Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 9th Lesson తొలిపండుగ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 9 తొలిపండుగ
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ?
జవాబు:
ఇది సంక్రాంతి పండుగ చిత్రం. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల పండుగ. ఈ పండుగ వేళల్లో ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఇంటి ముందు కలాపు జల్లి చక్కటి రంగవల్లులు (ముగ్గులు) వేస్తారు. ఆ ముగ్గుల మధ్యలో వివిధ రకాల రంగులు అద్దుతారు. ఆదే సమయంలో గంగిరెద్దుల వాళ్ళు వచ్చి ఇంటి ముందు గంగిరెద్దును ఆడిస్తారు. హరిదాసు వచ్చి దైవ సంకీర్తనలు పాడుతూ చిడతలు కొడుతూ, భుజం మీద తంబూర మీటుతూ – ఆ ఇంటి సభ్యులను ఆశీర్వదిస్తారు.
ప్రశ్న 2.
రంగు రంగుల ముగ్గులు ఎపుడెపుడు వేస్తారో చెప్పండి?
జవాబు:
ఇంటి ముందు ముగ్గు అనేది శుభప్రదం. రంగురంగుల ముగ్గులు అవకాశం ఉంటే ఓపిక – సమయం ఉంటే ప్రతిరోజూ వేసుకోవచ్చు. కాకపోతే ప్రత్యేకంగా- ఈ రంగు రంగుల రంగ వల్లులు సంక్రాంతి సమయంలో వేస్తారు. జనవరి 1వ తేదీన క్రొత్త సంవత్సరం ప్రారంభం (ఆంగ్ల నూతన సంవత్సరం) కనుక ఆనందంగా స్వాగతం చెబుతూ వేస్తారు.
ప్రశ్న 3.
మీరు ఇష్టంగా జరుపుకునే పండుగ గురించి చెప్పండి?
జవాబు:
నాకు ఇష్టమైన పండుగలలో దసరా ఒకటి. ఇది ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు. జరుగుతుంది. అందుకే దేవీ నవరాత్రులు అంటారు. దుర్గామాత మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమిరోజు విజయం సాధించింది. అందుకే పదవరోజును వియజదశమి అంటారు. ఈ పండుగ రోజుల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అలంకరిస్తారు. చివరి రోజు జమ్మి పూజ కూడా చేస్తారు.
పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:
- ఆడపిల్లలు
- పూలు
- జడలు
- ముగ్గుపాత్ర
- ముగ్గులు
- రంగులు, రంగవల్లులు
- గంగిరెద్దు
- గంగిరెద్దును ఆడించే వాళ్ళు
- సన్నాయి
- హరిదాసు
- చిడతలు
- తంబూర
- ఇళ్ళు
- చెట్లు
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
నీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పండి.
జవాబు:
- ఉగాది (సంవత్సరాది)
- శ్రీరామనవమి
- వరలక్ష్మీవ్రతం
- వినాయక చవితి
- దసరా
- దీపావళి
- ముక్కోటి ఏకాదశి
- సంక్రాంతి
- శివరాత్రి
- రంజాన్
- క్రిస్టమస్
ప్రశ్న 2.
పిల్లలూ! సెలవు రోజుల్లో ఎక్కడికి వెళ్ళి ఆటలు ఆడేవారో చెప్పండి.
జవాబు:
ఊరి చివరన ఉండే తాతల నాటి వేపచెట్టు ఉంది. అది ఆట స్థలం. సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి, పాడి ఆనందంగా గడిపుతారు.
ప్రశ్న 3.
మీకు ఇష్టమైన పండుగ ఏది? దాన్ని మీరు ఎలా జరుపుకుంటారు?
జవాబు:
మాకు ఇష్టమైన పండుగ ‘దీపావళి’. ఇది రెండు రోజుల పండుగ. ముందురోజు ‘నరక చతుర్థశి’. ఈ రోజు తెల్లవారు జామునే లేస్తాము. అమ్మ మా మాడున నూనె పెడుతుంది.
అప్పుడు తెచ్చుకున్న టపాకాయలలో ఒకటో రెండో కాల్చి, తలంటుకుని స్నానం చేస్తాము. ఇక అప్పటి నుండి కొసుకున్న మందులు ఎండబెడతాము. స్నేహితుల ఇళ్ళకు వెళ్ళి, వాళ్ళు ఏఏ మందులు కొనుక్కున్నారో చూస్తాము. అదో సరదా!
