SCERT AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 6th Lesson Questions and Answers ధ్వని
8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
ఖాళీలలో సరియైన సమాధానాలు రాయండి. (AS1)
ఎ) వస్తువు విరామ స్థానం నుండి ముందుకు, వెనుకకు కదలడాన్ని …………… అంటారు.
జవాబు:
కంపనం
బి) ఒక సెకనులో ఏర్పడే కంపనాల సంఖ్యను …………. అంటారు.
జవాబు:
పౌనఃపున్యము
సి) ధ్వని తీవ్రతను …………….. లో కొలుస్తాం.
జవాబు:
డెసిబెల్
డి) ధ్వని …………. గుండా ప్రయాణించలేదు.
జవాబు:
శూన్యం
ఇ) కంపించే వస్తువులు ……. ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
ధ్వనిని
ఎఫ్) ఒక వస్తువు తన విరామ స్థితి నుండి పొందే గరిష్ఠ స్థానభ్రంశాన్ని …………… అంటారు.
జవాబు:
కంపన పరిమితి
ప్రశ్న 2.
ఒక సాధారణ మానవుడు ధ్వనిని ……… నుండి …… కంపనాలు / సెకను వరకు వినగలుగుతాడు. (AS1)
జవాబు:
20 నుండి 20,000
ప్రశ్న 3.
వివిధ ధ్వనుల కంపన పరిమితి, పౌనఃపున్యానికి గల తేడాను తెలపండి. మీ దైనందిన జీవితం నుండి రెండు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
కంపన పరిమితి | పౌనఃపున్యం |
1) కంపన పరిమితి పెరుగుతూ ఉంటే ధ్వని తీవ్రత క్రమంగా పెరుగును.
ఉదా : సింహం గర్జించినపుడు ధ్వని కంపన పరిమితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. |
1) పౌనఃపున్యం తగ్గుతుంటే ధ్వని యొక్క కీచుదనం (పిచ్) క్రమంగా తగ్గుతుంది.
ఉదా : సింహం గర్జించినపుడు, ధ్వని పౌనఃపున్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి కీచుదనము (పిచ్) తక్కువగా ఉంటుంది. |
2) కంపన పరిమితి తగ్గుతుంటే ధ్వని తీవ్రత క్రమంగా తగ్గుతుంది.
ఉదా : తుమ్మెద ఝంకారం చేసినపుడు ధ్వని యొక్క కంపన పరిమితి తక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని తీవ్రత తక్కువగా ఉంటుంది. |
2) పౌనఃపున్యం పెరుగుతూ ఉంటే ధ్వని యొక్క కీచుదనము(పిచ్) క్రమంగా పెరుగును.
ఉదా : తుమ్మెద ఝంకారం చేసినపుడు ధ్వని యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కీచుదనము (పిచ్) ఎక్కువగా ఉంటుంది. |
ప్రశ్న 4.
మీకు తెలిసిన మూడు సంగీత పరికరాల పేర్లు వ్రాయండి. అవి ఏ విధంగా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయో వివరించండి. (AS1)
జవాబు:
1. తబల :
తబలపై ఉండే చర్మం లేదా పొర మరియు తబల లోపల ఉన్న గాలి కంపించడం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది.
2. సితార్ :
సితార్ లోని తీగను కంపింపజేసినపుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది.
3. వీణ :
ఒక నిలువుపాటి చెక్కపై మెట్లు బిగించి ఉంటాయి. వీణకు ఒక చివర ఎండిన సొరకాయతో చేసిన “బుర్ర” ఉంటుంది. మెట్ల మీదుగా లోహపు తీగలు అమర్చుతారు. ఈ తీగలను చేతితో మీటితే అవి కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మెట్లమీద వేళ్లను కదిలించడం ద్వారా తీగల పొడవులను మార్చుతూ, వివిధ తీవ్రతలు గల ధ్వనులను ఉత్పత్తి చేస్తారు.
ప్రశ్న 5.
కీచురాళ్లు (కీటకాలు) రొద విని మనం చెవులు ఎందుకు మూసుకుంటాము? (AS1)
జవాబు:
కీచురాళ్ళు (కీటకాలు) వినడానికి ఇబ్బందికరంగా ఉండే కఠోర ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. మరియు కీచురాళ్ళు చేసే ధ్వని యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కీచుదనం (పిచ్) ఉన్న ధ్వని విడుదలవుతుంది. కాబట్టి కీచురాళ్లరొద వినలేక మనం చెవులు మూసుకుంటాము.
ప్రశ్న 6.
రాబర్ట్ ఒక సంగీత వాయిద్యం ధ్వనిని ఉత్పత్తి చేయడం గమనించాడు. కానీ ఆ వాయిద్యంలో ఏ భాగమూ కంపనాలు చెందడం అతను గుర్తించలేకపోయాడు. ఈ పరిశీలన వల్ల అతని మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అతనికి తలెత్తిన ప్రశ్నలు ఏమిటో మీరు ఊహించగలరా? వాటిని వ్రాయండి. (AS2)
జవాబు:
రాబర్ట్ మెదడులో తలెత్తిన ప్రశ్నలు :
- కంపనం చెందకుండా వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయా?
- వాయు వాయిద్యంలో ఏ భాగము కంపనం చెందుతుంది?
- వాయు వాయిద్యంలో కంపనం చెందే భాగము కనిపిస్తుందా?
- డప్పు వాయిద్యాలలో గాలి కంపనం చెందుతుందా?
- పిల్లనగ్రోవిలో కంపించే భాగము ఏది?
- గిటార్ వాయించినపుడు గాలి కంపిస్తుందా?
- తబల, డోలలను వాయించినపుడు వాటిలో గల చర్మం లేదా పొరతోపాటు కంపించేది ఏది?
- విజిల్ ను ఊదినపుడు ఏ భాగం కంపించి ధ్వని వస్తుంది?
- వాయు వాయిద్యాన్ని తట్టడం లేదా కొట్టడం గాని చేయం. గాలిని మాత్రమే ఊదుతాం. అయితే ఏ భాగం కంపనం చెంది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది?
ప్రశ్న 7.
“ఒక వస్తువులోని కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి” అని మీరు ఎలా రుజువు చేస్తారు? (AS3)
జవాబు:
సైకిల్ బెల్ ను మోగించండి. బెల్ పైన గల స్త్రీలు గిన్నె కంపనం చెందడం వలన సైకిల్ బెల్ నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. సైకిల్ బెల్ మ్రోగుతున్నపుడు చేతితో స్టీలు గిన్నెను పట్టుకోండి. అది కంపనం చెందుతున్నట్లు చేతి స్పర్శ ద్వారా కూడా తెలుస్తుంది. స్త్రీలు గిన్నెను పట్టుకొన్నప్పుడు ధ్వని ఆగిపోతుంది. కారణం కంపనం చెందడం ఆగిపోవుట వలన ధ్వని ఆగిపోతుంది. దీనిని బట్టి కంపిస్తున్న వస్తువు నుండి ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చును అని తెలుస్తుంది.
ప్రశ్న 8.
చిలుకలు మాట్లాడతాయా? మీ స్నేహితులతో చర్చించి, సమాచారం సేకరించండి. (AS4)
జవాబు:
చిలుకలకు సరియైన రీతిలో తర్ఫీదు ఇస్తే చక్కగా మాట్లాడతాయి. మనం టి.వి.లో చిలుకలు మాట్లాడటం, పాటలు పాడడం లాంటివి చూస్తూనే ఉంటాము. వీటికి సంబంధించిన ఉదాహరణలు :
- తూర్పు గోదావరి జిల్లాలో ద్వారక తిరుమలలో SBI లో పనిచేస్తున్న శ్రీ భాస్కరరావుగారు 1985 నుండి చిలుకను పెంచుతున్నారు. ఈ చిలుక చక్కగా మాట్లాడడం మరియు ఇంట్లో సభ్యులను పేరుతో పిలవడం లాంటివి చేస్తుంది. ఈ వార్త N – Studio లో సెప్టెంబర్ 22వ తేదీ 2011న ప్రసారమైనది.
- అవధూత దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు చాలా చిలకలకు మాట్లాడడంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఈ చిలుకలు చక్కగా మాట్లాడడం మరియు స్వామీజీ చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తున్నాయి.
పై ఉదాహరణలను బట్టి చిలుకలు మాట్లాడతాయని మనకు తెలుస్తుంది.
ప్రశ్న 9.
స్థానిక సంగీతకారుల ఫోటోలను సేకరించండి. వాటిని మీ తరగతిగదిలో ప్రదర్శించండి. (AS4)
జవాబు:
ప్రశ్న 10.
ధ్వని కాలుష్యం జరిగే రకరకాల సంఘటనల చిత్రాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకంను తయారు చేయండి. (AS4)
జవాబు:
ప్రశ్న 11.
“కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. మరియు ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది” ఈ విధంగా మనం ప్రతిధ్వనిని వినగలుగుతున్నాం” అని జాకీర్ అన్నాడు. ఈ వాక్యం నిజమని మీ పరిసరాలలో గమనించి సరైన ఉదాహరణల ద్వారా తెల్పండి. (AS4)
జవాబు:
1. కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి :
i) పాఠశాలలో లోహపు గంటను, లోహపు కడ్డీతో కొట్టినపుడు లోహపు గంట కంపించడం వలన ధ్వని ఉత్పత్తి – అవుతుంది.
ii) సైకిల్ బెల్ ను మ్రోగించినపుడు, ‘సైకిల్ బెల్ పై గల స్త్రీలు గిన్నె కంపనం చెందడం వలన ధ్వని ఉత్పత్తి అగును. పై ఉదాహరణల ద్వారా కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అని తెలుస్తుంది.
2. ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది :
ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకొని రెండు వైపులా కోసి ఒక పైపు వలె తయారుచేయవలెను. ఒక చివర రబ్బరు బెలూనుతో మూస్తూ రబ్బరు బ్యాండ్ ను కట్టాలి. రబ్బరు బెలూనుపై కొన్ని చక్కెర కణాలను లేదా తేలికపాటి చిన్న గింజలను ఉంచాలి. రెండవ వైపు నుండి మీ స్నేహితుణ్ణి బిగ్గరగా మాట్లాడమని, చక్కెర కణాలను పరిశీలించండి. స్నేహితుడు మాట్లాడుతున్నపుడు చక్కెర కణాలు పైకి ఎగురుతూ ఉంటాయి. దీన్నిబట్టి ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పవచ్చును.
ప్రశ్న 12.
మీ పరిసరాలలో లభించే వస్తువులతో సంగీత పరికరాలను తయారుచేసి మీ తరగతిలో ప్రదర్శించండి. (AS5)
జవాబు:
1) ఏతార :
ఒక కొబ్బరి చిప్పపై ఒక దళసరి కాగితంను అంటించి పటంలో చూపిన విధంగా వెదురు కర్ర, తీగతో తయారు చేయండి. తీగను కంపింప చేసినపుడు సంగీత ధ్వని ఏర్పడును.
2) మంజిర (Manjira) :
రెండు రేకుడబ్బా మూతలకు మధ్యలో రంధ్రాలను చేసి తాడుతో కట్టి మంజిర తయారుచేయవచ్చును.
3) డోలక్ :
కావలసిన వస్తువులు : PVC పైపు, పాలిథిన్ కవర్లు, నైలాన్ దారం.
విధానం :
- 6 అంగుళాల వ్యాసం, 12 అంగుళాల పొడవు గల ఒక PVC. పైపును తీసుకోండి.
- PVC పైపుకు రెండు వైపుల పాలిథిన్ కవరును గట్టి నైలాన్ దారంతో కట్టండి. డోలక్ తయారగును.
4) తబల :
కావలసిన వస్తువులు : ఒకవైపు తెరిచి ఉన్న ప్లాస్టిక్ డబ్బా, పాలిథిన్ కవరు, నైలాన్ దారం.
విధానము :
ప్లాస్టిక్ డబ్బా తెరచి ఉన్న వైపు పాలిథిన్ కవరును ఉంచి, నైలాన్ దారంతో గట్టిగా కట్టండి. పాలిథిన్ కవరు బిగుతుగా ఉండేట్లు చూడవలెను.
ప్రశ్న 13.
సూర్యునిలో జరిగే ప్రేలుళ్ల ధ్వనులను మనం ఎందుకు వినలేమో వివరించండి. (AS7)
జవాబు:
ధ్వని ప్రసరించాలంటే యానకం కావలెను. ధ్వని శూన్యంలో ప్రయాణించదు. సూర్యునిలో జరిగే ప్రేలుళ్ల ధ్వనులు మనం వినలేము కారణం సూర్యునికి, భూమికి మధ్యలో శూన్య ప్రదేశం ఉంటుంది. ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు కావున సూర్యునిలోని ధ్వనులను వినలేము.
ప్రశ్న 14.
ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే రెండు నినాదాలు రాయండి. (AS6)
జవాబు:
- “ధ్వని కాలుష్యం తగ్గించు – ప్రశాంత జీవనం సాగించు”.
- “చెట్లను విరివిగా నాటుదాం – ధ్వని కాలుష్యాన్ని తగ్గించుదాం”.
ప్రశ్న 15.
ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు మీరిచ్చే సలహాలు ఏమిటి? (AS7)
జవాబు:
ఈ క్రింది సలహాలు పాటించడం ద్వారా ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చును.
- వాహనాలకు, ఇతర మిషన్లకు సైలెన్సర్లు బిగించడం.
- తక్కువ ధ్వని ఉత్పత్తి చేసే యంత్రాలను తయారు చేయడం.
- టి.వి., టేప్ రికార్డులు, రేడియోలను ఉపయోగించేటప్పుడు ధ్వని స్థాయి తగ్గించడం.
- ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లను విరివిగా పెంచడం.
- పరిశ్రమలను, విమానాశ్రయాలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించడం.
- వాహనదారులు అవసరంలేని సమయంలో హారన్లను మోగించరాదు.
ప్రశ్న 16.
ధ్వని కాలుష్యం జీవ వైవిధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? వివరించండి. (AS7)
జవాబు:
ధ్వని కాలుష్యం జీవవైవిధ్యంపై ప్రభావం చూపే విధం :
- దీపావళి ఔట్లు పేల్చినప్పుడు, డైనమైట్లతో కొండ రాళ్లను పేల్చినపుడు, పక్షులు గోల చేస్తూ చెల్లాచెదురుగా తమ ఆవాసాలను వీడి ఎగిరిపోతాయి.
- జెట్ బాంబర్లూ, కన్ కార్డ్ విమానాలు ఆకాశంలో ఎగిరేటప్పుడు వచ్చే విపరీతమైన ధ్వనికి ఆకాశ హార్శ్యాలు (స్కైస్క్రైపర్లు) ప్రకంపనలు చెంది, గోడలు కూలిపోతే వాటిలో నివసించే జనాలకు ప్రాణ హాని కలుగుతుంది.
- సైలెన్సర్లు లేని మోటారు వాహనాలను జన సమ్మర్థం గల రోడ్లపై నడిపితే ధ్వని కాలుష్యం వలన వృద్ధులలో ఉద్రేకం పెరగడం, రక్తపోటు వృద్ధి కావడం జరుగుతుంది.
- కర్ణకఠోరమైన ధ్వనులు వింటే పసిపిల్లలలో కర్ణభేరి చెడిపోయి వినికిడి శక్తి తగ్గవచ్చు.
పరికరాల జాబితా
చెక్కగంట, రబ్బరు బ్యాండ్, నీటితో ఉన్న పళ్లెం, గ్లాసులు, హాక్ సా బ్లేడు, సగం కోసి గ్లాసులా చేసిన ప్లాస్టిక్ బాటిల్, సెల్ ఫోన్, బెలూన్, రబ్బరు బ్యాండు, ఒకే పరిమాణంగల బీకరులు, చెక్కబల్ల, లోహపు కడ్డీ లేదా చెక్క స్కేలు, దారం, టెలిఫోన్, కీచుమని శబ్దం చేసే బొమ్మ, బకెట్, నీరు, ఇనుప గంట, ఇత్తడి గంట, వివిధ సంగీత పరికరాలను చూపే చార్టు, స్వరపేటిక నిర్మాణం చార్టు, కర్ణభేరి నిర్మాణం చార్టు, ధ్వని కాలుష్యం ప్రభావాలను చూపే చార్టు, చెక్కబల్ల, ఇటుక.
8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 86
ప్రశ్న 1.
ధ్వని ప్రసరణ పై గాలిలో తేమ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వేసవి, శీతాకాలాలలో గాలిలో ధ్వని ప్రసారంలో ఏమైనా తేడా ఉంటుందా? మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:
- గాలిలో తేమ పెరుగుతూ ఉంటే ధ్వని ప్రసరణ పెరుగును.
- గాలిలో తేమ ఎక్కువగా ఉండుట వల్ల వేసవి కాలంలో ధ్వని ప్రసరణ ఎక్కువగా ఉంటుంది.
- శీతాకాలంలో ధ్వని ప్రసరణ తక్కువగా ఉంటుంది.
8th Class Physical Science Textbook Page No. 87
ప్రశ్న 2.
కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి మరియు ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏది నిజం?
జవాబు:
- కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి నిజం. ఎందుకంటే ఏ వస్తువునైనా కంపింపచేసినపుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు పాఠశాల గంట.
- ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా నిజం. ఉదాహరణ ధ్వని మన చెవిని చేరినపుడు ధ్వనికి మన చెవిలోని కర్ణభేరి కంపిస్తుంది.
- మనం టెలిఫోన్లో మాట్లాడుతున్నపుడు టెలిఫోన్ లోని డయాఫ్రమ్ ను ధ్వని కంపింపచేస్తుంది.
ప్రశ్న 3.
మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే మూడు రకాల యానకాలున్నాయి. మీ స్నేహితులతో చర్చించి ఈ వాక్యం సరైనదో కాదో నిర్ణయించండి.
జవాబు:
మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే మూడు రకాల యానకాలు ఉన్నాయి. ఈ వాక్యం సరైనది. ఎందుకంటే
- చెవి వెలుపలి భాగంలోని రంధ్రంలో గాలి వాయు యానకంలా పనిచేస్తుంది.
- మధ్య చెవి భాగంలోని తేలికైన మూడు ఎముకలు మ్యాలియస్, ఇంకస్ మరియు స్టీలు ఘనస్థితిలో ఉన్నాయి. ఇవి ఘన యానకంలా పనిచేస్తాయి
- లోపలి చెవి భాగం అయిన కోక్లియా చిక్కని ద్రవంతో నింపబడి ఉన్నది. ఇది ద్రవ యానకంలా పనిచేస్తుంది. కాబట్టి మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే 3 రకాల యానకాలు ఉన్నాయి.
8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook Activities
కృత్యములు
కృత్యం – 1 ధ్వనిని విని, ధ్వని జనకాన్ని ఊహించుట :
ప్రశ్న 1.
మీకు వినిపించే ధ్వనులను వినండి. ఆయా ధ్వనులు ఏ ఏ వస్తువుల నుండి ఉత్పత్తి అయి ఉంటాయో ఊహించి ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
విన్న ధ్వని | ధ్వని జనకం |
1. నెమ్మదిగా మొరుగుట | దూరంగా ఉన్న కుక్క |
2. గంట ధ్వని | పాఠశాలలో ఉన్న గంట |
3. విద్యార్థుల గోల | ఆటస్థలంలో ఆటలాడుతున్న విద్యార్థుల అల్లరి |
4. వాహనాల ధ్వనులు | రోడ్డుపై వెళ్లే వాహనాల ధ్వనులు |
5. మోటారు ధ్వని | పాఠశాలలో గల మంచినీటి బోర్ మోటారు ధ్వని |
6. చప్పట్ల ధ్వని | విద్యార్థులు చప్పట్లు కొట్టడం |
కృత్యం – 2 వివిధ ధ్వనులను గుర్తించండి :
ప్రశ్న 2.
వివిధ ధ్వనులను గుర్తించండి :
జవాబు:
ఒక విద్యార్థిని పిలిచి నల్లబల్లవైపు తిరిగి నిలబడమని చెప్పండి. మిగిలిన విద్యార్థులను వివిధ రకాల ధ్వనులను ఒకరి తరువాత ఒకరిని చేయమని చెప్పండి. నల్లబల్ల వద్ద నున్న విద్యార్థిని తాను విన్న ధ్వనులను, ఆ ధ్వనులు ఉత్పత్తి అయిన విధానాన్ని ఈ క్రింది పట్టికలో నమోదు చేయమనండి.
విన్న ధ్వని | ధ్వని ఉత్పత్తి అయిన విధానము |
1. గలగల | ఒక రేకు పెట్టెలో రాళ్లు వేసి ఊపడం వల్ల |
2. ఈలధ్వని | ఒక విద్యార్థి ఈల వేయడం వలన |
3. చప్పట్లు | ఒక విద్యార్థి చప్పట్లు కొట్టడం వల్ల |
4. అలారమ్ ధ్వని | గడియారము అలారమ్ వల్ల |
5. కిర్, కిర్, కిర్ | కిర్ చెప్పులతో నడవడం వల్ల |
6. టక్, టక్ | టేబుల్ పై, ఇనుప స్కేలుతో కొట్టడం వల్ల |
కృత్యం – 3 కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేయడం :
ప్రశ్న 3.
కంపించే వస్తువుల నుండి ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చును అని కొన్ని కృత్యాల ద్వారా వివరించండి.
జవాబు:
పై కృత్యాల ద్వారా కంపించే వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుందని తెలుస్తుంది.
కృత్యం – 4 ధ్వని శక్తిని కలిగి ఉంది :
ప్రశ్న 4.
ధ్వనికి శక్తి ఉందని నిరూపించుటకు ఒక కృత్యాన్ని సూచించండి.
జవాబు:
ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పై భాగాన్ని కోసి గ్లాసులాగా తయారు చేయండి. దానిలో ఒక సెల్ ఫోన్ ను ఉంచండి. ప్రక్క పటంలో చూపిన విధంగా ఒక రబ్బరు బెలూతో మూసి రబ్బరు బ్యాండుతో గట్టిగా బిగించండి. బెలూను సాగదీసి ఉంచడం వల్ల అది డయాఫ్రం వలె పనిచేస్తుంది. బెలూన్ పొర పై కొన్ని చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులను వేసి మరొక సెల్ ఫోన్లో రింగ్ చేయండి. బెలూన్ పొర పై గల చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులు మరియు రబ్బరు పొర కదులుతున్నాయి. సెల్ ఫోన్ రింగ్ ఆపుచేయగానే చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులు, బెలూను రబ్బరు పొర నిలకడగా ఉంటాయి. బెలూను కంపనాలు మరియు చక్కెర లేదా ఇసుక. రేణువుల కదలికలకు కారణం సెల్ ఫోన్ ఉత్పత్తి చేసిన ధ్వని. దీని ద్వారా ధ్వనికి బెలూను రబ్బరు మూత పైన గల ఇసుక రేణువులను కంపింపజేసే శక్తి ఉందని తెలుస్తుంది.
కృత్యం – 5
ప్రశ్న 5.
వర్షం పడేటప్పుడు వినిపించే చప్పుడును పోలిన ధ్వనులను కృత్యం ద్వారా సృష్టించండి.
జవాబు:
మన చేతి వేళ్లను ఉపయోగించి వర్షం వచ్చే శబ్దాన్ని సృష్టించవచ్చును. ఎడమ అరచేతి మీద కుడి చూపుడు వేలితో కొడుతూ శబ్దం చేయాలి. మధ్యవేలిని దానికి జత కలపాలి. తరువాత ఉంగరపు వేలిని, చివరగా చిటికెన వేలితో శబ్దం చేయాలి. తరువాత చిటికెన వేలు నుండి చూపుడు వేలు వరకు ఒక్కొక్కటిగా తీస్తూ శబ్దం చేయండి. ఈ విధంగా తరగతిలోని పిల్లలందరు కలిసి ఒకేసారి ఇలా చేస్తే వర్షం పెరుగుతున్న శబ్దం, వర్షం తగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది.
కృత్యం – 6 ధ్వనిలోని మార్పును పరిశీలించడం :
ప్రశ్న 6.
కంపించే వస్తువు నుండి మరియు వాయిద్య పరికరాలలోని ఖాళీ ప్రదేశాల గుండా ప్రసరించే గాలి కారణంగా ధ్వని ఏర్పడుతుందని జలతరంగిణి కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
4 నుండి 5 లోహపు లేదా గాజు గ్లాసులను తీసుకొని, వాటిని ఆరోహణ తీసుకొని ఒక్కొక్క గ్లాసు అంచుమీద మెల్లగా కొట్టండి. ఈసారి వాటిని సమాన స్థాయిలో నీటితో నింపండి. ప్రతి పాత్రను పైన చెప్పిన విధంగా చెంచాతో కొట్టండి. గ్లాసులో నీటిమట్టం మారే కొలది ఉత్పత్తి అయిన ధ్వనిలో క్రమమైన మార్పు ఉంటుంది. కంపించే వస్తువు నుండి మరియు వాయిద్య పరికరాలలో ఖాళీ ప్రదేశాల గుండా ప్రసరించే గాలి కారణంగా ధ్వని వెలువడుతుంది.
కృత్యం – 7 మాట్లాడుతున్నపుడు స్వరతంత్రులలోని కదలికలను గమనించడం :
ప్రశ్న 7.
మాట్లాడుతున్నపుడు స్వరతంత్రులలోని కదలికలను పరిశీలించి ధ్వని ఏ విధంగా ఏర్పడునో వివరించండి.
జవాబు:
మీ స్నేహితుని తల పైకెత్తమని చెప్పండి. అతని నోటికి అడ్డంగా ఒక చాక్లెట్ పై కాగితాన్ని (Wrapper) ఉంచండి. దాని పైకి బలంగా గాలి ఊదమని చెప్పండి. అతని స్వరపేటికను పరిశీలిస్తే స్వరపేటిక ఉబ్బి ఎక్కువ ధ్వని వెలువడుతుంది. ఈసారి మెల్లగా ఊదమని చెప్పి పరిశీలిస్తే సాధారణ స్థాయిలో ధ్వని వెలువడుతుంది. ఈ ధ్వనులు స్వరతంత్రులు మరియు చాక్లెట్ కాగితాల కంపనాల కలయిక వల్ల ఉత్పత్తి అయినవి.
కృత్యం – 8 ఘన పదార్థాలలో ధ్వని ప్రసారాలను పరిశీలించుట :
ప్రశ్న 8.
ఘన పదార్థాలలో ధ్వని ప్రసరణ జరుగుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
పై కృత్యాల ద్వారా “ధ్వని చెక్క లోహం, దారం వంటి ఘనపదార్థ యానకాల ద్వారా ప్రయాణిస్తుందని” తెలుస్తుంది.
కృత్యం – 9 ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసరణ :
ప్రశ్న 9.
ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసరణ జరుగుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- రెండు రాళ్లను తీసుకొని ఒకదానితో మరొకటి గాల్లో కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వనిని మీ మిత్రున్ని వినమనండి.
- ఒక వెడల్పాటి బకెట్ ను నీటితో నింపండి.
- పక్క పటంలో చూపిన విధంగా చేతిలోని రాళ్లు నీటిలో ఉంచి, ఒక దానితో ఒకటి కొట్టండి.
- అదే సమయానికి మీ స్నేహితున్ని ఆ బకెట్ యొక్క బయటి గోడకు చెవిని ఆనించి ధ్వనిని వినమనండి.
- గాలిలో విన్న ధ్వనికి, నీటి ద్వారా విన్న ధ్వనికి మధ్య తేడాను మీ మిత్రున్ని అడగండి. గాలిలో కంటె నీటి ద్వారా ఎక్కువ ధ్వని వినబడుతుంది. కావున పై కృత్యం ద్వారా ధ్వని ద్రవాల ద్వారా ప్రయాణిస్తుందని తెలుస్తుంది.
కృత్యం – 10 యానకం లేకపోతే ధ్వని ప్రసరించగలదా?
ప్రశ్న 10.
యానకం లేకపోతే ధ్వని ప్రసరిస్తుందో లేదో ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- ఒక పొడవైన ప్లాస్టిక్ గ్లాసును లేదా గాజు గ్లాసును తీసుకోండి.
- గ్లాసు పొడవుకన్నా తక్కువ పొడవు ఉన్న సెల్ ఫోన్ ను గ్లాసులో నిలువుగా ఉంచండి.
- సెల్ ఫోన్లో రింగ్ టోన్ ను ఏర్పాటు చేయండి.
- ఆ రింగ్ టోన్ ధ్వని స్థాయిని జాగ్రత్తగా వినండి.
- ఇప్పుడు గ్లాసులో ఉన్న గాలిని ప్రక్క పటంలో చూపిన విధంగా మీ నోటితో పీల్చివేయండి.
- ఇలా గాలి పీల్చినప్పుడు గాలి బంధనం వల్ల గ్లాసు యొక్క అంచు మీ మూతి చుట్టూ అంటుకుంటుంది.
- ఇప్పుడు రింగ్ టోన్ స్థాయిని వినండి. గ్లాసులో గాలి ఉన్నప్పుడు ఎక్కువ ధ్వని వినపడింది.
- గ్లాసులోని గాలిని పీల్చిన తర్వాత రింగ్ టోన్ ధ్వని వినబడలేదు.
- ఈ కృత్యం ద్వారా ధ్వని ప్రసరణకు యానకం అవసరమని తెలుస్తుంది.
ప్రయోగశాల కృత్యం – 1
ప్రశ్న 11.
ధ్వని తీవ్రతకు, ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువు కంపన పరిమితికి మధ్య గల సంబంధాన్ని ఒక ప్రయోగం ద్వారా వివరించండి.
జవాబు:
లక్ష్యం :
ధ్వని తీవ్రతకు, ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువు కంపన పరిమితికి మధ్యగల సంబంధాన్ని తెలుసుకొనుట.
కావలసిన పరికరాలు :
చెక్కబల్ల, 30 సెం.మీ. పొడవు గల ఇనుప స్కేలు లేదా హాక్-సా బ్లేడు, ఇటుక.
