SCERT AP Board 8th Class Physical Science Solutions 2nd Lesson ఘర్షణ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 2nd Lesson Questions and Answers ఘర్షణ
8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
“ఘర్షణ మానవాళికి మిత్రుడు మరియు విరోధి” ఈ వాక్యాన్ని నీవు సమర్థిస్తావా? ఉదాహరణలతో వివరింపుము. (AS1)
జవాబు:
“ఘర్షణ మానవాళికి మిత్రుడు మరియు విరోధి” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను.
ఘర్షణ మానవాళికి మిత్రుడు అనుటకు ఉదాహరణలు :
- ఘర్షణ వలన మనం నడవగలుగుతున్నాము మరియు పరుగెత్తగలుగుతున్నాము.
- వాహనాలను నడుపగలుగుతున్నాము.
- వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయగలుగుతున్నాడు.
- కాగితంపై పెన్నుతో మరియు బ్లాక్ బోర్డ్ పై చాక్ పీతో వ్రాయగలుగుతున్నాము.
- గోడకు మరియు చెక్కలకు మేకులను దించగలుగుతున్నాము.
- భవనాలను నిర్మించగలుగుతున్నాము.
- వస్తువులను పట్టుకోగలుగుతున్నాము.
- వివిధ ఆటలు ఆడగలుగుతున్నాము.
- బరువులను ఎత్తగలుగుతున్నాము.
- మట్టిని తవ్వగలుగుతున్నాము.
ఘర్షణ మానవాళికి విరోధి అనుటకు ఉదాహరణలు :
- ఘర్షణ వల్ల యంత్రభాగాలలో పగుళ్లు వస్తాయి.
- యంత్రభాగాలు అరిగిపోతాయి.
- యంత్రభాగాలు వేడెక్కి పాడవుతాయి.
- ఘర్షణ వలన శక్తి నష్టం జరుగుతుంది.
- వాహనాల వడి తగ్గుతుంది.
- యంత్రాల సామర్థ్యం తగ్గుతుంది.
ప్రశ్న 2.
ఆటగాళ్లు వేసుకొనే బూట్లకు అడుగు భాగంలో చిన్న, చిన్న బొడిపెలు ఎందుకుంటాయి? (AS1)
(లేదా)
అడుగున గాడులు ఉన్న బూట్లను క్రీడాకారులు ధరిస్తారు ఎందుకు?
జవాబు:
ఆటగాళ్లు వేసుకొనే బూట్లకు అడుగుభాగంలో చిన్న చిన్న బొడిపెలు ఉంటాయి. ఎందుకంటే
- బూట్ల అడుగుభాగాన గల చిన్న, చిన్న బొడిపెలు ఘర్షణను పెంచుతాయి.
- బొడిపెలు నేలను గట్టిగా పట్టి ఉంచి, సురక్షితంగా నడవడానికి, పరుగెత్తడానికి ఉపయోగపడతాయి.
ప్రశ్న 3.
సబ్బు నీళ్లు పడిన పాలరాతి బండలపై (మార్బుల్) నడవటం సులభమా? కష్టమా? ఎందుకు? (AS1)
జవాబు:
సబ్బు నీళ్ళు పడిన పాలరాతి బండలపై నడవటం కష్టము. ఎందుకంటే
- సబ్బు నీళ్ళు పాలరాతి బండలపై ఘర్షణను తగ్గిస్తాయి. ఈ
- కాబట్టి సబ్బు నీళ్ళు పడిన పాలరాతి బండలపై నడచినపుడు జారిపడిపోతారు.
ప్రశ్న 4.
ఘర్షణ తగ్గించడానికి నీవిచ్చే సూచనలు ఏమిటి? (AS1)
జవాబు:
- స్పర్శలో ఉండే వస్తువు తలాలు నునుపుగా ఉండాలి.
- వస్తువులకు చక్రాలను ఉపయోగించాలి.
ఉదా : సూట్ కేసులు, బ్యాగులు. - యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి కందెనలను వాడాలి.
- యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప రాడ్ల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించాలి.
- ప్రవాహి ఘర్షణను తగ్గించడానికి వాహనాలను తగిన ఆకృతిలో నిర్మించాలి.
ప్రశ్న 5.
స్థైతిక ఘర్షణ వస్తువుల మధ్య ఉండాలంటే కావలసిన షరతులు ఏమిటి? (AS1)
జవాబు:
- తలాలు గరుకుగా ఉండాలి.
- వస్తువు భారాలు (బరువు) ఎక్కువగా ఉండాలి.
- వస్తువుపై అభిలంబ బలం ఎక్కువగా ఉండాలి.
- వస్తువు ఉండే తలం క్షితిజ సమాంతరంగా ఉండాలి.
- వస్తువులు ఉండే తలాలు పొడిగా (తడి లేకుండా) ఉండాలి.
ప్రశ్న 6.
స్థైతిక ఘర్షణ మనకు సహాయపడే సందర్భాలకు కొన్ని ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
- మనం కూర్చోవడానికి, పడుకోవడానికి మరియు నిలబడడానికి ఉపయోగపడుతుంది.
- భవన నిర్మాణంలో ఉపయోగపడుతుంది.
- టేబుల్ పై వివిధ వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఉదా : టి.వి., కంప్యూటర్. - అల్మరాలో వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
- లైబ్రరీలో రాక్స్ నందు పుస్తకాలను ఉంచుటకు ఉపయోగపడుతుంది.
- షాపులలో రాక్స్ నందు వివిధ రకాల వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
- వాహనాలను నిలిపి ఉంచడానికి ఉపయోగపడుతున్నది.
- టేబుళ్ళను, కుర్చీలను, సోఫాలను మరియు ఇతర సామగ్రిని నేలపై ఉంచుటకు ఉపయోగపడుతుంది.
- నిశ్చలస్థితిలో ఉండే ప్రతి వస్తువూ సైతిక ఘర్షణను ఉపయోగించుకుంటుంది.
ప్రశ్న 7.
జారుడు ఘర్షణ ఉండే సందర్భాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
- కేరమ్ బోర్డుపై పౌడరు చల్లి ఆట ఆడుతున్నప్పుడు, కేరమ్ కాయిన్ సులభంగా కదులుట.
- తలుపు యొక్క మడత బందులు కదులుట.
