SCERT AP 8th Class Biology Study Material Pdf 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 11th Lesson Questions and Answers మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?
8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
మీరు గత సంవత్సరం ఎన్నిసార్లు అస్వస్థతకు లోనైనారు ? మీరు ఏ ఏ వ్యాధులతో బాధపడ్డారు ?
(ఎ) పై వ్యాధులను నివారించడానికి మీరు రోజువారీగా ఏదైనా అలవాటును మార్చుకోగలరా ఆలోచించి రాయండి.
(బి) పై వ్యాధులు రాకుండా నివారించడానికి మీ పరిసరాలలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనుకుంటున్నారు ?
జవాబు:
నేను గత సంవత్సరం చాలాసార్లు అస్వస్థతకు లోనై విరేచనాలు, టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను.
(ఎ) ఆ వ్యాధులను నివారించడానికి నేను రోజూ ఒక గుడ్డు, ఆకుకూరలు తినుటకు అలవాటుపడ్డాను. అంతేకాక కాచి చల్లార్చిన నీటిని తాగుతున్నాను.
(బి) ఆ వ్యాధులు రాకుండా నివారించడానికి మా పరిసరాలలో ఈ కింది మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాను.
అవి :
- పరిసరాలు శుభ్రంగా ఉంచుట.
- ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచుట.
- వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టలో వేయుట.
- రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయుట.
ప్రశ్న 2.
డాక్టర్/నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా వారు అస్వస్థతకు ” గురికారు ఎందుకు ? ఆలోచించి రాయండి.
జవాబు:
డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా అస్వస్థతకు గురికారు. ఎందుకంటే వారు ఆరోగ్య నియమాలు చక్కగా పాటిస్తారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో తెలుసు కాబట్టి వారు కచ్చితంగా పరిశుభ్రత నియమాలు పాటిస్తారు. అంతేకాక అంటువ్యాధులకు చికిత్స చేసేటప్పుడు సరైన ఆరోగ్య రక్షణ సూత్రాలు పాటిస్తారు. పోషక ఆహారం ఎక్కువగా తీసుకుంటారు.
ప్రశ్న 3.
సాంక్రమిక (అంటువ్యాధులు), అసాంక్రమిక వ్యాధులకు మధ్య గల భేదాలను రాయండి.
జవాబు:
సాంక్రమిక వ్యాధులు | అసాంక్రమిక వ్యాధులు |
1. సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. | 1. శరీర అంతర్భాగాలలో మార్పు వలన వచ్చే వ్యాధులను అసాంక్రమిక వ్యాధులు అంటారు. |
2. ఈ వ్యాధులు గుర్తించటం తేలిక. | 2. ఈ వ్యాధులు గుర్తించటం అంత తేలిక కాదు |
3. శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి పై ఈ వ్యాధులు ఆధారపడును. | 3. తీసుకొనే ఆహారం, ఒత్తిడి మొదలైన అంశాలు ప్రభావంపై ఆధారపడును. |
4. మలేరియా, టైఫాయిడ్, గవదబిళ్ళలు మొదలైన వ్యాధులు. | 4. అధిక రక్తపీడనం, స్థూలకాయత్వం, గుండెపోటు మొదలైన వ్యాధులు. |
ప్రశ్న 4.
స్వల్పకాలిక వ్యాధులు ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి ?
జవాబు:
స్వల్పకాలిక వ్యాధులకు తరచు గురి అవుతూ ఉన్నప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను సరిగా గుర్తించలేనప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేసినపుడు, స్వల్పకాలికంగా ఉన్నప్పుడు సరిగా చికిత్స చేయకపోయినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి. ఉదా : ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు.
ప్రశ్న 5.
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో కలసి ఉంటున్నాడు. అతనికి మశూచి మరలా వస్తుందా ! రాదా ! ఎందుకు ?
జవాబు:
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో ‘కలిసి ఉన్నా అతనికి మశూచి మరలా రాదు. ఎందుకు అంటే మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వ్యాధి జనక జీవితో మొదటగా ప్రవేశించినప్పుడు ప్రత్యేకంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.