తరువాత రోజు దీపావళి. ఆరోజు ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటాము. రాత్రికి ఇంటి గుమ్మాల పైన వరుసగా నూనె దీపాలు వెలిగించి నమస్కారం చేసుకొని, అప్పటినుండి మందులు కాలుస్తాము. తరువాత తీపి మిఠాయిలు తింటాము.
ఈ విధంగా సరదాగా ఆనందంగా గడిపే మాకిష్టమైన పండుగ ‘దీపావళి’.
ప్రశ్న 4.
పిల్లలూ! సెలవు రోజుల్లో మీరేమేమి చేస్తారో చెప్పండి.
జవాబు:
సెలవు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేస్తాము. అమ్మ పెట్టిన అల్పాహారం (టిఫిన్) తిని ముందురోజు పాఠశాలలో గురువులు ఇచ్చిన ఇంటి పనిని (హోమ్ వర్క్) చేస్తాము. అమ్మకు నాన్నకు సాయం చేస్తాము. సాయంత్రం సమయం అంతా స్నేహితులతో ఆడుకుంటాం. ఇంటికి వచ్చాక అమ్మ, నాన్న, నేను తమ్ముడు కలసి సినిమాకు గాని, హూటలు గాని వెళ్తాము. ఈ విధంగా సెలవు రోజు గడుపుతాము.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది వాక్యాలను చదవండి. పాఠం ఆధారంగా ఎవరు ఎవరితో అన్నారో రాయండి.
ప్రశ్న 1.
ఉగాది పండుగ కదా! మా అమ్మ చెప్పింది.
జవాబు:
రవి అనంలో అన్నాడు.
ప్రశ్న 2.
లత, రవి వస్తున్నారా!
జవాబు:
ఆనంద్ – శామ్యూల్ లో అన్నాడు.
ప్రశ్న 3.
నా బంగారుతల్లివమ్మా!
జవాబు:
రంగయ్య తాత – లతతో అన్నాడు
ప్రశ్న 5.
“కరీమ్ మామా! ఎందుకు ఇవన్నీ కడుతున్నారు?”
జవాబు:
శామ్యూల్ – కరీముల్లాతో అన్నాడు.
ఆ) కింది పేరా చదవండి.
ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది, యుగాది అని కూడా అంటాం . ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఈ పండుగ రోజున చేసే ఉ గాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు.
ఇ) కింది పదాలకు సమానార్థాలు ఇచ్చే పదాలు పేరాలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి.
ఉదా :
1. గుర్తు : ____________
2. ఆరు రుచులు : ____________
3. వినడం : ____________
4. ఐదు ఆంగాలు : ____________
5. పర్వం : ____________
6. రోజు : ____________
జవాబు:
1. గుర్తు : ప్రతీక
2. ఆరు రుచులు : షడ్రుచులు
3. వినడం : శ్రవణం
4. ఐదు ఆంగాలు : పంచాంగం
5. పర్వం : పండుగ
6. రోజు : నాడు
ఈ) పదాలకు సమానార్థాలు ఇచ్చే పదాలు పేరాలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి.
తేజ : తాతయ్యా! ఈ పెళ్ళి పత్రికలో శార్వరి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, ఏకాదశి ధనిష్ఠ నక్షత్రం అని రాసి ఉంది.
తాతయ్య : శార్వరి అనేది తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం పేరు. సంవత్సరాలు మొత్తం అరవై అవి.
తేజ : అమ్మో! ఎంత బాగా గుర్తున్నాయి తాతయ్య నీకూ… మరి ‘ఆశ్వయుజ మాసం’ అని ఉంది – అదేమిటి?
తాతయ్య : జనవరి నుండి డిసెంబరు వరకూ ఉన్న నెలలు ఆంగ్ల సంవత్సరానికి చెందినవి. అయితే మన తెలుగువారికి ప్రత్యేకమైన నెలలున్నాయి. వాటిని తెలుగు నెలలు అంటారు. అవి
- చైత్రం
- వైశాఖం
- జ్యేష్టం
- ఆషాడం
- శ్రావణం
- భాద్రపదం
- ఆశ్వయుజం
- కార్తికం
- మార్గశిరం
- పుష్యం
- మాఘం
- ఫాల్గుణం
తేజ : అమ్మో! నీకు చాలా తెలుసు తాతయ్యా!