- టేబుల్ యొక్క సొరుగులు కదులుట.
- పిండి మిల్లులో లేదా వడ్ల మిల్లులో ధాన్యం జారుట.
- పార్కులలో జారుడు బల్లపై పిల్లలు జారుట.
- బాల్ పాయింట్ పెన్నుతో కాగితంపై వ్రాయుట.
- సైకిల్ పెడల్ తొక్కినపుడు చక్రాలు వేగంగా తిరుగుట.
- బురదగా ఉన్న నేలపై నడుచుచున్నపుడు జారుట.
- అరటిపండు తొక్కపై కాలు వేసినపుడు జారుట.
- సబ్బు నీళ్ళు పడిన మార్బుల్ గచ్చు జారుట.
ప్రశ్న 8.
ఘర్షణ బలాన్ని ఎలా కొలుస్తారు? వివరించండి. (AS1)
జవాబు:
- ఒక సన్నని తాడుకు చెక్క దిమ్మెను కట్టి గచ్చు నేలపై ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
- ఇక్కడ స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని కొలుచుటకు ఉపయోగపడుతుంది.
- స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినపుడు దానిలోని స్ప్రింగు సాగుతుంది. స్ప్రింగు త్రాసుపై అధిక బలాన్ని ప్రయోగించిన స్ప్రింగులో ఎక్కువ సాగుదలను గమనించవచ్చు. అనగా స్ప్రింగులో సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
- స్ప్రింగ్ త్రాసును లాగి చెక్క దిమ్మెను కదిలించడానికి ఆ ప్రయత్నించండి.
- చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్పింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయండి.
- ఈ స్థితిలో చెక్క దిమ్మెపై క్షితిజ సమాంతర దిశలో రెండు బలాలు పనిచేస్తాయి.
- ఒకటి ఘర్షణ బలం (f), రెండవది ప్రయోగించిన బలం (F).
- ఈ రెండు బలాలు చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నపుడు సమాన పరిమాణంలో ఉంటూ వ్యతిరేక దిశలో ఉంటాయి.
- కాబట్టి నమోదు చేసిన స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ఘర్షణ బలానికి సమానం అవుతుంది.
- ఈ విధంగా స్ప్రింగ్ త్రాసు రీడింగ్ తో ఘర్షణ బలంను తెలుసుకొనవచ్చును.
- ఘర్షణ బలాన్ని “ట్రైబో మీటరు” (Tribometer) అను పరికరం ద్వారా కూడా తెలుసుకోవచ్చును.
ప్రశ్న 9.
కందెనలు ఏ విధంగా ఘర్షణను తగ్గిస్తాయి? వివరించండి. (AS1)
జవాబు:
- స్పర్శలో ఉండే కదిలే భాగాల మధ్య కందెనలను పూస్తారు.
- రెండు తలాల మధ్య కందెనలు పలుచని పొరలాగా మారి భాగాల మధ్య రాపిడిని తగ్గిస్తాయి.
- కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటి చిన్న చిన్న ఎత్తుపల్లాల మధ్య బంధాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
- కావున వాటి కదలిక సులభమై ఘర్షణ తగ్గుతుంది.
ప్రశ్న 10.
ఘర్షణ బలాలు ఎన్ని రకాలో తెల్పండి. (AS1)
జవాబు:
ఘర్షణ బలాలు 3 రకాలు. అవి :
- సైతిక ఘర్షణ బలం
- జారుడు ఘర్షణ బలం
- దొర్లుడు ఘర్షణ బలం
ప్రశ్న 11.
జారుడు ఘర్షణ, సైతిక ఘర్షణ కంటే ఎందుకు తక్కువ ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
- చెక్క దిమ్మె యొక్క కొక్కానికి ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసు కొక్కాన్ని తగిలించి టేబులుపై అమర్చండి.
- స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినపుడు అది, దానిపై ప్రయోగించిన బలాన్ని న్యూటన్లలో తెలుపుతుంది.
- స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగించడం ద్వారా నిశ్చల స్థితిలో గల చెక్క దిమ్మెను కదల్చడానికి ప్రయత్నించండి.
- చెక్క దిమ్మె కదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులోని రీడింగ్ ను నమోదుచేయండి.
- ఈ రీడింగ్ చెక్క దిమ్మె యొక్క సైతిక ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
- ఈసారి స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగిస్తూ చెక్క దిమ్మెను సమవడితో కదిలేటట్లు చేయాలి.
- చెక్క దిమ్మె సమవడిలో ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయాలి.
- ఇపుడు రీడింగ్ చెక్క దిమ్మె యొక్క జారుడు ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
- పైన వచ్చిన సైతిక ఘర్షణ బలం, “జారుడు ఘర్షణ బలాల విలువలను పరిశీలించిన జారుడు ఘర్షణ బలం తక్కువగా ఉన్నదని తెలుస్తుంది.
- పై ప్రయోగం ద్వారా జారుడు ఘర్షణ, స్టైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది అని నిరూపించబడినది.
ప్రశ్న 12.
శక్తి నష్టానికి ఘర్షణ ఎలా కారణమో ఉదాహరణలతో వివరించండి. ఘర్షణ ద్వారా జరిగే శక్తి నష్టాలను తగ్గించడానికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? (AS1)
జవాబు:
1) శక్తి నష్టానికి ఘర్షణ కారణం :
స్పర్శలో ఉన్న రెండు వస్తువుల యొక్క తలాల మధ్య ఉండే ఘర్షణను అధిగమించడానికి ఎక్కువ శక్తి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి శక్తి నష్టానికి ఘర్షణ కారణం.
2) ఉదాహరణలు :
- యంత్రాలలో భ్రమణంలో ఉండే స్పర్శ చక్రాల మధ్య ఘర్షణ వల్ల అవి వేడెక్కడం, అరిగిపోవడం మరియు పగిలిపోవడం వంటివి జరుగుతాయి.
- వాహన ఇంజన్లో స్పర్శలో ఉండే చక్రాల మధ్య ఘర్షణ వల్ల ఇంజన్ వేడెక్కడం, ఇంజన్లోని భాగాలు అరిగిపోవడం జరుగుతుంది.
- సైకిల్ చక్రాలు, గొలుసులకు కందెనలు పూయనట్లయితే ఎంత తొక్కినా ఘర్షణ బలం వల్ల సైకిల్ నెమ్మదిగానే కదులుతుంది.
