SCERT AP 8th Class Social Study Material Pdf 17th Lesson పేదరికం – అవగాహన Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 17th Lesson పేదరికం – అవగాహన
8th Class Social Studies 17th Lesson పేదరికం – అవగాహన Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
తీవ్రమైన ఆకలిగా పేదరికం అన్న నేపథ్యంలో కింద వాక్యాలలో సరైనవి ఏవి? (AS1)
అ) రోజుకి ఒకసారే ఆహారం తీసుకోవటం
ఆ) అవసరమైనన్ని కాలరీల కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం
ఇ) నాగలితో దున్నే వ్యక్తికీ, వరికోత యంత్రం నడిపే వ్యక్తికీ ఒకే మోతాదులో కాలరీలు ఉన్న ఆహారం అవసరం.
ఈ) దుకాణదారుడు కంటే పొలం దున్నే వ్యక్తికి ఎక్కువ కాలరీలు కావాలి.
ఉ) ఆకలితో ఉన్న కారణంగా వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
జవాబు:
సరియైనవి
అ) రోజుకి ఒకసారే ఆహారం తీసుకోవటం
ఆ) అవసరమైన కాలరీల కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం
ఈ)దుకాణదారుడి కంటే పొలం దున్నే వ్యక్తికి ఎక్కువ కాలరీలు కావాలి.
ఉ) ఆకలితో ఉన్న కారణంగా వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
ప్రశ్న 2.
ఈ అధ్యాయంలో పేదరికానికి పేర్కొన్న ప్రధాన కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
‘పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకపోవటంగా ఈ అధ్యాయంలో పేర్కొనబడింది.
ప్రశ్న 3.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి పథకాలలోని ప్రధానమైన అంశాలు ఏమిటి? పేదరికంలోని ఏ అంశాలను అవి పరిష్కరించటానికి పూనుకుంటున్నాయి? చౌకధరల దుకాణాలు ఎందుకు అవసరం? (AS4)
(లేదా)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది? వివరించండి.
జవాబు:
ప్రధానమైన అంశాలు :
1) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం :
ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి, పని అడిగిన పెద్దవాళ్ల (18 సం||లు నిండిన)కు ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీ చెల్లించాలి.
- నీటి నిల్వ, సంరక్షణ
- కరవుకు తట్టుకునే పనులు (అడవుల వృద్ధి, చెట్ల పెంపకం)
- షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు కల్పించటం
- చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ
ii) ప్రజా పంపిణీ వ్యవస్థ :
చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయటాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (Public Distribution System (PDS)) అంటారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పట్టణ, పల్లె ప్రజలందరికీ ఆహార ధాన్యాలను చేర్చటంలో ఇది కీలకపాత్ర వహించింది. దీని పనితీరులో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ దుకాణాలను సమయానికి, లేదా క్రమం తప్పకుండా తెరవరు. ఎవరూ కొనగూడదన్న ఉద్దేశంతో ఆహార ధాన్యాలను కలీ చేసే సందర్భాలు ఉన్నాయి. ప్రజలకి కాకుండా ఇతర దుకాణాలకు సరుకులు అమ్మే చౌకధరల దుకాణాదారులు ఉన్నారు. దీంతో పేద ప్రజలతో సహా చాలామందికి ఆహారధాన్యాలు అందవు. భారతదేశంలోని పేదరాష్ట్రాలు, పేద ప్రాంతాలలో సాధారణంగా వీటి పనితీరు ఆశించిన మేరకు లేదు.
- ఉపాధిని కల్పించడం, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సరసమైన ధరలలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం అనే అంశాలను పరిష్కరించడానికి పూనుకున్నాయి.
- నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువగా ఉంటే ఉపాధి, ఆదాయాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి మౌలిక అవసరాలను ప్రభుత్వం చౌకగా అందిస్తుంది. వీటికోసం చౌకధరల దుకాణాలు అవసరం.
