These AP 10th Class Social Studies Important Questions 10th Lesson ప్రపంచీకరణ will help students prepare well for the exams.
AP Board 10th Class Social 10th Lesson Important Questions and Answers ప్రపంచీకరణ
10th Class Social 10th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఏమంటారు?
జవాబు:
బహుళజాతి సంస్థ.
2. ప్రపంచీకరణ ప్రధాన ఫలితం ఏమిటి?
జవాబు:
దేశాల మధ్య పోటీ పెరగడం.
3. హోండా, నోకియా, పెప్సి, టాటా మోటార్స్ లలో భారతీయ బహుళజాతి కంపెనీ ఏది?
జవాబు:
టాటా మోటార్స్.
4. WTO ను విస్తరింపుము.
జవాబు:
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)
5. SEZ ను విస్తరింపుము.
జవాబు:
స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి)
6. IBRD ను విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ & డెవలెప్ మెంట్ (అంతర్జాతీయ అభివృద్ధి మరియు పునర్నిర్మాణ బ్యాంక్).
7. IMF ను విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి).
8. వినియోగదారుల సేవలు అందించేవి ఏవి?
జవాబు:
కాల్ సెంటర్స్,
9. ప్రపంచీకరణ వలన విదేశీ వాణిజ్యాలలో అధిక భాగాన్ని ఏవి నియంత్రిస్తాయి?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.
10. WTO యొక్క ప్రధాన ఉద్దేశము.
జవాబు:
అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయుట.
11. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానం ఏ సంవత్సరం లో ప్రారంభమైనది?
జవాబు:
1991.
12. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలలో ఎన్ని రకాల ప్రవాహాలను మనం గుర్తించవచ్చు?
జవాబు:
మూడు.
13. ప్రపంచీకరణ ఏ శతాబ్దం చివర సంభవించిన పరిమాణం?
జవాబు:
20 వ.
14. భారతదేశంలో ఇంగ్లీషు మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత ఎటువంటి సేవలు అందిస్తున్నారు?
జవాబు:
వినియోగదారుల సేవలు (కస్టమర్ కేర్)
15. బహుళజాతి కంపెనీలు, ఆయా దేశాల క్లినిక కంపెనీలు కలిసి ఉత్పత్తిని చేపడితే వాటిని ఏమంటారు?
జవాబు:
జాయింట్ వెంచర్లు.
16. బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే పెట్టుబడిని ఏమంటారు?
జవాబు:
విదేశీ పెట్టుబడి.
17. IDA ని విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ (అంతర్జాతీయ అభివృద్ధి సంఘం)
18. IBRD, IDA సంస్థలు దేనిలో భాగం?
జవాబు:
ప్రపంచ బ్యాంక్ లో.
19. వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేయునది ఏది?
జవాబు:
విదేశీ వాణిజ్యం.
20. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు ప్రభావితమై నియంతలను తొలగించడానికి చేసిన విప్లవాలను ప్రసార మాధ్యమాలు ఏవిధంగా పేర్కొన్నాయి?
జవాబు:
అరబ్ వసంతంగా.
21. WTO లో సభ్యదేశాల సంఖ్య.
జవాబు:
150.
22. ప్రపంచీకరణ వల్ల ఏ రాజ్యాలు అంతరించి పోతాయో అన్నది చర్చనీయాంశమైనది?
జవాబు:
జాతీయ రాజ్యాలు.
23. జపాన్, జర్మనీ, యు.కె, ఫ్రాన్స్ వంటి దేశాలకు IBRD, IDA లలో ఉన్న ఓటు విలువ ఎంత?
జవాబు:
3 – 6%
24. ఏ సంస్థల కారణంగా దూరప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడింది?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.
25. ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంది?
జవాబు:
16%.
26. ప్రపంచ బ్యాంకులో ఏ దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంటుంది?
జవాబు:
పేద దేశాలకు.
27. IBRD, IDA సంస్థలలో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఎన్ని?
జవాబు:
170.
28. ప్రపంచీకరణ వల్ల భారతదేశంలో ఏ వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరింది?
జవాబు:
సంపన్న వర్గం.
29. క్రింది వానిలో బహుళ జాతి సంస్థలుగా ఎదిగిన భారతీయ కంపెనీలను రాయండి.
i) టాటా మోటర్స్ ii) ఇన్ఫోసిస్ iii) కార్గిల్ ఫుడ్స్ iv) ఏషియన్ పెయింట్స్.
జవాబు:
(i), (ii) & (iv)
30. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీలను ఆకర్షించుకోడానికి చేపట్టినవి ఏవి?
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు
31. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఏమి అంటారు?
జవాబు:
ఆర్థిక సరళీకరణ.
32. ఫోర్డ్ మోటార్స్ అనేది ఏ దేశ కంపెనీ?
జవాబు:
అమెరికా
33. ఏ సంవత్సరం నుండి దీర్ఘకాలం ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు?
జవాబు:
1991.
34. వస్తువులు, పెట్టుబడులు కదిలినంత స్వేచ్చగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపుగా 5 కోట్ల మంది యూరపు నుంచి ఏ దేశాలకు వెళ్ళి ఉంటారని అంచనా?
జవాబు:
అమెరికా, ఆస్ట్రేలియా.
35. ఒక పెద్ద బహుళజాతి సంస్థ ప్రపంచమంతటా అమ్మే సరుకులకు సేవలను అందించేవి ఏవి?
జవాబు:
వినియోగదారుల సేవ (కస్టమర్ కేర్)
36. ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపట్టే సంస్థలు ఏవి?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.
37. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ భారతదేశానికి చెందిన ఏ కంపెనీతో కలసి చెన్నె దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది?
జవాబు:
మహీంద్ర & మహింద్రా.
38. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణమేమి?
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానం వేగవంతంగా అభివృద్ధి చెందడం.
39. ‘E-mail’ ను పంపించటానికి అవసరమైనది.
జవాబు:
ఇంటర్నెట్.
40. లండన్లోని బ్యాంకు నుంచి విజయవాడలోని బ్యాంకుకు దీనిద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
జవాబు:
ఇంటర్నెట్ బ్యాంకింగ్.
41. విదేశీ వాణిజ్యాన్ని పెంచటానికి లేదా తగ్గించటానికి ప్రభుత్వం వేటిని విధిస్తుంది?
జవాబు:
పరిమితులను.
42. ప్రపంచీకరణలో భారతదేశంలోని ఉత్పత్తిదారులు మనుగడ సాగించాలి అంటే?
జవాబు:
నాణ్యతను మెరుగు పరచుకోవాలి.
43. ప్రపంచంలోని అధికశాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను తీసుకుంటున్న సంస్థలు ఏవి?
జవాబు:
ప్రపంచ పరిపాలనా సంస్థలు.
44. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి భారత ప్రభుత్వం ఏ చట్టాలను సడలించింది?
జవాబు:
కార్మిక చట్టాలను.
45. జాతీయ భావన పలచబడటానికి కారణమేమి?
జవాబు:
ప్రపంచీకరణ.
46. అమెరికా GDP లో వ్యవసాయ రంగం వాటా ఎంత?
జవాబు:
19
47. దేశాల మధ్య వేగంగా పెరుగుతున్న అనుసంధానం, అంత: సంబంధాలను ఏమంటారు?
జవాబు:
ప్రపంచీకరణ.
48. ఫోర్డ్ మోటార్స్ ఏ సంవత్సరంలో భారతదేశంలోని చెన్నై దగ్గర కంపెనీ ప్రారంభించింది?
జవాబు:
1995.
49. ఫోర్ట్ మోటార్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఉత్పత్తిని నిర్వహిస్తోంది?
జవాబు:
26.
50. అమెరికా మొత్తం ఉపాధిలో ఎంతశాతం వ్యవసాయ వాటా కల్గి ఉంది?
జవాబు:
0.5%
51. నైక్, పెప్సి, హెూండా, ఇన్ఫోసిస్ లో భారతీయ MNC ఏది?
జవాబు:
ఇన్ఫోసిస్.
52. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో ఏర్పడే ప్రవాహం కానిది ఏది?
→ వస్తువులు, సేవల ప్రవాహం.
→ శ్రమ ప్రవాహం
→ పెట్టుబడి ప్రవాహం
→ మార్కెట్ ప్రవాహం.
జవాబు:
మార్కెట్ ప్రవాహం.
53. వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పన్ను.
54. ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఎవరి మధ్య పోటీని పెంచుతుంది?
జవాబు:
ఉత్పత్తిదారుల మధ్య.
55. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (SEZ) లో ఉండే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏవి?
i) రవాణ il) విద్యుత్తు iii) గిడ్డంగులు iv) ఋణ సదుపాయం v) విద్య
జవాబు:
(i), (ii), (iii) & (iv)
56. WTO, IMF, WHO, IBRD లలో ప్రపంచ ద్రవ్య సంస్థ కానిది ఏది ?
జవాబు:
WHO
57. ఒకప్పుడు సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల, ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని “మార్కెట్ శక్తులు” ఆ నిర్ణయాలు చేస్తున్నాయి. ఈ ఉదాహరణలు ఊటంకించిన ఆ మార్కెట్ శక్తులు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీలు.
58. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటం లో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుంది. అయితే, ప్రపంచ బ్యాంక్ లో ఇమిడియున్న సంస్థలు ఏవి?
జవాబు:
IBRD, IDA.
59. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ఫోర్డ్ మోటార్స్ ( ) a) IT
ii) రాన్బాక్సీ ( ) b) నటులు, బోల్టులు
iii) సుందరం ఫాస్టెనర్స్ ( ) c) మందులు
iv) ఇన్ఫోసిస్ ( ) d) కార్లు
జవాబు:
i-d, ii – c, iii – b, iv-a.
60. ఈ-మెయిల్, వాయిస్-మెయిల్, టెలిగ్రామ్, ఈ-బ్యాంకింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కానిది ఏది?
జవాబు:
టెలిగ్రామ్.
61. క్రింది వానిలో సరికాని జత.
→ SEZ – ప్రత్యేక ఆర్థిక మండలి.
→ IBRD – ప్రపంచ బ్యాంక్.
→ IMF – అంతర్జాతీయ మార్కెట్ సంస్థ.
→ WTO – ప్రపంచ వాణిజ్య సంస్థ.
జవాబు:
IMF – అంతర్జాతీయ మార్కెట్ సంస్థ.
62. IT ని విస్తరింపుము.
జవాబు:
సమాచార సాంకేతిక పరిజ్ఞానం.
63. క్రింది ఇవ్వబడిన చిత్రంను పరిశీలించి చిత్రానికి సరిపోయే ఒక నినాదం రాయండి.
జవాబు:
స్వదేశీ నారికేళముండగా – విదేశీ కోలా ఎందుకు దండగా.
10th Class Social 10th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
I.B.R.D. ని విస్తరించుము.
జవాబు:
International Bank for Reconstruction and Development (అంతర్జాతీయ పునఃనిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు / ప్రపంచ బ్యాంకు)
ప్రశ్న 2.
SEZS ను విస్తరించుము.
జవాబు:
Special Economic Zones (ప్రత్యేక ఆర్థిక మండలి).
ప్రశ్న 3.
WTO ను విస్తరింపుము.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (లేదా) World Trade Organisation.
ప్రశ్న 4.
అరబ్ వసంతం అనగా నేమి?
జవాబు:
అరబ్ వసంతం :
ఉత్తర ఆఫ్రికా మరియు పశ్చిమ ఆసియాలలోని ట్యునీషియా, ఈజిప్ట్ వంటి దేశాలలో నియంతలను తొలగించడం కోసం చోటుచేసుకున్న విప్లవాలను అరబ్ వసంతం అని పిలుస్తారు.
ప్రశ్న 5.
ఈనాడు ఏ వర్గానికి చెందిన ప్రజల వలసలకు గిరాకీ ఉంది?
జవాబు:
ఈనాడు వృత్తి నైపుణ్యం ఉన్న ప్రజల వలసలకు గిరాకీ ఉంది.
ప్రశ్న 6.
జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని జాయింట్ వెంచర్లు అంటారు.
ప్రశ్న 7.
ఫోర్డ్ మోటర్స్ కంపెనీ తమ కర్మాగారాన్ని ఎచట నెలకొల్పింది?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ కంపెనీ తమ కర్మాగారాన్ని చెన్నైలో 1995లో నెలకొల్పింది.
ప్రశ్న 8.
ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో ఏ కంపెనీతో కలసి కర్మాగారాన్ని స్థాపించింది?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో మహీంద్ర & మహీంద్రతో కలసి కర్మాగారాన్ని స్థాపించింది.
ప్రశ్న 9.
చైనా బొమ్మలు భారతదేశంలో ఎందుకు ఆదరణ పొందాయి?
జవాబు:
చైనా బొమ్మలు కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా భారతదేశంలో ఆదరణ పొందాయి.
ప్రశ్న 10.
ప్రపంచీకరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదెవరు?
జవాబు:
ప్రపంచీకరణలో బహుళజాతి సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ప్రశ్న 11.
ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపే సమాచారాన్ని ఏమంటారు?
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపే సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail) అంటాం.
ప్రశ్న 12.
IT ని విస్తరించండి.
జవాబు:
Information Technology (సమాచార సాంకేతిక పరిజ్ఞానం).
ప్రశ్న 13.
ఆర్థిక సరళీకరణ అనగా నేమి?
జవాబు:
ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు.
ప్రశ్న 14.
WB ను విస్తరించండి.
జవాబు:
World Bank (ప్రపంచ బ్యాంకు).
ప్రశ్న 15.
IMF ను విస్తరించండి.
జవాబు:
International Monetary Fund (అంతర్జాతీయ ద్రవ్య నిధి).
ప్రశ్న 16.
విదేశీ వాణిజ్యం మౌలిక విధి ఏమిటి?
జవాబు:
విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది.
ప్రశ్న 17.
WTOని విస్తరించండి. అది చేసే పని ఏమిటి?
జవాబు:
WTO అనగా World Trade Organisation “ప్రపంచ వాణిజ్య సంస్థ”. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చేసే ఉద్దేశంతో పనిచేస్తుంది.
10th Class Social 10th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది. సమర్థించుము.
జవాబు:
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుందనుటలో సందేహం లేదు.
- సాధారణంగా బహుళజాతి సంస్థలే వివిధ దేశాలలో ఉత్పత్తి, వాణిజ్యం చేస్తున్నాయి.
- వివిధ దేశాల మార్కెట్ ను కైవసం చేసుకోవటానికి MNC లు కచ్చితంగా పోటీపడతాయి.
- MNC లు భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తాయి. ఈ స్థాయిలో స్వదేశీ సంస్థలు తట్టుకోవాలంటే కొంచెం కష్టం.
- ఈ పోటీ వలన, భారీతరహా ఉత్పత్తి వలన, ఉత్పత్తి వ్యయం తగ్గించి వస్తువు ధర కూడా తగ్గుతుంది.
- ఉత్పత్తికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమును వినియోగించుకుని ఉత్పత్తిని పెంచుతారు.
- స్వేచ్చా మార్కెట్ కారణంగా వివిధ కంపెనీలు ఉండుట వలన వినియోగదారునికి ఎంపిక అవకాశం ఉంటుంది. దీని వలన కంపెనీల మధ్య పోటీ ఏర్పడుతుంది.
- కొత్త వాణిజ్య అవకాశాలు పెరగటం (ఉదా : e-కామర్స్) వలన కూడా పోటీ వాతావరణం నెలకొంది.
- మారుతున్న ఫ్యాషన్లకనుగుణంగా అనేక రకాల కొత్త మోడల్స్ (కార్లు, ఫోన్లు మొదలైనవి) రావటం వలన అవి స్వదేశీ మార్కెట్ కు తీసుకురావటంలో కూడా పోటీ ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
భారతదేశంలోని స్థానిక పరిశ్రమలపై ప్రపంచీకరణ ప్రభావాన్ని అంచనా వేయుము.
జవాబు:
ప్రపంచీకరణ వలన కలిగే మంచి (అనుకూల) ప్రభావం :
- పెరుగుతున్న పోటీ వలన చాలా భారతదేశ కంపెనీలు ప్రయోజనాన్ని పొందాయి.
- వారు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తిని పెంచి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నాయి.
- కొన్ని కంపెనీలు విదేశీ కంపెనీలతో కలిసిపోయి వాటి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పంపించగలుగుతున్నాయి.
ప్రపంచీకరణ వలన చెడు ప్రభావం :
- ఈ పోటీని తట్టుకోలేక చాలా చిన్న తరహా కంపెనీలు మూత పడినాయి. కొన్ని మూతపడే స్థాయికి వచ్చాయి.
- దీనివలన చాలామంది కార్మికులు. నిరుద్యోగులుగా మారుతున్నారు.
ప్రశ్న 3.
ప్రపంచ బ్యాంకు యొక్క ప్రపంచ అభివృద్ధి నివేదిక (2012)’ వివిధ దేశాలను ఎలా వర్గీకరించిందో తెలుపుము.
జవాబు:
‘ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక 2012’ ప్రకారం వార్షిక తలసరి ఆదాయం ఆధారంగా దేశాలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి.
- అధిక ఆదాయ దేశాలు – 12,600 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ.
- మధ్య ఆదాయ దేశాలు – 1036 నుండి 12,599 అమెరికా డాలర్ల వరకు.
- అల్ప ఆదాయ దేశాలు – 1035 అమెరికా డాలర్లు మరియు అంతకంటే తక్కువ.
ప్రశ్న 4.
ప్రపంచీకరణకు దోహదం చేసిన కారణాలను ఏవైనా నాల్గింటిని రాయండి..
జవాబు:
ప్రపంచీకరణకు దోహదం చేసిన కారణాలు :
- సాంకేతిక పరిజ్ఞానం
- రవాణా
- విదేశీ వాణిజ్య సరళీకరణ
- విదేశీ పెట్టుబడుల సరళీకరణ
- రాజకీయ వాతావరణం.
