These AP 6th Class Telugu Important Questions 10th Lesson త్రిజట స్వప్నం will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 10th Lesson Important Questions and Answers త్రిజట స్వప్నం
6th Class Telugu 10th Lesson త్రిజట స్వప్నం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత పద్యాలు
కింది పరిచిత పద్యాలను చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. శుద్దాత్ముఁడైన రాముఁడు
 శుద్ధాంతపుదేవిఁ గానశుభసూచకముల్
 శుద్దమయి తోఁచుచున్నవి
 సిద్ధం బీమాట వేదసిద్ధాంతముగాన్
 ప్రశ్నలు – జవాబులు :
 అ) రాముడు ఎలాంటివాడు?
 జవాబు:
 రాముడు పవిత్రమైన ఆత్మ కలవాడు.
ఆ) శుద్ధాంతము అనగా అర్థమేమిటి?
 జవాబు:
 శుద్దాంతము అనగా అంతఃపురము.
ఇ) శుభములు ఎవరికి కలుగుతాయని త్రిజట అన్నది?
 జవాబు:
 శుభములు సీతారాములకు కలుగుతాయని త్రిజట అన్నది.
ఈ) తాను చెప్పిన మాట, దేనితో సమానమని త్రిజట అన్నది?
 జవాబు:
 తాను చెప్పినమాట వేదంతో సమానమని త్రిజట అన్నది.

2. అనుచు దనుజకాంత లంతంత నెడఁబాసి
 నిదుర వోయి రంత నదరి సీత
 తనకు దిక్కు లేమిఁ దలపోసి దుఃఖింపఁ
 బవనసుతుఁడు మనుజ భాషఁ బలికె
 ప్రశ్నలు – జవాబులు:
 అ) నిద్రపోయినవారు ఎవరు?
 జవాబు:
 సీతకు కావలిగా ఉన్న రాక్షస కాంతలు నిద్రపోయారు.
ఆ) సీత ఎందుకు దుఃఖించింది?
 జవాబు:
 తనను రక్షించే దిక్కులేదని సీత దుఃఖించింది.
ఇ) పవనసుతుడు అనగా ఎవరు?
 జవాబు:
 పవనమనగా వాయువు. పవనసుతుడు అనగా వాయుపుత్రుడైన హనుమంతుడు.
ఈ) హనుమంతుడు ఏ భాషలో మాట్లాడాడు?
 జవాబు:
 హనుమంతుడు మానవభాషలో మాట్లాడాడు.
3. ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
 డున్నాఁ డిదె కపులఁ గూడి, యురుగతి రానై
 యున్నాఁడు, నిన్నుఁ గొని పో
 నున్నాఁ డిది నిజము నమ్ము ముర్వీతనయా!
 ప్రశ్నలు – జవాబులు:
 ఆ) లెస్సగా ఉన్నది ఎవరు?
 జవాబు:
 లెస్సగా ఉన్నవాడు రాముడు.
ఆ) రాముడు ఎవరితో ఉన్నాడు?
 జవాబు:
 రాముడు వానర సైన్యంతో ఉన్నాడు.
ఇ) రాముడు వచ్చి ఏం చేస్తాడని హనుమంతుడు చెప్పాడు?
 జవాబు:
 రాముడు వచ్చి సీతను తీసుకొని వెళతాడని హనుమంతుడు చెప్పాడు.
ఈ) ఉర్వీ తనయ అనగా అర్థమేమిటి?
 జవాబు:
 ఉర్వి అనగా భూమి. ఉర్వీతనయ అనగా భూమి కూతురైన సీత.
అపరిచిత పద్యాలు
1. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
వఱదైన చేను దున్నకు
 కరవైనను బంధుజనుల కడ కేగకుమీ,
 పరులకు మర్మము సెప్పకు,
 పితికికి దళవాయితనము బెట్టకు సుమతీ !
 ప్రశ్నలు – జవాబులు :
 అ) వరద వచ్చినపుడు ఏమి చేయకూడదు?
 జవాబు:
 వరద వచ్చినపుడు పొలములో వ్యవసాయము చేయకూడదు.
ఆ) చుట్టముల దగ్గరకు ఎప్పుడు వెళ్ళకూడదు?