ప్రశ్న 4.
ఉపాధి లేని ప్రజలకే భూమి, పశువులు, దుకాణాలు వంటి ఆస్తులు సాధారణంగా ఉండవు. ఎందుకు? (AS1)
జవాబు:
ఉపాధిలేని వారికి సంపాదన ఉండదు. వారి నిత్యావసర ఖర్చులకే డబ్బులు సరిపోవు. యింక మిగులు సొమ్ములకు అవకాశం ఉండదు. పొదుపు చేయలేనివారు ఆస్తులను సమకూర్చుకోలేరు. కాబట్టి వీరికి సాధారణంగా ఆస్తులు ఉండవు.
ప్రశ్న 5.
పేజి నెం. 202 లో “జీవించే హక్కు కోసం పోరాటం” శీర్షికలోని మొదటి రెండు పేరాలు చదివి వ్యాఖ్యానించండి. (AS2)
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కొత్త విధానంపై ఎంతో చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అయిదు మందిలో నలుగురు అవసరమైన కనీస కాలరీల కంటే తక్కువ ఇచ్చే ఆహారం తీసుకుంటున్నారని మనకు తెలుసు. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పది కుటుంబాలలో మూడు కుటుంబాలకు కూడా అంత్యోదయ, BPL కార్డులు లేవు. అంటే అంతకుముందు ప్రజా పంపిణీ వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు ఇప్పుడు పొందటం లేదు. భూమిలేని కూలీల కుటుంబాలలో చాలా వాటికి BPL కార్డులు లేవు. ఇందుకు విరుద్ధంగా కొన్ని సంపన్న కుటుంబాలకు BPL కార్డులు ఉన్నాయన్న వార్తలొచ్చాయి.
ఈ కొత్త ప్రజా పంపిణీ వ్యవస్థ విధానంలో ఇతర వైరుధ్యాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం వద్ద రైతుల దగ్గర నుంచి కొన్న) ఆహారధాన్యాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ ఆహారధాన్యాలను ఎలుకలు తినేసిన, కుళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. చౌకధరల దుకాణాలు సరసమైన ధరలకు ఆహారధాన్యాలను BPL, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్న వాళ్ళకే అమ్ముతారు. కాబట్టి అక్కడ కూడా ఆహారధాన్యాలు నిల్వ ఉండిపోతాయి. ఇంకోవైపున అందరి ఆకలి తీర్చలేకపోతున్నామనే భావన కూడా ఉంది.
జవాబు:
జీవించే హక్కు అనేది ప్రజలు ఇంకా ఓ హక్కుగా భావించటంలేదు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం “ఆహార భద్రత బిల్లు”ను పార్లమెంటులో ఆమోదించడం, ఇవి చట్టం కావడంతో ప్రజలు ఈ దిశగా ఇప్పుడిప్పుడే ఆలోచించడం ప్రారంభించారు.
ప్రశ్న 6.
మీ గ్రామంలో PDS పథకం నిర్వహణపై జిల్లా కలెక్టర్ కు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:
జిల్లా కలెక్టర్ కరీంనగర్ వారికి కరీంనగర్ జిల్లా, కొత్తపల్లికి చెందిన 8వ తరగతి విద్యార్థి నమస్కరించి వ్రాయులేఖ.అయ్యా! మా ప్రాంతంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయుచున్న నిత్యావసరాలు కొలతలలో తేడాలు వస్తున్నాయి. నెలలో రెండు, మూడు రోజులు మాత్రం దీనిని తెరిచి ఉంచుతున్నారు. దీనితో బీదవారు సరకులను తీసుకోలేకపోతున్నారు. కావున, మీరు ఈ అంశాలను దర్యాప్తు చేసి న్యాయం చేయగలరు. మీ |
8th Class Social Studies 17th Lesson పేదరికం – అవగాహన InText Questions and Answers
8th Class Social Textbook Page No.193
ప్రశ్న 1.
చంద్రయ్య, రామాచారి జీవితాలలో పోలికలను చర్చించండి.
జవాబు:
- చంద్రయ్య, రామాచారి ఇరువురూ పేదవారు.
- ఇరువురూ ఆకలితో అలమటించేవారే.
- ఇరువురి భార్యలు పనిరీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు.
- ఇరువురికీ ఒంట్లో ఆరోగ్యం తగ్గిపోయింది.
- ఇద్దరూ వయస్సుకి మించి ముసలివారుగా కనిపించేవారు.
ప్రశ్న 2.
రామాచారి జీవనోపాధి గ్రామంలోని వ్యవసాయంతో ఏ విధంగా ముడిపడి ఉంది?
జవాబు:
కొన్ని సంవత్సరాల క్రితం వరకు రామాచారి వద్ద పని చేయించుకోటానికి 40 మంది దాకా వచ్చేవాళ్లు. వాళ్ళల్లో ఎక్కువమంది రైతులు. అతడు చేసిన పనులకు రైతులు ధాన్యం రూపంలో చెల్లించేవాళ్లు. ఒక్కొక్కళ్లు సంవత్సరానికి 70 కిలోల ధాన్యం ఇచ్చేవాళ్లు. అలా వచ్చిన 2800 కిలోల ధాన్యంలో కుటుంబానికి కావలసినంత ఉంచుకుని, మిగిలినది. మార్కెట్టులో అమ్మేవాడు. 70 కిలోల ధాన్యం 375 రూపాయలకు అమ్మేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ విధంగా కుటుంబానికి సరిపడా బియ్యంతోపాటు సంవత్సరానికి 8000 రూపాయలు పొందేవాడు. దీనితోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకొచ్చేవాడు.
ఈ విధంగా రామాచారి జీవనోపాధి గ్రామంలోని వ్యవసాయంతో ముడిపడి ఉంది.
ప్రశ్న 3.
రామాచారి కుటుంబం కష్టాలు ఎదుర్కోటానికి కారణం :
అ) రామాచారి సరైన ప్రయత్నాలు చేయకపోవటం, తగిన అవగాహన లేకపోవటం, లేక
ఆ) గ్రామంలో జీవనోపాధుల పరిస్థితి.
జవాబు:
గ్రామంలో జీవనోపాధుల పరిస్థితి.
ప్రశ్న 4.
రామాచారి కుటుంబానికి రోజూ రెండు పూటలా భోజనం లభించాలంటే ఏం చేయాలి? ఆలోచించండి.
జవాబు:
రామాచారి కూడా భార్యతో పాటు పట్టణానికి వలస వెళ్ళి కూలీనాలీ చేయాలి. అపుడే అతని కుటుంబానికి రెండు పూటలా భోజనం లభిస్తుంది.
ప్రశ్న 5.
రామాచారి గ్రామంలోని రైతులకు మధ్య మార్పిడి/లావాదేవీని ఎలా వర్ణిస్తావు?
జవాబు:
రామాచారి పనికీ, గ్రామంలోని రైతులకు మధ్య మార్పిడి/లావాదేవీని నేను ఈ విధంగా వర్ణిస్తాను. “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు”.
ప్రశ్న 6.
సాధారణంగా సంవత్సరానికి రామాచారి తన కుటుంబ అవసరాలకు ఎన్ని కిలోల ధాన్యం ఉంచుకునేవాడు?
జవాబు:
రామాచారి సాధారణంగా, సంవత్సరానికి దాదాపు 1300 కిలోల ధాన్యాన్ని ఉంచుకొనేవాడు.
ప్రశ్న 7.
(ఆహార ధాన్యాలు కాకుండా) కుటుంబ ఖర్చులకు సంవత్సరానికి 8000 రూపాయలు సరిపోతాయా?
జవాబు:
సం||రానికి రూ॥ 8000/-లు అంటే సుమారు నెలకు 667/-లు ఇవి కచ్చితంగా వారికి సరిపోవు.
ప్రశ్న 8.
ప్రక్క పట్టణ దృశ్యంలో జీవన విధానాలలో తేడా గురించి చర్చించండి.
జవాబు:
తేడాలు
భవంతులలోని వారు | డేరాలలోని వారు |
1. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. | 1. వీరు దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. |
2. వారు ధనికులు. | 2. వీరు కటిక పేదవారు. |
3. వీరికి చక్కటి సౌకర్యాలు ఉంటాయి. | 3. వీరికి కనీస సౌకర్యాలు కూడా ఉండవు. |
8th Class Social Textbook Page No.194
ప్రశ్న 9.
దేశంలో అత్యంత సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకి ఎన్ని కాలరీలను తీసుకుంటున్నారు?
జవాబు:
దేశంలో అత్యంత సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు 2521 కి॥ కాలరీలను తీసుకుంటున్నారు.
ప్రశ్న 10.
దేశంలో అత్యంత పేదలైన 25% ప్రజలు రోజూ తీసుకోవాల్సిన కాలరీల కంటే సగటున వాళ్లు తీసుకుంటున్న కాలరీలు ఎంత శాతం తక్కువ?
జవాబు:
దేశంలో అత్యంత పేదలైన 25% ప్రజలు రోజూ తీసుకోవలసిన కాలరీల కంటే సగటున 23% కాలరీలు తక్కువ తీసుకుంటున్నారు.
ప్రశ్న 11.
పేద ప్రజలు చాలా తక్కువ కాలరీలు తీసుకోవానికి గల కారణాలు ఏవి?
జవాబు:
పేద ప్రజల కొనుగోలు శక్తి తక్కువ. ఎక్కువ కాలరీలు ఉన్న ఖరీదైన పదార్థాలు కొనలేరు, తినలేరు, తిని పని చేయలేరు. కాబట్టి కడుపు నిండే ఆహార పదార్థాలు మాత్రమే తినగలుగుతారు.
ఉదా :
అన్నం, పచ్చడి లేదా అన్నం, కూర లేదా అన్నం, సాంబారు. కాబట్టి వారు చాలా తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.
8th Class Social Textbook Page No.196
ప్రశ్న 12.
వ్యక్తి ఆర్ధిక స్థాయికీ, వాళ్ళ పోషకాహార స్థాయికీ మధ్య ఏమైనా సంబంధం కనబడుతోందా?
జవాబు:
కనబడుతోంది. వ్యక్తి ఆర్ధిక స్థాయి బాగుంటే పోషకాహార స్థాయి బాగుంటుంది. వ్యక్తి ఆర్థిక స్థాయి తక్కువగా ఉంటే పోషకాహార స్థాయి తక్కువగా ఉంటుంది.
8th Class Social Textbook Page No.197
ప్రశ్న 13.
కృత్యం :
పెద్దవాళ్లు పోషకాహారలోపానికి గురైనదీ, లేనిదీ తెలుసుకోవాలంటే పోషకాహార శాస్త్రజ్ఞులు చెప్పే శరీర పదార్థ సూచిక (Body Mass Index) లెక్కకట్టాలి. దీనిని లెక్కకట్టడం తేలిక. వ్యక్తి బరువు ఎంతో కిలోల్లో తీసుకోండి. ఆ వ్యక్తి ఎత్తును మీటర్లలో తీసుకోండి. బరువును ఎత్తు వర్గంతో భాగించాలి. ఫలితంగా వచ్చిన సంఖ్య 18.5 కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తి పోషకాహార లోపానికి గురైనట్టు. శరీర పదార్థ సూచిక 25 కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తిది ఊబకాయం అన్నట్లు. ఈ నియమం ఎదుగుతున్న పిల్లలకు వర్తించదని గుర్తుంచుకోండి. భిన్న ఆర్థిక నేపథ్యాలకు చెందిన (ఉదాహరణకు శ్రామికులు, పనివాళ్లు, వ్యాపారస్తులు) ముగ్గురు పెద్దవాళ్ల బరువు, ఎత్తు ప్రతి ఒక్క విద్యార్థి సేకరించండి. అందరు విద్యార్థులు తెచ్చిన వివరాలను ఒకరు పట్టికలో పొందుపరచండి. శరీర పదార్థ సూచిక (BMI) లెక్కకట్టండి.
జవాబు:
8th Class Social Textbook Page No.199
ప్రశ్న 14.
‘నగదు బదిలీ పథకం’ ప్రజా పంపిణీ పథకానికి సరైన ప్రత్యామ్నాయమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
‘నగదు బదిలీ పథకం’ ప్రజాపంపిణీ పథకానికి సరైన ప్రత్యామ్నాయం కాదు అని నా భావన.
కారణం :
PDSల ద్వారా ప్రభుత్వం పేదలకు కిలో రూ|| 1/- కి బియ్యం అందిస్తోంది. దానిపై ప్రభుత్వం యిచ్చే సబ్సిడీ రూ|| 19/- లు. ఈ మొత్తం రూ|| 20/- లు ప్రభుత్వం నగదు బదిలీ పథకం క్రింద లదారులకు పంపిణీ చేస్తోంది. వీటితో వారు బయట దుకాణాలలో బియ్యం కొనుక్కుని తినాలి. కానీ బియ్యం రేట్లు పెరిగి రూ|| 40/- లు, రూ॥ 50/- లు అయినపుడు వారికి ఈ ధరకి బియ్యం దొరకవు. అప్పుడు వారికి ఆహార భద్రత కొరవడుతుంది.
కాబట్టి ఇది సరైన ప్రత్యామ్నాయం కాదు.
8th Class Social Textbook Page No.201
ప్రశ్న 15.
కొత్త విధానం వల్ల పేదవాళ్లకు మేలు జరుగుతుందా? మీ సమాధానానికి కారణాలు యివ్వండి.
జవాబు:
ఈ కొత్త విధానం వల్ల పేదవాళ్ళకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని మోసం చేసి తెల్లకార్డులు సంపాదించిన వారందరి నుండి అవి వెనుకకు తీసుకోబడతాయి. కేవలం పేదవారికి, అట్టడుగువారికి మాత్రమే ఈ దుకాణాల ద్వారా సరుకులు అందుతాయి.
ప్రశ్న 16.
ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి మరికొన్ని సూచనలు చేయండి.
జవాబు:
కొన్ని సూచనలు:
- నిజమైన లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగాలి.
- BPL వారితోపాటు మధ్యతరగతి వర్గాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
- ఈ దుకాణాలలో దొరికే సరుకులను సరియైన తూకంతో యివ్వాలి.
- ఈ దుకాణాలకు నాణ్యమైన సరుకును సరఫరా చేయాలి.
- డీలర్ల ఎంపిక సక్రమమైన పద్ధతులలో జరగాలి.
8th Class Social Textbook Page No.202
ప్రశ్న 17.
రేషను దుకాణాలను చౌకధరల దుకాణాలని కూడా అంటారు. ఎందుకో తెలుసా?
జవాబు:
రేషను దుకాణాలలో దొరికే సరుకులన్నీ బయట మార్కెట్టు ధరకన్నా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి వీటిని చౌకధరల దుకాణాలని కూడా అంటారు.
ప్రశ్న 18.
“పేదరికం ఎందుకు ఉంది? దాన్ని ఎలా నిర్మూలించవచ్చు” అనే శీర్షిక కింద పేరాను చదివి ఈ ప్రశ్నకు సమాధానం రాయండి.
పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకకపోవటం అని మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఉపాధి అవకాశాలు లేకపోతే మౌలిక అవసరాలు తీర్చుకునే ప్రజల కొనుగోలు శక్తి (ఆదాయం ) తగ్గుతుంది. కనీస . కొనుగోలు శక్తి లేనప్పుడు వాళ్లు తీవ్ర ఆకలికి గురవుతారు.
