SCERT AP State 7th Class Telugu Textbook Solutions 11th Lesson సీత ఇష్టాలు Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu Solutions 11th Lesson సీత ఇష్టాలు
7th Class Telugu 11th Lesson సీత ఇష్టాలు Textbook Questions and Answers
ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
చిత్రం చూడండి. ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
చిత్రంలో తంబురా వాయిస్తూ బుర్రకథ చెపుతున్న కథకుడూ, వంత పాడుతున్న మరో ఇద్దరూ ఉన్నారు.
ప్రశ్న 2.
చిత్రంలో ఏం జరుగుతున్నది?
జవాబు:
చిత్రంలో బుర్రకథ చెప్పడం జరుగుతున్నది.
ప్రశ్న 3.
ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడైనా చూశారా? దీనిని ఏమంటారు?
జవాబు:
ఇటువంటి ప్రదర్శనను చూశాను. దీనిని “బుర్రకథ” అంటారు.
ప్రశ్న 4.
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి ఏం మాట్లాడుతుండవచ్చు? ప్రక్కనున్నవారు ఏమంటున్నారు? ఊహించి చెప్పండి.
జవాబు:
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి బుర్రకథలో ప్రధాన కథకుడు. అతడు అల్లూరి సీతారామరాజు వంటి సాహసవీరుని కథ చెపుతూ ఉండవచ్చు. ప్రక్కనున్నవారు వంతలు.. వారు “తందాన తాన” అంటూ వంత పాడుతూ ఉండవచ్చు. ప్రక్కవారిలో ఒకడు హాస్యం చెపుతూ ఉండి ఉండవచ్చు.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
‘సీత’ లాంటి వాళ్ళను గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
సీతలాంటి తెలివైన ఆడవాళ్ళు, సంఘంలో ఎంతోమంది ఉంటారు. వారిలో చాలామందికి చదువు లేనందువల్ల వారు వంటింటి కుందేళ్ళుగా మారిపోయారు. సీతలా చదువుకుంటే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రాణించవచ్చు. ముద్దుగా నేర్పిస్తే, ముగుదలు నేర్చుకోలేని విద్యలు ఉండవు. కిరణ్ బేడీ లాంటి నిజాయితీ పోలీసు ఆఫీసర్లు, . ఇందిర, సిరిమావో వంటి గొప్ప రాజకీయ నాయకులు స్త్రీలలో ఉన్నారు.
ప్రశ్న 2.
ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకు? కారణాలు చెప్పండి.
జవాబు:
ఆడవాళ్ళలో ఎంతోమంది చదువుకున్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినవారు, రాజ్యాలు పాలించిన వారూ ఉన్నారు. రాణి రుద్రమదేవి, ఇందిరాగాంధీ, ఝాన్సీలక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు వంటి గొప్ప నాయికామణులు ఉన్నారు. మమతాబెనర్జీ జయలలిత, మాయావతి, షీలాదీక్షిత్ వంటి ఆడ ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రతిభాపాటిల్ వంటి స్త్రీ రాష్ట్రపతులున్నారు. ముఖ్యంగా స్త్రీలు బిడ్డలను కనిపెంచుతున్నారు. స్త్రీలలో ఎందరో ప్రొఫెసర్లు, అంతరిక్ష యాత్రికులు, శాస్త్రకోవిదులు ఉన్నారు. సోనియాగాంధీ వంటి పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. కాబట్టి స్త్రీలు కూడా గొప్పవారే.
ప్రశ్న 3.
శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు:
మా ఉన్నత పాఠశాలలో ‘గౌరి’ అనే తెలుగు టీచరూ, ‘పార్వతి’ గారు అనే లెక్కలు టీచరూ ఉన్నారు. వారు మాకు చక్కగా పాఠాలు బోధిస్తారు. మా తెలుగు టీచరు మాకు భారత, భాగవత, రామాయణ కథలు చెపుతారు.. మాకు తెలుగు భాషపై మంచి ఇష్టం కల్గించారు.
ఇక మా లెక్కల టీచరు పార్వతిగారు, లెక్కలు చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యేలా చెపుతారు. రోజూ సాయంత్రము అదనంగా క్లాసు తీసుకొని, అక్కడే మాచే ఇంటిపని లెక్కలు అన్నీ చేయిస్తారు. ఆ ఇద్దరు టీచర్లు అంటే, మా పిల్లలందరికీ చాలా ఇష్టం.
II. చదవడం – రాయడం
ప్రశ్న 1.
‘కొత్త వింత – పాత పోత’ అనే అర్థంవచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి?
