AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 12th Lesson చిత్రగ్రీవం

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
చిత్రగ్రీవంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమి ఉన్నాయి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడువారాల వయస్సు ఉన్నప్పుడు అది తన గూట్లోకి వచ్చిన నల్లచీమను, తన ముక్కుతో పొడిచి చంపింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికి రానిది. చీమ పావురాల జాతికి స్నేహితుడు. చీమను తినే వస్తువని భావించి చిత్రగ్రీవం దాన్ని పొడిచి చంపింది. తరువాత తాను చేసిన పని తప్పని చిత్రగ్రీవం పశ్చాత్తాపపడి ఉంటుంది.

అందుకేనేమో చిత్రగ్రీవం, మళ్ళీ ఎప్పుడూ తన జీవితంలో మరోసారి చీమను చంపలేదు – తాను చేసిన తప్పును గ్రహించిన చిత్రగ్రీవం, తిరిగి ఎప్పుడూ ఆ తప్పు చేయకపోడం, ఆశ్చర్యకరమైన విషయం.

ప్రశ్న 2.
మానవులకు, పావురాలకూ స్నేహం ఉందని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఏనుగులు, పావురాలు తమ యజమానుల పట్ల ఎక్కువగా విశ్వాసాన్ని కనబరుస్తాయి. అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు, తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. రోజంతా ఎక్కడ ఎక్కడ తిరిగినా, చివరికి పావురాలు తమకు గల అద్భుతమైన దిశాపరిజ్ఞానంతో, అంతః ప్రేరణా బలంతో తమకు మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకు చేరతాయి.

దీనినిబట్టి పావురాలకూ, మానవులకూ స్నేహం ఉందని చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
చిత్రగ్రీవం పాఠ్య రచయితను గురించి వ్రాయండి.
జవాబు:
చిత్రగ్రీవం పాఠ్యాంశం ‘చిత్రగ్రీవం – ఓ పావురం కథ’ అనే పుస్తకం నుండి గ్రహించబడింది. దీనిని ధనగోపాల్ ముఖర్జీగారు రచించారు. దానిని దాసరి అమరేంద్రగారు తెలుగులోనికి అనువదించారు.

దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా సంస్థ ప్రచురించింది. ధనగోపాల్ ముఖర్జీ తన 19వ ఏటనే అమెరికా వెళ్ళారు. కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో చదువుకొన్నారు. రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం ఆయన ప్రవృత్తి. కలకత్తాలో జన్మించారు.

వీరు 1890 నుండి 1936 వరకు జీవించారు.

ప్రశ్న 4.
ధనగోపాల్ ముఖర్జీ సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీగారు జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.

1922లో ఆయన వ్రాసిన ‘కరి ది ఎలిఫెంట్’ ప్రసిద్ధమైన రచన, 1924లో ‘హరిశా ది జంగిల్ ల్యాండ్’, 1928లో ‘గోండ్ ది హంటర్’ చాలా ప్రసిద్ధమైన రచనలు.

1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ బెరీ మెడల్’ బహుమతిని అందించారు. ఈ బహుమతిని గెల్చుకున్న భారతీయ రచయిత ధనగోపాల్ ముఖర్జీ మాత్రమే.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిత్రగ్రీవం యొక్క సొగసులను, చేష్టలను వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లిపక్షి, తండ్రిపక్షి కలిసి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. క్రమంగా దాని గులాబీ రంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్ల దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.

పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీరు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లిపక్షి లాలించింది.

చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల మరో పావురం లేదని రచయిత చెప్పాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 2.
పావురాల నుండి మానవులు నేర్చుకోవలసిన విషయాలు ఏవి?
జవాబు:
1) పావురాలు తమ యజమానులపై మంచి విశ్వాసాన్నీ, ప్రేమనూ చూపించి, యజమానులంటే ప్రాణం పెడతాయి. మానవులలో కొందరు యజమానుల పట్ల విశ్వాసం లేకుండా ఉంటారు. అది తప్పు, తమకు అన్నం పెట్టే యజమానిపై విశ్వాసం ఉండాలి. కాబట్టి పావురాల నుండి మానవులు యజమానులపై విశ్వాసాన్ని చూపడం అనే మంచి గుణం నేర్చుకోవాలి.

