SCERT AP 8th Class Social Study Material Pdf 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు
8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
“పాశ్చాత్య విద్య, క్రైస్తవ మత ప్రచారాలు భారతదేశంలోని సామాజిక మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి” – దీనితో నీవు ఏకీభవిస్తావా? ఎందుకు? (AS2)
జవాబు:
ఏకీభవిస్తున్నాను ఎందుకనగా :
యూరోపియన్ కంపెనీలతో పాటు అనేకమంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించటానికి వచ్చారు. అప్పటి స్థానిక మత ఆచరణలను, నమ్మకాలను వాళ్లు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోమని ప్రజలకు బోధించసాగారు. అదే సమయంలో వాళ్లు అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పారు. పేదలకు, అవసరమున్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వపనులు చేపట్టారు. ఇది ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దోహదపడింది.
అనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకూ, హిందూ, ఇస్లాం మతనాయకులకూ మధ్య తమతమ మత భావనలను సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలియటమే కాకుండా తమ తమ మతాలలోని మౌలిక సూత్రాలను తరచి చూసేలా చేసింది. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదివారు. పురాతన సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పుస్తకాలు ఐరోపా భాషలలోకి అనువదించడంతో దేశ సంపన్న, వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు. వారి మతాలలోని తమ భావనలను కొత్తగా వ్యాఖ్యానించడానికి వీలు కలిగింది.
ప్రశ్న 2.
సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రాముఖ్యత ఏమిటి? (AS1)
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రముఖ పాత్ర వహించింది.
ప్రశ్న 3.
అనేక దేవుళ్లను ఆరాధించటం, విగ్రహారాధన, సంక్లిష్ట సంప్రదాయాలు వంటి వాటిని మాన్పించటానికి మత సంస్కరణలు ప్రయత్నించాయి. ఈ సంస్కరణలను ప్రజలు ఆమోదించారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
అనేక దేవుళ్ళు, దేవతలను, గుడిలో విగ్రహాలను ఆరాధించటం, బ్రాహ్మణ పూజారులను పూజించటం, బలులు ఇవ్వటం, హిందూమతంలోని మౌడ్యం, మూఢాచారాలను వదలి పెట్టడానికి మతసంస్కరణ ఉద్యమాలు ప్రయత్నించి ఫలితాలు సాధించాయి. సనాతన, సాంప్రదాయ ఆచారాలు, పద్ధతులు వదలి పెట్టడానికి ప్రజలు ఒప్పుకోలేదు సరికదా అనేక దాడులకు దిగారు. ముస్లింలలో కూడా సంస్కరణలకు అంగీకరించక, సనాతన మతాచారాలు కొనసాగించారు. ఆధునిక విజ్ఞానం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను సైతం మౌఖ్యాలు తిరస్కరించారు.
కాని తదనంతర కాలంలో చర్చోపచర్చలు ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నాక, యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళలపట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం, ఆంగ్లవిద్య ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు మార్పును అంగీకరించి తమ జీవితంలో కొత్త కోణం ఆలోచించారు.
ప్రశ్న 4.
రమాబాయి వంటి వ్యక్తులు వితంతువుల పరిస్థితిపై ప్రత్యేక కృషి ఎందుకు చేశారు? (AS1)
జవాబు:
రమాబాయి, సావిత్రీబాయి ఫూలే వంటి వ్యక్తులు మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సహాయపడటానికి జీవితాలను అంకితం చేసారు. వితంతు మహిళలపై సమాజం చాలా చిన్న చూపు చూసింది. సమాజంలో అపశకునంగా, దుశ్శకునంగా భావించి, బయట తిరగనిచ్చేవారు కాదు. తెల్లచీర కట్టి, గుండు చేయించి, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు సుమంగళులైన ఇతర మహిళలు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళకూడదు. భర్త చనిపోవడమే ఆమె దురదృష్టం. ఆమె నుదుట మీద అనేక కష్టాలు ఉన్నాయి, ఇంకా ఈ కట్టుబాట్లు పేరుతో వితంతువులను హింసించడం సామాజిక దుశ్చర్యగా రమాబాయి వంటి సంస్కర్తలు ప్రతిఘటించారు. ఆత్మస్టెర్యం పెంచి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సమాజం మెచ్చేటట్లు వితంతువులు బ్రతికేందుకుగాను వృత్తి విద్యలు, స్వయం ఉపాధి పథకాలు అందించారు. వితంతువులు విద్యావంతులైతే మార్పు వస్తుందని భావించి, బొంబాయి లాంటి పట్టణాలలో “శారదాసదన్” వంటి పాఠశాలలు, ఆశ్రమాలు ఏర్పరిచి, ఆత్మ విశ్వాసం పెంచేటట్లు కృషి చేసారు.
ప్రశ్న 5.
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర వివరించండి. (AS1)
జవాబు:
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర :
- రాజారాంమోహన్ రాయ్ బెంగాల్ లో 1772లో జన్మించాడు.
- అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అన్నింటిలోని సారం ఒకటేనని గ్రహించాడు.
- ఇతరుల మతాలను విమర్శించవద్దన్నాడు.
- హేతు బద్ధంగా ఉన్న, ప్రయోజనకరమైన మత భావనలను అంగీకరించమన్నాడు.
- అనేక రచనలు చేసి ప్రజల్లో తన భావజాలాన్ని నింపాడు.
- ‘బ్రహ్మసమాజం’ను స్థాపించాడు.
- ‘సతి’ ని నిర్మూలించడానికి తోడ్పడ్డాడు.
- స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డాడు.
ప్రశ్న 6.
ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించటంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:
- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్’ ముస్లింలకు, బ్రిటిషు వారికి మధ్య నున్న శత్రుత్వం అంతం కావాలని భావించాడు.
- ప్రగతి సాధనకు ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ, ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద వాటా పొందాలని భావించాడు.
- ఆధునిక విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావించారు. అందుకే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించారు.
ప్రశ్న 7.
‘అంటరాని’ కులాలను మిగిలిన వాటితో సమానంగా చేయటానికి వివిధ నాయకులు వివిధ పద్ధతులను అనుసరించారు. ఫూలే, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీజీ వంటి నాయకులు సూచించిన చర్యల జాబితాను తయారు చేయండి. (AS3)
జవాబు:
అనాదిగా సమాజంలో అట్టడుగు వర్గాలైన శ్రామిక ప్రజలను శూద్రులుగా, అంటరాని వాళ్ళుగా చూపేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి వాళ్ళు, వీళ్ళను దేవాలయములోనికి ప్రవేశం కల్పించలేదు. అందరిలా నీళ్ళు తోడుకోవడానికి, చదవటం, రాయటం నేర్చుకోనిచ్చే వాళ్ళు కాదు. మత గ్రంథాలను చదవనివ్వలేదు. గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి అమలయ్యేది. ఉన్నత కులాలకు ! సేవ చేయటమే వీళ్ళ పనని భావించారు. ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, గాంధీజీ, నారాయణగురు వంటివారు పోరాడారు. వీళ్ళకై జీవితాలను అంకితం చేసారు.
జ్యోతిబాపూలే :
ఉన్నతులమని భావించే బ్రాహ్మణులు వంటి వారి వాదనను ఖండించాడు. శూద్రులు (శ్రామిక కులాలు), అతిశూద్రులు (అంటరానివాళ్ళు) కలసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయటానికి “సత్యశోధక సమాజ్” అన్న సంస్థను స్థాపించాడు. అంటరాని వాళ్ళుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన వాళ్ళకొరకు పాఠశాలను స్థాపించి, తాను తన భార్య సావిత్రి పూలే కృషి చేసారు.
డా||బి. ఆర్. అంబేద్కర్ :
బాల్యంలోనే తానే స్వయంగా కుల వ్యవస్థను సంస్కరించడానికి నడుము కట్టాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కొరకు, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకొనే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. “భారతదేశ రాజకీయ భవిష్యత్తు” సమావేశంలో సైతం దళితుల హక్కుల కొరకు కృషి చేసి, దళితులకు రిజర్వేషన్లు సాధించాడు. దళితుల సంక్షేమానికి “ఇండిపెండెంట్ లేబర్ పార్టీని” స్థాపించాడు. రాజ్యాంగ రచనలో, కూడా అంటరానితనాన్ని రూపు మాపడానికి అనేక అధికరణలు పొందుపరిచారు.
మహాత్మాగాంధీ :
మహాత్మాగాంధీ అంటరానితనం నిర్మూలన కొరకు విశేషంగా కృషి చేసారు. అంటరాని కులాల వాళ్ళకు గాంధీజీ ‘హరిజనులు’ అని నామకరణం చేసాడు. అంటే “దేవుడి ప్రజలు” అని పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు.
నారాయణగురు :
మనుషులందరిదీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు. ఈయన కులవివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. బ్రాహ్మణపూజారులు లేని పూజా విధానాన్ని అనుసరించాడు. “గుడులు కట్టటం కంటే బాలలకు బడులు కట్టటం ఎంతో ముఖ్యమని చెప్పాడు.
భాగ్యరెడ్డి వర్మ :
దళితుల సంక్షేమం, హక్కుల కొరకు విశేషంగా కృషి చేసినవాడు భాగ్యరెడ్డి వర్మ. దళితులే ఈ ప్రాంత , మూలవాసులని, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను అణచివేసారని చెప్పాడు. కాబట్టి దళితులు “ఆది ఆంధ్రులు” అని పిలుచుకోవాలని చెప్పాడు. దళితులలో చైతన్యం నింపడానికి, 1906లో “జగన్ మిత్రమండలి భాగ్యరెడ్డి, ప్రారంభించాడు. దళిత బాలికలను దేవదాసీలు లేదా జోగినులుగా మార్చడాన్ని వ్యతిరేకించాడు.
