SCERT AP 10th Class Biology Study Material 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Biology 9th Lesson Questions and Answers మన పర్యావరణం – మన బాధ్యత
10th Class Biology 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయికి బదిలీ అయిన శక్తి ఏమవుతుంది? (AS 1)
జవాబు:
- ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయికి శక్తి బదిలీ అవుతుంది.
- ఈ శక్తి బదిలీ పూర్తిగా 100 శాతం జరగదు. కొంత శక్తి జీవి జీవక్రియలకు వినియోగించుకుంటుంది.
- ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి కేవలం 10-20% శక్తి మాత్రమే సరఫరా అవుతుంది. మిగిలిన 80% నుండి శక్తి జీవి జీవక్రియలకు, శరీర ఉష్ణానికి ఖర్చు చేయబడుతుంది.
- ఉదాహరణకు 10 కిలోల గడ్డిని ఒక శాకాహారి ఆహారంగా తీసుకొంటే, దాని నుండి లభించిన శక్తిని, ఆ శాకాహారి, జీవక్రియలకు వాడుకొంటుంది. అంటే గుండె కొట్టుకోవటానికి, పరుగెత్తటానికి, శరీర ఉష్ణానికి ఈ శక్తి ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చు అయ్యే శక్తి విలువ 80% వరకు ఉంటుంది.
- జీవి తన అవసరాలకు పోను మిగిలిన శక్తిని జీవద్రవ్యరాశి రూపంలో శరీరంలో నిల్వ చేసుకొంటుంది. ఈ నిల్వ చేసుకొన్న తక్కువ శక్తి తరువాత పోషకస్థాయి అయిన మాంసాహారికి అందించబడుతుంది.
ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థలోని పిరమిడ్లు మరియు ఆహారపు గొలుసులు వేటిని సూచిస్తాయి? (AS 1)
జవాబు:
ఆవరణ వ్యవస్థలోని జీవుల మధ్య సంబంధాలను చూపటానికి లేదా వర్ణించటానికి ఆవరణ శాస్త్రవేత్తలు పిరమిడ్ భావనను ప్రతిపాదించారు. వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అంటారు. జీవావరణ పిరమిడ్లు ఆవరణ వ్యవస్థలోని జీవుల సంఖ్యను, వాటి జీవ ద్రవ్యరాశిని, ఆహారపు గొలుసులో శక్తి ప్రసరణను సూచిస్తాయి.
జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను చూపే రేఖాత్మక చిత్రాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఇది జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను, ఒక జీవి ఆహారం పొందే విధానాన్ని, దాని ఆహార అలవాట్లను తెలుపుతుంది.
ప్రశ్న 3.
ఏదైనా ఒక ఆహారపు గొలుసు యొక్క సంఖ్యా పిరమిడ్ పై లఘుటీక రాయండి. కింద ఇవ్వబడిన సంఖ్యాపిరమిడ్ నుండి నీవు ఏం గ్రహించావు? (AS 1)
ఎ) చెట్టు బి) కీటకం సి) వడ్రంగి పిట్ట
జవాబు:
సంఖ్యాపిరమిడ్ :
ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ రేఖాపటంలో చూపటాన్ని సంఖ్యాపిరమిడ్ అంటారు. ఇది ఆహారపు గొలుసులోని వివిధ పోషక స్థాయిలలో ఉన్న జీవుల సంఖ్యను తెలుపుతుంది.
చెట్లు → కీటకాలు → వడ్రంగి పిట్ట
అనే ఈ ఆహారపు గొలుసును పరిశీలిస్తే చెట్ల సంఖ్య కీటకాల కంటే అధికంగాను, కీటకాలు, వడ్రంగి పిట్ట కంటే అధిక సంఖ్యలోనూ ఉంటాయి. అంటే ఆహారపు గొలుసులో పైకి పోతున్న కొలది జీవుల సంఖ్య తగ్గుతుంది. కావున ఈ సంఖ్యా పిరమిడ్ నిటారుగా ఉంటుంది.
ఇదే ఆహారపు గొలుసును ఒక చెట్టు పరంగా పరిశీలిస్తే చెట్ల సంఖ్య (ఒక్కటి) దానిపైన ఉన్న కీటకాల కంటే తక్కువ. అదే విధంగా కీటకాల కంటే వడ్రంగి పిట్టల సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే చెట్టు, వడ్రంగి పిట్టల సంఖ్య తక్కువగా ఉండి, కీటకాల సంఖ్య ఎక్కువగా ఉండుట వలన ఈ సంఖ్యాపిరమిడ్ శంఖు ఆకారంలో వస్తుంది.
ప్రశ్న 4.
జీవ ద్రవ్యరాశి అనగానేమి? కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకొని, జీవద్రవ్యరాశి పిరమిడ్ ను గీయండి. (AS 1)
ఎ) గడ్డి బి) శాకాహారులు సి) మాంసాహారులు డి) గద్ద లేదా రాబందు
జవాబు:
శక్తిగా మార్చటానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. వివిధ ఆహారపు గొలుసుల జీవ ద్రవ్యరాశి పిరమిడ్లను నిర్మిస్తే అవి ఆహారపు గొలుసులోని జీవుల పరిమాణాన్ని సూచిస్తాయి.