పద్దతి :
- బ్లేడు పొడవులో 10 సెం.మీ. బల్ల ఉపరితలంపై ఉండునట్లు, మిగిలిన బ్లేడు భాగం గాలిలో ఉండునట్లుగా అమర్చి ఒక బరువైన ఇటుకను బల్ల ఉపరితలంపై ఉన్న స్కేలుపై ఉంచండి.
- కొద్ది బలాన్ని ఉపయోగించి బ్లేడులో కంపనాలను కలుగచేయండి. ఆ కంపనాల కంపన పరిమితిని, విడుదలైన ధ్వనిని పరిశీలించండి. ఈ విధంగా 3,4 సార్లు చేసి కంపనాల కంపన పరిమితిని విడుదలైన ధ్వనిని పట్టికలో నమోదు చేయండి.
- ఎక్కువ బలమును ఉపయోగించి బ్లేడులో ‘కంపనాలను కలుగజేసి, ఏర్పడ్డ కంపనాల కంపనపరిమితిని, ధ్వనిని పరిశీలించండి. ఇదే విధంగా 3,4 సార్లు చేసి, పరిశీలనలను ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
బ్లేడు కంపనాల కంపన పరిమితి పెరుగుతుంటే క్రమంగా ధ్వని తీవ్రత పెరుగుతుంది. బ్లేడు కంపనాల యొక్క కంపన పరిమితి తగ్గుతుంటే క్రమంగా ధ్వని తీవ్రత తగ్గుతుంది.
ప్రయోగశాల కృత్యం – 2
ప్రశ్న 12.
ధ్వని యొక్క కీచుదనము మరియు కంపనాల మధ్య గల సంబంధాన్ని ప్రయోగపూర్వకంగా వివరించండి.
(లేదా)
ధ్వని యొక్క కీచుదనాన్ని గుర్తించుటను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
లక్ష్యం :
ధ్వని యొక్క కీచుదనం మరియు కంపనాల మధ్యగల సంబంధాన్ని కనుగొనుట.
కావలసిన పరికరాలు :
ఒక చెక్క బల్ల, రెండు 30 సెం.మీ. పొడవు గల హాక్-సా బ్లేడు, రెండు ఇటుకలు.
పద్ధతి :
- బల్ల తలంపై ఒక చివర మొదటి బ్లేడు 10 సెం.మీ. పొడవు బల్లపై ఉండునట్లుగా మిగిలిన బ్లేడు భాగం బయటకు గాలిలో ఉండేలాగా అమర్చండి. బల్లపై ఉన్న 10 సెం.మీ. బ్లేడు భాగంపై బరువు కొరకు ఒక ఇటుకను బ్లేడులో, కంపనాలు ఉంచండి.
- రెండవ బ్లేడులో 25 సెం.మీ. భాగం బల్లపై మిగిలిన 5 సెం.మీ. భాగం గాలిలో ఉండేట్లు అమర్చండి. (ఇలా అమర్చిన బ్లేడ్ల మధ్య కనీసం 10 సెం.మీ. దూరం ఉండేటట్లు చూడాలి) బల్లపైన ఉంచిన భాగంపై ఇటుకను ఉంచాలి.
- రెండు బ్లేడ్లు ఒకే బలముతో కంపనాలకు గురి చేయండి. అప్పుడు బ్లేడ్లలో కలిగే కంపనాలను, వెలువడే ధ్వనులను పరిశీలించి ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
గాలిలో బ్లేడు పొడవు | కంపనాలు | ధ్వని |
స్కేలు 1 : 20 సెం.మీ. పొడవు | తక్కువ కంపనాలు (తక్కువ పౌనఃపున్యము) |
తక్కువ కీచుదనము గల ధ్వని వినబడింది. |
స్కేలు 2 : 5 సెం.మీ. పొడవు | ఎక్కువ కంపనాలు (ఎక్కువ పౌనఃపున్యము) |
ఎక్కువ కీచుదనము (పిచ్) గల ధ్వని వినబడింది. |
పై ప్రయోగం ద్వారా పొట్టి స్కేలు (ఎక్కువ కంపనాలు గల స్కేలు) ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క కీచుదనము (పిచ్) ఎక్కువగా వున్నది. పొడవు స్కేలు (తక్కువ కంపనాలు గల స్కేలు) ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క కీచుదనము తక్కువగా ఉన్నది.
ధ్వని యొక్క కీచుదనము (పిచ్) దాని పౌనఃపున్యము (కంపనాల) పై ఆధారపడి ఉన్నది.