AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 7 హరిశ్చంద్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

బలి చక్రవర్తి గొప్పదాత. అతడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవేదిక దగ్గర దానధర్మాలు చేస్తున్నాడు. వామనుడు దానం స్వీకరించడానికి వచ్చాడు.
బలి : ఏం కావాలి ?

వామనుడు : మూడడుగుల నేల.

బలి : తప్పక ఇస్తాను.

శుక్రాచార్యుడు : బలీ ! వద్దు ! వద్దు ! వచ్చినవాడు రాక్షసవిరోధి ! అతనికి దానం ఇస్తే నీకీ ప్రమాదం !

బలి : గురువర్యా ! నేను ఆడినమాట తప్పను. వామనా ! మూడడుగుల నేల గ్రహించు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
బలిని దానం ఇవ్వవద్దని ఎవరన్నారు? ఎందుకన్నారు?
జవాబు:
బలిని దానం ఇవ్వవద్దని శుక్రాచార్యుడు అన్నాడు. వచ్చినవాడు రాక్షసవిరోధి కాబట్టి దానం ఇవ్వవద్దని చెప్పాడు.

ప్రశ్న 2.
దానం ఇస్తే ఎవరికి ప్రమాదం?
జవాబు:
దానం ఇస్తే బలి చక్రవర్తికి ప్రమాదం.

ప్రశ్న 3.
బలి చక్రవర్తి గొప్పదనం ఏమిటి?
జవాబు:
బలి చక్రవర్తి తాను ఆడినమాట తప్పను అని చెప్పాడు. తాను అన్న మాటకు కట్టుబడి మూడడుగుల నేలను వామనునికి ధారపోశాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 4.
ఆడినమాట తప్పనివారి గురించి మీకు తెలుసా?
జవాబు:
బలి, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు మొదలగువారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

అ) హరిశ్చంద్రుని గొప్పదనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతము కుంగిపోయినా, ఆకాశం ఊడి కింద పడినా, సముద్రం ఎండినా, భూగోళం తలకిందులయినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.

ఆ) ద్విపద రూపంలోని ఈ పాఠాన్ని లయబద్ధంగా రాగంతో పాడండి.
జవాబు:
విద్యార్థి కృత్యము

ఇ) సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి “ముల్లోకాలలో బొంకనివారు ఎవరైనా ఉన్నారా ? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ, గతకాలం వారిలో కానీ అసత్యమాడని వారున్నారా ? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా ?” అని త్రికాలజ్ఞులైన మునీశ్వరులను అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతమంది విన్నా విననట్లు ఊరుకున్నారు. అప్పుడు వశిష్ఠుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడు హరిశ్చంద్రుడని సభలో ప్రకటించాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుని గొప్పదనం, గుణగణాలను గురించి దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

“దేవేంద్రా ! హరిశ్చంద్ర మహారాజు ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేసినవాడు. వినయ వివేకాలు గలవాడు. విద్యావంతుడు. కీర్తిశాలి. దయాసముద్రుడు. గాంభీర్యము గలవాడు. పుణ్యాత్ముడు. పండితులచే పొగడదగ్గవాడు. సర్వశాస్త్ర పండితుడు. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో పేరుపొందినవాడు. త్రిశంకుని పుత్రుడు. సత్యసంధుడు. సూర్యవంశీయుడు. అతడు ఆడి బొంకనివాడు. ఆదిశేషువు కూడా హరిశ్చంద్రుని గుణగణాలను కీర్తింపలేడు. అబద్ధం ఆయన నాలుక నుండి రాదు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరువు కుంగినా, ఆకాశం ఊడి కింద పడినా, భూగోళం తలకిందైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడినమాట తప్పడు.”

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది భావాలున్న ద్విపద పాదాలను పాఠంలో వెతికి రాయండి.

అ) హరిశ్చంద్రుడు వినయమే అలంకారంగా గలవాడు. వివేకం సంపదగా గలవాడు.
జవాబు:
వినయభూషణుఁడు వివేకసంపన్నుడు

ఆ) హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. నీతిగా పరిపాలన చేస్తాడు.
జవాబు:
నిత్యప్రసన్నుండు నీతిపాలకుడు.

ఇ) త్రిశంకుని కుమారుడు సత్యాన్నే పలికేవాడు.
జవాబు:
సత్యసంధుండు త్రిశంకునందనుఁడు

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పద్యం చదవండి. భావంలో ఖాళీలు ఉన్నాయి. పూరించండి.
నుతజల పూరితంబులగు నూతులు నూటిటికంటె సూనృత
వ్రత! యొక బావివేలు, మరి బావులు నూటిటికంటె నొక్క స
త్క్రతువది మేలు, తత్రతు శతంబున కంటె సుతుండుమేలు, త
త్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్

పై పద్యం శకుంతల దుష్యంతునితో చెప్పింది. సత్యవ్రతం యొక్క గొప్పదనాన్ని తెలిపే పద్యం ఇది.
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక …………….. మేలు. అలాంటి వందబావులకన్నా ఒక ……….. మేలు. అలాంటి వంద ………..ల కన్నా ఒక ………….. ఉండటం మేలు. అలాంటి వందమంది ……………… ఉండటం కన్నా ఒక ……….. మేలు.
జవాబు:
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక బావి మేలు. అలాంటి వందబావులకన్నా ఒక మంచియజ్ఞం మేలు. అలాంటి వంద మంచియజ్ఞముల కన్నా ఒక కుమారుడు ఉండటము మేలు. అలాంటి వందమంది కుమారులు ఉండటం కన్నా ఒక సత్యవాక్యం మేలు.

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) హరిశ్చంద్రుని గుణగణాలను కవి ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశస్థుడు. నీతిపాలకుడు. నిత్య ప్రసన్నుడు. మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేస్తూ ఆనందించేవాడు. వినయ వివేక సంపన్నుడు. కీర్తిమంతుడు. ధనుర్విద్యావేత్త. కరుణాపయోనిధి. గంభీరుడు. పుణ్యాత్ముడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. పండితుల స్తోత్రములకు పాత్రుడు. శత్రుజన భయంకరుడు. షట్చక్రవర్తులలో ఒకడు. సత్యసంధుడు. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. విజ్ఞాన నిధి. అబద్ధం ఎరుగనివాడు. రెండువేల నాలుకలు ఉన్న ఆదిశేషుడికి కూడా హరిశ్చంద్రుని గుణములను కీర్తించడం అసాధ్యము.

