AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 16th Lesson బాల్య క్రీడలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 16th Lesson బాల్య క్రీడలు

7th Class Telugu 16th Lesson బాల్య క్రీడలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:

  1. పిల్లలు ఆడుకుంటున్నారు.
  2. పక్షి ఎగురుతూ ఉంది.
  3. కుక్క పరిగెడుతోంది.

ప్రశ్న 2.
చిత్రంలో పిల్లలు ఏ ఏ ఆటలాడుతున్నారు?
జవాబు:

  1. ఒకామె ఉయ్యాల ఊగుతూ ఉంది.
  2. మరికొందరు కబడ్డీ ఆడుతున్నారు.
  3. కొందరు దాగుడుమూతలు ఆడుతున్నారు.
  4. కొందరు పరుగులు పెడుతున్నారు.
  5. కొందరూ కోకో ఆట ఆడుతున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

ప్రశ్న 3.
మీకిష్టమైన ఒక ఆటను ఎలా ఆడతారో చెప్పండి.
జవాబు:
నాకు ‘వాలీబాల్’ ఆట ఇష్టం. వాలీబాల్ ఆటలో రెండు జట్లు ఉంటాయి. అటు ఆరుగురు, ఇటు ఆరుగురు. మధ్యన వాలీబాల్ నెట్ కడతారు. వాలీబాల్ ను ఒక వైపు వారు ఎదుటి వారికి సర్వీసు చేస్తారు. బంతిని అవతల వైపుకు గుద్దుతాడు. ఇవతలివారు దాన్ని అవతలి వైపుకి గెంటాలి. కింద పడిపోతే అటువైపు వారికి పాయింట్ వస్తుంది.. అలా ఎవరికి 15 పాయింట్లు ముందు వస్తే, ఆ పక్షము ఆటలో గెలుస్తుంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ గురువుల సాయంతో పద్యాలు పాడడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
పాఠంలోని ఏ ఏ పద్యాలు మీకు బాగా నచ్చాయి? ఎందువల్ల?
జవాబు:
ఈ పద్యాలలో పిల్లల ఆటలను వర్ణించిన మూడవ పద్యమూ, ఐదవ పద్యమూ బాగున్నాయి. గోపబాలుర అదృష్టాన్ని గూర్చి చెప్పిన “ఎన్నఁడునైన” అన్న పద్యము ఈ పద్యాలన్నింటిలో మణిపూస వంటిది.

ప్రశ్న 3.
ఈ పద్యాలు విన్నారు కదా ! బలరామకృష్ణులు, గోపబాలకులు ఏ ఏ ఆటలు ఆడారు? వాటిలో ఏ ఏ ఆటలను ఇప్పటి పిల్లలు కూడా ఆడుతున్నారు?
జవాబు:
బలరామకృష్ణులు కింది ‘ఆటలు ఆడారు.

  1. పిల్లన గ్రోవులు ఊదడం
  2. “అల్లి” ఆట
  3. చెట్ల పండ్లు రాలగొట్టడం
  4. జంతువుల గొంతుల పోలికగా కూతలు పెట్టడం
  5. పరుగుపందాలు
  6. బండరాళ్ళపై నుండి జారడం
  7. విచిత్ర వేషాలు
  8. చల్టి చిక్కాలు దాచడం
  9. వెనుక నుండి కళ్ళు మూయడం
  10. తినుబండారాలు దొంగిలించడం.

ఇప్పటి పిల్లలు

  1. పరుగుపందాలు
  2. వెనుకగా వచ్చి కళ్ళు మూసి, మూసింది ఎవరో చెప్పమనడం – వంటి ఆటలు నేటికీ ఆడుతున్నారు.

II చదవడం – రాయడం

1. పాఠం ఆధారంగా కింది అంశాలకు సంబంధించిన పద్యాలు ఏవో చెప్పండి. వాటి కింద గీత గీయండి.
అ) బృందావనం
ఆ) గోపబాలకుల భాగ్యం
ఇ) పిండివంటలతో ఆడుకోవడం
ఈ) ఒకరినొకరు ముట్టుకునే ఆట

అ) బృందావనం :
బృందావనం గురించి, 1వ పద్యం “కసపు గల దిరవు …… పొదడచ్చటికిన్” అనే పద్యంలో చెప్పబడింది.

ఆ) గోపబాలకుల భాగ్యం :
గోపబాలకుల భాగ్యం గురించి, 10వ పద్యం “ఎన్నఁడునైన …………. భాగ్యములింత యొప్పునే” అనే పద్యంలో చెప్పబడింది.

ఇ) పిండివంటలతో ఆడుకోవడం :
పిండి వంటలతో ఆడుకోవడం గురించి, 8వ పద్యం “తీపుగల ………….. నృపా!” అనే పద్యంలో చెప్పబడింది.

ఈ) ఒకరి నొకరు ముట్టుకునే ఆట :
ఒకరినొకరు ముట్టుకొనే ఆట గురించి, 9వ పద్యం “వనజాక్షుఁడు ………….. నరేంద్రా! ” అనే పద్యంలో చెప్పబడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2. కింది పద్యాలను చదవండి. వాటి భావం ఆధారంగా ఆ పద్యాలకు శీర్షికలు పెట్టండి.

అ) “వేణువులూఁదుచు ……………. బాల్యవిహారులగుచు” : ఈ పద్యానికి ‘గోపాలుర బాల్య విహారాలు’ అనే శీర్షిక బాగుంటుంది.
ఆ) “కపులమై జలరాశి ………. గొమరు మిగిలి” : ఈ పద్యానికి ‘గోపాలుర విచిత్ర వేషధారణ’ అనే శీర్షిక బాగుంటుంది.

3. కింది పేరాను చదవండి.

ఒకనాడు బలరామకృష్ణులూ, గోపబాలురు అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సరదాపడ్డారు. పొద్దుటే లేచి, గబగబా తమ ఇంటి లేగదూడలను బయటికి తోలుకొని వచ్చారు. అందమైన కొమ్ము బూరలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులందరూ మేల్కొన్నారు. చల్ది అన్నపు కావడులను భుజాలకు తగిలించుకొన్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండివంటలు మూటలు కట్టుకొన్నారు. కాళ్ళకు చెప్పులు వేసుకున్నారు, చేతికర్రలు పట్టుకున్నారు. లెక్కపెట్టడానికి కూడా కష్టమనిపించే తమతమ లేగలమందలను ‘హెహెయ్’ అని కేకలతో తోలుకొంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలోకి ప్రవేశించారు. బంగారు, మణి భూషణాలు ధరించి ఉన్న పూలను, చిగుళ్ళను, చిన్నచిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు.

కొమ్ముబూరలు పూరిస్తూ, పిల్లనగ్రోవులు ఊదుతూ, తుమ్మెదలతోబాటు ఝుమ్మని పాడుతూ, నెమళ్ళతో సమానంగా నాట్యంచేస్తూ, కోకిలలను, మిగిలిన పక్షులను అనుకరించి కూతలు కూస్తూ, చిలకలతోపాటు అరుస్తూ కేరింతలు కొట్టారు. పైన పక్షులు ఎగురుతూ ఉంటే వాటి నీడలతోపాటు తామూ పరుగులెత్తారు. జలజలపారే సెలయేళ్ళను చెంగున దాటారు. హంసలపక్కనే వాటిని అనుకరిస్తూ నడిచారు. కొంగలతో పాటు ఒంటికాలిమీద నిలబడ్డారు. బెగ్గురు పక్షులను తరిమితరిమి అలసిపోగొట్టారు. నదీ జలాలలో స్నానాలు చేశారు. తీగల ఉయ్యాలలు ఊగారు. గోతులలో దాక్కొన్నారు. దూరాలకు పరుగు పందాలు వేసుకొన్నారు. కోతులవలె చెట్టు ఎక్కారు. పండ్లు తిని, ఆ రుచులకు పరవశించిపోయారు. కుప్పించి దూకి, తమ నీడలను చూసి నవ్వుకొన్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. కేరింతలు కొడుతూ, పరుగెడుతూ, పడుకొంటూ, అలసిపోతూ ఇలా ఎన్నో రకాలుగా ఆటలు ఆడుకొన్నారు.