గడ్డి → కీటకం → పాము → గద్ద
ఉత్పత్తి శాకాహారి → మాంసాహారి → అగ్రశ్రేణి మాంసాహారి
పై ఆహారపు గొలుసు యొక్క జీవద్రవ్యరాశి పిరమిడ్ ను నిర్మిస్తే అది అథోముఖంగా ఉంటుంది. ఈ ఆహారపు గొలుసులో పైకి వెళ్ళే కొలది జీవుల యొక్క జీవ ద్రవ్యరాశి పెరుగుతుండుట వలన పిరమిడ్ తలక్రిందులుగా ఏర్పడింది. కానీ సాధారణంగా భౌమ ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్లు శీర్షాభిముఖంగా ఉంటాయి.
ప్రశ్న 5.
ఈ పాఠం చదివిన తరువాత ‘విషపూరిత పదార్థాల వాడకం ఆవరణ వ్యవస్థను ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయి’ అనే దానిపై మీరు అర్థం చేసుకొన్న విషయాలను రాయండి. (AS 1)
జవాబు:
పరిశ్రమల నుండి వస్తున్న భారలోహాలు, వ్యర్థ జలాలు, వ్యవసాయ భూముల నుండి వస్తున్న రసాయన కలుషితాలు ఆవరణ వ్యవస్థలను విపరీతంగా నష్టపర్చుతున్నాయి. ఈ కలుషితాలు క్రమేణా జీవులలోనికి ప్రవేశించి హానికర వ్యాధులను కలిగిస్తున్నాయి. ఆహార గొలుసుతోపాటు ఈ హానికర రసాయనాలు అగ్రశ్రేణి మాంసాహారులలో, సాంద్రీకరణ చెంది దారుణమైన ఫలితాలు కలిగిస్తున్నాయి.
చిస్సౌ కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమల నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీ చేపల ద్వారా వాటిని తినే మనుషులలోకి చేరి ‘మినిమేటా’ అనే వ్యాధిని కలిగించింది. దీని ఫలితంగా అనేక జీవరాశులు మృత్యువాత పడ్డాయి. కావున విషపూరిత కలుషితాల ప్రభావాలను అర్థం చేసుకొని వాటిని వినియోగించటంలోనూ, తొలగించటంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మానవ జీవితం సక్రమంగా నడవగలుగుతుంది.
ప్రశ్న 6.
క్రిమికీటకాల బారి నుండి పంటలను, ఆహార పదారాలను నివారించే క్రిమిసంహారకాలను ఉపయోగించాలా? లేదా ప్రత్యామ్నాయాలను ఆలోచించాలా? ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని, దానికి గల కారణాలను రాయండి. (AS 1)
జవాబు:
క్రిమికీటకాల బారి నుండి ఆహార పదార్థాలను రక్షించుకోవటం మన తక్షణ బాధ్యత. అయితే దానికోసం ఉపయోగిస్తున్న రసాయనిక క్రిమిసంహారకాలు పర్యావరణం పైన తీవ్ర హానికర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రసాయనాలు హానికర కీటకాలనే కాకుండా ఉపయోగకరమైన అనేక కీటకాలనూ చంపుతున్నాయి. కావున వీటి వాడకం సరైన పద్దతి కాదు. ఈ రసాయనిక క్రిమిసంహారకాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేక జీవ నియంత్రణ పద్ధతులను సూచిస్తున్నారు. పరభక్షకాలను ఉపయోగించడం, పరాన్నజీవులను ప్రయోగించటం, పంట మార్పిడి విధానం, ఆకర్షక పంటలు, జీవ రసాయనాల వాడకం వంటి పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వీటిని అనుసరించుట వలన మన ప్రయోజనాలతో పాటు, పర్యావరణం పరిరక్షింపబడుతుంది. ఇది మన పర్యావరణ నైతికతకు నిదర్శనం. కావున ఈ ప్రత్యామ్నాయ పద్ధతులపైన రైతులలో అవగాహన కల్పించి, ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అప్పుడే మన జీవనం ‘పర్యావరణ మిత్ర’ గా కొనసాగుతుంది.
ప్రశ్న 7.
పోషకస్థాయి అంటే ఏమిటి? జీవావరణ పిరమిడ్లో ఇది దేనిని తెలియజేస్తుంది? (AS 1)
జవాబు:
ఆహారపు గొలుసు వివిధ జీవుల ఆహార సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆహారపు గొలుసులోని ఒక్కొక్క అంతస్తును పోషకస్థాయి అంటారు. ఆహారపు గొలుసులో శక్తి ఒక పోషకస్థాయి నుండి మరొక పోషక స్థాయికి అందించబడుతుంది.
- పోషకస్థాయి ఆహారపు గొలుసులోని జీవుల సంబంధాలను తెలుపుతుంది.
- ఆహారపు గొలుసులో జీవుల స్థానాన్ని తెలుపుతుంది.
- జీవి ఆహార విధానాన్ని తెలియజేస్తుంది.
- ఆహారపు గొలుసులో జీవి స్థాయిని తెలియజేస్తుంది.
- ఆహారపు గొలుసు యొక్క విస్తృతిని తెలియజేస్తుంది.
- శక్తి ప్రసరణ మార్గాన్ని తెలియజేస్తుంది.
ప్రశ్న 8.
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ గురించి వివరంగా తెలుసుకోవాలంటే నీవేమి ప్రశ్నలు అడుగుతావు? (AS 2)
జవాబు:
- ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ అవసరం ఏమిటి?
- ఆవరణ వ్యవస్థలో శక్తిపిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుంది?
- ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద శక్తి నష్టం ఎంత ఉంటుంది?
- ఎంత శక్తి శాతం ఆహారపు గొలుసులో స్థాయి పెరిగినపుడు రవాణా అవుతుంది?
- ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పత్తిదారులు ఏమిటి?
- శక్తి పిరమిడ్లో ఉత్పత్తిదారుల సంఖ్య అధికంగా ఉండవలసిన అవసరం ఏమిటి?