ఆ) హరిశ్చంద్రుని గొప్పతనం గురించి వశిష్ఠుడు ఎవరితో చెప్పాడు? ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి ఉన్న సమయంలో మూడులోకాలలో ఎవరైనా బొంకని వారున్నారా? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కాని, గతకాలం వారిలో కాని, అసత్యమాడని వారున్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా? అని అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వశిష్ఠుడు దేవేంద్రునితో హరిశ్చంద్రుని గొప్పతనం గురించి చెప్పాడు.

ఇ) హరిశ్చంద్రునికి ఉన్న విశిష్టతలు ఏవి?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశుడైన త్రిశంకుని కుమారుడు. సూర్యవంశమనే పాలసముద్రంలో పుట్టిన చంద్రుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. రెండు వేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలకిందులైనా హరిశ్చంద్రుడు మాత్రం ఆడినమాట తప్పడు- ఇవి అతనిలోని విశిష్టతలు.

ఈ) అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చని కవి వేటిని పేర్కొన్నాడు? వీటిని ఏ సందర్భంలో పేర్కొన్నాడు?
జవాబు:
అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చునని కవి ఈ కింది వాటిని పేర్కొన్నాడు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం కింద ఊడిపడినా, భూగోళం తలకిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్ర మహారాజు మాత్రం అబద్దమాడడని కవి చెప్పాడు.

ఎంతటి వైపరీత్యాలూ, అసాధారణాలు సంభవించినా హరిశ్చంద్రుడు అబద్ధమాడడని చెప్పే సందర్భంలో కవి వాటిని పేర్కొన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

4. కింది వాక్యాలకు సమానార్థాన్నిచ్చే వాక్యాలు గుర్తించండి.

అ) హరిశ్చంద్రుడు వివేకసంపన్నుడు, వినయభూషణుడు.
i) హరిశ్చంద్రుడు కేవలం వివేకసంపన్నుడు.
ii) హరిశ్చంద్రుడు వినయభూషణుడే.
iii) హరిశ్చంద్రునికి వివేకసంపదకన్న వినయభూషణం అధికం.
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.
జవాబు:
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.

ఆ) మేరువు గ్రుంకినా, మిన్ను వ్రాలినా హరిశ్చంద్రుడు అసత్యం పలకడు.
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.
ii) మేరువు కుంగి, మిన్ను వాలినా, సత్యం పలుకుతాడు హరిశ్చంద్రుడు.
iii) మేరువు కుంగినా, మిన్ను వాలకున్నా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు.
iv) మేరువు కుంగినా మిన్ను వాలినా హరిశ్చంద్రుడు సత్యం పలకడు.
జవాబు:
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “హరిశ్చంద్రుణ్ణి షోడశ మహాదాన వినోది” అని వశిష్ఠుడు ఎందుకు అన్నాడు?
జవాబు:
పదహారు రకాల దానాలను చేస్తూ ఆనందించేవాడు షోడశ మహాదాన వినోది. హరిశ్చంద్రునికి ఇతరులకు దానం చేయడం వినోదం అన్నమాట. గో-భూ-తిల-హిరణ్య-రత్న-కన్యా-దాసీ-శయ్యా-గృహ-అగ్రహార-రథ-గజ-అశ్వభాగ-మహిషీ దానాలను షోడశ మహాదానాలు అంటారు. హరిశ్చంద్రుడు ఎవరికైనా, ఏదైనా ఇస్తానంటే తప్పక ఇస్తాడనీ, ఆడినమాట తప్పడనీ, దానగుణం అన్నది ఆయనకు ఒక వినోదక్రీడ వంటిదనీ చెప్పడానికే వశిష్ఠుడు హరిశ్చంద్రుని “షోడశ మహాదాన వినోది” అని చెప్పాడు.

ఆ) హరిశ్చంద్రునిలో మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలేవి?
జవాబు:
హరిశ్చంద్రునిలోని షోడశ మహాదాన వినోదిత్వం, వినయభూషణత్వం, వివేక సంపన్నత, అపారమైన కరుణ, మహాజ్ఞాని కావడం, ధనుర్వేద విద్యాధికత, ధర్మతత్పరత, సత్యసంధత, ప్రియభాషణ, నిత్యప్రసన్నత, నీతిపాలకత అనే గుణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇ) ‘హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు’ అని తెలుసుకున్నారు కదా ! ఆడినమాట తప్పనివారు ఎలా ఉంటారో రాయండి.
జవాబు:
ఆడిన మాట తప్పనివారు అంటే సత్యసంధులు. వారు ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడరు. సత్యవాక్యం గొప్పతనాన్ని వారు గుర్తించినవారు. భార్యను అమ్మవలసి వచ్చినా, తానే అమ్ముడుపోయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడలేదు. వామనునికి మూడు అడుగుల నేల దానం చేస్తే బలిచక్రవర్తికే ప్రమాదం వస్తుంది అని ఆయన గురువు శుక్రుడు చెప్పినా బలి తాను అన్నమాటను తప్పలేదు. శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్నే కోసి ఇచ్చి పావురాన్ని రక్షించాడు. ఆడినమాట తప్పనివారు బలి చక్రవర్తిలా, హరిశ్చంద్రునిలా, శిబిచక్రవర్తిలా ఉంటారు.

ఈ) ‘మిన్ను వ్రాలినా’ అని వశిష్ఠుడు హరిశ్చంద్రుని పరంగా ఉపయోగించాడు కదా ! ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
జవాబు:
‘మిన్ను వ్రాలటం’ అంటే ఆకాశం వంగిపోవటం అని అర్థం. ఆకాశం వంగిపోవటం అనేది సృష్టిలో ఎప్పుడూ జరగనిది. అందువలన ఎన్నటికీ జరగని విషయం అని చెప్పే సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ సారాంశం సొంతమాటల్లో రాయండి.
(లేదా)
వశిష్ఠుడు వివరించిన ‘హరిశ్చంద్రుని సద్గుణాలేమిటో’ రాయండి.
(లేదా)
పర్వతాలు కుంగిన, ఆకాశం నేలమీద పడినా మాట తప్పనివాడైన హరిశ్చంద్రుడి గురించి కవి ఏ విధంగా వ్యక్తపరచారో రాయండి.
జవాబు:
దేవేంద్రుడు ఒక రోజు కొలువుదీర్చి ఉన్నాడు. ఆ సభలో వశిష్ఠ మహాముని హరిశ్చంద్రుని గుణగణాలను వర్ణించాడు.

“ఓ దేవేంద్రా! ఈ ప్రపంచంలో హరిశ్చంద్రుడు గొప్ప పరాక్రమవంతుడు. పదహారు రకాల దానాలు చేస్తూ వినోదిస్తూ ఉంటాడు. వినయం, వివేకం ఉన్నవాడు. గొప్ప కీర్తి, భాగ్యం కలవాడు. విలువిద్యా పండితుడు. దయాసముద్రుడు. పాపం చేయనివాడు. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడు. మహాజ్ఞాని. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో మొదటివాడు. నీతిగలవాడు. త్రిశంకుని కుమారుడు. సూర్యవంశంలో పుట్టినవాడు. సత్యవాక్పరిపాలకుడు.

హరిశ్చంద్రుని గుణగణాలను ఆదిశేషుడు సైతం వర్ణించలేడు. హరిశ్చంద్రుడు సత్యసంధుడు. ఆయన పనులు ధర్మము. ఆయన మాట ప్రియము. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పు వాలినా, మేరువు కుంగినా, భూమి తలకిందులయినా, ఆకాశం కిందపడినా, సముద్రాలు ఇంకినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.” అని వశిష్ఠుడు చెప్పాడు.

ఆ) వివేక సంపన్నుడు, సత్యసంధుడు, విద్యాధికుడు, కరుణాపయోనిధి, విజ్ఞాననిధి అని హరిశ్చంద్రుణ్ణి కీర్తించారు కదా ! మన సమాజంలోని వ్యక్తులు అందరూ ఈ గుణాలతో ఉంటే ఈ సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
(లేదా)
సమాజంలో ఉన్న అందరూ హరిశ్చంద్రుడిలా ఉంటే మన సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:
సమాజం. అంటే ‘సంఘం’. మన సంఘంలో హరిశ్చంద్రుని వంటి గుణగణాలు గల వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. అందరూ హరిశ్చంద్రునిలా వివేకం కలిగి ఉండి, నిజమే మాట్లాడుతూ, దయ గలిగి, అందరూ విద్యావిజ్ఞానములు కలిగి ఉంటే చాలా బాగుంటుంది. అందరూ వివేకం గలవారు కాబట్టి తగవులూ, యుద్ధాలూ ఉండవు. అధర్మ ప్రవర్తనలూ, వాటికి శిక్షలూ, కోర్టులూ ఉండవు. అందరూ చదువుకున్నవారే కాబట్టి ప్రజలు సంస్కారం కలిగి న్యాయధర్మాలతో ఉంటారు.

మళ్ళీ కృతయుగం వచ్చినట్లు అవుతుంది. మనం అంతా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి మంచి కాలం రావాలని అందరూ కోరుకోవాలి. అందరూ హరిశ్చంద్రునివంటి గుణాలు గలవారు అయితే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు అకారణంగా వారిని హింసించే ప్రమాదం లేకపోలేదు. కానీ చివరకు న్యాయం, ధర్మం జయిస్తాయి.

IV. పదజాలం

1. కింది పట్టికను పరిశీలించండి. అందులో హరిశ్చంద్రుని గుణగణాలకు సంబంధించిన పదాలున్నాయి. అయితే . ఒక్కొక్క పదం రెండుగా విడిపోయింది. వాటిని కలిపి రాయండి. ఆ పదాల ఆధారంగా సొంతవాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు 1

ఉదా : నీతినిధి – నీతికి నిధియైన సర్పంచ్ వల్ల గ్రామానికి మేలు జరుగుతుంది.
జవాబు:
పై పట్టికలోని పదాలు ఇవి :

  1. భాగ్యశాలి
  2. విజ్ఞాన నిధి
  3. బొంకనివాడు
  4. శరధిచంద్రుడు
  5. వినయభూషణుడు
  6. వివేక సంపన్నుడు
  7. కరుణాపయోనిధి
  8. నీతిపాలకుడు
  9. దాన వినోది
  10. సత్యసంధుడు

వాక్యప్రయోగములు:

1) భాగ్యశాలి : దానధర్మములు చేస్తే భాగ్యశాలి కీర్తి మరింత వృద్ధి అవుతుంది.

2) విజ్ఞాన నిధి : అబ్దుల్ కలాం గొప్ప ‘విజ్ఞాన నిధి’.

3) బొంకనివాడు : ప్రాణం పోయినా బొంకనివాడే యోగ్యుడు.

4) శరధిచంద్రుడు : శ్రీరాముడు సూర్యవంశ శరథి చంద్రుడు.

5) వినయభూషణుడు : ధర్మరాజు చక్రవర్తులలో వినయ భూషణుడు.

6) వివేక సంపన్నుడు : ఎంత విజ్ఞానం ఉన్నా వివేక సంపన్నుడు అయి ఉండాలి.

7) కరుణాపయోనిధి : శ్రీరాముడిని ‘కరుణాపయోనిధి’ అని రామదాసు కీర్తించాడు.

8) నీతిపాలకుడు : నీతిపాలకుడైన రాజు కీర్తి విస్తరిస్తుంది.

9) దాన వినోది : కర్ణుడు దానవినోదిగా పేరుపొందాడు.

10) సత్యసంధుడు : శిబి చక్రవర్తి సత్యసంధుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పదాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాక్యంలో ప్రయోగించండి.

అ) అడవికి కంఠీరవం రాజు.
జవాబు:
కంఠీరవం = సింహము
వాక్యం :
మృగరాజు అయిన కంఠీరవం మిగిలిన జంతువులు చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది.

ఆ) త్రిశంకు నందనుడు హరిశ్చంద్రుడు.
జవాబు:
నందనుడు = కుమారుడు
వాక్యం :
శ్రీరాముడు దశరథ నందనుడు.

ఇ) ఆంజనేయుడు శరధి దాటాడు.
జవాబు:
శరధి = సముద్రము
వాక్యం :
శ్రీరాముడు వానరుల సాయంతో శరధిపై సేతువు నిర్మించాడు.

ఈ) దేవతలకు రాజు సురేంద్రుడు.
జవాబు:
సురేంద్రుడు = దేవేంద్రుడు
వాక్యం :
గౌతముడు సురేంద్రుని శపించాడు.

ఉ) భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు.
జవాబు:
భానుడు = సూర్యుడు
వాక్యం :
భానుడు నిత్యము తూర్పున ఉదయిస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది వాక్యాలు పరిశీలించండి. పర్యాయపదాలతో ఇలాంటి వాక్యాలు రాయండి.

అ) భానుకిరణాలు చీకట్లు పోగొడతాయి. ఆదిత్యుడు వెలుగుతో పాటు వేడిమినిస్తాడు. రవి మొక్కలకూ, జంతువులకూ ప్రాణాధారం. సూర్యుడు లేకపోతే ఈ సమస్తజీవులు ఉండవు.
జవాబు:
భానుడు – ఆదిత్యుడు, రవి, సూర్యుడు

ఆ) వానరులు లంకను చేరడానికి సముద్రాన్ని దాటాలి. ఇందుకోసం ఆ శరధి పై వారధి కట్టాలి. దీనికి నలుణ్ణి వినియోగించారు. నలుని నేతృత్వంలో వానరవీరుల సహాయంతో. అంబుధిపై వారధి తయారయింది. శ్రీరాముని వెంట వానరులు కడలి దాటి వెళ్ళారు. సంద్రంలో ఆ వారధి ఈనాటికీ కనిపిస్తుంది.
జవాబు:
సముద్రం – శరధి, అంబుధి, కడలి, సంద్రం

పై వాక్యాలను పోలిన మరికొన్ని వాక్యాలు :
జవాబు:
1) తల్లిదండ్రులు తమకు కొడుకు పుట్టినప్పుడు సంతోషిస్తారు. ‘పుత్రుడు‘ పున్నామ నరకం పోగొడతాడని, వృద్ధాప్యంలో సుతుడు ఆదుకుంటాడనీ అనుకుంటారు. కానీ ఈనాడు తనయుడు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. కుమారుడు తన భార్య చుట్టూ తిరుగుతున్నాడు.

2) నీవు కుక్కను పెంచుతావు. నాకు జాగిలము అంటే ఇష్టము కాదు. మా ఇంట్లో వెనుక శునకము ఉండేది. ఆ శ్వానము బిస్కట్లు తినేదికాదు.

3) నేను ఈశ్వరుడు అంటే ఇష్టపడతాను. మహేశ్వరుడు దయగలవాడు. శివుడు పార్వతిని పెళ్ళాడాడు. పార్వతికి కూడా శంకరుడు అంటే మక్కువ ఎక్కువ. ఈశ్వరుడు చంద్రశేఖరుడు. ఆయన త్రిలోచనుడు. గంగను ధరించి గంగాధరుడు అయ్యాడు.

4) ఈ రోజు మన ఉపాధ్యాయుడు రాడు. మన గురువు నగరానికి వెళ్ళాడు. మన అధ్యాపకుడు రేపు రావచ్చు. ఒజ్జ పాఠం విననిదే నాకు నిద్ర పట్టదు.

V. సృజనాత్మకత

* మహాభాగ్యశాలి, ధనుర్వేద విద్యాధికుడు, సర్వశాస్త్రార్థ కోవిదుడు, నీతిపాలకుడు, ధర్మపరాయణుడు, మహా సత్యవంతుడు అయిన హరిశ్చంద్రుని పాత్రకు ఏకపాత్రాభినయం తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
ఏకపాత్రాభినయం

హరిశ్చంద్రుడు :
అయ్యో ! హతవిధీ ! ఎంత కష్టము ! ఆడినమాట తప్పనివాడనే ! అయోధ్యాపతినే ! త్రిశంకునందనుడినే! ధర్మమూ, సత్యమూ నాలుగు పాదాలా నడిపిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నందుకా ఇంత కష్టము ! దైవమా! నీ లీలలు ఎవరికీ అర్థం కావు కదా !

(భార్యను అమ్మడానికి వేలం పెడుతూ)
అయ్యలారా ! ఈ దౌర్భాగ్యుడు హరిశ్చంద్రుడు, భార్యను అమ్ముకుంటున్నాడు. క్షమించండి. ఈమె పరమ పతివ్రతా శిరోమణి. ఎండ కన్నెరుగని ఇల్లాలు. ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు భార్య. అయోధ్యా నగర చక్రవర్తి హరిశ్చంద్రుని సతీమణి. పూజ్య విశ్వామిత్రులకు బాకీపడిన సొమ్ముకై ఈ చంద్రమతిని వేలానికి పెడుతున్నా. కన్న తండ్రులారా ! ఈ అసూర్యం పశ్యను, మీ సొంతం చేసుకోండి.

(భార్యను అమ్మాడు. కాటికాపరిగా మారాడు)
అయ్యో ! చివరకు హరిశ్చంద్రుడు కాటికాపరి అయ్యాడు. ఎంత దౌర్భాగ్యము ? షోడశ మహాదానములు చేసిన చేయి. మహాపరాక్రమంతో శత్రువులను చీల్చి చెండాడిన చేతులివి – నేను దశదిశలా మారుమ్రోగిన కీర్తికెక్కిన చరిత్ర కలవాడిని. ధనుర్వేద పండితుడిని. పండిత స్తోత్రపాఠములు అందుకున్నవాడిని. షట్చక్రవర్తులలో గొప్పవాడిగా కీర్తికెక్కిన వాడిని. ఏమి నాకీ దుర్గతి ! హతవిధీ ! ఏమయ్యా ! నీ లీలలు !

ఏమైన నేమి ? ఈ హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు. బ్రహ్మ తలరాత తప్పుగాక ! ఆ సూర్యుడు తూర్పున అస్తమించుగాక ! మేరువే నేల కుంగిన కుంగుగాక ! ఆకాశం ఊడిపడుగాక ! భూమి తలక్రిందులగు గాక ! సప్త సముద్రములూ ఇంకుగాక ! నక్షత్రములు నేల రాలు గాక ! ఆడను గాక ఆడను. అబద్ధమాడను. దైవమా ! త్రికరణ
శుద్ధిగా నేను చెపుతున్న మాట ఇది. (కింద కూలి పడతాడు)

(లేదా)

* హరిశ్చంద్రుని గుణగణాలను తెలిపే విశేషణాలను తెలుసుకున్నారు కదా ! ఇలాంటి విశేషణాలను ఉపయోగించి ఎవరైనా ఒక గొప్ప నాయకుడి గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
(అటల్ బిహారీ వాజపేయి)
మన మాజీ భారత ప్రధానులలో “వాజపేయి” భారతీయ జనతా పార్టీ ప్రాభవానికీ, దేశ సౌభాగ్యానికి కృషి చేసిన మహోన్నతుడు. ఈయన నిత్య ప్రసన్నుడు. ముఖాన చెరగని చిరునవ్వు ఈయనకు అలంకారము. ఈయన నీతిపాలకుడు. నిరుపమ విజ్ఞాన నిధి. మహాకవి. అతులసత్కీర్తి. దురిత దూరుడు. బుధస్తోత్ర పాత్రుడు.

గొప్ప రాజకీయవేత్త. ఆడి తప్పనివాడు. అన్యాయాన్నీ, దుర్మార్గాన్ని సహింపనివాడు కళంక రహితుడు. వినయ భూషణుడు. వివేక సంపన్నుడు. భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన మహోన్నత గుణశీలుడు.

ఈయన విద్యాధికుడు. సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు. విశ్వనాయకులలో వినుతి కెక్కినవాడు. ఇతడు కరుణాపయోనిధి. గాంభీర్యఘనుడు. సత్యసంధుడు. ఆడి తప్పని నాయకుడు. ఈయన తనువెల్లా సత్యము. ఈయన తలపెల్లా కరుణ. ఈయన పలుకెల్లా ప్రియము. ఈయన పనులెల్లా ధర్మము.

మన దేశ ప్రధానులలో చెరిగిపోని, వాడిపోని, సత్కీర్తిని సంపాదించిన న్యాయ ధర్మవేత్త ఈయనయే.

VI. ప్రశంస

* ఆడినమాట తప్పకుండా తను చేస్తున్న వృత్తిలో నిజాయితీపరులైన వారివల్ల ప్రజలకు కలిగే మేలును ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

రాజమహేంద్రవరం,
x x x x x x x

పత్రికా సంపాదకులు,
సాక్షి,
లబ్బీపేట,
విజయవాడ.
ఆర్యా,
విషయం : ప్రజల మేలు కోరే వారి పట్ల ప్రశంస.

నమస్కారములు.
నేను ఇటీవల కాలంలో కొంతమంది నిజాయితీపరులైన నాయకులను చూశాను. వారు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. ప్రజలు వారి వద్ద తమ సమస్యలను విన్నవించుకుంటారు. నాయకులు వెంటనే పరిష్కరిస్తామని మాట ఇస్తున్నారు. అలాగే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఆ పనులను చేస్తున్నారు. అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇలాగే స్పందించి అందరికీ సహాయ సహకారాలు అందిస్తే దేశం బాగుపడుతుందని భావిస్తున్నాను. ఆడినమాట తప్పకుండా వృత్తిలో నిజాయితీపరులైన వారికి ఈ పత్రికా ముఖంగా అభినందనలను తెలుపకోరుచున్నాను.

మీ విశ్వసనీయుడు,
xxxxxx,
8వ తరగతి,
టాగూర్ ఉన్నత పాఠశాల,
రాజమహేంద్రవరం.
తూ.గో. జిల్లా.

చిరునామా :
సంపాదకులు,
సాక్షి, దిన పత్రిక,
లబ్బీపేట,
విజయవాడ.

VII. ప్రాజెక్టు పని

* సత్యం గొప్పతనం తెలుసుకున్నారు కదా ! సత్యాన్ని తెలిపే కథలను, పద్యాలను సేకరించండి. మీ పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:
కథ :
( సత్యమేవ జయతే)
ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.

ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా ! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.

ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా ! ఏమి, మాయమాటలు. ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా ? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనకు నేం వెర్రిబాగుల నుంచి అనుమతులు అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికే చాసను కాను. ఒక చచ్చి తను కు బయలు ! ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి గొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా ! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.

ఈ ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకొందామని ‘సరే’ అన్నది పులి. ఆవు ఇంటికిపోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా ! బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటి వారితో స్నేహంగా ఉండు. ఎట్టి పరిస్థితులలోను అబద్దాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు. మంచిబుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది ! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి.

నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

పద్యాలు :

1. అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠవరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ ! వినురవేమ !

2. రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ !

3. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధి గమము, సత్యంబుతో సరియుఁగావు
ఎఱుగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు
భారత – ఆది – 4 ఆ. 96 ప.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

(లేదా)

*హరిశ్చంద్రుని కథను చదివి అతని గొప్పతనాన్ని వర్ణించే వాక్యాలను చార్ట్ పై రాసి ప్రదర్శించండి.
జవాబు:
హరిశ్చంద్రుడు గుణగణాలు
హరిశ్చంద్రుడు – మహావిక్రమోన్నతుడు
హరిశ్చంద్రుడు – షోడశమహాదాన వినోది
హరిశ్చంద్రుడు – సత్యసంధుడు
హరిశ్చంద్రుడు – వినయ వివేక సంపన్నుడు
హరిశ్చంద్రుడు – సత్కీర్తి మహాభాగ్యశాలి
హరిశ్చంద్రుడు – ధనుర్వేద విద్యావిశారదుడు
హరిశ్చంద్రుడు – గాంభీర్యఘనుడు
హరిశ్చంద్రుడు – కరుణాపయోనిధి
హరిశ్చంద్రుడు – సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు
హరిశ్చంద్రుడు – షట్చక్రవర్తులలో మేటి
హరిశ్చంద్రుడు – నిరుపమ విజ్ఞాన నిధి
హరిశ్చంద్రుడు – గుణగణాలను ఆదిశేషుడు సైతం, ప్రశంసింపలేడు
హరిశ్చంద్రుడు – ఆడి తప్పనివాడు
హరిశ్చంద్రుడు – మేరువు క్రుంగినా, ధారుణి తలక్రిందయినా మాట తప్పని మహారాజు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాటిని పూరించండి.

సంధిపదంవిసంధిసంధి పేరు
అ) అన్నదమ్ములుఅన్న + తమ్ముడు + లుగసడదవాదేశ సంధి
ఆ) గుణములు వొగడగుణములు + పొగడగసడదవాదేశ సంధి
ఇ) విద్యాధికుడువిద్య + అధికుడుసవర్ణదీర్ఘ సంధి
ఈ) సురేంద్రసుర + ఇంద్రగుణసంధి
ఉ) తలపెల్లతలపు + ఎల్లగుణసంధి
ఊ) నల్ల గలువనల్ల + కలువగసడదవాదేశ సంధి
ఋ) వీడుదడివీడు + తడిసెగసడదవాదేశ సంధి
ఋ) కొలుసేతులుకాలు + చేయి + లుగసడదవాదేశ సంధి

2) కింది పేరాలోని సంధి పదాలను గుర్తించి అవి ఏ సంధులో రాయండి.