అ) పై పేరాకు వీలైనన్ని ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. బలరామకృష్ణులు దేనికి సరదా పడ్డారు?
  2. వారు వేటిని తోలుకొని వచ్చారు?
  3. బలరామకృష్ణులు గోపకుమారులను నిద్ర నుండి ఎలా లేపారు?
  4. గోపబాలకులు వేటిని భుజాలకు తగిలించు – కున్నారు?
  5. గోపబాలురు వేటిని మూటకట్టుకున్నారు?
  6. వారు కాళ్ళకు ఏమి ధరించారు?
  7. వారి లేగల మందలు ఎన్ని ఉన్నాయి?
  8. వారు లేగలను ఎలా తోలుకుంటూ వచ్చారు?
  9. వారు దూడలతో ఎక్కడ ప్రవేశించారు?
  10. గోపబాలుర అలంకారాలు పేర్కొనండి.
  11. గోపబాలురు ఎలా కేరింతలు కొట్టారు?
  12. గోపబాలురు దేనితో పాటు పరుగులెత్తారు?
  13. గోపబాలురు దేనిని దాటారు?
  14. గోపబాలురు దేని ప్రక్కన ఎలా నడిచారు?
  15. గోపబాలురు ఎలా నిలబడ్డారు?
  16. గోపబాలురు ఏ పక్షులను తరిమి అలిసి పోయారు?
  17. గోపబాలురు ఎక్కడ స్నానం చేశారు?
  18. గోపబాలురు దేనిలో ఊగారు?
  19. గోపబాలురు ఎక్కడ దాక్కొన్నారు?
  20. గోపబాలురు ఏమి పందాలు వేసుకున్నారు?
  21. వారు ఏమి ఎక్కారు?
  22. వారు దేనికి పరవశించిపోయారు?
  23. గోపబాలురు దేన్ని చూసి నవ్వుకున్నారు?
  24. ఏమి చేస్తూ గోపబాలురు ఆడుకున్నారు?

ఆ) పై పేరాకు శీర్షికను రాయండి.
జవాబు:
‘గోపబాలుర బాల్య క్రీడలు’ అనే శీర్షిక ఈ పేరాకు సరిపోతుంది.

ఇ) పై పేరాకు, పాఠానికి ఉన్న సంబంధం ఏమిటి?
జవాబు:
పాఠంలోనూ, ఈ పేరాలోనూ కూడా గోపబాలకుల ఆటలను గూర్చి వర్ణింపబడింది.

4. క్రింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) బృందావనం ఎలా ఉంది?
జవాబు:
‘బృందావనం’లో పశువులకు మేత సమృద్ధిగా దొరకుతుంది. అక్కడ అందమైన చెట్లు, కొండలు, నదులు, తీగలు ఉన్నాయి. బృందావనం నివసించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఆ) గోపబాలురతో బలరామకృష్ణులు నీటికి సంబంధించి ఏ ఏ ఆటలు ఆడారు?
జవాబు:

  1. సరస్సులలో ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొనే ‘చల్లులాట’ ఆడారు.
  2. కాలువలకు అడ్డుకట్టలు కట్టారు.
  3. కొలనులలో దిగి, చేతులతో నీళ్ళను చిలికారు.

ఇ) గోపబాలకులు నవ్వుకొనేలా ఏ ఆటలాడారు?
జవాబు:

  1. ఒకరి చల్టికావడిని ఇంకొకడు దాచాడు. వాణ్ణి మోసగించి మరొకడు దాన్ని పట్టుకెళ్ళాడు. ఇంకొకడు దాన్ని తెచ్చి అసలు వాడికిచ్చాడు.
  2. ఒకడు పరధ్యానంగా నడచివెడుతూ ఉంటే, వాడు ఉలిక్కిపడేలా మరొకడు వెనుకగా వచ్చి, పెద్దకేక పెట్టాడు. ఒకడు వెనుకగా వచ్చి, మరొకటి రెండు కళ్ళూమూశాడు. అది చూచి మరొకడు నవ్వాడు.
  3. కృష్ణుడిని ముట్టుకోవాలని ఇద్దరు పిల్లలు పందాలు వేశారు. అందులో కృష్ణుడిని ముందుగా ముట్టుకున్నవాడు, ముట్టుకోలేనివాడిని చూచి నవ్వాడు.
  4. ఒకరు తెచ్చుకున్న పిండివంటను ఒకడు లాక్కొని పారిపోగా, వాడి చేతిలోది మరొకడు లాక్కుని ఎవరికీ అందకుండా వాడు దూడల మధ్యకు పరుగుపెట్టాడు. గోపాలురు పై విధంగా నవ్వు తెప్పించే ఆటలు ఆడారు.

ఈ) పోతన గోపబాలకుల అదృష్టాన్ని ఏమని చెప్పాడు?
జవాబు:
యోగీశ్వరులు సైతం, పరమ పురుషుడు అయిన శ్రీకృష్ణుని పాదధూళిని రవ్వంత కూడా చూడలేరు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపబాలురు కౌగిలించుకున్నారు. చెట్టాపట్టాలు వేసుకున్నారు. తన్నుతూ, నవ్వుతూ, గుద్దుతూ, మీదపడుతూ కృష్ణుడితో కలిసి వారు ఆడుకున్నారు. అందువల్ల గోపబాలుర అదృష్టం ఎంతో గొప్పది అని పోతన అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పోతన పద్యాలలో చెప్పిన ఆటల్లో మీరు ఆడే ఆటలు ఏమైనా ఉన్నాయా? అవి ఏవి?
జవాబు:

  1. చెట్లపై కాయలు రాలగొడతాను
  2. చెరువులలో దిగి నీళ్ళను చిలుకుతాను
  3. నేను అప్సరసలాగా నాట్యం చేస్తాను
  4. విచిత్ర వేషాలు ధరిస్తాను.

ఆ) గోపబాలకులతో బలరామకృష్ణులు బృందావనంలో ఆటలు ఆడారు కదా ! మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ ఏ ఆటలు, ఎవరితో ఆడతారు?
జవాబు:

  1. నేను మా వీధిలో, మా చెల్లెలుతో షటిల్ ఆడతాను.
  2. మా వీధి మొదలులో మిత్రులతో కబడ్డీ ఆడతాను.
  3. మా స్నేహితురాండ్రతో పాఠశాలలో బాడ్మింటన్ ఆడతాను.
  4. నా స్నేహితులతో పాఠశాల ఆట స్థలంలో క్రికెట్ ఆడతాను.