 జవాబు:
 కరవు వచ్చినపుడు చుట్టముల దగ్గరకు వెళ్ళకూడదు.
ఇ) ఎవరికి ఏం చెప్పగూడదు?
 జవాబు:
 ఇతరులకు రహస్యము చెప్పగూడదు.
ఈ) పిటికివానికి ఏమి చేయకూడదు?
 జవాబు:
 పిటికివానికి సేనా నాయకత్వము ఇవ్వకూడదు.

2. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి..
అపకీర్తి పొందుట క
 ష్టపుఁ బని గా దొక్క గడియ చాలును గీర్తిన్
 నిపుణత వహింపవలయును
 జపల గుణము లెల్లఁ బాసి చనఁగఁ గుమారీ !
 ప్రశ్నలు – జవాబులు:
 అ) ఏది కష్టము కాదు?
 జవాబు:
 అపకీర్తి బొందుట కష్టము కాదు.
ఆ) అపకీర్తి పొందటానికి ఎంత సమయము పడుతుంది?
 జవాబు:
 అపకీర్తి పొందటానికి ఒక్క నిమిషం చాలును.
ఇ) కీర్తి సంపాదించవలెనంటే ఏమి చేయాలి?
 జవాబు:
 కీర్తి సంపాదించవలెనంటే చెడ్డ బుద్ధులను వదిలివేయాలి.
ఈ) కీర్తి సంపాదించవలెనంటే ఏమి కావాలి?
 జవాబు:
 కీర్తి సంపాదించవలెనంటే సుగుణములతో భాసిల్లాలి.
3. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. .
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగుఁబట్టు
 బయట కుక్క చేత భంగపడును
 స్థానబలము గాని తన బల్మి గాదయా
 విశ్వదాభిరామ ! వినుర వేమ !
 ప్రశ్నలు – జవాబులు :
 అ) నీటిలో మొసలి ఏం చేయగలదు?
 జవాబు:
 నీటిలో మొసలి ఏనుగుని కూడా పట్టగలదు.
ఆ) బయట మొసలిని ఎవరు భయపెడతారు?
 జవాబు:
 బయట కుక్క కూడా మొసలిని భయపెడుతుంది.
ఇ) మనకు ఏ బలము ముఖ్యము?
 జవాబు:
 స్థానబలము ముఖ్యము.
ఈ) పై పద్యములోని నీతి ఏమిటి?
 జవాబు:
 స్థానబలమే కాని తన బలము ఎందుకు పనికిరాదని నీతి.

4. క్రింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
లావుగల వానికంటెను
 భావింపగ నీతిపరుడు బలవంతుండా
 గ్రావంబంత గజంబును
 మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ !
 ప్రశ్నలు – జవాబులు :
 అ) బలవంతుడెవరు?
 జవాబు:
 నీతిపరుడే బలవంతుడు.
ఆ) కొండంత ఉండేదేది?
 జవాబు:
 ఏనుగు కొండంత ఉంటుంది.
ఇ) ఏనుగు పైనెక్కి నడిపేవాడెవరు?
 జవాబు:
 మావటివాడు ఏనుగు పైనెక్కి నడుపుతాడు.
ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 నీతిపరుడెవరి కంటె బలవంతుడు?
5. క్రింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అన్ని దానములను నన్నదానమె గొప్ప
 కన్నతల్లి కంటె ఘనము లేదు
 ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
 విశ్వదాభిరామ ! వినురవేమ !
 ప్రశ్నలు – జవాబులు:
 అ) అన్ని దానాలకంటే ఏ దానం గొప్పది?
 జవాబు:
 అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది.
ఆ) ఎవరి కంటే గొప్పది లేదు?
 జవాబు:
 తల్లి కంటే గొప్పది లేదు.
ఇ) ఎవరి కంటే గొప్ప వ్యక్తి లేదు?
 జవాబు:
 గురువుగారి కంటే గొప్ప వ్యక్తి లేడు.
ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 పై పద్యంలో ఎంతమంది గురించి చెప్పారు?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
 త్రిజట పాత్ర స్వభావాన్ని వ్రాయండి.
