SCERT AP 10th Class Social Study Material Pdf 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Social Solutions 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు
10th Class Social Studies 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
కింది కథనం ఆధారంగా సమాచార హక్కు చట్టం నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల, పౌరుల పాత్రలను వివరించండి. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పని మరింత పారదర్శకంగా ఎలా అవుతుందో రాయండి. (AS2)
కింద పేర్కొన్న ఘటన మెదక్ జిల్లాలోని చిన్న శంకరం పేటలో జరిగింది. స్వయం సహాయక బృందాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీలలో చేరారు. ఈ పథకం కింద 9 నుంచి 12 తరగతులు చదువుతున్న పిల్లలకు 1200 రూపాయల స్కాలర్షిప్ పొందడానికి అర్హత ఉంది. అయితే 2008-11 మధ్య మూడు సంవత్సరాల పాటు విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తం అందలేదు. విద్యార్థులు ఇందిరా క్రాంతి పథకం (IKP) కార్యాలయానికి వెళ్లి అడిగారు. కానీ అక్కడి అధికారులు వాళ్లను పట్టించుకోలేదు.
ఇది స్థానిక దినపత్రికల దృష్టికి వచ్చింది. ఆమోదించిన స్కాలర్షిప్పుల వివరాలు ఇవ్వమంటూ వాళ్లు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేశారు. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాలలో లబ్ధిదారుల సంఖ్య, మంజూరు చేసిన మొత్తం ఎంత అని అడిగారు. వాళ్లకు ఒక వారంలోపు సమాచారం వచ్చింది. మొత్తం ఏడు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. సమాచార హక్కు ద్వారా అందిన వివరాలను బట్టి డబ్బు మంజూరయ్యింది కానీ, దానిని పంచలేదని తెలిసింది. ఈ విషయం వార్తాపత్రికలలో ప్రచురితం కాగానే 15 రోజుల లోపు 1167 విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు.
జవాబు:
సమాచార హక్కు చట్టం ప్రయోజనాలు ప్రజలకు అందాలంటే రెండు పాత్రలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
- ప్రభుత్వ శాఖలు
- పౌరులు
ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైనా ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి.
1) ప్రభుత్వశాఖల పాత్ర :
పై ఘటనలో ఉన్న ప్రభుత్వ శాఖలు – రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం. ఈ సంస్థలు వాటి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించాలి. అంటే 9 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు 1200 రూపాయల స్కాలర్షిప్ అందజేయాలి. కాని 2008-11 మధ్య మూడు సంవత్సరాలపాటు పిల్లలకు స్కాలర్షిప్ అందచేయలేదు. ఆ విషయాలు పట్టించుకోలేదు. చివరికి విద్యార్థులే సమాచారహక్కును ఉపయోగించి వివరాలు కనుక్కోవలసి వచ్చింది. ఈ విషయమంతా వార్తాపత్రికలలో కూడా వచ్చింది. దీనితో 15 రోజులలోపు 1167 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందచేశారు. అయితే ఈ సంస్థల నిర్లక్ష్యం, జాప్యం అనేవి ప్రజలు, వార్తాపత్రికల దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వ సంస్థలు సక్రమంగా పనిచేయట్లేదంటూ మాట్లాడారు. కావున ప్రభుత్వ సంస్థలు నిరంతరం మెలకువతో ఉండి, తమ వద్ద ఏ ఫైల్ను ఆపకుండా సకాలంలో పనిచేయాలి.
2) పౌరుల పాత్ర :
అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం వంటి సంస్థలు వాటి విధులు మరిచిపోయాయి. కాని విద్యార్థులు వదలకుండా సమాచార హక్కు చట్టంను ఉపయోగించి వాస్తవాలు తెలుసుకున్నారు. ఈలోగా ఈ విషయాలన్నీ వార్తాపత్రికలో వచ్చాయి. అప్పుడు హడావుడిగా ఆ సంస్థలు విద్యార్థులకు డబ్బును అందించారు. ఇందులో పౌరులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించినారని తెలుస్తుంది.