తాతయ్య : మరి వీటన్నిటిని నీవు బాగా నేర్చుకోవాలి సరేనా!
తేజ : సరే తాతయ్యా!
ఊ) కింది ప్రశ్నల జవాబులను జట్లలో చర్చించండి.
ప్రశ్న 1.
తెలుగు నెలలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
విద్యార్థి కృత్యం
ప్రశ్న 2.
తెలుగు సంవత్సరాలు ఎన్ని అవి ఏవి?
జవాబు:
విద్యార్థి కృత్యం
పదజాలం
అ) కింది పండుగల పేర్లు చదవండి. వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి.
ఉదా : రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు.
జవాబు:
- దీపావళి పండుగకు (టపాసులు) మందుగుండు సామాను కాలుస్తారు.
- దసరా పండుగ 10రోజులు జరుపుకుంటారు.
- శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమినాడు జరుపుతారు. రామ కళ్యాణం చేస్తారు.
- వినాయక చవితి పండుగరోజు మట్టి వినాయకుణ్ణి పత్రితో పూజ చేసి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు.
ఆ) కింది ఆధారాలతో ఖాళీగా ఉన్న గదులను సరైన అక్షరాలతో పూరించండి.
- ఉగాది పచ్చడిలో తీపి నిచ్చేది
- ఉగాది పచ్చడిలో చేదు నిచ్చేది
- ఉగాది పచ్చడిలో పులుపు నిచ్చేది
- గుమ్మానికి తోరణాలుగా కట్టేవి
- ఉగాది రోజున ప్రత్యేకంగా వినేది
- ఉగాది రోజున నైవేద్యంగా పెట్టేది
జవాబు:
- ఉగాది పచ్చడిలో తీపి నిచ్చేది ( బెల్లం )
- ఉగాది పచ్చడిలో చేదు నిచ్చేది ( వేపపూత )
- ఉగాది పచ్చడిలో పులుపు నిచ్చేది (చింతపండు )
- గుమ్మానికి తోరణాలుగా కట్టేవి (మామిడాకులు)
- ఉగాది రోజున ప్రత్యేకంగా వినేది (పంచాంగ శ్రవణం)
- ఉగాది రోజున నైవేద్యంగా పెట్టేది (ఉగాది పచ్చడి)
ఇ) కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
(తోట, ఆటలు, చెట్టు, బొబ్బట్లు, పులిహూర )
ఉదా : గోపి తోటకు వెళ్ళాడు.
జవాబు:
1. ఆటలు ఆరోగ్యాన్నిస్తాయి.
2. చెట్టు నీడనిస్తుంది
3. బొబ్బట్లు రుచిగా ఉంటాయి
4. దేవాలయాల్లో పులిహోర ప్రసాదం బాగుంటుంది.
స్వీయరచన
కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
రవి తన మిత్రులకు బూరెలు, గారెలు, మొదలైన పిండివంటలు తెచ్చాడుగదా! అలాగే మీకు ఇష్టమైన పిండి వంటలు రాయండి.
జవాబు:
పులిహోర, దదోజనం, చక్రపొంగలి, పెరుగావడ, జిలేబి, ఉండ్రాళ్ళు, గారెలు, బూరెలు, కట్టెపొంగలి.
ప్రశ్న 2.
రవి, లత, ఆనంద్, శామ్యూల్ సెలవు రోజుల్లో వేపచెట్టు కింద ఆటలు ఆడతారుగదా! మీరు సెలవురోజుల్లో ఏఏ ఆటలు ఆడతారో రాయండి.
జవాబు:
క్రికెట్, కుంటుళ్ళాట, అంటుకునే ఆట, బంతాట, ‘కో’ తొక్కుడు బిళ్ళ, స్కిప్పింగ్, షటిల్ (బాడ్మింటన్) కోతి కొమ్మచ్చి.
ప్రశ్న 3.
‘ఉగాది పచ్చడి’ గురించి రంగయ్యతాత ఏమని చెప్పాడు ?
జవాబు:
వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. దీనిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా ఆరు రుచులు ఉంటాయి. ఈ పచ్చడినే దేవునికి నైవేద్యం పెడతారు. ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే, మన జీవితంలో కూడా బాధలు, కష్టాలూ, సుఖాలు, సంతోషాలు కలగలసి ఉంటాయని వాటిని మనం సమానంగా తీసుకోవాలని దీని భావం. ఈ విధంగా రంగయ్య తాత ఉగాది పచ్చడి గురించి చెప్పాడు.
ప్రశ్న 4.
పంచాంగం శ్రవణం’ లో ఏఏ విషయాలుంటాయో రాయండి.
జవాబు:
క్రొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకొస్తుంది అనేది తెలుస్తుంది. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలను చర్చిస్తారు. రాశుల గమనస్థితి తెలియజేస్తారు. కళలు, క్రీడలు, వ్యాపారం, విద్య, వైద్యం మొదలైన ప్రధాన రంగాలు ఏవిధంగా ఉపయోగకారిగా ఉంటాయో తెలియజేస్తారు. పుట్టిన నక్షత్రాలను, రాశుల పట్టి – వారి వారి శుభ-ఆశుభ-ఉపయోగ, నిరుపయోగ లాభ-నష్టాలను తెలియజేస్తారు. గ్రహ అనుకూలం ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుంటారు. ఈ విధమైన విషయాలు పంచాంగ శ్రవణంలో ఉంటాయి.
సృజనాత్మకత
కింది ఆధారాలతో గేయాన్ని పొడిగించండి. చక్కగా పాడండి.
వసంతకాలపు ఉగాదికి
కోకిల పలికెను స్వాగతం
ఉగాది పచ్చడి చేయడానికి
అమ్మలక్కలు రారండి
వేపపూత, …………………………
………………………….
………………………….
………………………… కలిపారు
………………………… చేశారు
………………………… చేశారు
………………………… పెట్టారు.
జవాబు:
వసంతకాలపు ఉగాదికి
కోకిల పలికెను స్వాగతం
ఉగాది పచ్చడి చేయడానికి
అమ్మలక్కలు రారండి
వేపపూత, లేత మామిడిముక్కలు
కొత్త చింతపండు, కొత్త బెల్లం
ఉప్పు, కారాలను
ఆరు రుచులు కలిపారు
ఉగాది పచ్చడి చేశారు
దేవుడికి నివేదన చేశారు
అందరికి చేతుల్లో పెట్టారు.
ప్రశంస
పిల్లలూ! ఉగాది పండుగ గురించి తెలుసుకున్నారు గదా! అలాగే రంజాన్, క్రిస్మస్ పండుగల గురించి తెలుసుకొని తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
ప్రాజెక్టుపని
‘క్యాలెండరు’ ఆధారంగా ఏఏ పండుగలు, ఏఏ నెలలలో వస్తాయో కింది పట్టికలో పూరించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
భాషాంశాలు
అ) పాఠం చదవండి, ద్విత్వ, సంయుక్త అక్షరాలున్న పదాలు గుర్తించి పట్టికలో రాయండి.
జవాబు:
ఆ) కింది పేరాను చదవండి. [,] కామా, [.] పూర్ణవిరామాలను సరైన చోట ఉంచి పేరాను తిరగ రాయండి.
గోపి ఇంటి నుండి బొబ్బట్లు గారెలు పాయసం పులిహోర తెచ్చాడు అతనికోసం రవి సుధ ఎదురుచూస్తూ ఉన్నారు. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు మంచినీళ్ళు తెచ్చుకున్నారు చెట్టు కింద కూర్చొని ఆహారపదార్థాలు తిన్నారు కొంతసేపు ఆటలు పాటలతో గడిపారు ఇంటికి తిరిగి వెళ్లారు.
జవాబు:
గోపి ఇంటి నుండి బొబ్బట్లు , గారెలు, పాయసం, పులిహోర తెచ్చాడు. అతనికోసం రవి, సుధ ఎదురుచూస్తూ ఉన్నారు. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటిఆకులు, మంచినీళ్ళు తెచ్చుకున్నారు. చెట్టు కింద కూర్చొని, ఆహారపదార్థాలు తిన్నారు. కొంతసేపు ఆటలు, పాటలతో గడిపారు. ఇంటికి తిరిగి వెళ్లారు.