అది మొదటిగా వ్యాధి జనక క్రిములను గుర్తిస్తుంది. వాటిపై ప్రతిస్పందించి, జీవితాంతం వాటిని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటుంది. రెండవసారి అదే వ్యాధి జనక జీవి లేదా దానికి సంబంధించిన మరొక వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి చాలా బలంగా పోరాడి మొదటిసారి కంటే తొందరగా వ్యాధి జనక జీవులను శరీరం నుంచి తొలగిస్తుంది.
ప్రశ్న 6.
వ్యాధికి సంబంధించి సత్వర కారకాలు, దోహదపడే కారకాలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
ఏదైనా వ్యాధిని ఒక సూక్ష్మజీవి కలుగచేయును. అది ఆ వ్యాధి కలుగజేయుటకు కారణం కాబట్టి దానిని సత్వర కారకం అంటారు. ఆ సూక్ష్మజీవి ఆ వ్యక్తి శరీరంలో వ్యాధి పెంచుటకు కొన్ని కారకాలు అనగా అతనికి ఉన్న ఇతర శారీరక సమస్యలు కారణం అవుతాయి. వీటిని వ్యాధి దోహద కారకాలు అంటారు.
ఉదా : ఒక వ్యక్తికి శరీరంలో వ్యాధి జనక జీవుల వలన అతనికి పుండ్లు వచ్చినాయి. కానీ అతనికి చక్కెర వ్యాధి ఉంది. అప్పుడు పుండ్లు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. పుండ్లు రావడానికి కారణమైన వ్యాధి జనకజీవులు సత్వర కారకాలు అయితే, చక్కెర వ్యాధి పుండ్లు పెరుగుటకు దోహద కారకాలు.
ప్రశ్న 7.
ఆరోగ్య కార్యకర్తను అడిగి వ్యాధి వ్యాప్తి గురించి తెలుసుకొనుటకు ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
1. వ్యాధి వ్యాప్తి ఎన్ని రకాలుగా జరుగును ?
2. గజ్జి అనేది ప్రత్యక్ష తాకిడి వలన వ్యాపించును. అవును / కాదు
3. కలరా వ్యాధిని ఈగలు వ్యాప్తి చేస్తాయి. అవును / కాదు
4. గాలి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
5. నీటి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
6. వ్యా ధి వ్యాప్తి తెలుసుకొంటే నివారణ తేలిక. అవును / కాదు.
ప్రశ్న 8.
లీష్మేనియా, ట్రిపానోజోమా బొమ్మలు గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 9.
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నీవిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నేను ఇచ్చే సలహాలు :
1. ఇతరులకు రామును ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంగా ఉంచుతాను. కారణం ఆరు అడుగుల లోపు ముఖాముఖిగా ఉంటే ఈ వ్యాధి వ్యాపించును.
2. శరీరం నుంచి విడుదల అయ్యే ద్రవాలు ఇతరులపై పడకుండా జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాను.
3. అతను ఉపయోగించిన వస్తువులను, బట్టలను, మంచాన్ని ఇతరులతో కలవకుండా జాగ్రత్తగా ఉంచాలి.
4. మొదటి వారం రోజులు ఎక్కువగా వ్యాపించును కాబట్టి. అతనిని చాలా దూరంగా ఉంచాలి.
గమనిక : భారతదేశంలో ఉన్న రాము మశూచి వ్యాధితో బాధపడడు. కాబట్టి అతనికి నేను ఇచ్చే సలహాలు ఏమి ఉండవు. కారణం ప్రపంచం నుంచి ఈ వ్యాధి ఎప్పుడో సంపూర్ణంగా నిర్మూలించారు.
ప్రశ్న 10.
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్రను ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్ర చాలా ఉంది. టీకాల వలన భారతదేశం నుండి మశూచి వ్యాధి పూర్తిగా నిర్మూలించాము. అదే విధంగా పిల్లలలో మరో భయంకరమైన వ్యాధి అయిన పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించుటకు చర్యలు జరుగుతున్నాయి.
