AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 4 ప్రేరణ Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Telugu Solutions 4th Lesson ప్రేరణ
9th Class Telugu 4th Lesson ప్రేరణ Textbook Questions and Answers
చదవండి-ఆలోచించండి-చెప్పండి
ప్రజ్ఞ చాలా తెలివికలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీ దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తి కోసం ఉపాధ్యాయులను, పెద్దలను, అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజున విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు:
నాకు శాస్త్రవేత్తలంటే చాలా ఇష్టం. నేను కూడా మీలా శాస్త్రవేత్తను కావాలంటే ఏమి చేయాలి?
ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు:
“నువ్వు కూడా శాస్త్రవేత్తవు కావచ్చు. ముందు విజ్ఞాన శాస్త్రాన్ని బాగా చదువు. శాస్త్రంలోని ప్రాథమికాంశాలు బాగా అర్థమైతేనే పై తరగతుల్లో వచ్చే జటిలమైన విషయాలు అర్థమవుతాయి. కాబట్టి కష్టపడి కాక ఇష్టపడి చదువు” అని శాస్త్రవేత్త ప్రజ్ఞకు చెప్పి ఉంచాడు.
ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు:
నేను వైద్యుణ్ణి కావాలనుకుంటున్నాను. ఇందుకోసం విజ్ఞాన శాస్త్రాన్ని, ప్రత్యేకంగా ‘జీవశాస్త్రాన్ని’ ఇష్టంతో చదువుతాను. ఇంకా పెద్దల సలహా, సూచనల ప్రకారం నా అధ్యయనాన్ని కొనసాగిస్తాను.
ప్రశ్న 4.
అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు:
డాక్టర్|| ఏ.పి.జె. అబ్దుల్ కలామ్.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది విషయాలను చర్చించండి.
ప్రశ్న 1.
ప్రేరణ అని ‘పాఠం’ పేరు వినగానే మీకేమనిపించింది?
జవాబు:
మాకేదో కొత్త అంశాన్ని నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ పాఠం తప్పక కలిగిస్తుందనిపించింది. మహానుభావుల జీవితంలోని అనుభవాలను మాకిది అందిస్తుందనిపించింది. మాలో నిగూఢంగా ఉన్న కోరికలను, భావాలను తట్టిలేపేదిగా, వాటిని సాధించే దిశగా మమ్మల్ని సన్నద్దుల్ని చేసేదిగా ఈ పాఠంలోని అంశం ఉంటుందనిపించింది.
ప్రశ్న 2.
అబ్దుల్ కలామ్ చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి.
జవాబు:
నాడున్న బ్రిటిష్ విద్యా విధానంపై భారతీయ విద్యార్థులకు సరైన అవగాహన లేదనిపిస్తుంది. పదవతరగతి పూర్తవగానే గుమస్తా ఉద్యోగాలను పొందడానికి అర్హత కలగడంతో ఎక్కువమంది చదువుకి అదే ముగింపు అయ్యేది. నాటి గురుశిష్య సంబంధం ఎంతో ఆత్మీయతతో కూడి ఉండేదని అన్పిస్తుంది. వృత్తివిద్యల మీద అవగాహన గలవారు తక్కువమంది. నాటి విద్యావిధానం నేటి విద్యావిధానానికి చాలా దగ్గరగా ఉంది. నేటికి వలెనే పదవతరగతి వరకు మాధ్యమిక విద్యగాను, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు కళాశాల విద్యగాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్యగా ఉంది. ఇంటర్మీడియట్ తరువాత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశాలున్నాయి. కానీ అలా వెళ్ళవచ్చనే విషయం నాటి విద్యార్థుల్లో ఎక్కువమందికి తెలియదు. ఉన్నత విద్యల్లోను, కళాశాల విద్యలోను ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహంగా కొంత డబ్బును (స్కాలర్ షిప్) ఇచ్చేవారని తెలుస్తోంది. నాడు పేద విద్యార్థులలో ఎక్కువ మందికి ఉన్నత విద్యను చదివే పరిస్థితులు లేవు.
అది చాలా ఖర్చుతో కూడి ఉండేది.
ఆ) కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.
ప్రశ్న 1.
కలామ్ తత్వశాస్త్ర గ్రంథాలు చదవడం.
జవాబు:
“నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.”
ప్రశ్న 2.
విజయానికి సూత్రాలు మూడు.
జవాబు:
“నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు – “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్మి
ఉంటుంది – అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశ పెట్టుకోవడమూను.”
ప్రశ్న 3.
సోదరి సహాయం.
జవాబు:
“ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను గానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు సంపాదించడానికున్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్ షిప్ సంపాదించుకోవడమే.
ప్రశ్న 4.
ప్రొఫెసర్ పక్కన కూర్చొని ఫొటో దిగడం.
జవాబు:
“ఎమ్. ఐ.టి.కి సంబంధించిన ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్ కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనుక నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని, నాకోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో నిల్చున్నాను. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిరాంతపోయాను. ‘నువ్వు నా బెసు స్టూడెంట్ వి.’ నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యతులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూచున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్ లోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.
ఇ) కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.
“భారత జాతీయోద్యమ నాయకుల్లో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న సైబెల్ లో జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్త్వవేత్తలను, వక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు. (✓)
2. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి. (✗)
3. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు. (✓)
4. బిపిన్ చంద్రపాల్ కి స్వాతంత్ర్యోద్యమ కాంక్ష ఉంది. (✓)
5. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (✓)
ఈ) పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
అబ్దుల్ కలాం దారి తప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతన్ని దారిలో పెట్టేవి కదా ! ఆ మాటలు ఏవి?
జవాబు:
ఆ ఉత్తేజకరమైన మాటలివి – “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం.”
ప్రశ్న 2.
కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవాడు ? వాటి ద్వారా ఏ స్పూర్తిని పొందాడు?
జవాబు:
కలాం బాల్యంలో పక్షుల ప్రయాణాన్ని గమనించేవాడు. ఆకాశంలో విహారించాలంటే అమితాసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం గమనిస్తూ తాను కూడా ఎగరాలనే స్ఫూర్తిని పొందేవాడు. ఆకాశ రహస్యాలను కనుక్కోవాలనే కోరిక పెంచుకున్నాడు.
ప్రశ్న 3.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసిందెవరు?
జవాబు:
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసినది కలాం సోదరి జొహారా. ఆమె తన బంగారు గాజులూ, గొలుసూ కుదువ పెట్టి వచ్చిన డబ్బుని కలాంకు ఇచ్చింది.
ప్రశ్న 4.
వీడ్కోలు సమావేశంలో ఏం జరిగింది?
జవాబు:
వీడ్కోలు సమావేశంలో భాగంగా కలాం, ఇతర విద్యార్థులు వాళ్ళ ప్రొఫెసర్లతో కలిసి గ్రూప్ ఫొటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో వెనుక నిలుచున్నారు. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని కలాం కోసం కలియచూశాడు. కలాం మూడోవరుసలో నిల్చున్నాడు. కలాంతో ‘రా………. నాతోపాటు ముందు కూర్చో’ అని పిలిచాడు. కలాం ప్రొఫెసర్ గారి ఆహ్వానానికి నిర్ఘాంతపోయాడు. ‘నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అని అన్నాడు ప్రొఫెసర్. ఆ ప్రశంసకి కలాం సిగ్గుపడ్డాడు. తనకు లభించిన గుర్తింపునకు గర్విస్తూ ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోకోసం కూర్చున్నాడు. దేవుడే కలాం ఆశ, ఆశ్రయం, మార్గదర్శి కాగలడని, భవిష్యత్తులో కలాం ప్రయాణానికి దారి చూపే దీపం కాగలడని ప్రొఫెసర్ వీడ్కోలు పలికాడు.
ప్రశ్న 5.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశాడు?
జవాబు:
కోర్సు పూర్తి చేయగానే కలాం తన నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనను ఇతర మిత్రులు తీసుకున్నారు. ఒకరోజు వాళ్ళ డిజైనింగ్ ప్రొఫెసరైన శ్రీనివాసన్ వాళ్ళ ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని తేల్చాడు. కలాం ఎన్ని సాకులు చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. ఆ పనిని పూర్తి చెయ్యడానికి ఒక నెలరోజుల వ్యవధి కోరినా మూడు రోజులు మాత్రమే గడువిచ్చాడు. సోమవారం ఉదయానికి విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాకపోతే స్కాలర్షిప్ ని ఆపెయ్యవలసివస్తుందని హెచ్చరించాడు.
కలాం రాత్రి భోజనం మానేసి, డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నుడైనాడు. మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకొని, ఏదో తిన్నాడనిపించి మళ్ళీ పనిలో పడ్డాడు. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి చేశాడు. ప్రొఫెసర్ ఆప్యాయంగా కావలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
(లేదా)
ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అన్న కలాం తండ్రి మాటలపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనిషి సంఘజీవి. ప్రతి మనిషికీ తన పరిసరాలకు సంబంధించిన జ్ఞానం చాలా అవసరం. తనే గాక తన చుట్టు . ప్రక్కలవారి బాగోగులను గమనించాల్సిన బాధ్యత, తోటి మనిషికి సహాయపడాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. తన ఇంట్లోనే గాక తన ఇంటి చుట్టుప్రక్కల చక్కని స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. తనకు ఉన్నదాంట్లోనే తోటి వారికి సహాయపడాలి. అలా ఇతరుల కష్టసుఖాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని.
ప్రశ్న 2.
‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి?
జవాబు:
కలాం పాఠశాల ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఈ విజయ సూత్రాన్ని బోధించాడు. మనకేదన్నా సంభవించాలని అనుకుంటే ముందు దాన్ని గట్టిగా కోరుకోవాలి. అది తప్పక జరిగి తీరుతుందని నమ్మాలి. ఆ కోరిక ఎన్ని ఇబ్బందులెదురైనా జరిగి తీరుతుందనే ఆశను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఇలా చేయడం ద్వారా కోరిక తీరాక మన సంకల్పబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆశావహ జీవనం అలవడుతుంది. తద్వారా నిరాశానిస్పృహలను జయించవచ్చు. ఆత్మన్యూనతను గెలవవచ్చు. అందుకనే కోరిక – నమ్మకం – ఆశ పెట్టుకోవడం అనే మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు పట్టు సాధించాలి.
ప్రశ్న 3.
“తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడమే!” ఈ మాటలు ఎవరి నుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
కలాం ఎమ్.ఐ.టి.లో తన ప్రొఫెసర్లు అయిన స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావుగార్ల గురించి చెప్పిన మాటలివి. ఇందులో ప్రతి అక్షరం సత్యమే అని నా కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఉపాధ్యాయుడు విసుక్కోకుండా ఓపికతో వివరించినప్పుడే విద్యార్థి మేధస్సు వికసిస్తుంది. ఉపాధ్యాయుడు నిరంతర విద్యాన్వేషి కావాలి. విద్యార్థుల ప్రశ్నలను పిచ్చివని కొట్టిపారేయకుండా, విజ్ఞానాత్మకంగా ఆలోచించి సమాధానాలను చెప్పాలి. అప్పుడే విద్యార్థుల జ్ఞానతృష్ణ సంతృప్తిపడుతుంది. లేకుంటే తెలివైన విద్యార్థి వేరొకరిని ఆశ్రయించడం ద్వారా తన విజ్ఞాన తృష్ణను తీర్చుకోగలడు. సాధారణ విద్యార్థులు దాన్ని అంతటితో విడిచిపెట్టడం ద్వారా నష్టపోతారు. కాబట్టి ఉపాధ్యాయుడు నిరంతరం చైతన్యశీలిగా ఉండాలి. అకుంఠిత సంకల్పంతో విద్యార్థుల జ్ఞానతృష్ణను సంతృప్తి పరచాలి.
ప్రశ్న 4.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తి చేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు:
కలాం స్థానంలో నేనుంటే ముందు కంగారు పడే మాట వాస్తవం. క్రమంగా విచక్షణతో ఆలోచిస్తాను. అవసరాన్ని బట్టి మిత్రుల సహాయం తీసుకుంటాను. “అవసరమే అన్ని ఆవిష్కరణలకు జనని” అనే సామెతను గుర్తుకు తెచ్చుకొని నా అవసరం కూడా ఒక నూతనావిష్కరణకు దారితీయాలని దృఢంగా సంకల్పించుకుంటాను. తగినట్లు కష్టపడతాను. వీలైనంత త్వరగా పనిని పూర్తిచేసి, గురువుల మన్ననలందుకుంటాను.
ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యారు? మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రతి వ్యక్తికి ఆశయం ఉంటుంది. అది సఫలం చేసుకోవడానికి అందరూ కృషి చేస్తుంటారు. అదే విధంగా కలాం తన ఆశయ సాధన విషయంలో ఎలా కృతకృత్యుడయ్యాడో వివరించండి.
జవాబు:
రామనాథపురంలోని హైస్కూల్లో చేరిన కలాంకు ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. క్రమంగా వారి అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. జీవితంలో విజయం పొందాలన్నా, మంచి ఫలితాలు సాధించాలన్నా మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక – నమ్మకం – ఆశ అని సోలోమోన్ చెప్పే మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగిరాయగలవు” – అనే గురువు గారి మాట కలాంలో ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించింది. సాధారణ గ్రామీణ బాలుడైన్పటికీ తాను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలడనే నమ్మకం బలంగా కలిగింది.
స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకునేటప్పటికీ జీవితంలో విజయం సాధించాలనే దృఢసంకల్పం రెట్టింపయింది. ఆ రోజుల్లో వృత్తి విద్యాకోర్సుల గురించి ఊహ కూడా లేకపోవడంతో, ఉన్నత విద్య అంటే అప్పటికి కాలేజీ చదువే కావడంతో ట్రిచీ సెంట్ జోసఫ్ కాలేజీలో చేరాడు. గణితశాస్త్ర ప్రొఫెసర్లైన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్లతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. సెంట్ జోసఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరి పూర్తి చేశాక గాని తన కిష్టమైన భౌతికశాస్త్రంలో తానేమీ చేయలేదని గుర్తించాడు. తన కలలు నిజం చేసుకోవాలంటే ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుందని గ్రహించాడు. తర్వాత “మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ”లో ప్రవేశానికి ఎంపిక అయ్యాడు. ఇక్కడే అసలు కష్టం మొదలైంది. ఆ సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయలన్నా అవసరమవుతాయని తెలిసింది. అది తన తండ్రికి అసాధ్యమైన పని. అప్పుడే కలాం సోదరి జొహారా తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ధన సహాయం చేసింది. తన సొంత సంపాదనతోనే ఆమె గాజుల్ని విడిపించాలని నిశ్చయించుకున్నాడు కలాం. డబ్బు సంపాదించాలంటే అతనికున్న ఒకే ఒక మార్గం స్కాలర్ షిప్ సంపాదించడం.
ఎమ్. ఐ. టి లో (కలాంను) అతణ్ణి అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శనగా ఉంచిన రెండు పాత విమానాల యంత్రాలు. వాటి పట్ల ఎంత ఆకర్షితుడైనాడంటే మిగిలిన విద్యార్థులంతా హాస్టలుకు వెళ్ళాక కూడా చాలా సేపు వాటి దగ్గరే కూర్చొనేవాడు. పక్షిలా ఆకాశంలో విహరించాలన్న తన కాంక్షని ఆరాధిస్తూ గడిపేవాడు. మొదటి సంవత్సరం పూర్తిచేశాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ను ఎంచుకున్నాడు. ఎలాగైనా విమానాల్ని నడపాలనే తన కోరికకు సాధారణ కుటుంబ నేపథ్యమేమీ అడ్డుకాలేదని భావించాడు.
అప్పుడే వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. అప్పుడే కొన్ని వైఫల్యాలు, ఆశాభంగాలు చవిచూడాల్సి వచ్చింది. దారితప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ తన తండ్రి మాటలు ఎప్పుడూ చెవులలో మారుమ్రోగుతూ సరైన మార్గంలో నడిపాయి. కలాం ఆలోచనల్ని ముగ్గురు ఉపాధ్యాయులు మలచారు. వారే ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావు గార్లు. తమ నిశిత బోధనల ద్వారా ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని కోరికను మేల్కొల్పారు. వారి మేధస్సు, ఆలోచనా స్పష్టత, కలాం శ్రద్ధను బలోపేతం చేశాయి. కోర్సు పూర్తిచేశాక నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. కాగా ప్రొఫెసర్ శ్రీనివాసన్ వారి పురోగతేమీ లేదని తేల్చి మూడు రోజుల్లోనే డిజైన్ పూర్తిచేయకుంటే స్కాలర్షిప్ ఆపేస్తామని హెచ్చరించాడు. దానితో కలాం నిద్రాహారాలు మాని రెండు రోజుల్లోనే దానిని పూర్తిచేసి ప్రొఫెసర్ శ్రీనివాస గారి మన్ననలే గాక ఇతర అధ్యాపకుల ప్రశంసలందుకున్నాడు. ‘మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం’ అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాసి ఎమ్.ఐ.టి. తమిళ సంఘంవారు నిర్వహించిన వ్యాసరచన పోటీకి పంపాడు. ప్రథమ బహుమతిని పొందాడు.
ఎమ్.ఐ.టి. నుంచి బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్ హాలింగ్ లో పనిచేశాడు. పిస్టన్, టర్బయిన్ ఇంజన్లు రెండింటి ఓవరాలింగ్ మీద పనిచేశాడు. వాయు పదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలు అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు. అప్పుడు వైమానిక దళంలో ఉద్యోగం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ లో ఉద్యోగ రూపంలో కలాం చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు లభించాయి. రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుడు కూడా కలామే.
ప్రశ్న 2.
కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రామనాథపురంలో హైస్కూల్ లో చేరాడు కలాం. జిజ్ఞాసియైన కలాంకు ఇయదురై సోలోమోన్ అనే ఉపాధ్యాయుడు మార్గదర్శియై నిలిచాడు. ఆయన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. కోరిక – నమ్మకం – ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాల ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని, మంచి ఫలితాలను పొందవచ్చని ఇయదురై బోధించేవాడు. “విశ్వాసంతో నీ విధిని కూడా తిరిగి రాయగలవు” – అనే సోలోమోన్ మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. కలాంకు చిన్నప్పటి నుండీ ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా ఆసక్తి ఎక్కువ. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూస్తూ తాను కూడా ఎగరాలని కోరుకునేవాడు. సోలోమోన్ బోధనలతో ఎగరాలనే కోరిక పెంచుకున్నాడు. ఎగురుతానని గట్టిగా నమ్మాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశవీడలేదు. కాబట్టే రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి బాలుడతడే అయ్యాడు.
స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకున్నాడు. వృత్తి విద్యాకోర్సుల గురించి అవగాహన లేకపోవడంతో ట్రిచీలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరాడు. పరీక్షల గ్రేడుల ప్రకారం చూస్తే ఏమంత తెలివైన విద్యార్థి కాడు కలాం. కళాశాలలో గణితశాస్త్రంలో ప్రొఫెసర్స్ అయిన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్ల ప్రేమకు పాత్రుడైనాడు. అక్కడే ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ అయింది. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల రచనల పట్ల ప్రత్యేకాసక్తి కలిగింది. ఉత్తమ రచనలన్నీ చదివాడు. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు కూడా చదివేవాడు. అప్పుడే భౌతికశాస్త్రం పట్ల విశేషమైన ఆసక్తి కలిగింది. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.
సెంట్ జోసెఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరాడు. నాటికి ఇంజనీరింగ్ విద్య గురించి అవగాహన కలాంకు లేదు. బి. ఎస్.సి. పూర్తిచేశాక గాని భౌతికశాస్త్రం తన ప్రధాన విషయం కాదని తెలియలేదు. తన కలల్ని నెరవేర్చుకోవడం కోసం ఇంజనీరింగ్ లో చేరాలనుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఎంపికయ్యాడు. కానీ అసలు కష్టం అప్పుడే మొదలైంది. అతడా సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయల దాకా కావాలి.
అప్పుడు కలాం సోదరి జొహారా తన బంగారు గాజుల్ని, గొలుసును కుదువబెట్టి ధనసహాయం చేసింది. తన సొంత డబ్బుతోనే వాటిని విడిపించాలని కలాం నిర్ణయించుకున్నాడు. చదువుకునే తనకి డబ్బు సంపాదించే ఒకే ఒక మార్గం కష్టపడి చదివి స్కాలర్ షిప్ సంపాదించడం.
మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎన్నుకున్నాడు. ఎలాగైనా తాను విమానాల్ని నడపాలనే బలమైన కోరిక అందుకు కారణమైంది. అక్కడే చాలా రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. దారితప్పే పరిస్థితులేర్పడ్డాయి. తండ్రి మాటలే కలాంని సరైన మార్గంలో నిలిపాయి. ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి పండలై, నరసింగరావుగార్లు ఎమ్.ఐ.టి. లో కలాంపై ప్రభావం చూపిన గురువులు. తమ నిశిత బోధనల ద్వారా వారు ఏరోనాటిక్స్ పట్ల కలాంలో తృష్ణని రేకెత్తించారు. పరిజ్ఞానం పెరగడం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలిసింది. కోర్సు పూర్తి అయింది. కోర్సులో భాగంగా నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన కలాం బాధ్యత కాగా చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనలు అతని మిత్రుల బాధ్యత.