3) ఘర్షణ ద్వారా జరిగే శక్తి నష్టాలను తగ్గించడం :
- స్పర్శలో ఉండే వస్తువుల తలాలు నునుపుగా ఉండాలి.
- స్పర్శలో ఉండే వస్తువుల తలాలకు కందెనలను పూయాలి.
- యంత్రాలలో ఘర్షణను తగ్గించుటకు బాల్ బేరింగ్ ను ఉపయోగించాలి.
- ప్రవాహి ఘర్షణను తగ్గించుటకు ప్రత్యేక ఆకృతిలో వాహనాల ఆకారాన్ని తయారుచేయవలెను.
ప్రశ్న 13.
కదులుతున్న బస్సు పైభాగంలో గల సామాన్లను సీత గమనించింది. బస్సు మెల్లగా కదిలేటప్పుడు దానిపై సామాన్ల స్థితిలో కొద్దిగా మార్పు గమనించింది. కానీ బస్సు వడి పెరిగి వేగంగా కదలటం ప్రారంభించగానే బస్సుపై ఉన్న సామాన్లు వెనుకకు పడడం సీత గమనించింది. ఈ సంఘటన వల్ల ఆమె మదిలో బస్సుపై గల సామాన్లపై మరియు బస్సు టైర్లపై పనిచేసే ఘర్షణకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వాటిని మీరు చెప్పగలరా? ఆ ప్రశ్నలను వ్రాయండి. (AS2)
జవాబు:
- బస్సు పైభాగంలో గల సామాన్లు వెనుకకు పడడంలో ఏ బలం పనిచేసింది?
- బస్సు ఉపరితలం ప్రయోగించే ఘర్షణ బలం ఏ దిశలో ఉంటుంది?
- బస్సు ఉపరితలం ప్రయోగించే ఘర్షణ బలం బస్సు ప్రయాణించే దిశలో ఎందుకు ఉంటుంది?
- బస్సుపై సామాన్లు వెనుకకు జరుగుటకు పనిచేసే బలం ఎక్కడి నుండి ఏర్పడినది?
- బస్సు టైర్లపై ఘర్షణ బలం ఏ దిశలో పనిచేస్తుంది?
- బస్సు టైర్లపై కలిగే ఘర్షణ బలం, బస్సుపై గల సామాన్లకు బస్సు ఉపరితలం కలిగించే ఘర్షణ బలం ఎందుకు వ్యతిరేక దిశలో ఉన్నాయి?
ప్రశ్న 14.
ఘర్షణ వల్ల కలిగే శక్తి నష్టాలను అధిగమించడానికి వాడే నూతన పద్ధతులను గురించి సమాచారాన్ని వివిధ పుస్తకాలు మరియు ఇంటర్నెట్ నుండి సేకరించండి. ఆ సమాచారాన్ని మీ మాటల్లో రాయండి. (AS4)
జవాబు:
ఘర్షణ వల్ల కలిగే శక్తి నష్టాలను అధిగమించడానికి, ఘర్షణను తగ్గించడానికి వాడే వివిధ పద్ధతులు :
1) కందెనలు (లూబ్రికెంట్స్) ఉపయోగించుట :
- యంత్రభాగాల మధ్య ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు (లూబ్రికెంట్స్) అంటారు.
- నూనెలను, గ్రీజులను కందెనలుగా ఉపయోగిస్తారు.
- సాధారణంగా యంత్రభాగాలలో ఘర్షణను తగ్గించుటకు మరియు శక్తి నష్టాలను అధిగమించడానికి కందెనలను ఉపయోగిస్తారు.
- స్పర్శలో ఉండే కదిలే యంత్రభాగాల మధ్య కందెనలు పూయడం వల్ల ఆ రెండు తలాల మధ్య పలుచని పొరగా మారి యంత్రభాగాల మధ్య రాపిడిని తగ్గిస్తాయి.
- కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటిలో గల చిన్న చిన్న ఎత్తుపల్లాల (గరుకుతలాల) మధ్య బంధాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. కాబట్టి ఘర్షణ తగ్గి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును.
2) తలాలను నునుపుగా (పాలిషింగ్) చేయుట :
- స్పర్శలో ఉండే యంత్రభాగాల తలాలపై గరుకుతనం తొలగిచడం వల్ల ఘర్షణకు తగ్గించి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును
- కాబట్టి స్పర్శలో ఉండే యంత్రభాగాలను నునుపుగా (పాలిషింగ్) చేయడం వలన శక్తి నష్టాలను అధిగమించవచ్చును.
3) బాల్ బేరింగ్లు ఉపయోగించడం :
- బాల్ బేరింగ్లను ఉపయోగించడం వలన చాలా ఎక్కువగా శక్తి నష్టాలను తొలగించవచ్చును.
- యంత్రాలలో భ్రమణంలో గల ఇరుసు, చక్రాల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించి శక్తి నష్టాలను తగ్గిస్తారు.
- యంత్రాలలో మరియు వాహనాలలో శక్తి నష్టాలను తగ్గించుటకు బాల్ బేరింగ్ లను ఉపయోగిస్తారు.
- శక్తి నష్టాలను తగ్గించడంలో ఇది ఉత్తమమైన పద్ధతి.
4) ప్రత్యేక ఆకారం ద్వారా :
వాహనాలలో ప్రవాహుల ఘర్షణను తగ్గించుటకు, శక్తి నష్టాలను తగ్గించుటకు ప్రత్యేక ఆకారాలలో వాహనాలను తయారుచేస్తారు.
5) చక్రాల ద్వారా :
బరువైన, పెద్ద పెద్ద కంటైనర్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి చక్రాలు కలిగిన ట్రాలీలను ఉపయోగిస్తారు. చక్రాలు ఉపయోగించడం వలన ఘర్షణను తగ్గించి, శక్తి నష్టాలను అధిగమించవచ్చును.
ప్రశ్న 15.
వాలుతలంపై జారుతున్న వస్తువుపై పనిచేసే బలాలను తెలిపే స్వేచ్ఛా వస్తుపటం గీయండి. (AS5)
జవాబు:
ప్రశ్న 16.
“యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను సాధ్యమయినంత తగ్గించడం ద్వారా శక్తి నష్టమును తగ్గించవచ్చు మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు”. దీనిని మీరెలా సమర్థిస్తారు? వివరించండి. (AS7)
జవాబు:
- యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణ వల్ల శక్తి ఉష్ణశక్తి రూపంలో వృధా అయిపోతుంది.
- దీనివలన విద్యుచ్ఛక్తి, ఇంధనశక్తి వంటి శక్తి వనరుల లోపం ఏర్పడుతుంది.
- దీనిని అరికట్టాలంటే మనం యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను సాధ్యమయినంత వరకు తగ్గించాలి.
- శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రకృతిలో శక్తి పరిమాణం స్థిరం, దానిని సృష్టించలేము మరియు నశింప చేయజాలము కనుక శక్తి వనరులను వీలైనంత తక్కువగా వినియోగించాలి.
- వృధా అయ్యే శక్తిని అదుపుచేయడం ఒక మార్గం. కనుక వీలైనంతవరకు యంత్రాల్లో గల వివిధ భాగాల మధ్య ఘర్షణను తగ్గించి తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడగలం.
8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 22
ప్రశ్న 1.
ఘర్షణ చలనాన్ని వ్యతిరేకిస్తుందా? తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుందా?
జవాబు:
ఘర్షణ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది.
ప్రశ్న 2.
ఘర్షణ ఉందని చూపుటకు ఏ పరిశీలనలు మరియు ప్రయోగాలు తెలుపుతావు?
ప్రయోగము :
ఉద్దేశం :
వస్తువులు ఘర్షణను కలుగజేస్తాయి అని తెలుపుట.
పరికరాలు :
సన్నని తాడు, చెక్క దిమ్మె, స్ప్రింగ్ త్రాసు.
విధానం :
- ఒక సన్నని తాడుకు చెక్క దిమ్మెను కట్టి ప్రక్క పటంలో చూపిన విధంగా అమర్చండి.
- నిశ్చల స్థితిలోని చెక్క దిమ్మెపై స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ఉపయోగించి స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను పరిశీలించండి.
- చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రయోగించిన బలం, ఘర్షణ బలానికి సమానంగా ఉంటుంది.
- చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను గుర్తించాలి. ఈ రీడింగ్ ఘర్షణ బలానికి సమానం అగును.
- దీనిని బట్టి వస్తువులకు ఘర్షణ బలం ఉంటుందని తెలుస్తుంది.
ప్రశ్న 3.
‘జారుడు ఘర్షణ’ గురించి ఏ పరిస్థితుల్లో మాట్లాడతాం?
జవాబు:
ప్రయోగించిన బలము, స్టెతిక ఘర్షణ కంటే ఎక్కువుగా నున్నపుడు వస్తువు చలించటం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో జారుడు ఘర్షణ’ గురించి మాట్లాడతాం.
8th Class Physical Science Textbook Page No. 25
ప్రశ్న 4.
నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందా?
జవాబు:
- నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుంది.
- నేలపై నిలకడగా ఉన్న బల్లపై సైతిక ఘర్షణ బలం పనిచేస్తుంది.
ప్రశ్న 5.
అభిలంబ బలాన్ని రెండింతలు చేస్తే, ఘర్షణ బలం ఏమవుతుంది? చర్చించండి.
జవాబు:
1) ఘర్షణ బలం, అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ ఘర్షణ బలం (Ff) ∝ అభిలంబ బలం (Fn).
ఘర్షణ బలం (Ff) = µsఅభిలంబ బలం (fn)
µs ను అనుపాత స్థిరాంకం అంటారు. దీనినే ఘర్షణ గుణకం అని కూడా అంటారు.
∴ Ff = µs . Fn ఇక్కడ Ff = ఘర్షణ బలం ; Fn = అభిలంబ బలం
సందర్భం – 1 : అభిలంబ బలం Fn = x అయినప్పుడు ఘర్షణబలం (Ff1 ) = µs × x
∴ Ff1 = µs x
∴ µs x = Ff1 …….. (1)
సందర్భం – II : అభిలంబ బలం Fn = 2x అయినపుడు ఘర్షణ బలం (Ff2 ) = µs × 2x
Ff2 = 2µs × x
Ff2 = 2µs × x ……. (B)
సమీకరణం (B) లో µs x విలువలను ప్రతిక్షేపించగా
∴ Ff2 = 2Ff1
∴ అభిలంబ బలాన్ని రెట్టింపు చేసినపుడు ఘర్షణ బలం రెట్టింపు అగును.
ప్రశ్న 6.
“ఘర్షణ వస్తువుల స్పర్శా వైశాల్యంపై ఆధారపడుతుంది” అని స్నేహితుడు అన్నాడు. ఏ ప్రయోగంతో నీ స్నేహితుడిని నీవు సరిచేస్తావు?
జవాబు:
ప్రయోగము :
ఉద్దేశం : “ఘర్షణ వస్తువుల స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు” అని నిరూపించుట.
పరికరాలు :
చెక్క దిమ్మె, సన్నని త్రాడు, స్ప్రింగ్ త్రాసు.
విధానం :
- ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి దానిని స్ప్రింగ్ త్రాసు యొక్క కొక్కేనికి తగిలించి, గచ్చుపై పటంలో చూపిన విధంగా అమర్చండి.
- చెక్క దిమ్మె యొక్క స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉండునట్లు గచ్చుపై అమర్చి స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని క్రమంగా ప్రయోగించాలి.
- స్ప్రింగ్ త్రాసుపై ప్రయోగించిన బలము న్యూటన్లలో స్ప్రింగ్ త్రాసు తెలియచేస్తుంది.
- స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని ప్రయోగిస్తున్నపుడు చెక్క దిమ్మె కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగ్ ను నమోదు చేయండి.
- ఈ రీడింగ్ చెక్క దిమ్మె స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
- పై ప్రయోగాన్ని ఈసారి చెక్క దిమ్మె స్పర్శా వైశాల్యం తక్కువగా (చెక్క దిమ్మె నిలువుగా) ఉండేటట్లు గచ్చుపై ఉంచి చేసి ఘర్షణ బలాన్ని నమోదుచేయండి.
