యక్ జ్ఞానం – సరైన జ్ఞానం
- సమ్యక్ చరిత్ర – సరైన ప్రవర్తన
ప్రశ్న 9.
గోమఠేశ్వర ఆలయం గురించి నీ కేమి తెలుసు?
జవాబు:
- గోమఠేశ్వర ఆలయం కర్ణాటకలోని శ్రావణబెళగొళ వద్ద ఉంది.
- ఇది చారిత్రక జైన దేవాలయం.
- గోమఠేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాలలో ఒకటి.
- దీని ఎత్తు 57 అడుగులు. దీనిని బాహుబలి అంటారు.
ప్రశ్న 10.
సాంచి స్థూపం గురించి నీకేమి తెలుసు?
జవాబు:
- సాంచి వద్ద ఉన్న స్థూపం గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి.
- ఇది బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని తెలియజేస్తుంది.
- ఇది భారతదేశంలో గల పురాతన రాతి నిర్మాణాలలో ఒకటి.
- దీనిని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు.
- ఇది మధ్య భారతదేశంలో సంరక్షించబడిన పురాతన స్థూపాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.
ప్రశ్న 11.
బౌద్ధమత ఆవిర్భావం, బౌద్ధమత బోధనల గురించి వివరించండి.
జవాబు:
బౌద్ధమతం :
- బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. అతను లుంబిని వనం (నేపాల్)లో జన్మించాడు.
- అతని మొదటి పేరు సిద్ధార్థుడు.
- జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడయ్యాడు.
- సిద్ధార్థుడు కపిలవస్తు పాలకుడైన, శుదోధనుడు మరియు అతని రాణి మాయాదేవికి జన్మించాడు.
- సిద్ధార్థుడికి యశోదరతో వివాహం జరిగింది. ఆ దంపతులకు “రాహుల్”. అనే కుమారుడు జన్మించాడు.
- ఒకరోజు సిద్ధార్థుడు తన ప్రయాణంలో ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసి మరియు ఒక మృతదేహాన్ని చూశాడు. అప్పుడు సిద్ధార్థుడు జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నాడు.
- అతను తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. అతను సత్యం మరియు శాంతికోసం పరిశోధించాడు.
- కఠినమైన ధ్యానంలో కూర్చున్నాడు. 6 సంవత్సరాల తరువాత, అతనికి జ్ఞానోదయం అయింది.
- అతను జ్ఞానోదయం పొందిన చెట్టుకు ‘బోధి వృక్షం’ అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ లో సిద్ధార్థుడు స్వర్గస్థుడైనాడు.
- బుద్ధుని ప్రకారం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము.
- మధ్యే మార్గం (అష్టాంగ మార్గం)ను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు. అహింసా సిద్ధాంతాలపై బౌద్ధమతం ఆధారపడి ఉంది.
- త్రిపీఠకాలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలు. అవి బుద్ధుని జీవితం, బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. గౌతమ బుద్ధుని బోధలను ఆర్య సత్యాలు అంటారు.
ఆర్య సత్యాలు :
- ప్రపంచం దుఃఖమయం.
- దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది.
- కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు.
- అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు.
ప్రశ్న 12.
క్రైస్తవ మత సిద్ధాంతం గురించి వివరించండి.
జవాబు:
క్రైస్తవ మతం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఆచరింపబడే మతం. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిలు.
క్రైస్తవ మత సిద్ధాంతం :
- మానవులందరూ దేవుని పిల్లలు.
- పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
- నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
- ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు. మానవ సేవే మాధవ సేవ.
ప్రశ్న 13.
ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త గురించి, వారి బోధనల గూర్చి తెలుపుము.
జవాబు:
- మహమ్మదు ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు.
- అల్లా యొక్క బోధనలు ‘ఖురాన్’ అనే పుస్తకంలో రాయబడింది.
- ఇది ముస్లింల పవిత్ర గ్రంథం.
- మహమ్మద్ ప్రవక్త మానవులందరూ సోదరులని బోధించాడు.
- సమస్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాడు.
- మహమ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే అని బోధించాడు.
