AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

These AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 9th Lesson Important Questions and Answers హితోక్తులు

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత పద్యాలు

కింది పరిచిత పద్యాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. నీటిమీది వ్రాత నిజము దుర్జనమైత్రి,
చేయుచుండఁగనె నశించుచుండు
అదియె సజ్జనాళియందుఁజల్పితి మేని
రాతగీచినట్టి గీత గాదె?
ప్రశ్నలు – జవాబులు:
అ) చెడ్డవారితో స్నేహం ఎలాంటిది?
జవాబు:
చెడ్డవారితో స్నేహం నీటిమీద రాత లాంటిది.

ఆ) మంచివారితో స్నేహం ఎలా ఉంటుంది?
జవాబు:
మంచివారితో స్నేహం రాతి మీద చెక్కిన రాత లాగే చిరకాలం ఉంటుంది.

ఇ) అప్పుడే నశించేది ఏది?
జవాబు:
చెడ్డవారితో స్నేహం అప్పుడే నశిస్తుంది.

ఈ) ఈ పద్యము ద్వారా మీరు గ్రహించిన నీతి ఏమి?
జవాబు:
మంచివారితో స్నేహం చేయవలెను.

2. ఎంత యలుకగొన్న నేమి సత్పురుషుల
నోటనెట్లు చెడ్డమాట వెడలు
రాహువదన గహ్వరమున నున్నను జంద్రు
కరములమృతరసమె కురియుఁగా గాదె !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎంత అలిగినా సత్పురుషులు ఎలా ఉంటారు?
జవాబు:
ఎంత అలిగినా సత్పురుషుల నోటి నుండి చెడ్డ మాటలు రావు.

ఆ) ‘గహ్వరము’ పదానికి అర్థమేమి?
జవాబు:
గుహ

ఇ) ఎవరి కరములు అమృతము కురియును?
జవాబు:
చంద్రుని కరములు అమృతము కురియును.

ఈ) ఎంత కోపం వచ్చినప్పటికి ఎవరి నోటి నుండి మంచిమాటలు వస్తాయి?
జవాబు:
ఎంత కోపం వచ్చినప్పటికి మంచివారి నోటి నుండి మంచిమాటలు వస్తాయి.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

అపరిచిత పద్యాలు

కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

కసవు గల దిరవు పసులకు,
లస దద్రినదీ మహీజ లతికావలి పెం
పెసఁగును, గాఁపురమునకును,
బొసఁగును బృందావనంబు వొదఁడచ్చటికిన్.
ప్రశ్నలు – జవాబులు:
అ) బృందావనము పశువులకు ఎలా ఉంటుంది?
జవాబు:
బృందావనము పశువులకు అనుకూలము. అక్కడ వాటికి గడ్డి దొరుకుతుంది.

ఆ) బృందావనము పర్వతాలు, నదులు, చెట్లు, తీగలతో ఉంటుంది. అనే భావంగల పంక్తి ఏది?
జవాబు:
“లస దద్రినదీ మహీజలతికావలి పెంపెసఁగును” అనే పంక్తి.

ఇ) బృందావనము ఏ విధంగా పొసగుతుంది?
జవాబు:
బృందావనం కాపురానికి తగి యుంటుంది.

ఈ) ‘పొదడచ్చటికిన్’ – అంటే ఏమిటి?
జవాబు:
‘అక్కడికి పోదాం ‘ అని ఆ పంక్తికి గల భావం.

2. ఒక్కఁడు ము న్నే మఱి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్, వే
డొక్కఁడు ముట్టి తటాలున,
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎప్పుడు బలుబొబ్బ పెట్టాడు?
జవాబు:
ఒకడు ఏమరుపాటుగా నడుస్తుండగా, మరొకడు పెద్దబొబ్బ పెట్టాడు.

ఆ) పెద్దబొబ్బ పెడితే ఏమయింది?
జవాబు:
బలుబొబ్బ (పెద్దకేక) పెడితే, నడిచివెళ్ళే వాడు ఉలికి పడ్డాడు.