2) చిత్రగ్రీవం అనే పావురము ఒకసారి తన గూటికి వచ్చిన నల్లచీమను చూసి, తాను తినే వస్తువు అనుకొని దానిని ముక్కుతో పొడిచి చంపింది. తరువాత చీమను పావురాలకు స్నేహితుడిగా అది తెలిసికొంది. తిరిగి అది తన జీవితంలో చీమను చంపలేదు. చిత్రగ్రీవం తన తప్పును తెలిసికొని పశ్చాత్తాప పడింది. చేసిన తప్పు అది తిరిగి చేయలేదు.

మనిషి మాత్రం చేసిన తప్పునే తిరిగి తిరిగి చేస్తాడు. కాబట్టి మానవులు పావురాల నుండి, చేసిన తప్పును తిరిగి చేయకపోడం అనే మంచి గుణాన్ని తప్పక నేర్చుకోవాలి.

ప్రశ్న 3.
పక్షులను, జంతువులను పెంచడం వల్ల ఉపయోగాలు ఏవి?
జవాబు:
పక్షుల పెంపకం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనము కోడి, నెమలి, చిలుక వంటి పక్షులను పెంచుతాము. కోడి, గ్రుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు మంచి పోషకాహారము. గుడ్లు, సంపూర్ణమైన బలమైన ఆహారం క్రిందికి వస్తాయి. కోళ్ళను పెంచి గుడ్లను అమ్మితే మంచి లాభాలు వస్తాయి. తాము తినడానికి పనికి వస్తాయి. పక్షుల మాంసం ఆహారంగా ఉపయోగిస్తుంది. చిలుక చక్కగా కబుర్లు చెపుతుంది. కాబట్టి పక్షులను పెంచాలి.

జంతువుల పెంపకం వల్ల చాల లాభాలు ఉన్నాయి. ఆవు, గేదె వంటి జంతువులు పాలను ఇస్తాయి. పాలు సంపూర్ణ ఆహారం. పాలనూ, పాల ఉత్తతులనూ అమ్మి లాభాలు తీస్తారు. వాటి పేడతో గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎరువులు తయారు చేయవచ్చు. పందులు వంటి వాటిని పెంచి వాటిని అమ్మి లాభాలు గడించవచ్చు. మేకలు, గొట్టెలు వల్ల పాలే కాకుండా, దాని బొచ్చు వల్ల ఉపయోగాలు ఉన్నాయి. గొట్టె బొచ్చుతో కంబళ్ళు చేయవచ్చు. వాటి మాంసం తినవచ్చు. ఎద్దులు, దున్నలు వ్యవసాయానికి పనికివస్తాయి. వాటితో బళ్ళు కట్టి సరకులను రవాణా చేయవచ్చు. కుక్క కాపలా కాస్తుంది. ఈ విధంగా పక్షులు, జంతువుల పెంపకం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 4.
కింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
చిత్రగ్రీవం :
తెలివైనది. చురుకైనది. చిన్నతనంలో మందకొడి. తల్లిదండ్రుల అభిమానాన్ని, అనురాగాన్ని పూర్తిగా అనుభవించింది. తన చిలిపి చేష్టలతో రచయితను అలరించింది. తన అందంతో చూపరులను మైమరపింపజేస్తుంది. . తండ్రి పక్షి : గ్రుడ్డును పొదగాలనే ఆత్రుత ఎక్కువ. ఇది గిరికీల మొనగాడు. వేగం, చురుకుదనం, సాహసం కలది. రచయిత ముఖంపై కొట్టి ఒక గ్రుడ్డు చితికిపోవడానికి కారణమయ్యింది. తొందర ఎక్కువ. చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది.

తల్లి పక్షి :
తెలివైన పావురం. గ్రుడ్డులోంచి పిల్ల బయటికి వచ్చే సమయాన్ని కచ్చితంగా అంచనా వేయగలదు. చిత్రగ్రీవాన్ని కంటికి రెప్పలా కాపాడింది. ఆహారం, భద్రత కల్పించింది. మేలుజాతి పావురాన్ని ప్రపంచానికి అందించిన ధన్యజీవి.