జవాబు:
పాండవులూ, కౌరవుల కథ, నలమహారాజు కథ, సీతమ్మ కష్టాలు వంటి కథలు పాతకథలయిపోయాయి. – కాబట్టి కొత్త కథ చెప్పమని రాజు, కృష్ణవేణి అక్కను అడిగాడు. అప్పుడు రోజా “పాతంటే రోతగా ఉందా !” అని రాజును ప్రశ్నించింది.
ప్రశ్న 2.
పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు:
- రాజు రోజాను, “కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అట్లా అరుస్తావ్” అన్నపుడు నవ్వు వచ్చింది.
- రాజు “ఆలస్యం అమృతం విషం” అంటే, ఇదేనేమో అన్నాడు. అప్పుడు రోజా “నువ్వు నోరు మూస్తావా? ముయ్యవా?” అంటుంది. అప్పుడు కూడా నవ్వు వచ్చింది.
- రాజు తాను “26 లెటర్సూ ABCD ” లాంటివి చదివానని తన చదువు – గురించి గొప్ప చెప్పినపుడు నవ్వు వచ్చింది.
ప్రశ్న 3.
కింది అపరిచిత వచన భాగం చదివి, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి, రాయండి.
“1940 ప్రాంతంలో తెలంగాణలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీ క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీమండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి, సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. – రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వితంతువుల కోసం వసతిగృహాలు ఏర్పాటు చేశారు. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి మొదలైనవాళ్ళు సంఘసంస్కరణకు కృషిచేశారు. అఘోరనాథ ‘ఛటోపాధ్యాయగారి భార్య వసుంధరా దేవి గారు, నాంపల్లిలో బాలికల కోసం ‘పాఠశాలను ప్రారంభించారు. ఈమె సరోజినీ నాయుడు గారి తల్లి.
అ) పైన పేర్కొన్న సంఘటనలన్నీ ఎప్పుడు జరిగాయి?
ఎ) స్వాతంత్ర్యానికి ముందు
బి) స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
సి) 19వ శతాబ్దంలో
జవాబు:
ఎ) స్వాతంత్ర్యానికి ముందు
ఆ) గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహిళ ఎవరు?
ఎ) లేడీ హైదరీక్లబ్
బి) రత్నదేశాయి
సి) ఇందిరాగాంధీ
జవాబు:
బి) రత్నదేశాయి
ఇ) సంగం లక్ష్మీబాయి ఏంచేశారు?
ఎ) వితంతువులకు హాస్టల్ ఏర్పరిచారు
బి) సంఘసంస్కరణ చేశారు
సి) క్లబ్బును స్థాపించారు
జవాబు:
బి) సంఘసంస్కరణ చేశారు
ఈ) నాంపల్లిలో బాలికా పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) అఘోరనాథ ఛటోపాధ్యాయ
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) శ్రీమతి సరోజినీ నాయుడు
జవాబు:
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ
ఉ) ఇది ఒక సమాజం పేరు.
ఎ) సోదరీ సమాజం
బి) ఆంధ్ర యువతీ మండలి
సి) లేడీ హైదరీక్లబ్
జవాబు:
ఎ) సోదరీ సమాజం
ఊ) సరోజినీ నాయుడు తండ్రి పేరు
ఎ) రత్నదేశాయి
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) గాంధీ
జవాబు:
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ
4. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) బుర్రకథ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఎవరెవరు ప్రదర్శించారు?
జవాబు:
బుర్రకథ ప్రదర్శన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. కృష్ణవేణి కథకురాలు. రాజు, రోజాలు వంతలు.
ఆ) బుర్రకథలో మొదట ఎవరెవరిని ప్రార్థించారు? ఏమని వేడుకున్నారు?
జవాబు:
బుర్రకథలో మొదట కృష్ణవేణి, సరస్వతీదేవిని, మహాలక్ష్మిని, దుర్గను ప్రార్థించింది.
- చదువులనిచ్చే సరస్వతిని చల్లగా చూడమని ప్రార్థించింది.
- సంపదలనిచ్చే లక్ష్మిని కరుణించమని కోరింది. 3) శత్రువులను నశింపజేసే దుర్గను, జయము నిమ్మని కోరింది.
ఇ) బుర్రకథ ప్రారంభంలో సీతను ఏమని పరిచయం చేశారు?
జవాబు:
సీతను గురించి ఈ విధంగా పరిచయం చేశారు. “సీత పేదల ఇంటిలో పుట్టిన పైడిబొమ్మ, చదువు సందెలో – పేరు పొందిన చక్కనమ్మ. ఓటమిని ఎరుగక పోరాడే వీరబాల”
ఈ) సీత బడిలో చేరడానికి కారణం ఏమిటి?