పేదరికానికి గల ఇతర కారణాలు ఏవి?
జవాబు:
పేదరికానికి గల ఇతర కారణాలు :
- కుటుంబంలో వ్యక్తులు ఎక్కువగా ఉండటం.
- ఒక్కరే పనిచేసి, ఎక్కువమంది కూర్చొని తినాల్సి రావటం.
- సామర్థ్యానికి తగిన అవకాశాలు రాకపోవటం.
- వేతన కూలీ రేట్లు చాలా తక్కువగా ఉండటం మొ||నవి.
ప్రశ్న 19.
క్రింది గ్రాఫుని చూసి, ప్రశ్నలకు జవాబు లిమ్ము.
1) ఎవరు ఎక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
ధనికులు.
2) ధనికులకు రెండవ పాతిక శాతానికి మధ్యన గల కాలరీల తేడా ఎంత?
జవాబు:
621 కాలరీలు.
3) ఎవరు అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
అట్టడుగువారు.
4) ఈ చిత్రాన్ని బట్టి నీకు ఏమి అర్థం అయింది?
జవాబు:
ఆర్థికస్థాయి, ఆహార స్థాయిని నిర్దేశిస్తుంది.
ప్రశ్న 20.
వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయంపై ఆధారపడిన వారికి మద్దతుగా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఈ కింద ఉన్నాయి. ప్రతిదాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. అది ఎందుకు ముఖ్యమో తెలియచేయండి. మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
1. రైతులు వ్యాపారస్తులు/దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలి. ఇవి నాణ్యతగా ఉండేటట్టు, సరసమైన ధరలకు దొరికేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
జవాబు:
రైతులు వ్యవసాయంపై సంపాదించినదే తక్కువగా ఉంటుంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందకపోతే వారు యిబ్బందుల పాలవుతారు. దళారీల దగ్గర ఎక్కువ ధరలకు కొనలేరు. ఇందులో ఏవి లేకపోయినా వారు పెట్టుబడి మొత్తాన్ని నష్టపోతారు.
ఉదా :
ఇటీవలే కొన్ని జిల్లాల్లో ప్రత్తి విత్తనాలు నాసిరకం యివ్వడం మూలంగా ప్రత్తి రైతులు కోలుకోలేనంతగా దెబ్బ తిన్నారు.
2. చిన్నతరహా సాగునీటి పథకాలు.
జవాబు:
భారతదేశంలో వ్యవసాయం వర్షాధారం, ఇవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు. వాటి మీద ఆధారపడితే రైతు పరిస్థితి దీనస్థితి.
ఉదా :
గతంలో ఒకసారి వర్మాలు లేవని రైతులు నారు పోయలేదు. జులై నెలలో విపరీతంగా వర్షాలు పడి వాగులు, వంకలు నిండిపోయాయి. అపుడు వారు ఎక్కువ ధరకు నారు కొని తెచ్చి నాట్లు వేశారు. చేను ఏపుగా ఎదిగి మంచిగా పండింది. నవంబర్‌లో తుఫాను వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేసేసింది. ఆ కాబట్టి చిన్న తరహా సాగు నీటి పథకాలు ఉండాలి.
3. న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకు ద్వారా రుణాలు.
జవాబు:
న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకులు ఋణాలివ్వకపోతే రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళతారు. హెచ్చువడ్డీలు వారికి చెల్లించాల్సి వస్తుంది. రైతులు అప్పుల పాలయిపోతారు.
4. ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరికేలా మార్కెటింగు సౌకర్యాలు.
జవాబు:
ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరకాలి. లేదంటే వారికి ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అవుతుంది. అందుకే ప్రభుత్వంవారు కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నారు.
5. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచటం.