మహమ్మద్ ప్రవక్త బోధనలు :
- మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు.
- మానవులందరూ దేవుని ముందు సమానం.
- దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరియైనది కాదు.
- ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి.
ప్రశ్న 14.
ఈ క్రింది వానిని గురించి నీకేమి తెలుసో వ్రాయండి.
ఎ) సెయింట్ పీటర్స్ బసిలికా (చర్చి)
బి) కాబా
సి) స్వర్ణదేవాలయం
జవాబు:
ఎ) సెయింట్ పీటర్స్ బసిలికా (చర్చి) :
ప్రపంచంలోని ప్రసిద్ధ చర్చి రోమన్ కాథలిక్ చర్చి. ఇది వాటికన్ నగరంలో కలదు. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని పోప్ అంటారు. వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం.
బి) కాబా :
ప్రసిద్ధ మక్కా మసీదు (సౌదీ అరేబియా) మధ్యలో ఉన్న భవనమే కాబా. ముస్లింలకు పవిత్రమైన నగరం మక్కా ముస్లిం భక్తులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ (తీర్థయాత్ర)కు మక్కాకు వెళ్ళాలనుకుంటారు.
సి) స్వర్ణదేవాలయం :
పంజాబ్ లోని అమృతసర్ నగరంలో స్వర్ణదేవాలయం ఉంది. ఇది పవిత్రమైన గురుద్వారా మరియు సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
ప్రశ్న 15.
సిక్కుమతం గురించి వివరించండి.
జవాబు:
- సిక్కు మతం స్థాపకుడు గురునానక్.
- సిక్కు అనేది ఒక విశ్వాసం మరియు దాని అనుచరులను “సిక్కులు” అంటారు.
- సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం.
- సిక్కుల “పదిమంది గురువులలో” మొదటివాడు గురునానక్.
- సిక్కుల ఆలయాన్ని ‘గురుద్వారా’ అంటారు. సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురుగ్రంథ్ సాహెబ్’.
ప్రశ్న 16.
భారతదేశంలోని ప్రధాన భాషలను అవి మాట్లాడే రాష్ట్రాలలో గుర్తించండి.
జవాబు:
- జమ్ముకాశ్మీర్ – కాశ్మీరి
- పంజాబ్ – పంజాబి
- గుజరాత్ గుజరాతి
- మహారాష్ట్ర – మరాఠి
- గోవా – కొంకణి
- కర్ణాటక – కన్నడ
- తమిళనాడు – తమిళం
- కేరళ – మళయాళం
- ఆంధ్రప్రదేశ్ – తెలుగు
- తెలంగాణ – తెలుగు
- ఒడిషా – ఒడియా
- పశ్చిమ బెంగాల్ – బెంగాలీ
- అసోం – అస్సామి
- సిక్కిం – నేపాలి
- నాగాలాండ్ – నాగామి
- మణిపూర్ – మణిపురి
- మిజోరాం – మిజో
- మేఘాలయా – ఖాసి
- అరుణాచల్ ప్రదేశ్ – నైషి
- మిగతా రాష్ట్రాలలో – హిందీ
ప్రశ్న 17.
వర్థమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, వీరి యొక్క జననం, జన్మస్థలం, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, బిరుదులు, మరణం గూర్చి తెల్పుము.
జవాబు:
i) వర్థమాన మహావీరుడు :
పేరు : వర్థమానుడు
జననం : క్రీ.పూ. 599
జన్మస్థలం : వైశాలి
తల్లిదండ్రులు : సిద్ధార్థ, త్రిషాల
జీవిత భాగస్వామి : యశోద
బిరుదులు : మహావీర జిన
మరణం : క్రీ.పూ. 527
ii) గౌతమ బుద్ధుడు
పేరు : సిద్దారుడు
జననం : క్రీ.పూ. 563
జన్మస్థలం : లుంబిని
తల్లిదండ్రులు : సుదోధనుడు, మాయాదేవి
జీవిత భాగస్వామి : యశోధర
కుమారుడు : రాహుల్
బిరుదులు : గౌతముడు, బుద్ధుడు
మరణం : క్రీ.పూ. 483
ప్రశ్న 18.
భారతదేశ సంస్కృతి మరియు వారసత్వం గూర్చి తెలిపి, వాని సమైక్యత ఎలా సాధ్యమైంది? (సాధ్యమైంది)
జవాబు:
- భారతదేశం సువిశాలమైనది. మన దేశంలో అనేక మతాలు, కులాలు, తెగలు, భాషలు, నృత్యరీతులు, శిల్పకళలు, ఆహారం, వేషధారణ, ఆచారాలు మరియు సంప్రదాయాలు కలవు. భారతదేశానికి గొప్ప సంస్కృత మరియు వారసత్వం కలదు. ఇది ఒక విభిన్నమైనది. ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు కలదు.
- భారతదేశంలో సంప్రదాయాలు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరు వేరుగా ఉంటాయి.
- ఇది అనేక ఆచార సంప్రదాయాల సమ్మిళితం.
- భారతదేశంలో అనేక ఆచార, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ, భారతీయులందరి మధ్య సోదర భావం కలదు.
- అన్ని మతాలవారు ఇతర మతపరమైన వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. ఉదాహరణకు దీపావళి, హోలీ, కడప దర్గాలోని ఉరుసు ఉత్సవం, రక్షాబంధన్ మరియు నెల్లూరులోని రొట్టెల పండుగ. దీనిద్వారా ప్రాథమికంగా అన్ని మతాలు సమానమని, చివరికి దేవుని సన్నిధికి దారితీస్తున్నాయనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు.
- ఒక మతం వారు తమ సొంత ఉనికిని కోల్పోకుండా ఇతర మతాలతో కలిసి ఒకే వేదికపై చేసే సహజీవనం ఇది.
ప్రశ్న 19.
బౌద్ధ, జైన మతాలలోని కొన్ని సారూప్యాలను వ్రాయండి.
జవాబు:
- ఈ రెండు మతాల వ్యవస్థాపకులు గణసంఘాలలో జన్మించారు.
- ఇద్దరూ చిన్నవయస్సులోనే ఇంటిని వదిలి పరివ్రాజకులయ్యారు.
- ఇద్దరూ ధ్యానం, తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొందారు.
- రెండు మతాలు సత్య, అహింసలను బోధించాయి.
- రెండు మతాలు వ్యక్తిత్వ ఉన్నతి ప్రభోదించాయి.
ప్రశ్న 20.
వైవిధ్యభరితమైన వారసత్వమున్న భారతదేశంలో నివసించటం మీ జీవితాన్ని ఎలా సుసంపన్నం చేస్తుంది?
జవాబు:
భారతదేశంలో జన్మించడం, జీవించడమే నాకు పెద్ద సంపద క్రింద లెక్క. ఇక్కడ పుట్టిన వేదాలు మనిషినేగాక మానును కూడా ఎలా గౌరవించాలో చెబుతాయి. వేదాంతాలు ‘నేను’ అంటే ఏమిటో తెలియచేస్తాయి. ఇక్కడ పుట్టిన బౌద్దం, ఇక్కడకొచ్చిన క్రైస్తవం తోటి మానవుణ్ణి, జంతువును కూడా ఎలా ప్రేమించాలో చెబుతాయి. ఇక్కడ కొచ్చిన ఇస్లాం చెడు మీద మంచి విజయం ఎలా సాధించాలో చెబుతుంది. ఇలాంటి వారసత్వమున్న దేశంలో జీవించడం నాకు కోట్ల ఆస్తితో సమానం.
ప్రశ్న 21.
వేర్వేరు మతాలలోని ఏకత్వాన్ని తెలిపే అంశాల పట్టికను తయారు చేయండి.
జవాబు:
వేర్వేరు మతాలలోని ఏకత్వాన్ని తెలిపే అంశాల పట్టిక :
- మార్గాలు, మతాలు వేరైనా దేవుడొక్కడే.
- చాలా మతాలవారికి శుక్రవారం మంచిరోజు.
- పూజా సమయానికి ముందు శరీరాన్ని శుభ్రపరచుకోవడం.