టీకాల వలన మాతా-శిశు రక్షణ జరుగుతున్నది. ఇటువంటి టీకాలను కనిపెట్టిన శాస్త్రవేత్త, జీవశాస్త్రం సాధించిన అభివృద్ధిని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. దీని గురించి ‘టీకాల డే’ అని ఒక రోజు నేను సెలబ్రేట్ చేసి జీవశాస్త్రమునకు కృతజ్ఞత తెలుపుకొంటాను.
ప్రశ్న 11.
మీ ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించండి. ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకుని మీ గ్రామపంచాయతీ / మున్సిపాలిటి వారికి వ్యాధులను నివారించటానికి మీరు ఏ సూచనలు చేస్తారు?
జవాబు:
మా ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాను. సర్వేలో ఎక్కువ వచ్చే వ్యాధులు డయేరియా, మలేరియా, డెంగ్యూ.
ఈ వ్యాధులు నివారించటానికి మా మున్సిపాలిటీకి ఇచ్చే సూచనలు :
- రక్షిత మంచినీటి సరఫరా చేయాలి.
- ఆరోగ్య కార్యకర్తల ద్వారా వ్యాధులు వచ్చే కాలం గురించి ముందుగా వివరించాలి.
- ఆ వ్యాధులు రావడానికి గల కారణాలు వివరించాలి.
- కాచి చల్లార్చిన నీటిని త్రాగమని మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి.
- కలుషిత ఆహార పదార్థాలు తినవద్దని ప్రజలకు చెప్పాలి.
- చెత్తాచెదారాలను రోడ్డుపై వేయకుండా జాగ్రత్తగా వారు తీసుకువెళ్ళే బండిలో వేయాలని, దాని వలన కలుగు లాభాలు ముందుగా ప్రజలకు తెలియచేయాలి.
- దోమలు పెరగకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాలి.
- దోమకాటు నుండి కాపాడుకొనుటకు దోమతెరలను ఉపయోగించమని తెలియచేయాలి.
- వ్యాధి వచ్చిన వెంటనే చికిత్స చేయుటకు వీలుగా ఆసుపత్రిలో సిబ్బంది మరియు మందులు ఏర్పాటుచేయాలి.
- పరిసరాలు శుభ్రంగా ఉంచాలి.
గమనిక : గ్రామపంచాయతి అయితే ఆ పేరు రాయాలి.
8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? InText Questions and Answers
కృత్యములు
1. పరిశుభ్రమైన త్రాగే మంచినీటి సరఫరా కొరకు మీ ప్రాంతంలో (గ్రామ పంచాయతీ పరిధిలో కాని / పురపాలక సంఘాలు, కార్పొరేషన్ కాని) కల్పించబడిన సౌకర్యాలను తెలుసుకోండి.
జవాబు:
పరిశుభ్రమైన. తాగే మంచినీటి సరఫరా కొరకు మా ప్రాంతంలో గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి వాటిని శుద్ధి చేసి రక్షిత మంచినీటిని పంపుల ద్వారా అన్ని ఇళ్లకు పంపులైన్ కనెక్షన్ల ద్వారా పంపిస్తారు. ఇంకా పంపు కనెక్షన్లు తీసుకోని వారి కొరకు గ్రామ పంచాయతి వీధి పంపులు ఏర్పాటుచేసింది.
2. మీ ప్రాంతంలోని ప్రజలందరికీ ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా ? ఎందుకు లేవో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలోని ప్రజలందరికి ఈ సౌకర్యాలు అందుబాటులో లేవు. కారణాలు :
1. ప్రజలకు రక్షిత మంచినీటి పై సరైన అవగాహన లేకపోవటం.
2. కొత్తగా ఏర్పడిన ఇళ్లకు ప్రభుత్వం వారు వెంటనే పంపులైన్ కనెక్షన్ ఇవ్వకపోవటం. ప్రజలు ఇంకా నదులు, చెరువులపై మంచినీటి కోసం ఆధారపడి ఉండటం వలన.