ఇ) ‘ఉలికిపడేటట్లు ఒకడు పెద్దకేక వేయగా’ అనే అర్థం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
‘ఒక్కడు బలుబొబ్బ పెట్టు నులికిపడన్’ అనే పంక్తి ఈ భావాన్ని ఇస్తుంది.

ఈ) కనుదోయి మూయగా ఏమి జరిగింది?
జవాబు:
ఒకడు కనుదోయి మూయగా, అది చూచి మరొకడు నవ్వాడు.

3. కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు – జవాబులు:
అ) సుజనుడు ఎట్లా ఉంటాడు?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

ఆ) మందుడు ఎలా ఉంటాడు?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

ఇ) సుజనుని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

ఈ) ఈ పద్యంలోని అలంకారమేమి?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

4. సద్గొష్ఠి సిరియు నొసెగును
సద్గొష్ఠియె కీర్తి పెంచు, సంతుష్టియునా
సద్గొష్ఠియె యొనగూర్చును
సద్గొష్ఠియె పాపములను చఱచు కుమారా !
ప్రశ్నలు – జవాబులు:
అ) సద్గోష్ఠి దేన్ని ఇస్తుంది?
జవాబు:
సద్గోష్ఠి సంపదను ఇస్తుంది.

ఆ) కీర్తిని పెంచేది ఏది?
జవాబు:
కీర్తిని పెంచేది సద్గోష్ఠి

ఇ) సద్గోష్ఠి పోగొట్టేది ఏది?
జవాబు:
సద్గోష్ఠి పాపములను పోగొడుతుంది.

ఈ) ఈ పద్యము ఏ శతకంలోనిది?
జవాబు:
ఈ పద్యము కుమార శతకంలోనిది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్జనమైత్రిని నీటిమీది వ్రాతతో ఎందుకు పోల్చారు?
జవాబు:
దుర్జనమైత్రి ఎంతో కాలం సాగదు. స్నేహం చేస్తుంటేనే అనేక అభిప్రాయ భేదాలు వస్తాయి. అపార్థాలు వస్తాయి. అనవసరమైన గొడవలెన్నో వస్తాయి. ఎంతగా సర్దుకుపోదామన్నా కుదరదు. అడుగడుగునా అవమానాలు ఎదురౌతాయి. అందుచేత దుర్జనమైత్రి నిలబడదు. అలాగే నీటి మీద వ్రాసిన వ్రాత కూడా అంతే. వ్రాస్తుంటేనే చెరిగిపోతుంది.

ప్రశ్న 2.
లోభి వాని చేతిలో డబ్బును వేసవిలో ఎండలో వెళ్లే వ్యక్తి నీడతో పోల్చడాన్ని ఎలా సమర్ధిస్తారు?
జవాబు:
లోభి వాని చేతిలో డబ్బు ఉంటుంది. కాని ప్రయోజనం ఉండదు. లోభి ఆ డబ్బును ఎవరికీ ఇవ్వడు. తనూ ఖర్చు చేసుకోడు. సుఖపడడు. అలాగే వేసవి ఎండలో వెళ్లే వాడి నీడ వలన కూడా ఎవరికీ ప్రయోజనం లేదు. ఆ నీడను ఎవరూ సేద తీరలేరు. అలాగే ఆ వ్యక్తికి కూడా తన నీడ చల్లదనాన్ని ఇవ్వదు. అందుచేత లోభి చేతిలో డబ్బు, వేసవిలో నడిచేవాని నీడా ప్రయోజనం లేనివే. కనుక రెండింటినీ పోల్చడం సమర్థనీయమే.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాపట్ల,
xxxxx.