ఒకరోజు వాళ్ళ డైరెక్టర్, డిజైనింగ్ ప్రొఫెసర్ అయిన శ్రీనివాసన్ గారు వాళ్ళ ప్రగతిని చూసి, పురోగతి లేదని తేల్చేశాడు. పనిలో జాప్యానికి కలాం ఎన్ని కారణాలు చూపినా ఆయన అంగీకరించలేదు. చివరికి ఒక నెలరోజుల వ్యవధి కోరగా, నేటి నుండి మూడో రోజున డిజైన్ పూర్తిచేసి చూపాలని, లేకుంటే స్కాలర్ షిప్ ఆపేస్తామని నిరంకుశంగా చెప్పాడు. స్కాలర్ షిప్పే కలాంకు ఆధారం. మూడు రోజుల్లో పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. నిద్రాహారాలు మాని డ్రాయింగ్ కు పూనుకున్నాడు. రెండవ రోజు ఉదయానికల్లా డిజైన్ పూర్తిచేసి గురువుల ప్రశంసలందుకున్నాడు.
ఎమ్.ఐ.టి. లో కోర్సు పూర్తిచేసుకొని, బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ విమానాల ఇంజన్ ఓవరాలింగు చేశాడు. వాయుపదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలను అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు.
ప్రశ్న 3.
‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్ కలాం ఏమి రాసి ఉంటారు?
జవాబు:
కలాంకి చిన్నప్పటినుండి పక్షిలా ఆకాశంలో ఎగరడమంటే ఇష్టం. ఇలాంటి కోరికతోనే మొదటిసారిగా యంత్రాన్ని నిర్మించి, ఆకాశంలో ఎగిరిన వారు రైట్ సోదరులు. కలాం తన ఇంజనీరింగ్ విద్యలో భాగంగా వివిధ విమాన యంత్రాలను నిశితంగా పరిశీలించాడు. ఇతర భాగాలను శ్రద్ధగా గమనించాడు. విమానాన్ని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగం విడదీయడం, విడి భాగాలను కలిపి విమానాన్ని తయారు చేయడంలో ప్రజ్ఞ గడించాడు. తన ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారి పుణ్యమా అని సొంతంగా విమానయంత్రాన్ని డిజైన్ చేశాడు.
‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’- అనే వ్యాసంలో కలాం తన అనుభవాలను, విజ్ఞానాన్ని రంగరించి విమానాన్ని సులభంగా ఎలా తయారుచేయవచ్చో నిరూపించి ఉంటాడని అన్పిస్తుంది. ఇంకా వీలైనంత తక్కువ ఖర్చుతో దాన్ని తయారుచేయగల మార్గాలను సూచించి ఉంటాడు. ముందుగా చిన్న చిన్న యంత్రాలను తయారుచేయడం, వాటిని విమానం బొమ్మలకు అనుసంధానించడం వంటి విషయాలను ఆసక్తి గల బాలల కొరకు వివరించి ఉంటాడు. వివిధ రకాల విమాన యంత్రాలకు ఉపకరించే లోహాలను, వాటి స్వరూపాలను తెలిపి ఉంటాడు. సాధారణ యంత్రాలకు కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా విమాన యంత్రాలుగా ఎలా మార్చవచ్చో నిరూపించి ఉంటాడు.
ఇ) సృజనాత్మకంగా రాయండి.
పాఠంలోని మూడవ పేరాను చదవండి. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అలాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి.
జవాబు:
“నాకూ రెక్కలు ఉంటే
నీలాకాశంలో విహరిస్తా
అవని అందాలను పరికిస్తా
చందమామను పలకరిస్తా
తారామండలానికి వెళ్ళిస్తా
గ్రహగతుల్ని వీక్షిస్తా
ఖగోళపు వింతల్ని పరిశీలిస్తా
విశ్వరహస్యాన్ని ఛేదిస్తా
గ్రహాంతర వాసులతో చెలిమిచేస్తా
భూగోళపు గొప్పదనం తెలియజేస్తా”
(లేదా)
ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం చెయ్యండి.
జవాబు:
కలాం సందేశం :
ప్రియ విద్యార్థులారా! భారత భవిష్య నిర్ణేతలారా!
మీ ఉత్సాహం, మీ ఆసక్తి చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఆ ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం గమనిస్తే మీరంతా నా ప్రతిబింబాలలాగే ఉన్నారు. ఇప్పుడు వయసు ఉడిగి వృద్దుడినైనా మానసికంగా ఉత్సాహంగా, బలంగానే ఉన్నా. నా ఈ స్థితికి కారణం నా గురువుల సందేశాలే. మనం ఏదైనా సాధించాలంటే దాన్ని గురించిన కోరిక బలంగా ఉండాలి. సాధించగలననే అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఎలాంటి పరిస్థితులెదురైనా ఆశను వీడకూడదు. అప్పుడే మనం దాన్ని సాధించగలం. జీవితంలో ఏరకమైన లక్ష్యాన్నైనా సాధించాలంటే ఇదే సులభమైన మార్గం. ముందు మీ కోరిక ఏదనే దానిపై ఒక స్పష్టత కలిగి ఉండండి. దాన్ని సాధించగలననే విశ్వాసాన్ని పెంచుకోండి. లక్ష్యం చేరేవరకు నిరాశను దగ్గరకు రానివ్వవద్దు. “విశ్వాసంతో మనం మన విధిని కూడా తిరిగి రాయగలం”. ఇది నిజం.
చిన్నారులారా! ఇతురుల్ని బాగా అర్థం చేసుకున్నవాడే విజ్ఞాని. తన గూర్చి తాను తెలుసుకున్నవాడే వివేకి. కానీ వివేకం లేని విజ్ఞానం ఏమాత్రం ప్రయోజనం లేనిది. నేడు విజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు గాని వివేకాన్ని కోల్పోతున్నారు. అందువల్లే చాలా దేశాల మధ్య పరస్పర ద్వేషాలు రగులుతున్నాయి. యుద్ధాలకు కారణాలవుతున్నాయి. మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి మనిషి విజ్ఞాని, వివేకి కావాలి.
ఏకపాత్రాభినయం :
తేది: 17 – 05 – 1974.
రంగం : ఢిల్లీ నగరంలోని కలాం వసతి గృహంలో ప్రయోగశాల.
సమయం : రాత్రి 11.00
సన్నివేశం : ఏకాంతంగా ప్రయోగశాలలో సంచరిస్తూ, ఆలోచిస్తున్న సన్నివేశం.
కలాం అంతరంగ మథనం :
(దీర్ఘంగా నిట్టూర్చి) ఏమిటీ వింత స్థితి? ఎన్నడూ నా జీవితంలో లేదే ఈ పరిస్థితి? ఎందుకు నా హృదయస్పందన నాకే తెలుస్తోంది నా శరీరావయవాల కంపం ఆగటంలేదెందుకు? అవునులే! రేపు జరగబోయేదేమన్నా చిన్నకార్యమా? యావత్ ప్రపంచం విస్తుపోయే కార్యం! పొరుగుదేశాలే కాక, అవకాశం కోసం పొంచి ఉన్న గుంటనక్కల లాంటి పాకిస్థాన్, చైనా వంటి దేశాలకు కన్నుకుట్టే సన్నివేశం. భారతీయులంతా సగర్వంగా తలలెత్తుకొని ఆనందంగా “వందేమాతరమ్” అని ఎలుగెత్తి నినదించే ఘటన. అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు కుళ్ళుకొని కుమిలిపోయే సంఘటన. నేపాల్, రష్యా వంటి మిత్రదేశాలు “శెహభాష్” అని ప్రశంసల జల్లు కురిపించే పని. టెక్నాలజీలో తామే గొప్పని విర్రవీగే జపాన్, జర్మనీ వంటి దేశాలు సిగ్గుతో చిమిడిపోయే ఘనకార్యం. అవును ఆ విషయాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆనందంతో శరీరం గాలిలో తేలుతున్నట్లుంది.