 జవాబు:
 త్రిజట రాక్షస స్త్రీ అయినా మంచి స్వభావం కలది. రాముడు రాక్షస విరోధి. అయినా శ్రీరాముని గొప్పతనాన్ని గుర్తించి ఆయనను శుద్దాత్ముడని సంభోదించింది. సీతాదేవిని కూడా ఒక అంతఃపుర స్త్రీగా, మహాపతివ్రతగా భావించింది. ఆమె దృష్టిలో సీతారాములు తమ విరోధులు కారు. సీతను అమ్మా అని గౌరవంగా సంభోదించిన ఉత్తమ సంస్కారం గల స్త్రీ త్రిజట. మిగిలిన రాక్షసులకు కూడా సీతాదేవి పట్ల తప్పుగా ప్రవర్తించవద్దని చెప్పిన త్రిజట పుణ్యాత్మురాలు.
ప్రశ్న 2.
 త్రిజటకు అటువంటి కల ఎందుకు వచ్చిందో ఊహించి వ్రాయండి.
 జవాబు:
 సాధారణముగా మన ఆలోచనలను బట్టి జరగబోయే దానికి సంకేత రూపంలో కలలు వస్తాయి. సీతారాములు పరమ పవిత్రులని త్రిజటకు తెలుసు. రావణాసురుడు పరమ దుర్మార్గుడని కూడా తెలుసు. అందుకే రావణాసురుడు పతనమయినట్లు శ్రీరాముడు ఏనుగు మీద వచ్చినట్లు త్రిజటకు కల వచ్చింది. రావణాసురుని కిరీటాలు నేల రాలినట్లు కల వచ్చింది. అది రావణాసురుని నాశనానికి సంకేతం. అలాగే లంకాద్వీపం సముద్రంలో పడిపోయినట్లు కల వచ్చింది. అంటే లంకా నగరం నాశనమవుతుందని సంకేతం. శ్రీరాముడు ఏనుగుపై వచ్చినట్లు కల వచ్చింది. ఏనుగు శుభానికి సంకేతం. అందుచేత శ్రీరాముడు విజయం సాధిస్తాడని సంకేతం.

ప్రశ్న 3.
 సీతాదేవి పట్ల కఠినంగా మాట్లాడవద్దని రాక్షస స్త్రీలతో త్రిజట ఎందుకు అన్నది?
 జవాబు:
 త్రిజటకు వచ్చిన కల ప్రకారంగా లంకా నగరానికి నాశనం తప్పదు. రావణుడు మొదలైన రాక్షసులంతా మరణిస్తారు. శ్రీరాముడు విజయం సాధిస్తాడు. సీతాదేవిని తీసుకుని వెడతాడు. సీతాదేవిని బాధిస్తే ఆ కోపం మనసులో పెట్టుకుని శ్రీరామునితో చెబితే అప్పుడు ఆయన రాక్షస స్త్రీలకు మరణదండన విధిస్తాడేమోనని త్రిజటకు భయం. అందుచేతనే సీతాదేవితో కఠినంగా మాట్లాడవద్దన్నది. భవిష్యత్తులో ఆమె మాత్రమే తమను రక్షింపగలదని త్రిజట ఉద్దేశ్యము.
ప్రశ్న 4.
 ‘ఉన్నాడు లెస్స రాఘవుడు’ అని హనుమంతుడు అన్నదానిని బట్టి నీవేమి గ్రహించావు?
 జవాబు:
 సీతాదేవి లంకలో రాముని కోసం పరితపిస్తోంది. ఆమెను రాక్షసులు చాలా బాధపెడుతున్నారు. రాముడు వచ్చి తనను అయోధ్యకు తీసుకువెడతాడనే ఆశతో జీవిస్తోంది. తన ఎడబాటును భరించలేక రాముడు అనారోగ్యవంతు డయ్యాడో, మరణించాడో అనే అనుమానం, భయం ఆమె మనసులో ఉన్నాయి. శ్రీరాముని దగ్గర నుండి వచ్చిన హనుమంతుని చూడగానే ఆమె భయాలు రెట్టింపయ్యాయి. హనుమంతుడు చాలా తెలివైనవాడు. ఆమెను చూడగానే ఆమెలోని భయాలను గ్రహించాడు. ఆ భయాలు పోగొట్టటానికే “ఉన్నాడు లెస్స ! రాఘవుడు”, అన్నాడు. అంటే రాముడు బాగున్నాడు అని దాని అర్థము. రాముడు ఉన్నాడు అంటే సీతకు బాధ మొత్తం పోయింది. ఆనందం కలిగింది.