ప్రశ్న 9.
ఆహారపు వల నుండి మాంసభక్షకాలను తొలగిస్తే ఏం అవుతుంది? (AS 2)
జవాబు:
- ఆవాసంలో ప్రతి జీవికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏ ఒక్క జీవిని తొలగించినా దాని ప్రభావం ఇతర జీవులపైనా, పర్యావరణం పైనా ప్రభావం చూపుతుంది.
- ఉదాహరణకు ఆహారపు వల నుండి మాంసభక్షకాలను తొలగిస్తే శాకాహారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటి జనాభా అదుపు తప్పుతుంది. అంటే ఒక అడవిలో సింహం, పులులను తొలగిస్తే అవి ఆహారంగా తీసుకొనే, జింకలు, జిరాఫీ వంటి శాకాహారుల సంఖ్య పెరుగుతుంది.
- ఈ పరిస్థితి కొనసాగితే శాకాహారుల సంఖ్య బాగా పెరిగి, వాటి మధ్య ఆహారం కొరకు, ఆవాసం కొరకు పోటీ తీవ్రత పెరుగుతుంది. ఈ జీవుల ఆహార అవసరాలు ఒకే విధంగా ఉండుటవలన వాటి మధ్య పోటీ పెరిగి ఆహార కొరత ఏర్పడుతుంది.
- ఆహారం లభించక శాకాహారులు కొన్ని మరణించి, వాటి జనాభా నియంత్రించబడుతుంది. ఈ విధంగా ప్రకృతిలో సమతాస్థితి స్థాపించబడుతుంది. జీవుల మధ్య ఉండే ఈ సమతాస్థితి ప్రకృతి ధర్మాలలో ఒకటి.
ప్రశ్న 10.
మీ పెరటి తోటలోని ఒక మొక్కను పరిశీలించండి. ఉత్పత్తిదారులు, వినియోగదారుల సంబంధంపై సంక్షిప్త నివేదిక రాయండి. (AS 3)
జవాబు:
- మా పెరటిలో జామచెట్టు ఉంది. దానిపైన అనేక జీవరాసులు ఆవాసం ఉండటం గమనించాను. చెట్టు మొదటలో చీమలు, చిన్న కీటకాలు ఉండగా, బెరడు మీద రెక్కల కీటకాలు కనిపించాయి. చెట్టుమీద పక్షులు, ఉడతలు ఉన్నాయి.
- ఈ చెట్టును ఆవాసంగా భావిస్తే చెట్టుమీద ఉన్న అన్ని జీవరాసులకు, దాని ఆధారంగా జీవిస్తున్న చిన్న జీవులకు, జామచెట్టు ఉత్పత్తిదారు అవుతుంది.
- చెట్టుపై ఆధారపడి జీవిస్తున్న కీటకాలు వినియోగదారులు అవుతాయి. ఇవి మొక్క ఆకులను తింటూ జీవిస్తుంటే వీటిని ప్రాథమిక వినియోగదారులుగా పరిగణిస్తారు. చెట్టు కాయలను తింటూ జీవించే ఉడత కూడా ప్రాథమిక వినియోగదారి అవుతుంది.
- చెట్టుపై ఉన్న కీటకాలను ఆహారంగా తీసుకుని జీవించే ‘పక్షులు ద్వితీయ వినియోగదారులు అవుతాయి.
- ఈ జీవుల మధ్య సంబంధాన్ని ఆహారపు గొలుసుగా చూపిస్తే కింది విధంగా ఉంటుంది.
- వీటి సంబంధాలను పిరమిడ్ ఆకారంలో క్రింది విధంగా చూపించవచ్చు.
ప్రశ్న 11.
జీవద్రవ్యరాశి పిరమిడను వివరించాలంటే ఎలాంటి సమాచారం అవసరమవుతుంది? (AS 4)
జవాబు:
శక్తిగా మార్చటానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. ఆహారపు గొలుసులోని ప్రతి స్థాయి వద్ద జీవద్రవ్యరాశిని గణించి వరుస క్రమంలో అమర్చటం వలన జీవద్రవ్యరాశి పిరమిడ్ ఏర్పడుతుంది.
జీవద్రవ్యరాశి పిరమిడను నిర్మించాలంటే :
- ఆహారపు గొలుసులోని జీవుల వివరాలు
- ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద ఉన్న జీవద్రవ్యరాశి పరిమాణం కావాలి.
జీవద్రవ్యరాశి పిరమిడ్ ప్రతి పోషక స్థాయిలోని జీవద్రవ్యరాశి పరిమాణాన్ని, వివిధ పోషక స్థాయిలలో ఉన్న రాశుల మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది.
జీవద్రవ్యరాశి పిరమిడను వివరించాలంటే-
- పిరమిడను నిర్మిస్తున్న జీవులు, వాటి ఆహార సంబంధాలు
- ప్రతి పోషక స్థాయిలో జీవుల జీవద్రవ్యరాశి.
- పోషక స్థాయిలో జరుగుతున్న శక్తినష్టం
- ప్రతి పోషక స్థాయిలో ఆహారపు గొలుసులో జమ అవుతున్న జీవద్రవ్యరాశి వంటి వివరాలు కావాలి.
సాధారణంగా జీవద్రవ్యరాశి పిరమిడ్లు రెండు రకాలుగా ఉంటాయి.
- ఊర్ధ్వముఖ జీవద్రవ్యరాశి పిరమిడ్లు
- అధోముఖ జీవద్రవ్యరాశి పిరమిడ్లు
ప్రశ్న 12.