నా దేశం, నా భారతదేశం రేపు మొట్టమొదటిసారిగా అణు పరీక్షను జరపబోతోంది. తన అణుసామర్థ్యాన్ని ప్రదర్శించబోతోంది. పాక్, చైనా వంటి దేశాలు ఇక కవ్వింపు చర్యలాపి, తోక ముడవాల్సిందే. భారతమాత శక్తి యుక్తులను తలచి మోకరిల్లాల్సిందే. అగ్రరాజ్యాలిక ఆగ్రహాన్ని నిగ్రహించుకోవాల్సిందే. నేపాల్, భూటాన్, బర్మా వంటి చిన్న దేశాలు భారతదేశం పంచన చేరాల్సిందే. ఇంతవరకూ శాంతికి ప్రతీకగా నిలిచింది నా దేశం. కానీ శాంతిని కోరడం చేతకానితనంగా భావించింది ప్రపంచం. తనకై తాను కయ్యానికి కాలు దువ్వనని, తన జోలికి వస్తే మాత్రం తాట తీయకుండా వదలనని ప్రపంచానికి చాటి చెపుతుంది నా దేశం.
కానీ ఇవన్నీ జరగాలంటే రేపటి అణుపరీక్ష విజయవంతం కావాలి. లేకుంటే ………… (చెవులు మూసుకొన్నట్లు నటించి), అపహాస్యాన్ని, ఎగతాళిమాటలను ………….. భరించాలి. నో………. అలా జరగడానికి వీలులేదు. దేశాన్ని అవమానాలపాలు చేయడం కంటే ఆత్మాహుతి మేలు.
మానవ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. కార్మికుని నుండి కార్యదర్శి దాకా అందరం కలిసికట్టుగా దేశ భవిష్యత్తును కోరి కష్టపడ్డాం. అయినా మానవాతీతమైనది కదా దైవం. దైవం ధర్మానికి బద్ధుడని భారతీయ తత్త్వశాస్త్రం ఘోషిస్తోంది. మేము మా ధర్మానికి కట్టుబడే ఈ ప్రయత్నం చేశాం. భారతదేశం కూడా ఆత్మరక్షణ కోసమే అణ్వాయుధాన్ని తయారుచేసుకుంది తప్ప వేరే దేశాలకు హానిచేయడం కోసం కాదు. కాబట్టి దైవం తప్పక భారతదేశానికి సహకరిస్తాడు.
అవును, నా మనస్సు దృఢంగా నమ్ముతోంది. రేపు తప్పక విజయం లభిస్తుంది. భారతదేశమంతా ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ చక్కని సన్నివేశాన్ని ఇప్పుడు దర్శిస్తా. రేపు కళ్ళతో చూసి హర్షిస్తా. ఇక విశ్రమిస్తా. (నిద్రకు ఉపక్రమిస్తాడు)
ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
కలాం గురించి చాలా విషయాలు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! కలాం జీవితం నుండి మనం నేర్చుకోదగిన మంచి విషయాలేమిటి? వీటిలో మీరు వేటిని ఆచరణలో పెడతారు?
జవాబు:
కలాం జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దృఢమైన సంకల్పం, ఆత్మవిశ్వాసం, ఎన్ని కష్టాలు వచ్చినా మొదలు పెట్టిన పనిని పూర్తిచేయడం వంటి ఎన్నో మంచిగుణాలు కలాంలో ఉన్నాయి. వీటిల్లో ఆయన ఆత్మ విశ్వాసాన్ని, కష్టాల్లో కూడా లక్ష్యాన్ని విడిచి పెట్టకపోవడాన్ని నేను ఆచరణలో పెడదామనుకుంటున్నాను. ఇలాగే జీవిత లక్ష్యానికి సంబంధించిన దాన్ని మనస్సులో బలంగా కోరుకోవడం, కోరుకున్నదాన్ని సాధించగలనని విశ్వసించడం, ఎన్ని అడ్డంకులెదురైనా ఆశ వీడకపోవడం అనే దాన్ని కూడా ఆచరణలో పెడతాను.
IV. ప్రాజెక్టు పని
* మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెలా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుకున్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. భౌతికశాస్త్రంలోను, జీవశాస్త్రంలోను భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త. ఈయన స్వేచ్ఛగా సంచరించే మనుషులకు, ఇతర జంతుజాలానికే కాక కదలని చెట్టుచేమలకు కూడా ప్రాణం ఉందని నిరూపించిన గొప్ప శాస్త్రవేత్త.
ఈయన చెట్టు, తీగలకు ప్రాణం ఉందని నిరూపించడంలో, మహాభారతంలోని శాంతిపర్వంలో భరద్వాజ – భృగుమహర్షుల సంభాషణ ఆయనకు మంచి ప్రేరణ ఇచ్చిందని ఆయన తాత్త్వికత గురించి తెలిసిన పెద్దలు చెప్తారు. ఆ సంభాషణ ఇది –
భృగుమహర్షి : బ్రహ్మ ఈ సృష్టి అంతటిని పంచమహాభూతాల సమ్మేళనంతో చేశాడు.
భరద్వాజ మహర్షి : స్థావరజంగమములలో ఈ పంచభూత ధాతువులు కనిపించడం లేదు గదా మహాత్మా ! అవి వినలేవు – చూడలేవు – వాసనను గ్రహించలేవు – స్పర్శలేదు గదా !
భృగుమహర్షి : బలమైన గాలులకు, అగ్నికి, ఉరుములకు, పిడుగులకు, ఫలాలు, పుష్పాలు చెదిరిపోతాయి. అంటే వాటినుండి వచ్చే ధ్వనిని గ్రహించే అవి అలా అవుతున్నాయి. కాబట్టి అవి వినగలుగుతున్నట్లే గదా!
“వాయ్వగ్యశని నిర్దోషైః ఫలం పుష్పం విశీర్యతే|
శ్రోత్రేణ గృహ్యతే శబ్దః తస్మాత్ శ్రుణ్వంతి పాదపాః ||
(అధ్యాయం – 184, శ్లో|| 12)
తీగలు చెట్లను అల్లుకొని పై పైకి పాకుతాయి. కొమ్మలు ఎటు వ్యాపించాయో చూడకుండా అవి అలా పాకలేవు గదా! కాబట్టి అవి చూడగలవు.
“వల్లీ వేష్టయతే వృక్షం సర్వతః చైవ గచ్ఛతి!
న హి అదృష్టశ్చ మార్గో 2 స్తి తస్మాత్ పశ్యంతి పాదపా?”|| (అ|| 184 – శ్లో|| 13)
చెట్లకు వచ్చే రకరకాల తెగుళ్ళను పోగొట్టడానికి సుగంధమైన, దుర్గంధమైన రకరకాల ధూపాలను వేస్తాం. అప్పుడు ఆ తెగుళ్ళు పోయి అవి పుష్పిస్తాయి. అంటే అవి వాసనను గ్రహించగలిగినట్లే గదా!
