AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 7 ఆడినమాట Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Telugu Solutions 7th Lesson ఆడినమాట
9th Class Telugu 7th Lesson ఆడినమాట Textbook Questions and Answers
చదవండి-ఆలోచించండి-చెప్పండి
ఒక అడవిలో వేటగాడు వేటకోసం వచ్చి చెట్లను, పొదలను తొ! శిస్తున్నాడు. ఆ పొదల్లోంచి ఒక పాము బయటకు వచ్చి చెట్లను నరకవద్దు నీకు సహాయం చేస్తానని చెప్పి ఒక రత్నం ఇచ్చింది. దాన్ని అతడు ఎక్కువ ధరకు అమ్మి ధనవంతుడయ్యాడు. చేసిన మేలు మరచి అతడు పాముకు ఇన్ని మణులెక్కడివని ఆలోచించి పుట్టను కనుక్కొని అందులో ఎండు గడ్డి వేసి మంటపెట్టాడు. ఆ మంటలకు పాము చనిపోయింది. మణుల కోసం పుట్టను తవ్వుతుండగా మిగతా పాములు కరచి అతడు చనిపోయాడు. ‘కృతజ్ఞత’ లేని నరుడు క్రూరమైనవాడు కదా !
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
చెట్లను నరక వద్దని పాము అనడానికి కారణమేమిటి?
జవాబు:
ఆ చెట్ల మధ్య, పొదల మధ్య ఆ పాము పెట్టిన పుట్ట ఉంది. ఆ పాము, ఆ పుట్టలో నివసిస్తోంది. తనక. నివసించడానికి పుట్ట లేకుండా పోతుందనే భయంతో పాము వేటగాడిని చెట్లను నరక వద్దని చెప్పింది.
ప్రశ్న 2.
వేటగాడు పామును ఎందుకు చంపాడు?
జవాబు:
వేటగాడికి పాము ఒక రత్నాన్ని ఇచ్చింది. దాన్ని అమ్మి వేటగాడు ధనవంతుడయ్యాడు. పాము పుట్టలో ఇంకా మరెన్నో రత్నాలు ఉంటాయని వేటగాడు ఆశించాడు. అందుకే వేటగాడు పుట్టను కనిపెట్టి ఎండుగడ్డితో దానిపై మంట వేసి పామును చంపాడు.
ప్రశ్న 3.
వేటగాడి స్వభావం ఎలాంటిది? ఇలాంటిదే మరో కథ తెలుసా మీకు?
జవాబు:
వేటగాడు, చేసిన మేలు మరచిపోయే స్వభావం కలవాడు. అనగా కృతజ్ఞత లేనివాడు. దురాశాపరుడు. పాము తనకు చేసిన మేలును మరచి, ఆ పాము పుట్టనే మంట పెట్టి ఆ పామును చంపాడు. ఈ వేటగాడు కృతఘ్నుడు. ఇలాంటి కథ మరొకటి నాకు తెలుసు.
కృతఘ్నతగల మరో జంతువు (పులి) కథ :
పూర్వము ఒక పులి, అడవిదున్నపోతును చంపి తింది. అప్పుడు పులి దవడలో ఒక ఎముక గ్రుచ్చుకుంది. పులి ఎంత విదల్చినా ఆ ఎముక ఊడి రాలేదు. పులి బాధతో విలవిలలాడింది. అప్పుడు ఆ పులి ఒక సూచీ ముఖ పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగి తనకు సాయం చేయమని కోరింది. ఆ పక్షి, పులి మాటలు నమ్మి ఆ ఎముకను తన ముక్కుతో లాగింది. పులి బాధ తీరిపోయింది. తరువాత పులి, ఆ పక్షి స్నేహం కొనసాగించాయి. అప్పుడప్పుడు ఆ పక్షి, పులి నోట్లో గుచ్చుకున్న ఎముకలను లాగి ఉపకారం చేస్తూ ఉండేది. ఒక రోజున ఆ పులికి ఆహారం ఎక్కడా దొరకలేదు. పులి, పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగమని చెప్పింది. పక్షి పులిమాటలు నమ్మి, పులి నోట్లో దూరి ఎముకను లాగుదామని చూస్తుండగా పులి ఆ పక్షిని కఱచి చంపింది. ఆ పులికి కృతజ్ఞత లేదు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.
ప్రశ్న 1.
పాఠంలో ఆవు మాట్లాడిన విషయాన్నీ, పద్యాలనూ రాగయుక్తంగా పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
ఆవు మాట్లాడిన పద్యములు ఇవి. 1, 2, 4, 9, 10 వీటి భావాలను “పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు”లో చూడండి.
ప్రశ్న 2.
అట్లాగే పులి మాట్లాడిన విషయాలున్న పద్యాలను రాగంతో పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
పులి మాట్లాడిన పద్యములు : 3, 13, 14
ఈ పద్యాల భావాలు “ప్రతిపదార్థాలు – భావాలు” వద్ద చూడండి.
ప్రశ్న 3.
క్రింది వాటిలో ఏదైనా ఒకదాన్ని సమర్థిస్తూ సరైన కారణాలతో మాట్లాడండి.
అ) “ఆడినమాట తప్పని ఆవు చాలా గొప్పది” – ఎందుకంటే …….
జవాబు:
ఆవు, పులికి మాట ఇచ్చిన విధంగా తన పుత్రునికి పాలిచ్చి, తనను తినివేయమని పులి వద్దకు తిరిగి వచ్చింది. అందుకే ఆవు గొప్పది.
ఆ) స్వభావరీత్యా పులి క్రూరమైన జంతువు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఆవును చూసి, మారిన పులి ఇంకా గొప్పది. ఎందుకంటే ………
జవాబు:
పులి సహజంగా మాంసం తినే జంతువు. అయినా ఆడినమాట తప్పని ఆవును చంపలేదు. ఆవు వంటి మహాత్ముణ్ణి చంపితే తనకు అంతులేని పాపం వస్తుందని పులి చెప్పింది. ఆవును తిరిగి తన దూడవద్దకు పంపించింది. కాబట్టి పులి ఇంకా గొప్పది.
ఇ) ‘ఆడిన మాట ప్రకారం వచ్చిన ఆవు, మారిన పులి రెండూ గొప్పవే’. ఎందుకంటే ……….
జవాబు:
ఆవు ఆడిన మాటను నిలబెట్టుకుంది. కనుక ఆవు గొప్పది. పులి హింసా ధర్మాన్ని మాని, ఆడిన మాట తప్పని ఆవును చంపకుండా దయతో విడిచి పెట్టింది. కాబట్టి పులి గొప్పది.
ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
అ) చెప్పేవారు చెప్పినా, వినేవారికి వివేకముండాలి.
జవాబు:
“చెప్పెడువారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె?” ఈ మాటలను పులి, ఆవుతో అంది.
ఆ) నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు.
జవాబు:
“మెత్తని మనసే నాయది యెత్తి యిటులు చూడనేల”? ఈ మాటలను ఆవు తనను తినమని, పులిని బ్రతిమలాడుతూ చెప్పినది.
ఇ) నీవు ధర్మం తెలిసినదానివి. నీకెవ్వరూ సాటిలేరు.
జవాబు:
నీవు ధర్మవిదురాలవు. నీకెన యెవ్వరు? ఈ మాటలను పులి, ఆవును ప్రశంసిస్తూ చెప్పింది.
ఈ) నిన్ను కన్నందుకు ఋణవశాన ఇన్ని రోజులు సాకి పాలు ఇచ్చాను.
జవాబు:
“నిన్ను గని యిన్ని దినములు చన్నిచ్చితి ఋణవశంబున” ఈ మాటలను గోవు తన దూడతో అంది.
ఉ) ఇంతమాత్రానికే నా, ప్రాణాలు పోతాయా?
జవాబు:
“ప్రాణములింతనె పోవుచున్నవే?” ఈ మాటలను పులి, ఆవుతో చెప్పింది.
ఇ) పాఠం ఆధారంగా కింద ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) పులిని ఆవు ఏమని వేడుకున్నది? ఎందుకు?
జవాబు:
పులిని ఆవు తనకు ఏడెనిమిది రోజుల క్రితమే పుట్టిన కుమారునకు పాలు ఇచ్చి వస్తానని వేడుకున్నది. తనకు కుమారుడు జన్మించి ఏడెనిమిది రోజులు మాత్రమే అయినది వానికి ఇంకా గడ్డి మేయుట చేతకాదని కావున వానికి పాలిచ్చి తగు జాగ్రత్తలు చెప్పిరావడానికి పులిని వేడుకున్నది. ఈ
ఆ) ఆవు మాటలు విన్న పులి ఏమన్నది? ఏం చేసింది?