ప్రశ్న 5.
భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావాలను వివరించండి.
జవాబు:
- భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు.
- ఇది సంపన్న వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది.
- నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంది.
- సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి.
- కొన్ని నూతన ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
- కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా ఎదగగలిగాయి.
- అనేకమంది చిన్న ఉత్పత్తిదారులు, కార్మికులు నష్టపోయారు.
- వారి ఉపాధికి, హక్కులకు భంగం వాటిల్లింది.
ప్రశ్న 6.
ప్రస్తుతం భారతీయ కంపెనీలు ప్రపంచీకరణ వల్ల ఎలా లాభపడుతున్నాయి?
జవాబు:
ప్రస్తుతం భారతీయ కంపెనీలు ప్రపంచీకరణ వల్ల లాభపడడానికి దోహదపడే అంశాలు.
- కొత్త సాంకేతిక విజ్ఞానము
- ఉత్పత్తి ప్రమాణాలను పెంచడం
- విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడం
ప్రశ్న 7.
ప్రపంచీకరణకు చోదక శక్తి ఏది? ఆర్థిక రంగమా? రాజకీయ నిర్ణయాలా?
జవాబు:
ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించేవాళ్లు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణం అని భావించేవాళ్లు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలయ్యిందని అంటారు. ప్రభుత్వాలు పరిమితులు విధిస్తాయి, లేదా వాటిని తొలగిస్తాయి. ఒక ప్రదేశం అనువుగా ఉందో, లేదో అంచనా వేసుకోటానికి మార్కెటు పరిస్థితులే కాకుండా రాజకీయ వాతావరణం కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వాస్తవం ఏమిటంటే పై రెండింటికీ సంబంధం ఉంది. ఒక ప్రత్యేక నేపధ్యంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని గుర్తిస్తే, ఇవి ఆపాటికే వచ్చిన ఆర్థిక, సాంకేతిక మార్పులను పరిగణనలోకి తీసుకుంటాయని అర్థం అవుతుంది.
ప్రశ్న 8.
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో ఎన్ని ప్రవాహాలున్నాయి? వాటిని గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం మూడు రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. మొదటిది వస్తువులు, సేవల ప్రవాహం. రెండవది శ్రమ ప్రవాహం – ఉపాధికోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం. మూడవది పెట్టుబడి ప్రవాహం – స్వల్పకాల, లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించటం.
ప్రశ్న 9.
బహుళజాతి సంస్థలు తమ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అమ్మడమే కాకుండా వస్తువుల, సేవల ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా – విస్తరింపజేస్తుంది – ఉదహరించండి.
జవాబు:
పారిశ్రామిక పరికరాలను తయారుచేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధనా కేంద్రాలలో డిజైన్ చేయిస్తుంది. ఈ రకంగా అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల చైనాలో విడిభాగాలు తయారు చేస్తుంది. వాటి మార్కెట్ లక్ష్యాలయిన అమెరికా, యూరప్ లకు సమీపంలోని మెక్సికో, తూర్పు యూరప్లో అసెంబ్లింగ్ చేస్తారు. భారతదేశంలో ఇంగ్లీష్ తెలిసిన యువకుల ద్వారా కాల్ సెంటర్లను నిర్వహిస్తారు.
ప్రశ్న 10.
చైనా బొమ్మల ఉత్పత్తిదారులు భారతీయ మార్కెట్ లను ఎలా ఆక్రమించారు?
జవాబు:
చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేయసాగారు. భారతదేశంలో కొనుగోలుదార్లకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మలలో ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో – ఆదరణ పొందాయి. ఒక సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాలలో 70 – 80 శాతం భారతీయ బొమ్మలకు బదులుగా . చైనా బొమ్మలను అమ్మసాగాయి. గతంలో కంటే ఇప్పుడు భారతదేశంలో బొమ్మలు చవకగా ఉన్నాయి.
చైనాలో బొమ్మల ఉత్పత్తిదారులకు ఇది తమ వ్యాపారాన్ని విస్తరింపచేసుకోటానికి అవకాశం ఇచ్చింది.
ప్రశ్న 11.
ప్రపంచీకరణ వలన దేశాలు అనేక అంశాలలో నియంత్రణను కోల్పోయాయి. వ్యాఖ్యానించుము.
జవాబు:
పెట్టుబడి, ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు. ఉదాహరణకు ఒకప్పుడు, సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసికొనేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల, ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెటు శక్తులు ఆ నిర్ణయాలు చేస్తున్నాయి.
ప్రశ్న 12.
అమెరికాలో కేవలం అరశాతం (0.5%) మాత్రమే వ్యవసాయరంగంలో ఉన్నా ఆ దేశ రైతులు తమ ఉత్పత్తులను ఇతర దేశాలలో చౌకగా ఎలా అమ్ముతున్నారు?
జవాబు:
అమెరికా GDP లో వ్యవసాయం వాటా 1 శాతం కాగా మొత్తం ఉపాధిలో 0.5% మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. అయినాకానీ అమెరికా వ్యవసాయంలో ఉన్న ఈ కొద్దిమందికే ఉత్పత్తికి, ఇతర దేశాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి. పెద్ద ఎత్తున లభించే ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అమ్మగలుగుతున్నారు. అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను వీళ్లు ఇతర దేశాల మార్కెట్లలో చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నారు.
ప్రశ్న 13.
అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు భిన్నంగా రైతులకు పెద్ద మొత్తంలో రాయితీ వచ్చినపుడు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాను ఏమని ప్రశ్నిస్తాయి?
జవాబు:
అన్యాయపూరిత వాణిజ్య అవరోధాల కొనసాగింపులో భాగంగా అమెరికా తమ రైతులకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చినపుడు అభివృద్ధి చెందిన రైతులు క్రింది విధంగా ప్రశ్నిస్తారు. “ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేం వాణిజ్య అవరోధాలను తొలగించాం. కానీ మీరు ఆ నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వొద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యం అంటే ఇదేనా?”
ప్రశ్న 14.
బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోడానికి ఉపయోగించే సాధారణ సూచికలు ఏవి?
జవాబు:
బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోడానికి ఉపయోగించే సాధారణ సూచికలు : మార్కెట్లకు దగ్గరగా ఉండటం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికుల లభ్యత ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు, తమ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండటం మొదలైనవి.
ప్రశ్న 15.
విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను ఎలా అనుసంధానం చేస్తుంది?
జవాబు:
ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తుంది. అదేవిధంగా కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది.
ప్రశ్న 16.
1950-1960 ప్రాంతంలో భారతదేశం దిగుమతులపై ఎందుకు అవరోధాలు విధించింది?
జవాబు:
1950-1960లలో పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి. ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుకుని ఉండేవి కావు. కాబట్టి అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.
ప్రశ్న 17.
“ప్రపంచీకరణ వలన జీవన ప్రమాణాలు పెరిగాయి.” వివరించండి.
జవాబు:
ప్రపంచీకరణ ఫలితంగా ప్రజల జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది. వీళ్లు ఎంచుకోటానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగి, ధరలు తగ్గాయి. ఫలితంగా ఈ ప్రజలకు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన “జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు.
ప్రశ్న 18.
బహుళజాతి సంస్థలు అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయో వివరించండి.
జవాబు:
- ఒకదేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టి లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు.
- కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలలో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి.
- ఉత్పత్తి ఖర్చులను తగ్గించి ఇలా లాభాలు పెంచుకుంటాయి.
- ఉత్పత్తి ప్రక్రియను చిన్నచిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపడతాయి. అంతేకాక వినియోగదారుల సేవ అందిస్తాయి.
10th Class Social 10th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
వ్యాపారము మరియు పెట్టుబడుల విధానాల సరళీకరణ ప్రపంచీకరణకు ఏవిధంగా తోడ్పడుతుంది?
జవాబు:
- వ్యాపారము మరియు పెట్టుబడుల విధానాల సరళీకరణ వలన ప్రపంచీకరణ సులభతరమైంది.
- సరళీకరణ విధానాల వలన పరిశ్రమల స్థాపనలో ఉన్న అవరోధాలు తొలగించబడ్డాయి.
- వస్తువులు, సేవలు ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వచ్చాయి.
- బహుళ జాతి కంపెనీల ఏర్పాటు వలన ప్రపంచీకరణ వేగవంతమైంది.
- వస్తువుల నాణ్యత పెరిగింది.
- వ్యాపార మరియు పెట్టుబడుల సరళీకరణ వల్ల రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాయి.
- మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, అంతర్జాలం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చి ప్రపంచీకరణకు దోహదం కలిగింది.
- అంతర్జాలం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ఏ సమాచారాన్నైనా క్షణాలలో తక్కువ ఖర్చుతో పొందగలుగుతున్నారు.
ప్రశ్న 2.
బహుళ జాతి సంస్థలు ప్రపంచీకరణకు ఏవిధంగా సహాయపడతాయో వివరించండి.
జవాబు:
- ప్రపంచీకరణ సాధించడంలో బహుళజాతి సంస్థల పాత్ర గణనీయంగా ఉంది.
- పెట్టుబడి, శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం మొదలగు వాటి ప్రవాహాల ద్వారా బహుళజాతి సంస్థలు సరిహద్దు లేని ప్రపంచాన్ని సృష్టించాయి.
- బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులనే కాక క్రొత్త వ్యాపార విధానాలను మరియు వివిధ దేశాల సంస్కృతులను పరిచయం చేస్తున్నాయి.
- వివిధ స్థానిక కంపెనీల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి బహుళజాతి కంపెనీలు దోహదం చేస్తున్నాయి.
- బహుళజాతి సంస్థలు వివిధ రకాల వాహనాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్నాయి.
- ప్రపంచ ప్రజల మధ్య విశాల దృక్పథాన్ని పెంపొందించడానికి బహుళజాతి సంస్థలు తోడ్పడుతున్నాయి.
ప్రశ్న 3.
భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై అవరోధాలు కల్పించడానికి గల కారణాలు ఏమిటి? ఈ అవరోధాలను తొలగించాలని ఎందుకు అనుకున్నది?
జవాబు:
విదేశీ పెట్టుబడులపై, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు.
- దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం.
- మన దేశంలో పరిశ్రమలు తగినంత స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం.
- విదేశీ పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయని భావించడం.
- విదేశీ ఉత్పత్తులతో పోలిస్తే మన వస్తువుల నాణ్యత తక్కువగా ఉండటం.
- దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల పై అవరోధాలు కల్పించింది. అయితే 1991 నుండి భారత ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాల్సిన అవసరం ఉందని నిర్ణయించి ఈ అవరోధాలను తొలగించారు. దానికి గల కారణాలు :
1) ప్రపంచ దేశాలన్నీ ప్రపంచీకరణ వైపు మొగ్గుచూపడం.
2) విదేశీ పెట్టుబడుల వల్ల స్థానిక కంపెనీలు అభివృద్ధి చెందడం.
3) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం.
ప్రశ్న 4.
బహుళజాతి కంపెనీల వలన కలుగు లాభ, నష్టాలు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీల వలన కలుగు లాభాలు :
- ఉపాధి అవకాశాలు పెరుగుచున్నాయి.
- నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తున్నాయి.
- ప్రజలు నైపుణ్యాలను మెరుగు పరచుకున్నారు.
- ప్రజల జీవన ప్రమాణ స్థాయి మెరుగుపడింది.
- ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెరిగింది.
- భారతదేశం కూడా ప్రపంచంలోని అగ్రదేశాలతో ఉత్పత్తులు విషయంలో పోటీపడగలుగుతుంది.
- వీటివలన దేశంలో అవస్థాపన సౌకర్యాలు మెరుగుపడతాయి.
- దేశాల మధ్య అనుసంధానం పెరుగుతుంది.
బహుళజాతి కంపెనీల వలన కలుగు నష్టాలు :
- సాంకేతిక పరిజ్ఞానం కలవారికి మాత్రమే ఉపాధి లభిస్తుంది, మిగతావారు నిరుద్యోగులవుతున్నారు.
- చిన్న ఉత్పత్తిదారులు పోటీని తట్టుకోలేక పరిశ్రమలను మూసివేస్తున్నారు.
- వ్యవసాయరంగం పూర్తిగా విస్మరించబడింది.
- గ్రామాలు కనుమరుగై పట్టణాల సంఖ్య పెరుగుతుంది.
- దేశీయ మార్కెట్ పై బహుళజాతి కంపెనీల పెత్తనం పెరిగింది.
ప్రశ్న 5.
బహుళజాతి కంపెనీ (MNC) లు రావడం వలన కుటీర చిన్నతరహా పరిశ్రమలు ఎలా అంతరించుకుపోతున్నాయో ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
బహుళజాతి కంపెనీలు రావడం వలన కుటీర / చిన్నతరహా పరిశ్రమలు అంతరించిపోవడానికి కారణాలు :
- బహుళజాతి కంపెనీల ప్రధాన లక్ష్యం ఎక్కువ లాభాలను గడించడం.
- దీని కొరకు అవి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి.
- ఈ బహుళజాతి కంపెనీలు అది పెట్టుబడి పెట్టిన దేశంలోని వనరులను సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి.
- ఉత్పత్తి ఖర్చులను తగ్గించి, వస్తువులను తక్కువ ధరలలో అమ్ముతాయి.
- అందువలన చిన్న ఉత్పత్తిదారులు ఈ పోటీని తట్టుకోలేక పరిశ్రమలను మూసివేసే స్థాయికి వస్తున్నారు.
ఉదా :
1) బుట్టలు తయారుచెయ్యడం :
ప్లాస్టిక్, స్టీలు తదితర వస్తువులతో తయారయ్యేవి తక్కువ ధరకు దొరకడం వలన ఈ కుటీర పరిశ్రమ మూతబడే స్థాయికి వచ్చింది.
2) చేనేత పరిశ్రమ :
మరమగ్గాలు ఉపయోగించడం వలనను, కృత్రిమ వస్త్రాలు లభ్యత వలనను ఈ పరిశ్రమ కూడా కష్టకాలంలో ఉంది.
ప్రశ్న 6.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావాలేమిటి ? విస్తరిస్తున్న ప్రపంచీకరణ వల్ల భారతదేశానికి ప్రయోజనాలేమిటి ? నీ అభిప్రాయాన్ని వివరించుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం :
- ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది.
- వినియోగదారులకు ఎంచుకోవడానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి.
- అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగింది.
- ప్రజలు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు.
ప్రపంచీకరణ వల్ల దేశానికి ప్రయోజనాలు:
- బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి.
- పారిశ్రామిక, సేవారంగాలలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
- భారతీయ కంపెనీలు విదేశీ కంపెనీలతో కలసి పనిచేయడం వల్ల లాభపడ్డారు.
- ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి.
ఉదా: టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రానాలాక్సీ - ప్రపంచీకరణ వల్ల ఐ.టి.తో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.
ప్రశ్న 7.
కార్మిక చట్టాల సడలింపు వలన కంపెనీలు ప్రస్తుతం ఏ విధంగా లాభపడుతున్నాయి?
జవాబు:
కార్మిక చట్టాల సడలింపు వలన ప్రస్తుత కంపెనీలకు కలిగే లాభం :
- తక్కువ కాలవ్యవధికి కార్మికులను నియమించుకోవడం (తాత్కాలికం).
- తక్కువ వేతనాలు ఇవ్వడం.
- ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవడం.
- బహుళ జాతి కంపెనీలను ఆకర్షించడం.
- ఎక్కువ పనిగంటలు.
- ఉత్పత్తి పెరగడం
- కార్మికులకు సౌకర్యాలు కల్పించలేకపోవడం.
- కార్మికులను ఎప్పుడైనా తొలగించడం.
ప్రశ్న 8.
“ఉత్పత్తిదారులు, కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.” దీనిపై నీ అభిప్రాయాలను తెలుపండి.
జవాబు:
- ప్రపంచీకరణ ప్రయోజనాలు సమంగా పంపిణీ కాలేదు.
- అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు, సంపన్న వినియోగదారులకు అది ప్రయోజనకరంగా ఉంది.
- మరొక వైపున చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు, వారి ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతున్నది.
- ప్రపంచీకరణ న్యాయంగా జరగాలి. అది అందరికీ అవకాశాలు కల్పించాలి.
- దీనిని సాధ్యం చేయడంలో ప్రభుత్వాలు ప్రధాన పాత్రను పోషించాలి.
- కార్మిక చట్టాలను సక్రమంగా అమలయ్యేలా, కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి.
ప్రశ్న 9.
ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు నీవు మద్దతిస్తావా? వ్యతిరేకిస్తావా? ఎందువలన?
జవాబు:
నేను ప్రత్యేక ఆర్థిక మండళ్ళను వ్యతిరేకిస్తాను.
కారణమేమనగా :
- ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కొరకు జరిగే భూసేకరణ వలన వ్యవసాయాధార జీవనంపై ప్రభావితం చూపుతుంది.
- ముందుగా ప్రకటించిన విధంగా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఉపాధిని కల్పించలేకపోతున్నాయి.
- కొన్ని సందర్భాలలో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
లేదా
నేను ప్రత్యేక ఆర్థిక మండళ్ళను సమర్థిస్తాను. కారణాలు:
- ప్రత్యేక ఆర్థిక మండళ్ళు పెద్ద యెత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
- అవి ప్రపంచస్థాయి అవస్థాపనా సౌకర్యాలను ఒకే ప్రదేశంలో అందిస్తాయి.
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయి.
ప్రశ్న 10.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించుము.
సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా, వేగంగా ఉన్నది. టెలికమ్యూనికేషన్ సేవలను ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుండి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాలో సాంకేతిక రంగంలో అభివృద్ధిని గురించి వివరిస్తూ దానితోపాటు సమాచార భావప్రసార సాంకేతిక రంగాల అభివృద్ధిని వివరించారు.
త్వరిత గతిన అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ప్రతి శాఖకు కూడా నూతన సమాచారంను చేర్చి ఆధునికీకరించ బడినవి. సాంకేతిక, సమాచార రంగంలో ఇలా మార్పులు రావడానికి కారణం ఇ-మెయిల్, గూగుల్, ఇంటర్నెట్ మొదలైనవి. ఇవి మన సమస్యలను, మన పనులను త్వరగా పరిష్కరించుకోవడానికి సహాయపడటమే కాకుండా మన జీవన విధానాన్ని కూడా మార్చివేశాయి. అంతేకాకుండా మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం చాలా సమాచారాన్ని సేకరించడమే కాకుండా వివిధ రకాల బిల్లులను కూడా కట్టవచ్చు. ప్రభుత్వంవారు GO లను, Memo లను mail ద్వారా సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతోంది.
అయితే దీనివలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీనివలన యువత కొన్ని అసభ్యకర అంశాలను చూడటమే కాకుండా చెడుదారిన పడుతున్నారు. కావున ప్రభుత్వం సమాచార, సాంకేతిక శాఖలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా చూడాలి మరియు అసభ్యకర అంశాలు ఉండకుండా కట్టుదిట్టం చేయాలి.
ప్రశ్న 11.
ప్రపంచీకరణకు దోహదం చేసిన అంశాలను వివరించండి.
జవాబు:
- సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందింది.
- దీనివలన ఉత్పత్తి, వాణిజ్యము, మరీ ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి.
- నేడు కంప్యూటర్, ఇంటర్నెట్ కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది.
- 1991 తరువాత విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై గల పరిమితులను చాలావరకు భారతదేశంలో తొలగించారు.
- ఇది భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది.
- WTO వంటి అంతర్జాతీయ సంస్థలు అనుసరించిన విధానాలు ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నాయి.
ప్రశ్న 12.
క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా పంపిణీ కాదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవడం ముఖ్యం.
జవాబు:
ప్రపంచీకరణ ప్రభావం – వ్యాఖ్య :
- భారతదేశం పై ప్రపంచీకరణ ప్రభావం సమానంగా లేదు.
- కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి.
- ఇంకొకవైపున అనేకమంది చిన్న ఉత్పత్తిదారులు ప్రపంచీకరణ పట్ల సంతోషంగా లేరు.
- భారీస్థాయిలో విదేశాల నుండి దిగుమతి అవుతున్న చవక వస్తువులతో పోటీ పడలేక వారి యొక్క అనేక సంస్థలు మూతపడ్డాయి.
- ప్రపంచీకరణ న్యాయంగా లేకుంటే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి.
- ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి’ అనేది ప్రస్తుతం మన ముందున్న ముఖ్యమైన ప్రశ్న.
ప్రశ్న 13.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించండి.
ఈ ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించేవాళ్ళు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే | నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణం అని భావించే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలయ్యిందని అంటారు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాఫ్ ప్రకారం, ప్రపంచీకరణకు ప్రధాన కారణం ఆర్థికపరమైన అంశాలు.
ఉదా : మనదేశంలో 1992లో రూపాయి విలువ పతనమౌతున్న సందర్భంలో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావుగారు కొన్ని షరతులతో కూడిన ప్రపంచీకరణ అంశాన్ని రూపొందించడం జరిగింది.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే మరియు ఇతర దేశాలతో పాటు సమానంగా అన్ని అంశాలలో పోటీని ఇవ్వాలి అంటే ప్రపంచీకరణ తప్పనిసరి. దానికి ఆర్థిక అంశాలే కాకుండా, రాజకీయ అంశాలు కూడా ముఖ్యమైనవే.
అయితే మనం మనదేశ ఆర్థిక అభివృద్ధి కోసం బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తున్నాం. అవి మన రాజకీయ నాయకులను ఇక్కడ ఉన్న వ్యాపారులను ప్రలోభపెట్టి వారు లాభాలను గడిస్తున్నారు.
కావున ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు లోబడకుండా మనదేశంలో ఏ ఏ రంగాలలో మాత్రమే అవి అవసరం అని గమనించి అక్కడ మాత్రమే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వలన మన చిన్న, చిన్న వ్యాపారస్తులు వ్యవసాయదారులు, పరిశ్రమల వారు నష్టపోకుండా ఉంటారు.
బహుళ జాతి సంస్థల వలన మరియు ప్రపంచీకరణ వలన మనం మనకు నచ్చిన వస్తువులను మనకు అందుబాటులో ఉన్న ధరలకు కొనుగోలు చేయగలుగుతున్నాం.
కాని ఇక్కడ ప్రభుత్వాలు గమనించవలసిన విషయం ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన దేశంలోని చిన్న, చిన్న వ్యాపారులకు ప్రభుత్వమే తక్కువ వడ్డీకి పెట్టుబడిని అందించి ఆ వస్తువులు అన్ని మనదేశంలో కూడా తయారుచేసే లాగా చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
దీని వలన మన ప్రజలకు ఉపాధితో పాటు, మనదేశం కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. దీని వలన మన ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళకుండా మన మానవ వనరులను మనం ఉపయోగించుకోవచ్చు.
ప్రశ్న 14.
ప్రపంచీకరణకు సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యకారణం – సమర్థింపుము.
జవాబు:
ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. ఉదాహరణకు, గత యాభై సంవత్సరాలలో రవాణా, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందాయి. ఫలితంగా ఎంతో దూరాలకు త్వరగా, తక్కువ ధరలకు వస్తువులను చేరవేస్తున్నారు.
సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా, వేగంగా ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ సేవలను (టెలిగ్రాఫ్, టెలిఫోను, మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్) ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోటానికి, మారుమూల ప్రాంతాలనుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమయ్యింది. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్లు ప్రవేశించాయి. ఇంటర్నెట్ అనే అద్భుత ప్రపంచంతో మీకు పరిచయం ఉండి ఉంటుంది. దీని ద్వారా మీరు ఏ విషయం గురించైనా సమాచారాన్ని పొందవచ్చు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా నామమాత్రపు ఖర్చుతో మీరు తక్షణమే ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail) పంపించవచ్చు. ఎవరితోనైనా (voice-mail) మాట్లాడవచ్చు.
ప్రశ్న 15.
ప్రపంచ వాణిజ్య సంస్థ గూర్చి నీకేం తెలుసు?
(లేదా)
సరళీకృత విధానాలు ఏర్పడేలా ప్రపంచ వాణిజ్య సంస్థ కృషి చేస్తుంది? సమర్ధింపుము.
జవాబు:
అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పని చేస్తున్న సంస్థలలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి, అవి పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. అయితే ఆచరణలో అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్యం అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఉదాహరణ.
ప్రశ్న 16.
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు (SEZS) ఏర్పాటు ద్వారా భారతదేశంలోకి పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నారు?
జవాబు:
ఇటీవలి కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZS) అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్ లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉంటాయి. విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZ) లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి అయిదేళ్లపాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది. కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీకి కార్మికుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి.
ప్రశ్న 17.
ప్రపంచీకరణ ఫలితాలు అందరికీ అందాలంటే ప్రభుత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదు. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్లు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొకవైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి.
దీనిని సాధ్యం చెయ్యటం ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్లవే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడగల శక్తి వచ్చేంతవరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.
ప్రశ్న 18.
ప్రపంచీకరణను వ్యతిరేకించే వారి భయాలు ఏమిటి?
జవాబు:
అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానాలలో ధనిక దేశాల పెత్తందారీ ఆధిపత్యం. వాణిజ్యం, పెట్టుబడులు, వలస వంటి అంతర్జాతీయ ఆర్థిక విధానాలలో అయితేనేమి, దేశ వ్యవహారాలలో అయితేనేమి ధనిక పాశ్చాత్య దేశాలు మిగిలిన ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), ప్రపంచ బ్యాంకు (WB). అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకవైపున ప్రపంచీకరణకు మద్దతు పలికేవాళ్లు విశ్వ అనుసంధానం ద్వారా ప్రపంచీకరణ అభివృద్ధికి, సంపదకు అవకాశాలను అందిస్తుందని భావించగా, దానిని విమర్శించే వాళ్లు ప్రపంచంపై ఆధిపత్యం పొందటానికి కొన్ని పాశ్చాత్య దేశాలు చేసే ప్రయత్నమని భావిస్తున్నారు. అనేక పేద దేశాలలో దీనివల్ల ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు, పర్యావరణానికి భంగం కలుగుతోందని వీళ్లు వాదిస్తున్నారు.
ప్రశ్న 19.
కెపాసిటర్లు ఉత్పత్తి చేసిన రవి పై ప్రపంచీకరణ ప్రభావం ఏమిటి?
జవాబు:
2001లో ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కారణంగా ప్రభుత్వం కెపాసిటర్ల దిగుమతిలో పరిమితులను తొలగించటంతో అతడి కష్టాలు మొదలయ్యాయి. అతడి ప్రధాన కొనుగోలుదారులైన టెలివిజన్ కంపెనీలు టెలివిజన్ సెట్ల ఉత్పత్తికి కెపాసిటర్లతో సహా వివిధ విడి భాగాలను పెద్ద సంఖ్యలో కొనేవి. అయితే బహుళజాతి సంస్థ (MNC)ల టీవీ బ్రాండుల నుంచి పోటీ ఫలితంగా భారతీయ టెలివిజన్ కంపెనీలు బహుళజాతి సంస్తలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. అవి ఒకవేళ కెపాసిటర్లు కొనాల్సి ఉన్నా వారు దిగుమతి చేసుకున్నవి రవి లాంటి ఉత్పత్తిదారులు ఇస్తున్న ధరలో సగానికి వస్తున్నాయి. కాబట్టి వాటికే మొగ్గు చూపుతారు.
ఇప్పుడు రవి 2000 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన సంఖ్యలో సగమే ఉత్పత్తి చేస్తున్నాడు. అతని దగ్గర ఇప్పుడు ఏడుగురు కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు.
ప్రశ్న 20.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
పునర్నిర్మాణం, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకును (IBRD), అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను (IDA) కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఈ రెండు సంస్థలలో 170కి పైగా సభ్యదేశాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈ నాటికి కూడా అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, యుకె, ఫ్రాన్స్, వంటి దేశాలు ఒక్కొక్కదానికి 3-6% ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకు ఎక్కువ ఓటింగు అధికారం ఉంది. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటంలో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి, మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చెయ్యగలుగుతోంది.
ప్రశ్న 21.
సంస్కృతి, భాషలపై ప్రపంచీకరణ ప్రభావం……… ఈ అంశంలో వినిపిస్తున్న భిన్న వాదనలేమి?
జవాబు:
అందరి దృష్టిని ఆకర్షించిన మరొక అంశం, ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యతకు దారితీస్తుందా లేక సాంస్కృతిక మూసపోతకు దారితీస్తుందా అనేది. ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతులు, భావాలు ప్రాచుర్యం పొంది ఇతర స్థానిక, అల్ప సంఖ్యాక వర్గాల సంస్కృతులు పక్కకు నెట్టివేయబడ్డాయని కొందరు వాదిస్తారు. అయితే మరికొందరు ప్రత్యేక, తరచుగా పక్కకు నెట్టివేయబడిన సాంస్కృతిక అలవాట్లకు ప్రపంచీకరణ తగినంత చోటు ఇచ్చి అవి విస్తరించడానికి దోహదపడిందని భావిస్తున్నారు. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగింపబడి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండి ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని కొంతమంది పేర్కొంటున్నారు.
ప్రశ్న 22.
ఈ క్రింది దేశాలను ప్రపంచపటంలో గుర్తించండి.
1) అమెరికా
2) చైనా
3) మెక్సికో
4) భారతదేశం
5) తూర్పు యూరోపియన్ దేశాలు :
i) పోలాండ్
ii) ఉక్రెయిన్
iii) రొమేనియా
iv) బల్గేరియా
v) చెక్ రిపబ్లిక్
vi) స్లోవేకియా