- భగవంతుని ధ్యానించే వారు ఆ సమయంలో తలపైన వస్త్రాన్ని కప్పుకోవడం.
- మండల (40 రోజుల) దీక్షలు పాటించడం. (ఈస్టర్, అయ్యప్ప 41 దినములు, రంజాన్ 30 దినములు).
- భగవంతుని పునరుత్థానాన్ని అందరూ నమ్మడం.
- అహింస, సత్యపాలన మొదలైనవి ఆచరించడం మొదలగునవి.
ప్రశ్న 22.
కరెన్సీ నోటును చూసి దానిపైనున్న వివిధ లిపులను గుర్తించండి. ఏయే భాషలలో దీనిమీద రాసి ఉన్నాయి. ఒకే లిపిలో వివిధ భాషలు రాసి ఉన్నాయి. అవి ఏవి?
జవాబు:
ఉదా : 20 రూపాయల నోటును తీసుకుంటే దానిమీద 15 భాషలలో వ్రాయబడి ఉన్నది.
- అస్సామీ – కుడిటక.
- బెంగాలీ – కుడిటక
- గుజరాతీ – వీస్ రుపియా
- కన్నడ – ఇప్పట్టురుపయగలు
- కాశ్మీరీ – ఊహ్ రోపియి
- కొంకణి – వీస్ రుపియా
- మళయాళం – ఇరుపట్ రూపా
- మరాఠీ – వీస్ రుపియా
- నేపాలీ – బీస్ రుపియా
- ఒరియా – బకాదాహకా
- పంజాబ్ – వీహ్ రుపయే.
- సంస్కృతం – వింశతి రూప్యకా
- తమిళం – ఇరుపదు రూపాయ్
- తెలుగు – ఇరువది రూపాయలు
- ఉర్దు – బీస్ రుపియాన్
వీటిలో అస్సామీ, బెంగాలీ ఒకే లిపిలోనూ, గుజరాతీ, మరాఠీ, కొంకణి ఒకే లిపిలో ఉన్నాయి.
ప్రశ్న 23.
మీ పరిసరాలలో భిన్నత్వం ఉందని తెలిపే రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
మా పరిసరాలలో భిన్నత్వం ఉందని తెలపడానికి ఈ క్రింది రెండు అంశాలు ఉదాహరణలు.
- మాది ఆంధ్రప్రదేశ్ లో ఒక నగరం. మేమంతా తెలుగువారము. కాని మానగరంలో అనేక భాషలవారున్నారు. ఇందుకు
ఉదా : మా ఊరిలో ఉన్న తమిళపాఠశాల, గురునానక్ కాలని. - మాది భారతదేశము. ఎక్కువమంది హిందువులుండే దేశము. కాని ఇక్కడ అనేక మతాలవారున్నారు. ఇందుకు
ఉదా : కాశీలో విశ్వేశ్వరుని మందిరము, నాగపట్నంలో వేళాంగిణీ మాత చర్చి, జుమ్మా మసీదు.
ప్రశ్న 24.
మత విశ్వాసాల మధ్య గల పోలికలను, భేదాలను పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
పోలికలు :
- అందరి భావాలు దేవుడొక్కడే అని చెబుతున్నాయి.
- పరలోక జీవితాన్ని విశ్వసిస్తున్నాయి.
- ప్రేమ తత్వాన్ని బోధిస్తున్నాయి.
- తోటి ప్రాణి మంచిని కోరుతున్నాయి.
భేదాలు:
- భగవంతుని రూపాలలో భేదాలున్నాయి.
- ప్రార్థనా విధానాలలో భేదాలున్నాయి.
- ‘పునర్జన్మ’ సిద్ధాంతం నమ్మికలో భేదాలున్నాయి.
- మతాన్ని అర్థం చేసుకోవటంలో కూడా భేదాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా అర్థం చేసుకుని వాటిని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రశ్న 25.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
అ) జెరూసలేం ఆ) మక్కా ఇ) కేరళ రాష్ట్రం ఈ) చెన్నె ఉ) సింధూనది ఊ) రోమ్ ఎ) అమృతసర్
జవాబు: