AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 11 ధర్మదీక్ష Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Telugu Solutions 11th Lesson ధర్మదీక్ష
9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Textbook Questions and Answers
చదవండి-ఆలోచించండి-చెప్పండి
వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్ని చోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడంకోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.
ప్రశ్న 2.
వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యులలో ఒకడు, జంతువుల దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోసేవాడు. జంతువులు వచ్చి ఆ నీటిని త్రాగుతూ ఉండేవి. ఆ విధంగా వాటి దాహ బాధ తీరింది.
ప్రశ్న 3.
ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
మనం తోటి ప్రాణులకు సహాయం చేస్తే, ఆ ప్రాణులు తిరిగి మనకు సహాయం చేస్తాయి. మనం తోటి మానవులకే కాక పరిసరాల్లో ఉన్న జంతువులకు సహితం సాయం చేయాలి. వాటిపై దయ చూపాలి. మనం సాయం చేస్తే జంతువులు సహితం మనకు సాయం చేస్తాయని ఈ కథ ద్వారా మనం గ్రహించగలం. మన పని మనం చేస్తే, మంచి ఫలితాలు దానంతట అవే వస్తాయని ఈ కథ తెలుపుతుంది.
ప్రశ్న 4.
జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
‘జీవకారుణ్యం’ అంటే ప్రాణులపై దయ అని అర్థం. తోటి మనుష్యుల పైననే కాకుండా, ప్రాణం గల జంతువులన్నింటి మీద కూడా దయ గలిగి ఉండాలి. దానినే ‘జీవకారుణ్యం’ అంటారు.
ప్రశ్న 5.
‘కర్తవ్య నిర్వహణ’ అంటే మీరేమని భావిస్తున్నారు?
జవాబు:
‘కర్తవ్యం’ అంటే ‘ప్రతి జీవి పాటించి తీరవలసిన నిష్ఠ’ అని అర్థం. ప్రతి వ్యక్తికి తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఉంటాయి. చేయవలసిన పనిని వదలకుండా ఆ పనిని చేయడాన్ని ‘కర్తవ్య నిర్వహణ’ అంటారని నేను భావిస్తున్నాను.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది అంశాల గురించి తెలపండి.
ప్రశ్న 1.
ఈ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
“ధర్మదీక్ష”
ఆళవీ గ్రామంలో నందగోపాలుడు అనే ఆవులను పెంచే గోపాలకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆవులు అన్నీ మేతమేసి, ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు రాలేదు. దాని దూడ దాని తల్లి కోసం అంబా అంటూ అరుస్తోంది. నందగోపుడికి ఆ ఆవు పులివాత పడిందేమో అని భయం వేసింది.
మరునాడు తెల్లవారకుండానే అతడు ఆవును వెదకడానికి బయలుదేరాడు. నందగోపుడు అడవిలోని ఆవును వెదకడానికి వెడుతున్నాడు. పొరుగూరి జనం అంతా తీర్థ ప్రజలా ఆళవీ గ్రామానికి వస్తున్నారు. కారణం ఏమిటని నందగోపాలుడు అడిగితే ఆ రోజు గౌతమ బుద్ధుడు ఆళవీ గ్రామానికి వస్తున్నాడనీ, మధ్యాహ్నభిక్ష తరువాత శ్రావస్తీ నగరానికి ఆయన వెడతాడనీ ఒక ముసలితాత నందగోపుడికి చెప్పాడు.
నందగోపుడు తాను తప్పిపోయిన ఆవును వెదకడానికి వెడుతున్నానని అతనితో చెప్పాడు. ఆవు కోసం వెతుకుతూ ఉంటే, బుద్ధుని దర్శనం తనకు కాదేమో అని నందుడికి భయం పట్టుకుంది. వెనకడుగు వేశాడు. కానీ అతనికి ఆవు దూడ అరచినట్లనిపించింది. నందుడు మధ్యాహ్నం వరకూ అడవిలో ఆవుకోసం వెదికాడు. ఇంతలో మిట్టమధ్యాహ్నవేళలో ఆవు ఆర్తనాదం వినిపించింది. అతి కష్టంపై ఆవును పట్టుకొని నందగోపుడు అన్నపానాలకు అలమటిస్తూనే ఆళవీ గ్రామానికి బయలుదేరాడు.
ఆళవీ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో వచ్చి గ్రామస్థుల విందును ఆరగించాడు. పొరుగూరి జనం ఎందరో బుద్ధుని ధర్మబోధలు విందామని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు కాబోతోంది. బుద్ధుడు ఇంకా బోధలు మొదలు పెట్టలేదు. ఎవరికోసమో ఆయన తలఎత్తి చూస్తున్నాడు. ఇంతలో ఆలస్యమయిపోతోందని నందగోపాలుడు సరాసరి బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం దగ్గరకు ఆవుతో వెళ్ళాడు. బుద్ధునికి నమస్కరించాడు. తనకు బుద్ధ దర్శనం అయ్యిందని నందుడు సంతోషించాడు.
బుద్దుడు లేచి, నందగోపాలుడికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. అతని ఆవు దగ్గరకు దాని దూడ వచ్చి పాలు తాగుతోందని, దానికోసం బెంగ పెట్టుకోవద్దనీ నందుణ్ణి బుద్ధుడు ఊరడించాడు. నందుడి దగ్గర గోసాముద్రిక రహస్యాలను బుద్ధుడు తెలుసుకొన్నాడు.
తరువాత బుద్ధుడు అష్టాంగ ధర్మాన్ని బోధించాడు. ప్రజలంతా ఆనందంలో మునిగితేలారు. నందగోపుడికి బుద్ధుడు ధర్మదీక్ష ఇచ్చాడు. భిక్షువులంతా బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరానికి ఆశ్చర్యపడ్డారు. బుద్ధుడు వారికి తాను నందగోపాలుని కోసమే, ఆళవీ గ్రామానికి వచ్చానని తెలియ చెప్పాడు. అది విన్న భిక్షువులు, నందగోపాలుని గౌరవభావంతో చూశారు. నందగోపాలుడు మాత్రం ఆ లేగ దూడవల్లే తనకు బుద్ధుని దర్శనం లభించిందని, దూడను ముద్దు పెట్టుకున్నాడు.
ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘ధర్మదీక్ష’ అనే పేరు సరైందేనా? ఎందుకు?
జవాబు:
ఈ పాఠమునకు ధర్మదీక్ష అని పేరు పెట్టారు. ఈ పేరు కొంతవరకు సరిపోతుంది. గోవులను పోషిస్తూ జీవించే నందగోపాలుడికి గౌతమ బుద్ధుడు ధర్మదీక్షను అనుగ్రహించాడు. కాబట్టి ధర్మదీక్ష అనే పేరు సరయినదే. అయితే ఈ పాఠంలో నందగోపాలుడి గోవాత్సల్యం సంపూర్తిగా కనిపిస్తుంది. అతడు బుద్ధుడి ధర్మ బోధనను వినాలనుకున్నా, దానికంటే ముందుగా తనకు గల గోవాత్సల్యానికే ప్రాధాన్యం ఇచ్చాడు. నందగోపాలుడు ఆకలి దప్పులను లెక్కచేయక ఆకలితో నకనకలాడుతూనే గోవును వెదకి పట్టుకున్నాడు. బుద్ధ దర్శనం కాదేమో అనే భయంతో నేరుగా బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం వద్దకు వచ్చాడు. ఎందరో భక్తులు, బుద్ధుడు అనుగ్రహించే ధర్మదీక్ష కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి ధర్మదీక్షను స్వయంగా బుద్ధుడే నందగోపుడికి అనుగ్రహించాడు.
కాబట్టి ధర్మదీక్ష అనే పేరు ఈ పాఠానికి సరిపోతుంది.
ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకన్నారు?
ప్రశ్న 1.
ఆళవికి పోతున్నాను బాబూ!
జవాబు:
ఆవును వెతకడానికి నందగోపాలుడు అడవికి పోతున్నాడు. ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి ఎందరో
వస్తున్నారు. అందులో ఒక ముసలివాడితో, “ఎక్కడికి తాత ! ఈ ప్రయాణం !” అని నందగోపుడడిగాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ముసలి తాత నందగోపుడితో “ఆళవికి పోతున్నాను బాబూ” అన్నాడు.
ప్రశ్న 2.
నీకింకా తెలియదా?
జవాబు:
“ఎక్కడికి తాతా! ఈ ప్రయాణం!” అని నందగోపుడు ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి వస్తున్న తాతను అడిగాడు. ఆళవికి వెడుతున్నానని తాత చెప్పాడు. అప్పుడు ఆ తాత, నందగోపాలుణ్ణి బుద్ధుడు వస్తున్నాడని “నీకింకా తెలియదా?” అని ప్రశ్నించాడు.
ప్రశ్న 3.
ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా?
జవాబు:
నందగోపుడు తప్పిపోయిన ఆవును పట్టుకొని ఎలాగో శ్రమపడి మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించాడు. అప్పుడు బుద్ధుడు లేచి నిలబడి అక్కడ ఉన్న తన శిష్యులతో “ఇంకా భోజన పదార్ధములు ఏమైనా మిగిలి ఉన్నాయా” అని ప్రశ్నించాడు.
ప్రశ్న 4.
ఆనందగోపాలుని కోసమే !
జవాబు:
బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందగోపాలునికి భోజనం పెట్టించి, ఆదరంతో చూసి ధర్మబోధచేసి, ధర్మదీక్షను అనుగ్రహించాడు. బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూచి మిగిలిన భిక్షువులు గుసగుసలు మాట్లాడుకున్నారు. బుద్ధదేవుడు నందగోపాలుని గోవాత్సల్యాన్ని మెచ్చుకొని, కేవలం నందగోపాలుణ్ణి చూడడం కోసమే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని శిష్యులతో అన్నాడు.
ప్రశ్న 5.
బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి.
జవాబు:
బుద్ధుడు నందగోపాలకుడి కోసమే, తాను ఆళవీ గ్రామానికి వచ్చానని చెప్పాడు. బౌద్ధ భిక్షువులు నందగోపాలుని గౌరవించి నిలబడ్డారు. అప్పుడు నందగోపాలుడు లేచి నిలబడి, “బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి అని, భిక్షువులతో అమాయకంగా మాట్లాడాడు.
ఇ) కింది పేరా చదవండి. ఖాళీలు వివరించండి.
‘కర్తవ్యం. ………… ప్రతి జీవీ పాటించి తీరవలసిన నిష్ఠ. ఒక వానపాము ఎంత అల్పజీవి! మట్టిలో పుడుతుంది. మట్టి తింటుంది. మట్టిల్ మరణిస్తుంది. మరెందుకు అది జన్మ తీసుకుంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే మట్టేదాని జీవనాధారమూ, జీవితమూ అయినా మట్టికీ దాని అవసరం ఉంది. అది మట్టిని తలకిందులు చేస్తుంది. గుల్లగుల్ల చేస్తుంది. గునపాలు చేయలేని ఆ సున్నితమైన వ్యవసాయాన్ని, సుకుమారమైన శరీరంతో శ్రద్ధగా అదే దాని జీవిత లక్ష్యం అన్నంత కర్తవ్యనిష్ఠతో చేస్తుంది. మనిషి మాత్రం అల్పజీవుల అవసరం ఏమిటన్న తేలికభావంతో ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడు.
1. కర్తవ్యం అంటే ప్రతి జీవీ పాటించవలసిన నిష్ఠ.
2. వానపాము జీవనాధారం మట్టి.
3. మనిషి ఉదాసీనత చూపించేది అల్పజీవులయందు.
4. పై పేరాకు శీర్షిక ‘కర్తవ్య నిష్ఠ’.
5. పై పేరాలోని ముఖ్యమైన ఐదు పదాలు : 1) కర్తవ్యం 2) అల్పజీవి 3) జీవనాధారము 4) ఉదాసీనత 5) కర్తవ్య నిష్ఠ
ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
నందగోపుడు ఆరాటపడడానికి కారణం ఏమిటి?
జవాబు:
నందగోపుడి గోవులన్నీ సాయంత్రం తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు మాత్రం రాలేదు. ఆ ఆవు దూడ ‘అంబా’ ‘అంబా’ అంటూ అరుస్తోంది. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుని ఇల్లంతా పాడిపంటలతో కళకళలాడింది. అందుకే ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుడికి ఎంతో ఇష్టం. దూడ తల్లి కోసం అదే పనిగా అరుస్తూ ఉండటంతో నందగోపుడికి అన్నం సయించలేదు. రాత్రి తెల్లవార్లూ, నందగోపుడు ఆవు ఏమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు.