ఇ) గోపబాలకులు ఎంతో భాగ్యవంతులని పోతన వివరించాడు కదా ! ఇలా పోతన అనడానికి కారణం ఏమిటి?
జవాబు:
శ్రీకృష్ణుడు భగవంతుడు. అవతార స్వరూపుడు. కృష్ణుని చూడాలని యోగీశ్వరులు సైతం తపస్సు, ధ్యానం వగైరా చేస్తారు. కాని వారికి కృష్ణుని దర్శనం జరుగదు. గోపాలురు ఏ యోగమూ, ధ్యానమూ లేకుండానే, కృష్ణుణ్ణి చూశారు. కృష్ణుడితో కలసి ఆడిపాడారు. అందుకే గోపాలురు భాగ్యం గొప్పదని భక్తుడైన పోతన అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పోతన సుమారు 500 సంవత్సరాల కిందట భాగవతంలో రకరకాల ఆటలను గురించి వివరించాడు కదా ! నాటి ఆటలతో పోల్చినపుడు నేటి ఆటల్లో ఏమైనా తేడాలున్నాయా? అలాగే ఆడుతున్నారా? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పోతన చెప్పిన ఆటలు చాలావరకు నేడు లేవు. నిజానికి ఇప్పుడు పిల్లలకు ఆటలు ఆడే సమయమే లేదు. కాన్వెంటులకు వెళ్ళడం, వారు చెప్పినవి రాసుకోవడం. బట్టీపట్టడంతోనే వారికి సరిపోతోంది. చాలా పాఠశాలల్లో ఆట స్థలాలే లేవు. ఆటల పోటీలు ఏడాది కొకసారి పెడతారు. కాని పాఠశాలలో దానికి తగిన శిక్షణ లేదు. తల్లిదండ్రులు కూడా, ఆటలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, కోకో వంటి ఆటలు వచ్చాయి. పరుగు పందాలు నేటికీ ఉన్నాయి. జలక్రీడలు ఉన్నాయి కాని, దానిలో ఈతకే ప్రాధాన్యం.

ఆ) బలరామకృష్ణుల బాల్యక్రీడలను గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బలరామకృష్ణులు గోప బాలకులతో కలిసి ఆడిన బాల్య క్రీడా విశేషాల గురించి వివరించండి.
జవాబు:
బలరామకృష్ణులు పిల్లనగ్రోవులు ఊదుతూ గంతులు వేశారు. కంబళ్ళతో ఎద్దులను చేసి, ఒకరినొకరు ఎదిరించుకున్నారు. అల్లులు చేసి, తమ గజ్జెలు మ్రోగేలా వాటిని తన్నారు. పండ్ల గుత్తులు రాల గొట్టారు. అడవి జంతువుల్లా అరిచారు. సరస్సుల్లో చల్లులాట. ఆడారు. ఉత్తుత్త యుద్ధాలు చేశారు. బండరాళ్ళు ఎక్కి జారారు. కాలువలకు అడ్డుకట్టారు. మునులులాగా మౌనంగా ఉన్నారు. పాటలు పాడారు. నాట్యాలు చేశారు. సరస్సుల్లో నీళ్ళు చిలికారు. చలిది చిక్కాలు దాచి, స్నేహితుల్ని ఏడిపించారు. వెనక నుంచి స్నేహితుల కళ్ళు మూసి, కేకలు పెట్టి వారిని బెదరించారు. చేతులలోని పిండివంటలను లాక్కొని పారిపోయారు. పరుగు పందాలు వేసుకొని ఆడారు.

ఎదిరించుకున్నారు. అంచారు. సరసమునులులాగా మౌనూరుల్ని ఏడిపించారు. కొని పారి

IV. పదజాలం

1. పాఠంలోని పద్యాల ఆధారంగా బలరామకృష్ణులు ఏ ఏ వస్తువులు ఉపయోగించి ఆడుకున్నారో, ఆ వస్తువుల పేర్లు రాయండి.
జవాబు:
గోపాలురు ఉపయోగించిన వస్తువులు ఇవి.

  1. పిల్లన గ్రోవి
  2. కంబళాలు
  3. అల్లులు
  4. బండరాళ్ళు
  5. చల్ది కావడి
  6. తియ్యని కజ్జములు

2) కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలను రాయండి.

అ) రాముడు కపులతో కలసి వారధి కట్టాడు.
జవాబు:
కోతులు

ఆ) నదులన్నీ జలరాశిలో కలుస్తాయి.
జవాబు:
సముద్రము

ఇ) నరేంద్రుడు రాజ్యాన్ని పాలిస్తాడు.
జవాబు:
రాజు

ఈ) ప్రావీణ్యం కోసం రోజూ అభ్యాసం చేయాలి.
జవాబు:
నేర్పు

ఉ) రామయ్యకు భాగ్యం కొద్దీ ఉద్యోగం దొరికింది.
జవాబు:
అదృష్టము

3) కింది పదాలను చదవండి. వీటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) బొబ్బపెట్టు :
మా తమ్ముడు చీకటిలో దేనినో చూచి, దెయ్యం అని భయపడి, పెద్దగా బొబ్బపెట్టాడు.

ఆ) ఒడిసిపట్టుకొని :
నీటిలో మునిగిపోతున్న నా మిత్రుని జుట్టును నేను ఒడిసిపట్టుకొని వాడిని పైకి లాగాను.

ఇ) కౌతుకము :
పరీక్షా ఫలితాలు తెలుసుకోవాలనే కౌతుకము మాకు ఎక్కువయ్యింది.

ఈ) వన్యజంతువులు :
చట్టం ప్రకారం వన్య జంతువులను వేటాడరాదు.

ఉ) బాల్యక్రీడలు :
ఎవరికైనా తమ బాల్యక్రీడలు గుర్తు చేసుకొంటే సరదాగానే ఉంటుంది.

ఊ) మన్ననచేయు : నేను బాగా చదువుతానని మా ఇంట్లో అంతా నన్ను మన్నన చేస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4) ప్రకృతులు – వికృతులు రాయండి.

ప్రకృతి – వికృతి
పశువులు – పసులు
రూపము – రూపు
పణితము – పన్నిదము
కుల్య – కాలువ
తపము – తబము
విద్యలు – విద్దెలు
కుమారులు – కొమరులు
కావటి – కావడి
ఖాద్యము – కజ్జెము
యోగి – జోగి
మాననము – మన్నన
ఘాసము – కసవు

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
పాఠం ఆధారంగా బృందావనం ఎలా ఉంటుందో ఊహించి చిత్రం గీయండి. రంగులు వేయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
బృందావనంలో పశువులకు పచ్చిమేత సమృద్ధిగా దొరుకుతుంది. అక్కడ అందమైన చెట్లు, కొండలు, నదులు, తీగలు ఉన్నాయి. బృందావనం నివాసయోగ్యమైన స్థలం.

బృందావనంలో సరస్సులు, కాలువలు ఉన్నాయి. కూర్చుండి తపస్సు చేసుకొనేందుకు బండరాళ్ళు ఉన్నాయి. ఈతలు కొట్టడానికి కాలువలు, సరస్సులు ఉన్నాయి.

బృందావనంలోని పచ్చిగడ్డిని మేస్తే పశువులు సమృద్ధిగా పాలు ఇస్తాయి. అక్కడ పచ్చని కొండలు ఉన్నాయి. చెట్లు అన్నీ పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. పూలతీగలు చెట్లకు దట్టంగా అల్లుకొని ఉంటాయి.

అక్కడ పచ్చికమేస్తున్న పశువులు బలిసిన పొదుగులతో చూడముచ్చటగా నడుస్తూ ఉంటాయి. ఎద్దులు కైలాసం నుండి దిగివచ్చిన శివుని నందివాహనములా అన్నట్లు ఉంటాయి.