3. (a) మీ పరిసరాలలో ఏర్పడే ఘనరూప వ్యర్థ పదార్థాలను మీ గ్రామపంచాయతి / మున్సిపాలిటీవారు ఎలా నిర్వహిస్తారో, తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామ పంచాయతివారు మా పరిసరాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను సేకరించుటకు కొంతమంది ఉద్యోగులను ఏర్పాటుచేసుకున్నారు. వారు ప్రతిరోజూ బండిలో ఘనరూప వ్యర్థ పదార్థాలను ఇంటికి వచ్చి తీసుకువెళ్తారు. రోడ్లపై చెత్త – కుండీలను ఏర్పాటుచేశారు.
(b) వారు తీసుకొనే చర్యలు సరిపోతాయా ?
జవాబు:
వారు తీసుకొనే చర్యలు సరిపోవు.
(c) వాటిని మెరుగుపరచటానికి మీరిచ్చే సూచనలేవి ?
జవాబు:
1. వాటిని మెరుగుపరచటానికి ప్రతిరోజూ ఇళ్లకు రెండుసార్లు వచ్చి చెత్తను తీసుకువెళ్లే ఏర్పాటుచేయాలి.
2. ప్రతిరోజూ చెత్త కుండీలలోని చెత్త తీసివేయాలి.
3. ఘనరూపంలో ఉన్న పొడి, తడి చెత్తను వేరు వేరుగా సేకరించే ఏర్పాటుచేయాలి.
(d) ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మీ కుటుంబ సభ్యులు ఎటువంటి కింది చర్యలు తీసుకుంటారు?
జవాబు:
ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మా కుటుంబ సభ్యులు ఈ కింది చర్యలు తీసుకుంటారు.
- పాలిథీన్ కవర్ల వాడకం తగ్గిస్తారు.
- కూరగాయలు, వాటి తొక్కులు, మినప పొట్టు మొ||నవి దగ్గరలో ఉన్న పశువులకు వేస్తారు.
- ఆహార పదార్థాలు ఎక్కువ వృథా చేయరు.
- పునర్వినియోగించే పదార్థాలను ప్రోత్సహిస్తారు.
4. ఐదుమంది చొప్పున జట్లుగా ఏర్పడండి. మీకు తెలిసిన వ్యాధుల జాబితా రాయండి. ఏ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో జట్లలో చర్చించి రాయండి.
జవాబు:
5. మీ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని కుటుంబాలను సర్వే చేసి ఈ కింది విషయాలను కనుక్కోండి.
(a) గత మూడు నెలల్లో ఎంతమంది స్వల్పకాలిక వ్యాధులకు లోనయ్యారు ?
జవాబు:
6 నుంచి 10 మంది.
(b) అదే కాలంలో ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధికి గురయ్యారు ?
జవాబు:
ఒకరిద్దరు.
(c) మొత్తంగా ఎంతమంది ఈ వ్యాధులకు గురైనారు ?
జవాబు:
7 నుంచి 12 మంది వరకు
(d) aవ ప్రశ్న మరియు 6వ ప్రశ్న యొక్క జవాబులు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
లేవు.
(e) bవ ప్రశ్న మరియు Cవ ప్రశ్న యొక్క జవాబులు ఏ విధంగా వేరుగా ఉన్నాయి ?
జవాబు:
b ప్రశ్నకు జవాబు దీర్ఘకాలిక వ్యాధికి గురి అయిన వారి సంఖ్యను తెలియచేయును. c ప్రశ్నకు జవాబు స్వల్ప మరియు దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారి సంఖ్యను తెలియచేయును.
(f) జవాబులు వేరు వేరుగా ఎందుకున్నాయి ? ఈ విధమైన వ్యాధులు సాధారణ మానవునిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?
జవాబు:
కారణం ఇవ ప్రశ్న స్వల్పకాలిక వ్యాధులు, bవ ప్రశ్న దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినదు. తిరిగి కోలుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.
6.