ప్రశ్న 5.
 ఈ పాఠం ఆధారంగా సీతాదేవి గురించి మీకు తెలిసిన విషయాలు వ్రాయండి.
 జవాబు:
 సీతాదేవి శ్రీరాముని భార్య. ఆమెను రావణుడు ఎత్తుకు వచ్చాడు. లంకలో ఉంచాడు. ఆమెకు కాపలాగా త్రిజట మొదలైన రాక్షస స్త్రీలను ఉంచాడు. సీతాదేవి చాలా మంచి స్వభావం కలది. అందుచేతనే ఆమె అంటే త్రిజటకు గౌరవం, ఇష్టం. ఆమె ఒంటరితనంతో బాధపడుతోంది. సీతాదేవి తనకెవరూ దిక్కు లేరని బాధపడుతోంది. ఆమె భూదేవి యొక్క పుత్రిక. రాముని బంటైన హనుమంతుని మాటలతో ఆమెకు ఆనందం కలిగింది. ఆమెకు ధైర్యం కలిగింది.
ప్రశ్న 6.
 కింది కవితను పొడిగించండి.
 లంకను కాల్చిన హనుమయ్య !
 సీతను చూచిన హనుమయ్య !
 జవాబు:
 లంకను కాల్చిన హనుమయ్య
 సీతను చూచిన హనుమయ్య
 రాముడు మెచ్చిన హనుమయ్య
 రాముని బంటువు నీవయ్య
 రావణ వైరివి నీవయ్య
 వారధి కట్టిన హనుమయ్య
 బలముగ పెరిగిన హనుమయ్య
 బలమును మాకూ ఇవ్వయ్య
 తెలివిని మాకూ నేర్పయ్య
 వారిని దూకిన హనుమయ్య
 గెంతులు మాకూ నేర్పయ్య
 కాపాడు మమ్మూ హనుమయ్య

ప్రశ్న 7.
 త్రిజట, సీతల సంభాషణను ఊహించి రాయండి.
 జవాబు:
 త్రిజట : అమ్మా ! సీతమ్మా !
 సీత : ఏమిటీ గౌరవం? ఎందుకంత భక్తి?
 త్రిజట : అమ్మా ! నిన్న రాత్రి కల వచ్చిందమ్మా !
 సీత : ఏమని వచ్చింది?
 త్రిజట : రావణుడు మరణించినట్లు, లంక మునిగిపోయినట్లూ.
 సీత : అయ్యయ్యో !
 త్రిజట : శత్రువు పట్ల కూడా జాలి చూపించే నీవు దేవతవమ్మా !
 సీత : నాకే కాదమ్మా ! ఎవ్వరికీ కష్టాలు కలగకూడదు.
 త్రిజట : నీ కష్టాలు తీరతాయమ్మా ! రాముడు నిన్ను తీసుకొని వెడతాడమ్మా !
 సీత : ఆ శుభగడియ వస్తుందా?
 త్రిజట : తప్పక వస్తుందమ్మా ! భయపడకు, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష !
 సీత : ఇక చాల్లే. అదిగో ! రావణుడు వస్తున్నాడు. మాట్లాడకు.