(లేదా)

ప్రశ్న 2.
మీరు ఆడుకొనే ఆటల జాబితా తయారుచేసి, వాటిని ఉపయోగించి ఒక గేయం రాయండి.
జవాబు:
రండి రండి పిల్లలూ – ఆటలాడుదాం, ఆటలాడుదాం ||
దాగుడు మూతలూ – కోతి కొమ్మచ్చులూ
కిరికీ ఆటలూ – కుందెన గుడులూ
దూదుంపుల్లలూ – కుప్పాతన్నులూ
వెన్నెల పాటలూ – బిళ్ళా బాధుడూ || రండి రండి పిల్లలూ || ఆటలాడుదాం ||
చెడుగుడు ఆటలూ – ఉప్పట్టి కూతలూ
కొక్కో ఆటలూ – కబడ్డీ ఆటలూ
బ్యాడ్మింటన్, ఫుట్ బాలూ – వాలీబాలు, క్రికెట్టూ
లాంగు జంపు, హై జంపు – పోలు జంపు, రన్నింగులు
నడక పరుగు పోటీలు – రకరకాల ఆటలు || రండి రండి పిల్లలూ || ఆటలాడుదాం ||

VI. ప్రశంసలు

1) పిల్లలను గురించి వాళ్ళు ఆడే ఆటలను గురించి పోతన ఎంతో చక్కగా పద్యాలలో వివరించాడు కదా! ఇలా – పోతన రాసిన మరికొన్ని పద్యాలను సేకరించండి. వాటిని రాగంతో, భావంతో పాడండి.
జవాబు:
1. అలవైకుంఠ పురంబులో నగరిలోనా మూల సౌధంబు దా
పల మందారవనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోదియగు నా పన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై

2. కం|| నీపాద కమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం
తా పార భూత దయయును
తాపస మందార ! నాకు దయసేయగదే !

(లేదా)

2) బాల్య క్రీడలనే పాఠం పోతన భాగవతంలోది కదా ! భాగవతంలోని, మరికొన్ని కథలను తెలుసుకొని చెప్పండి.
జవాబు:
భాగవతంలో

  1. వామనావతారము
  2. గజేంద్రమోక్షము
  3. ధ్రువ చరిత్ర
  4. అంబరీషోపాఖ్యానం
  5. కుచేలోపాఖ్యానం వంటి కథలు చాలా ఉన్నాయి. మీ గురువుగారిని అడిగి తెలుసుకోండి.

VII. ప్రాజెక్టు పని

* మీ నాన్న, అమ్మ, మీ తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలను అడిగి, వాళ్ళ చిన్నతనంలో ఏ ఏ ఆటలు ఆడుకొనేవారో, అడిగి తెలుసుకోండి. వాటి ఆధారంగా కింది పట్టికను పూరించండి.

తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు నాన్న, అమ్మ, అత్త మొదలైన 1. మీరు ఇప్పుడు ఆడుకొనే ఆటలు | వారు చిన్నప్పుడు ఆడిన ఆటలు వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలు
మీరు ఇప్పుడు ఆడుకొనే ఆటలు
| తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు వారు చిన్నప్పుడు ఆడిన ఆటలు
నాన్న, అమ్మ, అత్త మొదలైన — వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలు
1) చెడుగుడు 2) ఉప్పాట 3) కుప్పతన్నులు 4) దూదుంపుల్ల 5) కిరికి 6) చింత గింజలు 7) వామన గుంటలు 8) పరమ పదసోపాన పటం 9) పేకాట 10) చదరంగం 11) దాగుడు మూతలు

1) కబడ్డీ 2) కోకో 3) బ్యాడ్మింటన్ 4) వాలీబాల్ 5) బాస్కెట్ బాల్ 6) రింగు టెన్నిసు 7) షటిల్ 8) క్రికెట్ 9) పులి-మేక 10) లాంగ్ జంప్ మొ||నవి.

1) అంత్యాక్షరి 2) క్రికెట్ 3) హాకీ 4) షటిల్ 5) తాడు ఆట 6) వాలీబాల్ 7) చదరంగం 8) పరుగు 9) హైజంప్ 10) చింతగింజలు 11) కిరికి 12) దాగుడుమూతలు

Note :
బలరామకృష్ణులు గోపబాలురతో ఆడిన ఆటలతో, వీటిని పోల్చండి. ఏమి గ్రహించారో చెప్పండి.
జవాబు:
ఆనాడు ఆడిన ఆటలు నేడు లేవు. కొత్త ‘ఆటలు కాలానికి తగ్గవి వస్తున్నాయి. ఈ వేళ ఆడ – మగ అందరినీ ఆకర్షించే ఆట “క్రికెట్” – ఆట.

VIII. భాషను గురించి తెలుసుకుందాం అని

అ. ఈ పాఠంలోని కింది పద్యపాదాలను గమనించి, అందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి.

1) గంతులు వేతురు కౌతుకమున
దీనిలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు
జవాబు:
‘తు’

2) పోరుదురు గికుర్తు వొడచుచు దూఱుదురు.
(దీనిలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :
జవాబు:
‘రు’

3) ఒకనొని చల్టికావడి
నొకఁ డడకించి దాచు, నొకఁ డొకఁ డదివే
టొకఁడొకఁని మొఱగి కొని చన
నొకఁ డొ ……… ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు
జవాబు:
‘క’

పై ఉదాహరణల్లో ఏ అలంకారం ఉన్నదని గుర్తించారు? వృత్త్యనుప్రాసాలంకారం.

పైన మీరు రాసిన సమాధానాలను బట్టి వృత్త్యనుప్రాసాలంకారం గుర్తించడం ఎట్లాగో తెలుసుకుందాం.

వృత్త్యనుప్రాసాలంకారం లక్షణం :
ఒకే హల్లు పునరావృత్తమైతే అంటే పలుమార్లు వచ్చినట్లైతే దాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4) పాఠంలోని మూడవ, ఐదవ పద్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
‘మూడవ పద్యంలో వృత్త్యనుప్రాసాలంకారములు ఉన్నాయి.
1) వేణువు లూదుచు వివిధ రూపములతో :
‘వ’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.

2) గంతులు వైతురు కౌతుకమున :
‘తు’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.

3) మొరయ దన్నుదు రోలి ముమ్మరముగ :
‘మ’, ‘ర’ హల్లులు, పలుమార్లు వచ్చాయి.

4) న్యజంతు చయంబుల వాని వాని :
‘వ’ హల్లు పలుమార్లు వచ్చింది.

ఐదవ పద్యంలో వృత్త్యనుప్రాసలు ఉన్నాయి.
1) మునులమై తపములు మొనయుదమా యని :
‘మ’ అనే హల్లు చాలసార్లు వచ్చింది.

2) కొమరులను సరింప కొమరు మిగుల :
‘ర’ అనే హల్లు చాలాసార్లు వచ్చింది.

గమనిక :
పై ఉదాహరణలలో ఒకే హల్లులు పలుమార్లు వచ్చాయి. కాబట్టి అవి వృత్త్యనుప్రాసాలంకారములు.

ఆ. అంత్యానుప్రాసం :
1) వేద శాఖలు వెలిసెనిచ్చట
ఆది ‘కావ్యంబలరె నిచ్చట,
ఈ గేయంలోని రెండు పంక్తుల చివరన ఉన్న పదాలు ఏవి?
మొదటి పంక్తి చివర – ఇచ్చట; రెండో పంక్తి చివర – ఇచ్చట అనే పదాలు ఉన్నాయి.

2) తలుపు గొళ్ళెం
హారతిపళ్ళెం
గుఱ్ఱపుకళ్ళెం
ఈ మూడు వరసల్లో చివర వచ్చిన పదాలు ఏవి?

  1. గొళ్ళెం
  2. పళ్ళెం
  3. కళ్ళెం అనేవి.

గమనిక :
పై ఉదాహరణలలో మీరు రాసిన సమాధానాల ద్వారా, మీరు ఒక విషయాన్ని గుర్తించి ఉండాలి. అన్ని పంక్తులూ, చివరన ఒకే రకమైన పదంతోనో, అక్షరంతోనో ముగుస్తున్నాయి. అంతే కదూ !

ఇప్పుడు మీరు ఇది అంత్యానుప్రాసాలంకారమని గుర్తించారు ‘కదూ ! ఈ అలంకారాన్ని గుర్తించడానికి లక్షణం ఏమిటో రాద్దాం.

అంత్యానుప్రాసలంకార లక్షణం :
పాదాంతంలో లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటాం.

