SCERT AP Board 7th Class Telugu Guide Answers 5th Lesson పద్య పరిమళం Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 5th Lesson Questions and Answers పద్య పరిమళం
7th Class Telugu 5th Lesson పద్య పరిమళం Textbook Questions and Answers
వినడం – అలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రాన్ని గమనించండి. చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
చిత్రంలో గురువుగారు, శిష్యులు ఉన్నారు.
ప్రశ్న 2.
మీకు తెలిసిన ఇలాంటి నీతి పద్యాలు చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
1) దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వ వర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణ జాల తెలుగుబాల
2) అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ
ప్రశ్న 3.
మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
బద్దెన, వేమన, కవి చౌడప్ప, ఏనుగు లక్ష్మణకవి, నార్ల చిరంజీవి, బమ్మెర పోతన మొదలగువారు.
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో, భావానికి తగినట్లుగా పాడండి.
జవాబు:
స్పష్టమైన ఉచ్చారణతో భావయుక్తంగా, సంధి సమాస పదాలను విడదీస్తూ ఒకసారి, కలిపి రెండుసార్లు, స్వల్పరాగంతో ఉపాధ్యాయులు పద్యపఠనం చేస్తారు. దానిని విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలి. ఉపాధ్యాయుడు పద్యం చెబుతుంటే చెప్పాలి. దోషాలు సవరించుకోవాలి. తప్పులు లేకుండా స్పష్టంగా మీ ఉపాధ్యాయుని వలె మీరూ సొంతంగా చదవాలి.
ప్రశ్న 2.
మానవ జీవితంలో ధనం యొక్క అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
ధనం వలన స్నేహాలు పెరుగుతాయి. ధనం వలన స్నేహితులూ ఎక్కువైతారు. విరోధాలు పెరుగుతాయి. విరోధులూ ఏర్పడతారు. ధనం వలన సభలలో గౌరవం, గొప్పతనం పెరుగుతుంది. ఎంతమంచి గుణాలు కలవారికైనా ధనం వలన మాత్రమే పైన చెప్పినవన్నీ ఏర్పడతాయి.
ప్రశ్న 3.
వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
వృద్ధులకు సేవ చేస్తే పండితులకు కూడా మనపై ప్రేమ కలుగుతుంది. మెచ్చుకొంటారు. బుద్ధిమంతుడంటారు. – మహాజ్ఞాని అంటారు. పవిత్రమైన చరిత్ర కలవాడంటారు. మంచి ధర్మాత్ముడంటారు. మన కీర్తి, జ్ఞానం, బుద్ధి, పవిత్రత, ధర్మ బుద్ధి పెరగాలంటే వృద్ధులకు సేవ చేయాలి.
ప్రశ్న 4.
కింది పద్యం చదివి భావం రాయండి.
జవాబు:
చందమామ ఇచ్చు చల్లని వెన్నెల
తేనెటీగ ఇచ్చు తీపి మధువు
మనిషివైన నీవు మరిఏమి తక్కువ
మంచిమాట లెపుడు మరువవద్దు !
భావం :
చందమామ చల్లని వెన్నెలనిస్తుంది. తేనెటీగ తియ్యని తేనెనిస్తుంది. నీవు మనిషివి. తక్కువ వాడవు కాదు. చల్లని, తియ్యని మాటలు మాట్లాడడం మరచిపోకు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
క్షమ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
జవాబు:
క్షమ వలన సంపద కలుగుతుంది. మంచి మాట (విద్య) వస్తుంది. సౌఖ్యాలన్నీ కలుగుతాయి. దయామయుడైన శ్రీహరి మెప్పును కూడా క్షమ వలన పొందవచ్చును.
ప్రశ్న 2.
వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞానవంతుని లక్షణాన్ని గురించి ఏమని చెప్పారు?
జవాబు:
ఇతరులను తిడితే మన నోరు పాపంతో బురద ప్రదేశంగా మారుతుంది. పెద్దలను స్తుతిస్తే నోరు పవిత్రం అవుతుంది. కనుక జ్ఞానవంతుడు తన నోటితో మంచి మాటలనే మాట్లాడతాడని వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞానవంతుని లక్షణాన్ని గురించి చెప్పారు.
ప్రశ్న 3.
వృద్ధులను ఎందుకు సేవించాలి?
జవాబు:
వృద్ధులకు సేవ చేస్తే పండితులకు కూడా మనపై ప్రేమ కలుగుతుంది. మెచ్చుకొంటారు. బుద్ధిమంతుడంటారు. ఈ – మహాజ్ఞాని అంటారు. పవిత్రమైన చరిత్ర కలవాడంటారు. మంచి ధర్మాత్ముడంటారు. మన కీర్తి, జ్ఞానం, బుద్ధి, పవిత్రత, ధర్మ బుద్ధి పెరగాలంటే వృద్ధులకు సేవ చేయాలి.
ప్రశ్న 4.
సత్యవాక్కువలన కలిగే ప్రయోజనాలు ఏవి?
జవాబు:
సత్యం మాట్లాడడం వలన కీర్తి పెరుగుతుంది. సత్యం మాట్లాడడం వలన జన్మ వలన వచ్చిన అజ్ఞానం నశిస్తుంది. సత్యం వలన మన స్వభావం స్థిరంగా ఉంటుంది. అందుచేత సత్యవాక్కుతో సమానమైన వ్రతం లేదు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా”? అనే విషయాన్ని కవి ఎలా తెలియజేశారు?
జవాబు:
బంగారం అగ్నిలో కాలుతుంది. సుత్తి దెబ్బలను భరిస్తుంది. మంచి ఆభరణంగా తయారౌతుంది. మెరిసిపోతుంది. అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలను ఓర్చుకోవాలి. అని కవిగారు చెప్పారు. బంగారం అగ్నికి భయపడినా, సుత్తి దెబ్బలకు భయపడినా ఆభరణంగా తయారవ్వదు. అందరినీ ఆకర్షించేటంత మెరుపును సంపాదించలేదు కదా ! అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు. ఓర్చుకోవాలి, అని కవిగారి భావన.
ప్రశ్న 2.
“రాగిపై పూసిన బంగారం చెదిరిపోవును” అని కవి అనడంలో ఆంతర్యం ఏమిటి?
జవాబు:
బంగారం వస్తువుగా తయారవ్వాలంటే కొద్దిగా రాగి కలపాలి. బంగారం విలువైనది. రాగికి విలువ తక్కువ. రాగి పైన బంగారం పూత వేస్తే అదంతా బంగారమే అనిపిస్తుంది. కానీ, కొంతకాలానికి ఆ విలువైన బంగారు పూత పోతుంది. విలువ తక్కువైన రాగి బయట పడిపోతుంది.
అలాగే తప్పు పనిని చేసి, దానిని నేర్పుగా కప్పి పుచ్చినా కొద్దికాలమే దాగుతుంది. ఎప్పటికైనా తప్పు బయటపడి పోతుంది. తప్పుచేసినపుడు అంగీకరించాలి. అప్పుడు గౌరవం నిలబడుతుందని కవి భావన.
ప్రశ్న 3.
మహాత్ములకు ఉండవలసిన సహజ లక్షణాలు ఏవి?
జవాబు:
మహాత్ములకు సంపద లేకపోయినా, బంగారు ఆభరణాలు లేకపోయినా పరవాలేదు. వారి చేతులకు నిత్యం – దానం చేసే గుణం ఉండాలి. నోటితో నిజం మాత్రమే చెప్పాలి. గురువుల పాదాలకు నమస్కరించే శిరస్సు ఉండాలి. జబ్బలలో మొక్కవోని బలం ఉండాలి. మనసులో మంచి నడత ఉండాలి. చెవులు మంచి విద్యలను వినాలి. ఇవి మహాత్ములకు సహజంగా ఉండాలి. ఉంటాయి. అందుకే అవే వారికి మంచి కాంతివంతమైన ఆభరణాలని కవిగారు చెప్పారు.
ప్రశ్న 4.
ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలను రాయండి.
జవాబు:
ఓర్పు వలన సంపద కలుగుతుంది. మంచి చదువు వస్తుంది.. సౌఖ్యాలు కలుగుతాయి. దయామయుడైన విష్ణువు కూడా ఓర్పుగల వారిని మెచ్చుకొంటాడు. కనుక ఓర్పుతో ఉండాలి. ధనం వలన స్నేహం, వైరం, కీర్తి కలుగుతుంది. వృద్ధులను సేవించాలి. పరులను తిట్టకూడదు. పెద్దలను కీర్తించాలి. సత్యమునే మాట్లాడాలి. గురుభక్తి కలిగి ఉండాలి. వినయం కలిగి ఉండాలి. విద్యలపై నమ్మకం ఉండాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. నేర్చుకొన్న దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి. పునశ్చరణ చేయాలి.
భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు. ఓర్చుకోవాలి. తప్పును కప్పి పుచ్చుకోకూడదు. నిత్యం దానాలు చేయాలి. నిజం పలకాలి. గురువులకు భక్తితో నమస్కరించాలి, బలంగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
ఈ విధంగా ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా చాలా మంచి లక్షణాలను నేర్చుకొన్నాం.
భాషాంతాలు
అ) కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : మనిషికి ధనంపై మోహం ఉండరాదు.
మోహం = కోరిక
1. క్షమ వలన సిరి లభిస్తుంది.
క్షమ = ఓర్పు
2. స్నేహితులతో వైరం మంచిదికాదు.
వైరం = విరోధం
3. తామరలు పంకిలం నుండి వికసిస్తాయి.
పంకిలం = బురద ప్రదేశం
4. భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు.
భాస్కరుడు = సూర్యుడు
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.
1. కరముతో అన్నం తింటాము. హస్తములో జాతక రేఖలుంటాయి.
చేయి = కరము, హస్తము
2. ధనమే అన్నింటికీ మూలం. సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు.
సిరి = ధనము, సంపద
3. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. భూకంపం వల్ల పుడమి కుంగుతుంది.
భూమి = అవని, పుడమి
4. కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు. ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ.
కనకం = పసిడి, పుత్తడి
ఇ) కింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి.
ఉదా : పాపం × పుణ్యం
1. ధర్మం × అధర్మం
2. సురులు × అసురులు
3. విద్య × అవిద్య
4. చెడు × మంచి
ఈ) కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
1. విద్య | అ) అంచ |
2. అగ్ని | ఆ) విద్దె |
3. ధర్మము | ఇ) మొగము |
4. హంస | ఈ) అగ్గి |
5. ముఖము | ఉ) దమ్మము |
జవాబు:
1. విద్య | ఆ) విద్దె |
2. అగ్ని | ఈ) అగ్గి |
3. ధర్మము | ఉ) దమ్మము |
4. హంస | అ) అంచ |
5. ముఖము | ఇ) మొగము |
పదకేళి
ఉ) కింది పదపట్టిక ఆధారంగా శతకాలను, శతక కర్తలను గుర్తించండి. వాటి చుట్టూ గీతగీసి ఖాళీలలో రాయండి.
ఉదా : పక్కి అప్పల నరసయ్య రాసిన శతకం?
జవాబు:
కుమార
1. ధూర్జటి రాసిన శతకం?
జవాబు:
కాళహస్తీశ్వర
2. వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం
జవాబు:
కాళికాంబ
3. మారద వెంకయ్య రాసిన శతకం?
జవాబు:
భాస్కర
4. తెలుగుబాల శతక కర్త?
జవాబు:
కరుణశ్రీ
5. కంచర్ల గోపన్న రాసిన శతకం?
జవాబు:
దాశరథి
6. సుమతీ శతకం రాసిందెవరు?
జవాబు:
బద్దెన
7. నార్ల చిరంజీవి రాసిన శతకం?
జవాబు:
తెలుగుపూలు
8. సిరిసిరి మువ్వ శతక కర్త?
జవాబు:
శ్రీ శ్రీ
9. కాళికాంబ సప్తశతి శతక మకుటంలోని పక్షి?
జవాబు:
హంస
10. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు?
జవాబు:
ఏనుగు
వ్యాకరణాంశాలు
అ) కింద విడదీసిన పదాలను కలిపి రాయండి.
ఉదా : జనులు + ఎల్ల = జనులెల్ల
1. దెబ్బలకు + ఓర్చి = దెబ్బలకోర్చి
2. సొమ్ములు + అగుచు = సొమ్ములగుచు
3. సూర్యుడు + ఒక = సూర్యుడొక
4. బాధలు + ఓర్చుకున్న = బాధలోర్చుకున్న
పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ‘ఉ’ ఉంది. రెండవ పదం (పర పదం) మొదట ‘అ, ఇ, ఎ’. వంటి అచ్చులున్నాయి. ఇలా ‘ఉ’ కారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరిగి ‘ఉకార సంధి’ రూపాలు : ఏర్పడుతాయి.
కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా : సౌఖ్యములెల్లన్ = సౌఖ్యములు + ఎల్లన్ (ఉకార సంధి)
1. పంకిలమౌను = పంకిలము + ఔను (ఉకార సంధి)
2. కార్యములెల్ల = కార్యములు + ఎల్ల (ఉకార సంధి)
ఆ) కింది విడదీసిన పదాలను కలిపి రాయండి.
ఉదా : శుద్ది + అగును = శుద్ధియగును
1. లేని + అప్పుడున్ = లేనియప్పుడున్, లేనప్పుడున్
2. మూసిన + అంతటన్ = మూసినంతటన్, మూసినయంతటన్
3. ప్రేమ + ఒసంగ = ప్రేమొసంగ, ప్రేమయొసంగ
4. ముట్టక + ఉండదదేట్లు = ముట్టకుండదదెట్లు, ముట్టకయుండదదెట్లు
పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ‘అ, ఇ’ వంటి అచ్చులున్నాయి. రెండవ పదం (పర పదం) మొదట అ, ఉ, ఒ వంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వ, పర పదాల మధ్య సంధి జరగనప్పుడు ‘య్’ ఆగమంగా వచ్చి ‘యడాగమ సంధి’ రూపాలు ఏర్పడుతాయి.
ఇ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా : కాళికాంబ = కాళిక + అంబ (సవర్ణదీర్ఘ సంధి)
1. గురూపదేశం = గురు + ఉపదేశం (సవర్ణదీర్ఘ సంధి)
2. చరణాభివాదనం = చరణ + అభివాదనం (సవర్ణదీర్ఘ సంధి)
3. విద్యార్థి = విద్యా + అర్థి (సవర్ణదీర్ఘ సంధి)
4. ఋషీశ్వరుడు = ఋషి + ఈశ్వరుడు (సవర్ణదీర్ఘ సంధి)
పైన విడదీసిన పదాలు. సంస్కృత పదాలు, వాటిని గమనించండి. మొదటి పదాల చివర ‘అ, ఇ, ఉ’ లలో ఏదో ఒకటి ఉంది. రెండవ పదాల మొదట కూడా అవే అచ్చులు (ఉ – ఉ, అ – అ, అ – అ, ఇ – ఈ) ఉన్నాయి కదా ! మొదటి పదం చివర, రెండవ పదం మొదట (అ, ఇ, ఉ, ఋ) లలో ఒకే అచ్చు ఉంటే అవి కలిసినపుడు దీర్ఘం వస్తుంది. గమనించండి.
1. (ర్) + ఉ = ర్ ఊ = రూ
2. (ణ్) అ + అ = ణ్ ఆ = ణా
3. (ద్‌య్) ఆ + అ = య్ ఆ = ద్యా
4. (ష్) ఇ + ఈ = ష్ ఈ = షీ
ఏర్పడ్డాయి కదా ! దీనిని సవర్ణదీర్ఘ సంధి అంటారు. ఎందుకంటే సవర్ణములు అంటే అవే అక్షరాలు మొదటి పదం చివర, రెండవ పదం మొదట ఉండి, అవి కలసి వాని దీర్ఘాలుగా ఏర్పడ్డాయి కనుక.
ఈ) కింద గీతగీసిన పదాలలోని ప్రత్యయాలను గుర్తించి, ఏ విభక్తులో రాయండి.
ఉదా : వృద్ధ జనుల యొక్క సేవ = షష్ఠి విభక్తి
1. పరులను తిట్ట నోరు = ద్వితీయా విభక్తి
2. సుత్తి దెబ్బలకు ఓర్చి = షష్ఠీ విభక్తి
3. గురువు యందు భక్తి = సప్తమీ విభక్తి
4. ఓ ఆంధ్ర పుత్రుడా ! మేలుకో = ఓ – సంబోధన ప్రథమా విభక్తి
5. విద్య చేత వర్థిల్లుము = తృతీయా విభక్తి
6. వృక్షము అవనిని రక్షించును = ప్రథమా విభక్తి
7. క్షమ వలన సిరి కలుగును = పంచమీ విభక్తి
8. పరుల కొరకు జీవించుము = చతుర్డీ విభక్తి
ఉ) కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలను విడదీసి రాయండి.
1. మాయమ్మ వంట రుచికరంగా చేస్తుంది.
2. దుక్కిటెద్దు రంకె వేసింది.
3. పిల్లల మనసు చిగురుటాకు వంటిది.
4. సుమతి గుణవంతురాలు.
5. గంగవ్వ బీదరాలు.
ఉదా : బీదరాలు = బీద + (ర్) ఆలు
1. మాయమ్మ = మా + (య్) అమ్మ
2. దుక్కిటెద్దు = దుక్కి + (ట్) ఎద్దు
3. చిగురుటాకు చిగురు + (ట్) ఆకు
4. గుణవంతురాలు = గుణవంత + (ర్) ఆలు
పై ఉదాహరణల్లో పూర్వ పర స్వరాలకు మధ్యలో య్ -ట్ – ర్ లు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని ‘ఆగమం’ అంటారు.
ఆదేశం
ఊ) కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను విడదీయండి.
1. తల్లిదండ్రులకు కష్టం కలిగించరాదు.
2. సుధ సంతలో కూరగాయలు కొన్నది.
3. రాజుకు గుఱ్ఱపుకళ్ళెం దొరికింది.
4. కరోనా సోకకుండా ఉండాలంటే కాలుసేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ఉదా : తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + (లు)
1. కూరగాయలు = కూర + కాయ + (లు)
2. గుఱ్ఱపుకళ్ళెం = గుఱ్ఱము + కళ్లెం
3. కాలుసేతులు = కాలు + చేయి + తి + తు + (లు)
పై ఉదాహరణలలో పూర్వ, పర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావడాన్ని ‘ఆదేశం’ అంటారు.
చతుర్థి విభక్తి
ఋ) కింది పట్టికను గమనించండి. పట్టిక ఆధారంగా జతపరచి రాయండి.
ఉదా : తిండి గింజల కొరకు పావురాలు నేలపై వాలాయి.
1. వంట కొరకు = వంట కొఱకు కట్టెలు కొట్టబడినవి.
2. గాలి కొరకు = గాలి కొఱకు కిటికీలు తెరిచారు.
3. వామనుని కొరకు = వామనుని కొఱకు బలి మూడడుగుల నేల దానం చేశాడు.
4. సూర్యోదయం కొరకు = సూర్యోదయం కొలుకు, పద్మాలు వేచి ఉన్నాయి.
5. దశరథుడు పుత్రసంతానం కొరకు = దశరథుడు పుత్రసంతానం కొలకు పుత్రకామేష్టి యాగం చేశాడు.
పై వాక్యాలలో ‘కొరకు’ ప్రత్యయం పదాల మధ్య చేరింది. ఈ విధంగా “కొరకున్, కై” అనే ప్రత్యయాలు చేరితే దానిని చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ ‘చతుర్థి విభక్తి’ వస్తుంది. ఆధునిక కాలంలో ‘కొరకు’ ప్రత్యయానికి బదులు ‘కోసం’ అనే పదాన్ని వాడుతున్నారు.
ప్రాజెక్టుపని
శతక కవులకు సంబంధించిన విషయాలను సేకరించి కింది పట్టికను తయారుచేయండి.
జవాబు:
చమత్కార పద్యం
చలన శక్తి గలదు జంతువు గాదది
చేతులెపుడు తిప్పు శిశువు గాదు
కాళ్ళు లేవు సర్వకాలంబు నడచును
దీని భావమేమి తిరుమలేశ !
వివరణ :
ఇది పొడుపు కథ. తెలుగు సాహిత్యంలో ప్రత్యేకస్థానం ఉన్న వీటి సృష్టికర్తలు పల్లె ప్రజలే. కాలక్షేపం కోసం అడిగే చిన్న చిన్న ప్రశ్నలను “పొడుపు కథలు” అంటారు.
భావం :
కదిలే శక్తి ఉన్నా ఇది ప్రాణికాదు. పసిపిల్లల్లాగా చేతులు కదుపుతుంది కాని ఇది శిశువు కాదు. కాళ్ళు లేవు కాని 24 గంటలూ నడుస్తూనే ఉంటుంది. దీని అర్థం ఏమి ఓరి దేవుడా ! (తిరుమలేశ)
జవాబు:
గడియారం :
(కాలాన్ని / సమయాన్ని తెలపటానికి గడియారంలోని ముల్లులు తిరుగుతూనే ఉంటాయి. కదిలే శక్తి ప్రాణులకే ఉంటుంది. గడియారంలోని ముల్లులు కదులుతున్నా గడియారం ప్రాణికాదు కదా !)
మీకు తెలుసా?
శౌరి
శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. వసుదేవుని తండ్రి శూరుడు. శ్రీకృష్ణుడు శూరుని మనువడు కాబట్టి ఆయనకు – ‘శారి’ అని పేరు వచ్చింది.
భవమోహపాశములు
‘భవము’ అనగా పుట్టుక, ఉనికి అని, ‘మోహము’ అనగా వలపు, భ్రాంతి అని, ‘పాశము’ అనగా త్రాడు, . బంధము అని అర్థాలు. ఈ మూడింటిని కలిపి భవమోహపాశములు అంటున్నారు. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను ‘భవమోహపాశములు’ అంటారు.
కవుల పరిచయం
1) పోతన:
కవి పేరు : బమ్మెర పోతన
జననం : క్రీ.శ. 1450లో జనగాం జిల్లాలోని బమ్మెరలో జన్మించారు. 15వ శతాబ్దపు కవి.
తల్లిదండ్రులు : లక్కమాంబ, కేసయ దంపతులు
రచనలు : భోగినీ దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీమదాంధ్ర మహాభాగవతం.
బిరుదులు : సహజకవి
ప్రత్యేకతలు :
మహా భక్తకవి, తన భాగవతాన్ని నరులకు అంకితం ఇవ్వనని, శ్రీరామునకే అంకితం ఇచ్చాడు. వ్యవసాయం చేసుకొని జీవించాడు. ఎవ్వరి దగ్గరా చేయి చాపని ఆత్మాభిమాని.
2) పక్కి అప్పల నరసయ్య
కవి పేరు : పక్కి అప్పల నరసయ్య
కాలం : 16వ శతాబ్దం
రచనలు : కుమార శతకం, కుమారీ శతకం
3) మారద వెంకయ్య:
కవి పేరు : మారద వెంకయ్య
కాలం : 1550 – 1650 (16వ శతాబ్దం)
నివాసం : శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రాంతాలలో నివసించిన కళింగ కవి.
ప్రత్యేకతలు :
ఈయన ఇంటి పేరును మారయ, మారవి అని కూడా అంటారు. అరసవిల్లి సూర్యదేవాలయం లోని సూర్యభగవానుని సంబోధిస్తూ భాస్కర శతకం వ్రాశాడు. దీనిలో దృష్టాంతాలంకారాలు ఎక్కువగా ఉపయోగించాడు.
4) పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
కవి పేరు : పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
జననం : వై.యస్.ఆర్. కడపజిల్లా, కందిమల్లయ్య పల్లెలో క్రీ.శ. 1610లో జన్మించారు. (17వ శతాబ్దం)
తల్లిదండ్రులు : ప్రకృతాంబ, పరిపూర్ణమాచార్యులు దంపతులకు జన్మించారు. వీరపాపమాంబ, వీరభోజయా చార్య దంపతులు పెంచారు.
భార్య : గోవిందమ్మ
కుమార్తె : వీర నారాయణమ్మ
రచనలు : కాలజ్ఞానం, కాళికాంబ హంస కాళికాంబ శతకం. 1693లో సమాధి చెందారు.
5) గువ్వల చెన్నడు
కవి పేరు : గువ్వల చెన్నడు జననం : వై.యస్. ఆర్. కడపజిల్లా, రాయచోటి ప్రాంతం.
ప్రత్యేకతలు : లోకనీతిని, రీతిని పరిశీలించి సమాజ శ్రేయస్సు కోసం శతకం రచించాడు.
రచనలు : గువ్వల చెన్న శతకం
కాలం : 17వ శతాబ్దం
6) ఏనుగు లక్షణకవి:
కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి
కాలం : 18వ శతాబ్దం
జననం : తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం
తల్లిదండ్రులు : పేరమాంబ, తిమ్మకవి
రచనలు :
సుభాషిత రత్నావళి, రామేశ్వర మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, సూర్యశతకం, గంగా మహాత్మ్యం మొదలైన 11 గ్రంథాలను రచించాడు.
ప్రత్యేకతలు :
వీరి ఇంటి పేరు పైడిపాటి. వీరి ముత్తాతగారు పైడిపాటి జలపాతమాత్యుడు. ఆయనకు పెద్దాపురం సంస్థానాధీశులు ఏనుగును బహుమానంగా ఇచ్చారు. అప్పటి నుండీ వీరి ఇంటిపేరు ఏనుగుగా మారింది.
7) చుక్కాకోటి వీరభద్రమ్మ:
కవి పేరు : ‘చుక్కా కోటి వీరభద్రమ్మ
నివాసం : వల్లూరుపాలెం, కృష్ణాజిల్లా
కాలం : 20వ శతాబ్దం
రచన : నగజా శతకం (1940లో అచ్చయింది)
8) గద్దల శాంయూల్ :
కవి పేరు : గద్దల శాంయూల్
కాలం : 20వ శతాబ్దం
రచన : హితోక్తి శతకం
9) జెండామాన్ ఇస్మాయిల్:
కవి పేరు : జెండామాన్ ఇస్మాయిల్
నివాసం : కర్నూలు
రచనలు : లలిత కల్పవల్లి – తెలుగు తల్లి (పద్య సంకలనం), అఖిలలోక మిత్ర – ఆంధ్ర పుత్ర శతకం, సూక్తి సుధా లహరి శతకం
వృత్తి : తెలుగు ఉపాధ్యాయుడు
అవార్డులు :
2002లో జిల్లాస్థాయి, 2003లో రాష్ట్రస్థాయి, 2006లో జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు.
ప్రత్యేకతలు :
పాఠ్యపుస్తక రచయిత, బాల సాహిత్యానికి, పద్య రచనకు చాలా కృషి చేశారు. ‘మహతి’ సాహితీ సంస్థను నెలకొల్పారు. దానికి కార్యదర్శిగా పనిచేశారు.
కాలం : ఆగస్టు 5, 2020 వరకు జీవించారు. తన 66వ ఏట స్వర్గస్తులయ్యారు.
పద్యాలు – అర్థాలు – భావాలు
1. కం|| క్షమ గలిగిన సిరి గలుగును
క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ ! – ఆంధ్ర మహాభాగవతం
అర్థాలు :
తండ్రీ = ఓ నాన్నా !
క్షమన్ = ఓర్పు
కలిగిన = ఉంటే
సిరి = డబ్బు
కలుగును = కలుగుతుంది
క్షమన్ = ఓర్పు
కలిగిన = ఉంటే
వాణి = మంచిమాట (సరస్వతి)
కలుగు = ఉంటుంది
క్షమన్ = ఓర్పు
కలుగన్ = ఉంటే
తోన = దానితోనే
సౌఖ్యము లెల్లన్ = సౌకర్యాలన్నీ
తెచ్చును = తెస్తుంది
కలుగును = కలుగుతాయి
క్షమన్ = ఓర్పును
కలిగిన = కలిగి ఉంటే
సదయుడు = కరుణామయుడైన
శౌరి = శ్రీహరి
మెచ్చు = మెచ్చుకొంటాడు
భావం :
ఓ తండ్రీ ! ఓర్పు కలిగితే సంపద కలుగుతుంది. మంచిగా మాట్లాడడం (చదువు) వస్తుంది. సౌఖ్యాలన్నీ క్షమతోనే వస్తాయి. కరుణామయుడైన శ్రీహరి కూడా ఓర్పుగల వానిని మెచ్చుకొంటాడని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో అన్నాడు.
2. కం||| ధనమే మైత్రినిఁదెచ్చును
ధనమే వైరమును దెచ్చు ధనమే సభలన్
ఘనతను దెచ్చును నెంతటి
గొనముల కుప్పలకునైన గువ్వలచెన్నా ! -గువ్వల చెన్న శతకం
అర్థాలు :
గువ్వలచెన్నా = ఓ గువ్వల చెన్నా !
ఎంతటి = ఎంతగొప్ప
గొనముల = గుణాల కుప్పలకునైన = రాశులకు (కలవారికైనా)
ధనమే = డబ్బే
మైత్రినిన్ = స్నేహాన్ని
తెచ్చును తెస్తుంది
ధనమే = డబ్బే
వైరమును = విరోధాన్ని
తెచ్చు = తెస్తుంది
ధనమే = డబ్బే
సభలన్ = కొలువులలో కలిగిన
ఘనతనున్ = గొప్పతనాన్ని కూడా
భావం :
ఓ గువ్వలచెన్నా ! ఎంత గొప్ప గుణవంతుల కైనా ధనమే స్నేహాన్ని పెంచుతుంది. డబ్బే విరోధం తెస్తుంది. సభలలో గొప్పతనాన్ని కూడా డబ్బే తెస్తుంది.
3. కం|| వృద్ధ జన సేవఁజేసిన
బుద్ధి విశేషజ్ఞుడనుచుఁబూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్దరఁ బొగడెదరు ప్రేమయెసంగ కుమారా ! – కుమార శతకం
అర్థాలు :
కుమారా ! = ఓ కుమారుడా !