III. భాషాంశాలు
1. పర్యాయపదాలు :
స్వప్నం = కల, స్వపనము
 శుద్దాంతము = అంతఃపురము, రాణివాసము
 వేదము = ఆగమము, ఆమ్నాయము
 ఉక్తులు = మాటలు, పలుకులు
 మది = మనస్సు, హృదయం
 ఇమ్ముగ = సంతోషంగా, ఆనందంగా
 కరుణ = దయ, కృప
 దనుజులు = రాక్షసులు, అసురులు
 సీత = జానకి, మైథిలి
 పవనము = గాలి, వాయువు
 పవనసుతుడు = హనుమంతుడు, ఆంజనేయుడు
 ఉర్వి = భూమి, పుడమి
 ఉర్వీతనయ – సీత, మైథిలి
 రాముడు = దాశరథి, సీతాపతి
 శుద్ధము = పవిత్రం, పునీతం
 కఠినం = పరుషము, నిష్టూరము
 దిక్కు = శరణు, రక్షణ
 వెఱచు = భయపడు, బెదురు
 మగడు = భర్త, పతి
 కాంత = స్త్రీ, పడతి
 ఎడబాసి = విడిచి, వదలి
 దుఃఖము = ఏడ్పు, బాధ
 సుతుడు = కొడుకు, తనయుడు
 మనుజులు = మానవులు, మర్త్యులు
 తనయ = సుత, కూతురు
2. ప్రకృతి – వికృతులు :
జట – జడ
 ఈశ్వరుడు – ఈసరుడు
 శుద్ధము – సుద్దము
 కఠినము – కటిక
 మతి – మది
 దుఃఖము – దూకలి
 నిజము – నిక్కము
 ద్వీపము – దీవి
 రత్నము – రతనము
 ఆత్మ – ఆతుమ
 అంబ – అమ్మ
 నిద్ర – నిదుర
 భాష – బాస

3. వ్యతిరేకపదాలు:
వినండి × వినకండి
 శుభం × అశుభం
 కఠినం × మృదువు
 దుఃఖం × సుఖం
 శుద్ధము × అశుద్ధము
 సిద్ధం × అసిద్ధం
 లేమి × కలిమి
 నమ్ము × నమ్మకు
4. సంధులు:
వినుడు + ఇంతులు + ఆర = వినుడింతులార – (ఉత్వ సంధి)
 ద్వీపము + ఈ = ద్వీపమీ – (ఉత్వ సంధి)
 ఉద్వహుండు + ఎలమి = ఉద్వహుండెలమి – (ఉత్వ సంధి)
 ద్విపంబు + ఎక్కి = ద్విపంబెక్కి – (ఉత్వ సంధి)
 ఏను + ఇపుడే = ఏనిపుడే – (ఉత్వ సంధి)
 శుద్ధము + అయి = శుద్దమయి – (ఉత్వ సంధి)
 సిద్ధంబు + ఈ మాట = సిద్ధంబీమాట – (ఉత్వ సంధి)
 ఆడకుడు + ఇక = ఆడకుడిక – (ఉత్వ సంధి)
 దిక్కు + అగు = దిక్కగు – (ఉత్వ సంధి)
 మమ్ము + అందఱ = మమ్మందఱ – (ఉత్వ సంధి)
 మునుపుము + అమ్మ = మునుపుమమ్మ – (ఉత్వ సంధి)
 కాంతలు + అంత = కాంతలంత – (ఉత్వ సంధి)
 రాఘవుడు + ఉన్నాడు = రాఘవుడున్నాడు – (ఉత్వ సంధి)
 ఉన్నాడు + ఇదె = ఉన్నాడిదె – (ఉత్వ సంధి)
 నమ్ముము + ఉర్వి = నమ్ముముర్వి – (ఉత్వ సంధి)
 ఆత్ముడు + ఐన = ఆత్ముడైన – (ఉత్వ సంధి)
 మిన్నక + ఏను = మిన్నకేను – (ఉత్వ సంధి)
 ఉన్న + అట్టి = ఉన్నట్టి – (ఉత్వ సంధి)
 పోయిరి + అంత = పోయిరంత – (ఇత్వ సంధి)
 ఈ + అబ్ధి = ఈయబ్ది – (యడాగమం)
 కావలి + ఉన్న = కావలియున్న – (యడాగమం)
 కూడి + ఉరుగతి = కూడియురుగతి – (యడాగమం)
 రానై + ఉన్నాడు = రానైయున్నాడు – (యడాగమం)
 రఘు + ఉద్వహుడు = రఘూద్వహుడు – (సవర్ణదీర్ఘ సంధి)
 శుద్ధ + అంతము = శుద్ధాంతము – (సవర్ణదీర్ఘ సంధి)
 శుద్ధ + ఆత్ముడు = శుద్ధాత్ముడు – (సవర్ణదీర్ఘ సంధి)
 సిద్ధ + అంతము = సిద్ధాంతము – (సవర్ణదీర్ఘ సంధి)
 రావణ + ఈశ్వరుడు = రావణేశ్వరుడు – (గుణ సంధి)

5. కింది వ్యతిరేక పదాలు జతపర్చండి.