“పుణ్యాపుడ్యైః తథా గంధైః ధూ పైశ్చ వివిధైరపి
అరోగాః పుష్పితాః సంతి తస్మాత్ జిఝంతి పాదపాః”|| (అ|| 184 – శ్లో|| 14)
చెట్లు నీటిని స్వీకరిస్తున్నాయి. వాటికి వచ్చే రోగాలకు ఔషధాలు ఇవ్వడం ద్వారా నయం చేయగలుగుతున్నాము. కొమ్మను నరికేశాక కొన్నాళ్ళకు మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. అవి కూడా సుఖదుఃఖాలకు స్పందిస్తున్నాయి. వాటికి జీవం ఉన్నట్లే కదా!
భారతీయ గ్రంథాలను ‘వైజ్ఞానిక దృష్టితో పరిశోధించే సుభాష్ చంద్రబోస్ మహాశయుణ్ణి ఈ సంభాషణ బాగా ఆకర్షించింది. తన పరిశోధనను ఈ వైపుగా కొనసాగించి క్రెస్కోగ్రాఫ్ ను ఆవిష్కరించాడు. దీని సహాయంతో మొక్కలకు జీవం ఉందని, తీవ్రమైన కాంతికి, ధ్వనికి అవి స్పందిస్తాయని, వాటిలో జీవలక్షణమైన పెరుగుదల ఉందని ఆధునిక ఆధును. ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేశాడు. వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహునిగా కీర్తించబడినాడు.
(లేదా)
* శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించండి.
జవాబు:
పైన చెప్పిన పని మీరు మిత్రులతో కలసి పూర్తిచేయండి.
III. భాషాంశాలు
పదజాలం
అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ పదాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా :
వివేకానందుడు రామకృష్ణుని పథంలో పయనించాడు.
పథం = మార్గం
మహాత్ములు చూపిన మార్గంలో పయనించాలి.
1. ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
జవాబు:
ఔత్సాహికుడు = ఉత్సాహం గలవాడు – ఉత్సాహం గలవాడికే ఉన్నత స్థితి త్వరగా లభిస్తుంది.
2. జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జవాబు:
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక గలవాడు.
జగదీష్ చంద్రబోస్ కొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక గలవాడు.
3. బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
జవాబు:
ప్రత్యామ్నాయము = ఇతర సౌకర్యం
నేడు మా నగరానికి గవర్నర్ వస్తున్న కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు తగిన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
4. వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
జవాబు:
ప్రభావితం చేయు = ప్రేరణ కలిగించు, ప్రకాశింపజేయు.
కలాం బోధనలు యువతలో ప్రేరణ కలిగించాయి.
5. సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష.
జవాబు:
ఆకాంక్ష = కోరిక
నేను ఇంజనీర్ ను కావాలని మా తల్లిదండ్రుల కోరిక.
6. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
జవాబు:
వాగ్దానం = మాట ఇవ్వడం
మాట ఇవ్వగానే సరికాదు, దాన్ని నిలుపుకోగలగాలి.
ఆ) పాఠం చదివి కింది పదాలను వివరించి రాయండి.
1. ఆకాశయానం : ఆకాశంలో ప్రయాణించడం, విమానాల్లో తిరగడం.
2. అణు భౌతికశాస్త్రం : అణువులు, వాటి విచ్ఛేదనం వలన ఉత్పన్నమయ్యే శక్తి మొదలైన వాటిని గురించి వివరించే శాస్త్రం.
3. సాంకేతిక విద్య : సాంకేతికత (Technology) ను బోధించే విద్యను సాంకేతిక విద్య అంటారు.
ఉదా :
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్
4. ప్రొఫెషనల్ చదువు : వృత్తికి సంబంధించిన చదువు.
5. జ్ఞానతృష్ణ : తృష్ణ అంటే కోరిక. జ్ఞానాన్ని సంపాదించాలనే కోరికను జ్ఞానతృష్ణ అంటారు.
ఇ) ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.
ఉదా : ఎరోనాటికల్ ఇంజనియర్
1) ప్రొఫెషనల్
2) ఫిజిక్స్
3) ఇంజనీరింగ్
4) ఏరోనాటికల్ ఇంజనీరింగ్
5) ఏ ప్లేన్
6) డిజైన్
7) ఏరోడైనమిక్ డిజైన్
8) చోదనం
9) నిర్మాణం
10) అదుపు
11) ఉపకరణ సామాగ్రి
12) రూపకల్పన
13) డ్రాయింగ్
14) డ్రాయింగ్ బోర్డ్
15) ప్రాజెక్ట్
16) ఇంజన్ ఓవరహాలింగ్
17) విమానాల ఓవరాలింగ్
18) ప్రాక్టికల్
19) పిస్టన్
20) టర్బయిన్
21) ఇంజన్
22) వాయుపదార్థాల డైనమిక్స్
ఈ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలు సమానార్థాన్ని ఇస్తాయి. ఆ పదాలతో కొత్త వాక్యాలు రాయండి.
1. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో – ఇష్టం.
జవాబు:
ఆకాశంలో విమానాలు వెళతాయి. ఆ గగనంలోకే రాకెట్లు దూసుకెళతాయి. ఉపగ్రహాలన్నీ నింగి లోనే సంచరిస్తాయి.
2. భూమిమీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు:
భూమి మానవునికి నివాసం. వసుధ గురించి మానవుడెంతో తెలుసుకోవాల్సింది ఉంది. ఈ ధరణిని నిర్లక్ష్యం చేస్తే మనుగడే ఉండదు.
3. ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలయింది. నెలకు దాదాపు నలభై వేలు సంపాదిస్తున్నాడు.
జవాబు:
మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 66 సంత్సరాలు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇంచుమించు 63 సంవత్సరాలు. మన పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం మొదలు పెట్టి దాదాపు 63 సంవత్సరాలు.
ఉ) కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి – వికృతి పదాలున్నాయి. వాటిని గుర్తించి పట్టికగా రాయండి. వాటితో కొత్త వాక్యాలు తయారుచేయండి.
1) ఆకాశం మేఘావృతమైనది. ఆకసం నిండా మబ్బులున్నాయి.
2) మా ఉపాధ్యాయుడు పాఠాలు బాగా చెప్తారు. అందుకే మా ఒజ్జ అంటే మాకిష్టం.
3) అగ్ని దగ్గర జాగ్రత్త అవసరం. అగ్గితో ఆటలాడగూడదు.
4) సముద్రంలో గవ్వలుంటాయి. సంద్రంలో అలలు వస్తుంటాయి.
5) ఆకాశంలో పక్షి ఎగురుతోంది. పక్కిలా ఎగరటమంటే పవన్ కు ఎంతో సరదా.
జవాబు:
ప్రకృతి-వికృతి పదముల పట్టిక :
1. ఆకాశం – ఆకసం
2. ఉపాధ్యాయుడు – ఒజ్జ
3. అగ్ని – అగ్గి
4. సముద్రం – సంద్రం
5. పక్షి – పక్కి
కొత్త వాక్యాలు :
- ఆకసంలో చందమామ వెలిగిపోతున్నాడు. ఆకాశంలో తారకల అందానికి మరేదీ పోటీ కాదు.
- బాల్యంలో కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్. ఆ ఒజ్జను 82 సం||ల వయస్సులో కూడా సంస్మరిస్తాడు కలాం.
- ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ. ఈ కాలంలో అగ్గిని ఆపాలంటే ఎక్కువ కష్టపడాలి.
- భారతదేశానికి దక్షిణాన హిందూమహాసముద్రం ఉంది. ఆ సంద్రం ఒడ్డున సూర్యాస్తమయ సన్నివేశాన్ని చూడటానికి యాత్రికులు పోటీపడతారు.
- మా బడి దగ్గర తుమ్మచెట్టుకు గిజిగాడు పక్షిగూడు వేలాడుతోంది. పక్కి ఆ గూటిని ఎంతో అందంగా నిర్మించింది.
వ్యాకరణం
అ) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.
1. “మా అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు.
2. “నేను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే తనలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడని కలాం చెప్పాడు.
3. “నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడని కలాం చెప్పాడు.
4. “నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురంలో ఉన్న కాలంలో తమ అనుబంధం గరుశిష్య బంధాన్ని దాటి వికసించిందని కలాం చెప్పాడు.
5. “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాలి” చెప్పాడు సోలోమోన్.
జవాబు:
జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికీ అతడు మూడు అంశాల మీద పట్టు సాధించాలని సోలోమోన్ చెప్పాడు.
6. “నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తానని కలాం చెప్పాడు.
7. “నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి” కలాం చెప్పాడు.
జవాబు:
తనకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తని కలాం చెప్పాడు.
8. “కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి” చెప్పాడు కలాం.
జవాబు:
కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, తాను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణని కలాం చెప్పాడు.
9. ”నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మానని కలాం అన్నాడు.
10. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అనేవాడు సోలోమోన్.
జవాబు:
విశ్వాసంతో అతడు తన విధిని కూడా తిరిగి రాయగలడని సోలోమోన్ అనేవాడు.
11. “నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు మా అన్నయ్య” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా తనను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు తన అన్నయ్య అని చెప్పాడు కలాం.
12. “నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం , నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి” అన్నాడు కలాం.
జవాబు:
తాను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి అని కలాం అన్నాడు.
13. “మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా తనను వదలిపెట్టగానే తన తమ్ముడు కాశిం మహమ్మద్ తనని అతని ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడని కలాం చెప్పాడు.
14. “నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను సెంట్ జోసె లో తన చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నానని కలాం అన్నాడు.
15. “దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది” చెప్పాడు కలాం.
జవాబు:
దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల తనకు అమితమైన ఆసక్తి ఏర్పడిందని కలాం చెప్పాడు.
16. “నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది” అన్నాడు కలాం.
జవాబు:
తనకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చిందని కలాం అన్నాడు.
17. “ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు” చెప్పాడు కలాం.
జవాబు:
ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా తనకేమీ తెలియదని కలాం చెప్పాడు.
18. “బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను” అన్నాడు కలాం.
జవాబు:
బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం తన సబ్జెక్ట్ కాదని గ్రహించానని కలాం అన్నాడు.
19. “నా కలలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన కలలు నిజం కావాలంటే తాను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నానని కలాం చెప్పాడు.
20. “ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే నేను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చు” అన్నాడు కలాం.
జవాబు:
ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే తాను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చని కలాం అన్నాడు.
21. “అప్పుడు నా సోదరి ఊహారా నాకు తోడు నిలబడింది” చెప్పాడు కలాం.
జవాబు:
అప్పుడు తన సోదరి జొహారా తనకు తోడు నిలబడిందని కలాం చెప్పాడు.
22. “నేను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి” అన్నాడు కలాం.
జవాబు:
తను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, తన సామర్థ్యంపై ఆమె నమ్మకం తనను గాఢంగా చలింపచేశాయని కలాం అన్నాడు.
23. “నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
తాను తన సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నానని కలాం పేర్కొన్నాడు.
24. “నా మొదటి సంవత్సరం పూర్తయ్యాకజకు ప్రత్యేక విషయాన్ని పంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నానని కలాం చెప్పాడు.
25. “లక్ష్యం నా మనస్సులో స్పష్టంగానే ఉండింది” అన్నాడు కలాం.
జవాబు:
లక్ష్యం తన మనస్సులో స్పష్టంగానే ఉండిందని అన్నాడు కలాం.
26. “ఎమ్.ఐ.టి. లో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
ఎమ్.ఐ.టి. లో తన విద్యాభ్యాసంలో తన ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని కలాం పేర్కొన్నాడు.
27. “విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యింది” చెప్పాడు కలాం.
జవాబు:
విస్తృత పరిజ్ఞానం తన మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యిందని కలాం చెప్పాడు.
28. “ఒక రోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారు” అన్నాడు కలాం.
జవాబు:
ఒకరోజు తమ డైరెక్టర్, తమకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ తమ పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారని కలాం అన్నాడు.
29. “ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయాను” చెప్పాడు కలాం.
జవాబు:
ఆ రాత్రి తాను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయానని కలాం చెప్పాడు.
30. “నేను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నానని కలాం అన్నాడు.
31. “రా నాతోపాటు ముందు కూర్చో” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
తనతో పాటు ముందు కూర్చొనుటకు రమ్మని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.
32. “నువ్వు నా బెస్టు స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
అతడు తన బెస్టు స్టూడెంట్ అని, అతని పరిశ్రమ అతని ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుందని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.
ఆ) క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1. పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెలరోజుల వ్యవధి అవసరం లేదు.
2. నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను.
ఇ) కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు
1. కర్తరి వాక్యం :
క్రియ చేత కర్త చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. ఇది సూటిగా అర్థమవుతుంది. ఇది తెలుగు భాషకు సహజసిద్ధమైంది.
ఉదా :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలను చెప్పారు.
2. కర్మణి వాక్యం :
క్రియ చేత కర్మ చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్మణి వాక్యం అంటారు. ఇది కాస్త చుట్టు తిప్పి చెప్పినట్లుంటుంది. ఈ వాక్యాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులో ఏర్పడ్డాయి. ఇంగ్లీషులో ఇటువంటి వాక్య పద్ధతి ఉంది.
ఉదా :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.
ఇలాగే మీరు మార్చండి.
1. రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భారతం రమేష్ చే చదవబడింది. (కర్మణి వాక్యం)
2. నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. (కర్మణి వాక్యం)
9th Class Telugu 4th Lesson ప్రేరణ రచయిత పరిచయం
ఆ అందరూ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలామ్ 1931 అక్టోబర్ 15 న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశారు.
శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని | విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి.