వృద్ధజన = ముసలివారి
సేవన్ = సేవను
చేసిన = చేస్తే
బుద్ధి = తెలివిగలవాడు
విశేషజ్ఞుడు . = అన్నీ తెలిసినవాడు
అనుచున్ = అంటూ
పూత = పవిత్రమైన
చరితుడున్ = చరిత్ర కలవాడు
సత్ = మంచి
ధర్మశాలి = ధర్మాత్ముడు
అని = అని అంటూ
ప్రేమ, ఆప్యాయత
ఎసంగ = అతిశయించగా
ఈ + ధరన్ = ఈ లోకంలో (ఈ భూమిపై)
బుధులు = పండితులు
పొగడెదరు = మెచ్చుకొంటారు
భావం :
ఓ కుమారా ! పెద్దలకు సేవ చేస్తే తెలివైనవాడని, విశేషమైన జ్ఞానం కలవాడనీ, పవిత్రుడనీ, మంచి ధర్మాత్ముడని ఈ భూలోకంలోని పండితులు ప్రేమతో మెచ్చుకొంటారు.
4. ఆ.వె||పరుల దిట్ట నోరు పాప పంకిల మౌను
పెద్దలను నుతింప శుద్ధియగును
నోటి మంచి తనము పాటించు సుజ్ఞాని
కాళికాంబ ! హంస కాళికాంబ ! – కాళికాంబ సప్తశతి
అర్థాలు :
కాళికాంబ = కాళికామాతా !
హంస = పరమాత్మ స్వరూపమైన
కాళికాంబ = ఓ కాళికామాతా !
పరులన్ = ఇతరులను
తిట్ట = తిడితే
నోరు = మననోరు
పాప = పాపముతో
పంకిలము = బురదకల ప్రదేశం
ఔను = అవుతుంది
పెద్దలను = పెద్దవారిని
నుతింప = స్తోత్రము చేస్తే
శుద్ధి = పవిత్రం
అగును = ఔతుంది – అందుకే
సుజ్ఞాని = మంచి జ్ఞానము కలవాడు
నోటి = నోరు యొక్క
మంచితనము = మంచితనాన్ని (మంచిగా మాట్లాడే పద్ధతిని)
పాటించు = ఆచరిస్తాడు
భావం :
కాళికామాతా ! పరమాత్మ స్వరూపిణివైన ఓ కాళికా మాతా ! ఇతరులను తిడితే మన నోరు పాపమనే బురద కల ప్రదేశమౌతుంది. పెద్దలను స్తుతిస్తే పవిత్రం’ ఔతుంది. అందుకే మంచి జ్ఞానము కలవాడెప్పుడూ నోటితో మంచి మాటలనే మాట్లాడతాడు.
5. కం|| సత్యమె యశముకు మూలము
సత్యమె భవమోహపాశ సంసృతి బాపున్
సత్యమె శీలము నిలుపును
సత్యముతో నెట్టివ్రతము చాలదు నగజా – నగజా శతకం
అర్థాలు :
నగజా = హిమాలయ పర్వతం యొక్క కుమార్తెవైన పార్వతీ దేవి !
సత్యమె = నిజం చెప్పడమే
యశముకు = కీర్తికి
మూలము = ప్రధానమైనది
సత్యమె = నిజమైన ప్రవర్తనే (నిజం చెప్పడమే)
సంసృతి – సంసారమునందలి
భవ = పుట్టుక వలన వచ్చిన
మోహపాశము = అజ్ఞానం అనే పాశమును
బాపున్ = నశింపచేస్తుంది
సత్యమె = నిజమే
శీలము = మన నడతను
నిలుపును = కాపాడుతుంది
సత్యముతో = నిజం చెప్పడంతో
ఎట్టివ్రతము = ఏ రకమైన నోము
చాలదు = సరిపోదు
భావం :
ఓ హిమాలయ పర్వత కుమార్తెవైన పార్వతీదేవీ! సత్యం చెప్పడమే కీర్తికి కారణం, సత్యం చెప్పడం వలననే సంసారంలో పుట్టుక వలన. వచ్చిన అజ్ఞాన బంధాన్ని నశింప చేస్తుంది. సత్యమే మన నడతను నిలుపుతుంది. అందుకే సత్యవ్రతాన్ని మించిన వ్రతం లేదు.
6. కం||గురుభక్తియు విద్యల పై
తరగని విశ్వాస సంపద వినయము నిరం
తర సాధన, ధారణ పున
శ్చరణము విద్యార్థికి యవసర లక్షణముల్ – హితోక్తి శతకం
అర్థాలు :
గురుభక్తియు = గురువులపై భక్తీ
విద్యలపై = చదువులపై
తరగని = తగ్గని
విశ్వాస సంపద = విశ్వాసమనే ఐశ్వర్యం
వినయము = అణకువ
నిరంతరం = ఎల్లప్పుడూ
సాధన = అభ్యాసం
ధారణ = జ్ఞాపకశక్తి
పునః = తిరిగి
చరణము = గురుచేసుకోవడం
విద్యార్థికి = చదువుకొనేవానికి
అవసర = కావలసిన
లక్షణముల్ = లక్షణాలు
భావం :
గురువులపట్ల భక్తి, చదువులపట్ల అపార నమ్మకం, పెద్దలపట్ల వినయం, నిరంతరం కష్టపడేతత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం (ధారణ), నేర్చుకున్న అంశాన్ని వల్లె వేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం.
