AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు
AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 3rd Lesson జానపదుని జాబు
10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 2 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
జానపదుని జాబు రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురులో జన్మించారు. వారు 1911 నుండి 2005 వరకు జీవించారు.
వీరు కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. 1940-45 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వీరు డిశంబరు 16వ తేదీ, 2005న మరణించారు.
ప్రశ్న 2.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన రచనా వ్యాసంగాన్ని గూర్చి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా॥ బోయి భీమన్న గారు రచించారు.
ఆయన తన 11వ ఏట నుండే రచనలు చేశారు. “గుడిసెలు కాలిపోతున్నాయి”, పాలేరు, జానపదుని జాబు, పిల్లీ శతకం, ఉశారులు, ధర్మం కోసం పోరాటం, రాగవైశాఖి మొదలైన 70 రచనలు చేశారు.
ఆయన రచించిన పాలేరు నాటకం ప్రభావంతో ఎంతోమంది పేదలు, దళితులు తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించి పాఠశాలలో చేర్పించారు. ఈ నాటకం స్ఫూర్తితో ఎంతోమంది ఉన్నత విద్యావంతులయ్యారు. ఉన్నతోద్యోగులు అయ్యారు.
ప్రశ్న 3.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన అందుకొన్న పురస్కారాలేవి?
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్నాయ్ రచనకు 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం 1973లో పద్మశ్రీ బిరుదునిచ్చింది. 2001లో పద్మభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది.
1978+84 మధ్య రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యత్వం ఇచ్చి బోయి భీమన్న గారిని గౌరవించింది. 1991లో . రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ వారు రాజ్యలక్ష్మీ అవార్డును ఇచ్చి సత్కరించారు.
ప్రశ్న 4.
పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో తెలపండి.
జవాబు:
పల్లెటూరి జీవితం ఎంతో మనోహరంగా ఉంటుంది. అక్కడ చక్కని గాలి, ఎండ, నీరు దొరుకుతుంది. పాలు, కూరగాయలు దొరుకుతాయి. మంచి అందమైన చేలూ, కాలువలూ ఉంటాయి. అక్కడ ప్రకృతి మనోహరంగా ఉంటుంది. కాని, ఆధునిక సదుపాయాలు ఏవీ అక్కడ ఉండవు. అక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.
ప్రశ్న 5.
రచయిత పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
గ్రామీణ నేపథ్యాన్ని ఇష్టపడతాడు. పేద కుటుంబీకుడు. తన కుటుంబంతో చాలా అనుబంధం గలవాడు. పట్నవాసులంతా సుఖంగా ఉంటారనే అపోహ కలవాడు. రైతు కుటుంబం. తోటి రైతుల కష్టాలలో పాలుపంచుకొనే స్వభావం కలవాడు. పల్లెటూరి ప్రజలపై ప్రేమ కలవాడు. పల్లెటూరిపై మమకారం కలవాడు.
ప్రశ్న 6.
జానపదుని జాబు” పాఠ్యభాగ నేపథ్యం గురించి రాయండి.
జవాబు:
చదువుకొని బీదతనం వలన చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనులలో మునిగిపోయిన ‘జానపదుడు’ శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాలలోని పరిస్థితులను లేఖల రూపంలో తెలుపుటయే జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యము.
ప్రశ్న 7.
సమాచార సాధనమైన ‘లేఖ’ను గురించి వివరించండి. (March 2018)
జవాబు:
- సమాచారాన్ని చేరవేసే సాధనం లేఖ.
- కొన్ని సందర్భాలలో ప్రత్యేక సాహితీ లక్షణాలను, విలువలను కలిగి ఉంటుంది.
- లేఖలు ఆయాకాలాలకు సంబంధించినవే అయినా, కొన్నిసార్లు అందులోని విషయాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి.
- లేఖలు వ్యక్తిగత లేఖలు, అధికారిక లేఖలు, వ్యాపారాత్మక లేఖలు అని ప్రధానంగా మూడు విధాలుగా ఉంటాయి.