| 1) వినండి | అ) అశుభం | 
| 2) శుభం | ఆ) కలిమి | 
| 3) లేమి | ఇ) వినకండి | 
జవాబు:
| 1) వినండి | ఇ) వినకండి | 
| 2) శుభం | అ) అశుభం | 
| 3) లేమి | ఆ) కలిమి | 
6. కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి.
| 1) ద్వీపము | అ) ఆతుమ | 
| 2) ఆత్మ | ఆ) మది | 
| 3) మతి | ఇ) దీవి | 
జవాబు:
| 1) ద్వీపము | ఇ) దీవి | 
| 2) ఆత్మ | అ) ఆతుమ | 
| 3) మతి | ఆ) మది | 
7. కింది ఖాళీలను పూరించండి.
1) శుద్ధమయి = శుద్ధము + అయి – ఉత్వ సంధి
 2) పోయిరంత = పోయిరి + అంత – ఇత్వ సంధి
 3) ఉన్నట్టి = ఉన్న + అట్టి – అత్వసంధి
 4) ఈయబ్ది = ఈ + అబ్ధి – యడాగమం
 5) సీతారాములు = సీతయును, రాముడును – ద్వంద్వ సమాసం
 6) అష్టదిక్కులు = అష్టయైన దిక్కులు – ద్విగు సమాసం
8. కింద వాక్యాల రకాలను రాయండి.
1. అన్నం తిన్నావా ?
 జవాబు:
 ప్రశ్నార్థక వాక్యం
2. నవ్వుతూ, నవ్విస్తూ బతకాలి.
 జవాబు:
 సంయుక్త వాక్యం
3. ఆహా ! ఎంత రుచి !
 జవాబు:
 ఆశ్చర్యార్థక వాక్యం
4. రాధ నవ్వుతూ మాట్లాడుతుంది.
 జవాబు:
 సంక్లిష్ట వాక్యం
5. భారత, భాగవతాలు పవిత్ర గ్రంథాలు.
 జవాబు:
 సంయుక్త వాక్యం

9. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.
1. మహారాణులు శుద్ధాంతమున ఉంటారు. (అర్థం గుర్తించండి)
 అ) అంతఃపురము
 ఆ) పవిత్రమైన గుడి
 ఇ) దేవాలయం
 జవాబు:
 అ) అంతఃపురము
2. ద్విపమునకు సింహమంటే భయం. (అర్థం గుర్తించండి)
 అ) నక్క
 ఆ) కుందేలు
 ఇ) ఏనుగు
 జవాబు:
 ఇ) ఏనుగు
3. దిక్కులేని వారికి దేవుడే దిక్కు (అర్థం గుర్తించండి)
 అ) దిశ
 ఆ) శరణు
 ఇ) మ్రొక్కు
 జవాబు:
 ఆ) శరణు
4. మంచిని తలపోసిన మంచే జరుగుతుంది. (అర్థం గుర్తించండి)
 అ) చూసిన
 ఆ) ఆలోచించిన
 ఇ) చేసి
 జవాబు:
 ఆ) ఆలోచించిన
5. ఎవరి తనయ అంటే వారికి ముద్దే. (అర్థం గుర్తించండి)
 అ) కొడుకు
 ఆ) ఇల్లు
 ఇ) కుమార్తె
 జవాబు:
 ఇ) కుమార్తె

6. దేవాలయం శుద్ధముగా ఉంటుంది. (పర్యాయపదాలు గుర్తించండి)
 అ) పవిత్రం, పునీతం
 ఆ) పెద్దది, విశాలమైనది
 ఇ) అందం, సొగసు
 జవాబు:
 అ) పవిత్రం, పునీతం
7. మనుజులు చాలా తెలివైనవారు. (పర్యాయపదాలు గుర్తించండి)
 అ) మేధావులు, విజ్ఞులు
 ఆ) మానవులు, మర్త్యులు
 ఇ) గురువులు, ఒజ్జలు
 జవాబు:
 ఆ) మానవులు, మర్త్యులు