జవాబు:
సీత ఊరి బడికి, ‘శ్రావణి’ అనే టీచర్ వచ్చింది. ఆమె బడిఈడు వచ్చిన పిల్లలు ఎవరు బడికి రావట్లేదో ఆమె తెలుసుకొంది. శ్రావణి సీతమ్మ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభివృద్ధి అవుతుందని చెప్పింది. రుద్రమదేవి, సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి వంటి ఆదర్శ మహిళల గూర్చి శ్రావణి వారికి చెప్పింది. శ్రావణి మాటలు, సీత వింది. తాను చదువుకుంటానని చెప్పి బడిలో చేరింది.
ఉ) బుర్రకథలో ఏ ఏ ఆదర్శ మహిళలను గురించి చెప్పారు? వారు ఏం చేశారు?
జవాబు:
బుర్రకథలో రుద్రమదేవి, సరోజినీనాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, కల్పనా చావ్లా వంటి ఆదర్శ మహిళలను గురించి చెప్పారు. రుద్రమదేవి శత్రువులను చీల్చి చెండాడింది. సరోజినీ నాయుడు స్వరాజ్య సమరం చేసింది. సంగం లక్ష్మీబాయి బాలలను బాగుపరచింది. దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళల. మార్గము దిద్దింది. కల్పన చావ్లా అంతరిక్షంలోకి ఎగిరింది.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి.
జవాబు:
శ్రావణి మంచి టీచరు. ఈమె రామాపురం స్కూలుకు టీచరుగా వచ్చింది. ఆమె ఆ ఊరికి వెళ్ళగానే, బడి ఈడున్న పిల్లలు ఎవరు బడికి రావడం లేదో తెలుసుకుంది. తెలుసుకొని వారి ఇళ్ళకు వెళ్లింది. ఆ ఊళ్ళో సీత అనే అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బడికి పంపడం లేదు. శ్రావణి సీతవాళ్ళ ఇంటికి వెళ్ళి సీత తల్లిదండ్రులకు కొన్ని మంచిమాటలు చెప్పింది. మానవజన్మ గొప్పదనీ, ఆడపిల్లగా పుట్టడం శ్రేష్ఠమనీ, ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభ్యున్నతి పొందుతుందని చెప్పింది. ఆ మాటలు విని, సీత బడికి వెళ్ళి చదువుకొంది.
ఆ) పాఠాన్ని ఆధారంగా చేసుకొని, ఆడపిల్లల పరిస్థితులు గురించి, 5 వాక్యాలు రాయండి.
జవాబు:
పూర్వము తల్లిదండ్రులు ఆడపిల్లలను శ్రద్ధగా బడికి పంపేవారు కాదు. ఆడపిల్లలకు ఉన్నత చదువులు అవసరం లేదని ఆనాడు భావించేవారు. ఆడపిల్లలను బడికి పంపండని టీచర్లు వచ్చి అడిగితే, తల్లిదండ్రులు తను పిల్లల్ని టీచరుకు కనబడకుండా దాచేవారు. కాని ఈ పాఠంలో సీతవలె చదివి మంచి ఉద్యోగాలు చేసి, పిల్లల చదువుల కోసం, స్త్రీలకు మేలు చేయడం కోసం, స్త్రీలు శ్రమించాలి. అందుకు తల్లిదండ్రులు స్త్రీలకు చేయూతనియ్యాలి.
ఇ) “పెద్దలు పనికి – పిల్లలు బడికి” – అనే నినాదాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పెద్దవారు పనిచేసి డబ్బు సంపాదించి, సంసారాన్ని పోషించాలి. పిల్లలు చక్కగా బడికి వెళ్ళి, చదువుకొని మంచి విజ్ఞానాన్ని సంపాదించాలి. చిన్నపిల్లలను పనులకు పంపి, వారు సంపాదించే చిన్నపాటి కూలీ డబ్బులను పెద్దలు ఆశించరాదు. పిల్లలను చదువులు మాన్పించి వారిని పనులకు పంపిస్తే, పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది.
ఈ) “ఆలస్యం అమృతం విషం” – అంటే మీకేమి అర్ధమైంది?
జవాబు:
సహజంగా మనం ఏదైనా మంచిపని చేయాలని అనుకుంటే, దానిని త్వరగా ప్రారంభించాలి. అలా కాకుండా ఆ పని చేయడానికి ఆలస్యం చేస్తే, ఒకప్పుడు అది నష్టం తీసుకువస్తుంది. తీవ్రమైన వ్యాధితో ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరు వద్దకు వెళ్ళాలి. ఆలస్యం చేస్తే అమృతంలా చక్కగా నయం కావలసిన జబ్బు. కాస్తా విషంగా మారి, ప్రాణం మీదికి రావచ్చు. కాబట్టి పీకల మీదకు తెచ్చుకోకుండా తలచుకున్న మంచి పనిని ముందే పూర్తిచేయాలి.