10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 4 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘బద్దకం’ గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పనిచేయడానికి వెనుకాడడం. అంటే మాంద్యము. సోమరిపోతులయిన వారు ఏ పని చేయడానికీ ముందుకు రారు. వారికి పనిచేయడానికి బద్దకం. తగిన పని, చేతిలో లేకపోతే పనిమంతులకు కూడా బద్దకం వస్తుంది.
నగరాలలో వారికి చేతిలో ఏదో పని ఉంటుంది. గ్రామాలలో రైతులకు కొన్ని రోజుల్లోనే పని ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల్లో ఏ పనీ ఉండదు. అప్పుడు వారు ముడుచుకొని మంచము ఎక్కి పడుకుంటారు. లేదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
కాని ‘బద్దకం’ మంచి లక్షణం కాదు. పిల్లలు బడికి వెళ్ళడానికి, పాఠం చదవటానికి, ఇంటి పని చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చెయ్యాలి. బద్దకం విడిచి చురుకుగా పనులు చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. బద్దకం, సంజ నిద్ర, పనికిరాదని సుమతీ శతకం చెపుతోంది. ముఖ్యంగా యువత, బద్దకం, విడిచి తమ పనులు సకాలంలో సాగిస్తే దేశం సౌభాగ్యవంతం అవుతుంది.
ప్రశ్న 2.
బద్దకం వదలాలంటే ఏమి చేయాలో వివరించండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పని చేయడానికి ముందుకు రాకపోవడం. పని బద్ధకులకు అభివృద్ధి ఉండదు. బద్దకం వదలాలంటే రాత్రి పెందలకడనే నిద్రపోవాలి. ఉదయం సూర్యోదయం కాకుండానే లేవాలి. నడక, పరుగు, వంటి వ్యాయామాలు చేయాలి. పిల్లలు, పెద్దలకు ఇంటి పనుల్లో సాయం చేయాలి. చక్కగా స్నానం చేయాలి. పిల్లలు సాయం సమయంలో ఆటలు ఆడాలి. హాయిగా గొంతువిప్పి పాటలు పాడాలి.
పిల్లలు బద్దకంగా టి.విల ముందు కూర్చుండి, సీరియల్సు చూస్తూ ఉండరాదు. ఆడపిల్లలు తల్లుల పనిలో సాయం చేయాలి. మగపిల్లలు తండ్రికి పనిలో సాయం చేయాలి. అలా చేస్తే తండ్రి చేసే వృత్తి పనులు వారికి అలవాటు అవుతాయి.
పిల్లలు బద్దకం విడిచి చక్కగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వారు యోగా, వ్యాయామము వంటి వాటిలో పాల్గొంటూ, ఆటపాటలలో పాల్గొంటూ మంచి చురుకుగా, ఉత్సాహంగా ఉండాలి. అటువంటి చురుకైన యువతవల్లే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి అవుతుంది.
ప్రశ్న 3.
కాలం ఎలా విలువైందో నిరూపించు.
జవాబు:
‘కాలము’ విలువ అయింది. గడచిన క్షణం, తిరిగి రాదు. ప్రతి వ్యక్తి తాను చేయవలసిన పనిని సకాలంలో చేయాలి. రేపు . చేద్దాం అనుకుంటే, ఒక రోజు అతడి జీవితంలో వ్యర్థం అయినట్లే.
మన ఆయుర్దాయం చాలా పరిమితంగా ఉంటుంది. మనం ఎంత కాలం బ్రతుకుతామో మనకు తెలియదు. దేవుడిని ప్రార్థించేందుకు తిరిగి మనకు సమయం దొరకదు. బ్రతికి ఉండగానే దైవపూజ చేయాలి. చేయవలసిన పనులు పూర్తి చేయాలి. ఒక పరీక్షకు సిద్ధపడే వ్యక్తి ఏ రోజుకు ఆ రోజు చదివి సిద్ధం కావాలి. రేపు అనే మాట ఉండరాదు. అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడుపుకోవాలి. ఆడవలసిన కాలంలో ఆడాలి. వ్యాయామం చేయవలసిన కాలంలో వ్యాయామం చేయాలి.
