SCERT AP 8th Class Social Study Material Pdf 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947
8th Class Social Studies 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
జాతీయ ఉద్యమంలోని వివిధ ప్రయత్నాలలో గాంధీజీ కృషిని తెలియచేసే పట్టిక తయారు చేయండి. (AS3)
(లేదా)
భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పాత్రను వివరించండి.
జవాబు:
భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పాత్ర :
సంఘటన | గాంధీ పాత్ర |
1917 – రైతాంగ పోరాటం | చంపారన్, భేదాలలో అధిక పన్నులు, దోపిడీ చేసే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించాడు. |
1918 – నేత కార్మికుల సమ్మె | 1918లో అహ్మదాబాద్ నేత కార్మికుల సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. ఔడా నిరసనలు. |
1919 – రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా | 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. గౌరవభంగ దినంకు పిలుపునిచ్చాడు. |
1920-పంజాబ్ తప్పులు | ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి స్వరాజ్యం కోరాలని కాంగ్రెసుపై ఒత్తిడి తెచ్చాడు. |
1920-22 | ఖాదీ ఉద్యమాన్ని చేపట్టాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్థాంతరంగా ఆపివేశాడు. |
1930 – ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం | అహ్మదాబాదులోని సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్ర మొదలు పెట్టి దండి వరకు నడిచి బ్రిటిషు చట్టాలను ఉల్లంఘించాడు. |
1942 – క్విట్ ఇండియా తీర్మానం | క్విట్ ఇండియా తీర్మానం చేసి అందరినీ స్వతంత్రులుగా భావించమన్నాడు. |
1947, ఆగష్టు 15 | దేశం స్వాతంత్ర్యం పొందేంతవరకు అవిశ్రాంత కృషి జరిపాడు. |
ప్రశ్న 2.
ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు, స్వేచ్చ ఇవ్వటానికి నిరాకరించిన బ్రిటిషు ప్రభుత్వ అన్ని ప్రయత్నాలను జాతీయోద్యమం వ్యతిరేకించింది. ప్రభుత్వం ఏ హక్కులను కాలరాయటానికి ప్రయత్నించిందో, దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏమిటో ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
1. 1919లో రౌలట్ చట్టంను అమలులోకి తెచ్చి, భారతీయుల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఉగ్రవాది అని పోలీసులు అనుమానిస్తే వాళ్ళను అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టవచ్చు. విచారణ జరిగినా రుజువుల గురించి నిందితుడికి కూడా తెలియవు.
దీనికి వ్యతిరేకంగా ఆనాటి జాతీయోద్యమ నాయకులు 1919 ఏప్రిల్ 6న గౌరవభంగ దినంగా పిలుపునిచ్చారు. సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఈ రౌలట్ సత్యాగ్రహాన్ని పేర్కొనాలి.
2. 1920లో బ్రిటన్ కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్ పై రుద్దింది. దీనిని భారతీయ ముస్లింలు వ్యతిరేకించారు. వారికి మద్దతుగా జాతీయవాదులు సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టారు.
3. బ్రిటిషువారు చీరాల-పేరాల వారికి పన్ను పెంచగా, దానిని నిరసిస్తూ అక్కడి ప్రజలందరూ ఊళ్ళు వదిలి పెట్టి రాంనగర్ కాంప్ ను ఏర్పాటు చేసుకుని 11 నెలలు కాలం గడిపారు.
4. సామాన్యుడు నిత్యం ఉపయోగించే ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని జాతీయవాదులు చేపట్టి బ్రిటిషు వారి అధికారాన్ని తోసి రాజన్నారు.
ఈ విధంగా బ్రిటిషువారి భారత వ్యతిరేక నిర్ణయాలను జాతీయవాదులు వ్యతిరేకించారు. నిరసించారు. ధిక్కరించారు.
ప్రశ్న 3.
ఉప్పు సత్యాగ్రహం తన ఉద్దేశాలలో ఏ మేరకు విజయవంతం అయ్యింది? మీ అంచనా ఏమిటి? (AS2)
జవాబు:
ఉప్పు సత్యాగ్రహం దేశమంతటా నూతనోత్తేజం రగిల్చింది. దేశంలో పలుప్రాంతాలలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. దీనిలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఎంతోమంది’ అరెస్టయ్యారు. ఈ ఉద్యమం కేవలం దీనికే పరిమితంకాక విదేశ వస్త్ర, మద్యం, దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు, ఆ వస్తువులను తగులబెట్టారు. బ్రిటిషు పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలను బహిష్కరించారు. ఇది దేశమంతా పాకింది. కొద్దిమంది బ్రిటిషు కాల్పుల్లో మరణించారు. చివరికి 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది.
వీటన్నింటిరీత్యా ఉప్పు సత్యాగ్రహం తన ఉద్దేశాలలో అధిక మేరకు విజయవంతం అయ్యింది.
ప్రశ్న 4.
ఈ దిగువ పేర్కొన్న వాటిల్లో జాతీయోద్యమంలో భాగమైనవి ఏవి? (AS1)
అ. విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాల వద్ద పికెటింగ్
ఆ. బట్టలు వేయటానికి చేతితో నూలు వడకటం
ఇ. దిగుమతి చేసుకున్న బట్టలను తగలబెట్టటం
ఈ. ఖద్దరు వేసుకోవటం
ఉ. పైన పేర్కొన్నవన్నీ
జవాబు:
ఉ. పైన పేర్కొన్నవన్నీ
ప్రశ్న 5.
దేశ విభజనకు దారితీసిన వివిధ ఘటనలు ఏవి? (AS1)
జవాబు:
- 1930 సం|| నుంచి హిందువులకు భిన్నంగా ముస్లింలు ప్రత్యేక జాతిగా ముస్లింలీగ్ పరిగణించసాగింది. కాంగ్రెసు ముస్లింల మద్దతు కూడగట్టుకోలేకపోయింది.
- ముస్లింలు ఎప్పటికీ భారతదేశంలో ద్వితీయ స్థానంలోనే ఉంటామని భావించారు.
- 1937లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్- లీగ్ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటును కాంగ్రెసు తిరస్కరించడం కూడా వారిని ఇబ్బంది పెట్టింది.
- 1940లో కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నప్పుడు ముస్లింల మద్దతు లీగ్ కూడగట్టుకోగలిగింది.
- 1945లో బ్రిటిషువారు స్వాతంత్ర్యం విషయమై కాంగ్రెసు-ముస్లింలీగ్ ని సమర్థించడంలో విఫలమైంది.
- 1946 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెసు-ముస్లింలీగ్ రెండూ ఘన విజయాలు సాధించాయి. దీంతో ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్థాన్‌ను కోరింది.
- 1946లో క్రిప్పు రాయబారం జరిగింది. ఇందులో కాంగ్రెస్ వారు ముస్లింలీగ్ వారు ఐకమత్యంగా ఉండటానికి ససేమిరా ఒప్పుకోలేదు.
- 1946లో బ్రిటిషు క్యాబినేట్ సంఘం దీర్ఘకాలంలో భారతదేశం సమాఖ్యను ఏర్పరచి అధినివేశ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇది విఫలం అవ్వటంతో ఆగస్టు 16న ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’ గా ముస్లిం లీగ్ ప్రకటించింది.
- ఇది 1947 నాటికి హింసాత్మకంగా మారింది. వీటిని సరిదిద్దలేక దేశ విభజనకు నిర్ణయం చేశారు.
ప్రశ్న 6.
మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను పటంలో గుర్తించి రంగులు నింపండి. (AS5)
జవాబు:
ప్రశ్న 7.
1922-29 మధ్య ఘటనలు మొదటి పేరాను చదివి క్రింది ప్రశ్నకు జవాబు రాయండి. (AS2)
మహాత్మా గాంధీ హింసాత్మక ఉద్యమాలకు వ్యతిరేకి అని మీకు తెలుసు. 1922లో చౌరి చౌరాలో రైతుల గుంపు పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టినందుకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అతడు అర్ధాంతరంగా ఆపేశాడు. ఆ రోజు ఘటనలో 22 మంది పోలీసులు చనిపోయారు. శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపటంతో ప్రజలు ఆగ్రహావేశాలకు గురయ్యారు.
“హింసానంతరం గాంధీజీ ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపివేశాడు. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?
జవాబు:
గాంధీజీ అనుసరించిన అహింస, సత్యాగ్రహాలకు ఈ హింస వ్యతిరేకం కాబట్టి నేను దీనిని సమర్థిస్తాను.
ప్రశ్న 8.
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఏమిటి? (AS1)
జవాబు:
జాతీయతా కార్యక్రమాలకు గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది. ఇందులో విద్యార్థులే కాకుండా వ్యాపారస్తులు, పల్లెటూళ్లలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనసాగారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చెప్పుకోదగింది. చీరాల-పేరాల ఉద్యమం. ఈ పట్టణాన్ని నగరపాలికగా మార్చి ప్రభుత్వం ప్రజల మీద భారీగా పన్నులు వేసింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 15,000 మంది ప్రజలు పన్ను కట్టటానికి నిరాకరించి ఊరు వదిలి పెట్టారు. ఊరి బయట రాంనగర్ పేరుతో కొత్త నివాసం ఏర్పాటు చేసి పదకొండు నెలలు అక్కడే ఉండిపోయారు. రైతులు భూమి శిస్తులు కట్టకుండా సహాయ నిరాకరణోద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అధిక సంఖ్యలో గ్రామ అధికారులు రాజీనామా చేశారు. “గాంధీజీ స్వరాజ్యం వస్తోంది. ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం”, అని ప్రజలు ప్రకటించారు.
మరొక ముఖ్యమైన పరిణామం గుంటూరు జిల్లా పల్నాటి తాలుకాలోనూ, కడపజిల్లా రాయచోటి తాలూకాలోనూ జరిగిన అటవీ సత్యాగ్రహం. అటవీశాఖకు పుల్లరీ చెల్లించకుండానే రైతులు పశువులను అడవిలో మేపటానికి పంపించసాగారు. పల్నాడులోని అనేక గ్రామాలలో ప్రజలు గాంధీ రాజ్యాన్ని ప్రకటించి, పోలీసు బృందాలపై దాడులు చేయసాగారు. వలస పాలన అంతం అవుతోందని, అడవులు తిరిగి గ్రామప్రజల ఆధీనంలోకి వస్తాయని ప్రజలు నమ్మారు. ఈ రెండు తాలూకాలలో ఆందోళన జరుగుతున్న సమయంలో అటవీశాఖ పనిచేయటం దాదాపుగా సాధ్యం కాలేదు.
ఇవి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు.
ప్రశ్న 9.
క్విట్ ఇండియా ఉద్యమం ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? (AS1)
జవాబు:
స్వాతంత్ర్యం కోసం మనదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వాటినన్నింటిని బ్రిటిషువారు అణగట్టారు. కానీ క్విట్ ఇండియా ఉద్యమం ముందు వీరు మోకరిల్లారు. అందువలన ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రశ్న 10.
1885-1947 మధ్య స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలను తెలిపే కాలమాన పట్టిక తయారు చేయండి. (AS3)
జవాబు:
సంవత్సరం | ఘట్టాలు |
1. 1885 | భారత జాతీయ కాంగ్రెసు స్థాపన |
2. 1886 | స్థానిక సంస్థలు కాంగ్రెసు ప్రతినిధులు ఎన్నిక (436 మంది) |
3. 1885-1905 | మితవాద యుగం |
4. 1903 | స్వదేశీ ఉద్యమం |
5. 1905 | బెంగాలు విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం |
6. 1905-1920 | అతివాద యుగం |
7. 1907 | కాంగ్రెస్లో చీలిక. |
8. 1915 | తిలక్, అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమం |
9. 1916 | లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్ ఐక్యత |
10. 1915 | (1915లో దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ రాక) గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో చేరిక |
11. 1917 | చంపారన్ ఆందోళన |
12. 1918 | అహ్మదాబాదు కార్మికుల సమ్మె, ఔడా నిరసనలు |
13. 1919 | రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం |
14. 1920 | ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం |
15. 1922 | చౌరీ-చౌరా సంఘటన, సహాయ నిరాకరణం నిలిపివేత |
16. 1930 | శాసనోల్లంఘనోద్యమం, ఉప్పు సత్యాగ్రహం |
17. 1935 | భారత ప్రభుత్వ చట్టం |
18. 1937 | శాసన సభలకు ఎన్నికలు |
19. 1940 నుండి 1945 వరకు | విప్లవవాదుల యుగం |
20. 1942 | క్విట్ ఇండియా ఉద్యమం |
21. 1942-44 | మిడ్నాపూర్ ప్రజల సమాంతర ప్రభుత్వం ఆ సమాంతర పడుత్యం |
22. 1946 | ఎన్నికలు, ప్రత్యేక పాకిస్తాన్ కోసం ముస్లింలీగ్ పట్టుపట్టడం |
23. 1946 | క్రిప్పు రాయబారం, ముస్లింల ప్రత్యక్ష కార్యాచరణ దినం. |
24. 1947 | దేశమంతా హింసాపూరితం |
25. 1947 ఆగస్టు 14 | పాకిస్తాన్ స్వాతంత్ర్యం |
26. 1947 ఆగస్టు 15 | భారత్ స్వాతంత్ర్యం |
ప్రశ్న 11.
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యఫలాలు నేడు అందరికి అందాయా? దీనిపై మీ అభిప్రాయం తెలపండి. (AS6)
జవాబు:
భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి సాధించడం ద్వారా దేశం ముందంజ వేయగలదని భావించారు. భారతదేశం
అనేక రంగాలలో ముందంజలో ఉన్న సామాన్య ప్రజలు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. ప్రతి విషయంలో మితిమీరడంతో సమన్యాయం జరగడం లేదు. అవినీతి వలన ప్రభుత్వ పథకాలు సామాన్యునికి చేరడం లేదు. ప్రజలు సబ్సిడీలు, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడక తప్పడం లేదు.
8th Class Social Studies 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 InText Questions and Answers
8th Class Social Textbook Page No.131
ప్రశ్న 1.
తీవ్రవాదాన్ని అణిచివేయటానికి, పోలీసులకు ఇటువంటి అధికారాలు ఇవ్వటం సరైనదేనా?
జవాబు:
తీవ్రవాదం, నిరసన తెలియచేయటం అనేవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి మధ్య ఉండే తేడాని పోలీసులు గ్రహించగలిగి ఉండాలి. అపుడు వారికి ఇలాంటి అధికారాలు ఇవ్వవచ్చు. లేనిచో ఇవ్వరాదు.
ప్రశ్న 2.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఇటువంటి చట్టాలను ప్రజలు. అంతగా ఎందుకు వ్యతిరేకించారు?
జవాబు:
- నాటి స్వాతంత్ర్యోద్యమ కాలంలో అధిక శాతం పోలీసులు, వారి ఉన్నతాధికారులు అందరూ బ్రిటిషువారే.
- అప్పటికే వారి నిరంకుశాధికారాన్ని తట్టుకోవటం ప్రజలకు కష్టసాధ్యమవుతోంది.
- అలాంటి సమయంలో ఇలాంటి చట్టాలు చేయటం అనేది అగ్నిలో ఆజ్యం పోయటం లాంటిది.
అందువలన ఇలాంటి చట్టాలను ప్రజలు వ్యతిరేకించారు.
8th Class Social Textbook Page No.132
ప్రశ్న 3.
చీరాల-పేరాల ఉద్యమం గురించి, అటవీ సత్యాగ్రహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. వాటిపై ఒక నాటిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
స్వాతంత్ర్యోద్యమకాలం – 1919
రామ్ నగర్ కాంప్ (చీరాల-పేరాల)
రాముడు : ఓరేయ్ రాజా ! ఏంటిరా, మీరు కూడా మన ఊరు వదిలి వచ్చేశారా?
రాజా : నేనేంటిరా ! మొత్తం మన చీరాల-పేరాల వాళ్ళందరూ ఊళ్ళు వదిలి వచ్చేశారా !
శేఖర్ : ఏరా ! మనందరం మన ఇళ్ళు, వాకిళ్ళు వదిలి రావాల్సిన ఖర్మ ఏం పట్టిందిరా !
యశ్వంత్ : అది మన ఖర్మ కాదురా ! మనల్ని బాధ పెట్టాలని చూసే ఆ బ్రిటిషు వారి ఖర్మ. లేకపోతే మనం 4000/- కట్టే పన్ను 40,000/- కట్టాలా? ఎంత దారుణం?
రాముడు : అయితే అయింది కానీ, గాంధీగారు మహాబాగైన సలహా చెప్పారా !
రాజా : అవునురా ! ఆయన సలహా చెప్పడం, మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మన వెనకే ఉండి నడిపించడం చాలా బాగుందిరా !
ఇలా అయితే ఈ బ్రిటీషోడి పీడ మనకు త్వరలోనే వదిలిపోతుందిరా !
యశ్వంత్ : అయితే బ్రిటిషు వాళ్ళు మనల్ని ఇలాగే వదిలేస్తారంటావా?
శేఖర్ : ఎందుకు వదులుతారంట ! మనల్నందరినీ శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టరూ !
రాజా : పెడితే పెట్టనీరా ! ప్రాణాలిచ్చి అయినా సరే వాళ్ళ భరతం పట్టందే వదిలి పెట్టొద్దు.
మిగిలిన వారందరు : -అంతేరా ! అలాగే చేద్దాం.
గాంధీజీకి – జై
దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు – జై
భారతమాతకు – జై
జై – జై
అటవీ సత్యాగ్రహం – 1921
కన్నెగంటి హనుమంతు – పల్నాటి వీరబిడ్డ (వయస్సు 30 సం||రాలు)
ఏకపాత్రాభినయము
అడవిలో తిరుగుతూ :
ఒరేయ్ తెల్లోడా ! ఎవడురా నా వాళ్ళని పుల్లరి పన్ను కట్టమని అడిగిన మొనగాడు ! ఈ గడ్డమీద పుట్టిన మేము ఈ గడ్డను అడ్డం పెట్టుకున్న నీకు శిస్తు కట్టాల్నా ! ఏమి న్యాయమురా యిది ! ఏమి ధర్మమురా యిది ! ఈ పల్నాట బుట్టిన ఎవడైననూ యిటువంటి పని చేస్తారనే అనుకున్నార్రా! ఇంగ్లీషు కుక్కల్లారా !
ఒరేయ్ రూథర్ ఫర్డ్ !
ఈ అడవి తల్లి మాదిరా ! మా తల్లిరా !
మా అమ్మ పెట్టే తిండికే నీకు శిస్తు కట్టాలిరా?
నీరు పెట్టావా ! నాటు వేశావా ! కోత కోశావా !
కుప్ప నూర్చావా ! ఎందుకు కట్టాలిరా శిస్తు.
ఎందుకు కట్టాలిరా నీకు శిస్తు. ఎందుకు …………..
అమ్మా ! అమ్మా ! నన్ను చంపితే ……………………….
అబ్బా ! నాలాంటి వాళ్ళు వేలమంది పుడతారురా ! అమ్మా !
మిమ్మల్ని ఈ గడ్డ నుండి తరిమి, తరిమి, వేటాడి, వెంటాడి గెంటుతారురా ! ఇది నిజం.
అమ్మా !
వందేమాతరం
వందేమాతరం
అమ్మా !
భరతమాతా శెలవు తల్లీ !
మళ్ళీ జన్మంటూ ఉంటే నీ బిడ్డగానే
పుట్టి స్వేచ్ఛగా ఆడుకుంటాను
తల్లీ !
………….వం…………………………మా …………..రం
(మరణించాడు)
ప్రశ్న 4.
పల్నాడు ప్రాంతంలో కన్నెగంటి హనుమంతు పుల్లరి సత్యాగ్రహం గురించి మీ ఉపాధ్యాయుల ద్వారా అడిగి తెలుసుకోండి?
జవాబు:
కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. అది 1920వ సంవత్సరం ప్రాంతం. దేశమంతా గాంధీగారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని నాయకుల పిలుపునందుకొని ఆంధ్రదేశం కూడా సహాయ నిరాకరణోద్యమంలోకి దూకింది. సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల నిరాకరణ ఓ భాగం. గుంటూరు జిల్లాలో ఉన్న లక్ష్మీనారాయణగారు దీనికి నాయకులు.
పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, ‘ జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవితంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది.
అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికి ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధించింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించుకోవడానికి నానా అవస్థలు పడటం పరిపాటి అయింది. ఈ క్రమంలో ప్రజలను సంఘటితపరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు.
ప్రజలు పుల్లరి కట్టడం మానేశారు. పైపెచ్చు ప్రజలు కన్నెగంటి నాయకత్వంలో అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్రపన్నింది.
అది 1922వ సంవత్సరం, ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం, అమావాస్య మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఓ దుర్దినం. మరో బ్రిటిష్ దౌష్ట్యం రూపుదిద్దుకోబోతున్న వేళ. గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు పల్నాడు గ్రామం చేరుకున్నాడు. దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య నాయుడిని పిలిచాడు. అతనికి తోడు మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే… బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకు పడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. కన్నెగంటి నాయకత్వంలో గ్రామస్తులంతా తిరగబడ్డారు. సుమారు రెండు నుంచి మూడు వందల మంది గ్రామీణ స్త్రీలు, పురుషులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటిష్ సైన్యం ప్రజలపై దమనకాండ జరిపింది. ఈ పోరాటంలో తుది వరకూ పోరాడిన కన్నెగంటి పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. ఈ యోధుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు ఆ దమనకాండలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి మౌన సాక్షిగా నిలుస్తుంది.
8th Class Social Textbook Page No.135
ప్రశ్న 5.
“బ్యాంకాక్ నుంచి టోక్యో 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు.” సుభాష్ చంద్రబోస్ మరణాన్ని ఎందుకు ధృవీకరించలేదు?
జవాబు:
సుభాస్ చంద్రబోస్ మరణం నేటికీ అందరికీ ఒక పజిల్ వంటిది. ఆ రోజు ఆయన మరణించలేదని అందరూ నమ్ముతారు. ఆయన మరణం గురించి భారత ప్రభుత్వం 3 కమీషన్లను నియమించింది. కానీ అది ఇంతవరకు నిర్ధారణకు రాలేదు. కాబట్టి ఆయన మరణాన్ని ధృవీకరించలేదు.
ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానమిమ్ము.
సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. అతడు రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని (ఐఎన్ఏ) ఏర్పాటు చేశాడు. ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ పోరాటంలో జపాన్ అతడికి సహాయం చేసింది. 1943 అక్టోబరు 21న సింగపూర్ లో స్వతంత్ర భారత (ఆజాద్ హింద్) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1944 మార్చి 18న ‘ఢిల్లీకి పదండి’ నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది. 1944 మార్చిలోనే నాగాల్యాండ్ ని కోహిమాలో భారత జెండాను ఎగరవేశారు. అయితే యుద్ధ పరిస్థితులు మారి 1944-45 శీతాకాలంలో బ్రిటన్ ప్రతిఘటనకు దిగటంతో, రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాను ఓడిపోవటంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ నుండి టోక్యోకి 1945 ఆగష్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు. |
1. సుభాష్ చంద్రబోస్ ఎవరు?
జవాబు:
ఆయన స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది.
2. ఐఎన్ఏ ఏర్పాటుకు ఎవరి సహకారం తీసుకున్నాడు?
జవాబు:
రాస్ బిహారీ బోస్ సహకారం తీసుకున్నాడు.
3. ఈ పోరాటంలో బోనకు ఎవరి సహకారం ఉంది?
జవాబు:
జపాన్ సహకారం ఉంది.
4. ‘ఆజాద్ హింద్’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
స్వతంత్ర్య భారతం అని అర్థం.
5. కోహిమాలో భారత జెండాను ఎప్పుడు ఎగురవేశారు?
జవాబు:
1944 మార్చిలోనే ఎగురవేశారు.
ప్రశ్న 7.
భగత్ సింగ్ జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు సేకరించి ఒక వ్యాసం రాయుము.
జవాబు:
భగత్ సింగ్ : జననం: 28-9-1907, మరణం : 23-3-1931
భగత్ సింగ్ భారతదేశంలో జాతీయవాది, తిరుగుబాటుదారుడు, విప్లవవాది. ఈయనను షహీద్ అని పిలిచేవారు. ఈయన ఐరోపా విప్లవాలను చదివి ప్రభావితుడైనాడు.
లాలాలజపతిరాయను చంపినందుకు ప్రతీకారంగా బ్రిటిషు పోలీసు అధికారి ‘శాండర్’ ను కాల్చి చంపాడు. తన స్నేహితుడైన భటుకేశ్వర్‌తో కలిసి కేంద్ర విధానసభలో రెండు బాంబులను, కరపత్రాలను జారవిడిచాడు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదాన్ని అరచి చెప్పాడు.
తరువాత కోర్టులో తమ వారిని విడిపించడానికి తనే స్వచ్చందంగా అరెస్టు అయ్యాడు. ఈ సమయంలో జైలుకెళ్ళి అక్కడ 116 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఈ సమయంలో షహీదకు భగత్ సింగ్ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. కాని కోర్టు వారికి మరణశిక్ష విధించింది. దానిని కూడా 23 సం||రాల వయస్సులో నవ్వుతూ భరించాడు.
ప్రశ్న 8.
ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబు లిమ్ము.
రెండవ ప్రపంచ యుద్ధం (1939 – 1945) హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ ప్రపంచమంతటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా, ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యాలతో అమెరికా చేతులు కలిపింది. (వీటిని మిత్ర కూటమి అంటారు). జర్మనీకి జపాన్, ఇటలీ దేశాలు మద్దతు ఇచ్చాయి. మానవ చరిత్రలోనే అతి దారుణమైన ఈ యుద్ధం 1939లో మొదలయ్యి 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ ని చేజిక్కించుకోవటంతో, జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ముగిసింది. ప్రజాస్వామ్యం, స్వేచ్చల పక్షాన ఉన్న ప్రజలందరూ హిట్లరిని వ్యతిరేకించి మిత్ర కూటమికి మద్దతు పలికారు. అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుండటంతో భారతీయులలో ఇది సందిగ్ధతలను నెలకొల్పింది. |
1. హిట్లర్ పార్టీ పేరు?
జవాబు:
నాజీ పార్టీ.
2. మిత్ర కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైన దేశాలు.
3. ఇటలీ మద్దతు ఎవరికుంది?
జవాబు:
ఇటలీ మద్దతు జర్మనీకి ఉంది.
4. జపాన్లో అణుబాంబులు పదిన నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకీలు.
5. హిట్లర్ ప్రజాస్వామ్యవాదా లేక నిరంకుశుడా?
జవాబు:
హిట్లర్ నిరంకుశుడు.
ప్రశ్న 9.
భారతదేశంలో 1906 నాటి నుండి బయలుదేరిన హిందూ-ముస్లిం భేదభావాలు విభజన జరిగాక సమసిపోయాయా? నీ సమాధానానికి కారణాలు రాయండి.
జవాబు:
భారతదేశం విభజనకు గురి అయినా, ఈ భేదభావాలు సమసిపోలేదు అని నా అభిప్రాయం.
కాశ్మీరు ఆక్రమణ, కార్గిల్ యుద్ధం, పార్లమెంట్ పై దాడి, ముంబయిపై దాడులు, హైదరాబాదులోని లుంబినీ పార్కు గోకుల్ ఛాట్, దిల్‌షుఖ్ నగర్ పై దాడులు ఈ విషయాన్ని ఋజువు చేస్తున్నాయి.
ప్రశ్న 10.
రెండవ ప్రపంచ యుద్ధం భారతీయులలో ఎందుకు సందిగ్ధత నెలకొల్పింది?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రకూటమి, మిత్రరాజ్యాలు అని ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి యుద్ధం చేశాయి. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛనీ బలపరిచే ప్రజలందరూ హిట్లర్ ను వ్యతిరేకించి మిత్రకూటమికి మద్దతు పలికారు. అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుండటంతో భారతీయులు సందిగ్ధంలో పడ్డారు.
