AP Board 9th Class Telugu లేఖలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
పగ ప్రతీకారం మంచిది కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

మిత్రుడు రవికుమార్‌,

మిత్రమా ! నీకు స్నేహపూర్వక అభినందనలు. ఈ మధ్య నీకూ నీ ప్రక్క ఇంటి మోహనకూ తగవు వచ్చిందనీ, దానితో నీ మనస్సు బాగోలేదనీ రాశావు. నేను నీ ఉత్తరం అంతా చదివాను.

నాకు మీ తగవుకు, గట్టి కారణం ఉందని అనిపించలేదు. పగ, విరోధము, కలహము అన్న మాటలు అసలు మంచివి కావు. పగ పెంచుకొన్న కొద్దీ మన మనస్సులు పాడవుతాయి. అశాంతి పెరిగిపోతుంది. సుఖం ఉండదు.

మనం భారతం చదివితే, అన్నదమ్ముల మధ్య అకారణ విరోధం వల్ల, కౌరవ వంశం సమూలంగా నాశనమయ్యిందని తెలుస్తుంది. ఇక పాండవుల్లో కేవలం ఆ అయిదుగురూ, ద్రౌపదీ మిగిలారు. రాముడితో విరోధం పెట్టుకొన్న రావణుడు, బంధుమిత్ర పరివారంతో మరణించాడు.

ప్రస్తుత కాలంలో చూసినా, దేశాలు యుద్ధాలవల్ల సర్వనాశనం అవుతున్నాయి. గ్రామాల్లో తగవుల వల్ల కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి.

కాబట్టి నీవు నీ ప్రక్క ఇంటి మోహతో విరోధం మానివెయ్యి. స్నేహంగా ఉండు. నీ మనస్సు సుఖంగా ఉంటుంది. మనది, శాంతికాముకులయిన గాంధీ, బుద్ధుడు పుట్టిన దేశం. మరువవద్దు. ప్రక్కవారితో స్నేహంవల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.వెంకటేశ్వరరావు,
9వ తరగతి,
రవి పబ్లిక్ స్కూలు,
విజయవాడ.

చిరునామా :
కె.రవికుమార్,
S/O కె.ప్రసన్నకుమార్,
తేరు వీధి, తిరుపతి, చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాంగారి గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్నం,
x x x x x

ప్రియమైన ప్రభాకర్ కు,

మిత్రమా ! మన రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ గారి గూర్చి ఈ లేఖలో తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాంగారు సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను, అధిరోహించిన మహనీయుడు. చిన్నతనం నుండి ఆయనలో పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాస ఎక్కువ. అవే ఆయన ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా ఎదగడానికి కారణమయ్యాయి.

అబ్దుల్ కలాంగారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి, ‘భారతరత్న’ పురస్కారం అందుకొన్న గొప్ప వ్యక్తి, ఆయన భారత రాష్ట్రపతిగా భారతజాతికి అందించిన సేవలు ఎనలేనివి. ఆయన మన విద్యార్థిలోకానికి స్ఫూర్తి ప్రధాతగా భావిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. సుధాకర్.

చిరునామా :
కె. ప్రభాకర్, 9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
శ్రీకాకుళం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో పదో తరగతి చదివి, 9.7 పాయింట్స్ సాధించి, కలెక్టరు గారి నుండి బహుమతిని అందుకున్న ‘రాణి’ని ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా ? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా థమికస్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువుమానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.

ధన్యవాదాలు

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగు మాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,

చిరునామా:
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం.

ప్రశ్న 4.
వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకు అవసరమైన ప్రత్యేక ఋణసౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:

మండపేట,
x x x x

జిల్లా వ్యవసాయాధికారి గార్కి,

ఆర్యా,

విషయం :
రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక. – మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాతల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది.

మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు.

మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు.

నమస్కారములు.

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
ఎన్. శ్రీకాంత్,
మండపేట,
తూర్పుగోదావరి జిల్లా.

చిరునామా :
జిల్లా వ్యవసాయశాఖాధికారిగార్కి,
కాకినాడ,
తూ|| గో|| జిల్లా.

ప్రశ్న 5.
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళా ఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికలో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,

ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ మహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి, మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను, మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ, హైదరాబాదు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
మీ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కిరణకు,

ఉభయకుశలోపరి. ఇటీవల మా పాఠశాలలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరిపారు. మా ఊరి సర్పంచ్, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మేమంతా అంబేద్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూ, మహాత్మాగాంధీ, పింగళి వెంకయ్య మొదలైన మహనీయుల గురించి మాట్లాడాము. మా సోషల్ టీచర్ భారతుల ఫణిగారు మాకు మాట్లాడటంలో శిక్షణ ఇచ్చారు. మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను తెలియజేయి. ఇంతే సంగతులు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
కె. కిరణ్ కుమార్,
9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
రేటూరు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో జరిగిన “అమ్మకు వందనం” కార్యక్రమం గూర్చి వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం. నీవు క్షేమమని భావిస్తున్నాను. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ కార్యక్రమం బాగా జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని ఆహ్వానించారు. ఆ అమ్మలకు వారి పిల్లల చేత పాదపూజ చేయించారు. మేము అలా చేసి అమ్మ ఆశీస్సులు పొందాం. నేను, మరికొంతమంది పిల్లల అమ్మ గొప్పదనం, మా అమ్మ గొప్పతనాన్ని గొప్పగా చెప్పాము. ఆ సమయంలో మా అమ్మ కళ్ళలో నా మీద ప్రేమ తొణికిసలాడింది. ఆమె నా కోసం పడ్డ కష్టాన్ని వృధా పోనీయక బాగా చదివి మంచి స్థాయికి వెళ్ళి అమ్మను ఇంకా బాగా సంతోషించేటట్లు చేయాలని నిర్ణయించుకున్నాను. మీ స్కూలులో ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ సాయిశ్రీ ప్రసాదు.

చిరునామా :
ఎస్. కార్తీక్,
S/o బాలు,
9వ తరగతి ఎ-సెక్షన్,
ప్రభుత్వ పాఠశాల, ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 8.
మీ గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాల గురించి వివరిస్తూ నీ మిత్రునకు లేఖ వ్రాయుము.
జవాబు:

మిత్రునికి లేఖ

అప్పాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు ఫణిరామ్ కు,
ఉభయకుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు ? నీకు నేను ఇటీవల రెండు ఉత్తరాలు రాశాను. జవాబులేదు. చదువు ధ్యాసలో పడి నన్ను మరచిపోవద్దు. మొన్నీ మధ్యన మా గ్రామంలో “స్వచ్ఛభారత్” కార్యక్రమాలు నిర్వహించారు. మనం అశ్రద్ధ చేయడం వల్ల, గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా అన్నీ చెత్తా చెదారాలతో నిండిపోయాయి. దీన్ని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు ‘స్వచ్ఛభారత్’ పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా !

ఆ పిలుపునందుకొని ఎందరో పెద్దలు తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీపడుతున్నారు. ఆ క్రమంలో మా గ్రామంలో కూడా స్వచ్ఛభారత్ నిర్వహించారు. చెరువులు శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న తుమ్మచెట్లు వగైరా తొలగించారు. మురుగునీరు తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. త్రాగునీరు పరిశుభ్రంగా ఉండేట్లు చేశారు. మల, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశంలో చేయకూడదని చాటింపు వేశారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదని నిర్ణయించారు. అలాగే ‘ప్పారాగ్, గుట్కా పొగాకు’ వంటి వాటి జోలికి పోకూడదని, ఎవరూ అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏ ఒక్కరితో సాధ్యపడేది కాదు. అందరి సహకారం కావాలి. మరి మీ ఊరిలో స్వచ్ఛభారత్ నిర్వహించారా ? మరి ఆ విశేషాలు లేఖ ద్వారా తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. కిరణ్ కుమార్.

చిరునామా:
కె. ఫణిరామ్,
9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
చెరుకూరు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 9.
ప్రపంచ శాంతి ఆవశ్యకతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. మితునికి లేఖ
జవాబు:

పూళ్ళ,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం, నీవు క్షేమమని భావిస్తాను. బాగా చదువుతున్నావా? ఇటీవల మా పాఠశాలలో వ్యాసరచన పోటీలు పెట్టారు. మాకు ‘ప్రపంచశాంతి’ అంశం ఇచ్చారు. ఆ పోటీలో నేనే ప్రథమస్థానం పొందాను. నేను రాసిన పాయింట్స్ బాగున్నాయని మా మాస్టార్లు అన్నారు.

శాంతిని మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ఎప్పుడైతే మనం పరమత సహనం కల్గి ఉంటామో, ఎప్పుడైతే సోదర భావంతో అందరితో మెలుగుతామో అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. అని రాశాను. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను రాస్తావు కదూ !

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ

చిరునామా:
S. కార్తీక్,
S/o బాలసుబ్రహ్మణ్యం,
9వ తరగతి, ప్రభుత్వ పాఠశాల,
ఒంగోలు.

9th Class Telugu కరపత్రాలు

ప్రశ్న 1.
“స్వచ్చభారత్” ఆవశ్యకతను తెలుపుచూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రియమైన పర్యావరణ పరిరక్షకులారా !

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దల మాట. మనం అశ్రద్ధ చేయడం వల్ల గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. దీనిని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు స్వచ్ఛభారత్ కోసం పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకొని ఎందరో పెద్దలు తమ నగరాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మన పిల్లలు ప్రతిరోజూ ఇంటిని, అలాగే బడిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో తల్లిదండ్రులుగా మీరంతా వారికి సహకరించాలి.

ప్రభుత్వ వైద్యశాలలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బందికి, రోగులు, ప్రజలు సహకరించాలి. రోడ్లపై తుక్కు పోయకుండా, చెత్తకుండీలలోనే వేయాలి. మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు. చెరువులు, బావులు, కాలువలను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి.

మనదేశాన్ని మనమే శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలి. మనదేశం స్వచ్ఛమైనదని పేరు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం.

మనం శుభ్రంగా ఉందాం.

దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.
ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ బృందం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
పగ, ప్రతీకారం మంచిదికాదనీ, శాంతియుత జీవనం గొప్పదని తెలియజేస్తూ ‘కరపత్రం’ రూపొందించండి.
జవాబు:

కరపత్రం

ప్రియమైన మిత్రులారా !
పగ, ప్రతీకారం మంచిదికాదు, శాంతియుత జీవనం గొప్పదన్న సంగతి తెలుసుకోండి. అలనాడు రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలుకొని నేటి పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ పగతో రగిలినవారే. చివరకు ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు. పగ ఉంటే పాము ఉన్న ఇంట్లో ఉన్నట్టే. కాలుతున్న కట్టే ఇంకొక కట్టెను కాల్చగలదు. అంటే పగ, ప్రతీకారంతో రగులుతున్న వ్యక్తి ముందు తాను నశిస్తూ, ఇంకొకరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల వారు ఏం సాధిస్తారు. అందరూ ఉంటేనే కదా సమాజం. ఎవరూ లేకపోతే అది స్మశానమే.

పెద్దలు ఎప్పుడూ ఒకమాట చెబుతారు. ఏమిటంటే ‘నీ కష్టంలో నీ వెంట వచ్చే నలుగురిని సంపాదించుకో’ అని. అంటే నలుగురితో మంచిగా ఉండమని కదా ! గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ వంటి మహనీయుల వారసులుగా మనం సాధించేది ఇదేనా ? సరిహద్దుల్లో శత్రువులను పారద్రోలడానికి సైనికులున్నారు. సంఘంలోని చెడ్డవారిని ఆపడానికి పోలీసులున్నారు. మరి నీలోని శత్రువులను రూపుమాపడానికి ఎవరున్నారు ? ముందు మనం మారాలి. మన మనసును మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అంతా సంతోషమే. మనమే బాగుండాలి అన్నది స్వార్థం. ‘అందరూ బాగుండాలి ఆ అందరిలో నేనుండాలి’ అనుకోవడం పరమార్థం. శాంతిని స్థాపిద్దాం. సుఖైక జీవనం సాగిద్దాం. “శాంతి నీ ఆయుధమైతే; పగ, ప్రతీకారం నీ బానిసలు అవుతాయి.” అశాంతీ, అగ్గిపుల్లా ఒకటే. అవి కాలుతూ ఇంకొకరిని కాల్చడానికి ప్రయత్నిస్తాయి.

