SCERT AP Board 7th Class Telugu Guide Answers 8th Lesson ఎద Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 8th Lesson Questions and Answers ఎద
7th Class Telugu 8th Lesson ఎద Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి గమనించావు?
జవాబు:
చిత్రంలో కొండలు, చెట్లు, వాటి దిగువున గుడిసెలు గమనించాను. అక్కడ రకరకాల మనుషులను, జంతువులను, పక్షులను కూడా గమనించాను.
ప్రశ్న 2.
చిత్రంలోని వారు ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలోని పిల్లలు కొంతమంది పాఠశాలకు వెడుతున్నారు. కొంతమంది చదువుకొంటున్నారు. ఒకామె వంట వండుతోంది. కొంతమంది స్త్రీలు గంపలతో సరుకులు మోసుకొని వెడుతున్నారు. చిత్రంలో అందరూ స్త్రీలు, చిన్నపిల్లలే ఉన్నారు. అందరూ ఏవో పనులు చేసుకొంటున్నారు.
ప్రశ్న 3.
ప్రకృతితో సంబంధం కలిగి జీవనం సాగిస్తున్నవారి గురించి చెప్పండి.
జవాబు:
ప్రకృతితో దగ్గరి సంబంధం కలిగి, ప్రకృతిలో కలిసిపోయి గిరిజనులు జీవిస్తారు. వారు అడవులలోని కొండచీపుర్లు, షీకాయి, చింతపండు మొదలైనవి సేకరించి అమ్ముకొని జీవిస్తారు. వారికి మాయామర్మం తెలియదు. చాలా అమాయకులు.
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
సకాలంలో వర్షాలు పడనపుడు రైతులు చూసే ఎదురుచూపులకు గల కారణాలను మీ మాటల్లో చెప్పండి. . (వ్రాయండి)
జవాబు:
సకాలంలో వర్షాలు పడితే పంటలు పండుతాయి. అప్పులు తీరతాయి. తిండికి లోటుండదు. వర్షాలు పడకపోతే దుక్కి దున్నిన పొలంలో విత్తనాలు చల్లలేరు. మొలకలు రావు. పంటలు పండవు. అందుకే రైతులు వర్షం కోసం విపరీతమైన ఆత్రుతతో ఎదురుచూస్తారు. ఏ కాలంలో చేయవలసిన పని అప్పుడే చేయాలి. వర్షాలు ఆలస్యమైతే అదను దాటిపోతుంది. అదను దాటితే విత్తనాలు చల్లినా పంట దిగుబడి తగ్గిపోతుంది.
ప్రశ్న 2.
పోలమ్మ వర్షం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నదో మీ మాటల్లో చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
పోలమ్మ పొలంలో ధాన్యం చల్లింది. వర్షం వస్తేనే అవి మొలకెత్తుతాయి. వరిచేను తయారౌతుంది. వర్షం లేక గోగు మొక్కలు కూడా వాడిపోతున్నాయి. వర్షం వస్తే అవీ బ్రతుకుతాయి. అందుకే పోలమ్మ వర్షం కోసం ఎదురు చూస్తోంది.
ప్రశ్న 3.
పోలమ్మకు నిద్ర పట్టకపోవడానికి గల కారణాన్ని సొంతమాటల్లో చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
పోలమ్మకు గతమంతా గుర్తుకు వచ్చింది. అడవులు తగ్గిపోవడం వలన వర్షాలు రావని అందరూ అనే మాటకు కలవరపడింది. తమ గ్రామం రూపురేఖలు మారిపోవడం గుర్తుకు వచ్చింది. తను ప్రేమించడం, ఇద్దరు పిల్లలకు తల్లి అవ్వడం గుర్తుకు వచ్చింది. తమకు పట్టాలివ్వడం గుర్తుకు వచ్చింది. ఇన్ని ఆందోళనలతో పోలమ్మకు నిద్రపట్టలేదు.
ప్రశ్న 4.
కింది కరపత్రాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
ప్రజలారా !
ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం. ప్రకృతిలోని సమస్త జీవకోటిని కాపాడటం మన బాధ్యత. చెట్లు, నదులు, సమస్త జీవరాశి ప్రకృతిలో అంతర్భాగం. మనం నిర్లక్ష్యంగా చెట్లను నరుకుతూ పోవడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ప్లాస్టికను విచక్షణారహితంగా వాడటం వలన భూమి కలుషితం అవుతుంది. చెత్తా, చెదారాలతో నదులను కలుషితం చెయ్యడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా జంతువులు, పక్షులు తమ ఉనికిని కోల్పోతాయి. కాబట్టి పర్యావరణ పరిరక్షణకు మనం నడుంబిగిద్దాం. ఇది మనందరి బాధ్య త.
ఇట్లు
పర్యావరణ పరిరక్షణ సమితి, అమరావతి.
ప్రశ్నలు – జవాబులు:
అ) పర్యావరణ పరిరక్షణకు మనం ఏం చేయాలి?
జవాబు:
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే చెట్లను నరకకూడదు. ప్లాస్టిక్ వాడకూడదు.
ఆ) పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటోంది?
జవాబు:
చెత్తా చెదారాలతో నదులను కలుషితం చేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
ఇ) ఈ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారు?
జవాబు:
ఈ కరపత్రాన్ని పర్యావరణ పరిరక్షణ సమితి, అమరావతివారు ప్రచురించారు.
ఈ) కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. .
జవాబు:
పక్షులు, జంతువులు ఎందుకు తమ ఉనికిని కోల్పోతున్నాయి?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కొండ భూముల్లో వరి పంటతో పాటు ఇంకేం పండుతున్నాయి?
జవాబు:
కొండ భూములలో నీరు నిలువ ఉండదు. వర్షాలు కొండలపై పడినా నీరు లోయలలోకి వెళ్లిపోతుంది. అయినా కొండ భూములలో గిరిజనులు వ్యవసాయం చేస్తారు.
ఇక్కడ కాఫీ తోటలు, మామిడి, తేయాకు, వరి, జీడి మామిడి తోటలు మొదలైనవి పెంచుతారు. అక్కడక్కడ వరి, జొన్న, రాగులు మొదలైనవి కూడా పండిస్తారు.
ప్రశ్న 2.
పోలమ్మ నిద్రపోతున్న తన పిల్లలను చూసి ఎందుకు ఆనందపడింది?
జవాబు:
పోలమ్మ బాల్యంలో చదువుకోలేదు. అసలు బడికే పోలేదు. వాళ్ల తల్లిదండ్రుల వెనక పశువులను కాయడంతో బాల్యం గడిచిపోయింది. తన పిల్లలు బడికి వెడుతున్నారు. చదువుకొంటున్నారు. ఇంట్లో కూడా దీపం దగ్గర కూర్చొని చదువుకొంటున్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా పుస్తకాల్ని వదలలేదు. తమ దగ్గరే పెట్టుకొని నిద్రపోతున్నారు. అందుకే పోలమ్మ నిద్రపోతున్న తన పిల్లలను చూసి ఆనందపడింది.
ప్రశ్న 3.
వర్షం పడిన తరువాత పోలమ్మ పొలం వెళ్లే దారిలో ప్రకృతి ఎలా ఉంది?
జవాబు:
పోలమ్మ పొలం చేరే దారిలో ఎటుచూసినా వర్షపు నీరే. ఇంకిపోయిన నూతుల్లో నీరు, పల్లపు మళ్లలో నీరు, ఎండిపోయిన చెరువుల నిండుగా నీరు. తలలు వాల్చిన గోగుమొక్కలు తలెత్తి ఊగుతున్నాయి. ఉదయపు కాంతిలో కొండలు పచ్చలు పరిచినట్లుగా ఉన్నాయి. ఊటగెడ్డలో నీరు గలగలమంటోంది. దాహం తీరిన పక్షులు ఆనందపు కేరింతలు కొడుతున్నాయి.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పోలమ్మ గతాన్ని తలచుకొన్నప్పుడు ఆమెకు గుర్తొచ్చిన అంశాలేవి?
జవాబు:
పోలమ్మకు చాలా విషయాలు గుర్తొచ్చాయి. ఆమె చిన్నతనంలో జరిగిన పెద్ద తగువు గుర్తొచ్చింది. తగువులు తగ్గాక భూమిలేని వారికి పట్టాభూములిచ్చారు. ప్రస్తుతం ఉన్నదదే భూమి. దోమల వలన వచ్చిన (మలేరియా) జబ్బుతో ఆమె తల్లిదండ్రులు పోయారు. దోమల నివారణకు వచ్చిన వారిలో ఒకతనిని పోలమ్మ ప్రేమించింది. ఫలితంగా ఇద్దరు పిల్లల తల్లయింది. ఆ భర్త రావాలంటే వస్తాడు. లేకుంటే రాడు. కూలిపని చేసుకొని పిల్లలను పోషిస్తోంది. ఊళ్లో బడి పెట్టారు. పిల్లలకు తిండి; బట్టలు, చదువులు ఉచితంగా లభిస్తున్నాయి. ఈ విధంగా పోలమ్మకు అన్నీ గుర్తుకు వచ్చాయి.
ప్రశ్న 2.
మనకు అన్నం పెట్టే రైతు గొప్పతనాన్ని తెలుపుతూ మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
మనకు అన్నం పెట్టే రైతు ఎండనక, వాననక విశ్రాంతి లేకుండా చేలో కష్టపడతాడు. దుక్కి దున్నుతాడు. విత్తనాలు చల్లుతాడు. పంటకు ఎరువులు వేస్తాడు. పురుగుమందులు చల్లుతాడు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటాడు. పాములు, జెల్టులు, తేళ్లకు భయపడడు. పంటను కంటికి రెప్పలా కాపాడతాడు. వరి పనలు కోసి, వరి కుప్ప వేస్తాడు. సమయం చూసి కుప్ప నూరుస్తాడు. మనందరికీ భోజనాలకు లోటు లేకుండా బియ్యం అందిస్తాడు. తన సుఖం చూసుకోడు. తను తిన్నా తినకపోయినా పదిమందికి ఆహారాన్నందించే ధన్యజీవి రైతు. ఎవ్వరి దగ్గరా ఏదీ అడగడు. తనను అడిగిన వారికి లేదనడు. ఇతరుల సంపదలను, సుఖాలను చూసి ఈర్ష్యపడడు. తను సుఖపడాలని కోరుకోడు. కష్టపడడంలోనే ఆనందాన్ని వెతుక్కొంటాడు. పదిమందికీ అన్నం పెట్టడంలోనే తృప్తి చెందుతాడు.
భాషాంశాలు
అ) కింది వాక్యాలను చదివి గీతగీసిన పదాలకు అర్థాన్ని రాయండి.
ఉదా : అమ్మానాన్నలు తమ బిడ్డల్ని ఏ లోటు లేకుండా పెంచుతారు.
లోటు = లోపం
1. చిటపట చినుకులు నేలను తాకగానే మొలకలు పుట్టుకొస్తాయి.
మొలక = మొక్క
2. వర్షానికి తిరుమల ఘాటు రోడ్డులో మట్టిపెళ్ళలు జారి అడ్డుగా పడ్డాయి.
మట్టి పెళ్ళలు = మట్టి బెల్లులు
3. పారిజాత పుష్పాలు కోసిన వెంటనే వాడిపోతాయి.
వాడిపోవు = వడలిపోవు
4. కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరు కలవరం చెందుతున్నారు.
కలవరం = ఆందోళన
5. కష్టసమయంలో గుండె దిటవు చేసుకొని జీవించాలి.
దిటవు = స్థిమితం
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాల కింద గీత గీయండి.
ఉదా : చెట్లను నరకకూడదు. వృక్షాలు మనకు మేలు చేస్తాయి.
1. వర్షాలు పడి పంటలు పండాయి. వానలు కురిసి చెరువులు నిండాయి.
2. భూమాతను నమ్మినవారికి తల్లి ఆశీర్వాదం కూడా ఉంటుంది.
ఇ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.
1. నిద్ర | అ) ఆస |
2. దీపము | ఆ) నిదుర |
3. పుస్తకము | ఇ) దివ్వె |
4. పక్షి | ఈ) పొత్తం |
5. ఆశ | ఉ) పక్కి |
6. మూలిక | ఊ) దిటవు |
7. దృఢ | ఋ) మొలక |
జవాబు:
1. నిద్ర | ఆ) నిదుర |
2. దీపము | ఇ) దివ్వె |
3. పుస్తకము | ఈ) పొత్తం |
4. పక్షి | ఉ) పక్కి |
5. ఆశ | అ) ఆస |
6. మూలిక | ఋ) మొలక |
7. దృఢ | ఊ) దిటవు |
ఈ) కింది పదాలతో సొంతవాక్య ప్రయోగం చేయండి.
ఉదా : గోదావరినది గలగల ప్రవహిస్తోంది.
తహతహ – కటకట – పదేపదే – కాపలాకాయు – తలలు వంచు – కళ్ళముందు మెదలడం – చెదిరిపోవు – పరుగులుతీయు – కేరింతలు – మనసు దిటవుచేసుకొను
1. తహతహ = ఆత్రుత
సొంతవాక్యం : చదువుకొనే వయస్సులో డబ్బు సంపాదనకు తహతహలాడకూడదు.
2. కటకట = అయ్యయ్యో !
సొంతవాక్యం : కటకటా ! ఎంత కష్టము వచ్చినది.
3. పదేపదే = మాటిమాటికి
సొంతవాక్యం : పెద్దలను పదేపదే అడగకూడదు.
4. కాపలాకాయు = రక్షించడం
సొంతవాక్యం : చంటి పిల్లలను కాపలాకాయకపోతే ఎటో వెళ్లిపోతారు.
5. తలలు వంచు = తప్పు ఒప్పుకొను
సొంతవాక్యం : పౌరుషవంతులెప్పుడూ తలలు వంచుకోరు.
6. కళ్లముందు మెదలడం = గతం గుర్తుకురావడం.
సొంతవాక్యం : నా చిన్నతనంలో నేను చేసిన అల్లరి పనులింకా నా కళ్లముందు మెదులుతున్నాయి.
7. చెదిరిపోవు = మాయమైపోవు
సొంతవాక్యం : నాకు మెలకువ రావడంతో కల చెదిరిపోయింది.
8. పరుగులుతీయు = పారిపోవు
సొంతవాక్యం : మాష్టారిని చూసి విద్యార్థులు తరగతిలోకి పరుగులు తీశారు.
9. కేరింతలు = ఆనందంతో పెట్టే కేకలు
సొంతవాక్యం : పసిపాప చాక్లెట్ చూసి కేరింతలు కొట్టింది.
10. మనసు దిటవు చేసుకొను = మనసును గట్టిపరుచుకొను
సొంతవాక్యం : కష్టాలు వచ్చినపుడే మనసు దిటవు చేసుకోవాలి.
ఉ) కింది వాటిలో నిత్య ఏకవచనాలను, నిత్య బహువచనాలను గుర్తించండి.
వడ్లు, కందులు, అందరు, తెలుపు, మినుములు, పెసలు, ఇత్తడి, ఇనుము, కంచు . నిత్య ఏకవచనాలు : ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు నిత్య బహువచనాలు : కందులు, వడ్లు, అందరు, మినుములు, పెసలు
ఊ) కింది వాక్యాలలో గీతగీసిన పదాలను గమనించండి. అలాంటివి మీరూ రాయండి. .
- తల్లి గంగమ్మ ఇలాంటి గోరం సెయ్యదుగాక సెయ్యదు.
- నేలతల్లి అలాగ అనదుగాక అనదు.
- ఆడు మూర్ఖ్యుడు ఇనడు గాక ఇనడు.
- అది మొండిది ఎళ్లదు గాక ఎళ్లదు.
- ఆడికి బుద్ధి రాదు గాక రాదు.
- రాముడు దరమం తప్పుడు గాక తప్పుడు.
- సంటోడు వజ్రం తినడు గాక తినడు.
- ఆడు పెల్లాన్ని సూడడు గాక సూడడు.
- ఈడు కూడు ఎట్టడు గాక ఎట్టడు.
- ఇలాంటి ఊసులు అవ్వవు గాక అవ్వవు.
వ్యాకరణాంశాలు
క్రియ
అ) కింది వాక్యాలు చదవండి. గీతగీసిన పదాలను గమనించండి.
1. నవ్య పాట పాడింది.
2. రాజు అన్నం తిన్నాడు.
గీతగీసిన పదాలను గమనిస్తే ఎవరెవరు ఏ ఏ పనులు చేశారో తెలుస్తున్నది. ఇలా ఒక వాక్యంలో పనిని తెలిపే పదానికి ‘క్రియ’ అని పేరు.
సమాపక క్రియ – అసమాపక క్రియ
ఆ) కింది వాక్యాలు చదవండి. గీతగీసిన పదాలను గమనించండి.
1. ధర్మరాజు అన్నదానం చేశాడు.
2. భీముడు కీచకుని చంపాడు.
పై వాక్యాలను గమనించారు కదా ! వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలచిన భావాన్ని పూర్తిచేస్తున్నది. కావున – ఇది ‘సమాపక క్రియ’.
ఇ) కింది వాక్యాలు చదవండి. గీతగీసిన పదాలను గమనించండి.
1. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి.
2. కర్ణుడు కవచకుండలాలను దానమిచ్చి.
పై వాక్యాలను గమనించారు కదా ! వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలచిన భావాన్ని పూర్తిచేయడం లేదు. కావున ఇది ‘అసమాపక క్రియ’.
అత్వసంధి
ఈ) కింది వాక్యాలను గమనించండి.
- సీతక్క భరతమాతకు వందనం చేసింది.
- రామయ్యకు చెట్లు అంటే ఇష్టం.
- పాఠశాల సమయపాలనను వెంకప్ప పాటిస్తాడు.
- కరోనా లాంటి వ్యాధులు రాకుండుటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- అచ్యుతరావు మేనల్లుడు బాగా చదివి గొప్పవాడయ్యాడు.
పై ఉదాహరణలను గమనిస్తే పూర్వస్వరంగా ‘అ’ ఉంది. కావున ఇది (అకార సంధి) అత్వసంధి.
ఉ) గీత గీసిన పదాలను విడదీయండి.
1. సీతక్క = సీత + అక్క
2. రామయ్య = రామ + అయ్య
3. వెంకప్ప = వెంక + అప్ప
4. రాకుండుట = రాక + ఉండుట
5. మేనల్లుడు = మేన + అల్లుడు
ప్రాజెక్టుపని
గ్రామీణ వాతావరణాన్ని సూచించే చిత్రపటాన్ని గీచి తరగతి గదిలో ప్రదర్శించి వివరించండి.
జవాబు:
చమత్కార పద్యంతం
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లిబాధ పడలేక సుమీ !
భావం :
నల్లి బాధ పడలేక శివుడు కొండపై, సూర్యచంద్రులు ఆకాశంలో, విష్ణువు ఆదిశేషునిపై నిద్రించారని, చమత్కారం.
ఉపాధ్యాయులకు సూచనలు
1. భూషణం గారి కొత్తగాలి కథలను, ఇతర రచనలను పరిశీలించండి.
2. ‘గిరిజనుల జీవన శైలి, పోడు వ్యవసాయ పద్ధతుల గురించి చదివి విద్యార్థులకు తెలియజేయండి. జ.