జవాబు:
ఆవు మాటలు విన్న పులి, ఆవును అపహాస్యం చేసి ‘ఓ గోవా ! నీవు మాట్లాడుతున్నదేమిటి? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది సమంజసమేనా? చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకం ఉండవద్దా? అన్నది.
ఇ) ఆవు తన కొడుకుకు ఏమని బుద్దులు చెప్పింది?
జవాబు:
ఎప్పుడూ అబద్దాలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలిసి ఉండకు. ఇతరులెవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లుగా ఉండి ఎదురు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని బుద్ధులు చెప్పింది.
ఈ) తిరిగి వచ్చిన ఆవును చూసి పులి ఏమన్నది?
జవాబు:
నీ వంటి మహాత్ములను చంపి, పాపాన్ని మూటకట్టుకోలేను. కావాలంటే నాకు మాంసం ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం నా చేత గడ్డి తినిపించునా? (పాపాన్ని ఎందుకు చేయిస్తాడు?) ఇంత మాత్రానికే ప్రాణాలు పోతాయా ఏం”? అని పులి తిరిగి వచ్చిన ఆవుతో పలికింది.
ఉ) తినడానికి నిరాకరించిన పులితో ఆవు ఏమన్నది?
జవాబు:
“ఓ పుణ్యాత్ముడా ! ఈ కథలన్నీ ఎందుకు ? నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు. నేనీ శరీరాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా” అని తనను తినడానికి నిరాకరించిన పులితో ఆవు పలికింది.”
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
అ) ఈ కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఆకలితో ఉన్న పులిని ఆవు తన ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పించింది కదా ! పులి ఆవును నమ్మడానికి గల కారణాలు ఏమిటి?
(లేదా)
పులిని ఆవు ఏ మాటలతో నమ్మించింది?
జవాబు:
తాను తిరిగిరాకపోతే – అబద్ధాలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడు, తండ్రికి, తల్లికి ఎదురుమాట్లాడేవాడు, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేయుచున్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ నరకాల్లో పడతారో, తిరిగి రాకుంటే తాను కూడా అదే నరకాలలో పడతానని శపథం (ప్రమాణం) చేస్తుంది. కావున ఆవు మాటలను పులి నమ్మినది.
ప్రశ్న 2.
ఆవు తాను తిరిగి అడవికి వెళ్ళేముందు అబద్దమాడకు, పనికిరానివాళ్లతో తిరగకు అని బుద్ధులు చెప్పింది కదా ! ఆవు తన బిడ్డకు ఇంకా ఏమేమి బుద్దులు చెప్పి ఉండవచ్చు?
జవాబు:
- పక్క వారితో విరోధాలు పెట్టుకోకు
- అందరితో స్నేహం చెయ్యి
- వేళకు మేత తిను
- మేత తిని చక్కగా కడుపు
నిండా నీళ్లు తాగి హాయిగా పడుకో వంటి నీతులు ఆవు దూడకు చెప్పవచ్చు.
ప్రశ్న 3.
ఇతరులు ఎవరైనా కీడును కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లు ఉండి, వెళ్ళమని ఆవు తన కొడుకుతో చెప్పింది కదా ! అలా అనడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
ఇతరులు కీడు కలిగించే మాటలు, పొగరుబోతుతనంతో మాట్లాడవచ్చు. ఆ మాటలకు భయపడి కూర్చుంటే మనం సంఘంలో ఏమీ చేయలేము. ఎవరికీ భయపడరాదు. ధైర్యంగా ఉండాలి. ఇతరులు నిందిస్తే తిరిగి వారిని నిందించరాదు. అలా ఎదురు మాటలు మాట్లాడితే తగవులు వస్తాయి. అందుకే ఆవు “ఎవరు ఏమి అన్నా భయపడకు. వారి మాటలు
పట్టించుకోకు” అని తన కొడుకుకు చెప్పింది.
ప్రశ్న 4.
“ఈ కథలన్నీ ఎందుకు” ? అని ఆవు అన్నది కదా ! ఈ మాటలనే ఇప్పుడు కూడా వాడుతుంటారు. ఏ ఏ సందర్భాల్లో వాడుతుంటారు?
జవాబు:
- మనం ఎవరినైనా ఎక్కడకైనా ఏదో పనిమీద పంపిస్తే, వాడు ఆ పని చేయకుండా ఎక్కడో తిరిగి వస్తాడు. పని ఏమయిందిరా అని అడిగితే ఏవో కథలు చెపుతాడు.
- పరీక్షలో ఎందుకు మంచి మార్కులు రాలేదంటే ఏవేవో కారణాలు చెపుతాడు. అప్పుడు పెద్దలు వాడితో “ఏవేవో కథలు చెప్పకు” అంటారు.
ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“ఆవు-పులి” వంటి స్వభావం ఉన్నవాళ్ళు సమాజంలో ఉంటారు కదా ! వీరి స్వభావం ఎలా ఉంటుంది?
జవాబు:
ఆవు వంటి స్వభావం ఉన్నవాళ్ళు మన సమాజంలో ఉంటారు. వారు ఇతరులకు కష్టం వస్తే చూసి సహించలేరు. తనకు కష్టం కలిగినా, ఇతరులకు మేలు చేయాలనే చూస్తారు. తనకు కడుపునిండా తిండి లేకపోయినా, ఇతరులు కషాల్లో ఉన్నప్పుడు తనకు ఉన్నదంతా ధారపోసి ఎదుటివారిని ఆదుకుంటారు. సమాజంలో ఉన్నవారినందరినీ తనలాగే చూస్తారు. తనకు కష్టం వస్తే ఎలాగుంటుందో, ఇతరులకూ అలాగే ఉంటుందని వారు అనుకుంటారు.
ఆవు వంటి స్వభావం కలవారు ఎన్నడూ అబద్ధం మాట్లాడరు. ఆడినమాట కోసం తమ ప్రాణాలనైనా ధారపోస్తారు.
పులి వంటి స్వభావం కలవాళ్ళు తమ స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తారు. ఇతరులు ఎంత నష్టపోయినా వీరు పట్టించుకోరు. తమకోసం, తమవారి కోసం ఎదుటివారిని కష్టపెట్టి తమ ప్రయోజనాన్ని సాధించుకుంటారు.
పులి వంటి స్వభావం కలవారు అసత్యాలు మాట్లాడుతారు. అధర్మంగా నడచుకుంటారు. ఇతరులకు హాని చేస్తారు. పక్కవారి మంచిచెడ్డలను పట్టించుకోరు. పులి వంటి స్వభావం కలవారు అవసరమైతే ఇతరులను హత్యలు చేస్తారు. చేయిస్తారు, హింసిస్తారు, దుర్మార్గంగా నడుస్తారు.
ప్రశ్న 2.
“ఆవు” గుణగణాలను గురించి రాయండి.
జవాబు:
ఆవు ఆడినమాట తప్పని గోమాత. తన చిన్న బిడ్డకు పాలిచ్చి వస్తానని, వెళ్ళిరావడానికి తనకు అనుమతి ఇమ్మని పులిని బ్రతిమాలింది. తన బిడ్డకు గుమ్మెడు పాలు చాలునని, పులికి తన మాంసం అంతా తింటే కాని ఆకలి తీరదని, కాబట్టి ముందు తన పిల్లవాడికి పాలివ్వడం ధర్మమని నచ్చచెప్పింది. తాను అబద్ధం ఆడనని శపథాలు కూడా మాట్లాడి పులిని నమ్మించింది.
ఇంటికి వెళ్ళి ప్రేమతో కుమారుడికి పాలిచ్చి బుద్దులు చెప్పింది. ఆవు చెప్పిన బుద్ధులను బట్టి ఆవు స్వభావం చాలా మంచిదని తెలుస్తుంది. జరిగింది చెప్పి, కొడుకును ఓదార్చి పులి వద్దకు తిరిగి వచ్చింది. తన మనస్సు అసలే మెత్తనిదనీ ఇంకా పరీక్షించవద్దనీ పులికి చెప్పి, తనను తినమని పులిని బ్రతిమాలింది. దేవతలు సైతం ఆవు సత్యవాక్యశుద్ధిని మెచ్చుకున్నారు.
ప్రశ్న 3.
కథలో ఆవు గొప్పదనాన్ని తెలిపే సంఘటన ఏది? అట్లాగే పులి గొప్పదనాన్ని తెలిపే సన్నివేశం ఏది?
జవాబు:
ఆవు గొప్పదనం :
ఆవు తిరిగి వచ్చి పులిని తనను తిని కడుపు నింపుకోమంది. పులి, ఆవును చంపితే తనకు పాపం వస్తుందని చెప్పింది. అప్పుడు ఆవు పులితో “తనది అసలే మెత్తని మనస్సు అనీ, తనను ఇంకా పరీక్షించవద్దని చెప్పింది. అలాగే దూడకు బుద్ధులు చెప్పిన సంఘటన కూడా ఆవు గొప్పదనాన్ని తెలుపుతుంది.