జవాబు:
రోడ్డు, రవాణా సౌకర్యాలు లేకుంటే పండిన పంటను గ్రామం నుండి మార్కెట్టుకు చేర్చడం కష్టమవుతుంది. కొన్ని పంటలు త్వరగా పాడయిపోయేవి ఉంటాయి. అవి ఎందుకూ పనికి రాకుండా అయిపోతాయి.
ఉదా :
గతంలో ఒకసారి లారీల స్వంతదారులు సమ్మె చేశారు. ఆ సమయంలో చెరకు పంట. కోసి ఫ్యాక్టరీకి పంపడం కొంతమంది రైతులకు వీలవలేదు. ఆలస్యమయ్యేసరికి చెరుకు ఎండిపోయి దాని విలువను కోల్పోయింది. రైతులు పూర్తిగా నష్టపోయారు.
6. పంటలు నష్టపోయినప్పుడు రైతులకు సహాయం అందించటం.
జవాబు:
పంటలు నష్టపోయినపుడు బ్యాంకువారు, తరువాత పంటకి అప్పులివ్వటం, కొంత వడ్డీని మాఫీ చేయడం లాంటివి చేయాలి. లేదంటే రైతులు ఉన్న అప్పును తీర్చలేరు, మళ్ళీ పంటని పండించలేరు. ఈనాడు ఆత్మహత్యలు చేసుకునే రైతులంతా ఈ బాపతువారే.
ప్రశ్న 21.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానము లిమ్ము.
ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి, పని అడిగిన పెద్దవాళ్ల (18 సం||లు నిండిన)కు ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీ చెల్లించాలి.
- నీటి నిల్వ, సంరక్షణ
- కరవుకు తట్టుకునే పనులు (అడవుల వృద్ధి, చెట్ల పెంపకం)
- షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు కల్పించటం
- చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ
1. మీ ఉపాధ్యాయుల సహాయంతో పైన ఇచ్చిన పనులు ఏమి సూచిస్తాయో తెలుసుకోండి.
జవాబు:
పైన యిచ్చిన పనులు వ్యవసాయావసరాలను తీరుస్తాయి. గ్రామాలు వాటి వనరులను అవే సమకూర్చుకునేలా చేస్తాయి. ఈ పనులు గ్రామాభివృద్ధిని సూచిస్తాయి.
2. మీ ఊరు/పట్టణానికి దగ్గరలో ఉపాధి హామీ చట్టం కింద జరుగుతున్న పని స్థలాన్ని సందర్శించండి. అక్కడ వాళ్లతో మాట్లాడి దాని గురించి రాయండి.
జవాబు:
మా ఊరు కోరుట్లలో ఉపాధి హామీ చట్టం క్రింద కాలువగట్లు బాగు చేస్తున్నారు. అలాగే రహదారులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. చెరువులో పూడిక తీస్తున్నారు. దీనిమూలంగా ఇక్కడి పనివారికి వేసవికాలంలో అంటే పనులు లేని కాలంలో కూడా కూలీ పనులు లభిస్తున్నాయి అని సంబరపడుతున్నారు.
3. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతను ఇస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం కొంత సొమ్మును రిజర్వు చేసి ఉంచుతుంది. చాలా సం||రాల నుండి ఈ సొమ్ము వాడక నిల్వ ఉండిపోయింది. కాబట్టి వీటిని వెంటనే వారికి సాగునీరు, తాగునీరు అందించటానికి ఉపయోగిస్తున్నారు. దీనివలన వారు స్వయం సమృద్ధిని సాధించుకోగలుగుతారు.
4. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధుల రక్షణలో ఉపాధి హామీ చట్టాన్ని ఒక పెద్ద ముందడుగుగా ఎందుకు పేర్కొంటున్నారు?
జవాబు:
ఈ చట్టం లేని రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు వారి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. వారి కుటుంబాలు అల్లల్లాడేవి. ఈ చట్టం మూలంగా వారికి సం||రానికి 150 రోజులు పని దొరకటమే కాక గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఇది ఒక పెద్ద ముందడుగుగా పేర్కొనబడింది.