8. పవనము గట్టిగా వీచింది. (పర్యాయపదాలు గుర్తించండి)
 అ) గాలి, వాయువు
 ఆ) వాన, వర్షం
 ఇ) మంట, అగ్ని
 జవాబు:
 అ) గాలి, వాయువు
9. దనుజులు దుర్మార్గులు. (పర్యాయపదాలు గుర్తించండి)
 అ) దేవతలు, సురలు
 ఆ) యక్షులు, కిన్నరులు
 ఇ) రాక్షసులు, అసురులు
 జవాబు:
 ఇ) రాక్షసులు, అసురులు
10. సీత జనకుని కుమార్తె. (పర్యాయపదాలు గుర్తించండి)
 అ) ఊర్మిళ, సీత
 ఆ) జానకి, మైథిలి
 ఇ) పుత్రిక, కూతురు
 జవాబు:
 ఆ) జానకి, మైథిలి
11. పాఠం శ్రద్ధగా వినండి. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) వినకండి
 ఆ) వినాలి
 ఇ) వినకపోతే
 జవాబు:
 అ) వినకండి
12. ప్రతి ఇంటా శుభం జరగాలి. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) అశుభం
 ఆ) సంతోషం
 ఇ) సుఖం
 జవాబు:
 అ) అశుభం
13. కఠినంగా మాట్లాడకూడదు. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) పరుషం
 ఆ) నిష్ఠూరం
 ఇ) మృదువు
 జవాబు:
 ఇ) మృదువు

14. అందరినీ నమ్మకు. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) నమ్మకు
 ఆ) నమ్ము
 ఇ) అనుమానించు
 జవాబు:
 ఆ) నమ్ము
15. లేమికి భయపడకూడదు. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) కలిమి
 ఆ) దరిద్రం
 ఇ) దీనత్వం
 జవాబు:
 అ) కలిమి
16. జడలో పూలు పెట్టుకొంటారు. (ప్రకృతి గుర్తించండి)
 అ) సిగ
 ఆ) కొప్పు
 ఇ) జట
 జవాబు:
 ఇ) జట
17. ప్రతి దీవిలోనూ మనుషులుంటారు. (ప్రకృతి గుర్తించండి)
 అ) దీవెన
 ఆ) ద్వీపము
 ఇ) దీప్యము
 జవాబు:
 ఆ) ద్వీపము
18. దుఃఖము శాశ్వతం కాదు. వికృతిని గుర్తించండి)
 అ) దుఖము
 ఆ) దుక్కము
 ఇ) దూకలి
 జవాబు:
 ఇ) దూకలి
19. శుద్ధమయిన ఆత్మతో ఉండాలి. (సంధి పేరు గుర్తించండి)
 అ) ఉత్వ సంధి
 ఆ) ఇత్వ సంధి
 ఇ) అత్వ సంధి
 జవాబు:
 అ) ఉత్వ సంధి
20. కాంతలు + అంత – సంధి కలిసిన రూపం గుర్తించండి.
 అ) కాంతలెంత
 ఆ) కాంతలంత
 ఇ) కాంతలుంత
 జవాబు:
 ఆ) కాంతలంత

21. కిందివానిలో అత్వ సంధి పదం గుర్తించండి.
 అ) మమ్మందట
 ఆ) మనుపుమమ
 ఇ) ఉన్నట్టి
 జవాబు:
 ఇ) ఉన్నట్టి
22. పోయిరంత ముందుగానె – (సంధి పేరు గుర్తించండి)
 అ) ఇత్వ సంధి
 ఆ) ఉత్వ సంధి
 ఇ) అత్వ సంధి
 జవాబు:
 అ) ఇత్వ సంధి
23. ఈ + అబ్ది – సంధి కలిసిన రూపం గుర్తించండి.