ప్రశ్న 8.
ఈనాటికి కూడా కులం ఎందుకు వివాదాస్పద విషయంగా ఉంది? వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమం ఏది? (AS4)
జవాబు:
‘కులం’ అనేది వాస్తవానికి వ్యక్తిగతమయిన ఆచారం. ఇది వారి వారి ఆచార, వ్యవహారాల వరకు పాటించుకోవాలి. అంతేకాక ఎవరి కులం వారికే గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాల్లో ‘కులం’ అనేది ఇప్పటికే పునాదిగా నిలబడి ఉంది. దీన్ని దాటడానికి అగ్ర వర్ణాలుగా పిలువబడేవాళ్ళు, నిమ్న కులాలుగా పిలువబడే వాళ్ళు, ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే ఈ ‘కులాన్ని’ సంఘపరమైన విషయాలలోకి తేవడం మూలంగా ఇది వివాదాస్పద విషయంగా ఉంటోంది.
ఉదా :
ఇరువురు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తే అది రెండు కులాల మధ్య వివాదం తెచ్చి పెడుతోంది.
వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమంగా ‘సత్యశోధక్ సమాజ్’ జరిపిన ఉద్యమం ముఖ్యమైన ఉద్యమంగా చెప్పుకోవచ్చు.
ప్రశ్న 9.
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కర్ ఏమి సాధించదలుచుకున్నాడు? (AS1)
జవాబు:
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కరు మానవులందరూ భగవంతుడి దగ్గర ఒక్కటేనని, భగవంతుడిపై అందరికీ సమాన హక్కులుంటాయని చెప్పదలచుకున్నాడు.
ప్రశ్న 10.
భారత సమాజంలోని సామాజిక మూఢాచారాలు లేకుండా చేయటంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా దోహదపడ్డాయి? ఈనాడు ఎటువంటి సామాజిక మూఢాచారాలు ఉన్నాయి? వీటిని ఎదుర్కోటానికి ఎటువంటి సంఘ సంస్కరణలు చేపట్టాలి? (AS4)
జవాబు:
భారత సమాజంలో పూర్వకాలం నుండి కూడా అనేక సామాజిక మూఢాచారలు కులవివక్ష, మతోన్మాదం, స్త్రీలపట్ల వివక్షత బాల్యవివాహాలు, సతీసహగమనం, పరదాపద్ధతి, వితంతు స్త్రీల జీవనం వంటి సామాజిక మూఢాచారలు ఉండేవి. అయితే రాజారామ్మోహన్ రాయ్ సనాతన ఆచారాలను తిరస్కరించడమే కాకుండా “సతీ” సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలను దూరం చేసాడు. బ్రహ్మసమాజం ద్వారా విరివిగా కృషి చేసి, ప్రజలలో చైతన్యం తేవడానికి కంకణం కట్టుకున్నాడు. దయానంద సరస్వతి ఆర్యసమాజం ద్వారా అనేక దేవుళ్ళు, దేవతలను గుడిలో, విగ్రహారాధన, కుల వ్యవస్థను ఖండించాడు “సత్యార్థ ప్రకాష్” గ్రంథం ద్వారా ప్రజలను మేల్కొలిపాడు. ముస్లిం సమాజంలోని సనాతన మత దురాచారాలను రూపు మాపడానికి, ఆంగ్ల విద్య ద్వారా సంస్కరణ చేయాలని, పరదా పద్దతి వంటి దురాచారాలను దూరం చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ “విజ్ఞాన శాస్త్ర సంఘం” ద్వారా కృషి చేసాడు. జ్యోతిబాపూలే, నారాయణగురు, కందుకూరి, రమాబాయి సరస్వతి వంటి సంస్కర్తలు అనేక ఉద్యమాలు ద్వారా కులవివక్ష, బాల్యవివాహాల నిషేదం, వితంతు పునర్వివాహం, వంటి వాటిని అణచడానికి కృషి చేసాడు.
ఈనాటికి కూడా మతోన్మాదం, కులవివక్ష స్త్రీలపై దాడులు, బాలికలకు విద్య లేకపోవడం వంటి సామాజిక నేరాలు మనం గమనించవచ్చు. వీటిని దూరం చేయడానికి ప్రజలలో మార్పు రావాలి. విద్యావంతులు కావాలి. చైతన్యవంతులు కావాలి. చట్టాలు, హక్కులు, న్యాయస్థానాలను గౌరవించాలి. స్త్రీలకు సమాన హోదా, కల్పించి, ప్రోత్సహించాలి. కులవివక్షతను రూపు మాపడానికి విద్యార్థి దశనుండే సమగ్రత భావాలు పెంపొందించాలి. అన్ని మతాల సారం ఒక్కటేనని వివరించి జాతీయ సమగ్రతను పెంచాలి.
ప్రశ్న 11.
బాలికల విద్య ప్రాధాన్యతను తెలిపే ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
ఈనాడు సమాజంలో బాలురుతో పాటుగా బాలికలకు విద్య తక్కువగా అందిస్తున్నారు. కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు పేరిట బాలికల విద్యను మధ్యలో మాన్పిస్తున్నారు. బయటకు తిరగనీయకుండా, పంపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. కాని ఇటీవల కాలంలో తల్లిదండ్రులలో కూడా మార్పు కన్పిస్తుంది. బాలురతో పాటుగా బాలికలను కూడా ప్రోత్సహిస్తూ విద్యను అందిస్తున్నారు.
బాల్యవివాహాలు, కులవివక్షతను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అక్కడక్కడ కులవివక్షత కన్పిస్తుంటే ప్రజలలో చైతన్యం కొరకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపట్ల చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. ‘యువతీయువకులలో సామాజిక అవగాహన కొరకు కృషిచేస్తున్నారు.
ప్రశ్న 12.
సంఘ సంస్కర్తల్లో నీకు నచ్చిన గుణాలు ఏవి? అవి ఎందుకు నచ్చాయి? (AS6)
జవాబు:
సంఘ సంస్కర్తలలో నాకు నచ్చిన గుణాలు – కారణాలు :
- సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేస్తారు. దీనివలన చాలాకాలంగా దురాచారాలతో వెనుకబడిన మనం ముందంజ వేయగలం.
- దురాచారాలను రూపుమాపే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. తద్వారా ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.
- వీటిలో భాగంగా వీరు అనేక సంస్థలను నెలకొల్పుతారు. ఉదా : బాలికల విద్య కొరకు పోరాటం జరిగినపుడు బాలికలకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు.
- అవసరమైతే సనాతనవాదులనెదురొడ్డి పోరాడుతారు.
- ఉద్యమం ప్రారంభంలో సమాజం వెలివేసినంత పనిచేసినా, ధైర్యంగా ముందుకు సాగుతారు.
- నవసమాజాన్ని నిర్మిస్తారు.
8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు InText Questions and Answers
8th Class Social Textbook Page No.213
ప్రశ్న 1.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానందల దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :
- వీరిరువురూ హిందూ ధర్మశాస్త్రాలను చదివారు.
- అన్ని మతాలలోని సారం ఒకటేనని విశ్వసించారు.
- వీరిరువురూ సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ, దీనజనుల ఉద్ధరణకు, సంఘసేవకు ప్రాధాన్యత నిచ్చారు.
తేడాలు :
రామ్మోహన్ రాయ్ | స్వామి వివేకానందుడు |
అన్ని మతాలు ఒకటేనని నమ్మాడు. | హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదన్నాడు. |
బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. | రామకృష్ణ మిషను స్థాపించాడు. |
ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమన్నాడు. | మూఢాచారాలు వదలి మత ధర్మాన్ని పాటించమన్నాడు. |
ప్రశ్న 2.
యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల తొలితరం సంస్కర్తలు ఏవిధంగా ప్రభావితులయ్యారు?
జవాబు:
- ఆంగ్ల సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటితో వీరు ప్రభావితులయ్యారు. అందువలన వీరు బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం మొదలైన వాటిని అమలులోకి తెచ్చారు.
- వీరి మత బోధనలచే ప్రభావితులైన వారు ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు.
- వీరు ఆంగ్ల విద్యను అభ్యసించారు. ఈ భాషతో అనేక గ్రంథాలను చదివి జ్ఞానార్జన చేశారు. అలా అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆంగ్ల విద్యను, పాఠశాలలను ప్రోత్సహించారు.
ఈ విధంగా తొలితరం సంస్కర్తలు అనేక విషయాలలో యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల ప్రభావితులయ్యారు.
ప్రశ్న 3.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానందల మత దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :
- వీరు ముగ్గురూ హిందూ ధర్మశాస్త్రాలను విశ్వసించారు.
- ఇతర మతాలలోని మంచిని స్వీకరించి ఆచరించాలని చెప్పారు. ‘
- ముగ్గురూ సమాజసేవను ఆదర్శంగా తీసుకున్నారు.
తేడాలు :
దయానందుడు | రాంమోహన్ రాయ్ | వివేకానందుడు |
1) సనాతన సాంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించాడు. | 1) అన్ని మతాలు ఒకటేనని భావించాడు. | 1) హిందూమతం అన్ని మతాలలోకి గొప్పదని విశ్వసించాడు. |
2) ఆర్యసమాజాన్ని స్థాపించాడు. | 2) బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. | 2) రామకృష్ణ మిషను స్థాపించాడు. |
3) అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించి వేదాల ఆధారిత హిందూ మతంలోకి తిరిగి రావాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. | 3) ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమని చెప్పాడు. | 3) మౌఢ్యాన్ని, మూఢాచారాల్ని వదిలి పెట్టి హిందు మత ధర్మాన్ని పాటించాలని చెప్పాడు. |
ప్రశ్న 4.
ఈ కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఉపయోగపడింది.
ప్రశ్న 5.
మీరు DAV పాఠశాల, గురుకుల పాఠశాల, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే దేనిని ఎంచుకుంటారు? కారణాలు తెల్పండి.
జవాబు:
నేను ప్రభుత్వం నడిపే పాఠశాలలను ఎంచుకుంటాను.
కారణాలు:
- ఇక్కడ లౌకిక దృక్పథంతో బోధన జరుగుతుంది.
- అందరు విద్యార్థుల్నీ సమాన దృష్టితో చూస్తారు.
8th Class Social Textbook Page No.214
ప్రశ్న 6.
1857 తరువాత ముస్లింలు – బ్రిటిష్ మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
సంస్కరణవాద హిందువులు సనాతన వాదులతో ఘర్షణపడాల్సి వచ్చినట్లే సంస్కరణవాద ముస్లింలు కూడా వారి సనాతన మతాచారాలతో తలపడాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆధునిక విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఇంగ్లీషు విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు.
ప్రశ్న 7.
DAV పాఠశాలలు, MAO కళాశాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?
జవాబు:
DAV పాఠశాల | MAO కళాశాల |
1) దీనిని స్వామి దయానంద్ అనుచరులు స్థాపించారు. | 1) దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. |
2) దీని ద్వారా ఆంగ్ల బోధనతో పాటు హిందూమతాన్ని, దాని సంస్కృతిని పునరుద్ధరించాలని భావించారు. | 2) ఇది ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రాలను బోధించటానికి ప్రయత్నించింది. |
3) చివరలో ఇది వేదమతాన్ని మాత్రమే బోధించేలా మారింది. హరిద్వార్‌లో గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. | 3) ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. |
ప్రశ్న 8.
తమ సంస్కరణ’ భావాలను సమర్ధించుకోవటానికి సంస్కర్తలందరూ తమ తమ ప్రాచీన మత గ్రంథాలను కొత్త కోణంలో చూడటానికి ప్రయత్నించారన్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు. ప్రముఖ సంస్కర్తల ఉదాహరణలను చూసి దీనిని వాళ్లు ఎలా చేశారో తెలుసుకోండి.
జవాబు:
1) రాజారాంమోహన్ రాయ్ :
ఇతడు హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫి వంటి అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అనేక పుస్తకాలు చదవటం వల్ల అతడికి దేవుడు ఒక్కడే అన్న నమ్మకం కలిగింది. విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదని ఇతడికి అనిపించింది. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కలిగి ఉన్నాయని, ఇతరుల మతాలను . విమర్శించటం సరికాదని అతడు భావించాడు. హేతుబద్దంగా ఉన్నప్పుడు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనలను అంగీకరించాలని కూడా అతడు భావించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను అతడు కోరాడు. ముద్రణలోని కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధిక సంఖ్యలో ప్రజలకు చేరటానికి అతడు తన భావాలను పత్రికల్లో, పుస్తకాలుగా ప్రచురించాడు.
2) స్వామి వివేకానంద :
హిందూమతం ఇతర మతాలకంటే గొప్పదని వివేకానంద భావించాడు. ఇతడు ఉపనిషత్తుల – బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇవి అనువాదం అయ్యి, పెద్ద సంఖ్యలో ముద్రింపబడ్డాయి.
3) స్వామి దయానంద సరస్వతి :
అతడు వేదాలను చదివి నిజమైన మతం వాటిల్లోనే ఉందని సమ్మాడు. ఆ తరవాత హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళను, దేవతలను, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను అతడు తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుడిని పూజించాలని అతడు ప్రచారం చేశాడు. మిగిలిన అన్ని మతాలను అతడు తప్పు మతాలుగా తిరస్కరించి, ఇతర మతాలకు మారిన హిందువులను షేధాల ఆధారంగా ఉన్న హిందూమతంలోకి తిరిగి రావాలని భావించాడు.
ప్రశ్న 9.
భక్తి ఉద్యమంలో భాగంకాని మత భావనలను సంస్కర్తలు ప్రచారం చేశారా?