లోకా సమస్తా సుజనోభవన్తు
సర్వేసుజనా సుఖినోభవన్తు

ప్రశ్న 3.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

ప్రభుత్వ పాఠశాల – సౌకర్యాలు

తల్లిదండ్రులందరికీ మా విన్నపము. నేడు మన ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలతో హాయిగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు కావలసినది, చక్కని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా పోటీ పరీక్షల్లో నెగ్గిన రత్నాల వంటివారు. వారికి మంచి విద్యార్హతలు, మెరిట్ ఉంది. వారికి మంచి జీతాలు సక్రమంగా వస్తాయి. వారు మంచిగా బోధిస్తారు.

ఇక ప్రభుత్వ పాఠశాలలకు చక్కని భవనములు, ఆటస్థలాలు, ప్రయోగశాలలు ఉన్నాయి. ఆటలు ఆడించే వ్యాయామ ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. మంచినీటి సదుపాయము, విద్యుచ్ఛక్తి, ఫోను, మరుగుదొడ్లు ఉన్నాయి.

ఇక్కడ పిల్లలందరికి ఉచితంగా చదువు చెపుతారు. ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. అర్హులయిన వారికి హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టల్ విద్యార్థులకు ప్రయివేటుగా శిక్షణ చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చండి. కాన్వెంట్ల కోసం అధిక ధన వ్యయం చేసుకోకండి. బాగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసికోండి. గొప్ప గొప్ప విద్యావేత్తలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని మరచిపోకండి.

నమస్కారములు.

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ సంఘం,
కాకినాడ.

దివి x x x x x

ప్రశ్న 4.
ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులూ, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులూ, జంతువులు. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

ప్రశ్న 5.
ధనవంతులు సమాజానికి ఉపయోగపడాలి. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వృద్ధాశ్రమాలకు కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు

దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘవిద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా ? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.

మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవచేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మన కందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచి పెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు కాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.

సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్యవస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.

పేదలకు సాయం చేద్దాం
గుంటూరు జిల్లా,

పేదరికాన్ని రూపుమాపుదాం
బ్రాడీపేట 2/14, గుంటూరు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
దోమల నివారణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
దోమలపై దండయాత్ర దోమలపై దండయాత్ర యువతీ యువకులారా ! ఆలోచించండి ! ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అనారోగ్యానికి ప్రధాన కారణాలలో దోమకాటు ప్రధానమైనది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే దోమలను నివారించాలి. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిల్వ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్ళిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ వంటివి దోమల వల్లే వ్యాపిస్తాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. వాకిళ్ళు, కిటికీలకు దోమతెరలు బిగించాలి. జెట్ కాయిల్స్ వంటి వాటితో కూడా దోమలబాధ తగ్గుతుంది. కానీ మనకు శ్వాసకోశ ఇబ్బందులుంటాయి కాబట్టి సహజంగా దొరికే సాంబ్రాణి పొగ వేయడం, ఎండిన వేపాకు పొగవేయడం వంటివి దోమలను నివారిస్తాయి. పొడుగు దుస్తులు ధరించడం కూడా మేలే. దోమలను నివారిద్దాం – ఆరోగ్యాన్ని కాపాడుదాం.

ఇట్లు,
జిల్లా ఆరోగ్య పరిరక్షణ బృందం.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో ‘ప్రపంచ శాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

వ్యాసరచన పోటీ

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి X X X X X వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.

దివి X XX XX.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

9th Class Telugu అభినందన పత్రాలు

ప్రశ్న 1.
మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగు పదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రమా ! రాఘవా ! నీవు తెలుగు భాషాభిమానివి. నీవు చక్కని తెలుగును పరభాషా పదాలు లేకుండా మాట్లాడగలవు. అందుకుగాను నిన్ను తప్పక అభినందించాలి. మన మిత్రబృందంలో నీలాగా తెలుగు ఉచ్చారణ, దోషాలు లేకుండా స్వచ్ఛంగా మాట్లాడగలిగినవారు లేరు. నీవు మొన్న “భౌతికశాస్త్రము – ఉపయోగాలు” అన్న అంశం మీద వక్తృత్వం పోటీలో మాట్లాడిన విధం నన్ను బాగా ఆకట్టుకుంది. శాస్త్రవిషయిక అన్యభాషా పదాలను చక్కని పారిభాషిక పదాలతో తెలుగులో బోధించడం, మాట్లాడడం, నేడు ఉపాధ్యాయులకు సైతం కష్టంగా ఉంది. అలాంటిది నీవు అనర్గళంగా తెలుగులో ఒక్క పరభాషా పదం కూడా లేకుండా మాట్లాడావంటే అభినందించాల్సిన విషయమే. నిన్ను చూసి మేమూ అలాగే మాట్లాడాలని ప్రేరణ పొందాం. ఇదే విధంగా నీవు నీ తెలుగు భాషా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మరింత ప్రతిభతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ … ఇవే నా హార్దిక అభినందనలు.

విజయవాడ,
x x x x x

ఇట్లు,
శ్రీరామ్.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పది వాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా, నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరుతెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా, హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.

ఉంటా,

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,

 

ప్రశ్న 3.
రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయ శాఖ తరఫున ఆయన్ను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా!
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము. రైతురత్న రామయ్య గారూ!

నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరఫున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.

అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 4.
మీ తొమ్మిదో తరగతి తెలుగు దివ్వెలు – I పాఠ్యపుస్తకం గురించి పుస్తక పరిచయ నివేదికను; మీ అభిప్రాయాలను రాయండి.
జవాబు:
మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం పేరు, ‘తెలుగు దివ్వెలు’ – I అంటే తెలుగు దీపాలు అని అర్థం. ఈ పుస్తకంలో ఐదు పద్యభాగాలు, ఆఱు గద్యభాగాలు ఉన్నాయి. ఆరు ఉపవాచక వ్యాసాలు ఉన్నాయి.

పద్యభాగంలో కవి బ్రహ్మ తిక్కన గారి పద్యాలు, భారతం నుండి ఇవ్వబడ్డాయి. తిక్కన గారి తెలుగు పలుకుబడి, ఈ పద్యాల్లో కనబడుతుంది. ఇక వివిధ శతక కవుల పద్యాలు, ప్రాచీన కవిత్వానికీ, భక్తి, నీతి, ప్రబోధానికి ఉదాహరణలు. ఆడినమాట పద్యాలు, భోజరాజీయము అనే కథా కావ్యంలోనివి. దువ్వూరి రామిరెడ్డి గారి పద్యాలు, ఆధునిక పద్యానికి ఉదాహరణలు. ఆ పద్యాలు, రైతుకు వారు అందించిన నీరాజనాలు.

ఇక వచన పాఠాలలో పానుగంటి వారి సాక్షివ్యాసం, గ్రాంధిక భాషకు ఉదాహరణం. వచన పాఠములలో వివిధ వచన ప్రక్రియలను పరిచయం చేశారు. ఒక కథను, ఆత్మ కథను, లేఖను, వ్యాసాన్ని, పుస్తక పరిచయాన్ని పరిచయం చేశారు. మొత్తం పై మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం, తెలుగు సాహిత్యానికి ప్రతిరూపంగా ఉంది.

ఇక ఉపవాచక వ్యాసాలు, ఆరుగురు మహాత్ముల జీవితచరిత్రలను పరిచయం చేస్తున్నాయి. అవి మా విద్యార్థినీ విద్యార్థులకు, మంచి స్ఫూర్తి ప్రదాయకంగా ఉన్నాయి. మా తొమ్మిదో తరగతి పాఠ్య నిర్ణాయక సంఘం వారికి, నా కృతజ్ఞతలు.