పదాలు – అర్థాలు
గ్రామం = ఊరు, పల్లెటూరు
కమ్మని = మంచి, చక్కని
తొలి = మొదటి
ప్రారంభం = మొదలు
ఆది = మొదలు
నైవేద్యం = దేవుడికి పెట్టేది/నివేదన చేసేది
షడ్రుచులు = ఆరు రుచులు
పంచాంగం = ఐదు భాగాలు గలది
విశేషాలు = కొత్త విషయాలు
ఈ మానపు పాట
అందాల తోటలో
అందాల తోటలో బాల ఏమంది?
అడగా పాడగా తోడు రమ్మంది
గున్నా మామిడి పైని కోయిలేమంది?
‘కూ’ అంటే ‘కూ’ అన్న కొంటె ఎవరంది
నిండుగా పురి విప్పి నెమలి ఏమంది?
నృత్యాలు, నాట్యాలు నేర్చుకొమ్మంది.
చెట్టుకొమ్మన రామచిలుక ఏమంది?
సగము కొరికిన పండ్లు చవి చూడమంది.
చెంగు చెంగున ఎగిరి జింక ఏమంది?
పరుగు పందెములోన పస చూడమంది.
అంతలంతలమేయు ఆవు ఏమంది?
అగి తియ్యని పాలు త్రాగి పొమ్మంది.
క్రొత్తగా కొన్నట్టి గుర్రమేమంది?
స్వారి చేస్తే నీవు సాహసుడవంది.
విరియ బూచిన పండు వెన్నెలేముంది?
వింత వింతల కథల విందు నేడంది.
కవి పరిచయం
కస్తూరి నరసింహమూర్తి
ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన ‘పాపాయి సిరులు’ అనే గేయసంపుటి నుంచి తీసుకున్నారు.
ఈ మాసపు కథ
నక్కయుక్త
ఒక నదీతీరం, నక్క బావ విచారంగా ఉంది. అటూ ఇటూ పచార్లు చేస్తోంది. తనలో తాను ఇలా అనుకుంది. “ పరుగులతో, తరగలతో పారుతోంది. ఇప్పుడీ నది దాటడం ఎవరి తరం? ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు. ఎప్పుడు తీస్తుంది నీరు. ఎలా చేరతాను ఇల్లు”
నక్క బావ ఉపాయమేదని ఆలోచిస్తూ ఉంది. అంతలో నదిలో నుండి ఒక మొసలి బయటికి వచ్చింది. నక్కతో ” ఏమిటి నక్క బావా! ఒక్కడవూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు?” అంది. మెరుపులా నక్క బావ మదిలో మెరిసిందో ఉపాయం.
అది మొసలితో అంది “ నిజమేనయ్యా మొసలి బావా! నిన్ను చూడగానే నాకొక సందేహం వచ్చింది. ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా? ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా?”
మొసలి తడముకోకుండా అంది “అనుమానమెందుకు నక్కబావా? మేమే ఎక్కువ” నక్క అంది “ఏమో! నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది.” మొసలి అంది, “మా వాళ్ళను ఇప్పుడే పిలుస్తాను. నువ్వే చూచి లెక్కించి చెప్పు”
మొసలి తమ వాళ్ళనందరినీ పేరు పేరునా పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అప్పుడు నదిపై మొసళ్ళ వంతెన తయారయ్యింది. తన యుక్తి పారినందుకు సంతోషించింది నక్క ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే కష్టం. నేను ఒక్కొక్కరి పై ఎగురుతూ లెక్కిస్తాను” అంది. మొసలి సరే అంది. నక్క ఒక్కొక్క మొసలి పై దూకుతూ నది దాటింది. అప్పుడు మొసలి ” ఇప్పుడు లెక్కించావుగా చెప్పు. మేమే కదా ఎక్కువ ఉన్నది” అంది.
అప్పుడు నక్క నవ్వి ” ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది. ఎవరెక్కువ ఐతే మాత్రం వచ్చే లాభం ఏంటీ” అంది. నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది.
కవి పరిచయం
కవి : జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి
కాలము : (1892 – 1980)
రచనలు : ‘ఆంధ్రుల చరిత్ర’, ‘ఆంధ్ర సామ్రాజ్యం’, ‘రత్నలక్ష్మీ శతపత్రము’, ‘కేనోపననిషత్తు’
విశేషాలు : గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని.