SCERT AP Board 7th Class Telugu Guide Answers 7th Lesson కప్పతల్లి పెళ్ళి Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 7th Lesson Questions and Answers కప్పతల్లి పెళ్ళి
7th Class Telugu 7th Lesson కప్పతల్లి పెళ్ళి Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరున్నారు?
జవాబు:
చిత్రంలో ఇద్దరు వ్యక్తులున్నారు.
ప్రశ్న 2.
రైతులు దేనికోసం ఎదురుచూస్తున్నారు?
జవాబు:
రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రశ్న 3.
వర్షాలు కురవకపోతే ఏమౌతుంది?
జవాబు:
వర్షాలు కురవకపోతే పంటలు పండవు. ‘మొక్కలు పెరగవు. తినడానికి తిండి ఉండదు. త్రాగడానికి కూడా మంచినీరు ఉండదు. ఉన్న చెట్లు కూడా ఎండిపోతాయి. ఆక్సిజన్, నీరు లేక మరణాలు సంభవిస్తాయి. భూమి ఎడారిగా మారిపోతుంది.
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
గేయాన్ని రాగయుక్తంగా పాడుతూ అభినయించండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరించండి.
ప్రశ్న 2.
వర్షం వచ్చే ముందు ఆకాశం ఎలా ఉంటుందో చెప్పండి.
జవాబు:
వర్షం వచ్చే ముందు ఆకాశంలో మబ్బులు వస్తాయి. ఆ మేఘాలు నల్లగా ఉంటాయి. దట్టంగా చీకటి అలుముకుంటుంది. ఆకాశంలో వెలుతురు తగ్గిపోతుంది. ఆకాశంలో మెరుపులు వస్తాయి. చల్లటి గాలి వీస్తుంది. తర్వాత వర్షం ప్రారంభమవుతుంది.
ప్రశ్న 3.
మీరు చూసిన పెళ్లిలోని ఆచారాలను గురించి మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
మా అక్క పెళ్లిలోని ఆచారాలను పరిశీలించాను. పెళ్లికి 15 రోజులు ముందు వినాయకునికి బియ్యం మీదు కట్టారు. అప్పటినుండి పెళ్లి పనులు ప్రారంభించారు. పెళ్లికి 2 రోజుల ముందు పెళ్లికూతుర్ని చేశారు. పందిరి వేశారు. పేరంటం పెట్టారు. మా చెల్లిని తోడ పెళ్లికూతుర్ని చేశారు. పెళ్లికి పంతులుగారు వచ్చి మంత్రాలు చదివారు. మా అమ్మ, నాన్న, అక్కచేత ఏవో పూజలు చేయించారు. అక్కడ మా బావ, వాళ్ల అమ్మ నాన్నలతో కూడా పూజలు చేయించారు. తర్వాత మా బావ, మా అమ్మ, నాన్న పీటలపై ఉన్నారు. మా అక్కను అలంకరించిన బుట్టలో కూర్చోపెట్టి మా మామయ్యలు తెచ్చారు. మా బావ ఎదురుగా కూర్చోబెట్టారు. తెర అడ్డం పెట్టారు. ఒకరి తలపై ఒకరిచేత జీలకర్ర, బెల్లం పెట్టించారు. మా బావ మా అక్కమెడలో మంగళసూత్రం కట్టాడు. తర్వాత తలంబ్రాలు పోసుకున్నారు. బ్యాండుమేళం వాయించారు. బాణాసంచా కాల్చారు. చాలామంది భోజనాలు చేశారు. మా అక్క, బావలను ఆశీర్వదించారు.
ప్రశ్న 4.
కింది గేయాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
చేయి చేయి కలిపేద్దాం – ఇంకుడు గుంతలు తవ్వేద్దాం
వర్షపు నీటిని పట్టేద్దాం – భూగర్భ జలాలను పెంచేద్దాం
చెరువులన్నీ నింపేద్దాం – బంగరు పంటలు పండిద్దాం
మొక్కలెన్నో నాటేద్దాం – కరువు కాటకాలను తరిమేద్దాం
ప్రకృతిమాతను రక్షిద్దాం – హాయిగ మనము జీవిద్దాం.
ప్రశ్నలు :
1. భూగర్భ జలాలను ఎలా పెంచాలి?
జవాబు:
ఇంకుడు గుంతలు తవ్వి, వర్షపు నీటిని వాటిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచాలి.
2. కరువుకాటకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జవాబు:
పంటలు పండించి, మొక్కలను పెంచితే కరువు కాటకాలు రావు.
3. మనం దేనిని రక్షించాలి?
జవాబు:
మనం ప్రకృతిని రక్షించాలి.
4. ఈ కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రకృతిని రక్షిస్తే ప్రయోజనం ఏమిటి?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఇంద్రుని ప్రయాణంతో ప్రకృతిలో వచ్చిన మార్పులను కవయిత్రి ఎలా వర్ణించింది?
జవాబు:
ఇంద్రుడు దేవతలకు రాజు. అతను రథంపై ప్రయాణమయ్యాడు. ఆయన రథం యొక్క వేగానికి వచ్చిన గాలితో చెట్లు ఊగి గాలి వేసింది. ఆ గాలీ కప్పతల్లి పెళ్లికి విసనకర్రలతో విసురుతున్నట్లుగా కవయిత్రి వర్ణించింది.
ఇంద్రుని రథ చక్రాలు బండరాళ్లపై దొర్లుతుంటే వచ్చే చప్పుళ్లు (ఉరుములను) మేళతాళాలుగా వర్ణించారు. ఆ రథ వేగానికి ఆకాశంలో వచ్చే మెరుపులు కప్పతల్లి మెరుపులకు బాణాసంచా కాలిస్తే వచ్చే వెలుగులతో పోల్చారు.
ప్రశ్న 2.
కప్పల పెళ్లికి, వానకు గల సంబంధమేమిటో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కప్పల పెళ్లికి, వానకు గల సంబంధం ప్రకృతి సిద్ధమైనది. వర్షాకాలం రానంత వరకూ కప్పలెక్కడా ఎక్కువగా కనబడవు. వాటి బెకబెకలు వినబడవు. వర్షాలు ఎక్కువగా పడినపుడే కప్పలు అన్నీ పెళ్లివారిలా కలకలలాడుతూ వస్తాయి. బోదురు కప్పలు బెకబెకలాడుతూ పెళ్లి హడావుడి చేస్తాయి. సంతానం కలుగుతుంది. అందుకే కప్పలకు పెళ్లి చేస్తే వర్షం వస్తుందనే ఆచారం ఏర్పడింది.
ప్రశ్న 3.
కప్పల పెళ్లి వెనక దాగి ఉన్న గ్రామీణుల ఆలోచనను తెలియజేయండి.
జవాబు:
కప్పలకు, వానలకు విడదీయలేని సంబంధం ఉంది. ప్రకృతిలోని జీవులను, ప్రకృతిని కాపాడేవారంటే భగవంతునికి ఇష్టం. ధర్మంగా ప్రవర్తించే వారి వలననే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. ధర్మంలో భాగమే పెండ్లిళ్లు మొదలైనవి. కప్పలకు పెళ్లి చేసి ఊరేగిస్తే వరుణుడు సంతోషపడతాడు.
కప్పల పెళ్లిని చూసిన ఆయన మనసు కరుగుతుంది. ఆ కరిగిన మనసే వర్షధారలుగా భూమిపై కురుస్తుంది. ఆ వర్షం వలన పంటలు పండుతాయి. అందుచేత వర్షాలు కురవడం ఆలస్యమైతే గ్రామీణులు కప్పలకు పెళ్లిళ్లుచేసి ఊరేగిస్తారు. చేసిన పనికి ఫలితం ఎప్పుడూ రాకమానదని గ్రామీణుల నమ్మకం. ఆ నమ్మకమే మన జీవితాలకు అవసరమని గ్రామీణుల అభిప్రాయం, ఆలోచన.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కప్పతల్లి పెళ్లి గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కప్పతల్లి పెళ్లి జరుగుతోంది చూద్దాం రండి. ఆ పెళ్లికి వరుణదేవుడు కావిళ్లతో నీళ్లు ఒంపినాడు. వీధులన్నీ నీటితో – నింపేశాడు. స్వర్గానికి అధిపతియైన దేవేంద్రుడు తన రథం ఎక్కి ప్రయాణమయ్యాడు. ఆ రథం వేగానికి ఆకాశం నుండి గాలులు వీస్తున్నాయి. ఆ గాలులకు ఊగే చెట్లు పెళ్లివారికి విసనకర్రలతో గాలి వీస్తున్నట్లుగా ఉన్నాయి.