ఇ. ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం :

* కింది తరగతిలో పోలిక చెప్పడంలో అలంకారం ఉన్నదని. అది ‘ఉపమాలంకారం’ అని తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ఉపమాలంకారం లక్షణాన్ని తెలుసుకుందాం.

ఉదా : సోముడు భీముడిలాగ (వలె) బలవంతుడు.

ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినప్పుడు వాక్యంలో ఉండే పదాలను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాం

సోముడు – ఉపమేయం (అంటే ఎవరిని గురించి చెప్తున్నామో ఆ పదం)
భీముడు – ఉపమానం (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)

బలవంతుడు – సమానధర్మం – పోల్చడానికి వీలయిన సమానగుణం (ఉపమేయ ఉపమానాలలో ఉన్న ఒకే విధమైన ధర్మం) లాగ (వలె) – ఉపమావాచకం (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

గమనిక :
ఇక్కడ ఉపమాన, ఉపమేయాలకు చక్కని సామ్యం అంటే పోలిక – చెప్పటం జరిగింది. ఇలా చెప్పటాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.

ఉపమాలంకార లక్షణం :
“ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారము’.

ఈ. ఉత్ప్రేక్షాలంకారము :
ఆరో తరగతిలో, ఊహించి చెప్పడంలో ఒక అలంకారం ఉందని తెలుసుకున్నారు కదా ! అది ‘ఉత్ప్రేక్షాలంకారం’. ఇప్పుడు దీని లక్షణం తెలుసుకుందాం.

ఉదా : ‘ఆ ఏనుగు నడిచే కొండా! అన్నట్టు ఉంది’.

పై వాక్యాన్ని గమనించండి. ఇందులో కూడా పోలిక కనబడుతున్నది కదూ? ఈ పోలిక అనేది ఊహించి చెప్పినది.

ఈ వాక్యంలో ఉపమేయం – ‘ఏనుగు’, ఉపమానం – ‘నడిచే కొండ’.
ఇక్కడ ఏనుగును కొండలా ఊహిస్తున్నామన్నమాట.
దీన్ని బట్టి ఉత్ర్ఫేక్ష అలంకారం లక్షణాన్ని కింది విధంగా చెప్పవచ్చు.

ఉత్ప్రేక్షాలంకార లక్షణం : ఉపమేయాన్ని మరోకదానిలా (ఉపమానంగా) ఊహించి చెప్పడం ‘ఉత్ప్రేక్ష’.

కింది వాక్యాల్లోని అలంకారములు గుర్తించండి.

1. గోపి సూర్యుడిలాగ ప్రకాశిస్తున్నాడు.
జవాబు:
పై వాక్యంలో ‘ఉపమాలంకారము’ – ఉంది. ఇందు ‘గోపి’ని ‘సూర్యుడి’తో పోల్చారు.

2. మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉంది.
జవాబు:
పై వాక్యంలో ‘ఉత్ప్రేక్షాలంకారము’ – ఉంది. ఇందు ‘మండే ఎండ’ ‘నిప్పుల కొలిమి’గా ఊహించడం జరిగింది.

II. లఘువులు, గురువులు గుర్తించుట

మీరు చదువుకొనే పద్యాలు, గేయాలు, పాటలు ఒక పద్ధతిలో రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. కదూ ! అలా ఎందుకు ఉంటాయంటే వాటిని కవులు కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. ప్రతి నియమానికి కొన్ని గుర్తులు ఉంటాయి.

1) కింది అక్షరాలను పలకండి.

1) అ, ఇ, ఉ, ఋ, ఎ, ఒ
క, చి, తు, టె, ప, జొ
ఘ, ఝ, థ, ధ, భ, స, హ

పైన వ్రాసిన అక్షరాలను ఒక్కోటి పలకటానికి ఎంత సమయం పడుతున్నది?

గమనిక :
వీటిని పలకటానికి కనుటెప్ప పాటు అంతకాలం, లేక చిటికె వేసే అంతకాలం పడుతుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2) ఆ, ఈ ఊ, ఏ, ఐ, ఓ, ఔ, అం
గౌ, జం, డం, దా

పైన వ్రాసిన అక్షరాల వంటి అక్షరాలలో ఒక్కో అక్షరాన్ని పలకటానికి ఎంత సమయం పడుతున్నది? గమనించారా?

(1) లో సూచించిన అక్షరాలు పలకటానికి, (2) లో సూచించిన అక్షరాలు పలకటానికి పట్టే సమయంలో కొంత తేడా కనబడుతున్నది కదూ !

(1) లో వ్రాసిన అక్షరాలు పలకటానికి కనుటెప్పపాటు కాలం పడుతుంది లేదా చిటికె వేసేటంత కాలం పడుతుంది.
(2) లో వ్రాసిన అక్షరాలు పలకటానికి చిటికె వేసేటంత కాలం కంటె ఎక్కువ సమయం పడుతుంది.

గమనిక :
మరి వీటిని గుర్తు పట్టేందుకు మనవారు గుర్తులను ఏర్పాటు చేశారు – ఆ గుర్తులు ఏమిటో చూడండి.

రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలు – అంటే మనం హ్రస్వాక్షరాలుగా పిలుచుకొనే అక్షరాలను ‘l’ గుర్తుతో సూచిస్తాం. ఈ గుర్తును ‘లఘువు’ అని అంటాం. ‘l’ = లఘువు.

లఘువు పలికే సమయం కంటె ఉచ్చారణకు ఎక్కువ సమయం అవసరం అయ్యే అక్షరాలను ‘U’ గుర్తుతో సూచిస్తాం. ఈ గుర్తును గురువు అంటాం. ‘U’ = గురువు.

గమనిక :
లఘువు మన అంకెల్లోని ’19, గురువు ఆంగ్ల అక్షరాలలోని ‘U’ ను పోలి ఉంటాయి.

* ఈ పదాలను చూడండి. వీటిలోని అక్షరాలను ఎలా సూచించారో గుర్తించండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 2

గమనిక :
అయితే గురులఘువులను గుర్తించటానికి మనం మరికొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

3) కింది పదాలను చూడండి.

1) తర్కం 2) మెట్ట 3) చూడగన్ 4) నష్టం వీటిలో
‘ర్క’ – ఇది సంయుక్తాక్షరం కదూ!
‘ట్ట’ – ఇది, ద్విత్వక్షరం కదూ!
‘గన్’ – ఇందులో “గ”న్ అనే పొల్లుతో కూడి ఉంది కదూ!
మరి ఇలాంటప్పుడు ‘లఘుగురువులను ఎలా గుర్తించవచ్చునో చూడండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 3

వీటిలో ఏం గమనించారు? సంయుక్తాక్షరాల ముందున్న అక్షరాన్ని గురువుగా గుర్తించాం కదూ!

* అంటే సంయుక్తాక్షరం ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించాలి.
ఈ కింది పదాలలో గురులఘువులను ఎలా గుర్తిస్తామో చూడండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 4

వీటిలో ద్విత్వాక్షరం ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించాం కదూ!

* అంటే సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరాల విషయంలో ఒకే విధానాన్ని పాటిస్తాం.
ఇక –
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 5

* వీటిలో పొల్లుతో కూడిన అక్షరాలను గురువుగా గుర్తించాం కదూ!
ఇలా లఘుగురువులను గుర్తించడం అనేది పద్యాలు రాయటానికి ఉపయోగపడే నియమాల్లో మొదటి నియమం. మిగిలిన విషయాలను పై తరగతుల్లో నేర్చుకుందాం.