- రెండవసారి కనుగొన్న ఘర్షణ బలం స్పర్శా వైశాల్యం తక్కువ ఉన్నప్పుడు ఘర్షణ బలం అవుతుంది.
- పై ప్రయోగాలలో వచ్చిన ఘర్షణ బలాల విలువలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఘర్షణ బలం వస్తువు యొక్క స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు అని తెలియుచున్నది.
ప్రశ్న 7.
ఘర్షణ భారంపై ఆధారపడదు కాని ఇది అభిలంబ బలంపై ఆధారపడుతుంది. దీనిని నీవు అంగీకరిస్తావా? వివరించుము.
జవాబు:
- ఘర్షణ బలం, వస్తువు భారంపై మరియు అభిలంబ బలంపై ఆధారపడుతుంది అని నేను అంగీకరిస్తాను.
- ఘర్షణ బలం, అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఘర్పణ బలం, అభిలంబ బలంపై ఆధారపడును.
- వస్తువు భారంపై అభిలంబ బలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వస్తువు భారంపై ఘర్షణ బలం ఆధారపడి ఉంటుంది.
8th Class Physical Science Textbook Page No. 26
ప్రశ్న 8.
మానవుల మరియు జంతువుల జీవితాల్లో ఘర్షణ ఎలాంటి పాత్రను పోషిస్తుంది? వివరించండి.
జవాబు:
- మానవులు మరియు జంతువులు పరుగెత్తడానికి, నడవడానికి ఉపయోగపడుతుంది.
- మానవులు మరియు జంతువులు కూర్చోగలుగుతున్నాయి, పడుకోగలుగుతున్నాయి.
- నీటి జంతువులు నీటిలో ఈదగలుగుతున్నాయి.
- పక్షులు గాలిలో ఎగరగలుగుతున్నాయి.
- జీవులలో జీవక్రియలకు ఉపయోగపడుతున్నది.
ఉదా : శ్వాసక్రియ. - జీవులు ఆహారము నమలగలుగుతున్నాయి.
- జీవులు పనులు చేయగలుగుతున్నాయి.
ఉదా : పక్షులు గూళ్ళు కట్టుకోవడం.
ప్రశ్న 9.
రవాణాలో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది?
జవాబు:
- రవాణాకు ఉపయోగపడే వాహనాలను నడపడానికి, ఆపడానికి ఉపయోగపడుతుంది.
- వస్తువులు రవాణా చేయుటకు, వాహనాలలో వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది.
- నీటిలో వాహనాలు ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.
ఉదా : ఓడలు, పడవలు. - గాలిలో ప్రయాణించే వాహనాలకు ఉపయోగపడుతుంది.
ఉదా : విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లు. - బరువైన పెద్ద పెద్ద వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయుటకు ట్రాలీలు ఉపయోగపడుతున్నాయి.
8th Class Physical Science Textbook Page No. 28
ప్రశ్న 10.
తలాల మధ్య ఘర్షణను పూర్తిగా తొలగించగలమా? వివరించండి.
జవాబు:
- తలాల మధ్య ఘర్షణను పూర్తిగా తొలగించలేము.
- తలాలు నునుపుగా ఉంచడం వలన ఘర్షణను కొంతమేరకు తగ్గించవచ్చును.
- కందెనలు, బాల్ – బేరింగ్లు ఉపయోగించడం వలన చాలామేరకు ఘర్షణను తగ్గించవచ్చును.
ప్రశ్న 11.
యంత్రభాగాల్లో బాల్ – బేరింగ్ ను ఏ ఉద్దేశంతో వాడుతారు? నిజ జీవిత పరిస్థితులకు అన్వయించి వివరించండి.
జవాబు:
యంత్రభాగాల్లో బాల్ – బేరింగ్లను ఘర్షణను తగ్గించడానికి మరియు యంత్ర సామర్థ్యాన్ని పెంచుటకు ఉపయోగిస్తారు.
నిజ జీవిత పరిస్థితుల్లో బాల్ – బేరింగ్ల ఉపయోగం :
- వాహనాలలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు. ఉదా : సైకిల్, మోటారు వాహనాలు.
- ఫ్యాన్లలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు.
- మోటర్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.
- డైనమోలలో బాల్ – బేరింగ్ య్ ను ఉపయోగిస్తారు.
- పిండిమిల్లులలో మరియు క్రైండర్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.
- పరిశ్రమలలో, యంత్రాలలో బాల్ – బేరింగ్లను ఉపయోగిస్తారు.
- కుట్టుమిషన్లలో బాల్ – బేరింగ్ లను ఉపయోగిస్తారు.
పరికరాల జాబితా
పుస్తకము, పురిలేని దారము, గుడ్డ, కార్పెట్, అగ్గిపెట్టె, అంతరిక్ష నౌకలకు అమర్చే హీట్ షీల్డ్ చిత్రాలు, స్పూను, గ్రీజు, కొబ్బరి నూనె, షూ, టైరు, క్యారమ్ బోర్డు నమూనాలు, చక్రాలు గల సూట్ కేసు నమూనా, బాల్ బేరింగ్లు, గాజు గ్లాసు, పక్షి నమూనా, విమానం నమూనా, కారు నమూనా, ట్రాలీ, చెక్క దిమ్మ, బరువులు, బరువులు వేలాడదీసే కొక్కెం, కప్పీ, పొడవైన బల్ల, బరువైన పెట్టి, వాలుతలము, స్ప్రింగ్ త్రాసు, ఇటుక.
8th Class Physical Science 2nd Lesson ఘర్షణ Textbook Activities
కృత్యములు
కృత్యం – 1
1. ఒక వస్తువుపై పనిచేసే వివిధ బలాలు మరియు ఘర్షణబల ప్రభావాన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- ఒక పుస్తకాన్ని క్షితిజసమాంతర తలం గచ్చుపై ఉంచి ప్రక్క పటంలో చూపిన విధంగా నెట్టండి.
- పుస్తకం దానిని నెట్టిన దిశలో వడి పొంది, ఆ వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చలస్థితిలోకి వస్తుంది.
- క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది. అంటే చలన దిశకు వ్యతిరేక దిశలో గచ్చు, పుస్తకం పై బలాన్ని ప్రయోగిస్తుంది అని తెలుస్తున్నది.
- గచ్చు; పుస్తకంపై ప్రయోగించే ఈ క్షితిజ సమాంతర బలాన్నే ఘర్షణ బలం అంటారు.
పుస్తకంపై పనిచేసే బలాలు :
- పుస్తకంపై కిందకు పనిచేసే భూమ్యాకర్షణ బలం (గురుత్వబలం)
Fg = W (పుస్తకభారం) - గచ్చుచేత పుస్తకంపై ప్రయోగింపబడే అభిలంబ బలం (in = N)
- క్షితిజ లంబదిశలో పుస్తకం చలనంలో ఎటువంటి మార్పు లేదు కనుక ఈ దిశలో ఫలిత బలం శూన్యం
(Fnet = 0) అనగా Fg = Fn ; W = N = 10 - పుస్తకంపై ప్రయోగించిన బలం (F) క్షితిజ సమాంతరంగా బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది.
- గచ్చు పుస్తకంపై ప్రయోగించిన ఘర్షణ బలం (F) క్షితిజ సమాంతరంగా పుస్తకం కదిలే దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.
ప్రయోగశాల కృత్యం
2. ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణ భావనను ఒక కృత్యం ద్వారా వివరించండి.
ఉద్దేశ్యం :
ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణ (static friction) భావనను అర్థం చేసుకోవటం.
కావలసిన పరికరాలు :
ట్రాలీ (Trolley), చెక్కదిమ్మ, పురిలేని సాగని తీగ, బరువులు, కప్పి (pulley), బరువు వ్రేలాడదీసే కొక్కెం (Weight hanger) మరియు పొడవైన బల్ల.
నిర్వహణ విధానం :
పటంలో చూపిన విధంగా ట్రాలీపై ఒక చెక్కదిమ్మను అమర్చండి.
ట్రాలీకి ఒక దారాన్ని కట్టి దానిని కప్పి ద్వారా పంపండి. దారం రెండవ చివర బరువు వ్రేలాడదీసే కొక్కెం (weight hanger) వ్రేలాడదీయండి.
అతిచిన్న బరువును వెయిట్ హేంగర్ పై ఉంచి, ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాలలో మార్పులను గమనించండి.
a) ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏం మార్పు గమనించారు?
జవాబు:
ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏ మార్పు లేదు.
b) చెక్కదిమ్మ పడిపోతుందా లేదా ట్రాలీతోపాటు కదులుతుందా?
జవాబు:
చెక్కదిమ్మ ట్రాలీతోపాటు కదులుతుంది.
c) ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాల్లో వచ్చే మార్పులేమిటి?
జవాబు:
ట్రాలీ మరియు చెక్కదిమ్మ రెండూ కలిసి ఎడమవైపుకు కదులుతున్నాయి.
d) ఇప్పుడు హేంగర్ పై కొద్ది కొద్దిగా బరువులను పెంచుతూ, ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాలను పరిశీలించండి.
జవాబు:
ఈ విధంగా హేంగర్ పై బరువులను క్రమంగా పెంచుతుంటే ఒక నిర్దిష్ట బరువు వద్ద లేక నిర్దిష్ట త్వరణం వద్ద చెక్కదిమ్మ ట్రాలీ ఉపరితలం పరంగా వెనుకకు చలిస్తుంది.
e) చెక్కదిమ్మకు బదులు అంతే ద్రవ్యరాశి గల రాయి, ఇనుపదిమ్మలతోనూ, వేర్వేరు ద్రవ్యరాశులు గల రాయి, ఇనుప దిమ్మలతోనూ ప్రయోగం చేస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
- చెక్కదిమ్మతో సమాన ద్రవ్యరాశి గల రాయి, ఇనుప దిమ్మలతో ఈ ప్రయోగాన్ని చేస్తే ఫలితంలో ఎటువంటి మార్పు ఉండదు.
కాని వేర్వేరు ద్రవ్యరాశులు గల రాయి, ఇనుప దిమ్మలతో ఈ ప్రయోగం చేస్తే, ఫలితంలో మార్పు కలుగుతుంది. కారణం ద్రవ్యరాశిని బట్టి వస్తువు పై పనిచేసే ఘర్షణ బలం మారుతుంది.
f) రాయి, ఇనుప దిమ్మ మరియు ట్రాలీకి మధ్య సాపేక్ష చలనం కలిగించే గరిష్ఠ బరువు (limiting weight) లో ఏమైనా మార్పు వస్తుందా? లేదా? ఎందుకు?
జవాబు:
మార్పు వస్తుంది. కారణం ద్రవ్యరాశిని బట్టి వస్తువు పై పనిచేసే ఘర్షణ బలం మారుతుంది.
చెక్కదిమ్మ అడుగు’ తలానికి గ్రీజు పూసి, ట్రాలీ ఉపరితలంపై ఉంచి పై ప్రయోగం చేయండి.
g) గరిష్ఠ బరువు (limiting weight)లో ఏమైనా మార్పు వస్తుందా?
జవాబు:
గరిష్ఠ బరువు విలువ తగ్గుతుంది.
h) గరిష్ఠ బరువు విలువను పెంచాలంటే మనం ఏమి చేయాలి?
జవాబు:
గరిష్ఠ బరువు విలువను పెంచాలంటే వస్తువు చలించే ఉపరితలం మీద ఇసుక వేసి దాన్ని గరుకుగా చేయాలి లేదా చెక్కదిమ్మ ద్రవ్యరాశిని పెంచాలి.
i) ఈ ప్రయోగాల ఆధారంగా మీరేం గమనించారు?
జవాబు:
ఈ ప్రయోగాల ఆధారంగా నునుపుతలం కంటె గరుకుతలం చలించే వస్తువు పై ఎక్కువ ఘర్షణ బలాన్ని కలుగజేస్తుంది.
కృత్యం – 2
3. ఘర్షణలో వచ్చే మార్పును గమనించుట.
a) పటంలో చూపినట్లు నేలపై ఉంచిన బరువైన పెట్టెను తక్కువ బలంతో నెట్టండి. అది కదలదు (చలించదు). ఎందుకంటే మనం ప్రయోగించిన బలానికి వ్యతిరేకంగా, అంతే పరిమాణంలో గచ్చు పెట్టెపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది.
b) ఇప్పుడు పెట్టెపై ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూపొండి. అయినా కూడా పెట్టి చలించదు. ఇక్కడ ప్రయోగబలం, ఘర్షణ బలం రెండూ సమానంగా వుంటూ, వ్యతిరేకంగా ఉన్నవి. అనగా ప్రయోగించిన బలంతోపాటు ఘర్షణ బలం కూడా పెరిగింది అన్న మాట. అందుకే పెట్టెలో చలనం లేదు. కనుక సైతిక ఘర్షణ అనేది స్వయం సర్దుబాటు బలం (self adjusting force) అని అనవచ్చు.
c) కాని ఈ సైతిక ఘర్షణకు ఒక గరిష్ఠ హద్దు వుంటుంది. మనం ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూపోతే ఒకానొక సందర్భంలో అనగా ప్రయోగించిన బలం సైతిక ఘర్షణ యొక్క గరిష్ఠ హద్దు కంటే ఎక్కువైనప్పుడు పెట్టి కదులుతుంది. ఇది పటంలో చూపబడింది.
కృత్యం – 3
4. ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావం :
ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావంను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- క్షితిజ సమాంతరంగా ఉన్న గచ్చుపై చెక్కబోర్డు సహాయంతో ఒక వాలు తలాన్ని ప్రక్క పటంలో చూపిన విధంగా ఏర్పరచండి.
- వాలు తలంపై ఏదేని బిందువు “A” వద్ద ఒక గుర్తు పెట్టండి. వాలుతలంపై బంతి చలనం
- A నుండి బంతి లేదా పెన్సిల్ సెల్ ను విడిచి పెట్టండి.
- అవి వాలు తలం అడుగుభాగం నుండి ఎంత దూరం ప్రయాణించి నిశ్చలస్థితికి వచ్చాయో వాటి దూరాలను స్కేలుతో కొలిచి నమోదు చేయండి.
- వాలు తలం అడుగుభాగం నుండి కొద్ది దూరం వరకు ఎలాంటి మడతలు లేకుండా గుడ్డను పరచండి.
- మరల పై ప్రయోగాన్ని చేసి బంతి లేదా పెన్సిల్ సెల్ ప్రయాణించిన దూరాలను కనుగొనండి.
- ఈసారి ఒక గాజు ఉపరితలాన్ని వాలు తల అడుగుభాగాన ఉండేలా అమర్చండి.
- మరల పై ప్రయోగాన్ని బంతి లేదా పెన్సిల్ సెల్ తో చేసి, అవి కదిలిన దూరాలను కనుగొనండి.
- పై ప్రయోగాల వల్ల ఒకే వస్తువు వివిధ తలాలపై వేరు వేరు దూరాలు ప్రయాణించడం గమనించవచ్చును.
- వివిధ వస్తువులు ఒకే తలంపై వివిధ దూరాలు ప్రయాణించడం కూడా గమనించవచ్చును.
- ‘పై పరిశీలన ద్వారా వస్తువులు ప్రయాణించే దూరాలను వస్తువు, నేల తలాల గరుకుదనాలు ప్రభావితం చేస్తాయని తెలుస్తుంది.
- దీని ద్వారా “తలం గరుకుదనం పెరిగే కొద్దీ ఘర్షణ పెరుగుతుంది” అని తెలుస్తుంది.
కృత్యం – 4
5. ఘర్షణ బలంపై స్పర్శావైశాల్య ప్రభావం :
ఘర్షణ బలం వస్తువు స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు అని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
(లేదా)
ఘర్షణ స్పర్శాతల వైశాల్యంపై ఆధారపడదు. దీనిని నిరూపించుటకు నీవు ఏ విధమైన కృత్యాన్ని నిర్వహిస్తావు ? వివరించండి.
జవాబు:
- ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి గచ్చుపై ప్రక్క పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
- ఇక్కడ చెక్క దిమ్మెను ఎక్కువ వైశాల్య భాగము గచ్చుతో స్పర్శలో ఉండునట్లు ఉంచండి.
- స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని చెక్క దిమ్మెను స్ప్రింగ్ త్రాసుతో లాగుట న్యూటనలో తెలియజేస్తుంది.
- చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను గుర్తించి నమోదు చేయండి.
- ఈ రీడింగ్ ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
- చెక్క దిమ్మెను తక్కువ వైశాల్య భాగం గచ్చుతో స్పర్శలో ఉండునట్లు ఉంచండి.
- పైన తెలిపిన విధంగా మరల ప్రయోగాన్ని చేసి, ఘర్షణ దిమ్మెను లాగుట బలాన్ని కనుగొనండి.
- స్పర్శా వైశాల్యం మారటం వల్ల ఘర్షణ బలంలో ఎలాంటి మార్పు కనబడదు.
- స్పర్శా వైశాల్యముతో ఎటువంటి సంబంధం లేకుండా రెండు సందర్భాల్లోనూ ఒకే ఘర్షణ బలం ఉండటం గమనించవచ్చును.
- ఈ కృత్యం ద్వారా “ఘర్షణ బలం వస్తువు స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు” అని తెలుస్తుంది.
కృత్యం – 5
6. ఘర్షణపై అభిలంబ బల ప్రభావం :
ఘర్షణపై అభిలంబ బల ప్రభావమును ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- ఒక సన్నని తాడును చెక్క దిమ్మెకు కట్టి గచ్చుపై పటంలో చూపిన విధంగా స్ప్రింగ్ త్రాసుతో లాగండి.
- ఇక్కడ స్ప్రింగ్ త్రాసు చెక్క దిమ్మెపై ప్రయోగించిన బలాన్ని న్యూటనలో తెలియజేస్తుంది.
- చెక్క దిమ్మె కదలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ ను నమోదు చేయండి.
- ఈ రీడింగ్ ఘర్షణ బలాన్ని తెలియజేస్తుంది.
- ఈసారి చెక్క దిమ్మెపై మరొక చెక్క దిమ్మెను అమర్చి ప్రయోగాన్ని మరల చేయండి.
- రెండవసారి ఘర్షణ బలాన్ని కనుగొనండి.
- మొదటిసారి, రెండవసారి చేసిన ప్రయోగాలలో వచ్చిన ఘర్షణ బలం విలువల్లో రెండవసారి ‘ఘర్షణ బలం విలువ ఎక్కువగా ఉండుటను గమనించవచ్చును.
- రెండవ ప్రయోగంలో చెక్క దిమ్మెపై మరొక చెక్క దిమ్మెను ఉంచడం వల్ల అభిలంబ బలం (చెక్క దిమ్మెల భారం) పెరిగింది.
- కాబట్టి రెండవ ప్రయోగంలో ఘర్పణ బలం కూడా పెరిగినది.
- పై ప్రయోగం వలన ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుందని తెలుస్తుంది.
∴ ఘర్షణ బలం ∝ అభిలంబ బలం= Ff ∝ fN.
కృత్యం – 6
7. ఘర్షణ ఉష్ణాన్ని జనింపచేస్తుంది.
ఘర్షణ వలన ఉష్ణం ఉత్పత్తి అవుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- అరచేతులను ఒకదానిపై మరొకటి ఉంచి కాసేపు రుద్దండి.
- రెండు చేతులు వేడెక్కిన అనుభూతిని పొందుతాము.
- ఘర్షణ వలన రెండు చేతుల ఉష్ణోగ్రత పెరుగుతుంది.
- కాబట్టి ఘర్షణ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అని తెలుస్తుంది.
కృత్యం – 7
8. ఘర్షణను ఎలా తగ్గించాలి?
ఘర్షణను ఎలా తగ్గించవచ్చునో రెండు కృత్యాల ద్వారా వివరించండి.
జవాబు:
ఎ)
- కేరమ్ బోర్డుపై పౌడర్ చల్లకుండా ఆడితిని.
- కేరమ్ కాయిన్స్ సులభంగా కదలలేదు.
- ఎందుకంటే ఘర్షణబలం వల్ల కేరమ్ కాయిన్స్ సులభంగా కదలలేదు.
- ఈసారి కేరమ్ బోర్డుపై పౌడరు చల్లి ఆడితిని.
- కేరమ్ కాయిన్స్ సులభంగా కదిలినవి.
- ఎందుకంటే పౌడర్ వల్ల ఘర్షణ బలం తగ్గడంతో కేరమ్ కాయిన్స్ సులభంగా కదిలినవి.
బి)
- తలుపు యొక్క ఇనుప మడతబందులపై కొన్ని నూనె చుక్కలు వేయకుండా కదిపితిని.
- తలుపు సులభంగా కదలలేదు.
- తలుపు యొక్క ఇనుప మడతబందులపై కొన్ని నూనె చుక్కలు వేసి కదిపితిని.
- తలుపు సులభంగా కదిలినది.
- తలుపు యొక్క మడతబందులపై నూనె చుక్కలు వేయడం వలన ఘర్షణ తగ్గింది.
పై కృత్యాల ద్వారా మనం కదిలే భాగాల మధ్య పౌడర్, కందెనలు పూయడం వల్ల ఘర్షణను తగ్గించవచ్చునని తెలియుచున్నది.
కృత్యం – 8
9. ఘర్షణపై చక్రాల ప్రభావం :
చక్రాల ద్వారా ఘర్షణను తగ్గించవచ్చునని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- ఒక బల్లపై పుస్తకాన్ని ఉంచి నెట్టండి.
- పుస్తకం నెమ్మదిగా కదులుతుంది. కారణం ఘర్షణ బలం.
- ఈసారి బల్లపై రెండు లేదా మూడు పెన్సిళ్ళను లేదా మూతలేని పెన్లను ఉంచి, వాటిపై పుస్తకాన్ని ఉంచి నెట్టండి.
- ఈసారి పుస్తకం సులభంగా కదులుతుంది.
పై కృత్యం ద్వారా ఒక వస్తువు, రెండవ తలంపై జారటం కంటే దొర్లటం సులభం అని తెలుస్తుంది. కాబట్టి చక్రాల ద్వారా ఘర్షణను తగ్గించవచ్చును.
కృత్యం – 9
10. బాల్ బేరింగ్ సూత్రం అవగాహన :
ఎ) రెండు డబ్బా మూతలను తీసుకోండి. ఒక మూతను ఎడమచేతిలో స్థిరంగా వుంచి, రెండవ మూతను మొదటి మూతపై వుంచి త్రిప్పండి. ఏమి గమనిస్తారు?
జవాబు:
అతి కష్టం మీద మూత నిదానంగా తిరిగినది.
బి) ఇప్పుడు నాలుగు లేదా ఐదు గోళీలను మొదటి మూతపై ఉంచి, రెండవ మూతను గోళీలపై ఉంచి త్రిప్పండి. ఏమిగమనిస్తారు?
జవాబు:
ఇప్పుడు పై మూత చాలా సులభంగాను, వేగంగాను తిరిగినది.
కృత్యం – 10
11. ప్రవాహి ఘర్షణను పరిశీలించడం :
ప్రవాహికి ఘర్షణ ఉంటుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- నీటితో ఉన్న గాజు గ్లాసులో చెంచాతో నీటిని తిప్పండి.
- నీరు ఒక అక్షం పరంగా శ్రమిస్తుంది.
- చెంచాతో తిప్పుట ఆపివేయండి.
- తిరుగుతున్న నీటి వడి క్రమంగా తగ్గుతూ కొంత సేపటికి నీరు నిశ్చలస్థితికి వస్తుంది.
- ద్రవంలోని పొరల మధ్య మరియు ద్రవతలానికి, గాజు గ్లాసు తలానికి మధ్య గల ఘర్షణ బలం వల్ల నీరు నిశ్చలస్థితికి వచ్చింది.
కృత్యం – 11
12. ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు :
ఒక టబ్ లో నీటిని తీసుకోండి. అరచేతి వేళ్ల దిశలో, చేతిని నిలువుగా నీటిలో పైకి కిందికి కదపండి. ఇపుడు అరచేతి తలానికి లంబదిశలో చేతిని కదపండి.
ఏ సందర్భంలో ఎక్కువ నిరోధ బలాన్ని అనుభవిస్తాం? ఎందుకు?
జవాబు:
- అరచేతి తలానికి లంబదిశలో చేతిని కదిపినపుడు ఎక్కువ నిరోధ బలాన్ని అనుభవిస్తాం.
- ఈ స్థితిలో అరచేతి తలాల యొక్క ఎక్కువ వైశాల్యం నీటి ఉపరితలంతో స్పర్శలో ఉండటం వలన నిరోధ బలం ఎక్కువైంది.