కఠిన పదాలకు అర్థాలు
జిజ్ఞాసి = తెలిసికోవాలనే కోరిక కలవాడు
మేల్కొను = ముందు జాగ్రత్తపడు
జీవితావకాశాలు = జీవితంలో వచ్చే అవకాశాలు
ప్రత్యామ్నాయాలు = బదులుగా చేసే పనులు
ఔత్సాహికుడు = ఉత్సాహం కలవాడు
ఆదర్శపథము = ఆదర్శ మార్గం
నిర్దేశకుడు = ఉపదేశించేవాడు ; చూపించేవాడు
ఉదార = గొప్పదైన
దృక్పథము = ఆలోచనా ధోరణి లేదా సరళి
అనుబంధం = సంబంధం
గురుశిష్య బంధము = గురుశిష్యుల సంబంధం
సాహచర్యం = కలిసి ఉండడం
జీవిత గమనం = జీవితం నడవడి
ప్రభావితం = ప్రభావము పడినది
పట్టు = ఊత
ఆశ పెట్టుకోవడం = కోరిక కలిగి ఉండడం
సంభవించాలని = జరగాలని ; కలగాలని
ఆకాంక్షించాలని = కోరాలని
ప్రగాఢంగా = మిక్కిలి అధికంగా
విశ్వసించాలి = నమ్మాలి
అమితాసక్తి (అమిత+ఆసక్తి) = అంతులేని ఆసక్తి
స్పృహ = ఇచ్ఛ, కోరిక
విధిని = భాగ్యమును (విధి రాతను)
దృఢ సంకల్పం = గట్టి లక్ష్యము
ఇనుమడించింది = రెట్టింపు అయ్యింది
ప్రొఫెషనల్ చదువులు = వృత్తి విద్యలు
క్లుప్తంగా = సంక్షిప్తంగా
అదృశ్యం = కనబడనిది
కష్టార్జితం (కష్ట + ఆర్జితం) = కష్టంతో సంపాదింపబడినది
కంచి పరమాచార్య = కంచిలో గల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ శంకర మఠం అధ్యక్షులు)
అనుచరులు = సహాయకులు
త్యాగనిరతి = దానము చేయుటయందు మిక్కిలి ఆసక్తి
కేంపస్ = ప్రాంగణం
దృశ్యం = చూడదగినది
ఉద్వేగభరితుణ్ణి = కలతతో నిండినవాణ్ణి
మక్కువ = ప్రేమ
సర్వశ్రేష్ఠకృతుల్ని = అన్నింటికంటె గొప్ప కావ్యాల్ని
అంశము = విషయం
విజ్ఞానశాస్త్ర పథం = సైన్సు మార్గం
భవిష్య అవకాశాలు = రాబోయే కాలంలో వచ్చే అవకాశాలు
సమాచారం = వార్త
సబ్జెక్ట్ (subject) = విషయం
సాంకేతిక విద్య = యాంత్రిక విద్య
తలమానికం = శిరోరత్నం
దరఖాస్తు = అభ్యర్థన పత్రం
ఎంపిక = ఎన్నుకొను
ప్రతిష్టాత్మక సంస్థ = పేరుపొందిన సంస్థ
తలకు మించిన విషయం = తన వల్ల కాని విషయం
తోడు నిలబడింది = సహాయంగా నిలబడింది (సాయం చేసింది)
కుదువబెట్టి = తాకట్టుపెట్టి
ఆకాంక్ష = గాఢమైన కోరిక
చలింపచేశాయి = కదిలించాయి
స్కాలర్‌షిప్ = ఉపకార వేతనం (scholarship)
మిన్నగా = అధికంగా
ఆరాధిస్తూ = పూజిస్తూ (గౌరవిస్తూ)
ఏరోనాటికల్ ఇంజనీరింగు = విమానాలను నడపడానికి సంబంధించిన ఇంజనీరింగు
లక్ష్యం = గురి
సాధ్యము = సిద్ది
నేపథ్యం = తెరవెనుక విషయము (పూర్వ రంగం)
వైఫల్యాలు = ప్రయత్నము జయప్రదం కాకుండా పోవడం, (Failures)
ఆశాభంగాలు = కోరిక భగ్నం కావడాలు
ఉత్తేజకరము = ప్రేరణను ఇచ్చేది
వివేకి = విచారణ చేయువాడు
ప్రయోజన శూన్యం = ఉపయోగం లేనిది
వ్యక్తిత్వం = వ్యక్తికి సంబంధించిన స్వభావం
ఆశయము = అభిప్రాయం
జ్ఞానతృష్ణ = జ్ఞాన సంపాదనమందు ఆసక్తి
చైతన్యం = జ్ఞానం (తెలివి)
అకుంఠిత సంకల్పం = మొక్కవోని కోరిక (తిరుగులేని అభిప్రాయం)
ఉవ్విళ్ళూరించే = మిక్కిలి ఆశించే ; (త్వరపడే)
వ్యత్యాసము = భేదం
నిశిత బోధన = మెఱుగు పెట్టబడిన బోధన
ఏరోనాటిక్స్ = వైమానిక సంబంధమైనది
తృష్ణ = పేరాస
జాగరితం = మేల్కొనడం
మేధాగరిమ = గొప్ప తెలివి
సమగ్రత = సంపూర్ణం
బలోపేతం = బలంతో కూడినది
సమీకరింపబడటం = ఒకటిగా చేయబడటం
ఏరోప్లేన్ = విమానం (Aeroplane)
సమగ్రవంతం = సంపూర్ణము కావడం
సహకరించారు = సాయం చేశారు
కోర్సు (course) = పాఠ్య ప్రణాళిక
డిజైన్ (design) = నమూనా, ప్రణాళిక (Design)
ప్రగతి = అభివృద్ధి
సమీక్షించి = పరామర్శించి
పురోగతి = ముందుకు నడచుట
నిరాశాజనకం = నిరాశను పుట్టించేది
సాకులు = వంకలు
వ్యవధి = మేర,ఎడమ
భాగ్య రేఖ = అదృష్ట రేఖ
నిమగ్నుడు = మునిగినవాడు
కావలించుకొని = ఆలింగనం చేసుకొని
ప్రశంసాత్మకంగా = పొగడబడే విధంగా
వెన్నుతట్టు = ధైర్యము చెప్పు
నెడుతున్నాను = గెంటుతున్నాను
ఆసక్తి = అపేక్ష
మార్గదర్శి = మార్గాన్ని చూపేవాడు
మహామేధావి = గొప్ప తెలివి కలవాడు
వీడ్కోలు = పోవడానికి అంగీకారం తెల్పడం
ఇంజన్ ఓవర్ హాలింగ్ = ఇంజనను పరిశుభ్రం చేయడం
ప్రాక్టికల్స్ (practicals) = ప్రయోగాలు
ఉద్వేగాన్ని = కలతచెందిన మనస్సును
పసిగట్టడం = సూచనగా తెలిసికొను
డైనమిక్స్ = ఇది ఫిజిలో ఒక భాగం ప్రతిభ = తెలివి
అంశాలు = విషయాలు
బోధపడ్డాయి = అర్థమయ్యాయి
గ్రాడ్యుయేట్ (graduate)=పట్టభద్రుడు
చిరకాల స్వప్నం = చాలాకాలం నుండి ఉన్న కల
ఉపాధి అవకాశాలు = బ్రతుకు తెరువుకు దారులు
ఆధ్వర్యం = పెత్తనం
కాల్ లెటర్లు (call letters) = రమ్మని పిలిచే ఉత్తరాలు
కోరమాండల్ తీరం = భారతదేశానికి తూర్పు వైపున క్రింది భాగాన ఉన్న సముద్ర తీరాన్ని కోరమాండల్ తీరం అంటారు.
కోరమాండల్ తీరబాలుడు అంటే తూర్పు సముద్ర తూర్పు తీరాన పుట్టిన ‘కలాం’