ప్రశ్న 22.
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానము లిమ్ము.
అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేశారు. వాళ్లకంటే పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ పేదవాళ్లుగా పరిగణించబడే వాళ్లకు (BPL) (తెల్ల) కార్డులు ఇచ్చారు. మిగిలిన వాళ్లకి ఎపిఎల్ (గులాబీ) కార్డులు ఇచ్చారు.
ఒక్కొక్కరికి చౌకధరల దుకాణం నుంచి లభించే సరుకుల మొత్తం, వాటి ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకి నెలకి కుటుంబానికి 35 కిలోల ఆహారధాన్యాలు (బియ్యం, గోధుమ) ఇస్తారు. BPL కారు ఉన్నవాళ్లకి తెలంగాణలో ప్రతి వ్యక్తికీ నెలకి 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ఆహారధాన్యాలు ఇస్తారు. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి, వయసుమళ్లిన అతి పేదవారికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.
1. అంత్యోదయ కార్డులు ఎవరికి జారీ చేశారు?
జవాబు:
అత్యంత పేద కుటుంబాలకు.
2. BPL వారికి ఏ రంగు కార్డులిచ్చారు?
జవాబు:
తెల్లకార్డులు.
3. BPL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకు దిగువున అని అర్థం.
4. APL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకి ఎగువున అని అర్థం.
5. APL వారికి ఏ రంగు కార్డులు యిచ్చారు?
జవాబు:
గులాబీ రంగు కార్డులు.
ప్రశ్న 23.
షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతనిస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ నిధులు మిగిలిపోతాయి. ఈ నిధులతో త్రాగునీరు, సాగునీరు అందించడానికి ఉపయోగిస్తున్నారు.
ప్రాజెక్టు
మీ ప్రాంతంలోని చౌకధరల దుకాణాన్ని సందర్శించి ఈ దిగువ విషయాలు తెలుసుకోండి.
ప్రశ్న 1.
చౌకధరల దుకాణం ఎప్పుడు తెరిచి ఉంటుంది?
జవాబు:
చౌకధరల దుకాణం రోజూ ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు తెరచి ఉంటుంది.
ప్రశ్న 2.
చౌక ధరల దుకాణంలో ఏ సరుకులు అమ్ముతున్నారు?
జవాబు:
చౌక ధరల దుకాణంలో బియ్యం, గోధుమలు, పంచదార, చింతపండు, కందిపప్పు, పామాయిల్ మొ||నవి అమ్ముతున్నారు.
ప్రశ్న 3.
రకరకాల కార్డులు ఉన్న విధానం మీకు కనపడిందా?
జవాబు:
అవును. తెలుపు, గులాబి రంగుల కార్డులు నాకు కనబడ్డాయి.
ప్రశ్న 4.
(పేదరికంలోని కుటుంబాలకు) చౌక ధరల దుకాణాలలో బియ్యం, పంచదారల ధరలను కిరాణా దుకాణాలలో ధరలతో పోల్చండి. (కిరాణా దుకాణంలో సాధారణ రకం బియ్యం ధర అడగండి.)
జవాబు:
చౌకధరల దుకాణంలో ధరలు కిరాణా దుకాణంలో ధరలు
ప్రశ్న 5.
చిత్రం చూశారు కదా! మీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అభిప్రాయం.
మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం చక్కగా నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో తయారైన వేడి వేడి వంటకాలను వడ్డిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో రుచికరమైన ఆహారాన్ని తయారుచేయిస్తారు. భోజనానికి ముందు, తరువాత మేం చేతులు, నోటిని శుభ్రంగా కడుగుకుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన ‘మెనూ’ ప్రకారం రోజుకోరకమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే భోజనశాల ప్రత్యేకంగా లేకపోవడంతో ఆరుబయట తినవలసి వస్తోంది.