(a) మీ తరగతిలో ఎంతమంది జలుబు / దగ్గు / జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకోండి.
జవాబు:
20 నుంచి 30 మంది
(b) ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు.?
జవాబు:
3 నుంచి 4 రోజులు
(c) యాంటీబయోటిక్స్ ఎంతమంది తీసుకుంటున్నారు ? (మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి.)
జవాబు:
ఒక 20 మంది.
(d) యాంటీబయోటిక్స్ తీసుకొన్న తరువాత కూడా ఎన్ని రోజులు అస్వస్థులుగా ఉన్నారు ?
జవాబు:
2 నుంచి 3 రోజులు.
(e) యాంటీబయోటిక్స్ తీసుకోని వారు ఎన్ని రోజులు జలుబుతో బాధపడ్డారు ?
జవాబు:
4 నుంచి 7 రోజులు.
(f) రెండు గ్రూక్స్ మధ్య తేడా ఏమిటి ?
జవాబు:
రెండు గ్రూప్ ల మధ్య తేడా లేదు.
(g) తేడా ఉంటే ఎందుకు ? లేకపోతే ఎందుకో చెప్పండి.
జవాబు:
జలుబు అనేది వైరసకు సంబంధించిన వ్యాధి. వైరస్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ వేసుకున్నప్పటికీ అవి వ్యాధి. తీవ్రతను కాని, వ్యాధి వ్యవధిని కాని తగ్గించవు.
7. మీ పరిసరాలలో ఆర్థికంగా బాగా ఉన్న పది కుటుంబాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన పది కుటుంబాలపై సర్వే నిర్వహించండి.
జవాబు:
ప్రతి కుటుంబంలో 5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉండేలా చూడండి. ఈ పిల్లల ఎత్తును కొలవండి. వయస్సుకు తగిన ఎత్తును సూచించే గ్రాఫ్ గీయండి.
(a) రెండు గ్రూపులలో ఏమైనా తేడా ఉందా ? ఉంటే ఎందుకుంది ?
జవాబు:
రెండు గ్రూపులలో తేడా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు లేరు. కారణం వారికి పోషకాహార లోపం, వ్యాధులు ఎక్కువగా రావటం, పరిశుభ్రత లోపం మొదలైనవి.
(b) తేడాలు ఏమీ లేవా ? దీనిని బట్టి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం లేదనుకుంటున్నారా?
జవాబు:
ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం పోషకాహార లోపం వలన ఉంటుంది.
8. పిచ్చి కుక్క లేదా ఇతర వ్యాధిగ్రస్థ జంతువులు కాటేసినప్పుడు ‘ర్యాబిస్’ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జంతువులకు, మానవులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ మందు అందుబాటులో ఉంది. మీ పరిసరాలలో ‘ర్యాబిస్’ వ్యాధిని నివారించడానికి గ్రామ పంచాయతి / మున్సిపాలిటీ వారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చర్యలు సరిపోతాయా ? సరిపోకపోతే మెరుగుపరచే చర్యలకు మీరిచ్చే సూచనలేమిటి ?
జవాబు:
మా పరిసరాలలో ర్యాబిస్ వ్యాధిని నివారించడానికి మున్సిపాలిటీవారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక.
- ఏ కుక్క కరిచినా ర్యాబిస్ వ్యాధి టీకాను వెంటనే తీసుకోమని ప్రచారం చేయుట.
- ర్యాబిస్ వ్యాధి వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంచుట.
- వీధి కుక్కల జనాభాను తగ్గించుట.
- కుక్కలకు ముందుగా ఇంజక్షన్లు చేయుట. పైన చెప్పిన చర్యలు సరిపోవు.
మెరుగుపరుచుటకు సూచనలు :
- కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయుట.
- వీధి కుక్కలు అన్నింటికీ టీకాలు వేయించుట.
- పిచ్చి వచ్చిన కుక్కలను వెంటనే ప్రత్యేకమైన ప్రదేశాలలో ఉంచి మిగతా వాటికి వ్యాధి రాకుండా చూచుట.