ఉ) మీరు చదువుకొని ఏం కావాలనుకుంటున్నారు? ఎందుకు?
జవాబు:
నేను డాక్టరు కోర్సులో చేరి, MBBS చదవాలని అనుకుంటున్నాను. మాది పల్లెటూరు. ఆ గ్రామంలో వైద్యసహాయం ప్రజలకు అందడం లేదు. కాబట్టి నేను వైద్యవృత్తిని చేబట్టి, మా గ్రామ ప్రజలకు వైద్యం అందించాలని ఉంది. కొద్దిపాటి ఫీజు వసూలు చేసి, గ్రామ ప్రజలకు సాయం చేయాలని ఉంది. ఆదర్శ వైద్యశాల ప్రారంభిద్దామని నా కోరిక.
ఊ) ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
స్త్రీలు, పురుషులు అనే భేదం తప్ప, ఆడ మగపిల్లల్లో మరో తేడా లేదు. ఇద్దరూ తెలివిగలవారే. ఇద్దరూ పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు తోడుగా ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయగలరు. స్త్రీ, పురుషులు అన్ని ఉద్యోగాలకూ అర్హులు. స్త్రీ కన్న పురుషుడు సహజంగా బలవంతుడు.
ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు చదువుకున్నా, వారు ఉద్యోగాలు చేస్తున్నా, వారి పెళ్ళికి, వరునికి కట్నం ఇవ్వవలసి వస్తుంది. పెళ్ళయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలకు అండగా ఉండవలసి వస్తోంది. ఆడపిల్లలు మాత్రం, తమ తల్లిదండ్రులకు వారి భర్తల అనుమతి లేనిదే ఏమీ సాయం చేయలేరు. క్రమంగా ఆడ-మగ భేదం పోతుంది. పోవాలి.
2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) బుర్రకథలోని ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
బుర్రకథలో ఒకరు కథ చెపుతూ ఉంటారు. కథ చెప్పే వారికి చెరోప్రక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. – కథ చెప్పేవారిని కథకుడు’ అనీ, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను ‘వంతలు’ అని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు. వంతలు డక్కీలు వాయిస్తారు.
బుర్రకథలో మొదట .కథకుడు సరస్వతినీ, మహాలక్ష్మినీ, దుర్గనూ ప్రార్థిస్తారు. వంతలలో ఒకడు హాస్య సంభాషణలు చేస్తాడు. బుర్ర కథ పూర్తి అయ్యాక, మంగళం పాడతారు.
జానపద కళల్లో బుర్రకథకు ఎంతో ప్రాచుర్యం లభించింది. ప్రజలను చైతన్యపరచడంలో బుర్రకథ కీలక పాత్ర వహి తెచింది.
ఆ) సీత ఇష్టాలు పాఠం ఆధారంగా మీ ఇష్టాలను వివరించండి.
జవాబు:
నాకు పాఠశాలలో బాగా చదువుకోవాలని ఉంది. చదువుతోపాటు ఆటలపై నాకు ఆసక్తి ఎక్కువ. క్రికెట్, షటిల్ ఆటలపై నాకు ఎంతో ఆసక్తి ఉంది. క్రికెట్ ఆటలో సచిన్ టెండూల్కర్ నాకు ఇష్టమైన ఆటగాడు. ఎప్పటికైనా నేను సచిన్ లాగ, నూరు సెంచరీలు చేసి, మన దేశానికి పేరు తేవాలని ఉంది. . .
నాకు సివిల్ ఇంజనీరు కావాలని ఉంది. ఐ.ఐ.టిలో చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశ . ఉంది. ఎప్పటికయినా, ఏదో పెద్ద ప్రాజెక్టు కట్టే ఇంజనీరు కావాలని ఉంది. ఈ
IV. పదజాలం
1. కింది వాక్యాలు చదవండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.
అ. బుర్రకథలో కథ చెప్పేవాడు : (కథకుడు)
ఆ. మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే వ్యక్తి : (మండల అభివృద్ధి అధికారి)
ఇ. నాయకత్వం వహించేవాడు : (నాయకుడు)
ఈ. ఉపన్యాసం ఇచ్చేవాడు : (వక్త)
ఉ. హరికథ చెప్పేవాడు : (హరిదాసు )
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
1. సినీమా పాటలలో ఘంటసాల వారి గీతాలు ప్రాచుర్యం పొందాయి. : (విస్తారము)
2. భర్తృహరి సుభాషితాలలో మంచి సూక్తులు ఉన్నాయి. : (మంచి మాటలు)
3. నేను వేసిన తారాజువ్వ అంతరిక్షాన్ని తాకింది. : (ఆకాశము)
4. దేశం అభ్యున్నతికి పౌరులంతా శ్రమించాలి. : (అభివృద్ధి)
5. రామయ్యగారు కథలను అలవోకగా రాస్తారు. : (అప్రయత్నము)
6. విద్యార్థులలో ప్రతిభ ఉంటే వారు చక్కగా రాణిస్తారు. : (తెలివి)
3. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1) కలకలలాడు :
పెళ్ళికి వచ్చిన బంధువులతో మా ఇల్లు కలకలలాడుతూ ఉంది.
2) ప్రదర్శించు :
తెలివి ఉంది కదా అని, గర్వమును ప్రదర్శించరాదు.
3) కీలకపాత్ర :
మా సంసారమును నడిపించడంలో మా నాన్నగారే కీలకపాత్ర వహిస్తారు.
4) వంతపాడు :
మా చెల్లి మా అమ్మ మాటలన్నింటికీ వంతపాడుతుంది.
5) దిగ్విజయం :
మా పాఠశాల నూరు శాతం ఫలితాలతో దిగ్విజయంగా నడుస్తోంది.
6) రసాభాస : మా పాఠశాలలో నాటక ప్రదర్శన వర్షం రావడంతో రసాభాస అయ్యింది.
7) చదువు సందెలు :
మా మేనల్లుడికి చదువుసందెలు అబ్బలేదు.
8) నోరుమూయు :
నాన్నగారు కోపపడడంతో.తమ్ముడు నోరుమూశాడు.
9) కుంగదీయు :
కష్టాలు మా తాతగార్ని కుంగదీశాయి.
10) తల్లడిల్లు :
చీకటి పడినా తమ్ముడు ఆటల నుండి రాలేదని మా ఇంటిల్లపాదీ తల్లడిల్లాము.
11) కొవ్వొత్తి :
కష్టాలతో మా అమ్మమ్మ జీవితం, కొవ్వొత్తిలా కరిగిపోయింది.
12) సూకులు :
గురువులు పిల్లలకు సూక్తులు బోధించాలి.
13) పుణ్యఫలం :
భారతదేశం పుణ్యఫలం కొద్దీ గాంధీ, నెహ్రూలు మనదేశంలో పుట్టారు.
14) అభ్యున్నతి :
దేశం అభ్యున్నతి కోసం దేశపౌరులందరూ శ్రమించాలి.
15) అలవోకగా :
మా చెల్లెలు అలవోకగా త్యాగరాజు కీర్తనలు పాడుతుంది.
16) వెక్కిరించు :
అంగవైకల్యం గలవారిని చూచి వెక్కిరించరాదు.
4. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.
1. తొలి × మలి
2. ప్రయత్నము × అప్రయత్నము
3. జయము × అపజయము
4. పాత × కొత్త
5. ఇష్టం × అనిష్టం
6. ఉత్తముడు × అనుత్తముడు
7. కష్టము × సుఖము
8. పిల్లలు × పెద్దలు
9. నిజం × అబద్ధం
10. ముందు × వెనుక
11. మంచి × చెడ్డ
12. పుణ్యము × పాపము
13. అన్యాయము × న్యాయము
14. పెద్ద × చిన్న
15. అవకాశం × నిరవకాశం
16. మేలు × కీడు
17. సమానము × అసమానము
5. ఈ కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
1. కథ (ప్రకృతి) – కత (వికృతి)
2. సిరులు (వికృతి) – శ్రీలు (ప్రకృతి)
3. గాథ (ప్రకృతి) – గాద (వికృతి)
4. సన్నాసి (వికృతి) – సన్యాసి (ప్రకృతి)
5. కాకి (వికృతి) – కాకము (ప్రకృతి)
6. దీపము . (ప్రకృతి) – దివ్వె (వికృతి)
7. భారము (ప్రకృతి) – బరువు (వికృతి)
8. బొమ్మ, (వికృతి) – బ్రహ్మ (ప్రకృతి)
9. విషము (ప్రకృతి) – విసము (వికృతి)
10. దంపతులు (ప్రకృతి) – జంపతులు (వికృతి)
11. విజ్ఞానము (ప్రకృతి) – విన్నాణము (వికృతి)
12. అక్షరము (ప్రకృతి) – అక్కరము . (వికృతి)
V. సృజనాత్మకత
1. ఈ బుర్రకథను మీ పాఠశాలలో ప్రదర్శించండి. ఈ బుర్రకథకు ‘సీత ఇష్టాలు’ గాక మరేదైనా పేరును సూచించండి.
జవాబు:
ఈ కథకు “MDO సీతమ్మ” అని మరో పేరు పెట్టవచ్చును.
(లేదా)
2. ఆడపిల్లలను సమానంగా చూడాలన్న అంశాన్ని గురించి నినాదాలు రాయండి.
జవాబు:
- ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది.
- ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్ధిల్లాలి.
- ఆడపిల్లే మాకు యోగ్యం – ఆమే అత్తింటి సౌభాగ్యం.
- ఆడపిల్ల – ఆ యింటి మహాలక్ష్మి.
- ఆడా మగా తేడా వద్దు – ఎవరైనా మాకు ముద్దు.
VI. ప్రశంస
* మీ తరగతిలోని ఆడపిల్లల్లోని మంచి గుణాలను గుర్తించి, జాబితా రాయండి.
జవాబు:
మా తరగతిలో పదిమంది ఆడపిల్లలున్నారు. అందులో కింది బాలికలలో మంచి గుణాలున్నాయి.
1) సీత :
మంచి తెలివైన పిల్ల. ఈమె ఏక సంథాగ్రాహి.
2) రజని :
ఈమెలో కరుణ ఎక్కువ. ప్రక్కవారికి కష్టం కలిగితే కన్నీరు పెడుతుంది. వారికి సాయం చేస్తుంది.
3) గోపిక :
నిజాయితీ, ధర్మము, న్యాయముపై ఈమెకు మక్కువ.
4) పావని :
ఈమెకు శుభ్రతపై దృష్టి ఎక్కువ. తన బట్టలు, పుస్తకాలు నిర్మలంగా ఉంచుకుంటుంది. ఈమె స్నేహితురాళ్ళ పుస్తకాలు కూడా సర్దుతుంది.
5) రమ్య :
ఈమె పేరుకు తగినట్లుగా అందంగా ఉంటుంది. అభ్యుదయభావాలు కలది. ఈమె కొత్తదనాన్ని కోరుకుంటుంది.
6) గంగ :
ఈమెకు దేవునిపై మంచి విశ్వాసం. దైవభక్తి కలది. కమ్మగా దైవభక్తి గేయాలు పాడుతుంది.
VII. ప్రాజెక్టు పని
1. ఆడవాళ్ళపట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలను సేకరించండి.
జవాబు:
ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తలను సేకరించి, కత్తిరించి ఇక్కడ అతికించండి.
ఉదా :
సమస్యలపై సైకిల్ యాత్ర!
(లేదా)
2. మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, నచ్చిన కళారూపాన్ని గురించి రాయండి.
జవాబు:
మేము తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా వాసులం. మేము కపిళేశ్వరపురం ఉన్నత పాఠశాలలో చదువుతున్నాం. మా గ్రామంలో SBPK సత్యనారాయణరావు గారు అనే జమిందారు గారు ఉండేవారు.
ఆయనకు ‘హరికథ’ అనే కళారూపం అంటే చాలా ఇష్టం. మా గ్రామంలో హరికథను చెప్పడం నేర్పే పాఠశాలను ఆయన స్థాపించారు. ఇక్కడ వందలకొద్దీ హరికథా గాయనీగాయకులు తయారయ్యారు. ఇంకా అవుతున్నారు.
ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు వంటి ప్రసిద్ధ హరికథకులు, ఆంధ్రదేశంలో పుట్టారు. వారు మన తెలుగువారికి రామాయణ భారత భాగవత కథలను పరిచయం చేశారు. ‘హరికథ’ సంగీత, సాహిత్య, నృత్య కళారూపం. హరిదాసులు, మెడలో దండ వేసుకొని, చేతిలో చిడతలు తీసుకొని, హార్మనీ, ఫిడేలు, మద్దెలల సహకారంతో హరికథను చెపుతారు.
VIII. భాషను గురించి తెలుసుకుందాం
అ. కింది వాక్యాలు చదవండి.
1. సీత బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)
2. సీత అన్నం తిని, బడికి వెళ్ళింది. (సంక్లిష్ట వాక్యం)
3. సీత అన్నం తిన్నది, కాని బడికి వెళ్ళలేదు. (సంయుక్త వాక్యం)
ఇలా ఉన్న వాక్య భేదాల గురించి మీరు తెలుసుకున్నారు. అవేమిటంటే సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు. ఐతే ఈ వాక్యాలు ఇలా వేరువేరుగా కనబడటానికి కారణం, ఆ వాక్యాల్లోని క్రియ. క్రియను బట్టే కాక, అర్థాన్ని బట్టి కూడా వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు. అలాంటి వాక్య భేదాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.