ఎగువ పోషకస్థాయి వినియోగదారునిగా నిన్ను ఊహించుకొని, సంఖ్యాపిరమిడను గీసి దాని దిగువ స్థాయిల గురించి రాయండి. (AS 5)
జవాబు:
- మొక్కలు → గొర్రె → మానవుడు- ఈ ఆహారపు గొలుసు నందు మానవుడు ఎగువ పోషకస్థాయిలో ఉన్నాడు.
- మానవుని కంటే దిగువ పోషకస్థాయిలో గొర్రె, మేక వంటి శాకాహారులు ఉన్నాయి. ఇవి మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారాన్ని గ్రహిస్తాయి కావున వీటిని ప్రాథమిక వినియోగదారులు అంటారు.
- ఈ ప్రాథమిక వినియోగదారులు ఆహారం కోసం ఉత్పత్తిదారులైన మొక్కలపై ఆధారపడతాయి. అందువలన మొక్కలు పిరమిడ్ లో ఆధారభాగాన ఉన్నాయి.
- ఈ ఆహారపు గొలుసును సంఖ్యాపరంగా పరిశీలిస్తే శాకాహారుల కంటే మొక్కలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మానవుని కంటే ఆవరణ వ్యవస్థలో శాకాహారులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కావున ఈ పిరమిడ్ ఊర్ధ్వముఖంగా ఉన్నది.
ప్రశ్న 13.
మీ తోటి విద్యార్థులలో చైతన్యం కలిగించడానికి పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలపై నినాదాలు రాయండి. (AS 7)
(లేదా)
సమాజమును చైతన్యం చేయుటకు పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలపై నినాదాలు వ్రాయండి.
జవాబు:
పర్యావరణ స్నేహపూర్వక నినాదాలు :
- జీవించు – జీవించనివ్వు
- ప్రకృతిని సంరక్షించు – జీవ వైవిధ్యాన్ని సంరక్షించు
- పరిసరాలను శుభ్రంగా ఉంచు – సంతోషంగా ఉండు
- పర్యావరణ స్నేహభావంతో ఆలోచించు – పర్యావరణ స్నేహపూర్వకంగా జీవించు
- పర్యావరణాన్ని నీవు రక్షించు – పర్యావరణం నిన్ను రక్షిస్తుంది.
- పలు కాలుష్యాలను తగ్గించండి – జీవ వైవిధ్యాన్ని కాపాడండి.
- మన పర్యావరణం కోసం ఒక మొక్కను నాటుదాం.
- భూమి ఉన్నది ఒక్కటే – దానిని నాశనం చేయొద్దు.
ప్రశ్న 14.
క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి సహాయపడే ఏవైనా మూడు కార్యక్రమాలను సూచించండి. (AS 7)
(లేదా)
మీ ప్రాంతంలో క్రిమి సంహారకాలను అధికంగా వాడడం వల్ల నేల కాలుష్యానికి గురి అయింది. దీనిని నివారించడానికి ఏవైనా రెండు పద్ధతులను సూచించండి.
జవాబు:
క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేయటానికి ఈ కింది కార్యక్రమాలు తోడ్పడతాయి.
1. జీవనియంత్రణ పద్ధతులు :
కీటకాలను అదుపులో ఉంచటానికి వాటిని తినే పరభక్షకాలను ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు పరాన్నజీవులను ప్రవేశపెట్టి వ్యాధికారక కీటకాలను నిర్మూలించవచ్చు.
2. జీవరసాయనాలు వాడటం :
హానికర రసాయనిక మందుల స్థానంలో మొక్కల నుండి లభించే నింబిన్ (వేప) వంటి పదార్థాలను పిచికారీ చేసి, కీటకాలను అదుపులో ఉంచవచ్చు. పొగాకు, వెల్లుల్లి, పంచగవ్య, ఎపి వి ద్రావణం – దీనికి ఉదాహరణలు.
3. లింగాకర్షణ బుట్టలు :
మగ కీటకాలను ఆకర్షించటానికి పంట పొలాలలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి కీటకాలను బంధించవచ్చు. వీటిలో ‘ఫిరొమోన్’ రసాయనాలు వాడి మగకీటకాలను బంధిస్తారు.
10th Class Biology 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook InText Questions and Answers
10th Class Biology Textbook Page No. 208
ప్రశ్న 1.
పటం-1లో ఉన్న జంతువులను పరిశీలించండి. వాటి మధ్యగల ఆహార సంబంధాలను బాణపు గుర్తులతో చూపుతూ ఆహారపు గొలుసును తయారుచేయండి.
జవాబు:
గడ్డి → కుందేలు → పాము → గద్ద.
ప్రశ్న 2.
మీరు రాసిన లేదా తయారుచేసిన ఆహారపు గొలుసులోని ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల పేర్లను రాయండి.
జవాబు:
ఆహారపు గొలుసులో గడ్డి ఉత్పత్తిదారులు కాగా, మిగిలిన జంతువులు వినియోగదారులు.
ప్రశ్న 3.
మీరు గీసిన బాణపు గుర్తులు దేనిని సూచిస్తాయి?
జవాబు:
మేము గీసిన బాణపు గుర్తు ఆహార సంబంధాలను, శక్తి ప్రసరణను సూచిస్తుంది.
ప్రశ్న 4.
మీ పరిసరాలలో, కనీసం నాలుగు ఆహారపు గొలుసులను గుర్తించండి. వీటిలోని ఉత్పత్తిదారులు, వివిధ స్థాయిలలోని వినియోగదారుల పేర్లను రాయండి.
జవాబు:
ప్రశ్న 5.
ఆహారపు గొలుసులు చాలా వరకు నాలుగు స్థాయిలనే ఎందుకు కలిగి ఉంటాయి?
జవాబు:
ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులలో ప్రారంభమై అగ్రశ్రేణి మాంసాహారులలో పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియలో మూడు లేదా నాలుగు స్థాయిలలో వినియోగదారులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ స్థాయి పెరిగే కొలది ఆహార లభ్యత కష్టమవుతుంది. అందువలన ప్రకృతిలో సాధారణంగా మూడు లేదా నాలుగు స్థాయిలలో ఆహార గొలుసులు ముగుస్తాయి.
ప్రశ్న 6.
ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?
జవాబు:
ఆహారపు గొలుసులో స్థాయి పెరిగే కొలది శక్తి ప్రసరణ తగ్గుతుంది. సరిపడిన శక్తి కొరకు వినియోగదారులు, అధిక సంఖ్యలో వాటి కింది జీవులను ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది. అందువలన ఆహార కొరత ఏర్పడి, అగ్రశ్రేణి మాంసాహారుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
కావున ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల కంటే వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
10th Class Biology Textbook Page No. 211
ప్రశ్న 7.
a) కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసులకు సంఖ్యాపిరమిడ్లను గీయండి.
1) మర్రిచెట్టు → కీటకాలు → వడ్రంగి పిట్ట
2) గడ్డి → కుందేలు → తోడేలు
జవాబు:
b) పై రెండు ఆహారపు గొలుసుల సంఖ్యాపిరమిడ్ల నిర్మాణం ఒకే విధంగా ఉందా?
జవాబు:
రెండు ఆహారపు గొలుసుల సంఖ్యాపిరమిడ్ ఒకే విధంగా లేదు.
c) వ్యత్యాసాలేమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:
మొదటి ఆహారపు గొలుసు సంఖ్యాపిరమిడ్ శంఖు ఆకారంలో ఉంటే, రెండవ ఆహారపుగొలుసు సంఖ్యాపిరమిడ్ త్రిభుజాకారంగా ఉంది. ఈ మొదటి ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువ (ఒక్కటి) కావున పిరమిడ్ శీర్షాభిముఖంగా ప్రారంభమైంది. అగ్రభాగాన వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు (కీటకాలు) సంఖ్య కంటే తగ్గుట వలన పిరమిడ్ శంఖు ఆకారంలోనికి వచ్చింది. రెండవ ఆహార గొలుసులో జీవుల సంఖ్య క్రమేణ తగ్గుట వలన పిరమిడ్ ఊర్వాభిముఖంగా ఉంది.
10th Class Biology Textbook Page No. 212
ప్రశ్న 8.
పిరమిడ్లు ఎప్పుడూ శీర్షాభిముఖంగానే ఉంటాయి. ఎందుకు?
జవాబు:
సాధారణంగా ఆవరణ వ్యవస్థలో జీవుల సంబంధాలను, మూడు పిరమిడ్స్ రూపంలో చూస్తాము. అవి.
- సంఖ్యాపిరమిడ్
- జీవద్రవ్యరాశి పిరమిడ్
- శక్తిపిరమిడ్.
1. సంఖ్యాపిరమిడ్ :
దీని అడుగు భాగాన ఉత్పత్తిదారులు ఉండి, వాటి పైన వినియోగదారులు ఉంటాయి. సాధారణంగా వినియోగదారులకంటే ఉత్పత్తిదారుల సంఖ్య అధికంగా ఉంటుంది. కావున సంఖ్యాపిరమిడ్ శీరాభిముఖంగానే ఉంటుంది.
2. జీవద్రవ్యరాశి పిరమిడ్ :
ఆహారపు గొలుసులో ముందుకు ప్రయాణించే కొలది శక్తి క్షీణిస్తుంది. కావున వాటి జీవ ద్రవ్యరాశి కూడా తగ్గుతూ పోతుంది. కావున ఈ పిరమిడ్ శీర్షాభిముఖంగా ఉంటుంది.
3. శక్తిపిరమిడ్ :
ఆహారపు గొలుసులో ప్రతిస్థాయి వద్ద శక్తి నష్టం 80-90% ఉంటుంది. కావున ఆహారపు గొలుసులో పైకి వెళుతున్న కొలది శక్తి క్షీణిస్తుంది. కావున ఈ పిరమిడ్ శీర్షాభిముఖంగా ఉంటుంది.
కానీ అన్ని సందర్భాలలో పిరమిడ్లు శీర్షాభిముఖంగా ఉండవు. సంఖ్యాపిరమిడ్, జీవద్రవ్యరాశి పిరమిడ్ ఒకేసారి తలకిందులుగా ఉంటాయి. కానీ శక్తి పిరమిడ్ మాత్రం ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది.
10th Class Biology Textbook Page No. 216
ప్రశ్న 9.
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) ఏ సంవత్సరంలో సరస్సులో నీరు విస్తరించిన ప్రదేశం ఎక్కువగా ఉంది? ఎందుకు?
జవాబు:
1967 సంవత్సరంలో సరస్సు నీటి విస్తీర్ణం అధికంగా ఉంది. ఎందుకంటే అప్పటికి సరస్సు ఆక్రమణలకు గురి కాలేదు. సరస్సులో పూడిక పేరుకోలేదు.
2) సరస్సులో దట్టంగా కలుపు పెరగడానికి కారణం ఏమిటని నీవు భావిస్తున్నావు?
జవాబు:
అధిక పోషక కలుషితాలు నీటిలో చేరటం వలన సరస్సులో దట్టంగా కలుపు పెరిగింది.