ప్రియమైన శ్రీవల్లికి,
నీ స్నేహితురాలు లలిత వ్రాయు లేఖ.
ఇటీవల మా తెలుగు మాస్టారు ‘హితోక్తులు’ పాఠం చెప్పారు. దీనిని రాసిన కవి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు. రాళ్ళపల్లి గ్రంథ పరిష్కర్తగా, వ్యాస రచయితగా, విమర్శకునిగా, గానకళా ప్రపూర్ణగా సాహిత్య లోకానికి సుపరిచితులని చెప్పారు. రఘువంశం, స్వప్న వాసవదత్త గాథా సప్తశతి (ప్రాకృతభాష) వంటి సంస్కృత గ్రంథాలను ఆంద్రీకరించారు. అనేక గ్రంథాలను పరిశీలించి, పరిశోధకుడిగా పరిష్కరించి సమగ్ర పీఠికలను అందించారు. తిరుమలతిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 108 అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. రాళ్ళపల్లివారి పాత్ర చిత్రీకరణను తెలియజేసే వ్యాసాలు నిగమశర్మ అక్క తిక్కన తీర్చిన సీతమ్మ. వేమనపై ఏడు ఉపన్యాసాలు ఇచ్చారు. ‘ఏకసంథాగ్రాహి’ పేరు పొందారని మా సార్ చెబుతుంటే అద్భుతం అనిపించింది. ఇలాంటి గొప్పకవి రాసిన పద్యాలు చదవడం అదృష్టంగా భావిస్తున్నా. దీనిపై నీ అభిప్రాయం రాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
కె. లలిత.

చిరునామా :
ఎస్. శ్రీవల్లి, 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.

ప్రశ్న 2.
కవుల గొప్పదనాన్ని ప్రశంసిస్తూ కవిత రాయండి.
జవాబు:
బుద్ధి బలాన్ని సిరాగా మార్చి కలం పట్టిన
కవులకు మనమేమివ్వగలం ?

విలువలకు ఛందస్సులు తొడిగిన ఘనులే !
సాహిత్యపు మాగాణంలో పండిన మణులే ! .
ఆలోచనలే అక్షర రూపం దాల్చగా
పథం చూపే కథనాలను అందించిన
కవులకు మనమేమివ్వగలం
జయంతికో, వర్థంతికో వందనం తప్ప.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

హితోక్తులు = మంచి మాటలు, సూక్తులు
నీరు = జలము, ఉదకము
నిజము = సత్యము, యధార్థం
దుర్జనుడు = చెడ్డవాడు, దుష్టుడు
మైత్రి = స్నేహం, సఖ్యం
నశించు = నాశనమగు, ధ్వంసమగు
సజ్జనులు = మంచివారు, ఉత్తములు
అళి = సమూహం, గుంపు
సల్పుట = చేయుట, ఆచరించుట
సిరి = డబ్బు, ధనం
చేయి = హస్తము, కరము
వెలయు = వెలుగు, ప్రకాశించు
సుంత = కొంచెం, కొద్దిగా
ఫలము = ఫలితం, ప్రయోజనం
తెరవు = మార్గం, దారి
కఱకు = కఠినం, దట్టమైన
వేసవి = వేసంగి, ఎండాకాలం
నీడ = ఛాయ, పొడ
అలుక = కినుక, కోపం
సత్పురుషులు = ఉత్తములు, మంచివారు
నోరు = వక్రము, వాయి
రాహువు = స్వర్భానుడు, అహి
మాట = పలుకు, వాణి
వదనము = ముఖము, ఆననము
గహ్వరము = గుహ, బిలము
చంద్రుడు = శశి, శశాంకుడు
కరములు = కిరణాలు, మరీచులు
అమృతము = సుధ, పీయూషము
మనము = మనస్సు, మనసు
అంత్యము = తుద, చివర
దశ = స్థితి, పరిస్థితి
సూర్యుడు = ద్యుమణి, రవి

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

ప్రకృతి – వికృతులు

హితము – ఇతము
నిజము – నిక్కము
శ్రీ – సిరి
ఫలము – పండు
చంద్రుడు – చందురుడు
గహ్వరము – గవి