ప్రశ్న 2.
సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగుపరచటం, పర్యవేక్షించటం ఎలా సాధ్యమవుతుంది? (AS4)
జవాబు:
మెరుగుపరచటం :
1) ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి. ఏ విషయం మీదైనా ప్రజలు సమాచారం అడగవచ్చు. కనుక ఎల్లప్పుడూ ప్రభుత్వ సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
2) ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. దీని కొరకు రికార్డులను, రిజిష్టర్లను, నివేదికలను, డాక్యుమెంట్లను నిర్వహించాలి.
3) ప్రతి వ్యవస్థ, తన విధి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత వహించాలి. విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
4) సమాచార హక్కు చట్టం వలన ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
పర్యవేక్షణ :
5) ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటాడు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
6) అన్ని శాఖల అప్పిలేట్ అధికారులు, పౌర సమాచార అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
7) రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. కేంద్ర సమాచార కమిషనర్లు ఉంటారు.
మనం సమాచారం కొరకు దరఖాస్తు చేసినపుడు ఆయా సమాచార అధికారులు సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు జవాబుదారీగా ఉంటారు. అవసరం అయితే వీరు ఆ సమాచార అధికారికి జరిమానా కూడా విధించవచ్చు.
ప్రశ్న 3.
సమాచారం అని దేనిని అంటారు? ఇది ప్రభుత్వ శాఖలలో ఎలా ఉత్పన్నమవుతుంది? పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవుతుందా? (AS1)
జవాబు:
ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమనిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.
ఉదా :
- ఆరోగ్యశాఖలో ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సుల ఎంపిక, నియామకం, బదిలీలకు సంబంధించి లేదా మందుల కొనుగోలు, పంపిణీలకు సంబంధించి నియమనిబంధనలు ఉంటాయి.
- అందువల్ల ప్రతి సంస్థ కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి కారణంగా వ్యవస్థలో అనేక రాత పత్రాలు రూపొందుతాయి. ఇవి ఈ క్రింది రూపాలలో ఉండవచ్చు.
- రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్, ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
- సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
- పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవదు.
ప్రశ్న 4.
రాష్ట్ర, కేంద్ర సమాచార కార్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఎందుకు ఇచ్చారు? (AS4)
జవాబు:
- ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
- అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
- దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. ఏదైనా ప్రభుత్వశాఖ కేంద్రప్రభుత్వం కిందికి వస్తే కేంద్ర సమాచార కమిషనర్లతో కూడిన సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
- ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఎందుకనగా మనం ఏదైనా ఒక కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే, వారు మనల్ని వేరే కార్యాలయం నుండి సమాచారం పొందమని చెప్పడానికి లేదు.
- ఒకవేళ మనమడిగిన సమాచారం వారి దగ్గర లేనట్లయితే సమాచారం ఉన్న అధికారి నుంచి సమాచారం పొంది దానిని అందజేయటం వాళ్ళ బాధ్యత.
- ఈ అంశాల మూలంగా ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయని తెలుస్తుంది. మరియు ఇతరుల ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటే స్వయంప్రతిపత్తి ఉండాలి.
ప్రశ్న 5.
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు? (AS6)
జవాబు:
- ప్రజాస్వామ్యమంటేనే ప్రజల ప్రభుత్వమని అర్థం. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులచే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారు. కావున ప్రభుత్వ కార్యక్రమాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ప్రభుత్వమే కల్పించింది.
- ప్రజాస్వామ్య ప్రభుత్వాలు శ్రేయో రాజ్యాలు. ప్రజల కొరకు అనేక సంస్కరణలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలకు తెలియచేయడానికే ఈ సమాచార హక్కును కల్పించింది.
- ప్రజలు ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులు మరియు ఇతర రుసుములన్నింటిని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకునే అవకాశం ఈ సమాచార హక్కు కల్పిస్తుంది.
- సమాచారంలో పారదర్శకత ఉండాలి. ఇది ప్రభుత్వ సంస్థలలో అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుంది.
- ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక పౌరునికి కూడా జవాబుదారీగా ఉంటాయి.
- ఈ సమాచార హక్కు ద్వారా ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను, వారి విధులను, కార్యకలాపాలను నియంత్రణ చేయవచ్చు.
- ఈ సమాచార హక్కును ప్రజాస్వామ్య రాజ్యాలే ఇచ్చాయి. ఇది వ్యక్తి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది.
- ప్రభుత్వ ఆఫీసులలోని కార్యక్రమాల పట్ల ఇంతకుముందున్న అస్పష్టత ఈ హక్కు మూలంగా పోయింది.
కావున ఈ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది.
ప్రశ్న 6.
దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఏ పౌరుడికైనా సమాచారం అందుబాటులో ఉండేలా చెయ్యటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? (AS4)
జవాబు:
సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ సంస్థలు
అ) కంప్యూటరైజ్డ్ రూపంలో సమాచారాన్ని భద్రపరచాలి,
ఆ) దానికి సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగానే వెల్లడి చెయ్యాలి. సమాచార హక్కు చట్టం ఇలా పేర్కొంటోంది:
1) ప్రతి ప్రభుత్వ సంస్థ :
అ) తనకు సంబంధించిన అన్ని రికార్డులను… ఇటువంటి రికార్డులను తేలికగా బయటకు తీయటానికి వీలుగా వర్గీకరించి, సూచికలతో నిర్వహించాలి.
ఆ) ప్రతి సంస్థ ఈ దిగువ సమాచారాన్ని ప్రచురించాలి.
i) సంస్థ వివరాలు, విధులు, బాధ్యతలు.
ii) సంస్థలోని అధికారులు, ఉద్యోగస్తుల అధికారాలు, విధులు :
iii) నిర్ణయాలు తీసుకోవటంలో అనుసరించే విధానం, పర్యవేక్షణ, జవాబుదారీ విధానాలను కూడా పేర్కొనాలి.
iv) సంస్థకు ఉండే లేదా దాని నియంత్రణలో ఉండే లేదా తమ విధులను నిర్వర్తించటంలో ఉద్యోగస్తులు ఉపయోగించే నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, మార్గదర్శకాలు, రికార్డులు.
v) సలహా ఇవ్వటం కోసం ఏర్పాటు చేసి …. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న బోర్డులు, సమితులు, సంఘాలు, ఇతరాల వివరాలు:
vi) ఆ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగస్తుల వివరాలు :
vii) అధికారులు, ఉద్యోగస్తులకు ఇస్తున్న నెలసరి జీతం, నియమాల ప్రకారం చేసే ఇతర చెల్లింపులు
viii) తన ప్రతి ఒక్క ఏజెన్సీకి కేటాయించిన బడ్జెటు
ix) సబ్సిడీ పథకాల అమలు విధానం దానికి కేటాయించిన నిధులు.
x) దాని ద్వారా రాయితీలు, పర్మిట్లు, లేదా అధీకృత పత్రాలు పొందిన వాళ్ల వివరాలు
xi) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు.
ఇ) ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు లేదా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు సంబంధిత అన్ని వాస్తవాలను వెల్లడి చేయాలి.
ఈ) ప్రభావిత వ్యక్తికి పరిపాలన సంబంధ లేదా న్యాయ స్వరూపం గల నిర్ణయాలకు కారణాలను తెలియచెయ్యాలి.
2) పై సమాచారమంతటినీ ఎవరూ అడగకుండానే ప్రభుత్వ సంస్థలు వెల్లడి చేయాలి.
3) ఇది అందరికీ తేలికగా అందుబాటులో ఉండాలి.
4) ఇది స్థానిక భాషలో ఉండాలి, దీనికి ఏదైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే అది ప్రజలకు భారం కాకుండా ఉండాలి.
ప్రశ్న 7.