పులి గొప్పదనం :
ఆవు చేసిన శపథములు విని, ఆవు ధర్మాత్మురాలని మెచ్చుకొని ఆవును నమ్మి ఇంటికి పంపిన ఘట్టంలో పులి గొప్పదనం తెలుస్తుంది. తిరిగివచ్చిన ఆవును తింటే తనకు దోషమనీ, తనకు మాంసం ఎక్కడైనా దొరకుతుందనీ, తనను పుట్టించిన దేవుడే తనకు ఆహారం చూపిస్తాడనీ, పులి చెప్పిన మాటలు – పులి గొప్పదనాన్ని తెలుపుతాయి.
ఇ) సృజనాత్మకంగా రాయండి. .
“ఆవు – పులి” పాత్రల సంభాషణలు రాయండి. నాటకీకరణ చేయండి.
(లేదా)
క్రూర స్వభావం గల పులి, సాధు స్వభావం గల ఆవుల మధ్య జరిగిన సంభాషణను రాయండి.
(ఆవు-పులి)
జవాబు:
పులి : ఆగు ! ఆగు ! ఈ రోజు నువ్వు నాకు ఆహారం కావలసిందే.
ఆవు : పులిరాజా ! నేను చేసిన అపరాధమేమిటి?
పులి : (ఆవును పట్టుకొని) నాకు ఆకలిగా ఉంది. నిన్ను చంపి తింటాను.
ఆవు : అయ్యా ! పులిరాజా ! నాకు ఈ మధ్యే దూడ పుట్టింది. దానికి ఏడెనిమిది రోజులు ఉంటాయి. అది గడ్డి కూడా తినలేదు. దానికి పాలిచ్చి నీ దగ్గరికి వస్తా. నన్ను విడిచి పెట్టు.
పులి : అదేం కుదరదు. నీ మాటలు నేను నమ్మను.
ఆవు : వ్యాఘ్ర కులభూషణా ! నా మాట నమ్ము. నా బిడ్డకు గుమ్మెడు పాలతో కడుపు నిండుతుంది. నీకు నా మాంసం అంతా తింటే కాని తృప్తి తీరదు. ఈ రెండు పనుల్లో ఏది ముందు చేయాలో నీకు తెలుసు. నాకు అనుమతి ఇయ్యి. తొందరగా తిరిగి వస్తా.
పులి : (అపహాస్యంగా నవ్వి) ఓ గోవా ! ఇలా మాట్లాడుతున్నావేమిటి? నన్ను మోసపుచ్చి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి , వస్తానంటున్నావు. ఇది సమంజసంగా ఉందా? ఎవరైనా నీ మాటలు నమ్ముతారా?
ఆవు : అయితే శపథం చేస్తా. అబద్దాలాడే వాడు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాడు, మేస్తోన్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ దుర్గతికి పోతారో, నేను తిరిగి రాకపోతే అదే దుర్గతికి పోతా. నన్ను నమ్ము.
పులి : సరే. నేను నమ్మాను. వెళ్ళి త్వరగా రా.
ఆవు : (దూడకు పాలిచ్చి తిరిగి ఆవు పులి దగ్గరకు వచ్చి) పులిరాజా ! క్షమించు. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో.
పులి : శభాష్ ! మాట నిలబెట్టుకున్నావు. నీవు ధర్మాత్మురాలవు. పాపం మూటకట్టుకోలేను. నాకు మాంసం ఎక్కడైనా దొరకుతుంది. నీవు వెళ్ళిరా.
ఆవు : పులిరాజా ! నా మనస్సు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోకు. నా శరీరాన్ని నీకు ముందే వాగ్దానం చేశాను. నా రక్త మాంసాలతో నీ ఆకలి తీర్చుకో.
పులి : వద్దు వద్దు. నిన్ను నేను తినలేను. నీవు సత్యమూర్తివి. నీ ధర్మం నిన్ను కాపాడింది. వెళ్ళిరా !
(లేదా)
“ఆవు – పులి” రెండింటినీ ఒక కుందేలు చూసింది. ఆ కుందేలు వీటిని చూసి గొప్పగా గౌరవభావంతో పొగిడింది. ఆ కుందేలు ఆవును ఏమని పొగిడి ఉంటుంది? అట్లాగే పులిని ఏమని పొగిడి ఉంటుంది? ఊహించి రాయండి.
జవాబు:
కుందేలు ఆవును పొగడడం :
శభాష్ గోవా ! నీ వంటి ధర్మాత్మురాలిని నేను ఎక్కడా చూడలేదు. నీవు ఆడినమాటను నిలబెట్టుకున్నావు. నీ చిన్ని బిడ్డపై నీకు ఎంతో ప్రేమ ఉన్నా, దానిని విడిచిపెట్టి, ఇచ్చిన మాటకోసం పులికి ఆహారం కావడానికి సిద్ధపడ్డావు. సత్యవాక్యపాలనలో నీవు సత్యహరిశ్చంద్రుణ్ణి, బలిచక్రవర్తినీ, కర్ణుడినీ మించిపోయావు. నీవు లేదు మహాత్ముడివి. నిజానికి నీవు ధర్మమూర్తివి. నీ ధర్మమే నిన్ను కాపాడింది. నీ సత్యవాక్యశుద్ధిని, మనుష్యులూ, జంతువులూ, దేవతలూ సహితం మెచ్చుకుంటారు. భేష్.
కుందేలు పులిని మెచ్చుకోవడం :
శభాష్ పులిరాజా ! నీవు నిజంగా వ్యాఘ్రకుల భూషణుడవు. ఆవు పలికిన శపథాలు విని, దానిని నమ్మి, అది తన దూడకు పాలు ఇచ్చి రావడానికి, దానిని విడిచి పెట్టావు. అంతేకాదు అన్నమాట ప్రకారం తిరిగి వచ్చిన గోవును మెచ్చుకొని దాన్ని చంపకుండా విడిచిపెట్టావు. నీవు దయామూర్తివి. కరుణా సముద్రుడివి. దేవతలు సహితం నిన్ను పొగడకుండా ఉండలేరు.
ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
ఆవు తన కొడుక్కి మంచి బుద్ధులు చెప్పింది కదా ! అట్లాగే పిల్లలకు తల్లి చెప్పే బుద్ధులు ఏవి? ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులేవో రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :
- తోటి పిల్లలతో దెబ్బలాడవద్దు
- పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
- బట్టలు మాపుకోకు
- పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
- ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్ధగా రాసుకో
- అసత్యం మాట్లాడకు
- మధ్యాహ్నం భోజనం చెయ్యి
- చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొ||నవి.
ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :
- ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
- ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
- చదువుపై శ్రద్ధ పెట్టు
- ఆటలు ఆడుకో
- వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
- తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
- అసత్యం మాట్లాడకు
- తోటి బాలబాలికలను అన్నా చెల్లెళ్ళవలె ప్రేమగా గౌరవించు – మొ||నవి. “
ఆచరించాల్సినవి | ఆచరించాలని అనుకొన్నవి | నెల తరువాత |
ఆడిన మాట తప్పకపోవడం | ఆడిన మాట తప్పకపోవడం | లేదు |
అబద్ధం ఆడకుండా ఉండడం | అబద్దం ఆడకుండా ఉండడం | అవును |
సమయపాలన పాటించడం | భయపడకుండా ఉండడం | లేదు |
ఎవరైనా మనను సహాయం కోరితే సహాయం చేయడం | ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం | అవును |
భయపడకుండా ఉండడం | నిత్యం ఉదయం నడవడం | లేదు |
ఇంకేమైనా | ఆటలలో పాల్గొనడం | అవును |
IV. ప్రాజెక్టు పని
1. “ఆడినమాట తప్పరాదు!”, “సత్యవాక్కు” …… ఇలాంటి నీతికథలను మరికొన్నింటిని సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
జవాబు:
“బలిచక్రవర్తి – వామనుడి కథ” శ్రీమహావిష్ణువు వామనుడిగా పుట్టి, బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడిగాడు. ఇస్తానని బలి మాట ఇచ్చాడు. ఇంతలో బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు, వామనుడు శ్రీమహా విష్ణువని, బలిని మోసం చేయడానికే వచ్చాడని, దానం ఇయ్యవద్దని అడ్డు పెట్టాడు. ఆడినమాట తప్పని బలి, వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేశాడు. వామనుడు రెండు అడుగులతో భూమినీ, ఆకాశాన్ని కొలిచి, మూడవ అడుగు బలి తలపై పెట్టి అతణ్ణి పాతాళంలోకి తొక్కాడు. ఈ విధంగా బలి ఆడిన మాట తప్పలేదు.