ఆ రథ చక్రాలు బండరాళ్లపై దొర్లుతూ చేసే చప్పుళ్లు (ఉరుములు) కప్పతల్లి పెళ్లికి మేళతాళాలులాగా ఉన్నాయి. ఆ రథ వేగానికి వచ్చే కాంతి బాణసంచాలా ఉంది. బోదురు కప్పల అరుపులు కూడా మేళతాళాలులా ఉన్నాయి.
కప్పమ్మ గడప తొక్కింది. ఇంటిచూరు శుభమంది. వర్షంలో కప్పలు గంతులు వేస్తున్నాయి. ఇక పొలంలో బంగారం లాంటి పంట పండుతుంది.
ప్రశ్న 2.
ప్రజల నమ్మకాలపై ఆధారపడ్డ ఏదేని మీ ప్రాంత ఉత్సవం గురించి రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరకు నెల ముందు నుండి అమ్మవారి గరగలు ఊరేగిస్తారు. ఆ గరగలు ఇంటింటికీ వస్తాయి. అందరూ వాటికి భక్తితో బియ్యం ఇస్తారు. పసుపునీళ్లు పాదాలపై పోస్తారు. పువ్వులు, గాజులు, చీరెలు, పళ్లు, బియ్యం, డబ్బులు ఇస్తారు. గరగలెత్తాక ఊర్లోని ఆడపడుచులు ఎవ్వరూ ఊరు వదిలి ఎక్కడికీ వెళ్లరు. అమ్మవార్లకు చీరెలు పెట్టనిదే – పుట్టినరోజులు, పండుగలు మొదలైనవి ఏవి వచ్చినా కొత్తబట్టలు కట్టుకోరు. అమ్మవారికి నిర్ణయించిన రోజున చలిమిడి, పానకం పోస్తారు.
జాతర చాలా అట్టహాసంగా జరుగుతుంది. జాతరనాడు రాత్రి 2 గంటలకు నిప్పుల గుండం వేస్తారు. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అందరూ నిప్పుల గుండం తొక్కుతారు. ఎవ్వరికీ కాళ్లు కాలవు. అనారోగ్యాలుంటే తగ్గుతాయి. అందరూ కులమత భేదాలు లేకుండా పాల్గొంటారు.
ప్రశ్న 3.
కప్పతల్లి పెళ్లిలో ప్రకృతి పాత్రను కవయిత్రి ఎలా భావించిందో వివరించండి.
జవాబు:
కప్పతల్లి పెళ్లిని ప్రకృతే చేసింది. ఆ పెళ్లికి నీటిని వరుణదేవుడు వర్షం రూపంలో సమకూర్చాడు. చెట్లు విసనకర్రల వలే గాలిని వీచాయి. ఇంద్రుడు తన రథం యొక్క వేగం వలన పుట్టిన మెరుపులతో బాణసంచా కాల్పులు జరిపాడు. ఆ రథం బండరాళ్లపై దొర్లిన చప్పుడూ, బోదురు కప్పల బెకబెకలు బాజా భజంత్రీలు మేళతాళాలయ్యాయి. ఈ విధంగా కప్పతల్లి పెళ్లిలో ప్రకృతి పాత్రను కవయిత్రి భావించారు.
పువ్వులు కొడికీ వెళ్లరు. అమ్మవార్లకు నీరయించిన రోజున చలిమిడి, టెలకు నిప్పుల గుండం వేస్తారు తగ్గుతాయి
కంపోసారు.
భాషాంశాలు
అ) కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలకు అర్ధాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : గగనతలము నుంచి నేడు గాలులు వీచాయి.
గగనతలం = ఆకాశమార్గం
సొంతవాక్యం : పక్షులు ఆకాశమార్గంలో స్వేచ్ఛగా ఎగురుతాయి.
1. రాజు రథంపై పయనం అయ్యాడు.
పయనం = ప్రయాణం
సొంతవాక్యం : అనుకొన్న ప్రయాణం మానకూడదు.
2. మీకు శుభం కలుగుగాక.
శుభం = మంచి
సొంతవాక్యం : అందరికీ మంచి కలగాలి.
3. మా పొలంలో కనక వర్షం కురిసింది.
కనకం = బంగారం
సొంతవాక్యం : బంగారం కంటే కాలం విలువైనది.
4. పల్లెటూర్లో కావిళ్ళతో నీళ్ళను తెస్తారు.
కావిళ్ళు = నీటిని తేవడానికి ఉపయోగించేవి.
సొంతవాక్యం : నీటిని తేవడానికి ఉపయోగించేవి కావిళ్లు కదా ! వాటితో పాలు, ధాన్యం వగైరా అన్నీ తెస్తారు.
5. పండగకి వాడ వాడలా దేవుణ్ణి ఊరేగిస్తారు.
వాడ = వీధి.
సొంతవాక్యం : ప్రతి వీధిలోనూ దేవుడు ఊరేగుతాడు.
ఆ) కింది వాక్యాలలో సమానార్ధక పదాలను (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.
1. మంచివారి మాటలు వినాలి. వారి పలుకులు బంగారు తునకలు.
వాక్కులు = మాటలు, పలుకులు
2. పొలంలో బంగారం పండింది. ఇల్లు కనకంతో నిండింది.
పసిడి = బంగారం, కనకం
3. కప్పతల్లి పెళ్లి జరుగుతోంది. పెద్దలందరూ వివాహానికి వచ్చారు.
పరిణయం = పెళ్లి, వివాహం
ఇ) కింద ఇచ్చిన ప్రకృతి, వికృతులను జతపరచండి.
1. ప్రయాణం | అ) తలము |
2. రథము | ఆ) బత్తెము |
3. స్థలము | ఇ) పయనం |
4. భత్యము | ఈ) అరదము |
జవాబు:
1. ప్రయాణం | ఇ) పయనం |
2. రథము | ఈ) అరదము |
3. స్థలము | అ) తలము |
4. భత్యము | ఆ) బత్తెము |
ఈ) కింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి.
1. శక్యం | అ) నేడు |
2. శుభం | ఆ) అశక్యం |
3. నాడు | ఇ) అశుభం |
జవాబు:
1. శక్యం | ఆ) అశక్యం |
2. శుభం | ఇ) అశుభం |
3. నాడు | అ) నేడు |
ఉ) కింది గళ్లలో పాఠంలోని పదాలను గుర్తించండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా : బాజాలు
1. బడబడా భం
2. శక్యము
3. కప్ప
4. పెళ్ళి
5. శుభం
6. బహుబాగు
ఉదా : బాజాలు : మా అక్క పెళ్లికి బాజాలు వాయించారు.
1. బడబడా : తలుపులు బడబడా కొట్టకూడదు.
2. శక్యము : కృషి చేస్తే శక్యము కానిది లేదు.
3. కప్ప : కప్పులు వానాకాలం కనబడతాయి.
4. పెళ్ళి : పెళ్లికి దుబారా ఖర్చులు చేయకూడదు.
5. శుభం : మంచిగా ఆలోచిస్తే శుభం కలుగుతుంది.
6. బహుబాగు : ఈ పదకేళి బహుబాగుగా ఉంది.
వ్యాకరణాంశాలు
ద్రుతము
అ) కింది వాక్యాలను పరిశీలించండి.
1. బాలచంద్రుడు అభిమన్యునివలెన్ పోరు సలిపెను.
2. ఆర్యా ! మాయందున్ దయచూపుడు.
3. మీరు వచ్చినన్ సంతోషించెదను.
4. బాలుని కొట్టినన్ ఏడ్చును.
5. భూమి రాజు చేతన్ పాలించబడెను.
