SCERT AP 8th Class Social Study Material Pdf 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 18th Lesson హక్కులు – అభివృద్ధి
8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిదిద్దండి. (AS1)
అ) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.
ఆ) పథకాల అమలును కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించేలా ప్రజలు చూడాలి.
ఇ) సమాచార అధికారులు ఇష్టం వచ్చినంత కాలం సమాచారాన్ని వెల్లడి చేయకుండా ఉండవచ్చు.
ఈ) వివిధ పత్రాలు చూడటం ద్వారా కార్యక్రమాలు అవినీతి లేకుండా జరుగుతున్నాయని గుర్తించవచ్చు.
జవాబు:
ఆ) పథకాల అమలును ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా పర్యవేక్షించాలి.
ఇ) అడిగిన సమాచారాన్ని అధికారులు నిర్దేశిత సమయంలో వెల్లడి చేయాలి.
ప్రశ్న 2.
“అవినీతిని ఎదుర్కోవడానికి సమాచారం అవసరం” శీర్షిక కింద గల పేరా చదివి దిగువ ప్రశ్నకు జవాబివ్వండి. (AS2)
ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దది, సంక్లిష్టమయినది. విధానాలు, పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా చూడటం చాలా కష్టం. పేదల ప్రయోజనాల కోసం, పేదరికం నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధరణంగా వాళ్లకు చేరవు, నిధులు మళ్లింపబడతాయి. దీనికి ప్రధాన కారణం అవినీతి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు గురించి ప్రజలకు సరైన సమాచారం లేకపోవటం అవినీతి ప్రబలటానికి ఒక ప్రధాన కారణమవుతోంది.
మీ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి నివేదికను తయారుచేయండి.
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వం వారు వికలాంగులకు, వృద్ధులకు ఫించన్లు ఇస్తున్నారు. ప్రతినెలకు వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500లు ఇస్తారు. ఈ నిధులు 2, 3 నెలలకు ఒకసారి విడుదల అవుతాయి. వీటిని స్థానిక సంస్థల ద్వారా వీరికి అందచేస్తారు.
అయితే వీటిని బట్వాడా చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అందరినీ అక్కడికి రమ్మని చెబుతారు. దాదాపు ఒక్కో ప్రదేశంలో 400, 500 మంది వరకు 2, 3 రోజులు బట్వాడా జరుగుతుంది. పాపం వృద్ధులు, వికలాంగులు అంతంత సేపు ఎండలో, వానలో వరుసలో ఉండాల్సి వస్తుంది. ఒక్క రోజు సాయంత్రం వరకూ ఉన్నా వారికి రావాల్సిన సొమ్ము అందదు. మరలా మరుసటి రోజు రావాల్సి వస్తుంది. ఇదంతా చూడటానికి మాకు ఎంతో ఇబ్బందిగా, బాధగా అనిపించింది. ప్రభుత్వం ఆలోచించి వీరి లాంటి వారికి సొమ్మును నేరుగా ఇంటికే అందచేయవచ్చుగా అనిపించింది. ఇలాంటి విషయాలలో అధికారులు, నాయకులు మానవీయ కోణంలో ఆలోచించాలని మా ప్రార్థన.
ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం (స.హ.చ) ద్వారా సాధించిన విజయాలను వార్తాపత్రికల నుండి సేకరించి మీ తరగతిలో చెప్పండి. (AS3)
జవాబు:
వార్త – 1, న్యూఢిల్లీ :
హర్యానాకు చెందిన 70 సం||ల వృద్ధురాలు లక్ష్మి సింగ్ తన కుమారుడు అనూప్ సింగ్ ను ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుంది. అనూప్ సింగ్ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. అతను మరణించిన తరువాత అతని భార్యకు ఫించను ఇచ్చారు. కాని ఆమె కొద్ది సం||ల తరువాత ద్వితీయ వివాహం చేసుకుంది. లక్ష్మి దిక్కులేనిదయింది. అప్పుడు ఆమె స.హ. చట్టం ద్వారా పిటీషను పెట్టుకోగా ప్రభుత్వం వారు ఫించను మార్చి ఆమెకు ఇచ్చారు.
వార్త -2:
క్షేత్రమణి భువనేశ్వర్ లో ఒక చిన్న స్థలం కొనుక్కుంది. అమ్మకందారు, ఆమె రిజిష్ట్రార్ ఆఫీసులో రిజిష్టరు చేసుకున్నారు. కాని అక్కడి గుమాస్తా 1½ సం||రం అయినా ఆమెకు డాక్యుమెంట్లు ఇవ్వలేదు. దానితో స.హ. చట్టం ఆఫీసును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఇచ్చిన కొద్ది సేపటికే ఆమె కాగితాలు ఆమెకు తెచ్చి ఇచ్చాడు ఆ గుమాస్తా.
వార్త -3:
లక్నోలో నివసిస్తున్న ఆషియానా 13 సం||ల బాలిక. మే 2005లో ఆమె ఆరుగురుచే సామూహిక అత్యాచారానికి గురి అయింది. అయితే అందులో ప్రథమ నిందితుడు తాను మైనరనని సాక్ష్యాలు చూపించి జువెనైల్ కోర్టుకు కేసును మరల్చాడు.
ఆషియానా తండ్రి స.హ. చట్టం ద్వారా అతని డ్రైవింగ్ లైసెన్సును, తుపాకీ లైసెన్సును పొందిన వివరాలను సేకరించి వాటిని కోర్టుకు సమర్పించాడు. అప్పుడు కోర్టు అతనిని ‘ఆ సంఘటన జరిగినప్పుడు అతను మేజరే’ అని తేల్చింది.
వార్త – 4:
‘నాకాబందీ’ సమయంలో మోటారు వాహనాలలో కూర్చుని కనబడకుండా కొంతమంది తప్పించుకుంటున్నారని స.హ. చట్టం ద్వారా అప్పీలు చేయటం మూలంగా ప్రభుత్వం ఈ క్రింది రూలు విధించింది.
మోటారు కార్ల అద్దాలకు డార్క్ ఫిల్ములుగానీ, ఏ ఇతరాలు కానీ అంటించరాదు. ఇది 4.5.2012 నుండి అమలులోనికి వచ్చింది.
ప్రశ్న 4.
విద్యాహక్కు చట్టం బాలలకు వరం వంటిది. వివరించండి: (AS1)
జవాబు:
6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ ఉచిత విద్యకు హక్కు ఉందనీ విద్యాహక్కు చట్టం తెలియచేస్తుంది. పిల్లల పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించటం, సరైన అర్హతలున్న టీచర్లను నియమించటం, అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించటం వంటి పనులను ప్రభుత్వం చేయాలి. విద్య పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని, చదువు పిల్లలను కేంద్రంగా చేసుకుని కృత్యాల ద్వారా, పరిశోధన, ఆవిష్కరణ పద్ధతుల ద్వారా సాగాలని చట్టం చెబుతోంది. పిల్లలు మాతృభాషలో చదువు నేర్చుకోవాలని, వాళ్ళు భయం, ఆందోళనలు లేకుండా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కూడా చట్టం చెబుతోంది.
పరిసర ప్రాంతాలలో పాఠశాలలు అందుబాటులో లేకపోయినా, పాఠశాలల్లో బోధనకు తగినంతమంది టీచర్లు లేకపోయినా, బోధన – అభ్యసన పరికరాలు తగినన్ని అందుబాటులో లేకపోయినా, పిల్లలను కొట్టినా, భయభ్రాంతుల్ని చేసినా అటువంటి సందర్భాలలో అధికారులపై పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు.
కాబట్టి ఇది బాలలకు వరం.
ప్రశ్న 5.
మీకు ఇంకా ఏమైనా హక్కులు అవసరమని భావిస్తున్నారా? అవి ఏమిటి? ఎందుకు? (AS4)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత ఈ హక్కులు బాధ్యతతో కూడినవి అని అర్ధం చేసుకున్నాను. నాకు ఏమి కావాలో అన్నీ నా దేశం చూసుకుంటోంది. కాబట్టి నాకు కొత్త హక్కులు అవసరం లేదు. ఉన్న హక్కులను పొందటానికి, కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను.
ప్రశ్న 6.
సమాచార హక్కు చట్టం ప్రకారం మీ పాఠశాల గురించి ప్రధానోపాధ్యాయుడిని ఏ సమాచారం అడుగుతారు? (AS4)
జవాబు:
సమాచార చట్టం హక్కు ప్రకారం పాఠశాల గూర్చి ప్రధానోపాధ్యాయునికి అడిగే సమాచారం.
- పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం యిచ్చిన నిధులెంత?
- ఆ నిధులను దేనికొరకు ఖర్చు చేసారు?
- పాఠశాల మరమ్మతులు, నిర్మాణం కోసం నిధులు వచ్చాయా? వస్తే ఎంత వచ్చాయి? వేటికొరకు ఎంత ఖర్చు చేస్తారు?
- బడిపిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు ఉచితంగా సరఫరా చేసారా?
ప్రశ్న 7.
అవినీతిని ఎదుర్కోవడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలవు? (AS6)
జవాబు:
అవినీతిని ఎదుర్కొనడంలో సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం ద్వారా ఎటువంటి సమాచారాన్నైనా పొందే హక్కు ప్రజలకు లభించింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేసిన పథకాలు, ఖర్చు, లబ్దిదారుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో వాస్తవంగా అమలుజరిగిన దానితో పోల్చడం ద్వారా అవినీతి జరిగితే తెలుసుకొని పోరాడవచ్చు.
8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి InText Questions and Answers
8th Class Social Textbook Page No.204
ప్రశ్న 1.
పేజి నెం. 204 లో ఉన్న ఉదాహరణలోని పవన్, అతడి తల్లి గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారా?
జవాబు:
ఎవరైనా సరే చట్ట, ధర్మ విరుద్ధమైన పనులు చేయకుండా జీవనం సాగిస్తే అది గౌరవప్రదమైన జీవనమే అవుతుంది. పవన్ తల్లి వేరొకరింట్లో కష్టపడి పనిచేయటం గౌరవకరమే. కానీ పవన్ గుడి దగ్గర అడుక్కోవడం మాత్రం సరియైనది కాదు అని నా భావన.
ప్రశ్న 2.
దేని ద్వారా వాళ్లకి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది?
జవాబు:
కష్టించి పనిచేసి జీవనం గడపటం ద్వారా మాత్రమే వారికి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది.
ప్రశ్న 3.
తమకు కావలసింది చేసే స్వేచ్ఛ పవన్‌కు కానీ, అతడి తల్లికి కానీ ఉందా?
జవాబు:
ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, అధికారులైనా పనిలో స్వతంత్రంగా వ్యవహరించరాదు, వ్యవహరించలేరు. అలాగే వీరు కూడా పని వ్యవహారంలో యజమానిని అనుసరించి పోవాలి. స్వంత విషయాలలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించ వచ్చు.
ఉదా :
పవన్ తల్లి ఇష్టం లేకపోతే వారింట పని మానేయవచ్చు. వేరే చోట చేరవచ్చు.
ప్రశ్న 4.
పవన్, అతడి తల్లి ఈ విధమైన జీవితం గడపటానికి ఎవరు కారణం? వాళ్ల పరిస్థితికి వాళ్లనే నిందించాలా?
జవాబు:
వీరి పరిస్థితికి తరతరాలుగా వస్తున్న వ్యవస్థ కారణం అని చెప్పాలి. సమాజంలో ధనికులు ఇంకా ధనికులుగాను, పేదవారు కటిక పేదవారుగానూ మారతారు. వీరు కూడా అంతే. భారతదేశంలో ‘కర్మ’ అని ఎవరికి వారే నిందించుకోవడం అలవాటు. అలాగే వారినే నిందించుకోవాలి లేదా వ్యవస్థ తీరును నిందించాలి.
ప్రశ్న 5.
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది?
జవాబు:
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది.
8th Class Social Textbook Page No.206
ప్రశ్న 6.
ఒక రోడ్డు లేదా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని గుత్తేదారులు ఎలా నిర్వహిస్తున్నారో చర్చించండి.
జవాబు:
ఏదైన ఒక రోడ్డు లేదా ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వ సంస్థలు లేదా పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలు ముందు గుత్తేదారుల నుండి టెండర్లు స్వీకరిస్తారు. టెండర్లలో ఆ కట్టడాన్ని వారు కోరిన విధంగా నిర్మించడానికి ఎవరు అతితక్కువ ధరని ‘కోట్’ చేస్తారో వారికి మాత్రమే కాంట్రాక్టు ఇస్తారు. పని మొదలు పెట్టిన తరువాత గుత్తేదారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి. ఏ సిమెంటు వాడారు? సిమెంటు, ఇసుక ఏ నిష్పత్తిలో కలిపారు, ఇటుక మందం ఎంత, కొలతలు మొదలైనవి అన్నింటిని ఒక పుస్తకంలో నమోదు చేసి ఉంచుతారు. ఎంతమంది కూలీలు ఎన్ని రోజులు పని చేశారు? వారి కూలిరేట్లు ఎంత? ఎంత చెల్లించారు? మొదలైనవన్నీ దీంట్లో నమోదు చేసి ఉంటాయి. నిర్మాణం తాలూకు యజమాని (ప్రభుత్వం / ప్రైవేటు సంస్థ) వీటిని చూసి, నాణ్యతను పరీక్షించి, వీరికి వాయిదాలలో సొమ్ము చెల్లిస్తారు. ప్రభుత్వం వారయితే సంబంధించిన ఇంజనీరుతో పర్యవేక్షింపచేస్తారు.
ప్రశ్న 7.
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా, జవాబుదారీతనాన్ని ఎలా పెంచవచ్చు?
జవాబు:
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా పనిచేసేవారికి, దానిని పర్యవేక్షించేవారికి కూడా కొంత భయం, తప్పనిసరి నిజాయితీ అలవడతాయి. దాని మూలంగా జవాబుదారీతనం పెరుగుతుంది.
8th Class Social Textbook Page No.208
ప్రశ్న 8.
గత సంవత్సర కాలంలో మీ ఉపాధ్యాయులకు విద్యాశాఖనుంచి వచ్చిన ఆదేశాలు, నివేదికలు, సలహాలు, లాగ్ పుస్తకాల వంటి వాటి జాబితా తయారుచేయండి. విద్యాశాఖకు అందచేయటానికి పాఠశాల ఎటువంటి రికార్డులు నిర్వహిస్తుంది? మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు ఎలా నిర్వహిస్తారు?
జవాబు:
విద్యాశాఖ నుండి ఆదేశాలు, నివేదికలు, సలహాల జాబితా :
- బడి ఈడు బాలబాలికలు పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- డ్రాపవుట్సును తిరిగి పాఠశాలకు రప్పించాలి.
- విద్యార్థులందరికీ ఉచిత యూనిఫాం, టెక్స్ట్ పుస్తకాలు అందచేయాలి.
- పదవ తరగతి విద్యార్ధులకు అదనపు తరగతులు నిర్వహించాలి.
- మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి.
- విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించాలి.
- విద్యార్థులకు Deworming మాత్రలు వేయాలి.
- విద్యార్థుల హాజరు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.
పాఠశాల నిర్వహించే రికార్డులు :
- అడ్మిషను రిజిస్టరు
- టి.సీ.ల పుస్తకం
- హాజరు పట్టీలు
- మధ్యాహ్న భోజన వివరాల రిజిస్టరు.
- జీతాల రిజిస్టరు, బిల్లులు
- విజిటర్సు రిజిస్టరు
- మార్కుల రిజిస్టరు మొదలైనవి
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు :
1. బియ్యం రిజిస్టరు
2. తేదీ
3. రోజువారీ మెనూ పుస్తకం
4. నెలవారీ లెక్కల రిజిస్టరు మొ||నవి.
ప్రశ్న 9.
రాష్ట్ర సమాచార కమిషన్ సందర్భంలో ‘స్వతంత్ర’ అన్న పదం ఎందుకు కీలకమైంది?
జవాబు:
రాష్ట్ర సమాచార కమిషన్ పాలనా యంత్రాంగానికో, కార్యనిర్వాహక వర్గానికి అనుబంధమైతే అది అవినీతిని ప్రశ్నించలేదు, అరికట్టలేదు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించలేదు. కాబట్టి అది ‘స్వతంత్రం’గానే వ్యవహరించాలి, ఉండాలి. – అందువలన ‘స్వతంత్ర’ అన్న పదం కీలకమైంది.
ప్రశ్న 10.
ఆరోగ్యశాఖలో, సమాచార అధికారిని అడగటానికి ప్రశ్నల జాబితా తయారుచేయండి.
జవాబు:
- విపత్కర సమయాలలో రోగులను ఆదుకోవటానికి అంబులెన్స్ లు ఎన్ని ఉన్నాయి?
- ప్రాంతీయ ఆసుపత్రులలో సౌకర్యాలు ఏమి ఉన్నాయి?
- గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు కొనసాగటానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు?
- ‘పిచ్చి కుక్కలు వంటివి కరిచినప్పుడు ఉపయోగించాల్సిన మందులు అన్ని చోట్లా ఉన్నాయా?
- ‘ఆరోగ్యశ్రీ’లో ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించే సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు ఎందుకు ఉపయోగించడం లేదు?
8th Class Social Textbook Page No.210
ప్రశ్న 11.
మీ బడి ఈ ప్రామాణికాలకనుగుణంగా ఉందా?
జవాబు:
అవును. మా బడి ఈ ప్రామాణికాలకు అనుగుణంగానే ఉన్నది.
- మా పాఠశాలలో సరైన అర్హతలున్న టీచర్లు ఉన్నారు.
- అవసరమైన సౌకర్యాలున్నాయి.
- పారాలు ల్యాబ్ లో, LCD రూములలో బోధించబడుతున్నాయి.
- మేము పాఠశాలలో బాధ్యతతో కూడిన స్వేచ్ఛను అనుభవిస్తాము.
- మా ఉపాధ్యాయులు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు.
ప్రశ్న 12.
అవసరమైతే మీ బడి పనితీరుపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకోంది.
జవాబు:
అవసరమైతే బడి తీరుపై జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారికి, రాష్ట్రస్థాయిలో డైరెక్టరు, పాఠశాల విద్యకు ఫిర్యాదు చేయాలి.
ప్రశ్న 13.
ఈ చిత్రాన్ని వ్యాఖ్యానించుము.
ఇది వర్షాలు కురవని సంవత్సరం
జవాబు:
ఈ చిత్రం చాలా ఏళ్ళనాటిదని వృద్ధురాలి వస్త్రధారణను, ఇంట్లోని మట్టిబానలను, కుండలను చూసి చెప్పవచ్చు. ఒకప్పుడు ధాన్యం దాచుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్న వస్తువులన్నీ నేడు ఖాళీగా ఉన్నాయి. ఒక పాత్రలో బియ్యంలో ఎక్కడో అడుగున ఉన్నాయి. వృద్ధురాలు కూడా సరియైన తిండిలేక వడలిపోయి ఉన్నది. అది కరవు కాలం అని భావించవచ్చు.
ప్రశ్న 14.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
13 సంవత్సరాల పవన్ అనే బాలుడు వాళ్ల అమ్మతో కలిసి ఎంతోమంది భక్తులు సందర్శించే ఒక పుణ్యస్థలంలో ఉంటాడు. పవన్ గుడి బయట నిలబడి భక్తుల కాళ్లమీద పడి అడుక్కుంటాడు. అతడికి కొంతమంది మిగిలిపోయిన పాచి పదార్థాలు తినటానికి ఇస్తారు. కొన్నిసార్లు అతడు బరువైన సామాను మోస్తాడు, అందుకు వాటి యజమానులు కొంత డబ్బు ఇస్తారు.
అతడి తల్లి వేరొకరి ఇంటిలో పనిచేస్తుంది. ఆమె రోజుకి 12 గంటలపాటు, నెలలో 30 రోజులూ పనిచేస్తుంది. యజమానురాలే కాకుండా, చిన్న పిల్లలు సైతం ఆమెను ఇది చెయ్యి, అది చెయ్యి అని చెబుతుంటారు. అందరూ తిన్న తరవాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు. యజమానుల ముందు ఆమె కూర్చోటానికి వీలులేదు. వాళ్లతో భయభక్తులతో మాట్లాడాలి. చిన్న చిన్న తప్పులకు, ఆలస్యానికి ఆమెను తరచు అవమానిస్తుంటారు. ఆమె కన్నీళ్లతోపాటు కోపాన్ని కూడా దిగమింగుకోవాలి. లేదంటే పని నుంచి తీసేస్తారు.
1. పవన్ వయస్సు ఎన్ని సంవత్సరాలు?
జవాబు:
13 సంవత్సరాలు.
2. పవన్ కి డబ్బులు ఎందుకు ఇస్తారు?
జవాబు:
అతడు బరువైన సామాను మోసినందుకు ఇస్తారు.
3. అతడి తల్లి ఏమి చేస్తుంది?
జవాబు:
వేరొకరి ఇంటిలో పని చేస్తుంది.
4. ఆమెకున్న ఇబ్బందులను లేదా కష్టాలను రెండింటిని చెప్పండి.
జవాబు:
1. యజమానుల ముందు కూర్చోడానికి వీలులేదు.
2. అందరూ తిన్న తరువాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు.
5. పవన్ కాళ్ల మీద పడి ఎందుకు అడుక్కుంటాడు?
జవాబు:
వారికి జాలి కలిగి డబ్బులు ఇస్తారని
ప్రశ్న 15.
కింది పేరాను చదివి జవాబులు వ్రాయుము.
ప్రజా విచారణ :
‘జన్ సునావాయి’ (అంటే ప్రజా విచారణ) పేరుతో MKSS (మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్) సమావేశాలు నిర్వహించేది. పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను తమంతట తామే చదవలేరన్నది వాస్తవం. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ పత్రంలో ఏమి ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి వీటిని పైకి చదివి వినిపించేవాళ్లు, వివరించేవాళ్లు. చేతిపంపు వేయటానికి ఎవరెవరికి కూలీ చెల్లించారో మస్టర్/హాజరు జాబితా తెలియచేస్తుంది. మస్టర్ జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు ఆ సమయంలో ఊళ్లో ఉన్నారో, లేక వలస వెళ్లారో ప్రజలు చెప్పగలుగుతారు, లేదా మస్టర్‌లో పేర్కొన్న మొత్తం వాళ్లకు చెల్లించారో లేదో చెప్పగలుగుతారు. దీని ద్వారా ఏదైనా అవినీతి జరిగి ఉంటే అది వెల్లడవుతుంది. ఇటువంటి సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్లు. పత్రాలలో ఉన్న సమాచారం గురించి వివరించటానికి, సమర్ధించుకోటానికి అధికారులకు కూడా అవకాశం ఇచ్చేవాళ్లు. ఈ సమావేశాల్లో జిల్లా పాలనా యంత్రాంగం, పంచాయితీ అధికారులు కూడా పాల్గొనేవాళ్లు. అవినీతిని గుర్తించినప్పుడు సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేసేవాళ్లు.
1. ‘జన్ సునావాయి’ అంటే తెలుగులో ఏమిటి?
జవాబు:
ప్రజా విచారణ.
2. పత్రాలను పైకి చదివి ఎందుకు వినిపించేవారు?
జవాబు:
పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను చదవలేరు. అందుకే వాటిని పైకి చదివి వినిపించేవారు.
3. ‘మస్టర్’ అంటే ఏమిటి?
జవాబు:
కూలీవాళ్ళు లేదా చేతిపనులు చేసేవాళ్ళు ఆ రోజు పనికి హాజరయ్యారో లేదో ఒక పుస్తకంలో నమోదు చేస్తారు. దానినే మస్టర్ అంటారు.
4. సమావేశాల ద్వారా ప్రజలు ఏం చేసేవారు?
జవాబు:
సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్ళు.
5. కేసులు ఎప్పుడు నమోదు చేసేవాళ్ళు?
జవాబు:
అవినీతిని గుర్తించినప్పుడు కేసులు నమోదు చేసేవాళ్ళు.
ప్రశ్న 16.
‘సమాచారాన్ని వెల్లడి చేయడం పై ప్రజల వాదనలు ఏవి?
జవాబు:
వారి వాదనలు :
- మానవ అభివృద్ధి, ప్రజాస్వామిక హక్కులకు సమాచారం కీలకమైనది. అధికారిక పత్రాల రూపంలో తగినంత సమాచారం ఉన్నప్పుడే ప్రజలు పాలనలో భాగస్వాములై, న్యాయమైన అభివృద్ధి జరిగేలా చూడగలుగుతారు.
- సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటంవల్ల ప్రభుత్వాలు తమ పనితీరులో మరింత జవాబుదారీగా ఉంటాయి. దీనివల్ల వాటి పనితీరును పర్యవేక్షించటం, అవినీతి జరగకుండా చూడటం సాధ్యమవుతుంది.
- పేదల మనుగడకు సమాచారం కీలకమైనది.
- సమాచారాన్ని వెల్లడి చేయాల్సి ఉన్నప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవటాన్ని అరికట్టవచ్చు.
ప్రశ్న 17.
విద్యా హక్కు చట్టంలోని ఏవేని 6 ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 :
6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.
చట్టంలోని ముఖ్యాంశాలు :
- పిల్లలందరికి అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
- పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి.
- పిల్లలందరిని వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి.
- వయస్సుకు తగ్గ రీతిలో చేర్చిన తరవాత వారితో సమానంగా ఉండటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.
- ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సాధారణ పిల్లలతోపాటు విద్య కొనసాగించడానికి తగు వసతులు ఏర్పాటు చేయాలి.
- బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. ఎటువంటి రుసుము, ఛార్జీలు వసూలు చేయరాదు.
ప్రశ్న 18.
సమాచారం వెల్లడి కోసం ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
రాజస్థాన్లో కొంతమంది మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన (MKSS) పేరుతో సంఘటితమై ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు, స్థానికసంస్థలు డబ్బులు ఎలా ఖర్చు చేశామో తనిఖీ లేదా MNREGA వంటి సమాచారం అడగసాగారు. ప్రభుత్వం నుంచి ప్రజలు సమాచారం పొందటానికి ఎటువంటి చట్టబద్ధ హక్కులేదు. మొదట్లో కొంతమంది అధికారుల సహాయంతో సంబంధిత పత్రాలను సేకరించి బహిరంగ సమావేశాల్లో ప్రజలు వీటిని తనిఖీ చేయటం మొదలు పెట్టారు. కొంతకాలం తరవాత ఈ వివరాలు ఇవ్వటానికి అధికారులు నిరాకరించారు. ఫలితంగా ఈ విషయమై మూడు సంవత్సరాల పాటు ప్రదర్శనలు, ఊరేగింపులతో ఉద్యమించారు. ఈ విధంగా ఉద్యమం మొదలైంది.
ప్రశ్న 19.
విద్యా హక్కు చట్టం గురించి తెలపంది.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 : 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.
ప్రశ్న 20.
86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది.
ప్రశ్న 21.
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
జవాబు:
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది.
ప్రశ్న 22.
ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
ఐక్యరాజ్యసమితి 1945లో ఏర్పడింది.
ప్రశ్న 23.
జీవించే హక్కు అంటే?
జవాబు:
మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించే హక్కు.
ప్రశ్న 24.
జాతీయస్థాయిలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
2005లో
ప్రశ్న 25.
స్వాతంత్ర్య ఉద్యమంలో గోపాలకృష్ణ గోఖలే ఏ వర్గానికి చెందినవాడు?
జవాబు:
మితవాదులు.