జవాబు:
లేదు. సంస్కర్తలు అందరూ భక్తి ఉద్యమంలోని మత భావనలనే ఎక్కువగా ప్రచారం చేశారు.
8th Class Social Textbook Page No.215
ప్రశ్న 10.
సంఘసంస్కరణ కోసం ప్రభుత్వం చట్టాలు చేయటం ఎందుకు ముఖ్యమైంది?
జవాబు:
19వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రిటిష్ అధికారులలో చాలామంది కూడా భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను, విమర్శించసాగారు. రాజా రామ్మోహన్‌రాయ్ వాదాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆలకించారు. ఆవిధంగా 1829లో ‘సతి’ ని నిషేధించారు. వితంతు పునర్వివాహా చట్టాన్ని 1855లో చేసారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అనేక చట్టాలు అవసరమని భావించారు.
ప్రశ్న 11.
వితంతు పునర్వివాహాన్ని సమర్ధించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ మధ్య సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
1856 సం॥రం – మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సందర్భం – ఊరు కలకత్తా.
శ్రీకాంత్ ఛటర్జీ :
వాహ్వా ! ఈ రోజు ఈ దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు. భారతదేశంలో మహిళల కష్టాలు కడతేరిన రోజు. ఆ భగవంతుని కృప వీరిపై సదా వర్పించుగాక.
ముఖేశ్ బందోపాధ్యాయ :
ఎంత నీచంగా మాట్లాడుతున్నావు శ్రీకాంత్ బాబూ ! ఇది మనని పరలోకంలో శిక్షలనుభవించేలా చేస్తుంది. విధవకు మళ్ళీ పెళ్ళి ! ఆమె వివాహం ద్వారా ఒక ఇంటికి గృహిణిగా వెళ్ళి అక్కడ వంశవృద్ధికి తోడ్పడుతుంది. అలాంటిది మరోసారి మరో ఇంటికా ! అయ్యో ! భగవంతుడా రక్షించు నా దేశాన్నీ, దేశవాసులనూ.
రాజ్యలక్ష్మి:
ఇది నిజంగా సుదినం శ్రీకాంత్ బాబూ ! మా ఆడవారికి చిన్నవయసులో వృద్దులతో వివాహం, వారి మరణంతో వీరు విధవలై, జీవితాంతం అత్త వారిళ్ళలో ఉచితంగా ఊడిగం చేయటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇది మంచి ఆరంభం. ఆ భగవంతునికి శతకోటి కృతజ్ఞతలు.
8th Class Social Textbook Page No.217
ప్రశ్న 12.
బాలుర మాదిరిగా బాలికల చదువులకు ఈనాడు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారా? లేక బాలికలు వివక్షతకు, ‘గురవుతున్నారా?
జవాబు:
ఈనాడు బాలుర మాదిరిగా బాలికల చదువుకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో బాలికల నమోదే ఎక్కువగా ఉంటోంది అని చెప్పవచ్చు. కానీ ఎక్కడో కొన్ని కుటుంబాల్లో మాత్రం బాలికలు వివక్షకు గురి అవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాక కొన్ని వెనుకబడిన రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి కనబడుతోంది.
ప్రశ్న 13.
చదువుకోటానికి బాలురు ఎదుర్కోనే ఏ కష్టాలను బాలికలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:
- బాలికలు సాధారణంగా ఉన్నత విద్యను తక్కువగా అందుకుంటున్నారు.
- బాలురు చదువుకోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారు. కానీ బాలికలకు అన్నిచోట్లకి అనుమతి దొరకటం లేదు.
- కొన్ని కోర్సులలో బాలికలకు అవకాశం ఉండటం లేదు.
ప్రశ్న 14.
వితంతువుల పట్ల వ్యవహరించే తీరు ఈనాడు ఎంతవరకు మారింది?
జవాబు:
వితంతువుల పట్ల ఈనాడు సమాజ దృక్పథం మారింది అని స్పష్టంగా చెప్పవచ్చును. నేటి సమాజంలో చాలావరకు – వీరిని అందరు ఇతర మహిళల లాగానే గుర్తిస్తున్నారు. వీరికి పెద్దలే మరలా వివాహాలు చేస్తున్నారు. చేసుకోవటానికి పురుషులు కూడా వారంతటవారే ముందుకు వస్తున్నారు. కొన్ని మతపరమైన ఆచారాలలో తప్ప వీరిని అన్నింటా ఇతరులతో సమానంగానే గౌరవిస్తున్నారు.
ప్రశ్న 15.
ఈనాటికీ దళిత బాలికలు, ముస్లిం బాలికలు చదువుకోటానికి ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారా?
జవాబు:
దళిత బాలికలు ఎక్కడో ఒకటి, రెండు చోట్ల ఇతర సమాజం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారని అప్పుడప్పుడు వార్తా పత్రికలలో వార్తలు వింటున్నాం. వీరు కూడా అందరితోపాటు సమానంగానే తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముస్లిం బాలికలకు కూడా ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. వీరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చదువుకుంటున్నారు.
8th Class Social Textbook Page No.218
ప్రశ్న 16.
అంటరాని ప్రజలు అసలు చదువులేకుండా ఉండడం కంటే ఇది మెరుగని కొంతమంది భావించారు. మీరు వీళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వాళ్ళతో ఏకీభవిస్తాను. జ్యోతిబా పూలే, అంబేద్కర్లు అటువంటి కష్టనష్టాల కోర్చి విద్యనభ్యసించారు కాబట్టే వారు భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. లేకుంటే ఇప్పటికీ అదే పరిస్థితి ఉండి ఉండేది.
8th Class Social Textbook Page No.219
ప్రశ్న 17.
ఈనాటికీ జ్యోతిబా పూలే భావాలు అవసరమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి నిమ్నకులాల అభివృద్ధి కొరకు మన ప్రభుత్వాలు ‘రిజర్వేషన్లు’ అన్నిటా అమలు చేస్తున్నాయి. ఈ కులాల వారందరూ మిగతా అన్ని కులాల వారితో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆ భావాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.
ప్రశ్న 18.
నిమ్నకులాల విద్యార్థులకు ఆ కులాల ఉపాధ్యాయులే చదువు చెప్పాలని అతడు ఎందుకు అన్నాడు?
జవాబు:
శూద్రులు, అతిశూద్రులు కుల వివక్షతకు గురై పాఠశాలల్లో, కళాశాలల్లో అనేక అవమానాలకు గురౌతున్నారని అంతే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయులు, నిమ్నకులాల విద్యార్థులకు చదువు చెప్పకుండా వెలివేసే విధానంలో చదువు నేర్పిస్తున్నారని, కులవ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దీనికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి పుస్తకాలతో పాటు నిమ్నకులాల పిల్లలకోసం నిమ్న కులాల టీచర్లే చదువు చెప్పాలని తలంచాడు. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మ స్టైర్యం పెరుగుతుందని భావించాడు.
ప్రశ్న 19.
నారాయణ గురు, జ్యోతిబా పూలేల కృషిని పోల్చండి. వాళ్ళ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:
- ఇరువురూ కులవ్యవస్థను ఖండించారు.
- ఇరువురూ అనేక పాఠశాలలను స్థాపించారు.
- ఇరువురూ బ్రాహ్మణాధిక్యతను తోసిరాజన్నారు.
తేడాలు :
నారాయణ గురు | జ్యోతిబా పూలే |
1) ఈయన ఒక మత గురువు. | 1) ఈయన ఒక సంఘసంస్కర్త. |
2) కుల వివక్షత లేని దేవాలయాలను స్థాపించి, బ్రాహ్మణ పూజారులు లేని సామాన్య పూజా విధానాన్ని ప్రోత్సహించాడు. | 2) నిమ్న కులాల వారికి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని పిలుపునిచ్చాడు. వీటిలో నిమ్న కులాల ఉపాధ్యాయులే బోధించాలని చెప్పాడు. |
3) కుల వివక్షతను ఖండించాడు. అన్ని రకాల కుల వివక్షతలకు స్వస్తి చెప్పాలని చెప్పారు. | 3) నిమ్న కులాలవారు బ్రాహ్మలు లేకుండా పెళ్ళిళ్ళు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు. |
8th Class Social Textbook Page No.220
ప్రశ్న 20
కులవ్యవస్థకు సంబంధించి బుద్ధుని బోధనలను గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
బుద్ధుడు సర్వమానవ సమానత్వాన్ని చాటాడు. కుల,మత భేదాలను వ్యతిరేకించాడు. అందరినీ కలిసి ఉండమని బోధించాడు. తన పంథాను అనుసరించిన వారందరినీ సమానంగా చూశాడు.
ప్రశ్న 21.
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏవిధంగా దోహదపడింది?
జవాబు:
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిందనే చెప్పాలి. దళితులే ఈ ప్రాంతపు మూలవాసులనీ, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను బలంతో అణచివేసారని చెబుతారు. జనాదరణ పొందిన కళలను ఉపయోగించుకుని దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో ‘జగన్‌మిత్ర మండలి’ని
భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించి ఆత్మస్టైర్యం పెంచారు. దళితులకు ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కూడా వాళ్ళలో చైతన్యం వెల్లివిరిసింది.
ప్రశ్న 22.
స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికీ ఓటుహక్కు లభించిందా?
జవాబు:
సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను గాంధీజీ ఆశించి, ప్రోత్సహించారు. ఉప్పుసత్యాగ్రహం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం, రైతాంగ ఉద్యమం వంటి వాటిలో మహిళలు పాల్గొని విజయవంతం చేయడం వల్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికు ఓటుహక్కు లభించింది.