పై వాక్యాలలోని గీతగీసిన పొల్లు హల్లు (న్) తొలగించి వాక్యాలను మళ్ళీ రాయండి.
ఉదా : 1. బాలచంద్రుడు అభిమన్యుని వలె పోరు సలిపెను.
2. ఆర్యా ! మాయందు దయ చూపుడు.
3. మీరు వచ్చిన సంతోషించెదను.
4. బాలుని కొట్టిన ఏడ్చును.
5. భూమి రాజు చేత పాలించబడెను.
పై ఉదాహరణల్లో ‘స్’ తొలగించినా అర్థంలో మార్పు రావడం లేదు. ఇటువంటి ‘న’ కారాన్ని ద్రుతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
త్రికము
ఆ) కింది వాక్యాలను గమనించండి.
1. అతడు ఎచ్చోటనైనా జీవించగలడు.
2. ఇక్కడ వర్షం పడుతోంది.
3. ఎక్కడ ఉన్నా మన మాతృభూమిని మరవవద్దు.
4. అచ్చోటు నివాసయోగ్యము కాదు.
5. అక్కడ చలి ఎక్కువగా ఉంది.
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
ఉదా : ఎచ్చోటు – ఏ + చోటు
1. ఇక్కడ = ఈ + కడ
2. ఎక్కడ = ఏ + కడ
3. అక్కడ = ఆ + కడ
4. అచ్చోటు = ఆ + చోటు
పై ఉదాహరణల్లో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు వచ్చాయి. వీటినే ‘త్రికములు’ అంటారు.
ఆమ్రేడితం
ఇ) కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి.
1. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి.
2. మేము అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంటాం.
3. విందు భోజనంలో ఏమేమి పదార్థాలు వడ్డించారు.
4. మా ఊరికి చిట్టచివర బడి ఉంది.
5. ఆ పట్టణం నట్టనడుమ కోనేరు ఉంది.
ఉదా : అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు
1. అక్కడక్కడ = అక్కడ + అక్కడ
2. ఏమేమి = ఏమి + ఏమి
3. చిట్టచివర = చివర + చివర
4. నట్టనడుమ = నడుమ + నడుమ
5. పట్టపగలు = పగలు + పగలు
పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోను ఒకేపధం కనిపిస్తుంది. ఇలా రెండూ ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవపదాన్ని ఆమ్రేడితం అంటారు. ఈ
పంచమీ విభక్తి
ఈ) క్రింది వాక్యాలను పరిశీలించండి.
1. వర్షాల వలన కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
2. కృష్ణుడి వలన పాండవులు యుద్ధంలో విజయం-సాధించారు.
3. కరువుకాటకాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
4. పల్లెటూరి కంటె పట్నంలో కాలుష్యం ఎక్కువ.
5. శ్రీనాథుని కంటె నన్నయ ముందువాడు.
పై వాక్యాల్లో ‘వలన కంటె – పట్టి’ అనే ప్రత్యయాలు వాక్యాన్ని అర్థవంతంగా మార్చాయి. ఇలాంటి ప్రత్యయాలు వస్తే దాన్ని పంచమీ విభక్తి అంటారు. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర ‘వలన’ అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు ‘కంటె’ అనే ప్రత్యయం వస్తుంది.
ఉ) గేయంలోని ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి.
ద్విత్వాక్షర పదాలు :
1) కప్ప 2) తల్లి 3) పెళ్ళి 4) కావిళ్ళు 5) నీళ్లు 6) శుభమన్న 7) రాళ్ళు 8) కళ్ళు 9) కప్పమ్మ 10) తొక్కినది 11) వానలమ్మా 12) వాడలన్నీ 13) రథమెక్కి 14) ఒళ్లు 15) సుమ్మా 16) గొప్ప 17) పోవుచున్నాడు 18) మెరుపులమ్మ 19) తెప్పించి 20) చెప్ప 21) పండుతాయమ్మా
సంయుక్తాక్షర పదాలు :
1) భత్యాలు 2) చక్రములు 3) స్వర్గాధినాథుడు 4) దొర్లించి 5) శక్యము 6) చెట్లు
ఊ) కింది పదాలను విడదీయండి. సంధి పేర్లు రాయండి.
ఉదా : స్వర్గాధినాథుడు : స్వర్గ + అధినాథుడు = సవర్ణదీర్ఘ సంధి
1. పరవశమౌను = పరవశము + ఔను = ఉత్వ సంధి
2. శుభమన్న = శుభము + అన్న = ఉత్వ సంధి
3. మెరుపులమ్మ = మెరుపులు + అమ్మ = ఉత్వ సంధి
4. రథమెక్కి = రథము + ఎక్కి = ఉత్వ సంధి
ఋ) కింది పదాలను కలిపి రాయండి.
ఉదా : కప్ప + అమ్మ = కప్పమ్మ
1. కప్పలు + ఎగిరే = కప్పలెగిరే
2. పండుతాయి + అమ్మ = పండుతాయమ్మ
3. వాడలు + అన్నీ = వాడలన్నీ
4. చేసినారు + ఏ = చేసినారే
ఋ) కింది వాక్యాలలో ప్రత్యయాల కింద గీత గీయండి. విభక్తులను రాయండి.
ఉదా : విద్యను అర్థించు వానిని విద్యార్థి అంటారు. – ద్వితీయ విభక్తి
1. విద్యావంతుడు అందరిచే పూజించబడతాడు. – తృతీయా విభక్తి
2. విద్యార్థులు జ్ఞానం కొరకు యాత్ర చేశారు. – చతుర్తీ విభకి
3. తల్లిదండ్రులు పిల్లలను ప్రాణము కంటే అధికంగా ప్రేమిస్తారు. – పంచమీ విభక్తి
4. అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. – షష్ఠీ విభక్తి
5. మా పురము నందు జనులు సేవాగుణం కలిగినవారు. – సప్తమీ విభక్తి
6. ఓయీ ! మునీశ్వరా ! ఇటు రమ్ము. – సంబోధనా ప్రథమా విభక్తి
ప్రాజెక్టుపని
అ) మీ ప్రాంతంలో జరిగే జాతరలకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
మా ప్రాంతంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరకు నెల ముందు నుండి అమ్మవారి గరగలు ఊరేగిస్తారు. ఆ గరగలు ఇంటింటికీ వస్తాయి. అందరూ వాటికి భక్తితో బియ్యం ఇస్తారు. పసుపునీళ్లు పాదాలపై పోస్తారు. పువ్వులు, గాజులు, చీరెలు, పళ్లు, బియ్యం, డబ్బులు ఇస్తారు. గరగలెత్తాక ఊళ్లోని ఆడపడుచులు ఎవ్వరూ ఊరు వదిలి ఎక్కడికీ వెళ్లరు. అమ్మవార్లకు చీరెలు పెట్టనిదే – పుట్టినరోజులు, పండుగలు మొదలైనవి ఏవి వచ్చినా కొత్తబట్టలు కట్టుకోరు. అమ్మవారికి నిర్ణయించిన రోజున చలిమిడి, పానకం పోస్తారు.
జాతర చాలా అట్టహాసంగా జరుగుతుంది. జాతరనాడు రాత్రి 2 గంటలకు నిప్పుల గుండం వేస్తారు. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అందరూ నిప్పుల గుండం తొక్కుతారు. ఎవ్వరికీ కాళ్లు కాలవు. అనారోగ్యాలుంటే తగ్గుతాయి. అందరూ కులమత భేదాలు లేకుండా పాల్గొంటారు.
ఆ) క్రింది నినాదాలు చదవండి. ఇలాంటివి మీరూ తయారుచేయండి.
జవాబు:
- మనిషికొక మొక్క పెంచుదాం – జీవకోటికి ప్రాణదాతలవుదాం.
- చెట్లు నరికితే దుర్భిక్షం – చెట్లు పెంచితే సుభిక్షం.
- చెట్లు పెంచితే ఉండవు ఇక్కట్లు – చెట్లే మన ప్రగతికి మెట్లు.
- మొక్కలు నాటుదాం – చక్కగా బ్రతుకుదాం.
- చెట్టుపై వేస్తే గొడ్డలి – అదే నీ భవితకు గొడ్డలి పెట్టు.
చమత్కార పద్యం
మామిడేలపూచు మండు వేసంగిని !
బాలుడేల పోవు పసుల వెంట
రాజు సేవ నేల రహిజేర్చు చుండును !
మూటనొక్క మాట ముద్దు కృష్ణ !
భావం :
మామిడిచెట్టు వేసవిలోనే ఎందుకు పూతపూస్తుంది? బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు? రాజు సేనను ఎందుకు పెంచుతాడు?
(పై మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం ‘కాయ’.) మామిడి పూసేది కాయడానికే.. బాలుడు పశువుల వెంట పోవడం చాటిని కాయడానికే. సేన కూడా ప్రజలను కాయడానికి. అంటే కాపాడడానికే అని అర్థం.
ఉపాధ్యాయులకు సూచనలు
చావలి బంగారమ్మ గారి రచనలను సేకరించి చదవండి.
కవి పరిచయం
కవయిత్రి పేరు: చావలి బంగారమ్మ
జననం : తూర్పుగోదావరి జిల్లా మోడేకుర్రులో 1897లో జన్మించారు. వీరిది కొంపెల్ల వారి పండిత కుటుంబం కనుక కవిత్వం ఉగ్గుపాలతో వచ్చింది.
రచనలు :
1930లో ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ ద్వారా ఈమె కవితలు వెలుగులోకి వచ్చాయి. 1958లో 42 కవితలతో ‘కాంచన విపంచి’ పేరుతో సంకలనం చేశారు. అవి భారతి, ఉదయిని, జ్వాల, ఆంధ్రపత్రికలలో ప్రచురితమైనవి.
ప్రత్యేకత :
ఈమె కవితలలో సరళత, స్పష్టత, లయాత్మకత కన్పిస్తాయి. భావ కవిత్వంలో స్మృతి కవిత్వం ఒకటి. తన సోదరుడు కొంపెల్ల జనార్ధనరావును స్మరిస్తూ స్మృతి కవిత్వం వ్రాసింది. ఈమె 11 1970లో కాలం చేశారు.
గేయాలు – అర్థాలు – భావాలు
1. కప్పతల్లి పెళ్లి నేడూ – చూడారే
కావిళ్ళనీళ్ళోంపినాడు !
వరుణదేవుడు వంపినాడూ – ఓ చెలీ
వాడలన్నీ నింపినాడు.!
గగనతలము నుంచి నేడు – వీవెనలు
చెట్లచే వేయించినాడు !
స్వర్గాధినాథుడు నేడూ – రథమెక్కి
పయనమై పోవుచున్నాడు !
భత్యాలు లేకనేవాడు – పెళ్లికి
బాజాలు వేయించినాడు!
బండరాళ్ళ పైని వాడు – చక్రములు
బడబడా దొర్లించినాడు!
అర్థాలు :
కావిడి = ఒక వెడల్పైన వెదురుబద్దకు రెండు చివర్లా ఉట్టెలు కట్టి, వాటిలో బిందెలు పెట్టి నీళ్లు తెచ్చుకొంటారు. (వెదురు బద్దను కావిడి బద్ద అంటారు) ఉట్లునే మట్టులు అంటారు. కావిడి బద్దను భుజంపై పెట్టు కొని నీరు తెస్తారు.
వాడలు = వీధులు
గగనము = ఆకాశం
తలము = స్థలము
వీవెన = విసనకర్ర
స్వర్గాధినాథుడు = దేవేంద్రుడు
పయనము = ప్రయాణము
భత్యము = ఖర్చుల కోసం ఇచ్చే డబ్బు
బాజా = డోలు
భావం :
కప్పతల్లి పెళ్లి జరుగుతోంది చూడండి. వరుణ దేవుడు కావిళ్లతో (పెళ్లికి) నీళ్లు పంపాడు. అన్ని వీధులూ వర్షపు నీటితో నింపేశాడు. పెళ్లివారికి నీటికి లోటు లేకుండా వరుణదేవుడు చేశాడు. స్వర్గానికి అధిపతియైన దేవేంద్రుడు రథమెక్కి ప్రయాణమై వెళుతున్నాడు. ఆ వేగానికి ఆకాశ వీధి నుండి వాయుదేవుడు వీచేగాలి పెళ్లి వారికి విసనకజ్జలతో గాలి వీస్తున్నట్లుంది. బండరాళ్లపై దేవేంద్రుని రథం పరుగెడుతోంది. ఆ ధ్వనినే ఉరుములంటారు. ఆ ఉరుములు కప్పతల్లి పెళ్లికి బాజాలు లాగా ఉన్నాయి.
2. ‘బాణసంచా వెలితి లేదే – పెళ్లికి
బహుబాగుగా జేసినారే
కళ్ళు చెదిరే మెరుపులమ్మా – చూడగా
వొళ్ళు పరవశమౌనుసుమ్మా !
కప్పమ్మ పెళ్లికోయంచూ – మేళములు
గొప్పగా తెప్పించినారే !
చెప్ప శక్యము కాదు వేరే – బోదురూ
కప్పలా మేళములురారే !
కప్పమ్మ గడప తొక్కినది – శుభమన్న
సూచనలు చూరు చెప్పినది !
కప్పలెగిరేవానలమ్మా – పొలములో
కనకాలెపండుతాయమ్మా !
అర్థాలు :
బాణసంచా = మందుగుండు సామగ్రి
వెలితి = లోటు
ఒళ్లు = శరీరం
పరవశం = తన్మయం
మేళము = వాయిద్యాలు
చూరు = ఇంటి పెణక అంచు
కనకం = బంగారం
శక్యము = సాధ్యము
కప్ప = మండూకం
పెళ్లి = వివాహం
భావం :
ఇంద్రుని రథచక్రాల వేగానికి ఆకాశంలో మెరుపులు పుట్టాయి. అవి కప్పతల్లి పెళ్లికి బాణా సంచా కాలుస్తుంటే వస్తున్న వెలుగులులా ఉన్నాయి. అవి చూస్తే తన్మయత్వం కలుగు తోంది. బోదురు కప్పల అరుపులు పెళ్లికి మేళతాళాలులా ఉన్నాయి. కప్పతల్లి మా ఇంటి గడప దగ్గర కొచ్చింది. అది శుభసూచన అని చూరు నుండి కారుతున్న నీరు చెప్పింది. కప్పలు ఎగిరి గంతులు వేసేటంత వాన కురిసింది. ఇక ఈ వర్షంతో పొలంలో బంగారం పండుతుంది. అంటే మంచి పంటలు పండుతాయి.
సారాంశం
ఈ రోజు కప్పతల్లి పెళ్లి చూడడానికి రండి. వరుణదేవుడు కావిళ్లతో నీళ్లు పంపాడు. మొత్తం వాడలన్నీ || నీటితో నింపేశాడు.
ఆకాశం నుండి గాలులు వీస్తున్నాయి. అవి చెట్లచేత పెళ్లివారికి విసనకర్రలతో విసిరిస్తున్నట్లుంది. స్వర్గాధి నాథుడైన దేవేంద్రుడు రథం ఎక్కి పెళ్లికి వెడుతున్నాడు. బండరాళ్లపై అతని రథచక్రాలు దొర్లుతున్నాయి. ఆ చప్పుడు పెళ్లి బాజాలులా ఉన్నాయి.
పెళ్లిలో బాణాసంచాలేని వెలితి కూడా లేదు. ఆకాశంలో వచ్చే మెరుపులు పెళ్లికి బాణాసంచాలా ఉన్నాయి. ఈ అవన్నీ చూస్తుంటే పరవశం కల్గుతోంది.
కప్పమ్మ పెళ్లికి మేళాలు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. ఆ మేళాలు చెప్పశక్యం కానంత బాగున్నాయి. అవే బోదురుకప్పల అరుపులు.
కప్పమ్మ గెంతుతూ గడప తొక్కింది. చూరు నుండి కారుతున్న వర్షపునీరు శుభం అంది. కప్పలెగిరి గెంతేటంత వాన వస్తోంది. ఇంక ఈ వర్షానికి పొలంలో బంగారం లాంటి పంట పండుతుంది.