న్యాయ సహాయం ఆశించే ప్రజలకు న్యాయ సేవల ప్రాధాన్యత సంస్థ ఏ విధంగా దోహదపడుతుంది? (AS1)
జవాబు:
- ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
- న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
- ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.
- దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.
ప్రశ్న 8.
లోక్ అదాలత్ ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:
- సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
- లోక్ అదాలత్ లను “న్యాయసేవల పీఠాల చట్టం 1987″ని 1994లోను తిరిగి 2002లోను సవరించారు. ఈ సవరణ ప్రకారం లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
- లోక్ అదాలత్ అంటే ప్రజాస్వామ్య పీఠాలు. వీటి ద్వారా న్యాయకోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో పరస్పర అంగీకారంతో తగాదాలు, వివాదాలు పరిష్కరించుకోవచ్చు.
- ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి లోక్ అదాలలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
- కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది.
ప్రశ్న 9.
ఈ చట్టం కింద చేపట్టే కేసులు, ఉచిత న్యాయసేవలు పొందటానికి పేర్కొన్న అర్హతలపై మీ అభిప్రాయం ఏమిటి? (AS2)
జవాబు:
I. ఉచిత న్యాయసేవలు పొందటానికి అర్హతలు :
- షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు.
- అక్రమ రవాణా బాధితులైన వ్యక్తులు, బిక్షాటకులు.
- స్త్రీలు, పిల్లలు.
- మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు.
- పెను విపత్తు, జాత్యాహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరవులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు.
- పారిశ్రామిక కార్మికులు.
- వ్యభిచార వృత్త (నివారణ) చట్టం, 1956లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం రక్షణ గృహం, లేదా బాల నేరస్తుల న్యాయ చట్టం, 1986లోని సెక్షన్ 2, క్లాజు (జె) ప్రకారం బాల నేరస్తుల గృహం లేదా మానసిక ఆరోగ్య చట్టం 1987లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం మానసిక వ్యాధి చికిత్సాలయం లేదా మానసిక రోగుల సంరక్షణాలయంలో నిర్బంధంలో ఉన్న వ్యక్తులు.
- లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు.
పైన పేర్కొన్న వారిలో ఏ వ్యక్తులైనా సహాయం పొందటానికి అర్హులని సంబంధిత న్యాయమూర్తి సంతృప్తి చెందితే వారు తగిన న్యాయ సేవలు పొందవచ్చు.
II. లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చే కేసులు :
- వైవాహిక విభేదాలు.
- భరణానికి సంబంధించిన కేసులు.
- భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు.
- గృహ హింస కేసులు.
- అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు.
- చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.
III.నా అభిప్రాయం :
సమాజంలో వెనుకబడినవారు, పేదవారు, ఏ విధమైన సహాయ సహకారాలు లభించని వారికి ఈ లోక్ అదాలత్ సహాయపడుట చాలా మంచిదని నా అభిప్రాయం. స్త్రీలకు సంబంధించిన కేసులలో సరైన న్యాయం లభించుటలేదు. ఇటువంటి నేపథ్యంలో లోక్ అదాలత్ లు స్త్రీల వేధింపులకు సంబంధించిన కేసులను విచారించి, పరిష్కరించడమనేది అభినందనీయమే.
ప్రశ్న 10.
గ్రామ పెద్దలు, కోర్టులు వివాదాలు తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేనిని ఇష్టపడతారు, ఎందుకు? (AS2)
జవాబు:
గ్రామ పెద్దలు | కోర్టులు |
1) గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మనదేశంలో అనాదిగా జరుగుతోంది. | 1) కోర్టులు ముఖ్యంగా లోక్ అదాలత్ ల ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు. |
2) తగాదాలు, వివాదాల స్వభావం వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి. | 2) ఖర్చులేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు ఇప్పుడు లోక్ అదాలత్ లు ఉపయోగపడుతున్నాయి. |
3) దీనివల్ల ఆ తగాదాలను, వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలిగి, పారదర్శక పద్ధతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది. | 3) కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ లు సహాయపడుతున్నాయి. |
నా అభిప్రాయం :
ప్రస్తుత ప్రజాస్వామ్య దేశాలలో జరిగే కార్యక్రమాలన్నింటికి రికార్డులు, రుజువులు, సాక్ష్యాలు ఉండాలి. తీసుకున్న నిర్ణయాల వివరాలను రికార్డు చేయాలి. కోర్టుల తీర్పులను ఎవరైనా పాటించకపోతే న్యాయస్థానాలు వారి మీద చర్యలు తీసుకొని, వాటిని పాటించేలా చేస్తాయి.
కాని గ్రామాలలో జరిగే తీర్పులను ప్రజలు అమలుచేయకపోతే అటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం గ్రామపెద్దలకు ఉండదు. కావున గ్రామాలలో నిర్వహించే కార్యక్రమాల కంటే కోర్టుల ద్వారా వచ్చే తీర్పులే మంచివని నా అభిప్రాయం.
10th Class Social Studies 22th Lesson పౌరులు, ప్రభుత్వాలు InText Questions and Answers
10th Class Social Textbook Page No.320
ప్రశ్న 1.
కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులు భరించలేని పేద ప్రజలకు మనదేశంలో ఉచిత న్యాయసేవలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి?
జవాబు:
- ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
- న్యాయ సేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
- ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.
- దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.
10th Class Social Textbook Page No.320
ప్రశ్న 2.
ఉచిత న్యాయసేవల ద్వారా ఎటువంటి కేసులు, తగాదాలను చేపట్టవచ్చు?
జవాబు:
- లోక్ అదాలల ద్వారా న్యాయ సేవల ప్రాధికార సంస్థ దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న కేసులను తక్కువ కాలంలో, ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది.
- వైవాహిక విభేదాలు, భరణానికి సంబంధించిన కేసులు, భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు, గృహ హింస కేసులు.
- అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు, చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.
10th Class Social Textbook Page No.320
ప్రశ్న 3.
కోర్టుల బయట తగాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానం ఏదైనా ఉందా?
జవాబు:
ప్రాచీన కాలం నుండి ఒక విధానం అమలులో ఉంది. అదేమనగా :
- గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మన దేశంలో అనాదిగా జరుగుతోంది.
- తగాదాలు, వివాదాల స్వభావం, వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి.
- దీనివల్ల ఆ తగాదాలను / వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలుగుతుంది.
- పారదర్శక పద్దతిలో అందరికీ ఆమోదయోగ్య పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది.
10th Class Social Textbook Page No.316
ప్రశ్న 4.
టీచరుకు హెడ్ మాష్టారు ఇచ్చే మౌఖిక ఆదేశం సమాచారం కాకపోవటానికి కారణం ఏమిటో చర్చించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న ప్రకారం సమాచారం ఈ క్రింది వాటి రూపంలో ఉండాలి.
- రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్.
- ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
- కావున మౌఖిక ఆదేశాలు సమాచారంలోకి రావని తెలుస్తుంది.
- హెడ్ మాష్టారు ఆదేశాలను రాత పూర్వకంగా ఇవ్వలేదు. కావున హెడ్ మాష్టారు టీచరుకు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు సమాచారం క్రిందకు రావని చెప్పవచ్చు.
10th Class Social Textbook Page No.316
ప్రశ్న 5.
సిఫారసు చేసిన విధంగా నియమ, నిబంధనలను పాటించినట్లయితే ప్రభుత్వ శాఖలు మరింత జవాబుదారీతనాన్ని ఎలా కనబరుస్తాయో ఊహించండి.
జవాబు:
- ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. మరియు సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని తయారుచేసి తయారుగా పెట్టుకోవాలి.
- ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ శాఖలు ప్రజలకు బాధ్యత వహిస్తాయి. కావున ప్రభుత్వ సంస్థలన్నీ నిరంతరం మెలకువగా ఉండి, తమ విధులను నిర్వర్తించాలి.