వ్యతిరేక పదాలు

నిజము × అబద్దము
దుర్జనుడు × సజ్జనుడు
మైత్రి × వైరము
సుంత × అధికం
ఫలము × నిష్ఫలము
నీడ × వెలుగు
అలుక × శాంతం
సత్పురుషులు × దుష్టులు
చెడు × మంచి
అమృతం × విషం
అంత్యం × ఆది
ఉన్నతం × అధమం
మీద × క్రింద

సంధులు

కరములమృతము = కరములు + అమృతము – ఉత్వసంధి
మానవంతుడైన = మానవంతుడు + ఐన – ఉత్వసంధి
ఉన్నతంబె = ఉన్నతంబు + ఎ – ఉత్వసంధి
సల్పితిమేని = సల్పితిమి + ఏని – ఇత్వసంధి
సజ్జనాళియందు = సజ్జనాళి + అందు – యడాగమం
సిరియెంతగా = సిరి + ఎంతగా – యడాగమం
వేసవియెండ = వేసవి + ఎండ – యడాగమం
ఎంతయలుక = ఎంత + అలుక – యడాగమం
ఉన్నతంబెయగును = ఉన్నతంబె + అగును – యడాగమం
సజ్జనాళి = సజ్జన + అళి – సవర్ణదీర్ఘసంధి
గీచినట్టి = గీచిన +అట్టి – అత్వసంధి
వేళఁగఱకు = వేళన్ + కఱకు – సరళాదేశ సంధి
వానికిఁదన = వానికిన్ + తన – సరళాదేశ సంధి
దశలఁగూడ = దశలన్ + కూడ – సరళాదేశ సంధి
ప్రక్కఁగాదె = ప్రక్కన్ + కాదె – సరళాదేశ సంధి

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. మంచివారితో మైత్రి చేయాలి.
a) స్నేహం
b) బంధుత్వం
c) వ్యాపారం
d) వ్యవసాయం
జవాబు:
a) స్నేహం

2. దుర్జనులు దూరంగా ఉంచవలసినవారు.
a) దేవతలు
b) కోపం కలవారు
c) శత్రువులు
d) చెడ్డవారు
జవాబు:
d) చెడ్డవారు

3. సిరిని అనవసరంగా వృథా చేయకూడదు.
a) ఆహారం
b) డబ్బు
c) నీరు
d) కాలం
జవాబు:
b) డబ్బు

4. మంచి తెరువులో ప్రయాణించాలి.
a) వాహన
b) సమయం
c) దారి
d) మిత్రుడు
జవాబు:
c) దారి

5. వదనములో చిరునవ్వు ఉండాలి.
a) ఎప్పుడు
b) ఎల్లప్పుడు
c) ముఖము
d) ఆనందం
జవాబు:
c) ముఖము

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

6. చెట్టు నీడ చల్లగా ఉంటుంది.
a) క్రింద
b) ఛాయ
c) ప్రక్క
d) లోపల
జవాబు:
b) ఛాయ

7. సూర్య కరములు వేడిగా ఉంటాయి.
a) కిరణాలు
b) కాంతులు
c) ఎండలు
d) తాపం
జవాబు:
a) కిరణాలు

8. అంత్యదశలోనూ మహాత్ములు ఉపకారం చేస్తారు.
a) మొదటి స్థితి
b) చివరిస్థితి
c) దుస్థితి
d) సుస్థితి
జవాబు:
b) చివరిస్థితి

9. చంద్రుడు వెన్నెలనిస్తాడు.
a) కౌముది
b) రవి
c) శశి
d) ఆతపం
జవాబు:
c) శశి

10. సూర్యుడు పగటికి రాజు.
a) శశి
b) శశాంకుడు
c) ద్యుః
d) రవి
జవాబు:
d) రవి

పర్యాయపదాలు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. పెద్దల హితోక్తి వినాలి.
a) సూక్తి, ఉక్తి
b) సూక్తి, మంచిమాట
c) నీతి, ధర్మం
d) మాట, పలుకు
జవాబు:
b) సూక్తి, మంచిమాట

12. మంచి నీరు వృథా చేయకూడదు.
a) జలము, ఉదకం
b) జలము, జలజం
c) ఉదకం, ఉదధి
d) నీరు, నీరజ
జవాబు:
a) జలము, ఉదకం

13. మంచివారితో మైత్రి చేయాలి.
a) బంధుత్వం, చుట్టరికం
b) వైరం, శత్రుత్వం
c) స్నేహం, సఖ్యం
d) వ్యాపారం, వాణిజ్యం
జవాబు:
c) స్నేహం, సఖ్యం

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

14. సుంత కోపం కూడా ఉండకూడదు.
a) కొంచెం, కొద్దిగా
b) చాలా, ఎక్కువ
c) అంత, ఇంత
d) ఇంత, వింత
జవాబు:
a) కొంచెం, కొద్దిగా

15. చేయి చాపి యాచించకూడదు.
a) కరి, కరము
b) కరము, కరుణ
c) హస్తం, హస్తి
d) కరము, హస్తము
జవాబు:
d) కరము, హస్తము

16. చంద్రుడు రాత్రికి రాజు.
a) శశి, చంద్రిక
b) కౌముది, చందురుడు
c) శశి, శశాంకుడు
d) ద్యు, మహి
జవాబు:
c) శశి, శశాంకుడు

17. మంచి తెరువు చూసుకోవాలి.
a) మార్గం, దారి
b) ఉద్యోగం, జీతం
c) ఉపాధి, పని
d) ఉద్యోగం, పని
జవాబు:
a) మార్గం, దారి

18. గహ్వరములోకి వెళ్లకూడదు.
a) అడవి, కాననం
b) కొండ, శైలం
c) నది, గోదావరి
d) గుహ, బిలము
జవాబు:
d) గుహ, బిలము

19. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది.
a) వేసగి, ఎండాకాలం
b) వేసటం, వేసము
c) వేసదము, ఎండ
d) ఆతపం, ఎండ
జవాబు:
a) వేసగి, ఎండాకాలం

20. దేవతలు అమృతము త్రాగుతారు.
a) సుధ, సుద్ద
b) సుధ, పాలు
c) సుధ, పీయూషము
d) మధువు, తేనె
జవాబు:
c) సుధ, పీయూషము

ప్రకృతి-వికృతులు

ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. హితము పలకాలి.
a) హితవు
b) హిమము
c) ఇతవు
d) హితోక్తి
జవాబు:
c) ఇతవు

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

22. నిక్కము పలకాలి.
a) నిక్కరు
b) నిజము
c) సత్యము
d) యదార్థం
జవాబు:
b) నిజము

23. సిరి గలవాడు శ్రీహరి.
a) డబ్బు
b) లక్ష్మి
c) ధనం
d) శ్రీ
జవాబు:
d) శ్రీ

24. ఫలము లేనిదే ఎలా?
a) పండు
b) ఫలితం
c) ప్రయోజనం
d) లాభం
జవాబు:
a) పండు

25. చంద్రుడు రేరాజు.
a) శశి
b) శశాంకుడు
c) చందురుడు
d) చంద్రిక
జవాబు:
c) చందురుడు

26. గహ్వరము కొండలలో ఉంటుంది.
a) గుహ
b) గొబ
c) బిలము
d) గవి
జవాబు:
d) గవి

27. ప్రతిదానికీ ఆశ్చర్యము వ్యక్తం చేయకూడదు.
a) అచ్చెరువు
b) ఆచెరుము
c) ఆచ్చెరం
d) ఆచెరం
జవాబు:
a) అచ్చెరువు

28. ధర్మము తప్పకూడదు.
a) దరమము
b) దరిమ
c) దరము
d) దమ్మము
జవాబు:
d) దమ్మము

29. న్యాయమునకు గెలుపు వస్తుంది.
a) న్యాయ్యము
b) నాయము
c) నాయ్యము
d) నయము
జవాబు:
b) నాయము

30. ప్రతి కార్యము శ్రద్ధతో చేయాలి.
a) కర్యము
b) కర్జూరం
c) కర్ణము
d) కర్చు
జవాబు:
c) కర్ణము

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

వ్యతిరేకపదాలు : ఈ క్రింది గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు గుర్తించండి.

31. నిజమును పలకాలి.
a) సత్యం
b) అబద్ధం
c) యదార్థం
d) నృతము
జవాబు:
b) అబద్ధం

32. మైత్రిని పాటించాలి.
a) స్నేహం
b) సఖ్యం
c) వైరం
d) నటన
జవాబు:
c) వైరం

33. శ్రమకు ఫలము ఉంటుంది.
a) నిష్ఫలము
b) ఫలితము
c) ప్రయోజనం
d) లాభం
జవాబు:
a) నిష్ఫలము

34. నీడలో చీకటి ఉంటుంది.
a) నీడజము
b) ఛాయ
c) పొడ
d) వెలుగు
జవాబు:
d) వెలుగు

35. దుర్జనుడు విడువ తగినవాడు.
a) సజ్జనుడు
b) దుష్టుడు
c) దుర్మార్గుడు
d) దుర్మదుడు
జవాబు:
a) సజ్జనుడు

36. దేవతలకు అమృతం ఇష్టం.
a) పీయూషం
b) సుధ
c) విషం
d) విషజం
జవాబు:
c) విషం

37. అంత్యంలోనైనా మంచిగా ఉండాలి.
a) చివరి
b) తుద
c) వెనుక
d) ఆది
జవాబు:
d) ఆది

38. ఉన్నతంగా జీవించాలి.
a) అధమం
b) ఉత్తమం
c) చాలా
d) కొంచెం
జవాబు:
a) అధమం

39. తల మీద ఉంటుంది.
a) పైన
b) క్రింద
c) ప్రక్క
d) ఇటు
జవాబు:
b) క్రింద

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

40. చెడు ను విడవాలి.
a) మంచి
b) కీడు
c) ఆపద
d) ఇడుము
జవాబు:
a) మంచి

2. వ్యాకరణాంశాలు

ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

41. కరములమృతము – సంధి పేరు?
a) ఉత్వసంధి
b) అత్వసంధి
c) ఇత్వసంధి
d) యడాగమం
జవాబు:
a) ఉత్వసంధి

42. సిరియెంతగా – సంధి విడదీయండి.
a) సిరి + యెంతగా
b) సిరి + ఎంతగా
c) సిరియెంత + గా
d) సిరీ + ఎంతగా
జవాబు:
b) సిరి + ఎంతగా

43. సజ్జనాళి – సంధి పేరేమి?
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) సవర్ణదీర్ఘ సంధి
d) గుణసంధి
జవాబు:
c) సవర్ణదీర్ఘ సంధి

44. గీచినట్టి – సంధి విడదీయండి.
a) గీచి + నట్టి
b) గీచిన + అట్టి
c) గీచిన + ట్టి
d) గీచీ + న + అట్టి
జవాబు:
b) గీచిన + అట్టి

45. సల్పితిమేని – ఇది ఏ సంధి?
a) అత్వసంధి
b) యడాగమం
c) ఉత్వసంధి
d) ఇత్వసంధి
జవాబు:
d) ఇత్వసంధి

46. వానికిఁదన – సంధి విడదీయండి.
a) వానికిన్ + తన
b) వాని + కిదన
c) వానికి + తన
d) వానికి + దన
జవాబు:
a) వానికిన్ + తన

47. ప్రక్కఁగాదె – సంధి పేరేమి?
a) గసడదవాదేశ సంధి
b) సరళాదేశ సంధి
c) ఇత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
b) సరళాదేశ సంధి

48. ఎంతయలుక – సంధి పేరేమి?
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) యడాగమం
d) త్రికసంధి
జవాబు:
c) యడాగమం

49. ఉన్నతంబె – సంధి పేరేమి?
a) ఉత్వసంధి
b) అత్వసంధి
c) ఇత్వసంధి
d) యడాగమం
జవాబు:
a) ఉత్వసంధి

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

50. దశలఁగూడ – సంధి పేరేమి?
a) ఉత్వసంధి
b) ఇత్వసంధి
c) సరళాదేశ సంధి
d) గసడదవాదేశ సంధి
జవాబు:
c) సరళాదేశ సంధి

నేనివి చేయగలనా?

1. పద్యాలను వినసొంపుగా పాడగలను. [ ఔను / కాదు ]
2. పద్యాలను స్పష్టమైన ఉచ్చారణతో చదవగలను. [ ఔను / కాదు ]
3. నేర్చుకున్న భాషాంశాలను సొంత మాటల్లో రాయగలను. [ ఔను / కాదు ]
4. నేను విన్న హితోక్తులను ఆచరించగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి.

సంకల్పబలం

టిట్టిభము అనేది ఒక చిన్న పక్షి. దానిని లకుముకి పిట్ట అని కూడా అంటారు. ఈ ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్ళింది. అది తిరిగి వచ్చి చూసే సరికి దాని గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను సముద్రంలోకి ఈడ్చుకుని పోయాయి.

గుడ్లు కనిపించకపోవడంతో ఆ పక్షి చాలా బాధపడింది. ‘అయ్యో ! నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకుని పోయిందే’ అని తలుచుకుంటూ ఆ చిన్న పక్షి రోదించింది. ఏడుపు ఆపి ఆలోచించింది. పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది. వెంటనే కార్యాచరణకు దిగింది. సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటి బొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒకచోట ఉమ్మివేసేది. మళ్లీ సముద్రం వద్దకు వచ్చి ఇంకొక బొట్టును పీల్చి దూరంగా పోయి ఉమ్మివేయసాగింది.

ఈ విధంగా అది విశ్రాంతి లేకుండా ఆ నీటిని ఉమ్మివేసే పనిలో నిమగ్నమయ్యింది. ఆ సముద్ర జలాన్నంతా పీల్చివేస్తే తన గుడ్లు బయటపడతాయనుకుంటుంది. టిట్టిభపక్షి చేస్తున్న పనిని తోటి పక్షులు హేళన చేసాయి. సముద్రాన్ని తోడివేయడం నీ వల్ల అవుతుందా ? అని ఎగతాళిగా మాట్లాడాయి. మరికొన్ని దాని కష్టం చూడలేక దానికి సాయం చేసాయి. మొత్తానికి టిట్టిభ పక్షులన్నీ కలిసి సముద్రంలోకి నీటిని పీల్చడం…. బయట వదలి వేయడం. ఆ పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న ఈ పనిని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏమిటని వాటిని అడిగాడు.

తన గుడ్లని సముద్రంలోకి కెరటాలు ఈడ్చుకొనిపోయిన విషయాన్ని టిట్టిభపక్షి సముద్రుడితో మొర పెట్టుకుంది. ఆ పక్షుల పట్టుదల, సంకల్పాన్ని, సంతానం పట్ల ప్రేమను చూసి సముద్రుని మనస్సు కరిగిపోయింది. తన గర్భంలోకి జారిపోయిన గుడ్లను వెతికి తెచ్చి టిట్టిభపక్షికి అప్పగించాడు. పని చిన్నదా? పెద్దదా? అవుతుందా? కాదా? అనేది కాదు…. ముందు ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల ఎలా ఉండాలనే సంకల్పాన్నీ, తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని ఈ చిన్నికథ మనకు అందిస్తోంది.