ప్రశ్న 2.
నందగోపునికి ఆ ఆవంటే ఎందుకంత ఇష్టం?
జవాబు:
ఆ ఆవు నందగోపాలుడి ఇంట్లోనే పుట్టి అతని పాపలతో పాటు పెరిగి పెద్దదయ్యింది. అతని పాపలందరూ ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్దవారయ్యారు. నందుడు కూడా వారితో బాటే ఆ ఆవు పాలు తాగి పెద్దవాడయ్యాడు.
ఈ మధ్యనే దానికి ఒక కోడె దూడ పుట్టింది. కోడె పుట్టిన వేళ మంచిది. ఆనాటి నుండీ, నందగోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కళకళలాడింది. అందుకే ఆ ఆవు అంటే నందగోపాలునికి బాగా ఇష్టం.
ప్రశ్న 3.
గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఏయే ఏర్పాట్లు చేశారు?
జవాబు:
ఆళవీ గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఎదురేగి, అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. విశాలమైన మఱ్ఱిచెట్టు నీడలో వారికి విడుదులు ఏర్పాటు చేశారు.
తరువాత తాము ప్రత్యేకంగా భిక్షువులకు విందు చేస్తామనీ, విందు ఆరగించవలసిందనీ వారిని బ్రతిమాలారు. ఈ విధంగా బౌద్ధ భిక్షువులకూ, బుద్ధునికీ గ్రామస్థులు విందు ఏర్పాట్లు చేశారు.
ప్రశ్న 4.
గౌతమ బుద్ధుడు నందగోపుణ్ణి ఏమేం అడిగాడు?
జవాబు:
గౌతమ బుద్ధుడు నందుణ్ణి గోవును గురించీ, కోడె దూడను గురించి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు, తను కోడె దూడ నుదుటిపై నల్లని మచ్చలను గురించి, ఒంటిమీద సుడులను గురించి, ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలను చెప్పాడు. తాను వంశపారంపర్యముగా గ్రహించిన కొన్ని గోసాముద్రిక రహస్యాలను నందగోపుడు బుద్ధునికి తెలిపాడు. గౌతమబుద్ధుడు అడిగిన కొన్ని కొన్ని చిన్న సందేహాలను నందగోపుడు గౌతమునకు తెలిపాడు.
ప్రశ్న 5.
నందగోపుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
నందగోపుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడు. అతన్ని ఎంతగా ఆకలిమంట బాధించినా, అతడు తన గోపాలక ధర్మాన్ని మరువలేదు. అతనికి గోవులపై గల వాత్సల్యం అపారము. ముప్ఫై క్రోశాల దూరం నడిచి, ఎంతో శ్రమపడి అందుకే బుద్ధుడు నందగోపుణ్ణి చూడటానికి ఆళవీ గ్రామానికి వచ్చాడు.
ఆవు తప్పిపోయిందని తెలియగానే నందగోపుడు ఎంతో ఆరాటపడ్డాడు. అతనికి అన్నం సహించలేదు. మర్నాడు మిట్ట మధ్యాహ్నం దాటిపోయే వరకు తనను ఆకలి దహించి వేస్తున్నా, తనకు దాహం వేస్తున్నా ఆవును అతడు వెతికి పట్టుకున్నాడు. ఈ సంఘటన నందగోపునికి గల గోవాత్సల్యాన్నీ, అతని ధర్మ నిర్వహణనూ తెలియపరుస్తుంది.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘గోధూళివేళ అంటే ఏ సమయం? ఆ సమయంలో గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం, అది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. ఆవులు మెడలో కట్టిన గంటలు చప్పుడు చేస్తూ, ఇంటి ముఖం పడతాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆకాశంలో ఎఱ్ఱగా కుంకుమ ఆరపోసినట్లుగా ఉంటుంది. కొందరు ఆవులను త్రాళ్ళకు కట్టివేస్తూ ఉంటారు. కొందరు చుంద్ చుంయ్ అంటూ పాలు పితుకుతూ ఉంటారు. సాయంత్రం పైరుగాలి వీస్తూ ఉంటుంది. ఆవుల కాపరులు ఆవులను వేగంగా ఇళ్ళకు తోలుకు వస్తూ ఉంటారు. ఆవులు, గేదెలు ఆనందంగా గంతులు వేస్తూ ఇళ్ళకు వస్తూ ఉంటాయి.
ప్రశ్న 2.
“ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయకాంతులతో, నూతనానందావేశాలతో కలకలలాడుతున్నాయి”. ఈ వాక్యాన్ని మీ సొంతమాటలలో వివరించండి.
జవాబు:
ప్రజల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. వారందరిలో ఆనందం పొంగుకు వచ్చింది. ముఖాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. వారు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహం వారిలో ఉరకలు వేస్తోంది. అప్పుడే సూర్యుడు ఉదయించినట్లుగా, వారి ముఖాలు ఎర్రగా కళకళలాడుతున్నాయి. బుద్ధునికీ, భిక్షువులకూ ఎదురేగి, వారు జయజయధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా బుద్ధుణ్ణి గ్రామంలోకి తీసుకువచ్చారు.
ప్రశ్న 3.
జిజ్ఞాస రేకెత్తడమంటే ఏమిటి? ఏ అంశాల పట్ల మీకు జిజ్ఞాస ఉంటుంది?
జవాబు:
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస రేకెత్తించడం అంటే, తెలుసుకోవాలనే కోరిక కలిగించడం. పిల్లలకు కొత్త కథలు, వింతలు, ఇంద్రజాల విద్యలు వగైరా చిత్రాలను గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది. సినిమా కథలను తెలుసుకోవాలని ఉంటుంది. ప్రక్క విద్యార్థులు ఏవైనా ప్రయోగాలు చేసి నూతన విషయాలను కనుక్కొంటే తాను కూడా వాటిని తెలుసుకోవాలని పిల్లలకు కుతూహలం ఉంటుంది. ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయో, తూనీగలు ఎలా ఎగురుతున్నాయో, రైలు ఎలా నడుస్తోందో, యంత్రాలు ఎలా తిరుగుతున్నాయో వగైరా విషయాలను తెలుసుకోవాలనే కోరిక పిల్లలకు ఉంటుంది.
ప్రశ్న 4.
ఎదురేగి అతిథి సత్కారాలతో ఎవరెవరిని ఆప్యాయంగా పలకరిస్తారు?
జవాబు:
సన్యాసులను, మఠాధిపతులను ఎదురేగి, అతిథి సత్కారాలు చేసి గౌరవిస్తారు. గురువులను, పూజ్యులను, అతిథులను ఎదురేగి సత్కరిస్తారు. లోనికి రండని, స్వాగతం చెప్పి వారిని లోపలకు తీసుకువస్తారు. మంత్రులనూ, గౌరవనీయులనూ ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి ఆహ్వానిస్తారు.
దేవాలయాలకు ట్రస్టీలనూ, చైర్మన్లనూ నియమించినపుడు వారిని ప్రజలు గౌరవంతో ఎదురేగి స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులను, తాత ముతాతలను, పెద్దలను వారు మన ఇంటికి వచ్చినపుడు గౌరవంగా ఎదురేగి సత్కరించి ఆహ్వానించాలి. మగ పెళ్ళివారికి ఆడపెళ్ళివారు ఎదురేగి అతిథి సత్కారాలతో ఆహ్వానించాలి.
ప్రశ్న 5.
బుద్ధుని ఆప్యాయతను చూసేసరికి నందగోపాలుడి హృదయం ద్రవించి నీరైపోయింది. “హృదయం ద్రవించి నీరైపోవడం ” అంటే ఏమిటి? దీన్ని ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు?
జవాబు:
హృదయం ద్రవించి నీరైపోవడం అంటే, మనస్సు ప్రేమతో తడిసి ముద్దవడం అని అర్థం. జాలి, కరుణ, ఆర్ధత అనే గుణాలు మనస్సులో నిండడం. మనస్సు జాలితో, కరుణతో నిండిపోవడం అని అర్థం.
ఎవరైనా ఆపదలో ఉంటే, ఆ సంఘటనను చూసి జాలితో మనస్సు కరిగిపోతుంది. ఏదైనా బస్సు, ఆటో వంటి వాటికి ప్రమాదం సంభవించినపుడు, అందులోని ప్రయాణికుల కాళ్ళూచేతులు తెగితే, లేక గాయాలయితే, వారి రక్తం రోడ్డుపై ప్రవహిస్తే, అవయవాలు దెబ్బ తింటే ఆ సంఘటనను చూస్తే మనస్సు కరిగి ప్రవహిస్తుంది. మనశక్తి కొద్దీ, వారికి సాయం చేద్దామనుకుంటాం.
అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు, ప్రకృతి బీభత్సాలు సంభవించినపుడు బాధలు పడ్డ ప్రజలను చూస్తే మనస్సులు అలాగే ద్రవిస్తాయి.
ప్రశ్న 6.
ఏ సమయాన్ని గోధూళివేళ యంటారు? అలా అనడానికి కారణమేమిటి?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం. ఇది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. పొద్దుగుంకే సమయం. అని నిఘంటువు అర్థం. ఉదయం మేతకై వెళ్ళిన ఆవులమంద, కడుపునిండినవై, బిడ్డల కడుపు నింపడానికి సంతోషంగా ఇంటికి వస్తున్నప్పుడు గోవుల కాళ్ళతో రేగిన దుమ్ము ఇక్కడ గోధూళిగా చెప్పవచ్చు. గోవులు ఇంటికి వచ్చే సమయం గోధూళి వేళగా ‘రూఢి’ అయింది. (ఉదయం బిడ్డలను విడిచి వెళ్ళే గోవులు మందగమనంతో ఉంటాయి. సాయంత్రం బిడ్డలను చూడాలనే ఆతురతతో గోమాతలు నడుస్తాయి. అందువల్ల దుమ్ము రేగుతుంది.
ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
నందగోపాలుడి గుణగణాలను వర్ణించండి.
జవాబు:
నందగోపాలుడు ఆవులను మేపుతాడు. తనకిష్టమైన ఆవు రాత్రి ఇంటికి రాకపోతే నందగోపాలుడికి అన్నం సయించలేదు. రాత్రంతా ఆవుకు ఏమవుతుందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు. ఆవుపై ప్రేమతో మరునాడుదయమే నందుడు దాన్ని వెతకడానికి అడవికి వెళ్ళాడు. ఆకలి దహించి వేస్తున్నా, నాలుక పిడచగట్టుకు పోతూ ఉన్నా, నందుడు పట్టువిడవకుండా, ఆవును వెతికి పట్టుకున్నాడు.
బుద్ధుడు తన గ్రామానికి వస్తున్నాడని తెలిసి, ఆయన ధర్మబోధ వినలేకపోయినా, ఆయన దర్శనం చేసుకుందామని నందుడు ఆవును తీసుకొని సరాసరి బుద్ధుడు ఉన్న మజ్జి చెట్టు దగ్గరకు వచ్చి బుద్ధునకు నమస్కరించాడు.
నందగోపాలుడి ధర్మకార్యనిర్వహణకు తృప్తిపడిన గౌతమ బుద్ధుడు నందగోపాలునికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. నందగోపాలుడికి, గోసాముద్రిక రహస్యాలు, కోడె దూడల లక్షణాలు, వంశపారంపర్యంగా తెలుసు. బుద్ధుడికి, నందుడు ఆ రహస్యాలను చెప్పాడు. నందుడు వచ్చిన తర్వాత కాని ఆనాడు బుద్ధుడు ధర్మబోధ ప్రారంభించలేదు. బుద్ధుడు స్వయంగా నందగోపాలునికి ధర్మదీక్షను ఇచ్చాడు.
నందగోపాలుడు బుద్దుని అనుగ్రహాన్ని పొందిన భక్తుడు. నందగోపాలుడిని చూడడానికే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని బుద్ధుడు శిష్యులకు చెప్పిన మాట గుర్తు పెట్టుకోదగినది.
గౌతమ బుదుడు చెప్పినట్లు నందగోపాలుని సరళవర్తనం, సాధు స్వభావం ప్రసిద్ధమైనవి. ఎంత ఆకలి మంట అతణ్ణి వేధిస్తున్నా, అతడు తన గోపాలక ధర్మాన్ని విడిచిపెట్టలేదు. బౌద్ధభిక్షువులందరూ నందుని గౌరవభావంతో నిలబడి చూశారు. తాను వట్టి అమాయకుణ్ణని, నందగోపాలుడు అమాయకంగా వినయంతో వారికి చెప్పాడు. నందగోపాలుడు, సజ్జనుడైన ఆలకాపరి.
ప్రశ్న 2.
గౌతమబుద్ధుడు నందగోపాలుడిపై వాత్సల్యాన్ని ఎలా చూపించాడు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
నందగోపాలుడి ధర్మ నిర్వహణ పట్ల, కర్తవ్యం పట్ల, అతనికి గల గోవాత్సల్యం పట్ల కరుణామూర్తియైన బుద్ధుడు ఆనందించాడు. నందగోపాలుడిని చూడాలని శిష్యులతో 30 క్రోశాల దూరం నడచి, నందగోపాలుడి ఆళవీ గ్రామానికి వచ్చాడు. నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ధర్మ ప్రసంగాన్ని ప్రారంభించలేదు.
నందగోపాలుడు మధ్యాహ్నము 3 గంటలకు తన ఆవుతో సహా బుద్దుడి వద్దకు వచ్చాడు. ఇంతలో ఆవు దూడ అరుపు గుర్తుకు వచ్చి అతడు ఇంటికి బయలుదేరబోయాడు. దూడ తాడు ట్రెంపుకొని తల్లి వద్ద పాలు తాగుతోందని, స్వయంగా బుద్దుడు నందుడికి చెప్పి, నందుడికి దగ్గరుండి కడుపు నిండా భోజనం పెట్టించాడు.
నందగోపాలుడి భోజనం పూర్తి అయ్యాక బుద్దుడు నందుణ్ణి తనతో తీసుకొని వెళ్ళి ధర్మబోధ ప్రారంభించాడు. బుద్ధుని ధర్మబోధ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నా బుద్ధుడు నందుడు వచ్చేవరకూ బోధ ప్రారంభించలేదు.
మధ్యాహ్నమే శ్రావస్తీ నగరానికి వెళ్ళవలసియున్నా నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. నందగోపాలుడికి తాను ప్రక్కన కూర్చుండి కడుపునిండా భోజనం పెట్టించాడు. నందుడికి ధర్మదీక్షను ఇచ్చాడు. నందుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడనీ, గోపాలక ధర్మాన్ని నిర్వర్తించిన సజ్జనుడనీ శిష్యులకు బుద్దుడు చెప్పి నందగోపాలకుని మెచ్చుకున్నాడు.
ప్రశ్న 3.
మానవులుగా పుట్టినందుకు మనం ఎవరిపట్ల, వేటిపట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించాలి? ఎందుకని?
జవాబు:
మానవులుగా పుట్టినందుకు తోడి ప్రాణులపట్ల జాలి, దయ, సానుభూతి, అనుకంపలను మనం చూపించాలి. మానవులం కాబట్టి మనలో దానవత్వం ఉండరాదు. తోడి మానవుల యందు, ప్రకృతిలోని పశుపక్ష్యాదులయందు, కరుణ చూపించాలి. జీవహింస చేయరాదు.
మనకు ముల్లు గుచ్చుకుంటే మనం బాధపడతాము. అలాగే జంతువులు కూడా తమకు బాధ కలిగితే అవి సహించలేవు. ఏడుస్తాయి. మనము దయతో ఆ జంతువులకు కావలసిన ఆహారము, నీరు అందించాలి. కొందరు సత్పురుషులు పశు అశ పక్ష్యాదుల తిండికి, నీరు త్రాగడానికి ఏర్పాట్లు చేస్తారు. తాను అన్నం తినే ముందు, ఒకటి రెండు ముద్దలు కాకులకో, కుక్కలకో, జంతువులకో పెడతారు. అదే జీవకారుణ్యము. కొన్ని ప్రాంతాల్లో జీవకారుణ్య సంఘాలు ఉంటాయి.
తోటి ప్రాణులను, నీ ప్రాణం లాగే చూడాలి. సర్వప్రాణి సమానత్వం ఉండాలి. అల్ప ప్రాణులయిన సీతాకోక చిలుక, మిడత, దోమ, నల్లి వంటి వాటిని కూడా చంపరాదు. సర్వజీవ సమానత్వం మనందరం అలవరచుకోవలసిన మంచిగుణం. అది ముఖ్య కర్తవ్యం.
ఇ) సృజనాత్మకంగా రాయండి.
* ఇది ఎందుకూ పనికిరాదు. దీన్ని కబేళాకు తీసుకొనిపోండి – అన్న యజమాని మాటలకు ఆ ఎద్దు గుండె గుభేలుమంది. తన గంతులేసే బాల్యం, అప్పటి నుండి తన యజమానికి చేసిన సేవ గుర్తుకు వచ్చాయి. బాధగా మూలిగింది – ఇలాంటి ఎద్దు ఆత్మకథను ఊహించి రాయండి.
జవాబు:
అవును. నేను ఇప్పుడు ముసలిదాన్నయ్యాను. నన్ను కర్కశంగా చంపి తినేయడానికి కబేళాకు అమ్మేస్తారా ? ఎంత దారుణం!
నేను ఎంత బాగా పెరిగాను | మా అమ్మ, రోజూ నాకు తన పొదుగులో దాచి, అర్థశేరు పాలు ఇచ్చేది. అవి తాగి, లేత పచ్చి గడ్డి తిని ఎంతో బాగా గంతులు వేసేదాన్ని. నా మెడలో గంటలు కట్టి నన్ను పరుగు పెట్టించి, పిల్లలు నా వెనుక పరుగుపెట్టేవారు. ఆ రోజులే రోజులు !
నేను పెద్దయ్యాక, మా యజమాని నాగలిని ఎన్నోసార్లు లాగాను. పొలాలు దున్నాను. నా తోడి ఎదు రాముడుతోపాటు మా యజమాని బండి లాగాను. ఎంత బరువు వేసినా కాదనలేదు. ఇంతే కాదు. అందాల ఎద్దుల పోటీలో నేను నాలుసార్లు మొదటి బహుమతులు తెచ్చి మా యజమానికి ఇచ్చాను. ఎడ్ల పందేలలో మా యజమానికి మూడుసార్లు గెలుపు సాధించి పెట్టాను. బండ చాకిరీ చేశాను. ఇప్పుడు నేను పనికిరాని దాననయ్యాను.
ఈ మానవులకు జాలి లేదు. నాకు పెట్టే తిండి తగ్గించేశారు. చివరకు నన్ను కబేళాకు అమ్మేస్తున్నారు. ఇంత కృతఘ్నతా? ఈ విషయంలో మనుషుల కంటె, మా జంతువులే నయమేమో ! సరే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం చేస్తాము ? మా యజమాని బహుశః వాళ్ళ అమ్మా నాన్నలనూ రేపో మాపో కబేళాకు తోలేస్తాడేమో ! భగవాన్ ! మా యజమానికి కొంచెం కరుణా బుద్ధి ప్రసాదించు.
(లేదా )
* ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు, కనుమరుగయే ప్రమాదం ఏర్పడింది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కింది వాటిలో ఒకదాన్ని తయారుచేయండి.
i) పోస్టర్ ii) కరపత్రం iii) ప్రసంగ పాఠం
జవాబు:
ii) జంతు రక్షణ చర్యలు (కరపత్రం) :
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.
అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులు, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.
ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులు, జంతువులు. “అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.
ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
* సామ్య తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఆమెకు పిచ్చుకలంటే మహా ప్రేమ. వాటికోసం అపార్టుమెంటు బాల్కనీలోనే కుండీల్లో చెట్లు పెంచింది. కొన్నాళ్ళకు ఆ పూలచెట్ల మధ్యే పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. గుడ్లు పెట్టాయి. పొదిగాయి. సౌమ్య గింజలు చల్లి, నీళ్లు పెట్టి వాటి ఆలనాపాలనా చూస్తుండేది.
ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
స్నేహశీలి సౌమ్యకు శుభాభినందనలు.
ఈ రోజుల్లో జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. నీకు పిచ్చుకలంటే ఇష్టమనీ, నీకు పెద్దగా సావకాశం లేకపోయినా, మీ బాల్కనీ కుండీల్లో పెరిగిన మొక్కల మధ్య పిచ్చుకలను పెంచుతున్నావని తెలిసింది. చాలా సంతోషం.
నిజానికి పిచ్చుకలు చాలా అందంగా, ముద్దు వస్తుంటాయి. నీవు వాటిని రోజూ ఏమి వేసి పెంచుతున్నావు? మనతోటి జంతువులను ప్రేమించి, రక్షించడం మంచి అలవాటు. నాకు కూడా కుక్కలంటే ఇష్టం. మా ఇంట్లో నాలుగు రకాల జాతుల కుక్కల్ని పెంచుతున్నాను. సోనియాగాంధీ తోడి కోడలికి కూడా జంతువులంటే గొప్ప ఇష్టం. నీ పక్షి ప్రేమకు, నా మనఃపూర్వక అభినందనచందనం. నాకు కూడా చిలుకల్ని పెంచాలని ఉంది. పక్షుల పెంపకంలో నీ సలహాలు నాకు చాలా అవసరం. – ఉంటా. బై.బై.
IV. ప్రాజెక్టు పని
* మీ పాఠ్యాంశంలోని జాతీయాలను సేకరించండి. వాటితోపాటు మరికొన్ని జాతీయాలను సేకరించండి. వివరించండి. ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.
III. భాషాంశాలు
పదజాలం
అ) పేరా చదివి గీత గీసిన పదాలను ఏ అర్థంలో వాడారో రాయండి.
నందగోపునికి అన్నం కంటపడగానే పంచప్రాణాలూ లేచి వచ్చాయి. గతరాత్రినించి ఆ క్షణం వరకూ అతడాకటితో నకనకలాడుతున్నాడు. ఆకలితో నవనాడులు కుంగిపోతున్నాయి.
1. పంచప్రాణాలూ లేచి రావడం
జవాబు:
శరీరంలో తిరిగి సత్తువ రావడం
2. ఆకలితో నకనకలాడటం
జవాబు:
ఆకలితో నీరసపడడం
3. నవనాడులు కుంగిపోవడం
జవాబు:
బాగా దిగాలు పడడం
ఆ) కింది పదాలకు సమానార్థకాలు రాయండి.
1) గోధూళి వేళ = సాయం సమయం (ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం)
2) ఆలమంద = ఆవుల గుంపు
3) తీర్థప్రజ = తీర్థమునకు వచ్చిన జనం
4) గాలించు = వెదుకు
5) విడిది = అతిథుల వసతి గృహం
6) ఉవ్విళ్లూరు = బాగా కోరుకొను
7) అనతిదూరం = కొద్ది దూరం
ఇ) వాక్యాన్ని చదివి, జాతీయాల అర్థాన్ని ఊహించి రాయండి.
1) మీ ఆప్యాయతకు నా హృదయం కరిగిపోయింది.
జవాబు:
హృదయం కరిగిపోయింది = ద్రవించింది
2) మేధావులందరూ చర్చలలో తలమునకలయ్యారు.
జవాబు:
తలమునకలయ్యారు = మునిగిపోవు
3) ఆవు అరుపు విన్నాక నందగోపాలుడికి బుద్ధుడి దగ్గరకు వెళ్ళడానికి కాలుసాగలేదు.
జవాబు:
కాలుసాగలేదు = ముందడుగు పడలేదు.
వ్యాకరణం
అ) కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1. ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు. .
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది.
2. రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు.
3. నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు.
4. ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడింది.
ఆ) కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.
1. బుద్ధదేవుడు, వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)
2. లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దుపెట్టుకొన్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాన లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకొన్నాడు. (సంయుక్త వాక్యం)
ఇ) విరామ చిహ్నాలు గుర్తించండి.
నాయనా నందగోపాలకుని సరళ వర్తనం సాధుస్వభావం మీరెరుగరు ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు అతని గోవాత్సల్యం అపారం ముప్పయి క్రోశాల దూరం నడిచి ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా
జవాబు:
“నాయనా! నందగోపాలుని సరళవర్తనం, సాధుస్వభావం మీరెరుగరు. ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా, అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు ! అతని గోవాత్సల్యం అపారం ! ముప్పయి క్రోశాల దూరం నడిచి, ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా?”