ప్రశ్న 23.
స్వాతంత్ర్య పోరాటంలోని ముఖ్యమైన మహిళా నాయకుల గురించి తెలుసుకోండి – కల్పనాదత్, అరుణ అసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ మొదలగువారు.
జవాబు:
1) కల్పనాదత్ :
ఈమెను తరువాత కాలంలో కల్పనాజోషి అని పిలిచేవారు. ఈమె చిటగాంగ్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యురాలు. పేరొందిన చిటగాంగ్ ఆయుధాల దోపిడీ కేసులో ఈమె కూడా పాల్గొన్నారు. తరువాత ఈమె కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
2) అరుణా అసఫ్ అలీ :
ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కాలంలో అరుణ గొవాలియా మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి యువతి గుండెల్లో స్ఫూర్తిని నింపారు. ఆమె ఈ కింది అవార్డులను పొందారు.
లెనిన్ ప్రైజ్ ఫర్ పీస్ – 1975
జవహర్లాల్ నెహ్రూ అవార్డు – 1991
భారతరత్న – 1998
3) కెప్టెన్ లక్ష్మీ సెహగల్ :
ఈమె 1943లో నేతాజీని సింగపూర్ లో కలిసే వరకు డాక్టరు వృత్తిలో కొనసాగారు. నేతాజీతో కలిసి మహిళా రెజిమెంట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వెంటనే ‘ఝాన్సీరాణి రెజిమెంట్’ను స్థాపించి కెప్టెన్‌గా మారారు. 1945 మేలో బ్రిటిషు వారు ఆమెను అరెస్టు చేశారు.
4) సరోజినీనాయుడు :
భారత జాతీయ కాంగ్రెస్ కు ద్వితీయ మహిళాధ్యక్షురాలు. ఆమెను నైటింగేలు ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఆమె బెంగాలు విభజన కాలంలో ఉద్యమంలో చేరారు. అనేక కవితలు రాశారు. ఈమె జన్మదినాన్ని భారతదేశంలో మహిళా దినోత్సవంగా జరుపుతారు.
5) కమలాదేవి ఛటోపాధ్యాయ :
ఈమె స్వాతంత్ర్య పోరాటంలో 1923లో సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. భారతదేశంలో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళ.
8th Class Social Textbook Page No.221
ప్రశ్న 24.
దళితుల పట్ల తమ దృక్పథంలో గాంధీజీ, అంబేద్కర్ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:
- ఇరువురూ దళితుల కోసం పాటుపడ్డారు.
- ఇరువురూ కాంగ్రెస్ వాదులే.
తేడాలు :
గాంధీజీ | అంబేద్కర్ |
1) ఈయన అగ్రవర్ణస్తుడై దళితుల కోసం పోరాడారు. | 1) ఈయన దళితుడిగా దళితుల కోసం పోరాడారు. |
2) ఈయన దళిత అభ్యర్థులకు ఎన్నికలలో సీట్లు రిజర్వు చేయించారు. | 2) ఈయన దళితులకు, దళితులే వేరుగా ఓట్లు వేయాలని భావించారు. |
3) ఈయన కాంగ్రెసులో ఉండే వారికోసం పనిచేశారు. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ లో భాగంగా చేశారు. | 3) ఈయన దళితుల కోసం ఇండిఫెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. |
4) ఈయన చివరి వరకు హిందూ మతంలోనే ఉండి దళితుల కోసం పోరాడారు. | 4) ఈయన హిందూమతాన్ని విశ్వసించలేక చివరలో బౌద్ధ మతానికి మారారు. |
ప్రశ్న 25.
ఈనాడు దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలల్లో దళితులకు సమాన హక్కులు ఉన్నాయా? వాళ్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి?
జవాబు:
నేడు దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం లభ్యమే. నీటి వనరులు, పాఠశాలల్లో చెప్పుకోవాలంటే దళితులకు సమానహక్కులే కాక, రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అంటే అందరితో పాటు సమానంగా అన్ని ప్రభుత్వం వీరికి అందిస్తోంది. అంతేకాక కొన్ని వీరి కొరకు రిజర్వు చేసి అవి వారికి మాత్రమే అందిస్తుంది. వీరు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు ఏమీ లేవనే చెప్పవచ్చు.
పట నైపుణ్యాలు
ప్రశ్న 26.
ఈ క్రింది బొమ్మలలో మత సంస్శలు సంఘ సంస్కర్తలను గుర్తించి, మీ ఉపాధ్యాయుల సహకారంతో వారి పేర్లు వ్రాయుము.
జవాబు:
ప్రశ్న 27.
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో ఏమి స్థాపించాడు?
జవాబు:
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.