- వ్యాధి వచ్చిన కుక్కలను దూరంగా ఉంచి చికిత్స చేయుట.
- వ్యాధితో చనిపోయిన కుక్కలను జాగ్రత్తగా ఎవరూ వెళ్లని ప్రదేశాలలో పాతి పెట్టుట.
పాఠ్యాంశములోని ప్రశ్నలు
1. మీ గ్రామపంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ గోడల మీద రాసిన ఆరోగ్య సూత్రాలు తెలపండి. (పేజీ.నెం. 177)
జవాబు:
- కాచి చల్లార్చిన నీటిని త్రాగండి.
- ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా గిన్నెలపైన మూతలు పెట్టండి.
- దోమకాటు నుండి కాపాడుకోవడానికి దోమతెరలను ఉపయోగించండి.
- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.
- చుట్టు ప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూడండి.
- వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగండి.
- ఆరుబయట మలవిసర్జన చేయకండి. టాయిలెట్లు ఉపయోగించండి.
- వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినండి.
- భోజనం మరియు టాయిలెట్‌కు ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి.
2. ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనకేమి తెలుస్తుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనం ఆరోగ్య నియమాలు, జాగ్రత్తలు పాటించాలని తెలుస్తుంది.
3. ఈ సూచనలు పాటించని వాళ్లకు ఏమవుతుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
అనారోగ్యం కలుగును.
4. మనకు దోమలు ఏ కాలంలో ఎక్కువగా కనబడతాయి ? మనపై అవి ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి ? (పేజీ.నెం. 177)
జవాబు:
మనకు దోమలు ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలంలో కనబడును. అవి మనపై చాలా రకాల వ్యాధులు కలుగచేయును.
ఉదా : మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, ఫైలేరియా.
5. కాచి చల్లార్చిన నీరు త్రాగడం వలన, ఈగలు ఆహార పదార్థాల మీద వాలకుండా చూడటం, దోమకాటు బారిన పడకుండా నివారించగలిగితే మనము ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి ? మనమెందుకు అనారోగ్యం పాలవుతాం? (పేజీ.నెం. 177)
జవాబు:
శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బాగా పనిచేయడమే ఆరోగ్యం అంటారు. మనమెందుకు అనారోగ్యం పాలవుతామంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవటం వలన, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం వలన, ఆరోగ్య నియమాలు పాటించకపోవటం వలన, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన, ఒత్తిడి, మానసిక ఆందోళనల వలన.
6. మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు ఒకే రకంగా సమాధానాలు . ఉంటాయా ? వేరు వేరుగా ఉంటాయా ? ఎందుకు ? (పేజీ.నెం. 179)
జవాబు:
మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. కారణం ఆరోగ్యం, వ్యాధి రహితం వేరు వేరు కాబట్టి.
ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సమాజం గురించి, ప్రజల గురించి కూడా మాట్లాడతాం. వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా బాధపడే వ్యక్తులను గురించి మాత్రమే మాట్లాడతాం.
7. వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులను వివరించండి. (పేజీ.నెం. 179)
జవాబు:
వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులు :
1. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం : దీని వలన ఎటువంటి వ్యాధి జనక జీవులు పరిసరాలలో పెరగవు. అందువలన అందరూ వ్యాధి రహితంగా ఉంటారు.
2. వ్యాధిని సరిగా గుర్తించుట : వ్యాధిని సరిగా గుర్తించుట వలన సరైన చికిత్స చేసి వ్యాధి రహితంగా చేయవచ్చు మరియు టీకాలు వేసి వ్యాధిని నివారించవచ్చు.
8. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయా ? ఇలా వ్యాప్తి చెందని వ్యాధులేమైనా ఉన్నాయా ? అవి ఏమిటి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాలుగా వ్యాధులు వ్యాప్తి చెందవు. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఉన్నాయి. అవి అసాంక్రమిక వ్యాధులు.
ఉదా : బి.పి., డయాబెటిస్, గుండెపోటు.
9. అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు : కలరా, టైఫాయిడ్, ధనుర్వాతం, క్షయ, మలేరియా.
10. సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు.
11. నీకు అస్వస్థతగా అనిపించి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలనుకునే ఏవైనా-3 కారణాలు తెలపండి. నీవు తెలిపిన మూడు కారణాలలో ఏదో ఒక లక్షణం మాత్రమే నీలో కన్పిస్తే నీవు డాక్టరు వద్దకు వెళ్లాలనుకుంటావా ? ఎందుకు ? (పేజీ.నెం. 182)
జవాబు:
నాకు అస్వస్థతగా అనిపించి డాక్టరు దగ్గరకు వెళ్ళాలనుకునే 3 కారణాలు : (1) జలుబు (2) దగ్గు (3) జ్వరం వీటిలో ఏ ఒక్క కారణం కనిపించినా డాక్టరు వద్దకు వెళ్తాను. ఎందుకంటే – మందుల్ని మన ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే స్వల్పకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి.
12. ఈ క్రింది వానిలో ఏ సందర్భం నీ ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది ?
1. కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా
2. నీ తలలో పేలు ఎక్కువగా ఉన్నప్పుడు
3. నీ ముఖంపై మచ్చలు ఏర్పడినపుడు (పేజీ.నెం.184)
జవాబు:
కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది. ఈ వ్యాధిలో కాలేయం దెబ్బతినుట వలన జీర్ణశక్తి మందగించి, రోగి నీరసపడతాడు. కాలేయ, జీర్ణ వ్యవస్థలు పునరుద్ధరించబడటానికి సమయం పడుతుంది. ఒక్కొక్క మార్పు ఇది ప్రాణాంతకంగా కూడ పరిణమించవచ్చు.
13. వ్యాధి ఎలా వ్యాప్తి చెందును ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :
- ప్రత్యక్ష తాకిడి
- గాలి ద్వారా
- నీరు, ఆహారం ద్వారా
- జంతువుల ద్వారా
14. వాహకాలు అనగానేమి ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు ఉన్నప్పటికి వ్యాధికి గురికాని జీవులను వాహకాలు అంటారు. వ్యాధులను ఒకరి నుండి మరొకరి
వ్యాప్తి చేయు జీవులు.
15. వ్యాధులను నివారించే విధానాల గురించి వ్రాయుము. (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధులను నివారించే విధానాలు రెండు.
1. సర్వసాధారణమైనది
2. ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనది.
సాధారణ నివారణ సూత్రాన్ని పాటించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడం సర్వసాధారణమైన అంశం.
దానికి ఈ కింది నియమాలు పాటించాలి.
- గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాలలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాలలో నివసించే ఏర్పాటు చేయటం.
- నీటి ద్వారా వ్యాధులను నివారించుటకు రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు.
- పరిశుభ్రమైన వాతావరణం కల్పించినట్లయితే వ్యాధి వాహకాల నుండి విముక్తి.
- వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకొనుట. ప్రత్యేకమైన నివారణ పద్ధతిలో వ్యాధి జనక జీవులతో పోరాడే వ్యాధి నిరోధక లక్షణాన్ని కలిగి ఉండటమే.
16. మనం అస్వస్టులుగా ఉన్నప్పుడు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఎందుకు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి నిరోధక శక్తి పెరుగుటకు.
17. వివిధ పద్ధతుల ద్వారా వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుంది ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :
- ప్రత్యక్ష తాకిడి
- గాలి ద్వారా
- నీరు, ఆహారం ద్వారా
- జంతువుల ద్వారా
18. సాంక్రమిక వ్యాధులు ప్రబలకుండా మీ పాఠశాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:
- వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటివద్ద ఉండిపో అని చెబుతారు.
- తరగతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చే ఏర్పాటు చేస్తారు.
- ఆరోగ్య నియమాల గురించి వివరిస్తారు.
- టీకాలు వేయించుకోమని చెబుతారు.
- పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచటం.
- బోరింగ్ వద్ద నీరు నిల్వకుండా చూడటం.
- పరిసరాలలో మొక్కలు పెంచటం.
- ఆహార వ్యర్థాలను కంపోస్ట్ పిట్ కు చేర్చటం.
- కాగితాలు, కాయల వ్యర్థాలను కుళ్లబెట్టి మట్టిలో కలపడం ద్వారా పాఠశాలలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడతాం.
19. అసంక్రామ్యత అంటే ఏమిటి ? (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి ఒక వ్యాధికి పలుసార్లు గురి అయినప్పుడు ఆ వ్యాధిని ఎదురుకొనే శక్తి అతనికి వస్తుంది. దీనిని అసంక్రామ్యత అంటారు.
20. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకత కార్యక్రమాలేవి ? మీ ప్రాంతంలో తరుచు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేవి ? (పేజీ.నెం. 189)
జవాబు:
మా థమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకతకు ఈ కింది కార్యక్రమాలు ఉన్నాయి.
- పోషకాహారం యొక్క ఆవశ్యకతను తెలియచేయుట
- చిన్న చిన్న వ్యాధులకు చికిత్స
- రక్షిత మంచినీటి ఆవశ్యకత
- పరిసరాల శుభ్రత గురించి తెలియచేయుట
- వ్యాధి రాకుండా తల్లి పిల్లలకు టీకాలు వేయుట.
- ఏ కాలంలో ఏ వ్యాధులు వస్తాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు తెలియచేయుట.
మా ప్రాంతంలో తరుచూ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు డయేరియా, మలేరియా, డెంగ్యూ మొదలైనవి.
21. ఈ పాఠం మీద వ్యాఖ్యానం రాయడానికి పై ప్రశ్నల గురించి మీ తరగతిలో చర్చించండి. మీ నోటు పుస్తకంలో వ్యాసంగా రాయండి. (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి శారీరకంగాను, మానసికంగా, సామాజికంగా బాగా ఉంటే దానిని ఆరోగ్యం అంటారు. వ్యాధి జనక జీవులు శరీరంలోనికి ప్రవేశించటం వలన శరీర జీవక్రియలు సరిగా జరగవు. దీనిని వ్యాధి అంటాము. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధి రహిత స్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వ్యాధిని కలుగచేయు కారకాలను వ్యాధి కారకాలు అంటారు. అవి సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు.
వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి తీసుకొనే సమయాన్ని బట్టి (1) స్వల్పకాలిక వ్యాధులు (2) దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. , వ్యాధి కలిగే విధానాన్ని బట్టి వ్యాధులు రెండు రకాలు. సాంక్రమిక వ్యాధులు, అసాంక్రమిక వ్యాధులు.
ముఖ్యంగా మానవునిలో వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని క్రిమికీటకాలు వ్యాధి జనకాలుగా, వాహకాలుగా గుర్తించారు. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుటను వ్యాధి వ్యాప్తి అంటారు. వ్యాధి వ్యాప్తి .
- గాలి ద్వారా
- నీరు, ఆహారం ద్వారా
- ప్రత్యక్ష తాకిడి ద్వారా
- జంతువుల ద్వారా జరుగును.
వ్యాధులను నయం చేసే సూత్రాలు అమలు చేయాలి. అవసరమైన యాంటీబయోటిక్స్, ఇతర మందులు వాడాలి. వ్యాధి వచ్చిన తరువాత మందులు వాడటం కంటే నివారించుట మంచిది. వ్యాధి నివారణకు ఈ కింది నియమాలు పాటించాలి.
- ఇంట్లోకి, పాఠశాలలోకి గాలి, వెలుతురు ఉండే విధంగా చేయుట.
- రక్షిత మంచి నీటిని తాగుట.
- పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొనుట
- పోషకాహారం తీసుకొనుట
- వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండటం
- సాంక్రమిక వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటి దగ్గర ఉంచుట
- పిల్లలకు టీకాలు ఇప్పించుట.
- వ్యాధి నిరోధక శక్తి అవసరం గురించి చెప్పుట