ఈ) పాఠంలోని పది సమాస పదాలను రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో తెలపండి.
1) భాను బింబం = భానుని యొక్క బింబం – షష్ఠీ తత్పురుష సమాసం
2) ధర్మబోధ = ధర్మము యొక్క బోధ షష్ఠీ తత్పురుష సమాసం
3) విశాలనేత్రాలు = విశాలమైన నేత్రాలు విశేషణ పూర్వపద కర్మధారయం
4) వృక్షచ్ఛాయ = వృక్షము యొక్క ఛాయ షష్ఠీ తత్పురుష సమాసం
5) పంచప్రాణాలు = పంచ సంఖ్య గల ప్రాణాలు ద్విగు సమాసం
6) నవనాడులు = నవ సంఖ్య గల నాడులు – ద్విగు సమాసం
7) అన్నపానాలు = అన్నమును, పానమును ద్వంద్వ సమాసం
8) ముప్పయి క్రోశాలు = ముప్పది సంఖ్యగల క్రోశాలు – ద్విగు సమాసం
9) ఆనంద తరంగాలు = ఆనందము అనెడి తరంగాలు – రూపక సమాసం
10) ప్రశాంత స్వరం = ప్రశాంతమైన స్వరం – విశేషణ పూర్వపద కర్మధారయం
11) క్షుధార్తుడు = క్షుధతో ఆర్తుడు – తృతీయా తత్పురుషం
ఉ) మీరు తెలుసుకున్న అలంకారాలు ఏవి? ఈ పాతంలో వాటికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయా? వాటిని రాయండి. లేని వాటికి మీరే సొంతంగా రాయండి.
1) ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం.
పాఠంలోని ఉదాహరణ :
1) గౌతమదేవుని ముఖ జ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భాను బింబంలా మెరిసింది.
2) వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస లాంటిది. అతంతు
2) రూపకాలంకారం :
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం.
పాఠంలో ఉదాహరణ:
1) ముఖజ్యోతి (ముఖం అనెడి జ్యోతి) (రూపకాలంకారము)
2) ఆనంద తరంగాలలో తలమునకలైనారు (రూపకాలంకారము)
3) దృష్టాంతాలంకారం :
ఉపమానోపమేయాలు వేరైనా బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశించడం,
ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.
4) స్వభావోక్తి అలంకారం :
ఉన్నది ఉన్నట్లు రమణీయంగా వర్ణించడం.
ఉదాహరణ :
లేళ్ళు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు రిక్కించి ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నాయి.
5) ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని చూసి ఉపమానంగా ఊహించడం.
ఉదాహరణ :
మా ఇంటి ముందు ఉన్న పెద్ద కుక్కను చూసి, సింహమేమో అని భయపడ్డాను.
6) వృత్త్యనుప్రాస అలంకారం :
ఒకే అక్షరం, అనేకసార్లు రావడాన్ని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణ :
నాయనా ! నేను నిన్నేమన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?
7) అంత్యాను ప్రాసాలంకారం :
ఒక అక్షరం, లేదా రెండుమూడు అక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ :
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథలో రక్తి – ఓ కూనలమ్మా !
8) లాటాను ప్రాసాలంకారం :
అర్థభేదము లేకపోయినా, తాత్పర్యభేదం కల పదాలు ఒకదానివెంట మరొకటి రావడం.
ఉదాహరణ :
కమలాక్షునర్చించు కరములు కరములు.
9) ఛేకానుప్రాసాలంకారం :
అర్థభేదం గల జంటపదాలు వెంటవెంటనే రావడం ఛేకానుప్రాసాలంకారం,
ఉదాహరణ :
వందవందనాలు.
9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష కవి పరిచయం
పిలకా గణపతిశాస్త్రి 1911 ఫిబ్రవరి 24న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కట్టుంగ వీరి స్వస్థలం. విజయనగరంలో విద్యనభ్యసించారు. సాహిత్య విద్యా ప్రవీణ, ఉభయభాషా ప్రవీణ పూర్తిచేశారు. రత్నాపహారం వీరి తొలిరచన. మణిదీపిక, ప్రాచీన గాథాలహరి, విశాలనేత్రాలు, కాశ్మీర పట్టమహిషి, నాగమల్లిక, అందని చందమామ వీరి ఇతర రచనలు. సంస్కృతం, బెంగాలీ భాషల నుంచి అనేక అనువాదాలు చేశారు. సరళమైన అలంకారిక శైలిలో వీరి రచన సాగింది.
కలిన పదాలకు అర్థాలు
గోధూళి వేళ = సాయం సమయం ; ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం
ఆలమంద = ఆవుల గుంపు
గోవత్సాలు = ఆవు దూడలు
కుడుచుకుంటున్నాయి = చప్పరించుచున్నాయి (త్రాగుచున్నాయి)
కలకలలాడింది = ఆనందంగా ఉంది
సయించలేదు = ఇష్టం కాలేదు
ఆరాటపడు = ఆత్రపడు
= సంతాపము నొందు
అరుణోదయ కాంతులు (అరుణ +ఉదయ కాంతులు) = సూర్యోదయ కాంతులు
నూతనానందావేశాలు (నూతన+ఆనంద+ఆవేశాలు) = కొత్త ఆనందము యొక్క ఉద్రేకాలు
హృదయాంతరాళం (హృదయ+అంతరాళం) = హృదయం మధ్య చోటు
సందర్శనభాగ్యం = చూచే అదృష్టం
నిట్టూర్పు = దీర్ఘ నిశ్వాసము
వాలకం = రూపు
పులివాత = పులినోట్లో
ఆరాటం = ఆవుల పాక
తథాగతుడు = బుద్ధుడు
పాపలు = చిన్న పిల్లలు
కోడెదూడ = మగ ఆవుదూడ
పెయ్యదూడ = ఆడ దూడ
గౌతమదేవుడు = బుద్ధుడు
అధమ పక్షం = (మిక్కిలి చెడ్డ పక్షం) కనీసం
అంగలు = చాచివేసిన రెండు అడుగులు చోటులు
మిట్ట మధ్యాహ్నం = మధ్యాహ్న కాలము
దహించి వేయు = కాల్చు
పిడచగట్టుకుపోవు = నోరు ఎండిపోవు
స్పురించింది = తోచింది
ఆర్తనాదం = బాధతో అరిచే అరుపు
పెన్నిధి = పెద్ద నిధి
తికమకలు = బాధలు (తొట్రుపాటులు)
పొలిమేర = సరిహద్దు
సంకల్పం = ఉద్దేశ్యం
అధమం = కనీసం
మహామహుడు = గొప్పవాడు
ఉవ్విళ్ళూరిపోవు = బాగా కోరుకొను
శిష్యగణం = శిష్యుల సమూహం
విశ్రమించిన = ఆయాసం తీర్చుకొనిన
వటవృక్షం = మజ్జిచెట్టు
కాషాయాంబరధారులు = కాషాయ వస్త్రాన్ని ధరించినవారు.
భిక్షుకులు = సన్యాసులు
ముఖజ్యోతి = ముఖ ప్రకాశము
భాను బింబము = సూర్య బింబము
విడుదులు = అతిథుల వసతి గృహాలు
ఆసన్నము+అగు = సమీపించడం ; దగ్గరికి రావడం
వంశపారంపర్యత: = వంశములో ఒకరి తరువాత ఒకరుగా
అనుమతించలేదు = అంగీకరించలేదు
ప్రాధేయపడ్డారు = వేడుకున్నారు
విసర్జించు = విడుచు
అనుజ్ఞ = అంగీకారము
శ్రమణకులు = బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుడి శిష్యులుగా ఉండేవారు.
వట తరుచ్ఛాయ = మట్టిచెట్టు నీడ
సమాసీనులు = చక్కగా కూర్చున్నవారు
యామాలకాలం = జాముల కాలం ; యామము అంటే 3 గంటలు
సుఖాసనం (సుఖ +ఆసనం) = సుఖమైన ఆసనం
అవలోకిస్తున్నాడు = చూస్తున్నాడు
ఆలకించు = విను
ఉత్కంఠ = ఇష్టవస్తు ప్రాప్తికై వేగిరపాటు
తహతహలాడిపోవు = వేగిరపడు
పలుకు = మాట
నేత్రాలు = కన్నులు
నిరీక్షించు = ఎదురుచూచు
స్ఫురిస్తున్నాయి = తోస్తున్నాయి
నిరీక్షణ = ఎదురుచూపు
అవగాహన = తెలిసికొనడం
అనతిదూరం = కొద్ది దూరం
పరికిస్తున్నాయి = పరీక్షిస్తున్నాయి
ఆత్రంగా = తొందరగా
ఆగమనము = రాక
సాగిలపడ్డాడు = సాష్టాంగ నమస్కారం చేశాడు
దోసిలి ఒగ్గి = చేతులు జోడించి
ఆత్రం = తొందర
పంచప్రాణాలు = ఐదు ప్రాణాలు 1) ప్రాణము 2) అపానము 3) వ్యానము 4) ఉదానము 5) సమానము
నవనాడులు = తొమ్మిది నాడులు (నాడులు అన్నీ)
నకనకలాడు = ఆకలిచే బాధపడు
పలుపు = పశువుల మెడకు కట్టు త్రాడు
ఆప్యాయత = ప్రేమ ప్రత్యక్షము = ఎదుట ఉన్నది
ద్రవించి = కరగి
కుశల ప్రశ్నలు = క్షేమ సమాచారాలను గూర్చి ప్రశ్నలు
సాముద్రిక విషయాలు = హస్తరేఖాది లక్షణాలను బట్టి శుభా శుభాలు తెలిపే శాస్త్ర విషయాలు
ఆచార్యదేవుడు = గురువు
సందేహాలు = అనుమానాలు
అభ్యర్థించారు = కోరారు
చనువు = ప్రేమ
ఉపదేశించు = బోధించు
ప్రసంగాలు = ఉపన్యాసాలు
విడ్డూరము = ఆశ్చర్యము
అష్టాంగ ధర్మ ప్రవచనం = ఎనిమిది అంగములైన ధర్మాలు చెప్పడం: 1) సమ్యక్ దృష్టి 2) సమ్యక్ వాక్కు 3) సమ్యక్ కర్మ 4) సమ్యక్ సంకల్పం లక్ష్యం 5) సమ్యక్ చేతన, మనస్తత్వం 6) సమ్యక్ జీవనం 7) సమ్యక్ వ్యాయామం 8) సమ్యక్ భావన
ఆనందతరంగాలు = సంతోషపు కెరటాలు
తలమునకలగు = ఎక్కువగు
అలవోకగా = అప్రయత్నముగా ; (లీలగా)
ప్రవచనం = చక్కగా మాట్లాడడం
నిగ్రహం = సంయమనం
శ్రమణకులు = బౌద్ధ భిక్షువులు
గుసగుసలు = రహస్యం మాటలు
ఉపేక్షించి = అశ్రద్ధ చేసి
పక్షపాతం = ఒకదానియందభిమానం
సమ్యక్ సంబుద్ధుడు = బుద్ధుడు
స్వరం = ధ్వని
క్షుధార్తుడు = ఆకలితో బాధపడేవాడు
క్షుధ = ఆకలి
దుస్సహము = సహింపరానిది
యాతన = తీవ్రవేదన
సమ్యగుృద్ధి (సమ్యక్ + బుద్ధి) = సరియైన బుద్ధి
నిర్వాణం = మోక్షం
కరతలామలకం (కరతల+ ఆమలకం) – బాగా తెలిసినది (అరచేతిలో ఉసిరిక)
పశ్చాత్తప్తులు = తాముచేసింది తప్పని తెలిసి, అలా చేశామే అని బాధపడేవారు
ఆకటిచిచ్చు = ఆకలి మంట
గోవాత్సల్యం = ఆవుపై ప్రేమ
అపారం = అంతులేనిది
గో, గోవత్సాలు = ఆవు, ఆవు దూడలు
మంద = ఆవులు మొదలైన పశువుల గుంపు
అన్నపానాలు = అన్నము, పానము (తిండి, నీరు)
తాండవించాయి. = కదలియాడాయి
మురిసిపోయాడు = సంతోషించాడు
కుడుచుకొని = చప్పరించి, త్రాగి