4) కింది పదాలకు లఘువు, గురువులను గుర్తించండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 6

కవి పరిచయం

పాఠ్యభాగం పేరు : “బాల్య క్రీడలు”
కవి పేరు : బమ్మెర పోతన
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా
దేని నుండి గ్రహింపబడింది : ‘ఆంధ్రమహా భాగవతం’ దశమస్కంధం నుండి గ్రహింపబడింది.
రచనలు : 1) భోగినీ దండకం
2) ఆంధ్రమహా భాగవతం
3) వీరభద్ర విజయం

బిరుదు : “సహజ పండితుడు.

1. బాల్య క్రీడలు పాఠ్యభాగ రచయిత పోతన కవిని గూర్చి పరిచయం చేయండి.
జవాబు:
‘బాల్య క్రీడలు’ అనే పాఠం పోతన మహాకవి రచించిన ఆంధ్రమహా భాగవతము దశమ స్కంధములోనిది. పోతన 15వ శతాబ్దము వాడు. ఈయన తెలంగాణలో వరంగల్లు జిల్లా బమ్మెర గ్రామంలో పుట్టాడు. ఈయనకు ‘సహజ పండితుడు’ అనే బిరుదు ఉంది.

పోతన గారు ఆంధ్రమహా భాగవతము, భోగినీ దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము అనే గ్రంథాలు రచించాడు. పోతనగారి పద్యం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1వ పద్యం : – కంఠస్థ పద్యం
* క. కసవు గల దిరవు పసులకు,
లస దద్రినదీ మహీజ లతికావలి పెం
పెసఁగును, గాఁపురమునకును, .
బొసఁగును బృందావనంబు వొదఁడచ్చటికిన్.
ప్రతిపదార్థం :
బృందావనంబు = బృందావనము అనే ప్రదేశము ఉంది.
కసవు = గడ్డి (పశువులకు మేత)
కలదు = (అక్కడ) ఉంది
పసులకున్ = పశువులకు
ఇరవు = (అది) అనుకూలమైన చోటు
లసత్ = ఒప్పుచున్న
అద్రీ = పర్వతములు (క్రీడా పర్వతములు)
నదీ = నదులూ
మహీజ = చెట్లు
లలితావలి (లతికా + ఆవలి) = తీగల సమూహమును
పెంపు = ఇంపుగా (అందముగా)
ఎసగును = (అక్కడ) ఉంటాయి
కాపురమునకును = (మనము) నివసించడానికి
పొసగును = (అది) అనుకూలంగా ఉంటుంది
అచ్చటికిన్ = ఆ బృందావనానికి
పొదఁడు = పోదాం రండి.

భావం :
‘బృందావనం’ అనే ప్రదేశం ఉంది. అక్కడ పశువులకు మేత సమృద్ధిగా దొరుకుతుంది. అక్కడ అందమైన పర్వతాలూ, నదులూ, చెట్లూ, తీగలూ ఉన్నాయి. అది నివసించడానికి తగినట్లుగా ఉంటుంది. అక్కడికి పోదాం పదండి.

గమనిక :
ఉపనందుడు అనే ముసలి గోపాలకుడు, మిగిలిన గోపాలురతో ఈ మాట చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2వ పద్యం :
వ. ఇట్లు బృందావనంబుఁ జెందిఁయందుఁగొంతకాలంబునకు
రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడికొని
వేడుక లూదు కొన దూడలఁ గాచుచు.
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా
బృందావనంబున్ + చెంది = బృందావనానికి పోయి
అందున్ = అక్కడ
కొంతకాలంబునకు = కొంతకాలానికి
రామకృష్ణులు = బలరామకృష్ణులు
సమాన వయస్కులు + ఐన = తమతో సమానమైన వయస్సు కలవారైన
గోపబాలకులన్ = గోపాల బాలురను
కూడికొని = కలిసికొని
వేడుకలు = సంతోషములు
ఊడుకొనన్ = నాటుకొనేటట్లు (సంతోషంతో)
దూడలన్ + కాచుచు = దూడలను కాస్తున్నారు.

భావం :
ఇలా బృందావనం చేరిన కొంత కాలానికి, బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలిసి, ఆనందంగా దూడలను కాస్తున్నారు.

3వ పద్యం : కంఠస్థ పద్యం
* సీ. వేణువు లూఁదుచు వివిధరూపములతో
గంతులు వైతురు కౌతుకమున,
గురుకంబళాదుల గోవృషంబులఁబన్ని
పరవృషభము లని ప్రతిఘటింతు,
రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జెలు
మొరయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ
బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి
వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప,

తే.గీ. వన్యజంతుచయంబుల వాని వాని,
వదరు వదరుచు వంచించి పట్టఁబోదు,
రంబుజాకరములఁజల్లులాడఁజనుదు
రాకుమారులు బాల్యవిహారులగుచు.
ప్రతిపదార్థం :
ఆ కుమారులు = ఆ బాలురైన రామకృష్ణులు
బాల్య విహారులు + అగుచు = చిన్నతనంలో ఆటలు ఆడుతూ
వేణువులు = పిల్లన, గ్రోవులు
ఊదుచున్ = ఊదుతూ
వివిధ రూపములతోన్ = రకరకాల వేషాలతో
కౌతుకమునన్ = ఉత్సాహంతో
గంతులు వైతురు = గంతులు వేస్తారు
గురుకంబళ + ఆదులన్ = పెద్ద పెద్ద కంబళ్ళు మొదలయిన వాటితో
గోవృషంబులన్ = ఆబోతులను (ఎద్దులను)
పన్ని = తయారు చేసి
పరవృషభములు + అని = అవి శత్రువుల ఎద్దులు అని
ప్రతిఘటింతురు = వాటిని ఎదిరిస్తారు
అల్లులు = బట్టలతో తయారు
చేసిన బొమ్మలు
దట్టించి = కూరి, (గుడ్డలతో కూరి)
అంఘ్రుల = (తమ) కాళ్ళ;
గజ్జెలు = గజ్జెలు
మొరయన్ = మ్రోగేటట్లు
ముమ్మరముగా = ఎక్కువగా
ఓలిన్ = వరుసగా
తన్నుదురు = ఆ బొమ్మలను తన్నుతారు
పన్నిదంబులు = పందెములు
వైచి = వేసుకొని
ఫల మంజరులన్ = పండ్ల గుత్తులను
ప్రావీణ్యము + ఒప్పన్ = నేర్పుగా
కూల్చి = పడగొట్టి
వ్రేటులాడుదురు = దెబ్బలాడుకుంటారు
వన్యజంతుచయంబులన్ = అడవి జంతువుల సమూహములను
వాని వాని = ఆయా జంతువుల యొక్క
వదరు వదరుచున్ = కూతలవలె కూస్తూ (అరపులవలె అరిచి వాటిని ఆకర్షించి)
వంచించి = వాటిని మోసగించి
పట్టన్ + పోదురు = వాటిని పట్టుకోబోతారు
అంబుజ + ఆకరములన్ = తామరపూలు నిండిన సరస్సులలో
చల్లులు + ఆడన్ = ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొనే జలక్రీడలు ఆడడానికి
చనుదురు = వెళతారు

భావం :
ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ, రకరకాల వేషాలు ధరించి సంతోషంగా గంతులు వేస్తున్నారు. పెద్ద పెద్ద కంబళ్ళను కప్పుకొని, ఎద్దుల రూపాలు తయారుచేసి, అవి శత్రువుల ఎద్దులని వాటిని ఎదిరిస్తారు. బట్టలతో తయారుచేసిన బొమ్మలను తన్నుతూ ఆడుతుంటే, వాళ్ళ కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమంటున్నాయి. పండ్ల గుత్తులను రాలగొట్టడానికి పందెములు వేసుకొని వారు తమ నేర్పరితనాన్ని చూపిస్తున్నారు.