1. కింది వాక్యాల్ని చదివి అర్థం చేసుకోండి. అందులోని భేదాలను గుర్తించండి.
అ) ఆహా ఎంత బాగుందో !
ఆ) చేతుల కడుక్కో !
ఇ) చాలాసేపు టీవీ చూడొద్దు.
ఈ) లోపలికి రావచ్చు.
ఉ) గోపాల్ చెట్టు ఎక్కగలడు.
గమనిక :
పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెలాగో చూద్దాం !
ఉదా :
అ) ఆహా ! ఎంత బాగుందో ! :
ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కనుక ఈ వాక్యం. “ఆశ్చర్యార్థక వాక్యం ”.
ఆ) చేతులు కడుక్కో :
ఇది విధిగా ఆ పని చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయవలసిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అంటాం.
ఇ) చాలా సేపు టీవీ చూడొద్దు :
ఈ వాక్యం టీవీ చూడటం వద్దని చెబుతున్నది. టీవీ చూడటాన్ని నిషేధిస్తున్నది. అంటే ‘నిషేధార్థక వాక్యం’. ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం, “నిషేధార్థక వాక్యం”.
ఈ) లోపలికి రావచ్చు :
ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని ఇస్తున్నట్లు సూచిస్తున్నది. అంటే అనుమత్యక వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.
ఉ) గోపాల్-చెట్టు ఎక్కగలడు :
ఈ వాక్యంలో గోపాల్ చెట్టు ఎక్కగలడు. అంటే గోపాల్ కు ఉన్న చెట్టును ఎక్కే – సామర్థ్యాన్ని సూచిస్తున్నది. ఇది “సామర్థ్యార్థక వాక్యం”.
ఒక వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే అర్థంగల వాక్యాన్ని . “సామర్థ్యార్థక వాక్యం” అంటాం. ఈ . అభ్యాసాలు.
అభ్యాసాలు
2. కింది వాక్యాలలోని భావాన్ని అనుసరించి ఏ వాక్యాలు అవుతాయో గుర్తించి రాయండి. ఈ వాక్యాలన్నీ మీ, పాఠ్యాంశంలోనివే.
అ) సీత కలెక్టరైందా? (ప్రశ్నార్థక వాక్యం )
ఆ) మీరు తర్వాత కొట్టుకోవచ్చు. (అనుమత్యర్థక వాక్యం)
ఇ) అక్క చెప్పేది విను. (విధ్యర్థక వాక్యం)
ఈ) రసాభాస చేయకండి. (నిషేధార్థక వాక్యం)
3. ఇలాంటి మరికొన్ని వాక్యాలు మీ పాఠ్యాంశాలలో నుంచి రాయండి.
1. ముందు సీత ఇష్టాలు విను. (విధ్యర్థక వాక్యం)
2. ఏం చదివావో చెప్పు. (విధ్యర్థక వాక్యం)
3. సీత చదువు ఆగిపోయిందా? (ప్రశ్నార్థక వాక్యం)
4. సీత బడికి వెళ్ళిందా లేదా ! (సందేహార్థక వాక్యం)
5. సరస్వతి తల్లీ ! చల్లగ. చూడమ్మా ! (ప్రార్థనాధ్యర్థక వాక్యం)
6. దుర్గా ! జయము నీయవమ్మా ! (ప్రార్థనార్థక వాక్యం)
7. అంతమాట అనకండి (నిషేధార్థక వాక్యం)
8. ఆహా ! ఎంత బాగుంది. (ఆశ్చర్యార్థక వాక్యం)
9. సీత లెక్కలు బాగా చేసింది. (సామాన్య వాక్యం)
10. నీవు ఇంటికి వెళ్ళవచ్చు. (అనుమత్యర్థక వాక్యం).
4. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.