3) సరస్సు వైశాల్యం తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
సరస్సు వైశాల్యం తగ్గటానికి
- ఆక్రమణలు
- పంట భూములుగా మార్చటం
- రొయ్యల చెరువుల సాగు
- కలుషితాల వలన కలుపు మొక్కలు పెరగటం వంటి కారణాలు ఉన్నాయి.
4) పై కారణాలు కాలుష్యానికి దారితీస్తాయని చెప్పవచ్చా? ఎందుకు?
జవాబు:
ఈ కారణాలలో పంట భూములు, రొయ్యల సాగు వంటి కారణాలు సరస్సు నీటిని కలుషితం చేస్తాయి. పంట భూములకు చేసే రసాయనిక ఎరువులు, రొయ్యల చెరువు నుండి వచ్చే పోషక విలువలు కలిగిన నీరు, కలుపు మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది.
5) కొల్లేరుకు సుదూర ప్రాంతాల నుండి పక్షులు వలస రావడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
కొల్లేరు సరస్సు అధిక విస్తీర్ణం కలిగిన మంచినీటి ఆవాసం, కావున పక్షులకు ఇక్కడ ఆహారం పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడకు వచ్చే పక్షులు చాలా వరకు వలస పక్షులు. అక్కడి వేసవి పరిస్థితులను తప్పించుకోవటానికి, ఇక్కడకు వస్తాయి. విదేశాలలో వేసవికాల ప్రారంభంలో మనకు శీతాకాలం ప్రారంభమవటం వలసపక్షుల రాకకు ప్రధాన కారణం.
6) సరస్సు కాలుష్యానికి గురైన ముప్పును ఏ విధంగా కనుగొన్నారు?
జవాబు:
ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా, సరస్సును ఫోటోలు తీసి, సరస్సు ఆక్రమణలను గుర్తించారు. కలుపు మొక్కల విపరీత పెరుగుదలను బట్టి కాలుష్య ముప్పును గుర్తించారు.
7) సరస్సులో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి?
జవాబు:
మానవ సంబంధ కార్యకలాపాలను సరస్సు పరివాహక ప్రాంతంలో నియంత్రించాలి.
(లేదా)
– చేపలు, రొయ్యల చెరువులను సరస్సు పరివాహక ప్రాంతంలో తొలగించాలి.
(లేదా)
– సరస్సు పరివాహక ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలను చట్టప్రకారం తగ్గించాలి.
10th Class Biology Textbook Page No. 217& 218
ప్రశ్న 10.
పై పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) వలస పక్షుల మీద ప్రభావం చూపించే అంశాలు ఏమిటి?
జవాబు:
చేపల పెంపకం వలన వాటి రక్షణ పెరిగి, పక్షుల ఆహార కొరత ఏర్పడుతుంది. అందువలన వలస పక్షుల సంఖ్య తగ్గుతుంది.
2) భౌతిక సమస్యలకు, జీవ సంబంధ సమస్యలకు మధ్య ఏదైనా సంబంధం ఉందని నీవు భావిస్తున్నావా? అవి ఏమిటి?
జవాబు:
భౌతిక సమస్యలైన మేట వేయడం, వరదలు వంటి కారకాలు జీవులపై ప్రభావం చూపుతాయి. మేట వేయడం వలన సరస్సు విస్తీర్ణం తగ్గి జీవుల సంఖ్య తగ్గుతుంది. వరదల వలన చేపలు, కొట్టుకుపోయి, కలుషిత నీరు చేరి, మరణించటం జరుగుతుంది.
3) రసాయనిక సమస్యలు ఏర్పడడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు, పరిశ్రమల వ్యర్థ జలాల కలయిక వలన రసాయన సమస్యలు ఏర్పడుతున్నాయి.
4) నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతే ఏమవుతుంది?
జవాబు:
నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గితే, జలచర జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి. ఇవి కుళ్ళిపోయి జల ఆవాసాన్ని మరింత కలుషితం చేస్తాయి.
5) మురికిగా, పోషక పదార్థాలు కలిగి ఉన్న నీటికి జైవిక ఆక్సిజన్ డిమాండ్ (Biological Oxygen Demand) ఎక్కువా? తక్కువా? తద్వారా కలిగే ప్రభావం ఏమిటి?
జవాబు:
మురికి, పోషక పదార్థాలు కలిగిన నీటికి (Biological Oxygen Demand) ఎక్కువ. అందువలన జలచరాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడి అవి మరణించే ప్రమాదం ఉంది.
6) కొల్లేరు పరీవాహక ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
సరస్సు నీరు కలుషితం కావటం వలన కొల్లేరు పరీవాహక ప్రాంత ప్రజలు అనేక వ్యాధులకు గురైనారు. డయేరియా వంటి రోగాలు బాగా విస్తరించాయి. తాగునీటి సమస్య ఏర్పడింది.
7) పక్షుల వలసపై కాలుష్యం ఎలాంటి ప్రభావం కలిగించిందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
సరస్సు కలుషితం కావటం వలన వలస పక్షుల సంఖ్య గణణీయంగా తగ్గే అవకాశం ఉంది. పక్షులకు ఆహార కొరతతో పాటు, జీవనానికి పరిసరాలు సౌకర్యంగా ఉండవు. అందువలన వలస పక్షుల సంఖ్య తగ్గుతుంది.
10th Class Biology Textbook Page No. 219
ప్రశ్న 11.
మీకు తెలిసిన, మీరు విన్న ఏదైనా రెండు కీటక నాశనుల, శిలీంద్రనాశకాల పేర్లు తెలపండి.
జవాబు:
- నువాక్రాన్
- ఎండోసల్ఫాన్ వంటి కీటక నాశనులు, ఈగిల్ – 20 EW, మిల్ స్టాప్, స్పెక్టేటర్స్ వంటి శిలీంధ్ర నాశనులు మా ప్రాంతంలో విరివిగా వాడుతున్నారు.
ప్రశ్న 12.
మీరు క్రిములు, శిలీంధ్రాల నుండి ఆహారపు గింజలు, ధాన్యాలను సంరక్షించుకోవడానికి ఇంట్లో ఏ విధంగా నిలువ చేస్తారు?
జవాబు:
- ఆహార గింజలు, ధాన్యాల పరిరక్షణకు గ్రామీణ ప్రాంతాలలో ‘పురి’, గోదాము వంటివి నిర్మించి నిల్వ చేస్తారు.
- పట్టణ ప్రాంతాలలో రైతులకు ‘కోల్డ్ స్టోరేజీ’ లు అందుబాటులో ఉండుటవలన ధాన్యాల సంరక్షణ సులభమౌతుంది.
- ఇంటిలో ధాన్యాలను సంరక్షించటానికి, ‘వాస్పరిన్’ ‘జింక్ ఫాస్ఫేట్’ వంటి రసాయనాలు వాడి ధాన్యాన్ని నిల్వచేస్తాను. ఇవి ధాన్యాన్ని ఎలుకలు, కీటకాల నుండి రక్షిస్తాయి.
- నిల్వ చేసే ధాన్యాన్ని బాగా ఆరబెట్టుట వలన తేమ శాతం తగ్గి, శిలీంధ్రాల పెరుగుదలను అరికడతాను.
10th Class Biology Textbook Page No. 221
ప్రశ్న 13.
నీటి వనరులలోకి ఎక్కడి నుండి కలుషితాలు వచ్చి చేరుతున్నాయి? ,
జవాబు:
వ్యవసాయ భూముల నుండి వస్తున్న నీరు అధిక మోతాదులలో రసాయనాలను కలిగి ఉంటున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయటం వలన నీటి వనరులు కలుషితమవుతున్నాయి.
ప్రశ్న 14.
నీటిలో నివసించే చేపల శరీరాలలోకి భారలోహాలు ఎలా చేరుతున్నాయి?
జవాబు:
చేపలు, కాడ్మియం వంటి భారలోహాలు సున్నితత్వం కలిగి ఉంటాయి. దానితో కాడ్మియం సులభంగా చేపల్లోకి చేరిపోతుంది. అంతేకాక సీసం, కాడ్మియం, ఫెర్రస్, పాదరసం వంటి భారలోహాలను అధికంగా కలిగి ఉన్న పరిశ్రమల వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల చేపల శరీరంలోనికి భారలోహాలు చేరుతున్నాయి.
ప్రశ్న 15.
పరిశోధకులు నీటిలో కాలుష్య పరిమాణం వర్షాకాలంలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు కదా! ఇది ఎందుకు జరుగుతుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
వర్షాకాలంలో వర్షాలు కురవటం వలన వరదలు ఏర్పడతాయి. ఈ వరద నీటిలోనికి రకరకాల కలుషితాలు చేరి, జలావాసాలను చేరతాయి. భూమిపై పారేసిన అనేక ఘన, వ్యర్ధ కలుషితాలు వరద నీటి ద్వారా జలావాసాలను చేరి కలుషితం చేస్తున్నాయి.
ప్రశ్న 16.
కలుషిత నీటిలో దొరికే చేపలను తినడం వలన ప్రజలు అనేక వ్యాధులకు గురికావడానికి కారణం ఏమిటి?
జవాబు:
పరిశ్రమల వ్యర్థాల వలన అనేక భారలోహాలు నీటిని చేరి, చేపల శరీరంలోనికి ప్రవేశిస్తున్నాయి. వీటిని మనుషులు తినటం వలన, భారలోహాలు మానవ శరీరంలో సాంద్రీకరణ చెంది రోగాలను కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియను “జైవిక వృద్ధీకరణ” అంటారు.
10th Class Biology Textbook Page No. 223
ప్రశ్న 17.
‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే అంశాన్ని చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జవాబు:
1) ఏ ఆహారపు గొలుసు గురించి పైన చర్చించడం జరిగింది.
జవాబు:
మొక్కల ధాన్యం → కీటకాలు → పిచ్చుక అనే ఆహారపు గొలుసు పైన చర్చించడం జరిగింది.
2) పంటపొలాలలోని ఆహారపు గొలుసును, ఈ ఉద్యమం ఏ విధంగా ఆటంకపరిచింది?
జవాబు:
ఉద్యమంలా పిచ్చుకలను నిర్మూలించటం వలన కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
3) ఈ అవరోధాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి?
జవాబు:
కీటకాలు విపరీతంగా పెరిగి పంట పొలాలపై దాడిచేయటం వలన ఆహార దిగుబడి గణనీయంగా తగ్గింది.
4) ఆవరణ వ్యవస్థలో ఒక జీవిని చంపడం భావ్యమేనా? ఇది ఏ విధంగా ప్రమాదం కలిగించింది?
జవాబు:
ఆవరణ వ్యవస్థలో ఒక జీవిని చంపటం, లేదా తొలగించటం భావ్యం కాదు. ఇది ఇతర జీవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రకృతి సమతాస్థితిని దెబ్బతీస్తుంది.
5) వాస్తవానికి పిచ్చుకలే బాధ్యులా? పంట దిగుబడి తగ్గదానికి సరైన కారణం ఏమిటి?
జవాబు:
పంట దిగుబడి తగ్గటానికి సరైన కారణం పిచ్చుకలు కాదు. ఒకే నేలలో పంటలను మార్చకుండా పండించటం వలన పోషకాలు తగ్గి, పంట దిగుబడి తగ్గుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం కూడా పంటదిగుబడి తగ్గుదలకు కారణం.
6) శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు? తప్పును సరిదిద్దుకునే విధంగా సహాయపడగలిగారా? ఎందుకలా చేయలేకపోయారు?
జవాబు:
శాస్త్రవేత్తలు చనిపోయిన పిచ్చుకల జీర్ణవ్యవస్థను పరిశీలించినపుడు వాటిలో కేవలం 1వంతు మాత్రమే ధాన్యం ఉంది. మూడు వంతులు పంటను పాడుచేసే కీటకాలు ఉన్నాయి. కావున పంట దిగుబడికి పిచ్చుకలు కారణం కాదని తేల్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పిచ్చుకల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది.
7) మానవ చర్యలు పర్యావరణం మీద ఏ విధమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి?
జవాబు:
మానవ చర్యలు పర్యావరణం మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. విచక్షణారహితంగా వాడుతున్న ఎరువులు పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగాలు, ఆవరణ వ్యవస్థను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీనివలన కొన్ని జీవజాతులు అంతరించే ప్రమాదానికి చేరుకున్నాయి.
8) ఇలాంటి విపత్తులు సంభవించకుండా, నీవు ఎలాంటి సలహాలు ఇస్తావు?
జవాబు:
ఇలాంటి విపత్తులు సంభవించకుండా ఉండాలంటే మానవుడు పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలు మానుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే చర్యలు చేపట్టాలి. దీనికి మనవంతు కృషిచేయాలి.
10th Class Biology 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
మీ పరిసరాలలో ఉన్న ఏదైనా (నీటి) ఆవరణ వ్యవస్థను పరిశీలించండి. అందులో ఉండే వివిధ ఆహారపు గొలుసులు, ఆహార జాలాలను గురించి 5 ది వరషీట్ ఆధారంగా నివేదిక రాయండి.
వర్క్ షీట్
జట్టుసభ్యుల పేర్లు : వివేక్, లిఖిత, తేది : మార్చి – 2
ఆవరణ వ్యవస్థ పేరు : చెరువు ఆవరణవ్యవస్థ
భౌగోళిక స్వరూపం (టోపోగ్రఫీ) :
గుర్తించిన ఉత్పత్తిదారులు మొక్కల పేర్లు / సంఖ్య : నాచు, నీటి మొక్కలు, వ్యక్త ప్లవకాలు
గుర్తించిన జంతువుల పేర్లు /సంఖ్యలో : చేపలు, పీతలు, కొంగలు, నత్తలు, వడ్రంగిపిట్ట, నీటికోడి
గుర్తించిన వినియోగదారుల పేర్లు /సంఖ్య : ………………………………………
శాకాహారులు (ప్రాథమిక వినియోగదారులు) : చేపలు, జంతుప్లవకాలు
మాంసాహారులు (ద్వితీయ వినియోగదారులు) : కొంగలు, నీటి కోడి
ఉన్నతస్థాయి మాంసాహారులు (తృతీయ వినియోగదారులు) : మానవుడు
వాటి మధ్యగల ఆహార సంబంధాలు, అలవాట్లు : చేపలను తింటూ చాలా పక్షులు జీవనం సాగిస్తున్నాయి.
ఆహారపు గొలుసు పటం : నీటి మొక్కలు → జంతుప్లవకాలు → చేపలు → కొంగ → మానవుడు
ఆహారజాలం పటం:
ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశాలు : గాలి, నీరు, సూర్యరశ్ని, నేల స్వభావం, నీటి లవణాలు
ఆవరణ వ్యవస్థకు ఏవైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా? అవి ఏమిటి?
ఆక్రమణకు గురి అవుతున్నది. పూడిక పెరుగుతున్నది.
పరిష్కారాలు సూచించండి :
- చెరువు ఆక్రమణలను అరికట్టాలి.
- ప్రతి సంవత్సరం పూడిక తీయించాలి.
- పంట పొలాల నీరు చెరువులోకి చేరి రసాయన కలుషితాలు చేరకుండా నిరోధించాలి.
- చెరువు ప్రాధాన్యతపై ప్రజలలో అవగాహన పెంచాలి.
- చెరువు గట్లపై మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది?
A) శాకాహారి
B) మాంసాహారి
C) ఉత్పత్తిదారు
D) ఏదీకాదు
జవాబు:
C) ఉత్పత్తిదారు
2. దేనికోసం మొక్కలు పోటీపడవు?
A) నీరు
B) ఆహారం
C) స్థలం
D) పైవన్నీ
జవాబు:
B) ఆహారం
3. క్రిమిసంహారకాల వాడకాన్ని పూర్తిగా ఆపివేయడం అంటే
A) పురుగుమందుల వాడకంపై నియంత్రణ
B) పురుగుమందుల నిషేధం
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం
D) జీవరసాయనాల పరిశ్రమలను మూసివేయించడం
జవాబు:
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం
4. చార్లెస్ ఎలాన్ ప్రకారం కింది వానిలో సరైన వాక్యం
A) మాంసాహారులు పిరమిడ్ శిఖరభాగంలో ఉంటాయి.
B) పిరమిడ్ శిఖరభాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది.
C) పిరమిడ్ శిఖరభాగంలో ఉత్పత్తిదారులు ఉండవు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C