అడవి జంతువుల కూతలను అనుకరిస్తూ అరుస్తూ, ఆ జంతువులు దగ్గరకు రాగానే, వాటిని పట్టుకోబోతారు. సరస్సుల్లోకి వెళ్ళి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ బాల్య క్రీడలలో సంచరిస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4వ పద్యం :
క. పోరుదురు గికురు వొడుచుచు,
దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్
జాఱుదురు ఘనశిలాతటి,
మీఱుదు రెన్నంగరాని మెలఁకువల నృపా !
ప్రతిపదార్థం :
నృపా = ఓ రాజా ! పరీక్షిన్మహా రాజా ‘ (శుక మహర్షి భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజుకు చెబుతున్నాడు. అందువల్లనే ‘నృపా’ అంటే ఇక్కడ పరీక్షి న్మహారాజా ! అని భావం)
కికురు + పొడుచుచు = మోసగించుచు; (ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్ధాలు చేస్తూ)
పోరుదురు = పోరాడుతారు; (దొంగదెబ్బలు కొట్టుకుంటారు)
భయంబు లేక = భయం లేకుండా
తోరపుటిరవుల్ (తోరము + ఇరవుల్) = సుందరమైన ప్రదేశాలలో
దూఱుదురు = ప్రవేశిస్తారు
ఘనశిలా తటిన్ = పెద్ద బండరాళ్ళు పైకి ఎక్కి వాటిపై నుండి
జాఱుదురు = కిందికి జారుతూ ఉంటారు
ఎన్నంగరాని = ఊహింపశక్యముకాని
మెలకువలన్ = నైపుణ్యాలతో
మీఱుదురు = అతిశయిస్తారు (మించి పోతారు)

భావం :
ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్దాలు చేస్తూ, దొంగదెబ్బలు కొట్టుకుంటారు. అందమైన స్థలాలలోకి ఏ మాత్రం భయం లేకుండా పోతారు. పెద్ద పెద్ద బండరాళ్ళ పైకి ఎక్కి కిందికి జారుతూ ఉంటారు. ఈ పనులు చేయడంలో ఊహింపశక్యం కాని నైపుణ్యాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు.

5వ పద్యం : కంఠస్థ పద్యం
* సీ. కపులమై జలరాశిఁగట్టుదమా యని
కట్టుదు రడ్డంబుఁగాలువలకు,
మునులమై తపములు మొనయుదమా యని
మౌనులై యుందురు మాట లేక,
గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ
బాడుదమా యని పాడఁ జొత్తు,
రప్సరోజనులమై యాడుదమా యని
యాండు రూపుల ఁదాల్చి యాడఁ జనుదు,

ఆ.వె. రమర దైత్యవరులమై యభిం ద్రక్తమా,
యని సరోవరములయందు హస్త
దండచయముఁ ద్రిప్పి తరుతురు తమ యీడు
కొమరులనుచరింపఁ గొమరు మిగిలి.
ప్రతిపదార్థం :
కపులము + ఐ = కోతుల వలె అయి
జలరాశిన్ = సముద్రానికి
కట్టుదము + ఆ = వారధికడదామా?
అని = అంటూ
కాలువలకున్ = (దగ్గరలోని) కాలువలకు
అడ్డంబు = అడ్డుకట్టలు
కట్టుదురు = కడుతున్నారు
మునులము + ఐ = (మనమంతా) మునులవలె అయి
తపములు = తపస్సులకు
మొనయుదుమా = పూనుకుందామా (చేద్దామా?)
అని = అంటూ
మౌనులు + ఐ = మునులవలె అయి
మాటలేక = మాట్లాడకుండా
ఉందురు = ఉంటారు
గంధర్వ వరులము + ఐ = శ్రేష్ఠులైన గంధర్వుల వలె
గానవిద్యలు = సంగీత విద్యలు
మీఱన్ = అతిశయించేటట్లుగా (సంగీత విద్యా నైపుణ్యంతో)
పాడుదుమా + అని = పాడదామా ? అని;
పాడన్ + బొత్తురు = పాడడం మొదలు పెడతారు
అప్సరోజనులమై (అప్పరః + జనులము + ఐ) = అప్సరసలవలె అయి
ఆడుదమా + అని = “నాట్యం చేద్దామా? అంటూ
ఆడురూపులన్ = ఆడువేషాలను
తాల్చి = ధరించి
ఆడన్ = నాట్యం చేయడానికి
చనుదురు = సిద్ధం అవుతారు
అమర, దైత్యవరులము + ఐ = దేవతలూ, రాక్షస శ్రేష్ఠులమూగానై
అబ్దిన్ = సముద్రాన్ని
త్రత్తమా + అని ఆ మథిద్దామా అంటూ
హస్తదండచయమున్ = (తమ) కట్టల వంటి చేతులతో
త్రిప్పి = నీళ్ళు చిలికి
తమ + ఈడు = తమతో సమాన వయస్సుగల
కొమరులు = కుమారులు
అనుచరింపన్ = అనుసరించి తమగ వెంట రాగా
కొమరు మిగిలిన్ = సౌందర్యము అతిశయించేటట్లు (కనుల విందుగా)
తరుతురు = నీటిని చిలుకుతారు.

భావం :
మనము అంతా కోతుల వలె సముద్రానికి వారధి కడదామా? అంటూ, కాలువలకు అడ్డుకట్టలు కడుతున్నారు. మునులవలె తపస్సు చేద్దామా? అంటూ, మాట్లాడకుండా మునులులాగా కూర్చుంటున్నారు. గంధర్వులవలె చక్కగా పాటలు పాడుదామా ? అంటూ, చెవులకు ఇంపుగా పాడుతున్నారు. మనం అంతా అప్సరసల వలె నాట్యం చేద్దామా? అంటూ, ఆడువేషాలు వేసుకొని నాట్యం చేస్తున్నారు. “మేము దేవతలం, మీరు రాక్షసులు, మనం కలిసి సముద్రాన్ని మథిద్దామా?” అంటూ, సరస్సులలో నీళ్ళను చేతులతో చిలుకుతున్నారు. ఈ విధంగా తమ ఈడు పిల్లలతో కలిసి బలరామకృష్ణులు ఆటలాడు తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

6వ పద్యం :
క. ఒకనొకని చల్దికావడి,
నొకఁడొకఁ డడకించి దాఁచు, నొకఁడొకఁడది వే
ఱోకనొకని మొఱగికొని చన
నొకఁడొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా !
ప్రతిపదార్థం :
ఉర్వీనాథా = ఓ రాజా ! (పరీక్షిన్మహా రాజా!)
ఒకనొకని = ఒకానొక పిల్లవాడి యొక్క
చల్టికావడిన్ = చలిది అన్నం మూట తెచ్చుకున్న కావడిని (చిక్కాన్ని)
ఒకడొకడు = ఒకానొకడు (ఒక పిల్లవాడు)
అడకించి = బెదరించి
దాచున్ = దాస్తాడు
ఒక డొకడు = ఇంకొకడు
అది = ఆ కావడిని
వేఱోకనొకని = ఇంకో బాలుడిని
మొఱగికొని = దాచిన వాడిని మోసగించి
చనన్ = పట్టుకొని పోగా
ఒకడు = ఇంకో పిల్లవాడు
అది = ఆ కావడిని
తెచ్చి + ఇచ్చు = తీసుకొని వచ్చి మొదటి వాడికి ఇస్తాడు

భావం :
ఒకని చల్ది కావడిని (చిక్కాన్ని) మరొకడు బెదరించి తీసుకొని ఒక చోట దాచాడు. దాచిన వాణ్ణి మోసగించి ఇంకొకడు ఆ చిక్కాన్ని తీసికొని వెళ్ళాడు. వాడి దగ్గర నుంచి వేరొకడు తెచ్చి మొదటి వాడికి దాన్ని ఇచ్చాడు.

7వ పద్యం : కంఠస్థ పద్యం
* క. ఒక్కఁడు ము న్నే మటి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్, వే
ఱోక్కఁడు ముట్టి తటాలున,
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్.
ప్రతిపదార్థం :
ఒక్కడు = ఒక పిల్లవాడు
మున్ను = ముందు
ఏమఱి = ప్రమాదపడి (పరధ్యానంగా ఉండి)
చనన్ = నడుస్తూ ఉండగా
ఒక్కడు = మరో బాలుడు
ఉలికిపడన్ = (నడిచేవాడు) ఉలిక్కిపడేటట్లు (త్రుళ్ళిపడేటట్లు)
బలు బొబ్బ = పొలికేక (పెద్దకేక)
పెట్టున్ = పెడతాడు (వేస్తాడు)
వేరు + ఒక్కడు = మరో పిల్లాడు
ముట్టి = ముట్టుకొని
తటాలునన్ = అకస్మాత్తుగా
ఒక్కడు = మరో పిల్లాడు
నగగన్ = నవ్వేటట్లు
ఒక్కని = ఒక పిల్లవాని
కనుదోయిన్ = కన్నుల జంటను
మూయున్ = మూస్తాడు .

భావం :
ఒకడు పరధ్యానంగా నడుస్తూంటే, ఇంకొకడు వెనుక నుండి గట్టిగా కేకపెడతాడు. అది విని వాడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, ఇంకొకడు వెనుక నుండి వచ్చి మరొకడి కళ్ళు రెండూ మూశాడు. అది చూసి వేరొకడు నవ్వుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

8వ పదం: కంఠస్థ పద్యం
* క. తీపుగల కట్ట మన్యుఁడు,
గోపింపఁగ నొడిసి పుచ్చుకొని పోవాఁడుం
బైపడి యదిగొని యొక్క ఁడు,
కేపులలో నిట్టునట్టుఁగికురించు నృపా !
ప్రతి పదార్థం :
నృపా = ఓ రాజా (పరీక్షిత్తు మహారాజా!)
కోపింపగన్ = కోపం వచ్చేటట్లు
తీపు + కల = తియ్యదనం కల
కజ్జము = పిండివంటను
అన్యుడు = మరొకడు
ఒడిసి పుచ్చుకొని = బలవంతంగా పట్టుకొని
పోలాడ్రున్ = పారిపోవును
ఒక్కడు = మరొకడు
పైపడి = వాడి మీద పడి (పిండి వంట లాగుకున్న వాడి మీద పడి)
అది + కొని = వాడి చేతిలోని పిండి వంటను తీసికొని
క్రేపులన్ = దూడల మధ్యన
ఇట్టునట్టున్ = ఇటూ అటూ
కికురించున్ = తప్పించుకొని తిరుగుతాడు

భావం :
ఒకడి చేతిలోని పిండి వంటను మరొక్కడు లాక్కొని పారిపోతున్నాడు. పిండి వంట తెచ్చుకొన్న వాడికి చాలా కోపం వచ్చింది. కాని ఆ పారిపోతున్నవాడి దగ్గరి నుంచి దాన్ని మరొకడు లాక్కొనిపోయి దూడల మధ్య అటూ ఇటూ తిరుగుతూ వాడికి తాను దొరకకుండా వీణ్ణి ఏడిపిస్తున్నాడు.

9వ పద్యం : కంఠస్థ పద్యం
* క. వనజాక్షుఁడు మున్నరిగిన,
మునుపడఁగా నేనెయతని ముట్టెద’ ననుచుం
గని మును ముట్టనివానిన్,
మును ముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా !
ప్రతిపదార్థం :
నరేంద్రా = ఓ రాజా !
వనజాక్షుడు (వనజ + అక్షుడు) = పద్మముల వంటి కన్నులు కలవాడైన శ్రీకృష్ణుడు
మున్ను = ముందుగా
అరిగినన్ = వెళ్ళగా (నడుస్తూ ఉంటే)
అతనిన్ = ఆ శ్రీకృష్ణుని
మునుపడగా = ముందుగా
నేనె = నేనే
ముట్టెదన్ = ముట్టుకుంటాను
అనుచుంగని = అంటూ చూచి
మును = ముందుగా
ముట్టనివానిన్ = ముట్టుకోలేనివాణ్ణి (చూచి)
మునుముట్టినవాడు = ముందుగా శ్రీకృష్ణుణ్ణి ముట్టుకొన్న పిల్లవాడు
మొనసి = గట్టిగా ప్రయత్నించి
నవ్వున్ = నవ్వుతున్నాడు

భావం :
కృష్ణుడు ముందు నడుస్తూ ఉంటే చూసి, ఇదరు బాలురు “కృష్ణుణ్ణి ముందుగా ఎవరు ముట్టుకుంటారో చూద్దాం” అని పందెం వేసుకున్నారు. వారిలో ముందుగా వెళ్ళి కృష్ణుని ఒకడు ముట్టుకున్నాడు. వాడు కృష్ణుని ముందుగా ముట్టుకోలేని పిల్లవాణ్ణి చూసి, గట్టిగా నవ్వుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

10వ పద్యం : -కంఠస్థ పద్యం
ఉ. ఎన్నఁడునైన యోగివిభు లేవ్వని పాదపరాగ మింతయుం
గన్నులఁగానరట్టి హరిఁ గౌఁగిటఁ జేర్చుచుఁ జెట్టఁబట్టుచుం
దన్నుచుగ్రుద్దుచున్ నగుచుఁదద్దయు ఁబైపడి కూడి యాడుచున్
మన్నన సేయు వలవకుమారుల భాగ్యము లింత యొప్పునే?
ప్రతిపదార్థం :
యోగి విభులు : యోగీశ్వరులు (మహాయోగులు)
ఎన్నడునైనన్ = ఎప్పుడైనా
ఎవ్వని = ఏ శ్రీకృష్ణుని
పాదపరాగము = పాద ధూళిని
ఇంతయున్ = రవ్వంతయైనా
కన్నులన్ = తమ కన్నులతో
కానరు = చూడలేకపోయారో
అట్టిహరిన్ = అటువంటి శ్రీకృష్ణుని
కౌగిటన్ = కౌగిలిలో
చేర్చుచున్ = చేర్చుకుంటూ (ఆలింగనం చేసికొంటూ)
చెట్టపట్టుచున్ = చెట్టాపట్టాలు వేసికొంటూ (భుజాలపై చేతులు వేసికొంటూ)
తన్నుచున్ = ఒకరినొకరు తన్నుకుంటూ
గ్రుద్దుచున్ = గుద్దుకుంటూ
నగుచున్ = నవ్వుకుంటూ
తద్దయున్ = మిక్కిలి (ఎక్కువగా)
పైబడి (పైన్ + పడి) . = మీదపడి
కూడి + ఆడుచున్ = కలసి ఆడుకుంటూ
మన్నన + చేయు = ఆదరించే
వల్లవ కుమారులు – గొల్లపిల్లల (గోపబాలుర)
భాగ్యములు = నా అదృష్టములు
ఇంత ఒప్పునే = ఎంత గొప్పవో కదా !

భావం :
యోగి శ్రేష్ఠులు సైతం, పరమ పురుషుడయిన శ్రీకృష్ణుని పాదధూళిని రవ్వంత కూడా తమకన్నులతో చూడలేరు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపబాలురు కౌగిలించు కుంటున్నారు. చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. తన్నుకుంటున్నారు, గుద్దుతున్నారు. నవ్వుతూ మీదపడుతూ కలిసి ఆడుకుంటున్నారు. ఈ గోప బాలకుల అదృష్టం ఎంత గొప్పదో కదా?

గమనిక :
ఈ మాట పోతన కవి అంటున్నాడు. మనం అందరం ఇలాగే అనుకోవాలి.