ప్రశ్న 11.
మతతత్వం, లౌకికవాదంలోని సున్నితమైన అంశాలను వివరించండి.
జవాబు:
అందరి ప్రయోజనాల గురించి కాక ఒక ప్రత్యేక మతస్తుల ప్రయోజనాలను మతతత్వం ప్రోత్సహిస్తుంది. ఆ మతస్తుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని నడపాలని అది నమ్ముతుంది. ఇందుకు విరుద్ధంగా చిన్న సమూహాలకంటే జాతి పెద్దదని, ఏ మతమూ లేనివాళ్ళతో సహా అందరి ప్రయోజనాలను జాతీయతావాదం కోరుకుంటుంది. ఈ దృక్పథాన్ని “లౌకిక” దృక్పథం అంటారు. మతసంబంధ వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోగూడదు. అలాగే ప్రభుత్వంలో మతాలు జోక్యం చేసుకోగూడదని ఇది భావిస్తుంది. ఏ ఒక్క మతానికో ప్రాధాన్యతను ఇవ్వకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి. ఈ విధంగా లౌకిక దృక్పథం, మతతత్వం విరుద్ధ అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మతతత్వం ఒక ప్రత్యేక మత ప్రయోజనాల కోసం పాటుపడుతుంది. ఆ మతం అవసరాల , ప్రకారం ప్రభుత్వం కూడా నడుచుకోవాలని కోరుతుంది.
ప్రశ్న 12.
సుభాష్ చంద్రబోస్, భారత జాతీయ సైన్యం గురించి రాయండి.
జవాబు:
సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. అతడు రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని’ (ఐఎన్ఏ) ఏర్పాటు చేశాడు. ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ పోరాటంలో జపాన్ అతడికి సహాయం చేసింది. 1943 అక్టోబరు 21న సింగపూర్‌లో స్వతంత్ర భారత (ఆజాద్ హింద్) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి’ నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది.
1944 మార్చిలోనే కోహిమాలో భారత జెండాను ఎగరవేశారు. అయితే యుద్ధ పరిస్థితులు మారి 1944-45 శీతాకాలంలో బ్రిటన్ ప్రతిఘటనకు దిగటంతో రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాన్ ఓడిపోవటంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ నుంచి టోక్యో 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు.
ప్రశ్న 13.
బ్రిటిషువారు భారతదేశంను వదలిపోవటానికి విప్లవవాదులు, వారి యుగం సహకరించింది. వివరించండి.
జవాబు:
1940ల తరువాత కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, కిసాన్ సభ, దళిత సంఘాల వంటి విప్లవవాద సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇవి పేదలు, సన్నకారురైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులను సమీకరించి బ్రిటిషు పాలన పైనే కాకుండా వడ్డీ వ్యాపారస్తులు, కర్మాగార యజమానులు, ఉన్నతకుల భూస్వాములు వంటి స్థానిక దోపిడీదారులకు వ్యతిరేకంగా సంఘటిత పరచసాగారు. నూతన స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల ప్రయోజనాలకు సరైన చోటు కల్పించాలని, తరతరాల వాళ్ల కష్టాలు అంతం కావాలని, సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఈ సంస్థలు కోరుకున్నాయి. అప్పటివరకు ధనిక వర్గాలు అధికంగా ఉన్న స్వాతంత్ర్యోద్యమం వీళ్ల చేరికతో కొత్త కోణాన్ని, శక్తినీ సంతరించుకుంది. బ్రిటిషు పాలకులు అంతిమంగా దేశం వదిలి వెళ్లటానికి ఇది. సహకరించింది.
ప్రశ్న 14.
సుభాష్ చంద్రబోస్ ఎవరు?
జవాబు:
ఆయన స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది.
ప్రశ్న 15.
‘ఆజాద్ హింద్’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
స్వతంత్ర భారతం అని అర్ధం.
ప్రశ్న 16.
మిత్ర కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైన దేశాలు.
ప్రశ్న 17.
జపాన్లో అణుబాంబులు పడిన నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకీలు.