These AP 6th Class Social Important Questions 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి will help students prepare well for the exams.
AP Board 6th Class Social 1st Lesson Important Questions and Answers సౌర కుటుంబంలో మన భూమి
ప్రశ్న 1.
నక్షత్రరాశులు అనగానేమి? కొన్ని నక్షత్ర రాశుల పేర్లు తెల్పండి.
జవాబు:
మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని ‘నక్షత్రరాశులు’ అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్రరాశులలో ఒకటి సప్తర్షి ఇది ఏడు నక్షత్రాల సమూహం.
ప్రశ్న 2.
ప్రాచీనకాలంలో ప్రజలు రాత్రి సమయంలో దిక్కులను ఎలా గుర్తించేవారు? ధృవ నక్షత్రం అంటే ఏమిటి? వివరించండి. సప్తర్షి మండల నుండి ధృవ నక్షత్రం ఏ దిశలో ఉంటుందో బొమ్మగీచి చూపండి.
జవాబు:
ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ‘ధృవ నక్షత్రం’ అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్రరాశి సహాయంతో ఈ ధృవ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు.
ప్రశ్న 3.
సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరగడానికి కారణమేమి? సూర్యుని ఉపరితలం గురించి వివరించండి.
జవాబు:
సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని (తన వైపు లాగ గల శక్తి) అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000° సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రశ్న 4.
మన సౌర కుటుంబంలోని గ్రహాల గురించి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమం – బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి (గురుడు), శని, ఇంద్రుడు, వరుణుడు, సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని కక్ష్యలు అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను అంతర గ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి. చివరి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి (గురుడు), శని, ఇంద్రుడు. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడిని ‘భూమికి కవల గ్రహం’ (ఎర్త్ – ట్విన్) గా పరిగణిస్తారు.. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాలలో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు.
ప్రశ్న 5.
మనం నివసిస్తున్న భూ గ్రహం గురించి నీకేమి తెలుసో వివరించు.
జవాబు:
మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం. పరిమాణంలో ఇది ఐదవ అతిపెద్ద గ్రహం. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది.. అందుకే దాని ఆకారాన్ని జియోయిగా అభివర్ణించారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి, భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే దాని మూడింట రెండు వంతుల * ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి దీనిని నీలి గ్రహం అంటారు.
ప్రశ్న 6.
ఉపగ్రహాలు అని వేటినంటారు? ఉపగ్రహాలు కల్గిలేని గ్రహాలు ఏవి?
జవాబు:
సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే, గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటినే ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి.
ప్రశ్న 7.
ఆవరణములు ఎన్ని? అవి ఏవి? వివరించండి.
జవాబు:
జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది నాలుగు ప్రధాన ఆవరణలు. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం కలిగి ఉంది. శిలావరణం : శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొర.
జలావరణం :
భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచుపొరలు, చెరువులు మొదలైన వాటినన్నింటినీ కలిపి జలావరణంగా పిలువబడుతుంది.
వాతావరణం :
భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువులు నత్రజని (78%) మరియు ఆక్సిజన్ (21%) కార్బన్‌డయాక్సెడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వంటి ఇతర వాయువులు తక్కువ మొత్తంలో ఉంటాయి. జీవావరణం : భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి ‘జీవావరణం’ అని పిలుస్తారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర జీవులను కలిగి ఉంటుంది.
ప్రశ్న 8.
భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది? దాని గురించి మీకు తెలిసిన రెండు వాక్యాలు రాయండి.
జవాబు:
మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో నాలుగవ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రశ్న 9.
భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సంస్థ ఏది? కొన్ని భారతీయ ఉపగ్రహాల పేర్లు తెల్పండి.
జవాబు:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీశ్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి “సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ (SHAR)” అని పేరు పెట్టారు.
కొన్ని భారతీయ ఉపగ్రహాలు : ఇన్సాట్ (INSAT), ఐ ఆర్ ఎస్ (IRS), ఎడ్యుశాట్ (EDUSAT) మొదలైనవి.
ప్రశ్న 10.
మంగళయాన్ (MOM) గురించి నీవు తెలుసుకున్న విషయాలను ప్రస్తావించండి.
జవాబు:
అంగారక గ్రహ వాతావరణం, స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రారంభించిన మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్ – MOM) అంగారక కక్ష్యకు సెప్టెంబర్ 24, 2014న చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రాం, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాల్గవ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది.
ప్రశ్న 11.
గ్రహశకలాలు అని వేటినంటారు? ఇవి ఎక్కడ ఉంటాయి?
జవాబు:
గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు (Asteroids) అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్ష్యల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహశకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు అభిప్రాయం.
ప్రశ్న 12.
‘ఉల్కలు’ గురించి వివరించండి.
జవాబు:
సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను ఉల్కలు (Meteoroids) అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినపుడు గుంతలను సృష్టిస్తుంది.
ప్రశ్న 13.
తోకచుక్కలు అనగానేమి? భూమికి దగ్గర వచ్చే తోకచుక్కకు ఉదాహరణ నివ్వండి. ఇది చివరిసారిగా ఎప్పుడు కన్పించింది?
జవాబు:
తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది 2061లో కనిపిస్తుంది.
ప్రశ్న 14.
గెలాక్సీ/ పాలపుంత అనగానేమి?
జవాబు:
నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే ‘పాలపుంత’ అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువలన దీనిని ‘ఆకాశగంగ’ అని కూడా పిలుస్తారు.
ప్రశ్న 15.
పగటిపూట మనం చంద్రుడిని ప్రకాశవంతమైన నక్షత్రాలను ఎందుకు చూడలేము?
జవాబు:
సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనపడకుండా చేస్తుంది. అందువలన పగటిపూట మనం చంద్రుడిని, ఇతర నక్షత్రాలను చూడలేము.
ప్రశ్న 16.
నక్షత్రాలు అనగానేమి? నీకు తెలిసిన ఒక నక్షత్రంను తెల్పి, మిగతా నక్షత్రాల వేడి/కాంతి భూమికి అంతగా చేరకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే. కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల అవి చిన్నవిగా కనిపిస్తాయి.
ప్రశ్న 17.
భూమి నీలం రంగులో కన్పించడానికి కారణమేమి?
జవాబు:
భూమిపై మూడింట రెండు వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి బాహ్య అంతరిక్షం నుండి, భూమి నీలం రంగులో కనిపిస్తుంది.