విద్యార్థులందరూ ఆడుకుంటూండగా ఎగురుతున్న పక్షి కింద పడింది. ఆ పక్కనే ఉన్న వాళ్ళంతా దానివైపు పరుగెత్తారు. కాని పురుషోత్తముడనే పిల్లవాడు నీళ్ళు తీసుకువెళ్ళి ఆ పక్షి పైన చల్లాడు. అది తేరుకొని లేచి పైకెగిరి వెళ్ళింది. అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
పై పేరాలోని సంధులు :
విద్యార్థులు = విద్య + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి
వాళ్ళంతా = వాళ్ళు + అంతా – ఉకారసంధి
పురుషోత్తముడు = పురుష + ఉత్తముడు – గుణసంధి
పైకెగిరి = పైకి + ఎగిరి – ఇత్వసంధి
విద్యార్థులందరూ = విద్యార్థులు + అందరూ – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3) అలంకారాలు :
అ) వృత్త్యనుప్రాసాలంకారం :
అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు.
1) అర్థాలంకారాలు
2) శబ్దాలంకారాలు

ఉపమాది అలంకారాలు అర్థాలంకారాలు. వీటి గురించి కింది తరగతులలో తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు కొన్ని శబ్దాలంకారాలను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి.
1) “ఆమె కవతో వడిడి అడుగులతో గపను దాటింది”.
2) “చి చినుకులు పమని పడుతున్న వేళ”

మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ విధంగా

ఒక హల్లును మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే వినసొంపుగా ఉంటుంది. శబ్దం ద్వారా సౌందర్యం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఈ విధంగా శబ్దానికి ప్రాముఖ్యం ఇచ్చే అలంకారాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఒకటి.

మరికొన్ని ఉదాహరణలు చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకెళ్ళాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షభక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా!

ఒక హల్లుగాని, రెండు, మూడు హల్లులు గాని, వేరుగా నైనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని “వ్యత్యనుప్రాస అలంకారం” అంటారు. “ప్రతిజ్ఞ” పాఠం చదవండి. వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన పదాలు/ వాక్యాలు గుర్తించండి.
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠంలోని వృత్త్యనుప్రాసాలంకారానికి చెందిన పదాలు / వాక్యాలు :

  1. పొలాల నన్నీ హలాల దున్నీ ఇలా తలంలో
  2. హేమం పిండగ – సౌఖ్యం నిండగ
  3. ఘర్మజలానికి, ధర్మజలానికి
  4. నిలో వనిలో కార్యానాలో
  5. నా వినిపించే నా విరుతించే నా వినిపించే నా విరచించే
  6. త్రిలోకాలలో త్రికాలాలలో
  7. బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ
  8. విలాపాగ్నులకు విషాదాశ్రులకు
  9. పరిష్కరించే, బహిష్కరించే – మొ||వి.

ఆ) ఛేకానుప్రాసాలంకారం :
కింది వాక్యం చదవండి.
నీకు వంద వందనాలు

పై వాక్యంలో ‘వంద’ అనే హల్లుల జంట వెంటవెంటనే అర్థభేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’నాలు – నమస్కారాలు అనే అర్థాన్నిస్తుంది. ఈ విధంగా – హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస అలంకారం’ అంటారు. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:

  1. పాప సంహరుడు “హరుడు”
  2. మహాహీ భరము
  3. కందర్పదర్పము
  4. కానఁగాననమున ఘనము ఘనము

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

వారిధి : సముద్రం, అంబుధి, ఉదధి
భానుడు : సూర్యుడు, రవి, ప్రభాకరుడు\
ఘనము : మేఘము, పయోధరం
గిరి : పర్వతం, కొండ, అది
జిహ్వ : నాలుక, రసన, కకుత్తు
మిన్ను : ఆకాశం, గగనము, నభము
నందనుడు : కుమారుడు, పుత్రుడు, ఆత్మజుడు
కంఠీరవం : సింహం, కేసరి, పంచాస్యం
సురలు : దేవతలు, అనిమిషులు, నిర్జరులు
ధరణి : భూమి, వసుధ, అవని
బొంకు : అబద్దం, అసత్యం
రాజు : నృపతి, నరపతి, క్షితిపతి
నుతి : పొగడ్త, స్తోత్రము, స్తుతి
వారిజగర్భుడు : బ్రహ్మ, విధాత, విరించి

వ్యుత్పత్యర్థాలు

భానుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
వారిజగర్భుడు – పద్మము గర్భముగా కలవాడు (బ్రహ్మ)
వారిజము – నీటి నుండి పుట్టినది (పద్మం)
నందనుడు – సంతోషమును కలుగజేయువాడు (కుమారుడు)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
శరధి – శరములకు (నీళ్ళకు) నిధి (సముద్రం)
రాజు – రంజింపచేయువాడు (నరపతి)
కంఠీరవం – కంఠంలో ధ్వని కలది (సింహం)

నానార్థాలు

రాజు = ప్రభువు, చంద్రుడు
బుద్ధుడు = పండితుడు, బుధగ్రహం, వేల్పు, వృద్ధుడు
గుణము = స్వభావం, దారము, వింటినారి
పాకం = వంట, పంట, కార్యపాకాలు
జిహ్వ = నాలుక, వాక్కు జ్వాల
నందనుడు = కొడుకు, సంతోష పెట్టువాడు
ధర్మం = పుణ్యం, న్యాయం, ఆచారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
విద్యాధికుండు = విద్యా + అధికుండు – సవర్ణదీర్ఘ సంధి
శాస్త్రార్థం = శాస్త్ర + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
వారిజాప్తుడు = వారిజ + ఆప్తుడు – సవర్ణదీర్ఘ సంధి
వజ్రాయుధంబు = వజ్ర + ఆయుధంబు – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.
సురేంద్ర = సుర + ఇంద్ర – గుణసంధి
విక్రమోన్నతుడు = విక్రమ + ఉన్నతుడు – గుణసంధి
దేవేంద్ర = దేవ + ఇంద్ర – గుణసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
వానికైన = వానికిన్ + ఐన – ఇత్వసంధి
వినుతికెక్కిన = వినుతికిన్ + ఎక్కిన – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
తరమిడి = తరము + ఇడి – ఉత్వసంధి
తనువెల్ల = తనువు + ఎల్ల – ఉత్వసంధి
తలపెల్ల = తలపు + ఎల్ల – ఉత్వసంధి
మున్నెన్నన్ = మున్ను + ఎన్నన్ – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పురుషములకు గసడదవలు బహుళంబుగానుగు.
ధారదప్పిన = ధార + తప్పిన – గసడదవాదేశ సంధి
కాలుసేతులు = కాలు + చేతులు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
మహాదానంగొప్పదైన దానంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాభాగ్యంగొప్పదైన భాగ్యంవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విద్యధికుండువిద్యచేత అధికుండుతృతీయా తత్పురుష సమాసం
వినయభూషణుడువినయము చేత భూషణుడుతృతీయా తత్పురుష సమాసం
వివేక సంపన్నుడువివేకము చేత సంపన్నుడుతృతీయా తత్పురుష సమాసం
బుధస్తోత్ర పాత్రుండుబుధస్తోత్రమునకు పాత్రుండుషష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్రార్థముశాస్త్రముల యొక్క అర్థముషష్ఠీ తత్పురుష సమాసం
భానువంశంభానువు యొక్క వంశంషష్ఠీ తత్పురుష సమాసం
విజ్ఞాననిధివిజ్ఞానమునకు నిధిషష్ఠీ తత్పురుష సమాసం
రెండువేల నాల్కలురెండు వేల సంఖ్య గల నాలుకలుద్విగు సమాసం
సత్కీర్తిగొప్పదైన కీర్తివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విచారకోవిదుడువిచారమునందు కోవిదుడుసప్తమీ తత్పురుష సమాసం
వారిజగర్భుడువారిజము గర్భము నందు కలవాడుబహున్రీహి సమాసం
రిపుగజమురిపువు అనే గజమురూపక సమాసం
వారిజాప్తుడువారిజములకు ఆప్తుడుషష్ఠీ తత్పురుష సమాసం
దేవేంద్రుడుదేవతలకు ఇంద్రుడుషష్ఠీ తత్పురుష సమాసం
దురితదూరుడుదురితములను దూరం చేయువాడుతృతీయా తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

