Students can go through AP Board 10th Class Social Notes 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి
→ ప్రజలు తమ జీవనోపాధికోసం రకరకాల పనులను చేపడతారు.
→ ఈ పనులు ప్రధానంగా మూడు రంగాలుగా విభజిస్తారు.
- ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు.
- యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు.
- వస్తువులను నేరుగా తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు.
→ సాధారణంగా ఈ మూడు రంగాలను ప్రాథమిక (వ్యవసాయ) రంగం, ద్వితీయ (పారిశ్రామిక) రంగం, తృతీయ (సేవా) రంగం అని పిలుస్తారు. ఈ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తారు.
→ దేశ ఆదాయాన్ని లెక్కగట్టటానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను తీసుకుంటారు. ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదం స్థూల దేశీయోత్పత్తి (GDP).
→ ప్రతిరంగంలోనూ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, ఎంత మొత్తం వస్తువులు, సేవలు ఉత్పత్తి అవుతున్నాయన్నది GDP ని అంచనా వేయటానికి లెక్కిస్తారు.
→ వేలాది వస్తువులు, సేవలను అంచనా వేయటం అసాధ్యమైన పని, ఈ సమస్యను అధిగమించటానికి ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా ఆయా వస్తువులు, సేవల విలువను జోడించాలని సూచిస్తారు.
→ మాధ్యమిక వస్తువులను అంతిమ వినియోగదారుడు, అంత్య వస్తువులు తయారుచేయటానికి వీటిని ఉత్పాదకాలుగా వాడతారు.
→ అంతిమ వస్తువుల విలువలో దానిని తయారుచేయటానికి ఉపయోగించిన మాధ్యమిక వస్తువులన్నింటి విలువ ఉంటుంది.
→ కొనుగోలు చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను పరిగణనలోకి తీసుకొని, ఆ తరువాత ఉత్పత్తిదారు శ్రమ, ఇతర ఉత్పాదకాలను ఉపయోగించి తరువాతి దశ వస్తువును తయారుచేశారు. ఇది ఇప్పటికీ ఉన్న విలువకు అదనంగా జోడించినట్లు ఉన్నాయి.
→ ప్రతి దశలోనూ జోడించబడిన అదనపు విలువను మాత్రమే తీసుకోవటం మరొక పద్దతి.
→ దీనికి వస్తువుల అమ్మకం విలువలో అంతకుముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను తీసెయ్యాలి.
→ ఒక సం||లో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల/సేవల విలువ ఆ సం||రాన్ని, ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. మూడు రంగాల ఉత్పత్తిని కలిపితే దేశ స్థూల దేశీయోత్పత్తి వస్తుంది.
→ ఒక దేశంలో, ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల, సేవల విలువను ఇది (GDP) తెలియచేస్తుంది.
→ 1, ఏప్రిల్ నుంచి మార్చి (31 వరకు) వరకు ఉన్న 12 నెలలను “ఆర్ధిక సంవత్సరం” అంటారు.
→ స్థూల దేశీయోత్పత్తిని గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు లేని వాటిని పరిగణనలోకి తీసికోవడం లేదు.
ఉదా : వంట చేయటం, పిల్లల్ని పెంచడం, గృహ సంబంధ పనులు.
→ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఈ పనులను నేటికీ ద్రవ్యపరమైన చెల్లింపులు చేయడం లేదు.
→ ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణింపబడుతున్న దేశాల అభివృద్ధి తొలి దశల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వాటి GDP పెరుగుదలకు అధికంగా దోహదం చేశాయి.
→ కొత్త ఉత్పత్తి విధానాలు రావటంతో కర్మాగారాలు ఏర్పడి, విస్తరించసాగాయి. ఇంతకుముందు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసినవాళ్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కర్మాగారాలలో పనిచేస్తున్నారు.
→ ఈ దేశాలలో మొత్తం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు దృష్ట్యా, కల్పించిన ఉపాధి దృష్ట్యా పారిశ్రామిక ఉత్పత్తి ప్రాముఖ్యతను సంతరించుకుంది.
→ రంగాల ప్రాముఖ్యత మారింది. పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అయ్యింది. ఉత్పత్తి, ఉపాధుల దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణించింది.
→ గత 50 సం||లలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతుంది. మొత్తం ఉత్పత్తిలో సేవారంగం ప్రముఖ స్థానంలో ఉంది.
→ వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడురంగాల ఉత్పత్తి కలిపితే “స్థూల జాతీయోత్పత్తి” వస్తుంది.
→ సేవలలో తిరిగి మూడు రకాలు ఉన్నాయి.
1) ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు :
ప్రభుత్వ పాలన, దేశ రక్షణ, విద్య, వైద్యం, ప్రసార మాధ్యమాలు.
2) ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు :
బ్యాంకులు, జీవితబీమా, భవన విక్రయ కంపెనీలు, పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు మున్నగునవి.
3) వ్యాపారం, మోటళ్లు, రవాణా, ప్రసారాలు – దూరదర్శిని, టెలిఫోన్, రైల్వేలు, తంతి తపాలా మొదలగునవి.
→ 1972-73, 2009-10 మధ్య 37 సం||రాల కాలంలో వ్యవసాయరంగం వాటి గణనీయంగా క్షీణించింది GDPలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వాటా కొంచెం పెరిగింది. సేవా కార్యకలాపాలలోని మూడింట రెండు రంగాలలో గణనీయమైన వృద్ధి ఉంది.
→ ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ల మొత్తం సంఖ్యకు, ఆ దేశ స్థూల జాతీయోత్పత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంది.
→ 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో 46 కోట్లమంది పని చేస్తున్నవారు. అంటే ఉత్పాదక కార్యకలాపాలలో భాగస్వాములైన ప్రజలు.
→ స్టూల దేశీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలో మార్పు వచ్చినంతగా ఉపాధిలో మార్పు రాలేదు.
→ ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది.
→ 1972-73, 2009-10 కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి తొమ్మిది రెట్లు పెరిగింది, కానీ పారిశ్రామిక ఉపాధి మూడు రెట్లు మాత్రమే పెరిగింది.
→ సేవారంగంలో ఉత్పత్తి 14 రెట్లు పెరిగింది కానీ ఉపాధి మాత్రం 5 రెట్లు పెరిగింది.
→ దీని ఫలితంగా దేశంలోని కార్మికులలో సగం కంటె ఎక్కువమంది వ్యవసాయరంగంలో ఉండి ఆరింట ఒక వంతు (1/6 వంతు) ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు.
→ దీనికి విరుద్ధంగా GDPలో 75 శాతం వాటా ఉన్న పారిశ్రామిక, సేవారంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి.
→ అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవరికీ పూర్తి పని లేదు, అల్ప ఉపాధి అంటే ఇదే.
→ అందరూ పనిచేస్తున్నట్టు ఉంటుంది కానీ ఎవ్వరికీ తమ పూర్తి, సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండటం లేదు. పని లేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది. కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనబడదు, అందుకే దీనిని “ప్రచ్ఛన్న నిరుద్యోగం” అని కూడా అంటారు.
→ వ్యవసాయ ఉత్పత్తి తగ్గకుండా రైతు కుటుంబం అదనపు ఆదాయం పొందవచ్చు. అంటే వ్యవసాయరంగం నుంచి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాలలో పనిచేసినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు.
→ ఈ రకమైన అల్ప ఉపాధి ఇతర రంగాలలో కూడా ఉండవచ్చు.
ఉదా : దినసరి కూలీలు.
→ సేవారంగం అభివృద్ధి చెందినా ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగటం లేదు.
→ ఉపాధి తీరుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు పరిశీలించటానికి ఉపాధికి సంబంధించి మరొక వర్గీకరణ – వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు.
→ 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారు.
→ ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి.
→ కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండటం వల్ల కూడా వీటిని “వ్యవస్థీకృత రంగం” అంటారు. ఈ రంగంలో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది.
→ అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడా ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు.’ భద్రత ఉండదు. ఉద్యోగులకు జీతం తక్కువ.
→ కార్మికులలో సగం శాతం స్వయం ఉపాధి పొందుతున్నవారే.
→ వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలు అందరూ కోరుకుంటారు.
→ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు సన్న, చిన్నకారు రైతుల కిందకు వస్తాయి.
→ షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధికశాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.
→ కాబట్టి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవ్యవస్థీకృత రంగ కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం.
→ 2004-05 సం||లో మొత్తం కార్మికులలో 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండగా, మొత్తం ఉత్పత్తిలో సగానికి (50%) దోహదం చేశారు.
→ అంటే కేవలం 8% కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగం ఉండి మొత్తం వస్తువులు, సేవలు (50%)లోనికి దోహదం చేశారు.
→ పరిశ్రమలు, సేవల్లో ఉత్పత్తి పెరిగింది కాని దానికి తగ్గట్లుగా ఉపాథి పెరగలేదు.
→ ఉత్పత్తిలో పెరుగుదల వల్ల కార్మికులలో 8% మంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు.
→ ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించుటయే కాదు యంత్రాలతో, సమర్థంగా పనిచేయటంలో ప్రజలకు శిక్షణ కూడా ఇవ్వాలి.
→ స్థూల దేశీయోత్పత్తి : ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన అంత్య వస్తు సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి (GDP).
→ అంత్య వస్తువులు : వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులు. ఉదా : ఇడ్లీ, దోశలు, నోటుపుస్తకం
→ ఉపాధి బదిలీ : ఒక రంగం నుంచి మరొక రంగానికి ఉపాధి బదిలీ అవ్వటం.
→ వ్యవస్థీకృత రంగం : కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండి నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి కల్పనలున్న రంగం.
ఉదా : భారీ పరిశ్రమలు
→ అవ్యవస్థీకృత రంగం : ఉద్యోగాలలో కాని, జీతాల స్థాయిలో కానీ ఒక నియత పద్ధతి లేని కార్మికులు, కర్షకులు ఉండే చిన్న చిన్న సంస్థలను అవ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు.
ఉదా : చేతి పనులు, చేనేత, బీడీల తయారీ.
→ ప్రాథమిక రంగం : వ్యవసాయానికి అనుబంధ వృత్తులు, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు, (ఉత్పత్తి ప్రక్రియల ప్రకృతి ప్రధాన పాత్ర వహించే పనులు) ప్రాథమిక రంగంగా చెబుతారు.
→ ద్వితీయ రంగం : యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు ద్వితీయ రంగానికి చెందినవి.
→ తృతీయ రంగం : వస్తువులు నేరుగా తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు.
→ మాధ్యమిక ఉత్పాదకాలు : వినియోగ ఉత్పత్తి (అంతిమ వస్తు, సేవ) తయారుచేయటానికి ఉపయోగించే వస్తువులను “మాధ్యమిక ఉత్పాదకాలు” అంటారు. వీటిని ఉత్పాదకాలుగా వాడతారు.
→ ప్రచ్ఛన్న నిరుద్యోగం : అందరూ పనిచేస్తున్నట్టు ఉంటారు కానీ ఎవ్వరికీ తమ పూర్తి, సామర్థ్యానికి తగినట్లుగా పని ఉండదు. ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనపడదు. దీనినే “ప్రచ్ఛన్న నిరుద్యోగం” అంటారు.
→ నిరుద్యోగం : అమలులో వేతనాలకు పనిచేయటానికి ఇష్టపడ్డా పని దొరకని పరిస్థితి.
→ అల్ప ఉపాధి : పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా, తగినంతగా పని దొరకని స్థితి.
→ ఆర్థిక సంవత్సరం : ఏప్రిల్ నెల నుండి ప్రారంభమయ్యి మార్చితో ముగుస్తుంది. సాధారణంగా ఈ సం||లో (12 నెలల్లో) జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి తెలియజేస్తుంది.