జవాబు:
వ్యవసాయం :
ఇది చాలా ప్రాచీనమైన సంప్రదాయ వ్యవసాయ పద్ధతి. పోడు వ్యవసాయంలో భూమిని మారుస్తారు. దీనికి నాగలిని ఉపయోగించరు. దీనికి ఒక చిన్న గొడ్డలి ఉపయోగిస్తారు. కొంత భూభాగంలో చెట్లను నరికి, మోడులు కాల్చేస్తారు. ఆ కాల్చిన బూడిద పంటకు బాగా ఉపయోగిస్తుంది. ఎరువులు వాడరు. ఇది రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఈ వ్యవసాయంలో జొన్నలు, సజ్జలు, కూరలు మొదలైనవి పండిస్తారు. రెండు మూడు సంవత్సరాలకు కలుపు మొక్కలు పెరిగిపోతాయి. ఆ భూమిని వదిలేసి మరో చోటికి వెడతారు. ఇక్కడ 15 సంవత్సరాలలో మళ్లీ అడవి పెరిగిపోతుంది. ఈ వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందులు వాడరు కనుక ఈ పంటలు ఆరోగ్యానికి మంచిది. ఈ పోడు వ్యవసాయంపై మనదేశంలో 6,20,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
పోడు వ్యవసాయం వలన అడవులు నష్టపోతున్నాం. మోడులు కాల్చినపుడు వచ్చే పొగ వలన కార్బన్ డయాక్సైడ్ కూడా సమస్యగా మారుతుంది.
కవి పరిచయం
కవి పేరు : బోనం నాగభూషణం
జననం : విజయనగరం జిల్లాలోని మేరంగి గ్రామంలో 1.7.1938న జన్మించారు.
వృత్తి : ఉపాధ్యాయులు
ప్రవృత్తి : రచనలు చేయడం
రచనలు :
భూషణం కథలు, ఏదిసత్యం – ఏదసత్యం, కొండగాలి, అడవంటుకుంది, కొత్తగాలి కథా సంకలనం మొదలైనవి.
ప్రత్యేకతలు :
వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైంది. శూలపాణి, భూషణం వీరి కలం పేర్లు. 21.5.1999న స్వర్గస్తులయ్యారు.
అర్థాలు – భావాలు
1. పోలమ్మకి ……… మామూలైపోయింది.
అర్థాలు :
కుదురు = కుంది
నిశ్చింత = ఏ ఆలోచనా లేకుండా
ఈడు = వయస్సు
అయ్య = తండ్రి
బాల్యం = చిన్నతనం
కునుకు = నిద్ర
మడి = వరిపొలము
మొలక = మొక్క
ఆశ = కోరిక
గుంపు = సమూహం
గుమ్మరించడం = ఒంపడం
నిరాశ = ఆశలేకపోవడం
మేఘాలు = మబ్బులు
2. ఇవాళ సాయంత్రం ……. కొంత తెలిసింది.
అర్థాలు :
గోగు మొక్కలు = గోంగూర మొక్కలు
ముసురు = కమ్ముకొను (వాన)
కలికాలం = కలియుగం
భీతి = భయం
మెదిలి = సంచరించి
కలవరం = ఆందోళన
విత్తనం = బీజం
సెక్క = చెక్క (చిన్న వరిపొలం)
కటకట = ఆందోళన
తగువు = గొడవ
శబ్దము = చప్పుడు
పశువు = జంతువు
మేత న = తిండి
విషయం = సమాచారం
3. భూములు కొలిచేరు …. ఆమెకి నిద్రపట్టింది:
అర్థాలు :
పట్టాలు = భూమికి సంబంధించిన కాగితాలు
జబ్బులు = రోగాలు
పోయేరు = మరణించేరు
రెక్కలు = జబ్బలు
చెయ్యి చాచడం = అడగడం
లోటు = వెలితి
బడి = పాఠశాల
ఏకైక = ఒకే ఒక
ఆధారం = ఆలంబన
వర్తమానం = ప్రస్తుతం
ఎదమళ్లు = విత్తనాలు జల్లిన పొలములు
4. పోలమ్మ నిద్ర ……. చుట్టూ తిరిగింది.
అర్థాలు :
ఉత్సాహం = హుషారు
కళకళగా = కలకలలాడుతూ
ఊటగెడ్డ = ఊటకాల్వ
ఇంపు = ఇష్టం
కేరింత = కేక
గంగతల్లి = గంగమ్మ (నీరు)
గోరం = ఘోరం
మట్టితల్లి = భూమాత
తెలదు = తెలియదు
దరణి = ధరణి = భూమి
బూదేవత = భూ దేవత
ఎద = హృదయం
పండుతాది = పండుతుంది