(లేదా)
2. ఈ పాఠ్యపుస్తకంలోని పాఠాలు ఏఏకవులు/ఏఏరచయితలు రాసినవి? వాటి వివరాలు చార్టు మీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
III. భాషాంశాలు
పదజాలం
అ) కింది పదాలకు అర్థాలు రాసి సొంతవాక్యాలలో రాయండి.
అ. కడుపార (కడుపునిండుగా) : పసిపిల్లలు కడుపునిండుగా పాలు తాగితే ఏడవకుండా నిద్రపోతారు.
ఆ. సుకృతం (పుణ్యం) : మన గతజన్మ సుకృతమే నేడు మనము అనుభవించేది.
ఇ. బడబాగ్ని (సముద్ర జలములోని అగ్ని) : పేదల హృదయాలలో ఆకలి మంట, బడబాగ్నిలా విజృంభిస్తోంది.
ఈ. అపహాస్యం (ఎగతాళి) : పెద్దల హితవచనాలను ఎన్నడూ అపహాస్యం చేయరాదు.
ఉ. మెత్తని మనసు (మెత్తని గుండె) . : పేదలకు నా మిత్రుడు తన మెత్తని మనస్సుతో ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు.
ఊ. ప్రసన్నులైరి (సంతోషించారు) : మహర్షుల తపస్సులకు మెచ్చి దేవతలు ప్రసన్నులయ్యారు.
ఎ. గగనవీధి (ఆకాశవీధి) : హనుమ గగనవీధి గుండా ఎగిరి లంకకు చేరాడు.
ఏ. దుర్గతి (హీనదశ) : నేటి పేదల దుర్గతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
అ) కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) పూరి : గడ్డి, తృణం
ఆ) అగ్ని : శుచి, చిచ్చు, అగ్గి, మంట
ఇ) ప్రల్లదము : పరుషవాక్యం, కఠినపు మాట
ఈ) కొడుకు : కుమారుడు, సుతుడు, పుత్రుడు మజుడు
ఉ) సత్యం : నిజం, ఒట్టు
ఊ) సత్వరం : వెంటనే, త్వరితం, చయ్యన, త్వరగా
ఎ) పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
ఏ) ఆవు : గోవు, ధేనువు, మొదవు
ఇ) కింది వాక్యాలలో భావాన్ని బట్టి గీత గీసిన పదాలకు గల వేరువేరు అర్థాలను గుర్తించి రాయండి.
1. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలం అయ్యాయి.
సూర్యరశ్మి సోకగానే సరస్సులో పుండరీకం వికసిస్తుంది.
జవాబు:
పుండరీకం = పులి, పద్మం
2. సీత గుణములు చెవిసోకగానే శివధనస్సుకు రాముడు గుణమును బిగించుటకు ప్రయత్నించాడు.
జవాబు:
గుణము – స్వభావం, అల్లెత్రాడు
3. అందమైన తమ కులములో తమ కులము వృద్ధి చెందాలని కోరుకుంటారు.
జవాబు:
కులము = ఊరు, వంశము, తెగ, ఇల్లు, శరీరం
4. కొందరు పలుకులు మిఠాయి పలుకులుగా ఉంటాయి.
జవాబు:
పలుకు = మాట, ముక్క
5. రమణీరత్నము తన ఉంగరములో రత్నమును ధరించింది.
జవాబు:
రత్నము = శ్రేష్ఠము, మణి
ఈ) ఈ క్రింది పట్టికలోని వాక్యాలకు సంబంధించిన వ్యుత్పత్తిపదాలను రాయండి.
వ్యుత్పత్తిపదాలు : వ్యాఘ్రము, ప్రదక్షిణ, ప్రాణం, ధర్మం, రక్తం
1. శరీరాన్ని నిలిపే వాయువు = ప్రాణం
2. జనులచేత పూనబడునది = ధర్మం
3. పొడలచేత నానావర్ణాలతో శరీరం కలది = వ్యాఘ్రం
4. ఎఱ్ఱని వర్ణము కలది = రక్తం
5. దేవతాదులనుద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం = ప్రదక్షిణ
వ్యాకరణం
అ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.
1. ఉత్త్వసంధి : ఉత్తునకు సంధి నిత్యము
ఉదా :
ఇట్లు + అని = ఇట్లని
నేను + ఇట్లు = నేనిట్లు
నీవు + ఎన్నడు = నీవెన్నెడు
2. జశ్వసంది :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా :
మత్ + రక్తమాంసములు = మద్రక్తమాంసములు
వాక్ + దత్తము = వాగ్దత్తము
3. గసడదవాదేశ సంధి :
ప్రథమము మీది పరుషములకు గసడదవలగు
ఉదా :
అడుగు + తిరుగక = అడుగుదిరుకగ
అన్యచిత్త + కాక = అన్యచిత్తగాక
సక్తమ్ము + చేసి = సక్తమ్ము సేసి
4. ఇత్వసంధి :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
అంటివి + ఇది = అంటివిది, అంటివియిది
వారికి + ఇంచుక = వారికించుక, వారికి యించుక
5. యడాగమ సంధి :
సంధి లేని చోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
నీ + ఉదరాగ్ని = నీ యుదరాగ్ని
నా + అది = నాయది
హింస + ఒనర్చి = హింస యొనర్చి
త్రికసంధి
ఆ) ఆ, ఇ, ఏ అను సర్వనామాలను త్రికం అంటారు. క్రింది ఉదాహరణలను గమనించండి.
అప్పులి = ఆ + పులి
1. దీనిలో ‘ఆ’ అనేది ‘త్రికము’లలో ఒకటి. ఇది దీర్ఘాక్షరం.
2. అటువంటి త్రికమైన ‘ఆ’ మీద ఉన్న అసంయుక్త హల్లు అయిన ‘పు’ అనే అక్షరానికి ద్విత్వం వచ్చి ‘ప్పు’ అయింది. అప్పుడు ఆ + ప్పులి అయినది.
3. ద్విత్వమైన ‘ప్పు’ పరమైనందువల్ల అచ్చతెనుగు ‘ఆ’ ఇపుడు ‘అ’ అయినది.. అప్పుడు ‘అప్పులి’ అయినది.
సూత్రములు :
1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
2. త్రికంబుమీది అంసయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు.
కింది మాటలను విడదీసి రాయండి.
1. ఇచ్చోట – ఈ + చోట
2. అక్కడ – ఆ + కడ
3. ఎక్కడ – ఏ + కడ
ఇ) పాఠంలోని సమాస పదాల ఆధారంగా కింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి.
సమాసం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. నా సుతుడు | నా యొక్క సుతుడు | షష్ఠీ తత్పురుష సమాసం |
2. ధేనురత్నము | రత్నము వంటి ధేనువు | రూపక సమాసం |
3. ధర్మవిదుడు | ధర్మమును తెలిసినవాడు | ద్వితీయ తత్పురుష సమాసం |
4. గంభీరరవము | గంభీరమైన రవము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
5. నాలుగు చన్నులు | నాలుగు సంఖ్యగల చన్నులు | ద్విగు సమాసము |
6. అసత్యము | సత్యము కానిది | నఞ్ తత్పురుష సమాసం |
7. తల్లిదండ్రులు | తల్లి, తండ్రి | ద్వంద్వ సమాసం |
ఈ) బహుబ్లిహీ సమాసం
కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు – విష్ణువు అని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు (చక్రానికి గాని పాణికి గాని) ప్రాధాన్యం లేకుండా ఆ రెండూ మరో అర్థం ద్వారా విష్ణువును సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా అన్యపద అర్థాన్ని స్ఫురింపజేస్తే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్యపదార్థ ప్రాధాన్యం కలది బహుజొహి సమాసం.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1. ముక్కంటి : మూడు కన్నుల కలవాడు (శివుడు)
2. శోభనాంగి : చక్కని అవయవములు కలది (స్త్రీ)
3. మహాత్ముడు : గొప్ప ఆత్మకలవాడు (మహానుభావుడు)
4. అన్యచిత్త : వేరు ఆలోచన కలది / కలవాడు
5. చతుర్ముఖుడు : నాలుగు ముఖములు కలవాడు (బ్రహ్మ)
6. నీలాంబరి : నల్లని వస్త్రాలు ధరించినది
ఓ) ఛందస్సు
కింది పద్య పాదాలకు గణవిభజన చేసి లక్షణాలు రాయండి.
1. ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్
జవాబు:
పద్యం : ఉత్పలమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : భ, ర, న, భ, భ, ర, వ
2. పులికి ప్రదక్షిణించి తలపుం బలుకున్ సదృశంబుగాగన (స్థలిత)
జవాబు:
పద్యం : చంపకమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : న, జ, భ, జ, జ, జ, ర
ఊ) అలంకారాలు
7వ పద్యంలోని అలంకారాన్ని కనుక్కొని పేరు రాసి లక్షణాలతో సరిపోల్చండి.