- ప్రతి ప్రభుత్వ శాఖ నియమ నిబంధనలకు లోబడి పని చేసినప్పుడు పనిలో పారదర్శకత ఏర్పడి ప్రజల నియంత్రణలో ఉంటుంది.
- ఎవరైనా వ్యక్తులు, ఏదైనా విషయం మీద, ఏ సంస్థనైనా సమాచారం అడగవచ్చు. కావున ప్రతి సంస్థ తన విధి నిర్వహణలో అవినీతికి పాల్పడకుండా ఈ చట్టం నియంత్రిస్తుంది.
- ఈ సమాచార హక్కు చట్టం అనేది అన్ని ప్రభుత్వ శాఖల మీద పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తుంది.
10th Class Social Textbook Page No.318
ప్రశ్న 6.
ఈ చట్టం ప్రకారం ఏ సమాచార అధికారి అయినా సమాచారం ఇవ్వకపోతే వాళ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు దీనితో ఏకీభవిస్తారా? ఎందుకని?
జవాబు:
ఏకీభవిస్తాను. ఎందుకనగా :
- సమాచార అధికారులు పౌరులు అడిగిన సమాచారాన్ని అందివ్వని పక్షంలో జరిమానా కట్టవలసిందే.
- ఎప్పుడైతే ఆ అధికారి జరిమానా చెల్లిస్తాడో, తాను చేసిన పని పట్ల సిగ్గుపడతాడు. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయకూడదని భావిస్తాడు.
- ఒక అధికారి జరిమాన చెల్లించడం ద్వారా ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని భావించి, మరింత బాధ్యతగా పనిచేస్తాడు. పనిలో పారదర్శకత ఉండేలా చూసుకుంటాడు.
- జరిమానా కట్టుట మూలంగా, ఆ విషయం ఆ కార్యాలయంలో అందరికి తెలిసిపోతుంది. దీని పట్ల అతను సిగ్గుపడడమే కాకుండా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటాడు.
- సమాచారాన్ని అందివ్వకపోతే జరిమానా కట్టవలసి వస్తుంది. కావున ఇంకెప్పుడు అటువంటి పొరపాటు చేయకుండా సమాచారాన్ని అడిగిన వారందరికి అందిస్తాడు.
10th Class Social Textbook Page No.318
ప్రశ్న 7.
ఏ రకమైన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు? దీనికి మద్దతు తెలిపిన వాదన ఏది?
జవాబు:
కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :
- భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
- పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
- గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
- ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
- (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
- మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.
ఈ చట్టానికి మద్దతుగా చేసిన వాదన :
ఈ చట్టం చేసిన తరువాత దీనిలోని పలు అంశాలను అనేక సందర్భాలలో వివిధ శాఖలు ప్రశ్నించాయి. అవసరమనిపిస్తే ఈ చట్టానికి పార్లమెంటు సవరణలు చేయవచ్చు. అయితే రాజ్యాంగం అర్థం చేసుకుని నిర్వచించిన దానికి మద్దతుగా, సమాచారానికి ఉన్న మౌలిక హక్కుకు భంగం కలిగించేలా ఇది ఉండకూడదు.
10th Class Social Textbook Page No.320
ప్రశ్న 8.
లోక్ అదాలత్ ను మీరు సమర్థిస్తారా?
జవాబు:
అవును సమర్థిస్తాను. ఎందుకనగా :
- సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం జరిగింది.
- ఖర్చు లేకుండా లోక్ అదాలత్ న్యాయాన్ని అందిస్తుంది.
- త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది. విధానాలలో వెసులుబాటు ఉంటుంది.
- కోర్టులలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని కేసులకు లోక్ అదాలత్ లో పరిష్కారం దొరుకుతుంది.
- ఎటువంటి కోర్టు రుసుము ఉండదు, ఒకవేళ కోర్టు రుసుము అప్పటికీ చెల్లించి ఉంటే లోక్ అదాలత్ లో కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
- తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయ స్థానాలో సాధ్యంకాదు.
- లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది.
- అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయసలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్దతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.