 అ) ఈ అభి
 ఆ) ఈయబ్ది
 ఇ) ఈబ్ది
 జవాబు:
 ఆ) ఈయబ్ది
24. శుద్దాత్ముడు రాముడు. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
 అ) శుద్ధా + ఆత్ముడు
 ఆ) శుద్ధి + ఆత్ముడు
 ఇ) శుద్ధ + ఆత్ముడు
 జవాబు:
 ఇ) శుద్ధ + ఆత్ముడు
25. రావణ, కుంభకర్ణులు రాక్షసులు. (వాక్య రకం గుర్తించండి)
 అ) సంయుక్తం
 ఆ) సంక్లిష్టం
 ఇ) సామాన్యం
 జవాబు:
 అ) సంయుక్తం
26. ఎవ్వరూ రాకండి. (వాక్య రకం గుర్తించండి)
 అ) అనుమత్యర్థకం
 ఆ) నిషేధాకం
 ఇ) విధ్యర్థకం
 జవాబు:
 ఆ) నిషేధాకం
27. రావణుడెవరిని ఎత్తుకెళ్లాడు? (వాక్య రకం గుర్తించండి)
 అ) ఆశ్చర్యార్థకం
 ఆ) విధ్యర్థకం
 ఇ) ప్రశ్నార్థకం
 జవాబు:
 ఇ) ప్రశ్నార్థకం
28. ఆహా ! బూరె ఎంత తియ్యగా ఉందో ! (వాక్య రకం గుర్తించండి)
 అ) ఆశ్చర్యార్థకం
 ఆ) ప్రశ్నార్థకం
 ఇ) అనుమత్యర్థకం
 జవాబు:
 అ) ఆశ్చర్యార్థకం
29. నీవు వచ్చి, వెళ్ళు. (వాక్యం రకం గుర్తించండి)
 అ) ఆశ్చర్యార్థకం
 ఆ) సంక్లిష్టం
 ఇ) సంయుక్తం
 జవాబు:
 ఆ) సంక్లిష్టం

30. అరవై సంవత్సరాలు నిండాయి. (సమాసం పేరు గుర్తించండి)
 అ) ద్విగువు
 ఆ) ద్వంద్వం
 ఇ) బహుబ్లిహి
 జవాబు:
 అ) ద్విగువు
చదవండి – ఆనందించండి
పిచ్చుక నేర్పిన పాఠం
యువకుడొకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు.

 అతడు జ్ఞానితో, ఇలా అన్నాడు. “అయ్యా, ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు. ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు. కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను. అందునిమిత్తం నేడే నేను మన ఊళ్ళోనుండి బయలుదేరుతున్నాను. నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి, అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి. అలాగే ఆ యువకుణ్ణి, జ్ఞాని మనసారా ఆశీర్వదించి పంపించాడు.
కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుణ్ణి మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ యువకుడి వద్దకు వెళ్ళి, ఆ జ్ఞాని, “నాయనా ! నువ్వు ఇంకా ఆ నగరానికి బయల్దేరి వెళ్ళలేదా? నువ్వు… నన్ను కలుసుకున్న రోజునే, ఉద్యోగార్థం ఊరు విడిచి వెళుతున్నట్లు చెప్పావే ?” అని అడిగాడు.
అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు: “అయ్యా! నేను ఆరోజునే, అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తారసపడ్డది. అక్కడున్న ఒక ఈతచెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను.
అక్కడ నేనొక దృశ్యం చూశాను.
నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో, ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ, అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లి పోతూండడం కంటపడింది. దాన్ని చూసి నేను ‘ఈ పిచ్చుక దానంతట అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే! ఇది ఎలా బతకగలదు?” అని ఆలోచిస్తూ ఉండిపోయాను.
“ఇలా నా ఆలోచనలు సాగుతూండగా, ఎక్కణ్ణుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చింది. అది తన నోటితో ఆహారం తెచ్చి, కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది.
“అది చూసి నేను, ‘ఆహా! కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించడానికి, భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే! అలాంటప్పుడు, మనిషినైన నేను జీవించడానికి భగవంతుడు నాకొక ఏర్పాటు చెయ్యకుండా ఉంటాడా?” అని అనుకొని, పయనం రద్దుచేసుకొని, మన ఊరికే తిరిగి వచ్చేశాను.” –
అంతా విన్న ఆ జ్ఞాని, “నాయనా! నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని ఆశిస్తున్నావు? తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకొని, మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు అశించడం లేదు?” అని ప్రశ్నించాడు.
ఆ మాటలకు యువకుడికి కనువిప్పు కలిగింది.
‘ఇతరుల శ్రమతో జీవించాలి’ అనుకోవడం హీనాతిహీనం అని గ్రహించి కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. తన స్వకీయ శ్రమతో జీవిస్తూ, ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి, ఆకాంక్షించాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది.
