SCERT AP State 7th Class Telugu Textbook Solutions 3rd Lesson ఆనందం (కథ) Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu Solutions 3rd Lesson ఆనందం (కథ)
7th Class Telugu 3rd Lesson ఆనందం (కథ) Textbook Questions and Answers
ఇవి చేయండి
ప్రశ్న 1.
‘ఆనందం’ కథ ఎలా ఉంది ? దీన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
‘ఆనందం’ కథ చక్కగా ఉంది. విద్యార్థులు, బడులకు సెలవులు ఇచ్చే రోజులలో వ్యర్థంగా వారు కాలాన్ని గడపరాదని, సంఘానికి మేలు కల్గించే మంచి పనులు ఆ రోజుల్లో విద్యార్థులు చేయాలని, ఈ కథ సూచిస్తుంది. ఈనాడు సమాజంలో ముసలివారు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఒకనాడు సంఘానికి ఎంతో సేవ చేసినవారే. అటువంటి ముసలివారికి సంతోషం కల్గించే ఒక నాటకం ప్రదర్శించడం, వారికి వృద్ధాశ్రమాలలో కాలక్షేపానికి రేడియో, టేప్ రికార్డరు ఇవ్వడం, అన్నవి మంచి ఆదర్శనీయమైన విషయములని, నా అభిప్రాయము.
ప్రశ్న 2.
సెలవులలో సుశీల్, సునీత, సాగర్లు నాటకం వేశారు కదా ! మరి మీరు సెలవులలో ఏమేం చేస్తారు?
జవాబు:
నేను సెలవులలో మా గ్రామంలో మిత్రులతో కలసి ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని చేపడతాను. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరాన్ని గురించి మిత్రులతో కలసి ప్రచారం చేస్తాను. నీరు – చెట్టు ఆవశ్యకతను గూర్చి గ్రామంలో ప్రచారం చేస్తాను. దసరా సెలవుల్లో రోడ్ల వెంబడి మొక్కలు నాటుతాను. వేసవి సెలవుల్లో స్నేహితులతో – కలిసి మా గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వుతాను. మా ఊరి చెరువును శుభ్రం చేస్తాను.
ప్రశ్న 3.
సుశీల్, సాగర్, సునీత నాటకం వేసి, దాని ద్వారా డబ్బు పోగుచేసి, వృద్ధులకు సహాయపడ్డారు కదా ! అట్లాగే ఏ – ఏ మంచి పనులు ఎవరెవరి కోసం చేయవచ్చు?
జవాబు:
- గ్రామాలలో, నగరాలలో పరిశుభ్రత యొక్క అవసరాన్ని గూర్చి ప్రచారం చేయవచ్చు.
- పోలియో చుక్కలు పిల్లలకు వేయించవలసిన అవసరాన్ని గురించి, హెపటైటిస్ ఎ, బి ఇంజక్షన్లు అందరూ చేయించుకోవాల్సిన అవసరాన్ని గూర్చి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయవచ్చు.
- గ్రామాలలో మంచినీటి వసతులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గూర్చి, ‘చెట్టు – నీరు’ యొక్క ఆవశ్యకతను గూర్చి, ప్రచారం చేయవచ్చు.
- గ్రామాలలో చందాలు వసూలు చేసి గ్రామానికి ఉపయోగించే కార్యక్రమాలను చేపట్టవచ్చు.
- గ్రామంలో గుడి, బడి, ఆరోగ్య కేంద్రాలను బాగుచేయించవచ్చు.
ప్రశ్న 4.
ఈ కథలో మీకు బాగా నచ్చిన సంఘటన ఏది? ఎందుకు?
జవాబు:
ఒకనాడు సంఘం యొక! అభివృద్ధికి ఎంతో సేవ చేసిన వ్యక్తులు నేడు. ముసలివారై పోయారు. ఈ రోజుల్లో ముసలివారైన తల్లిదండ్రులను వారి పిల్లలు సహితం పట్టించుకోవడం లేదు. అటువంటి రోజుల్లో, గ్రామంలోని ‘ పిల్లలు అంతా, వృద్ధాశ్రమంలోని ముసలివారికి సంతోషం కోసం, రేడియో, టేప్ రికార్డర్లు ఇవ్వడం, వారికి నవ్వు తెప్పించే నాటకాన్ని తాము ప్రదర్శించడం నాకు బాగా నచ్చాయి. పిల్లలు వృద్ధాశ్రమంలోని . పెద్దలకు పూలగుత్తులిచ్చి, అభినందించి, వారి ఆనందానికి నాటకాన్ని ప్రదర్శించినందుకు, నాకు ఈ కథ బాగా నచ్చింది.
ప్రశ్న 5.
ఈ (ఆనందం) కథను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సుశీల్, సునీత, సాగర్‌లకు సెలవులు ఇచ్చారు. సెలవుల్లో ఏమి చేయాలో వారికి తోచలేదు. వాళ్ళు ముగ్గురూ తోటలోకి వెళ్ళి పూలు కోసి పూలగుత్తులు తయారుచేశారు. వాళ్ళకు దగ్గరలో ముసలివాళ్ళు ఉండే వృద్ధాశ్రమం ఉంది. వాళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్ళి, ఆ పూలగుత్తులను ముసలివారికి ఇచ్చారు. వాళ్ళు సంతోషించారు. అక్కడి – ముసలివారికి కాలక్షేపానికి టీవీ కానీ, రేడియో కానీ కొని ఇద్దామని ఆ పిల్లలు అనుకున్నారు.
వాళ్ళ దగ్గర రేడియో కొనడానికి సరిపడ డబ్బు లేదు. చివరకు స్కూలు నాటకాల్లో వారు నటించిన అనుభవంతో, ఒక నాటక ప్రదర్శన ఇస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. పక్క వారి నుండి కూడా కొంత డబ్బు వసూలు చేద్దామనుకున్నారు. నాటక ప్రదర్శనను “ఛారిటీ షో”లా చేద్దామనుకున్నారు.
సుశీల్ కు నితిన్ అనే స్నేహితుడు ఉన్నాడు. వారు ‘గుశ్వం’ అనే హాస్య నాటికను ప్రదర్శన చేద్దామని సంభాషణలు రాసుకొని, రిహార్సల్సు చేశారు. ఒక రోజున వృద్ధాశ్రమంలో ఆ నాటకాన్ని ప్రదర్శించారు. అక్కడి వృద్ధులు ఆ నాటకం చూసి సంతోషించారు. అందరూ ఇచ్చిన డబ్బు రూ. 800తో, ఒక రేడియో, టేప్ రికార్డర్ కొని, వృద్ధాశ్రమానికి ‘వారు ఇచ్చారు. ఆ పిల్లలు సెలవులను అద్భుతంగా గడిపారు.
ప్రశ్న 6.
సుశీల్, సాగర్, సునీతల స్థానంలో మీరే ఉంటే, మీ మిత్రులతో కలిసి వృద్ధాశ్రమానికి ఎలా సాయపడతారు? ఆలోచించి రాయండి.
జవాబు:
నేను, మా మిత్రులతో కలసి మా నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి, చందాలు వసూలు చేసి, ఆ డబ్బుతో వృద్ధాశ్రమంలోని ముసలివారికి కొన్ని మంచి పుస్తకాలు కొని ఇస్తాను. రామాయణం, భారతం, భాగవతం, కొని ఇస్తాను. వారికి కాలక్షేపానికి ఒక టీవీ, టేప్ రికార్డర్ కొని ఇస్తాను.
మా మిత్రులకు నాటికలలో నటించడం, బుర్రకథ చెప్పడం అలవాటు ఉంది. మేము వృద్ధాశ్రమంలో ఒక ఛారిటీ షో ఏర్పాటుచేసి, దానిలో నటిస్తాము. మాకు సినిమా పాటలు పాడడం బాగా వచ్చు. మేము మ్యూజికల్ నైట్ (Musical Night) ఏర్పాటుచేసి మా గ్రామస్థులందరినీ పిలుస్తాము. తల్లిదండ్రులు దేవుళ్ళవంటివారని, వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచడం మంచిది కాదని, తమ ఇంట్లోనే ఉంచుకోవాలని ప్రచారం చేస్తాము.
కఠిన పదములకు అర్థములు
సాహసోపేతం (సాహస + ఉపేతం) = సాహసంతో కూడినది
సాహసము = చేయడానికి శక్యం కాని పని చేయడానికి ఉత్సాహం
దిండు తొడుగులు = తలగడ గలేబులు
కుషన్లు (Cushions) = కూర్చుండే మెత్తటి దిండ్లు
లాన్లు (Lawns) = పచ్చిక బయళ్ళు
వంటకాలు – అన్నము మొదలయిన తినే పదార్థాలు
తాజాగా = సరికొత్తదిగా
కళకళలాడుతూ = మంచి ప్రకాశవంతంగా
వృద్ధాశ్రమం (వృద్ధ + ఆశ్రమం) = ముసలివారు ఉండే ఆశ్రమం
ఒంటరిగా = ఏకాకిగా (ఒక్కడూ)
కృతజ్ఞతలు = ధన్యవాదములు
దైవప్రార్థన = దేవుడిని ప్రార్థించడం
గొడవ = అల్లరి
ప్రదర్శన = చూపించడం (నాటకం వేయడం)
స్టేజి (Stage) = రంగము, నాటకశాల
ఛారిటీ షో (Charity show) = ఒక మంచి పనికి సహాయ పడటానికి ధనం కొరకు ఇచ్చే ప్రదర్శన
తుళ్ళుతూ = ఉప్పొంగుతూ
ప్రింట్ చేద్దాం (Print చేయు) = అచ్చు వేద్దాం
విరాళం = ధర్మకార్యాలు చేయడానికి సంతోషంతో ఇచ్చే ధనము
సంభాషణలు = మాటలు (నాటకంలో పాత్రధారుల మాటలు)
సేకరించారు = కూడబెట్టారు (పోగు చేశారు)
రిహార్సల్సు (Rehearsals) = నాటకాన్ని జనం ముందు ఆడడానికి ముందు, వేరుగా ఆడి చూసుకోడాలు)
దర్శకత్వం (Direction) = నాటకంలో ఎలా నటించాలో మార్గం చెప్పడం
ఆహ్వానించాలి = పిలవాలి
అనుమతి = సమ్మతి (అంగీకారము)
ఉత్కంఠతో = ఇష్ట వస్తువును పొందడానికి పడే తొందరతో
కర్టెన్ (Curtain) = తెర
బ్రహ్మాండంగా = చాలా గొప్పగా
అద్భుతంగా = ఆశ్చర్యకరంగా
అభినందించారు = ప్రశంసించారు
హాస్య సన్నివేశాలు = నవ్వు తెప్పించే ఘట్టములు
టేప్ రికార్డరు = రికార్డు చేసిన పాటలను తిరిగి వినిపించే యంత్రము
వృద్ధులంతా = ముసలివారు అంతా
దీవించారు = ఆశీర్వదించారు