1. జాతీయ దినోత్సవం = జాతీయదిన + ఉత్సవం = (అ + ఉ = ఓ) = గుణసంధి
2. పల్లెటూరు = పల్లె + ఊరు = టుగాగమ సంధి
3. కథకురాలు = కథక + ఆలు = రుగాగమసంధి
4. దిగ్విజయం = దిక్ + విజయం = జత్త్వసంధి
5. ఏందక్కా = ఏంది + అక్కా = (ఇ + అ = అ) = ఇకారసంధి
6. రసాభాస = రస + ఆభాస = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘసంధి
7. చక్కనమ్మ = చక్కని + అమ్మ = ఇకార సంధి
8. పదహారేళ్ళు = పదహారు + ఏళ్ళు = (ఉ + ఏ = ఏ) = ఉత్వసంధి
9. కొవ్వొత్తి = కొవ్వు + ఒత్తి = ఉత్వసంధి
10. అభ్యున్నతి = అభి + ఉన్నతి = (ఇ + ఉ = యు) = యణాదేశ సంధి
11. చిన్నక్క = చిన్న + అక్క = (అ + అ = అ) = అత్వసంధి
12. ఏమున్నది = ఏమి + ఉన్నది = (ఇ + ఉ = ఉ) = ఇత్వసంధి
13. ప్రధానోపాధ్యాయుడు = ప్రధాన + ఉపాధ్యా యుడు = (అ + ఉ = ఓ) = గుణసంధి
14. నాయకురాలు = నాయక + ఆలు = రుగాగమ సంధి
15. సీతక్క = సీత + అక్క న = (అ + అ = అ) = అత్వసంధి.
5. కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.
సమాస పదం | విగ్రహవాక్యం | సమాస నామం |
1) సీత ఇష్టాలు | సీత యొక్క ఇష్టాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
2) ప్రజాచైతన్యం | ప్రజల యొక్క చైతన్యం | షష్ఠీ తత్పురుష సమాసం |
3) దిగ్విజయము | దిక్కుల యొక్క విజయము | షష్ఠీ తత్పురుష సమాసం |
4) చదువు బీజాలు | చదువునకు బీజాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
5) అక్షరమాల | అక్షరముల యొక్క మాల | షష్ఠీ తత్పురుష సమాసం |
6) ఉన్నత పాఠశాల | ఉన్నతమైన పాఠశాల | విశేషణ పూర్వపద కర్మధారయం |
7) మంచి కథలు | మంచివైన కథలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
8) స్వరాజ్య సమరం | స్వరాజ్యం కొఱకు సమరం | చతుర్డీ తత్పురుష సమాసం |
9) రెండు పక్కలు | రెండైన పక్కలు | ద్విగు సమాసం |
10) నాలుగు రాళ్ళు | నాలుగు (4) సంఖ్యగల రాళ్ళు | ద్విగు సమాసం |
11) తల్లిదండ్రులు | తల్లీ, తండ్రీ | ద్వంద్వ సమాసం |
12) లవకుశలు | లవుడూ, కుశుడూ | ద్వంద్వ సమాసం |
13) అన్యాయము | న్యాయము కానిది | నఞ్ తత్పురుష సమాసం |
14) అనవసరము | అవసరం కానిది | నఞ్ తత్పురుష సమాసం |
కొత్త పదాలు-అర్థాలు
అంశం = విషయం
అనవసరం = అవసరం లేనిది
అభినయించు = నటించు
ఆలస్యం అమృతం విషం = ఆలస్యము వల్ల అమృతం కూడా విషంగా మారుతుంది.
అంకితము = గుర్తువేయబడినది
అంతరిక్షము = ఆకాశము
అక్షరమాల = అక్షరాలు
ఆదర్శం = ప్రతియైన (చూపబడిన)
అలవోకగా = అనాయాసముగా
కలకలలాడు = సంతోషంగా ఉండు
కీలకపాత్ర = ప్రధాన పాత్ర
తల్లడిల్లు = కలతపడు
నేపథ్యం = తెరవెనుక జరిగినది (పూర్వ రంగం)
దిగ్విజయం = సంపూర్ణ జయం
తుద = చివర
నిరంతరం = ఎల్లప్పుడు
పరిసరాలు = సమీప ప్రదేశాలు
పక్కా = కచ్చితంగా
ప్రతిభ = తెలివి
ప్రభావితులు = ప్రభావము పడినవారు
బాలభానుడు = ఉదయించే సూర్యుడు
ప్రాంగణం = ముంగిలి
ప్రాచుర్యం = విరివి, విస్తారం
ఫ్యాషన్ = Fashion (వైఖరి, విధము)
పైడిబొమ్మ = బంగారు బొమ్మ
బడాయి = గర్వము
ప్రేరణ = ప్రేరేపించుట
రోత = అసహ్యం
రాజనాలు = మంచి ధాన్యం
వంతపాడు = ఒకరన్న దానినే ఆలోచన లేకుండా తాను కూడా అనడం
శ్రీలు = సిరులు
సూక్తులు (సు + ఉక్తులు) = మంచిమాటలు
సహనము = ఓర్పు
మహిళలు = స్త్రీలు
వెక్కిరించు = పరిహాసం చేయు
లెటర్సు = Letters (అక్షరాలు)