రూపకాలంకారం : పాషాణ ధేనువు
ఇచట ఉపమేయమైన ధేనువును, ఉపమానమైన పాషాణానికే అభేదం చెప్పబడింది. కనుక ఇది రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారం.
ఋ) స్వభావోక్తి
“మునుమునుబుట్టె ………………… దయాగుణముల్లసిల్లగన్”
పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా గడ్డిని కూడా తినలేడని – ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇది స్వభావోక్తి అలంకారం. ఇలా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.
స్వభావోక్తి అలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.
- ఆ తోటలోని చిలుకలు పచ్చని రెక్కలతో, ఎఱ్ఱని ముక్కుతో పండు తినుచున్నది.
- ఆమె ముఖము కాటుక కళ్ళతో, చిరునగవు పెదవులతో చూపురులను ఆకర్షిస్తున్నది.
9th Class Telugu 7th Lesson ఆడినమాట కవి పరిచయం
కవిపేరు : అనంతామాత్యుడు (అనంతుడు)
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : శ్రీకాకుళక్షేత్ర సమీపంలోని పెనుమకూరు
రచనలు : భోజరాజీయం – 2092 పద్యాల ప్రబంధ గ్రంథం. ఛందోదర్పణం – ఛందశ్శాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాల గ్రంథం) రసాభరణం – అలంకారశాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాలతో 344 గద్య పద్యాలు కలవు.)
కవితాదృక్పథం : ప్రతికథలోను నైతికత, సత్యం, త్యాగం అను సుగుణాలు ఉంటాయి.
పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు
1వ పద్యం : కంఠస్థ పద్యం
*చ. మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్లపాటి గలఁడింతియ, పూరియు మేయనేరఁ డేఁ
జని, కడుపారం జన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న ! దయాగుణ ముల్లసిల్లఁగన్.
ప్రతిపదార్థం :
నాకున = నాకు
మునుమును = ముందుగా (తొలి సంతానంగా)
ఒక ముద్దుల పట్టి = ఒక ముద్దు బిడ్డ
పుట్టెన్ = పుట్టాడు
అతండు, పుట్టి = ఆ బిడ్డ పుట్టి
ఏడు + ఎనిమిది నాళ్లపాటి
గలడు = ఎనిమిది రోజులయింది
ఇంతియ = ఇంకా
పూరియున్ = గడ్డి కూడా
మేయనేరడు = తినడం చేతకాదు
ఏన్ + చని = నేను వెళ్ళి
కడుపారన్ = బిడ్డకు కడుపునిండా
చనుడిపి = పాలిచ్చి
చయ్యనన్ = వెంటనే
వచ్చెదన్ = తిరిగివస్తాను
దయాగుణము + ఉల్లసిల్లగన్ = దయాగుణం వెల్లడి అయ్యేటట్లు
నన్నున్ = నన్ను
పోయిరమ్ము + అని = వెళ్ళి రమ్మని చెప్పి
సుకృతంబు = పుణ్యము
కట్టికొనవన్న (కట్టికొనుము + అన్న) = కూడగట్టుకోవయ్యా!
భావం :
అయ్యా ! నాకు తొలి సంతానంగా పుట్టిన ముద్దుల బిడ్డ వయస్సు డెనిమిది రోజులు మాత్రమే. వాడికింకా గడ్డి మేయడం కూడా రాదు. వాడికి కడుపు నిండా పాలిచ్చి వెంటనే వస్తాను. దయతో నేను వెళ్ళిరావడానికి అంగీకరించి పుణ్యం కట్టుకో అని ఆవు పులితో చెప్పింది.
2వ పద్యం :
ఉ. గుమ్మెడు పాల నా సుతునకుం బరితృప్తి జనించుఁగాని, మాం
సమ్ము సమస్తముం గొనక చాలదు నీ యుదరాగ్ని కైన, ని
కుమ్ముగ నిందులోఁబ్రథమ కార్య వినిర్గతి నీ వెఱుంగవే,
పొమ్మన వన్న ! వ్యాసకులభూషణ! చయ్యనఁ బోయి వచ్చెదన్.
ప్రతిపదార్థం :
నా సుతునకున్ = నా బిడ్డకు
గుమ్మెడు పాలన్
(గుమ్మ + ఎడు = గుమ్మెడు) = ఒక పాలధారతో
పరితృప్తి = సంతృప్తి
జనించున్ = కలుగుతుంది
కాని = కానీ
నీ + ఉదర + అగ్నికిన్ + ఐనన్ = (నీయుదరాగ్నికైనన్) = నీ కడుపు మంటకు అయితే
మాంసమ్ము సమస్తమున్ = నా మాంసాన్ని అంతా
కొనక = తినక
చాలదు = సరిపోదు
నిక్కమ్ముగ = నిజంగా
ఇందులోన్ = ఈ విషయంలో
ప్రథమ కార్య వినిరతి = ముందుగా చేయవలసిన పని
నీవు + ఎరుంగవే = నీకు తెలియదా?
వ్యాఘ్రకుల భూషణ – పులుల వంశంలో శ్రేష్ఠుడా!
పొమ్మనవన్న = (పొమ్మనుము + అన్న) వెళ్ళు అని చెప్పవయ్యా!
చయ్యనన్ = వెంటనే
పోయి వచ్చెదన్ = వెళ్ళి తిరిగివస్తాను.
భావం :
ఓ పులివంశంలో శ్రేష్ఠుడా ! గుమ్మెడు పాలతో నా కుమారునకు తృప్తి కలుగుతుంది. నా మాంసము అంతా తింటే కాని నీ ఆకలి మంట చల్లారదు. అయినా నిజంగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నీకు తెలియదా? నాకు అనుమతి ఇయ్యి. తొందరగా వెళ్ళివస్తాను.
3వ పద్యం :
చ. అనవుడు పుండరీక మపహాస్యముచేసి ‘యిదేమి గోవ! యి
ట్లనియెదు, నన్ను బేల్పఱచి యాత్మజుఁ దున్నెడ కేగి సత్వరం|
బునఁ జనుదెంతు నంటి విది పోలునె, చెప్పెడువారు చెప్పినన్
వినియెదువారి కించుక వివేకము పుట్టదె, యింత యేటికిన్.
ప్రతిపదార్థం :
అనవుడు = (ఆవు) అట్లనగా
పుండరీకము = పెద్దపులి
అపహాస్యము చేసి = ఎగతాళి చేసి
గోవ = ఓ ఆవా !
ఇదేమి = ఇది + ఏమి ఇదేమిటి?
ఇట్లు + అనియెదు = ఇలా అంటున్నావు
నన్నున్ = నన్ను
బేల్పఱచి = అమాయకుని చేసి
ఆత్మజుడు = నీ కొడుకు
ఉన్నెడకున్ (ఉన్న+ఎడకున్) = ఉన్న చోటుకు
ఏగి = వెళ్ళి
సత్వరంబునన్ = త్వరగా
చనుదెంతున్ = తిరిగి వస్తాను
అంటివి = అన్నావు
ఇది, పోలునె = ఇది తగినదా? (ఇలా అనడం బాగుందా?)
చెప్పెడువారు = చెప్పేవారు
చెప్పినన్ = చెప్పినా
వినియెడువారికిన్ = వినే వారికి
ఇంచుక = కొంచెము
వివేకము = ఆలోచన (తెలివి)
పుట్టదె (పుట్టదు + ఎ) = పుట్టవద్దా
ఇంత + ఏటికిన్ = ఇదంతా ఎందుకు?
భావం :
ఆవు అట్లా అనగానే పులి అపహాస్యం చేసి, ‘ఓ గోవా ! ఇదేమిటి? ఇలా మాట్లాడుతున్నావు? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది బాగుందా? చెప్పేవాడు చెప్పినా వినేవాడికి కొంచెం వివేకం ఉండవద్దా ! ఇదంతా ఎందుకు?’ అన్నది.
4వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చునతండు, తండ్రికిం
దల్లికి మాజుపల్కెడు నతండును, నాఁకొని వచ్చి మొడ్లచే
సుల్ల మెలర్ప మేయఁజనుచున్న వృషంబు నదల్చునాతఁడు
ద్రెళ్ళాడు నట్టిదుర్గతులఁ దెళ్ళుదు నేనిటు రాక తక్కినన్.
ప్రతిపదార్థం :
ప్రల్లదము + ఆడి = కఠినమైన మాట మాట్లాడి
పెద్దలకు = పెద్దవారికి
బాధ + ఒనర్చు + అతండు = బాధ కలిగించేవాడూ
తండ్రికిన్ = తండ్రికిని
తల్లికిన్ = తల్లికి
మాఱు పల్కెడు + అతండును = ఎదురు తిరిగి మాట్లాడేవాడునూ
ఆ కొని వచ్చి = ఆకలితో వచ్చి
ఒడ్ల (ఒడ్డుల) = గట్లపై గల
చేను = సస్యము
ఉల్లము + ఎలర్బన్ = మనస్సునకు సంతోషము కలిగేటట్లు
మేయన్ = మేయడానికి
చను చున్న (చనుచున్ + ఉన్న) = వెళుతున్న
వృషంబున్ = ఎద్దును
అదల్చునాతడున్ (అదల్చు + ఆతడున్) = బెదరించేవాడునూ
త్రెళ్ళెడునట్టి = పడేటటువంటి
దుర్గతులన్ = నరకాలలో
నేను = నేను
ఇటురాక = తిరిగి ఇటువైపురాక
తక్కినన్ = మానేస్తే
తెళ్ళుదున్ = పడతాను
భావం :
కఠినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడూ, తండ్రికీ, తల్లికీ ఎదురు మాట్లాడే వాడూ, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును (ఎద్దును) వెళ్ళగొట్టేవాడూ, ఏ నరకాలలో పడతారో, తిరిగి నేను నీ దగ్గరికి రాకపోతే నేను ఆ నరకాలలో పడతాను.
5వ పద్యం :
క. అని శపథంబులు పలికిన
విని వ్యాఘ్రము – “నీవు ధర్మవిదురాలవు నీ
కెన యెవ్వరు, ధేనువ ! యే
నిను నమ్మితిఁ బోయి రమ్మ” నినఁ బటుబుద్దిన్,
ప్రతిపదార్థం :
అని = అట్లని
శపథంబులు పలికినన్ = శపథాలు మాట్లాడగా, (ఒట్లు పెట్టగా)
వ్యాఘ్రము = పులి
విని = విని
నీవు = నీవు
ధర్మవిదురాలవు = ధర్మం తెలిసిన దానవు
నీకున్ = నీకు
ఎవ్వరు = ఎవరు
ఎన = సాటి వస్తారు
ధేనువ = ఓ గోవా !
ఏన్ = నేను
నినున్ = నిన్ను
నమ్మితిన్ = నమ్మాను
పోయి రమ్ము =
అనినన్ = అని పులి అనగా
పటు బుద్దిన్ = (ఆవు) మంచి బుద్ధితో
భావం :
అని ఆవు పలికిన శపథాలు విన్న ఓ గోవా ! నీవు ధర్మం తెలిసిన దానవు. నీకెవ్వరూ సాటిరారు. నేను నిన్ను నమ్మాను. నీవు వెళ్ళిరా” అని చెప్పింది. ఆవు అప్పుడు చక్కని బుద్ధితో.
6వ పద్యం :
చ. పులికిఁ బ్రదక్షిణించి తలఁపుంబలుకున్ సదృశంబు గాఁగ, న
సలిత విలాసయాన మెసంగం బురికేఁగెఁ జతుస్తనంబులుం
బలసి పొదుంగు బ్రేఁగుపఱుపంగ గభీర రవంబుతోడ వీ
థుల నడయాడు బాలకులు దోరపు భీతిఁ దొలంగి పాఱఁగన్
ప్రతిపదార్థం :
పులికిన్ = పులికి
ప్రదక్షిణించి = ప్రదక్షిణము చేసి
తలపున్ = ఆలోచనయూ
పలుకున్ = మాటయూ
సదృశంబు = సమానము
కాగన్ = కాగా
చతుస్తనంబులున్ = నాలుగు చన్నులునూ
బలసి = పుష్టిపొంది
పొదుంగు = పొదుగు
త్రేగు పఱుపంగన్ = చేపగా
అస్ఖలిత = తొట్రుపాటు లేని
విలాసయానము = విలాసపు నడక
ఎసగన్ = అతిశయింపగా
గంభీరవంబుతోడన్ = గంభీరమైన ధ్వనితో
వీథులన్ = వీధులలో
నడయాడు = సంచరించే
బాలకులు = పిల్లలు
తోరపు భీతిన్ (తోరము + భీతిన్) = పెద్ద భయంతో
తొలంగి = ప్రక్కకు తప్పుకొని
పాఱగన్ = పరుగెత్తగా
పురికేగెన్ (పురికిన్ + ఏగెన్) = తన నివాస స్థలానికి వెళ్ళింది
భావం :
ఆవు, పులికి ప్రదక్షిణము చేసింది. తన బిడ్డకు సంబంధించిన ఆలోచనలూ, మాటలూ ఏకమయ్యాయి. స్తనములు లావెక్కి పొదుగు చేపుకు వచ్చింది. ఆవు గంభీర ధ్వని చేసింది. వీధులలో తిరిగే పిల్లలు పెద్ద భయంతో ప్రక్కకు తప్పుకొని పారిపోతుండగా ఆవు విలాసంగా నడుస్తూ, తన నివాసానికి వెళ్ళింది.
పురాతన
7వ పద్యం :
చ. కొడుకు చనుగ్రోలుచున్నంత దదవుఁ దల్లి
యడుగు దిరుగక కదలక యన్యచిత్త
గాక పై నీఁగ సోఁకినఁ గదలకుండా
నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు.
ప్రతిపదార్థం :
కొడుకు = తన దూడ
చనుగ్రోలు చున్న = పాలు త్రాగుచున్న
అంతతడవు = అంత సేపూ
తల్లి = తల్లియైన ఆ ఆవు
అడుగు + తిరుగక = (తన) కాలు మరలింపక
కదలక = కదలకుండా
అన్యచిత్త + కాక = వేరు ఆలోచన లేక
పైన్ = తనపైన
ఈగ సోకినన్ = ఈగ వాలినా
పాషాణ ధేనువున్ = రాతి ఆవును
నిలిపినట్లు = నిలబెట్టినట్లు
నెమ్మి = దూడపై ప్రేమతో
కదలకుండె (కదలక + ఉండె) = కదలకుండా నిలబడింది.
భావం :
కొడుకు పాలు తాగుతున్నంత సేపూ ఒక్క అడుగు కూడా కదల్చకుండా, తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచి, తన మీద ఈగ వాలినా కూడా కదలకుండా, ప్రేమతో రాతి ప్రతిమలా ఆవు నిలిచి ఉంది.
8వ వచనం:
వ. అయ్యవసరంబున
(ఆ + అవసరంబున) = ఆసమయంలో
తా॥ ఆ సమయంలో
9వ పద్యం :
క. ‘నిన్నుఁ గని యిన్ని దినములు
చన్నిచ్చితి నేను ఋణవశంబున. నిఁక నీ
వెన్నఁడు నన్నుఁ దలంపకు ,
మన్న ! మమత్వంబు విడువు మన్న, మనమునన్’
ప్రతిపదార్థం :
నిన్నున్ + కని = నిన్ను నా పుత్రునిగా కని;
ఋణవశమునన్ = ఋణానుబంధం వల్ల
ఇన్ని దినములు = ఇన్ని రోజులూ
చన్నిచ్చితి (చన్ను + ఇచ్చితి) = పాలు ఇచ్చాను
అన్న = నాయనా
ఇఁకన్ = ఇంకముందు
నీవు = నీవు
ఎన్నడున్ = ఎప్పుడూ
నన్నున్ = నన్ను గూర్చి
తలంపకుము = ఆలోచించకు
అన్న = నాయనా
మనమునన్ = మనస్సులో
మమత్వంబు మమకారము (నా తల్లియనే అభిమానము)
విడువుము = విడిచిపెట్టు.
భావం :
నిన్ను కన్నాను. నీకూ నాకూ మధ్య ఉన్న ఋణానుబంధం చేత ఇన్ని రోజులూ నీకు పాలు ఇచ్చాను. ఇంక నీవు నన్ను ఎప్పుడూ తలంపవద్దు. నీ మనస్సులో ఇంక అమ్మ అనే భావాన్ని రానీయకు.
10వ పద్యం :
క. ఆడకు మసత్యభాషలు
కూడకు గొఱగానివాని గొంకక యొరు లె
గాడిన నెదు రుత్తరమీల
జూడకు విని విననివాని చొప్పునఁ జనుమీ.
ప్రతిపదార్థం :
అసత్య భాషలు = అబద్దపు మాటలు
ఆడకుము = మాట్లడకుము
కొఱగాని వానిన్ = పనికి మాలినవాడిని
కూడకు = చేరకు (పొందుచేయకు)
ఒరులు = ఇతరులు
ఎగ్గాడినన్ (ఎగు. + ఆడినన్) = నిందించినా
కొంకక = జంకక
ఎదురు + ఉత్తరము = ఎదురు జవాబు (తిరిగి సమాధానము)
ఈఁజూడకు (ఈన్ + చూడకు) = ఇయ్యాలని చూడవద్దు
విని = అవతలి వారి మాటలు విని కూడా
విననివాని చొప్పునన్ = విననట్టి వాడివలె
చనుమీ = వెళ్ళు
భావం :
అసత్యపు మాటలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలసి ఉండకు. ఇతరులు ఎవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే, తిరిగి ఎదురు జవాబు చెప్పకు. విని కూడా వినని వాడివలె అక్కడి నుండి వెళ్ళిపో.
11వ పద్యం :
కం. చులుకన జలరుహతంతువు
చులుకన తృణకణము దూది చుల్కనసుమ్మీ !
యిలనెగయు ధూళిచులను
చులకనమరి తల్లిలేని సుతుడు కుమారా!
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా ! (గోవత్సమా !)
ఇలనే = ఈ భూమిపై
జలరుహతంతువు = తామరతూడు
చులకన = లోకువ
తృణకణము = గడ్డిపరక
చులకన = లోకువ
దూది = ప్రత్తి
చుల్కన = తేలిక
ఎగయు = ఎగురుతున్న
ధూళి = దుమ్ముకూడా
చులకన = తేలిక
మఱి = అదేవిధంగా
తల్లిలేని = తల్లి లేని అనాధ ఐన
సుతుడు = కుమారుడు కూడా
చులకన సుమ్మీ = లోకువగా చూడబడతాడు కదా!
భావం :
ఈ లోకంలో తామరతూడు, గడ్డి పరక, ప్రత్తి, దుమ్ములను తేలికభావంతో చూస్తారు కదా ! అలాగే తల్లి లేని పిల్లలను కూడా అందరూ లోకువగా చూస్తారు. అని ఆవు తన కుమారునికి చెప్పింది.
12వ వచనం :
వ. అని గడుపాఱఁ బాలు కుడిచి తనిసిన కొడుకునకుం గడచిన
వృత్తాంతం బంతయు నెఱింగించి, పెద్దగా నేడ్చు కొడుకు నెట్టకేల
కోదార్చి, తగ బుద్ధి చెప్పి యా మొదవు పులియున్న వనంబునకు
మగిడి వచ్చిన …..
ప్రతిపదారం :
అని = అని ఆవు దూడకు చెప్పి
మును = ముందు
పుట్టగన్ + చేసిన + అట్టి = పుట్టించినట్టి
దైవము = భగవంతుడు
ఈ పట్టునన్ = ఈ సమయములో
పూరిన్ = గడ్డిని
మేపెడినే = (నాచే) తినిపిస్తాడా?
ప్రాణములు = నా ప్రాణాలు
ఇంతనె = నీ మాంసము మాత్రము చేత
పోవుచున్నవే = పోతాయా?
భావం :
అని ఆవు బుద్దులు చెప్పి, తనివి తీరా పాలు త్రాగిన కొడుకును చూసి జరిగిన సంగతి అంతా చెప్పింది. అది విని గట్టిగా ఏడుస్తున్న కొడుకును ఎట్లో ఓదార్చి, తగిన బుద్ధులు చెప్పి, ఆవు తిరిగి ఆ పులి ఉన్న అడవికి తిరిగి వచ్చింది. అప్పుడు పులి ఆవుతో ఇలా అంది.
13వ పద్యం : కంఠసపద్యం
*ఉ. ఇట్టి మహానుభావులకు హింస యొనర్చి దురంత దోషముల్
గట్టికొనంగఁజాల, మటి కల్గవె మాంసము లొండుచోట, నీ
పుట్టువునందు నన్ను మును పుట్టఁగఁ జేసినయట్టి దైవ మీ
పట్టునఁ బూరి మేపెడినే ! ప్రాణములింతనె పోవుచున్నవే !
ప్రతిపదార్థం :
ఇట్టి మహానుభావులకున్ = ఇంత గొప్ప ఔదార్య బుద్దిగల నీ వంటి వారికి
హింస + ఒనర్చి = హింసించి (చంపి)
దురంత దోషముల్ = అంతులేని పాపములను
కట్టికొనంగన్ + చాలన్ = మూట కట్టుకోలేను
ఒండు చోటన్ = మరోచోట
మాంసములు = మాంసములు
కల్గవె = లభింపవా!
ఈ పుట్టువునందు = ఈ జన్మమునందు
నన్నున్ = నన్ను
కడుపాఱన్ = కడుపు నిండా
పాలుకుడిచి = పాలు త్రాగి
తనిసిన = తృప్తి పడిన
కొడుకునకున్ = తన పుత్రునకు
కడచిన వృత్తాంతంబు + అంతయున్ = జరిగిన సంగతినంతా
ఎఱింగించి = తెలిపి
పెద్దగాన్ + ఏడ్చు, కొడుకున్ = పెద్దగా ఏడుస్తున్న పుత్రుని
ఎట్టకేలకున్ + ఓదార్చి = చిట్టచివరకు ఓదార్చి
తగన్ = తగు విధంగా
బుద్ధి చెప్పి = బుద్ధులు చెప్పి
ఆ మొదవు = ఆ ఆవు
పులి = పులి
ఉన్న వనంబునకున్ = ఉన్న అడవికి
మగిడి = తిరిగి
వచ్చినన్ = రాగా
భావం :
ఇటువంటి మహాత్ములను హింసించి అంతులేని పాపాల్ని మూటకట్టుకోలేను. మాంసాలు నాకు మరొక చోట దొరకవా ! ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం, నాచే గడ్డి తినిపిస్తాడా? ఇంత మాత్రానికే నా ప్రాణాలు పోతాయా?” అని పులి ఆవుతో అన్నది.
14వ పద్యం : కంఠస్థ పద్యం
మ. అని యా ధేనువుఁ జూచి-నీ విమల సత్య ప్రొధికిన్ మెచ్చు వ
చ్చె, నినుం జంపఁగఁ జాల, నీదు తలగాచెన్ ధర్మ మీ ప్రొద్దు, పొ
మ్ము నిజావాసము చేర, నీ సఖులు సమ్మోదంబునుం బొంద నీ
తనయుం డత్యనురాగముం బొరయఁ జిత్త ప్రీతిమై నొందఁగన్
ప్రతిపదార్థం :
అని = పులి ఆ విధంగా ఆవుతో అని
ఆ ధేనువున్ = ఆ ఆవును
చూచి = చూచి
నీ = నీ యొక్క
విమల = నిర్మలమైన
సత్యప్రౌఢికిన్ = సత్యము యొక్క గొప్పతనానికి
మెచ్చు = ప్రీతి (సంతోషము)
వచ్చెన్ = కల్గింది
నినున్ = నిన్ను
చంపగన్ + చాలన్ = చంపజాలను
ఈ ప్రొద్దు = ఈ వేళ
ధర్మము = నీ ధర్మగుణము
నీదు = నీయొక్క
తల + కాచెన్ = తలను రక్షించింది
నీ సఖులు = నీ తోడి గోవులు
సమ్మోదంబునున్ + పొందన్ = మిక్కిలి సంతోషాన్ని పొందేటట్లు
నీ తనయుండు = నీ కుమారుడు
అత్యనురాగమున్ = మిక్కిలి ప్రేమను
పొరయన్ = అనుభవించేటట్లు
చిత్తప్రీతి = (నీ) మనస్సులో సంతోషము
మైనొందగన్ = కలిగేటట్లుగా
నిజావాసము (నిజ + ఆవాసము) = నీ యొక్క నివాస స్థానమును
చేరన్ + పొమ్ము = చేరడానికి వెళ్ళు. (సమీపించుము)
భావం :
పులి ఆవుతో అట్లు చెప్పి, ఆ ఆవును చూచి “నీవు మాట నిలబెట్టినందుకు నాకు సంతోషము కలిగింది. నిన్ను నేను చంపలేను. నీ ధర్మము ఈ రోజు నిన్ను రక్షించింది. నీ తోడివారు సంతోషించేటట్లు, నీ కొడుకు నీ ప్రేమను పొందేటట్లు, నీ మనస్సుకు ప్రీతి కలిగేటట్లు, నీ ఇంటికి నీవు వెళ్ళు” అని చెప్పింది.
15వ వచనం :
వ. అనిన నప్పులికి న మ్మొద విట్లనియె
ప్రతిపదార్థం :
అనినన్ = పులి అట్లనగా
అప్పులికిన్ = (ఆ + పులికిన్) ఆ పులితో
అమ్మొదవ = (ఆ + మొదవు) ఆ ఆవు
ఇట్లనియె = (ఇట్లు + అనియె) ఇలా అంది
భావం :
పులి చెప్పిన మాటలు విని, ఆవు పులితో ఇలా చెప్పింది.
16వ పద్యం :
క. ‘మెత్తని మనసే నాయది
యెత్తి యిటులు చూడనేల ? యో పుణ్యుడ ! నే’
నిత్తనువు నీకు మును వా
గ్దత్తము చేసినది కాదె ! కథ లేమిటికిన్.
ప్రతిపదార్థం :
ఓ పుణ్యుడా = ఓ పుణ్యాత్ముడా ! (ఓ పులి రాజా !)
కథలు + ఏమిటికిన్ = ఈ కథలు అన్నీ ఇప్పుడు ఎందుకు?
నా + అది = నాయది; (కాపాడింది)
మెత్తని మనసు + ఏ = అసలే మెత్తని మనస్సు
ఒత్తి = గట్టిగా నొక్కి
ఇటులు = ఈ విధంగా
చూడన్ + ఏల = పరీక్షించి చూడడం ఎందుకు?
నేను = నేను
ఇతనువు (ఈ + తనువు) = ఈ శరీరం
నీకున్ = నీకు
మును = ముందుగానే
వాగ్దత్తము (వాక్ + దత్తము) = మాటతో ఇచ్చినది
కాదె = కాదా?
భావం :
ఓ పుణ్యాత్ముడా ! “ఈ కథలన్నీ ఎందుకు? నా మనసు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోవద్దు. నేను నా శరీరాన్ని ఇస్తానని నీకు ముందే వాగ్దానం చేశాను కదా”.
17వ వచనం :
వ. కావున పగలించి యుపవాసభారం బంతయుఁ
బోవునట్లు మద్రక్తమాంసములతో సక్తమ్ము సేసి
నాకుఁ బుణ్యమ్ము ప్రసాదింపుము.
ప్రతిపదార్థం :
కావున = కాబట్టి
పగలించి = చీల్చి
ఉపవాస భారంబు = నీ ఉపవాస భారాన్ని; (తిండి లేకుండా ఉన్న నీ కష్టమును)
అంతయున్ = అంతా
పోవునట్లు = పోయేటట్లు
మద్రక్త మాంసమ్ములతోన్ మత్ = నా యొక్క
రక్తమాంసములతోన్ = రక్తంతో, మాంసంతో
సక్తమ్ము + చేసి = ఆరగించి
నాకున్ = నాకు
పుణ్యమ్ము = పుణ్యమును
ప్రసాదింపుము = అనుగ్రహింపుము
భావం :
“కాబట్టి నన్ను చీల్చి, నీ ఉపవాస భారము అంతా పోయేటట్లు, నా రక్తమాంసాలు ఆరగించి, నాకు పుణ్యం ప్రసాదించు.
18వ పద్యం :
క. అని గంగడోలు బిగియఁగఁ
దన మెడ యెత్తుకొని కపిల దగ్గఱఁ జనుదెం
చినఁ జూచి పుండరీకము
వెనువెనుకకె పోవు గాని విజువదు దానిన్.
ప్రతిపదార్థం :
అని = అట్లని
కపిల = ఆ కపిల ధేనువు
గంగడోలు = తన మెడ కింద ఉండే తోలు
బిగియగన్ = బిగించి
తనమెడ = తన మెడ
ఎత్తుకొని = పైకి ఎత్తి
దగ్గఱన్ = (పులికి) దగ్గరగా
చనుదెంచినన్ = రాగా
చూచి = ఆవును చూచి
పుండరీకము = పులి
వెనువెనుక = వెనుకకు వెనుకకే
పోవున్ + కాని – పోతోంది కానీ
దానిన్ = ఆవును
విఱువదు = (పైనబడి) చీల్చదు.
భావం :
అని చెప్పి ఆవు తన గంగడోలు బిగించి, తన మెడ ఎత్తి, పులి దగ్గరకు వెళ్ళగా, ఆ పులి వెనుక వెనుకకే వెడుతోంది. కానీ ఆవును చంపడానికి ముందుకు రాలేదు.
19వ పద్యం :
సీ. ‘కుడువంగ ర’ మ్మని తొడరి చుట్టముఁ బిల్వ
నాఁకలి గా దొల్ల ననుచుఁ బెనఁగు
నతఁడును బోలె నాతతశోభనాంగియై
తనరు నా ధేనురత్నంబు దన్ను
భక్షింపు మని పట్టుపటుప, సద్యోజ్ఞాన
శాలియై పరగు శార్దూలవిభుఁడు
దా నొల్ల నని పల్కఁ దమలోన నొక కొంత
దడవు ముహుర్భాషితంబు లిట్లు
ఆ. జరుగుచుండ గోవుసత్యవాక్శుద్ధికిఁ,
బులి కృపాసమగ్రబుద్ధికిని బ్ర
సన్ను లైరి సురలు; సాధువాదము లుల్ల
సిల్లె గగనవీథి నెల్లయెడల.
ప్రతిపదార్థం :
కుడువంగన్ = తినడానికి
రమ్మని = రమ్మని
తొడరి = పూనుకొని
చుట్టమున్ = బంధువును
పిల్వన్ = పిలువగా
ఆకలి + కాదు = ఆకలిగా లేదు
ఒల్లన్ + అనుచున్ = ఇష్టము లేదని (వద్దని)
పెనుగు+అతడును+పోలెన్ = పెంకితనము చేసే వాడిలా (మొరాయించే వాడిలా)
ఆతత శోభ నాంగియై ఆతత = విస్తృతమైన (అధికమైన)
శోభన+అంగి+ఐ = చక్కని అవయవములు గలదై
తనరు = ఒప్పునట్టి
ఆ ధేనురత్నంబు = ఆ రత్నము వంటి ఆవు
తన్నున్ = తనను
భక్షింపుము + అని = తినుమని
పట్టు పఱుపన్ = పులిని లొంగ దీయు చుండగా (బ్రతిమాలుచుండగా)
సద్యోజ్ఞానశాలియై = అప్పుడే కలిగిన జ్ఞానముతో కూడినదై
పరగు = ఒప్పునట్టి
శార్దూల విభుడు = పులిరాజు
తాను = తాను
ఒల్లను + అని = అంగీకరించనని (తిననని)
పల్కన్ = చెప్పగా
తమలోనన్ = ఆ పులికీ, ఆవుకూ మధ్య
ఒక కొంత తడవు = ఒక కొంచెం సేపు
ముహుః + భాషితంబులు = మాటి మాటికీ అవసరం లేక పోయినా మాట్లాడే మాటలు
ఇట్లు = ఈ విధంగా
జరుగుచుండన్ = సాగుచుండగా
గోవు సత్యవాక్శుద్ధికిన్ = ఆవు యొక్క సత్య వాక్యము యొక్క పవిత్రతకూ
పులి = పులి యొక్క
కృపా సమగ్ర బుద్ధికిని; కృపా = దయతో
సమగ్ర = నిండిన
బుద్ధికిని = బుద్ధికీ
సురలు = దేవతలు
ప్రసన్నులు + ఐరి = సంతుష్టులైరి
గగన వీధిన్ = ఆకాశ వీధిలో
ఎల్లయెడలన్ = అన్ని చోట్ల
సాధువాదములు = భళీ బాగు, సాధు అనే మాటలు
ఉల్లసిల్లెన్ = కలిగాయి. (పుట్టాయి, వినిపించాయి)
భావం :
తినడానికి రమ్మని బంధువును పిలిస్తే ఆకలిగా లేదు వద్దని పేచీ పెట్టే వాడిలా, చక్కని అవయవములతో ఒప్పిన ఆ శ్రేష్ఠమైన ఆవు తనను తినమని పులిని బ్రతిమాలంగా, జ్ఞానము కల్గిన ఆ పులిరాజు తాను తిననని చెప్పాడు. ఇలా వారు మాటిమాటికీ మాట్లాడుతున్నారు. అప్పుడు దేవతలు గోవు యొక్క సత్యవాక్య పవిత్రతకూ, పులి యొక్క దయతో నిండిన బుద్ధికీ సంతోషించారు. ఆకాశ వీధిలో అన్ని దిక్కులలో భళీ, బాగు అనే మాటలు వినిపించాయి.
కఠిన పదాలకు అర్థాలు
గుమ్మ = పాలు పితికేటప్పుడు వచ్చేధార
సుతుడు = కుమారుడు
పరితృప్తి = సంతోషం
ఉదరాగ్ని = కడుపులో మంట, ఆకలిమంట
వినిర్గతం = బయలు వెడలినది
వ్యాఘ్రము = పెద్దపులి
కులభూషణుడు = కులం మొత్తానికి అలంకారం వంటి వాడు, గొప్పవాడు
ఆత్మజుడు = కొడుకు
సత్వరం = వెంటనే
పాషాణము = రాయి
అసత్యభాషలు = అబద్దాలు
శార్దూలము = పెద్దపులి