నిత్యము – నిచ్చలు
వంశము – వంగడము
అద్భుతము – అబ్బురము
విజ్ఞానము – విన్నానము
సత్యము – సత్తు
భాగ్యము – బాగేము
రాట్టు – ఱేడు
గుణము – గొనము
విద్య – విద్దె / విద్దియ
గర్వము – గరువము
శాస్త్రము – చట్టము
కీర్తి – కీరితి

కవి పరిచయం

పాఠము : ‘హరిశ్చంద్రుడు’

కవి : గౌరన

నివాసస్థలం : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం

దేని నుండి గ్రహించబడింది : గౌరన కవి రచించిన “హరిశ్చంద్రోపాఖ్యానం” అనే ద్విపద కావ్యం నుండి గ్రహించబడింది.

కవి కాలము : 15వ శతాబ్దానికి చెందినవాడు.

రచనలు :
1) హరిశ్చంద్రోపాఖ్యానం
2) నవనాథ చరిత్ర
3) సంస్కృతంలో ‘లక్షణ దీపిక’ రచించాడు.

బిరుదు :
సరస సాహిత్య విచక్షణుడు.

రచనాశైలి : మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చతెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగుళికల్లా జాలువారుతాయి. పదప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగునా కనబడుతుంది.

ద్విపద పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1-2 పంక్తులు
నిరుపమ విజ్ఞాననిధి వశిష్ఠుండు
పురుహూతు తోడ నద్భుతముగాఁ బలికె
ప్రతిపదార్ధం :
నిరుపమ విజ్ఞాననిధి; నిరుపమ = సాటిలేని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = పాతర (ఆశ్రయమైన) ;
వశిష్ఠుండు = వశిష్ఠ మహర్షి
పురుహూతుతోడన్ = దేవేంద్రునితో (పెక్కు మందిచే పిలువబడువాడు పురుహూతుడు)
అద్భుతముగాన్ = ఆశ్చర్యకరముగా (వింతగా)
పలికెన్ = ఇలా చెప్పాడు

భావం :
సాటిలేని విజ్ఞాన నిధియైన వశిష్ఠ మహర్షి, ఆశ్చర్యం కలిగే విధంగా దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3వ పంక్తి నుండి 10వ పంక్తి వరకు
వినుము సురేంద్ర యీ విశ్వంబునందు
వినుతి కెక్కిన మహావిక్రమోన్నతుఁడు
వినయభూషణుఁడు వివేకసంపన్నుఁ
డతుల సత్కీర్తి మహాభాగ్యశాలి
వితత ధనుర్వేద విద్యాధికుండు
కరుణాపయోనిధి గాంభీర్యఘనుఁడు
దురితదూరుఁడు బుధస్తోత్రపాత్రుండు
ప్రతిపదార్ధం :
సురేంద్ర = ఓ దేవేంద్రా
వినుము = విను
ఈ విశ్వంబునందు = ఈ ప్రపంచంలో
వినుతికెక్కిన ; (వినుతికిన్ + ఎక్కిన) = ప్రసిద్ధి కెక్కిన
మహావిక్రమోన్నతుడు ; మహా = గొప్ప
విక్రమ = పరాక్రమం చేత
ఉన్నతుడు = గొప్పవాడు
తనరు = ప్రసిద్ధి పొందిన
షోడశ మహాదాన = పదహారు గొప్పదానములచే
వినోది = వినోదంగా ప్రొద్దుపుచ్చేవాడు
వినయ భూషణుడు = వినయమే అలంకారంగా గలవాడు
వివేక సంపన్నుడు = “మంచి చెడ్డలు తెలిసికోడం” అనే వివేకముతో కూడినవాడు
అతుల = పోలిక చెప్పడానికి వీలుకాని
సత్మీర్తి = మంచి కీర్తి గలవాడు
మహాభాగ్యశాలి = గొప్ప ఐశ్వర్యంచే ప్రకాశించేవాడు తనరు షోడశమహాదాన వినోది
వితత = విరివియైన (విస్తారమైన)
ధనుర్వేద విద్యా = ధనుర్వేద విద్య యందు (విలు విద్యలో)
అధికుండు = గొప్పవాడు
కరుణాపయోనిధి = దయకు సముద్రుని వంటివాడు
గాంభీర్యఘనుడు = మేఘము వలె గంభీరుడు
దురితదూరుడు = పాపానికి దూరంగా ఉండేవాడు (పుణ్యాత్ముడు)
బుధస్తోత్ర పాత్రుండు = పండితుల యొక్క ప్రశంసలకు యోగ్యుడు

భావం :
ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమ వంతుడు హరిశ్చంద్రుడు. అతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. సాటిలేని కీర్తి కలవాడు. గొప్ప భాగ్యవంతుడు. విస్తారమైన ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు పండితులను గౌరవించేవాడు.

విశేషాంశం :
షోడశమహాదానములు :
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహార దానము 12. రథదానము 13. గజదానము నిధి 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము.

11వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు
సర్వ శాస్త్రా విచారకోవిదుఁడు
గర్వితరిపుగజ కంఠీరవుండు
వరుస నార్వురు చక్రవర్తులలోనఁ
దరమిడి మున్నెన్నఁదగు చక్రవర్తి
నిత్యప్రసన్నుండు నీతిపాలకుఁడు
సత్యసంధుండు త్రిశంకు నందనుఁడు
నిరుపమ విజ్ఞాననిధి భానువంశ
శరధిచంద్రుఁడు హరిశ్చంద్రుఁడా రాజు
ప్రతిపదార్థం :
సర్వ శాస్త్రార్థ విచారకోవిదుఁడు; సర్వశాస్త్ర = అన్ని శాస్త్రముల
అర్థ = అర్థాన్ని
విచార = పరిశీలించడంలో
కోవిదుడు = పండితుడు
గర్వితరిపుగజ కంఠీరవుండు ; గర్విత = గర్వించిన
రిపు = శత్రువులు అనే
గజ = ఏనుగులకు
కంఠీరవుండు – సింహము వంటివాడు (శత్రువులను మర్ధించేవాడు)
వరుసన్ = వరుసగా
ఆర్వురు చక్రవర్తులలోన్ = ప్రసిద్ధులైన షట్ చక్రవర్తులలో
తరమిడి = తారతమ్యము ఎంచి
మున్ను = ముందుగా
ఎన్నదగు = లెక్కింపదగిన (గ్రహింపదగిన)
చక్రవర్తి = మహారాజు
నిత్య, ప్రసన్నుండు = ఎల్లప్పుడు నిర్మలమైనవాడు (నిత్య సంతుష్టుడు)
నీతిపాలకుఁడు = నీతివంతమైన పాలన చేసేవాడు
సత్యసంధుడు = సత్యమును పాటించేవాడు
త్రిశంకునందనుడు = త్రిశంకుమహారాజు కుమారుడు
నిరుపమ విజ్ఞాన నిధి ; నిరుపమ = పోలిక చెప్పరాని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = రాశి (సాటిలేని విజ్ఞానం కలవాడు)
భానువంశ శరధి చంద్రుడు ;
భానువంశ = సూర్య వంశము అనే
శరధి = సముద్రములో పుట్టిన
చంద్రుడు = చంద్రుని వంటివాడు
హరిశ్చంద్రుఁడా రాజు = హరిశ్చంద్రుడు అనే రాజు

భావం :
అన్ని శాస్త్రాల సారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిటి సింహం వంటివాడు. షట్చక్ర వర్తులలో ఒకడు. సత్యం వదలనివాడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. గొప్ప జ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు. సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్య వంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు.

విశేషాంశం :
షట్చక్రవర్తులు :
1) హరిశ్చంద్రుడు 2) నలుడు 3) పురుకుత్సుడు 4) పురూరవుడు 5) సగరుడు 6) కార్తవీర్యార్జునుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

19వ పంక్తి నుండి 26వ పంక్తి వరకు
పోండిమి మదిఁ దలపోసి చూచినను
వాఁడెపో బొంకనివాఁడు దేవేంద్ర
అల రెండువేల జిహ్వల వానికైనఁ
గొలఁదె హరిశ్చంద్రు గుణములు వొగడఁ
దను వెల్ల సత్యంబు తలఁ పెల్లఁగరుణ
పను లెల్ల ధర్మంబు పలు కెల్లఁ బ్రియము
బొంకు నాలుకకుఁ జేర్పుట కాని వావి
ప్రతిపదార్థం :
పోడిమిన్ = చక్కగా
మదిన్ = మనస్సులో
తలపోసి చూచినను = ఆలోచించి చూసినట్లయితే
దేవేంద్ర = ఓ దేవేంద్రా
బొంకనివాడు = అబద్దం ఆడనివాడు
వాడెపో = వాడే సుమా (ఆ హరిశ్చంద్రుడే)
అల = ప్రసిద్ధమైన
రెండువేల జిహ్వలవానికైనన్; = రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా
హరిశ్చంద్రు = హరిశ్చంద్రుని యొక్క
గుణములు + పొగడన్ = గుణాలను పొగడుటకు
కొలదె; (కొలది + ఎ) = శక్యమా (కాదు)
తనువు + ఎల్లన్ = ఆయన శరీరమంతా
సత్యంబు = సత్యము
తలపు + ఎల్లన్ = హృదయము అంతా
కరుణ = జాలి, దయ
పనులు + ఎల్లన్ = ఆయన పనులు అన్నీ
ధర్మంబు = ధర్మము
పలుకు + ఎల్లన్ = మాట అంతయూ
ప్రియము = ఇంపుగా ఉంటుంది
బొంకు = అబద్ధము
నాలుకకున్ = నాలికవద్దకు
చేర్పుట = చేర్చడం
కాని = లేని
వాయి = నోరు

భావం :
ఓ దేవేంద్రా ! చక్కగా మనస్సులో ఆలోచించి ఆ రాజు చూస్తే హరిశ్చంద్రుడే అబద్ధం ఆడనివాడు. రెండువేలు నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మగుణం కలవాడు. ఆయన ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు. ఆబద్ధమనేది అతనికి తెలియదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

27వ పంక్తి నుండి 33వ పంక్తి వరకు
యింక నన్నియుఁ జెప్ప నేమి కారణము
వారిజ గర్భుని వ్రాంత దప్పినను
వారిజాప్తుఁడు దూర్పువంకఁ గ్రుంకినను
మేరువు గ్రుంగిన మిన్ను వ్రాలినను
ధారుణీ చక్రంబు తలక్రిందు వడిన
వారిధు లింకిన వజ్రాయుధంబు
ధార దప్పిన మాటతప్పఁడా రాజు.
ప్రతిపదార్థం :
ఇంకన్ = ఇంకా
అన్నియున్ = అన్ని గుణాలనూ
చెప్పడన్ = చెప్పడానికి
ఏమి కారణము = కారణము ఏముంది (చెప్పడం ఎందుకు)
వారిజ గర్భుని = పద్మమున పుట్టిన బ్రహ్మ యొక్క
వ్రాత + తప్పి న = రాత తప్పినా
వారిజాప్తుడు = పద్మబంధువైన సూర్యుడు
తూర్పు వంకన్ = తూర్పు దిక్కున
క్రుంకినను = అస్తమించినా
మేరువు = మేరు పర్వతము
క్రుంగినన్ = భూమిలోకి దిగిపోయినా
మిన్ను = ఆకాశము
వ్రాలినను = ఊడి కిందపడినా
ధారుణీ చక్రంబు = భూమండలము
తలక్రిందు + పడినన్ = తలక్రిందులుగా పడినా
వారిధులు = సముద్రములు
ఇంకినన్ = ఎండిపోయినా
వజ్రాయుధంబు = దేవేంద్రుని వజ్రాయుధము
ధారతప్పినిన్ = పదును తగ్గినా
ఆరాజు = ఆ హరిశ్చంద్ర మహారాజు
మాట తప్పడు = ఆడిన మాట తప్పడు

భావం : ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు మాత్రము ఆడినమాట తప్పడు.