రచయిత :
పక్షి ప్రేమికుడు. పక్షుల పెంపకం అంటే చాలా ఇష్టం. వ్యక్తిగత శ్రద్ధతో పావురాలను పెంచుతాడు. జంతువులను కూడా పెంచుతాడు. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తాడు. పక్షులకు చిన్న గాయమైనా తట్టుకోలేడు. గ్రుడ్డు పగిలిపోయినందుకు చాలా బాధపడ్డాడు. సున్నిత స్వభావి.

ప్రశ్న 5.
శిశువుల పెంపకంలో పక్షుల దగ్గర నుంచి మనుషులు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయా? “చిత్రగ్రీవం” పాఠం ఆధారంగా చర్చించండి.
జవాబు:
శిశువుల పెంపకంలో పక్షుల దగ్గర నుంచి మనుషులు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి.

  1. చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి, తండ్రి పక్షి కలిసి అనురాగంతో పెంచాయి. దీన్నిబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను అనురాగంతో పెంచాలనే విషయాన్ని వాటి నుండి నేర్చుకోవాలి.
  2. పక్షి తన పిల్లలకు గూటిలో సుఖ సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేస్తుంది. అదే విధంగా మనుషులు తమ పిల్లలకు పక్క ఏర్పాట్లలో శ్రద్ధ వహించాలనే విషయాన్ని గ్రహించాలి.
  3. పక్షి పిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందించి వాటి పెరుగుదలకు సహాయపడతాయి. మనుషులు కూడా తమ చంటిపిల్లల నోటికి ఆహారాన్ని అందించి వారి ఎదుగుదలకు పాటుపడాలి.
  4. చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి, దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండేవి. అలాగే మనుషులు కూడా పిల్లలను లాలిస్తూ వారి బాగోగులను గురించి పట్టించుకోవాలి.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Important Questions and Answers

ప్రశ్న 1.
పక్షులను, జంతువులను సంరక్షించవలసిన అవసరం గురించి తెలియజేస్తూ మీ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

లేఖ

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన మిత్రుడు శంకరు,
నీ మిత్రుడు శ్రీనివాస్ వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మా తెలుగు పాఠ్యపుస్తకంలో ‘చిత్రగ్రీవం’ పాఠం చదువుకొన్నాం. దానిని ధనగోపాల్ ముఖర్జీగారు రచించారు. దాసరి అమరేంద్రగారు తెలుగులోనికి అనువదించారు. ఆ పాఠం ఒక పావురం గురించి, నాకు చాలా బాగా నచ్చింది.

ఈ మధ్య రేడియేషన్ ప్రభావం వల్ల చాలా పక్షిజాతులు అంతరించిపోతున్నాయని మా సైన్సు మాష్టారు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ వలన కూడా చాలా రకాల జంతుజాతులు అంతరించి పోతున్నాయట. అడవులు విచక్షణా రహితంగా నరికేయడం వల్ల కూడా జంతువులకు రక్షణ పోయింది.

పక్షులు, జంతువులను సంరక్షించుకొంటేనే మన మనుగడకు మంచిది. మనకు గ్రుడ్లు, మాంసమే కాక మానసిక ఆనందాన్ని కల్గించే అందమైన పక్షులను, జంతువులను కోల్పోకూడదు. ఈ విషయంలో అందరినీ చైతన్యపరచాలి. మానవజాతికి విశ్వాస పాత్రంగా సేవలు చేసేవి పక్షులు, జంతువులే కద. మన ప్రగతికి మూలం అవే, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.

మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
నీ చెలికాడు,
ఆర్. శ్రీనివాస్.

ప్రశ్న 2.
జంతు సంరక్షణ గురించి వ్యాసం రాయండి.
జవాబు:
జంతు సంరక్షణ

సైన్సు ప్రకారం మానవుడిని కూడా జంతువుగానే పరిగణిస్తారు. కాని, జంతువులకు లేని ‘మాట’ మనిషికి ఉంది. ఆలోచన మొదలైనవన్నీ జంతువులకూ, మానవులకూ సమానమే.

కాని, మన ఆలోచన, తెలివి తేటలు మొదలైన వాటి వలన జంతులోకానికి తీరని నష్టం కలుగుతోంది. ఆది మానవుడు జంతువులకు భయపడ్డాడు. పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఆధునిక మానవుని చేతిలో అంతరించి పోతున్నాయి.

అడవి జంతువుల చర్మాలు, పులిగోళ్లు, ఏనుగు దంతాలు మొదలైనవి ఇతర దేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకొనేందుకు అడవి జంతువులను చంపుతున్నారు. వీరప్పన్ వంటి స్మగ్లర్ల వలన ఎన్నో ఏనుగులు, పులులు నశించిపోయాయి. అటువంటి వారి పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. అటువంటి విషయాలు ఎవరికి తెలిసినా వెంటనే పోలీసులకు, అటవీశాఖాధికారులకు తెలియజేయాలి.

పెంపుడు జంతువులను కబేళాలకు తరలించడం కూడా పెరిగిపోయింది. దీనిని కూడా అరికట్టాలి.

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను గ్రామగ్రామాన నెలకొల్పి జంతువులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో ప్రజలంతా సహకరించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
జంతువులను, పక్షులను కాపాడమని కోరుతూ ఒక కరపత్రం తయారుచెయ్యండి.
జవాబు:
జంతు పక్షి రక్షణ

సోదరులారా! భగవంతుడు 84 కోట్ల జీవరాశులను సృష్టి చేశాడట. భగవంతుడు సృష్టించిన జీవరాశులు అన్నీ ఉపయోగకరమైనవే. అందులో ముఖ్యంగా జంతువులను మనం రక్షించుకోవాలి. సాధుజంతువులయిన ఆవు, మేక, గేదె, గొట్టె వంటి వాటినే కాదు. అడవి జంతువులయిన సింహం, పులి, మొదలయిన వాటిని కూడా మనం రక్షించుకోవాలి.

వన్య జంతురక్షణను మనం ఉద్యమంగా చేపట్టాలి. అడవులలోని పులి, సింహం వంటి వాటిని వేటాడి చంపడం వల్ల పాపం వస్తుంది. అంతేకాదు అడవులకు రక్షణ పోతుంది. దానితో అడవులు తగ్గి వర్షాలు రాకుండా పోతాయి. మనకు కావలసిన కలప వగైరా రాకుండా పోతాయి.

ముఖ్యంగా మనం చల్లే క్రిమి సంహారక మందుల వల్ల ఎన్నో పక్షులు చచ్చిపోతున్నాయి. మొక్కలకు పట్టే చీడపురుగుల్ని ఎన్నింటినో పక్షులు తిని మొక్కలను కాపాడతాయి. దానివల్ల చీడపీడలు రాకుండా పోతాయి. సీతాకోకచిలుకల వల్లనే మొక్కల్లో పరపరాగ సంపర్కం జరిగి, అవి కాయలు కాస్తున్నాయి. పక్షులు మానవజాతికి స్నేహితులు, వాటిని రక్షించుకుందాం.

ఆవులు, గేదెలు వంటి వాటిని రక్షించుకుంటే, మంచి పాలు ఉత్పత్తి అవుతాయి. మంచి పాలు వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఆవులు, గేదెలు, మొ|| వాటిని మాంసం కోసం చంపకండి. పాడి పశువులను పెంచుకుంటే రైతులకు మంచి లాభాలు వస్తాయి. సేంద్రియ ఎరువులు లభిస్తాయి. రండి. కదలండి. ఉద్యమించండి. జంతు పక్షి రక్షణకు నడుం బిగించండి.

ఇట్లు,
పశుపక్షి రక్షణ సంస్థ,
కర్నూలు.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం, తల్లిదండ్రుల సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
(పాత్రలు : 1. చిత్రగ్రీవం 2. తల్లిపక్షి 3. తండ్రిపక్షి)
తండ్రిపక్షి : చూశావా భార్యామణీ! మన చిత్రగ్రీవం ఎంత అందంగా ఉందో!

తల్లిపక్షి : మన చిత్రగ్రీవం అంత అందాలరాశి, ఈ కలకత్తాలోనే లేదు.

తండ్రిపక్షి : బాగుంది. కానీ మన చిత్రగ్రీవానికి ఎగరడం ఇంకా రాలేదు. దీనికి బద్దకం ఎక్కువ.

తల్లిపక్షి : నేనూ అదే అనుకుంటున్నా. నేర్చుకుంటుంది లెండి.

తండ్రిపక్షి : ఏమిరా చిత్రగీవా! నీకు మూడునెలలు నిండాయి. బడుద్దాయిలా ఉన్నావు. ఎగిరే ప్రయత్నం ఏమీ చెయ్యవా ?

చిత్రగ్రీవం : ప్రయత్నం చేస్తా నాన్నా!

తండ్రిపక్షి : చిత్రగ్రీవా! నీవు అసలు పావురానివా? వానపామువా? (చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, గోడపై నుండి క్రిందికి త్రోసింది)

తల్లిపక్షి : ఏమిటి? చిత్రగ్రీవాన్ని అలా తోస్తున్నారు?

తండ్రిపక్షి : ఇలా చేస్తేగాని వీడికి ఎగరడం రాదు.

తల్లిపక్షి : చాల్లెండి. వాడికి దెబ్బ తగులుతుంది. నేనే వాడిని పట్టుకుంటాను. చూడండి.

చిత్రగ్రీవం : అమ్మా! నువ్వు నన్ను బాగానే పట్టుకొన్నావు. లేకపోతే పడిపోదును.

తల్లిపక్షి : నాయనా! ఆయాసం వచ్చిందా? ఫర్వాలేదులే నా దగ్గరగా రా!

చిత్రగ్రీవం : అమ్మయ్యా! కొద్దిగా ఎగరడం వచ్చింది.

తండ్రిపక్షి : అంతే! నీవూ ఎగురగలవు. సరేనా ? ధైర్యం వచ్చింది కదూ!

తల్లిపక్షి : ఇంక ఎప్పుడూ ఇలా చేయకండి. చిత్రగ్రీవం చిన్నపిల్లాడు.

తండ్రిపక్షి : నేర్పితే గాని ఏ విద్యా రాదు. మన చిత్రగ్రీవానికి కొంచెం బద్దకం ఎక్కువ కదా! అందుకే అలాచేశా.

చిత్రగ్రీవం : చూడు నాన్నా! రేపటి నుండి నేను కూడా ఎగిరి గింజలు తెచ్చుకొని తింటా.

తల్లిపక్షి, తండ్రిపక్షి : సెభాష్! చిత్రగ్రీవా! హాయిగా ఎగురు. నీకు ఏమీ కాదు. మేముంటాం.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 1 Mark Bits

1. “శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది” – ఇందులోని అలంకారం (March 2017)
A) రూపకం
B) ఉపమ
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు:
B) ఉపమ

2. చిత్రగ్రీవం చిన్నతనంలో చురుకుగా ఉండేది కాదు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి. (June 2018)
A) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది.
B) చిత్రమైన ముక్కు గలది.
C) చిత్రమైన శరీరం గలది.
D) చిత్రమైన చూపులు గలది.
జవాబు:
A) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

3. “అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు” – అనే వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి. (June 2018)
A) మిత్రుడు
B) ఈశ్వరుడు
C) గురువు
D) పుత్రుడు
జవాబు:
C) గురువు

4. “భ, జ, స, నల, గగ” అనే గణాలతో కూడిన పద్యం పేరును గుర్తించండి. (June 2018)
A) సీసము
B) కందము
C) మత్తేభము
D) శార్దూలము
జవాబు:
B) కందము

5. “నాకు ఎగరడం తెలుసును” అని చిత్రగ్రీవం అన్నది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. (March 2018)
A) ‘నాకు తెలుసును ఎగరడం’ అని చిత్రగ్రీవం అన్నది.
B) ‘నాకు తెలియదు ఎగరడం’ అని చిత్రగ్రీవం అన్నది.
C) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది.
D) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అనలేదు.
జవాబు:
C) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది.

చదవండి – తెలుసుకోండి

విశ్వకవి “గీతాంజలి”

సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి “జనగణమన” గీతం, “గీతాంజలి”. “జనగణమన” గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతినికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి “గురుదేవుడు”గా కీర్తింపబడ్డారు. ఈ సంస్థ ద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించారు.

కవిగా వీరికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన “గీతాంజలి” 1913లో దీనికి “నోబెల్ సాహిత్య పురస్కారం” దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందారు. “గీతాంజలి” భారతీయ భాషల్లోకి మాత్రమేకాక విదేశీయ భాషలెన్నింటిలోకి అనువాదమయింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.

“గీతాంజలి” లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు. – చలం

2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన.
నా సుఖదుఃఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి.
పేదలను కాదనకుండా, అధికార దర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు.
నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె భాగ్యలక్ష్మి