7. ఆ.వె.|| చూడనగ్నిఁ గాలి సుత్తి దెబ్బలకోర్చి
మేలి సొమ్ములగుచు మెరియుఁ బసిడి
బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా
అఖిల లోకమిత్ర ! ఆంధ్రపుత్ర ! – ఆంధ్రపుత్ర శతకం
అర్థాలు :
అఖిల = అన్ని
లోక = లోకాలకూ
మిత్ర = స్నేహితుడా !
ఆంధ్రపుత్ర = తెలుగుబిడ్డా !
చూడన్ = ఆలోచించగా
పసిడి = బంగారం
అగ్నిన్ = నిప్పులతో
కాలి = కాలి
సుత్తిదెబ్బలకు = సుత్తి దెబ్బలకు
ఓర్చి = ఓర్చుకొని
మేలి = విలువైన
సొమ్ములగుచు = ఆభరణాలవుతూ
మెరయున్ = మెరుస్తుంది కదా ! (అలాగే)
బాధలు = కష్టాలను
ఓర్చుకొన్న = తట్టుకొంటే
భవిత = భవిష్యత్తు
వర్ధిల్లురా = వృద్ధి చెందుతుంది
భావం :
ఓ ఆంధ్ర పుత్రుడా ! బంగారం అగ్నిలో కాలి, సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదే విధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.
8. ఉ||చేసిన దుష్టచేష్ట నదిచెప్పక, నేర్పునఁగప్పిపుచ్చి తా
మూసినయంతటన్, బయలుముట్టక యుండదదెట్లు, రాగిపై
బూసిన బంగరుం జెదరి పోవగడంగిన నాడు నాటికిన్
దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగ భాస్కరా ! – భాస్కర శతకం
అర్థాలు :
భాస్కరా – ఓ సూర్య దేవా!
దుష్టచేష్టన్ = తప్పుడు పనిని
చేసిన = చేసినట్లైతే
అది = దానిని
చెప్పక = ఎవ్వరికీ చెప్పకుండా
నేర్పునన్ = నైపుణ్యంతో
కప్పిపుచ్చి = దాచి ఉంచి
తాన్ = తాను
మూసిన = దాచిపెట్టినా
అంతటన్ = ఐనా
బయలుముట్టక = బయట పడక
ఉండదు = ఉండదు కదా !
అది = ఆ.విషయం
ఎట్లు = ఎలాగంటే
రాగిపై = రాగిపైన
పూసిన = పూసినటువంటి
బంగరున్ = బంగారం
చెదరిపోవన్ = చెదరిపోవడం
కడంగిన = ప్రారంభించిన
నాడు = రోజున
నాటికిన్ = అప్పటికి
తాసిన = తాపడం చేసిన
రాగి = రాగిని
జనులెల్లన్ = జనమందరూ
ఎఱుంగన్ = తెలుసుకొనేలా
కానబడదా = కనిపించదా
భావం :
ఓ సూర్యదేవా ! తప్పుడు పనులు చేసి ఎవ్వరికీ చెప్పకుండా నైపుణ్యంతో దాచినా బయటపడక మానదు. అదెలాగంటే, రాగిపై బంగారం పూసినా కొంత కాలానికి బంగారం చెదిరిపోయి తాపడం కిందనున్న రాగి అందరికీ తెలుస్తుంది కదా !
9. చ|| కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణా భివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబులివి శూరులకున్ సిరి లేనియప్పుడున్ – సుభాషిత రత్నావళి
అర్థాలు :
సిరి = డబ్బు
లేని అప్పుడున్ = లేనప్పుడు కూడా
శూరులకున్ = పౌరుషవంతులకు
కరమున = చేతియందు
నిత్యదానము = నిత్యమూ దానం చేయడం
ముఖంబున = నోటిని
సూనృతవాణి = సత్యమైన మాట
ఔదలన్ = శిరస్సున్
గురు = గురువు యొక్క
చరణ = పాదములకు
అభివాదనము = నమస్కారము దోః
దోঃ= భుజములు
యుగంబునన్ = రెండిటియందునూ
అకుంఠిత = తగ్గని
వీర్యము = బలము
వర = శ్రేష్టమైన
హృదయంబునన్ = మనసులో
విశద = కచ్చితమైన
వర్తనము = ప్రవర్తన
వీనులన్ = చెవులయందు
అంచిత విద్య = ఒప్పిదయైన విద్య
ఇవి = ఇవి
సురుచిర = మంచి కాంతివంతమైన
భూషణములు = ఆభరణాలు
భావం :
పౌరుషవంతులకు సిరిలేక పోయినప్పుడు కూడా చేతులకు దానం చేసే గుణం, నోటికి నిజం చెప్పడం, గురువుగారి పాదాలకు నమస్కరించడం శిరస్సుకు, భుజాలకు మొక్కవోని బలం, శ్రేష్ఠమైన హృదయంలో మంచి ప్రవర్తన, చెవులకు ఒప్పిదమైన విద్య అనేవి మంచి కాంతివంతమైన ఆభరణాలు.