డాక్టరుగారు నిత్యం వ్యాయామం చేసి ఉన్నట్లయితే గుండె రోగం వచ్చి ఉండేది కాదంటారు. అప్పుడు మనం పశ్చాత్తాప పడతాం. కాని జరిగి పోయిన కాలాన్ని మనం వెనుకకు తీసుకురాలేము. ఎంత డబ్బు ఇచ్చినా, జరిగిపోయిన కాలాన్ని ఒక్క నిమిషం కూడా తిరిగి తీసుకురాలేము.
కాబట్టి కాలం ప్రాధాన్యాన్ని గుర్తించి, సకాలంలో ప్రతి పనినీ పూర్తి చేసి జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. గ్రామాల్లో రైతులు సకాలంలో పొలం పనులు చేపట్టాలి. సకాలంలో పురుగుమందులు చల్లాలి. లేకపోతే పొలంలో పంట, నాశనం అవుతుంది.
ప్రశ్న 4.
పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని భావిస్తున్నారా?
జవాబు:
పల్లెలు నిజానికి సౌఖ్యనిలయాలు. పల్లెల్లో మంచి పాడిపంటలు ఉంటాయి. తాజాకూరగాయలు, చల్లని, కలుషితం కాని గాలి లభిస్తుంది. ప్రతి ఇల్లు ముగ్గులతో, పూల తోరణాలతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రామాలలో ఆవులు, గేదెలు ఇచ్చే తాజా పాలు లభిస్తాయి. అక్కడ కల్మషం లేని ప్రజల పలకరింపులు దొరుకుతాయి. పల్లె ప్రజలు పరస్పరం ఒకరికి , మరొకరు సాయం చేసుకుంటారు. పల్లెల్లో మంచి తాజాపళ్ళు, కూరలు లభిస్తాయి.
కాని గ్రామాలలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యంగా వాటికి రోడ్లు, ప్రయాణసౌకర్యాలు ఉండవు. విద్య, వైద్య సదుపాయాలు ఉండవు. కావలసిన వస్తువులు అన్నీ అక్కడ దొరకవు. సరుకులకై నగరాలకు వెళ్ళాలి. చదువులకు నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే మంచి డాక్టర్లు పల్లెల్లో ఉండరు. విద్యుచ్ఛక్తి కూడా 24 గంటలూ అక్కడ లభించదు. కొత్త బట్టలు వగైరా కావాలంటే నగరాలకు పల్లెవాసులు వెళ్ళాలి.
కాబట్టి పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని మనం భావించకూడదు. పల్లె ప్రజల కష్టాలు పల్లెవాసులకు ఉన్నాయి. పల్లె ప్రజలకు తగిన విశ్రాంతి ఉండదు. 24 గంటలు శ్రమిస్తేనే కాని వారికి కూడు, గుడ్డ దొరకదు.
ప్రశ్న 5.
పల్లెటూరి జీవితం హాయిగా ఉంటుందని ఎలా చెప్పగలవు?
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతోముంచెత్తుతాయి.
ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.
పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.
గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.
ప్రశ్న 6.
శ్రమదోపిడి గురించి రచయిత ఉద్దేశ్యమేమిటి?
జవాబు:
సామాన్యంగా గ్రామాల్లో భూకామందులు, తమకున్న పొలాలను తాము సేద్యం చేసుకోకుండా గ్రామాల్లోని బీద రైతులకు కౌలుకు ఇస్తుంటారు. ఆ బీద రైతులు ధనికుల పొలాలను కౌలుకు తీసుకొని, కష్టపడి సేద్యం చేస్తుంటారు. రాత్రింబగళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని భూకామందులకు వారు కౌలుగా వారికి చెల్లిస్తారు. మిగిలిన ధాన్యాన్ని వారు తింటారు. కాని సామాన్యంగా కౌలు రైతులకు ఏమీ మిగలదు. భూకామందులు, బీద రైతుల శ్రమను దోపిడీ చేయడం క్రింద వస్తుంది.
బీదరైతులు శ్రమపడి పండించిన ఫలసాయాన్ని భూకామందులు దోచుకుంటున్నారన్నమాట నిజానికి శ్రమపడేవానికి ఫలాన్ని తినే హక్కు ఉంటుంది. కాని ఇక్కడ శ్రమ ఒకరిది, ఫలం మరొకరిది అవుతోంది.
దీనినే దృష్టిలో ఉంచుకొని రైతులు కష్టపడుతున్నారని, కాని దాని ఫలితం ఇనాందారుకు లభిస్తోందని చెప్పడమే ఇక్కడ రచయిత ఉద్దేశ్యమై ఉంటుంది.
ప్రశ్న 7.
పల్లె ప్రజల కష్టాలను వివరించండి.
జవాబు:
పల్లెలలో ప్రజలు కష్టపడి పంటలు పండిస్తారు. ఒకప్పుడు వర్షాలు ఉండవు. చేలకు నీళ్ళను తోడాలి. ఒకప్పుడు తోడుకోవడానికి సైతం వారికి నీళ్ళు దొరకవు. ఒక్కొక్కసారి అతివృష్టి, ఒక్కొక్కసారి అనావృష్టి సంభవిస్తుంది.
వారి మోటర్లకు రాత్రింబవళ్ళు విద్యుచ్ఛక్తి ఉండదు. పాడిపశువులకు మేత లభించదు. రాత్రివేళల్లో కూడ చేనుకు నీరు పెట్టడానికి వారు వెళ్ళాల్సివస్తుంది. చీడపీడలకు పురుగుమందులు చల్లాలి. ఒకప్పుడు వారికి అవి ప్రమాదాన్ని తీసుకువస్తాయి.
చక్కగా పండిన పంట, ఒక్కరోజు పురుగు పట్టి తినేస్తుంది. ఇనాందార్లకు కౌలు చెల్లించాక రైతుకు ఫలసాయం మిగలదు. ఒక్కొక్కసారి కాలం కలసివస్తే పంట మిగులుతుంది. కాని రైతుకు దానికి తగిన ధర లభించదు.
రైతు పండించిన పంటలను వర్తకులు చౌకగా కొంటారు. కాని రైతుకు కావలసిన ఎరువులు వగైరా ఎక్కువ ధరకు కాని దొరకవు. పల్లె ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు ఉండవు. వారికి రోడ్డు, బస్సు సౌకర్యాలు ఉండవు. ప్రతి వస్తువు కోసం నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే వారు నగరాలకు బళ్ళ పై రోగులను తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు మోసుకు వెళ్ళాల్సివస్తుంది.
ఈ విధంగా పల్లెల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.
ప్రశ్న 8.
పల్లెల ప్రగతికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏవి?
జవాబు:
పల్లెలు బాగుపడాలంటే రైతులకు కావలసిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు చౌకగా వారికి అందించాలి. గ్రామాల్లో వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. రైతులకు ప్రభుత్వం విత్తనాలు మంచివి చౌకధరలకు ఇవ్వాలి. తక్కువ వడ్డీకి బ్యాంకులు వారికి ఋణాలు ఇవ్వాలి.
రైతులు తోటల్లో పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. వారు పాడి పశువులను పెంచి, పాల ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకోవాలి. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించాలి. రైతులు కూరగాయలను పెంచాలి.
గ్రామాల్లో ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రతి గ్రామానికి మంచినీటి కుళాయిలు, రోడ్లు, విద్యుచ్ఛక్తి సదుపాయం ఉండాలి. ప్రతి గ్రామానికి నగరాలకు పోవడానికి బస్సులు ఉండాలి. పల్లె ప్రజలు సంఘాలుగా ఏర్పడి గ్రామాలలో చెరువులు బాగు చేసుకోవాలి. మురికి నీరు దిగే కాలువలు బాగు చేసుకోవాలి. ప్రభుత్వ సహాయంతో గ్రామాలకు రోడ్లు వేసుకోవాలి. గ్రామీణ స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి, లఘు పరిశ్రమలను చేపట్టాలి.
పల్లెలలోని ప్రజలు తమ పిల్లలను తప్పక చదివించాలి. పిల్లలందరికీ టీకాలు వేయించాలి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పల్లె ప్రజలు తీరిక సమయాల్లో చేతి వృత్తులు చేపట్టి దాని ద్వారా ధనం సంపాదించాలి.
రైతులు పండించే ఉత్పత్తులకు న్యాయమైన మంచి ధరలు లభించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. గ్రామాల్లోని పోరంబోకు పొలాల్లో రైతులు సమిష్టిగా సహకార వ్యవసాయం చేపట్టాలి.
ప్రశ్న 9.
పల్లెటూళ్ళ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాలను వివరించండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా అక్కా, బావా అంటూ పలకరించుకుంటారు. పల్లెలలో పండుగలు, ఉత్సవాలు, వేడుకగా జరుగుతాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, గ్రామాలు చక్కగా అలంకరింపబడతాయి. ప్రతి ఇంటికి రంగుల పూలతోరణాలు కడతారు. వివిధ వాయిద్యాలు మ్రోగిస్తారు. గంగిరెద్దులు, గరగలు, విచిత్రవేషాలు తోలుబొమ్మలాటలు, హరికథలు వగైరా ఉంటాయి. ఈ కళలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నాయి.
భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి ఉంటాయి. వీటివల్ల మన ప్రజలకు ప్రాచీన సంస్కృతీ వైభవం తెలుస్తుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భోగిమంటల వల్ల, ముగ్గుల వల్ల దోమలు వగైరా దూరం అవుతాయి. మనుష్యుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకుంటారు.
పల్లెటూళ్ళు మన ప్రాచీన సంస్కృతీ వైభావాన్ని వెల్లడించే కేంద్రాలు. ఈ సంస్కృతీ సంప్రదాయాలను మనం కాపాడుకుంటే మన భారతదేశ ప్రాచీన నాగరికతా వైభవం కాపాడబడుతుంది.
ప్రశ్న 10.
‘పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది’ – సమర్థించండి. (March 2017)
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.
ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ, వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.
పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.
గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.
ప్రశ్న 11.
“పల్లెటూళ్ళలో ప్రజలు పడే కష్టాలు తొలగిపోతే మానవ సంఘానికి పల్లెటూళ్ళు ఆనందాన్ని ఇవ్వగలవు”. దీనిని ‘ సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
భారతావనికి పల్లెలు పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ బోధించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పల్లెలు ప్రధాన కారణాలుగా , పేర్కొనవచ్చు. ఒకప్పుడు పల్లెలు ప్రశాంత వాతావరణానికి ఆనవాలుగా ఉండేవి. చుట్టూ పంటపొలాలు, పచ్చని చెట్లు కనువిందు చేస్తుంటాయి. స్వచ్ఛమైన గాలి, జలం దొరుకుతాయి. కలుషితమైన వాతావరణం కన్పించదు.
ప్రజల మధ్య సోదరభావం, సమత్వం కన్పిస్తాయి. కష్ట సుఖాలను సమంగా పంచుకుంటారు. కాని ఈనాడు పల్లెల ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. దళారీల పోరు ఎక్కువైంది. కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా పల్లెల్లో కన్పించడంలేదు. ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది పట్టణాలకు వలస పోతున్నారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పల్లె ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే పల్లె ప్రజలు ఆనందోత్సాహాలతో సుఖంగా ఉంటారు. పల్లె ప్రజలంతా ఆనందంతో సుఖంగా తమ జీవనాన్ని గడుపగలుగుతారు.
10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Important Questions and Answers
ప్రశ్న 1.
అన్నదాత అవస్థ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
( అన్నదాత అవస్థ )
అన్నదాతగా గర్వంగా పిలిపించుకొనే రైతుకు అన్నీ అవస్థలే. ఎప్పుడు వర్షపు చినుకులు నేలపై పడతాయా? అని ఆత్రుతగా, ఆశగా ఆకాశంవైపు చూడడంతో వ్యవసాయంలో రైతుకు అవస్థలు ప్రారంభమౌతాయి. కాలువ నీటి కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తాడు.
దుక్కి దున్నుతాడు. విత్తనాలు చల్లుతాడు. కూలీల కొరకు పోటీపడి ఆకుమడి తయారు చేస్తాడు. బాడీబందా, వానా – వరదా పట్టించుకోకుండా వరి నాట్లు వేస్తాడు.
ఆకుమళ్ళను పశువులు తినేయకుండా తొక్కి పాడు చేయకుండా రాత్రింబవళ్ళు రైతు కాపలా కాస్తాడు. ఆ చేలగట్లపై జెర్రీలు, తేళ్ళు, పాములూ ఉంటాయి. అవి కరుస్తుంటాయి. అయినా అన్నదాత పట్టించుకోడు. పురిటిబిడ్డను బాలెంతరాలు కాపాడుకొన్నట్లు పంటను కాపాడతాడు.
ఎరువు చల్లి, పంటను కోసి, పనలు కట్టి కుప్ప వేస్తాడు. నూరుస్తాడు. ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బులు చేసిన అప్పులకు సరిపోవు. అయినా వ్యవసాయం మానడు.
అందుకే అన్నదాత అయ్యాడు. అమ్మకే అన్నం పెట్టే అన్నదాతకు భూమాత కూడా కన్న కూతురే.
ప్రశ్న 2.
వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
వ్యవసాయం మన జీవనాధారం
ఆంధ్రులారా ! సోదరులారా !
కల్లాకపటం తెలియని పల్లెటూరి జనాల్లారా !
కంప్యూటరు విద్య నేర్చిన పట్నవాసపు నిరుద్యోగులారా !
రండి! వ్యవసాయం చేద్దాం ! పట్టెడన్నం పదిమందికీ పెడదాం !
ఉద్యోగం చేస్తే ఎవరికో సలాం చేస్తూ బతకాలి. మన బంగారు భూమిని మనమే సాగు చేసుకొంటూ ఏడాదికి మూడు పంటలు పండిద్దాం. ఆకలి మంటలను ఆర్పేద్దాం. కరవు కాటకాలను తరిమేద్దాం. ఆత్మాభిమానంతో జీవిద్దాం. ఎవ్వరికీ తల వంచకుండా బతుకుదాం. ఆంధ్రమాతను భారతదేశపు ధాన్యాగారంగా మారుద్దాం. మన తాత ముత్తాతల దారికి ఆధునికత జోడించి అద్భుతాలు సాధిద్దాం.
భూసారానికి మన తెలివి జతచేసి కలిమిని సృష్టిద్దాం. జై కిసాన్.
ఇట్లు,
భూమి పుత్రులు.
ప్రశ్న 3.
నీ చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణిస్తూ 10 పంక్తుల వచన కవిత రాయండి.
జవాబు:
(‘మా ఇంటి తోట’ వచన కవిత)
మా ఇంటితోట మాకు నచ్చిన పాట
అందమైన మల్లె తీగ, విందు లిచ్చు మొల్లపూలు
రంగు రంగుల గుత్తిపూలు, శృంగారాల విరిజల్లు
దొడ్డిలోన జామచెట్టు, చెట్టుమీద చిలుక గూడు
చిలుక కొట్టిన జామపండు అబ్బో ఎంతో తియ్యగుండు
చెట్లమీద పక్షి గూళ్ళు, చెవులు మెచ్చెడి సంగీతాలు
పెరడులోన పనసచెట్టు, దాని పక్క నిమ్మ మొక్క
గుమ్మం ముందు తులసి తల్లి, చేస్తుంది పూజ మాదుతల్లి
కూరగాయ మొక్కలెన్నో – బీరకాయ పాదులెన్నో
వీధి గుమ్మం వెనుక తట్టు – ఉన్న దొక్కరావి చెట్టు
వేపచెట్టు పిల్లగాలి – అది యిచ్చును మాకు హేళి
పూలమొక్కల మీది గాలి – మొక్కలన్న నాకు జాలి
ప్రశ్న 4.
‘పల్లె సంరక్షణ – మన బాధ్యత’ అని వివరిస్తూ కరపత్రం రూపొందించండి.
జవాబు:
పల్లెటూళ్ళు మన దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. మనదేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న పల్లె ప్రజలు పంటలు పండిస్తేనే నగరవాసులకు ఇంత తిండి దొరుకుతుంది. పల్లెల్లో ప్రజలు పశువులను మేపి పాలను నగరాలకు అందిస్తేనే నగరవాసులకు టీ, కాఫీలు దొరుకుతాయి. పల్లెల్లో రైతులు కూరగాయలు పండిస్తేనే, నగరాల కూరగాయల దుకాణానికి కూరగాయలు వస్తాయి.
గ్రామాల్లో చేతి వృత్తులవారు పనిచేస్తేనే కత్తి, చాకు, కొడవలి, మంచాలు, కుర్చీలు, వగైరా పనిముట్లు నగరవాసులకు లభిస్తాయి. గ్రామాల్లో రైతులు పత్తి పండిస్తేనే నగరవాసులకు బట్టలు లభిస్తాయి. నగరాలు ప్రతి దానికి గ్రామాలపైనే ఆధారపడాలి. కాబట్టి ప్రతి దేశ పౌరుడు గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం గ్రామాల్లో రైతులకు చౌకగా ఋణాలు, ఎరువులు, పురుగు మందులు వగైరా అందించాలి. రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధరలను ప్రభుత్వం ఇవ్వాలి. ‘పల్లెల సంరక్షణ బాధ్యత’ ప్రతి పౌరుడు తీసికోవాలి. పల్లెలను రక్షించవలసిన బాధ్యత నగరవాసులదే అని అందరూ గుర్తించాలి. పల్లెలకు రోడ్డు సదుపాయాలు కల్పించాలి. పల్లెల్లో విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి. పల్లెలు పచ్చగా ఉంటేనే నగరాలు తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాల్లోని ప్రజలు, పల్లెల ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్న అందరూ ముందుకు రావాలి. పల్లెలను, పల్లె ప్రజలను రక్షించాలి. పల్లెలు పచ్చగా ఉండేలా అందరూ చూడాలి.
పల్లెల సంరక్షణకు కంకణం కట్టుకుందాం. కదలి రండి. ఆలస్యం వద్దు. మనదేశ సౌభాగ్యం పల్లెల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. గమనించండి.
దివి. x x x x x
ఇట్లు,
అఖిల భారత యువజన సంఘం,
విజయవాడ.
ప్రశ్న 5.
కిలకిలలాడే పక్షులతో కలకలలాడే పల్లెటూరిలో మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వర్ణించండి. (S.A. I – 2018-19)
జవాబు:
పల్లెల్లో పచ్చని చేలు, తలలాడిస్తూ మనల్ని ఆహ్వానిస్తాయి. చెట్లపై చిలుకలూ, పిచ్చుకలూ దోబూచులాడుకుంటూ ఉంటాయి. వృక్షాలపై పక్షులు గొంతెత్తి పాటలు కమ్మగా పాడుతాయి. పక్షుల మధురనినాదాల ముందు సుశీలమ్మ పాటలు ఏమి హాయి? బాటలన్నీ ముత్యాల ముగ్గులతో, ముసి ముసి నవ్వులు నవ్వుతాయి. పొలాల్లో ఆవులు మేతలు మేస్తూ, అంభారవాలు చేస్తూ ఉంటాయి. పశువుల కాపర్ల జానపద గీతాలు జోరుజోరుగా వినిపిస్తాయి. మామిళ్ళు, పనసలు చెట్లపై కాయలతో నిండు ముత్తదువుల్లా ఉంటాయి. కాల్వ గట్ల నుండి పోతూ ఉంటే పిల్లకాల్వలు సన్నగా సాగుతూంటాయి. పచ్చగా ఈనిన వరిచేలు, బుక్కా చల్లుకొన్న పడుచుకన్నెల్లా ఉంటాయి. పల్లెల్లోని ప్రకృతి దృశ్యాలు అతిథుల నేత్రాలకు విందు చేస్తాయి.
10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 1 Mark Bits
1. గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు – (గీత గీసిన పదమును విడదీసిన రూపమును గుర్తించండి.) (March 2017)
A) పూన్ + తోట
B) పూవు + తోట
C) పూ + తోట
D) పూవు + తోట
జవాబు:
B, D
2. కాలం ఎంతో విలువైనది – గీత గీసిన పదానికి నానార్ధములు గుర్తించండి. (S.A. I – 2018-19 June 2018)
A) నలుపు, కళ
B) సమయం, నలుపు
C) చావు, జీవనం
D) జీవనం, సంతోషం
జవాబు:
B) సమయం, నలుపు
3. సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) కర్మణీ వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం
4. రామారావు మెట్లు ఎక్కుతూ, దిక్కులు చూస్తున్నాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) కర్మణీ వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) సామాన్య వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం
5. తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2017)
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి
B) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడలేదు
C) తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడా ?
D) తాత పిల్లలకు నీతి కథలు చెప్పలేదు
జవాబు:
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి
6. రైతుల చేత పంటలు పండించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2017)
A) రైతులు పంటలను పండించలేదు
B) రైతులు చేత పంటలు పండించబడలేదు
C) రైతుల చేత పంటలు పండించబడ్డాయి
D) రైతులు పంటలను పండించారు.
జవాబు:
D) రైతులు పంటలను పండించారు.
7. తాత భారతం చదివి నిద్రపోయాడు – ఏ వాక్యమో గుర్తించండి. June 2018
A) చేదర్థకము
B) సంయుక్త వాక్యము
C) సంక్లిష్ట వాక్యము
D) నిషేధార్థకము
జవాబు:
C) సంక్లిష్ట వాక్యము
8. రామకృష్ణ వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామాన్య వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
D) సంయుక్త వాక్యం
9. పురిటిలోనే సంధి కొట్టడం : సంధివాక్యంలో వస్తుంది. ఇది పురిటిలోనే వస్తే తప్పక మరణిస్తారు. అలాగే ఏదైనా పని ప్రారంభంలోనే నాశనమైన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. (June 2017)
10. అడుగున పడిపోవుట : క్రొత్త సమస్యలు వస్తే పాత సమస్యలు అడుగున పడిపోతాయి. (June 2017)
11. కష్టఫలం : నేడు రైతులకు బొత్తిగా కష్టఫలం దక్కడం లేదు. (June 2018)
12. పొద్దస్తమానం : అన్నదాతలు పొద్దస్తమానం పొలాల్లో పనిచేస్తారు. (June 2018)
13. చమత్కారం : రఘురామ్ మాటలలో చమత్కారం తొణికిసలాడుతుంటుంది. (June 2018)
14. తునాతునకలు : ముక్కలు ముక్కలగుట / ఛిన్నాభిన్నమగుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (S.A.I -2018-19 March 2018)