Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 1st Lesson జీవ ప్రపంచం Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 1st Lesson జీవ ప్రపంచం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ICBN దేనికి సూచిక?
జవాబు:
అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి
[International Code for Botanical Nomenclature].
ప్రశ్న 2.
ఫ్లోరా (Flora) అంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసము, వితరణల సమాచారము, మొక్కల జాబితాను ఒక క్రమపద్ధతిలో ఉన్న దానిని ఫ్లోరా అంటారు.
ప్రశ్న 3.
జీవక్రియను నిర్వచించండి. నిర్మాణాత్మక, విచ్ఛిన్న క్రియల మధ్య తేడా ఏమిటి?
జవాబు:
ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియ అంటారు.
నిర్మాణాత్మక క్రియ | విచ్ఛిన్న క్రియ |
→ సరళమైన అణువుల నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణ క్రియ అంటారు. | → సంక్లిష్ట అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియను విచ్ఛిన్న క్రియ అంటారు. |
→ కిరణజన్య సంయోగక్రియ. | → శ్వాసక్రియ. |
ప్రశ్న 4.
ప్రపంచంలోని అతిపెద్ద వృక్షశాస్త్ర ఉద్యానవనం ఏది? భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ వృక్షశాస్త్ర ఉద్యానవనాలను పేర్కొనండి.
జవాబు:
ప్రపంచంలోని అతిపెద్ద ఉద్యానవనము – రాయల్ బొటానికల్ గార్డెన్స్-క్యూ-ఇంగ్లండ్లో ఉన్నది. భారతదేశంలో ఇండియన్ బొటానికల్ గార్డెన్స్ – హోరా, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉద్యానవనాలు కలవు.
ప్రశ్న 5.
వర్గీకరణశాస్త్ర ‘కీ’ లో వాడే ‘కప్లెట్’, ‘లీడ్’ పదాలను నిర్వచించండి.
జవాబు:
జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలను కట్లెట్ అంటారు. “కీ” లోని ప్రతి వ్యాఖ్యను “లీడ్” అంటారు.
ప్రశ్న 6.
మాన్యుయల్ లు (Manuals), మోనోగ్రాఫ్ లు (Monographs) అంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని ఇచ్చే చిన్న పుస్తకాలను మాన్యుయల్స్ అంటారు. ఏదేని ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని కలిగి ఉన్న వాటిని మోనోగ్రాఫ్లు అంటారు.
ప్రశ్న 7.
“సిస్టమాటిక్స్” (Systematics) అంటే ఏమిటి?
జవాబు:
వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని సిస్టమాటిక్స్ అంటారు.
ప్రశ్న 8.
జీవులను ఎందుకు వర్గీకరించారు?
జవాబు:
జీవుల పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యం, దానికి తగిన అనుక్రియను చూపడం, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యం, పరస్పర చర్యలు, లక్షణ వ్యక్తీకరణ వంటి విషయాలు తెలుసుకొనుటకు జీవులను వర్గీకరించారు.
ప్రశ్న 9.
వర్గీకరణలో మౌళిక ప్రమాణం ఏది? దాన్ని నిర్వచించండి.
జవాబు:
వర్గీకరణకు మూల ప్రమాణము “జాతి”. మౌళికమైన పోలికలు కలిగిన జీవుల సముదాయాన్ని జాతి అంటారు.
ప్రశ్న 10.
మామిడి శాస్త్రీయ నామాన్ని తెలపండి. ప్రజాతి, జాతి నామాలను (epithet) గుర్తించండి.
జవాబు:
మాంజిఫెరా ఇండికా. మాంజిఫెరా ప్రజాతి నామము, ఇండికా జాతినామము.
ప్రశ్న 11.
పెరుగుదల అంటే ఏమిటి? జీవులు నిర్జీవుల పెరుగుదలల మధ్య తేడా ఏమిటి? [Mar. ’14]
జవాబు:
జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన, అద్విగతమైన వృద్ధిని పెరుగుదల అంటారు. జీవులలో పెరుగుదల లోపలి నుంచి జరుగుతుంది. నిర్జీవులలో పర్వతాలు, ఇసుకతిన్నెలు వాటి ఉపరితలంపై పదార్థం సంచయనం చెందడం వల్ల జరుగుతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
గుర్తింపు, నామీకరణ అంటే ఏమిటి ? ఒక జీవిని గుర్తించడంలోనూ, వర్గీకరించడంలోనూ ‘కీ’ (key) ఏ విధంగా సహాయపడుతుంది?
జవాబు:
సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేక పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయమును నిర్ధారించుటను గుర్తింపు అంటారు. గుర్తించిన జీవికి అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన శాస్త్రీయనామాన్ని ఇవ్వడాన్ని నామీకరణ అంటారు. మొక్కలను పరోక్షంగా ఫ్లోరాలలోని ‘కీ’ ల సహాయంతో గుర్తించవచ్చు. వివిధ రకాల మొక్కలు, జంతువుల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపునకు తోడ్పడే మరో వర్గీకరణ సహాయము “కీ” “కీ” లు సాధారణంగా “కప్లెట్” అనబడే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. ఇది రెండు వ్యతిరేక లక్షణాలలో ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. “క్రీ” లోని ప్రతి వ్యాఖ్యను “లీడ్” అంటారు. వివిధ వర్గీకరణ ప్రమాణాలు అయిన కుటుంబం, ప్రజాతి, జాతులకు వేర్వేరు వర్గీకరణ “కీ” లు అవసరము. “కీ” లు సాధారణంగా విశ్లేషణ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ప్రశ్న 2.
వర్గీకరణశాస్త్ర సహాయకాలు (taxonomical aids) ఏవి? హెర్బేరియంలు (herbaria), మ్యూజియంల (museums) ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
వివిధ జాతుల మొక్కలు, జంతువులు, ఇతర జీవుల వర్గీకరణ అధ్యయనాలు వ్యవసాయం, అటవీశాస్త్రం, పరిశ్రమలు మనం వాడే జీవవనరులు, వాటి వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటికి ఉపయోగపడేవి హెర్బేరియమ్, “మ్యూజియం, కీ “(key)” లు.
హెర్బేరియమ్ :
సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి, ప్రెస్చేసి, షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటారు. ఈ షీట్లు విశ్వవ్యాప్తంగా ఆమోదింపబడిన వర్గీకరణ వ్యవస్థను అనుసరించి అమర్చబడి ఉంటాయి. వర్ణనలతో కూడిన హెర్బేరియమ్ షీట్లు భవిష్యత్లో ఉపయోగాల కోసం గిడ్డంగిగా పనిచేస్తాయి. ఈ షీట్లపై సేకరణ తేదీ, స్థలాన్ని గురించిన సమాచారము, ఇంగ్లీష్ స్థానిక వృక్ష శాస్త్రనామము, కుటుంబము, సేకరించిన వారి పేరు మొదలైన సమాచారంతో కల గుర్తింపు చీటీని కలిగి ఉంటాయి. వర్గీకరణ అధ్యయనాలలో హెర్బేరియమ్ శీఘ్రసంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తుంది.
మ్యూజియమ్లు :
జీవసంబంధ మ్యూజియంలను విద్యాసంస్థలైన పాఠశాలలు, కళాశాలల్లో నెలకొల్పుతారు. మ్యూజియంలో భద్రపరిచిన వృక్ష, జంతు నమూనాల సేకరణలు అధ్యయనం కోసం, సంప్రదింపులకు తోడ్పడతాయి. నమూనాలను పాత్రలలోకాని లేదా జాడీలలోగాని నిల్వఉంచే ద్రావకంలో భద్రపరుస్తారు. వృక్ష, జంతు నమూనాలను ఎండిన స్థితిలో కూడా నిల్వచేస్తారు.
ప్రశ్న 3.
టాక్సాన్ (Taxon)ను నిర్వచించండి. స్థాయి క్రమంలోని వివిధ స్థాయిలలో టాక్సాన్ల (Taxon)కు కొన్ని ఉదాహరణలను తెలపండి.
జవాబు:
వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ఏ ప్రమాణమును అయినా లేదా రకాన్నైనా “టాక్సాన్” అంటారు. స్థాయి క్రమంలోని వివిధ స్థాయిలు :-
1) జాతి : మౌలికమైన పోలికలు కల జీవుల సముదాయమును “జాతి” అంటారు.
ఉదా : మాంజిఫెరా ఇండికా (మామిడి)లో ఇండికా జాతినామము.
2) ప్రజాతి : దగ్గర సంబంధం కల జాతుల సముదాయమును ప్రజాతి అంటారు.
ఉదా : పొటాటో (బంగాళదుంప), వంకాయ రెండు వేర్వేరు జాతులు కాని సొలానమ్ అను ప్రజాతికి చెందినవి.
3) కుటుంబము : సన్నిహిత సంబంధం కల ప్రజాతుల సముదాయములను కుటుంబం అంటారు.
ఉదా : సొలానమ్, నికోటియానా, దతూర అను మూడు వేరు వేరు ప్రజాతులను సొలనేసి అను కుటుంబంలో చేర్చారు.
4) క్రమము : తక్కువ లక్షణాలలో మాత్రమే సారూప్యత కలిగిన వేర్వేరు కుటుంబాలను కలిగి ఉంటుంది.
ఉదా : పుష్పలక్షణాలు ఆధారంగా కన్వాల్యులేసి, సొలనేసి అను కుటుంబాలు పోలీమోనియేల్స్ క్రమంలో చేర్చబడినాయి.
ప్రశ్న 4.
జీవ వైవిధ్య సంరక్షణలలో వృక్షశాస్త్ర ఉద్యానవనాలు ఏ విధంగా తోడ్పడతాయి? ‘ఫ్లోరా’ (flora), ‘మాన్యుయలు’ (manuals), ‘మోనోగ్రాఫ్ లు’ (monographs), కాటలాగ్ (catalogues)లను నిర్వచించండి.
జవాబు:
వృక్షశాస్త్ర ఉద్యానవనాలు సంప్రదింపుల కోసం సజీవమైన మొక్కలను కల్గి ఉంటాయి. మొక్కలను తేలికగా గుర్తించడం కోసం వృక్ష జాతులను ఈ తోటలలో పెంచుతారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ లేదా వృక్షనామము, కుటుంబముతో కూడిన గుర్తింపు చీటీ ఉంటుంది.
1) ఫ్లోరా (Flora) :
ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసము వితరణల సమాచారాన్ని, మొక్కల జాబితాను ఒక క్రమ పద్ధతిలో కలిగి ఉన్న పుస్తకంను ఫ్లోరా అంటారు.
2) మాన్యుయల్ (Manuals) :
ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని ఇచ్చే చిన్న పుస్తకము.
3) మోనోగ్రాఫ్లు (Monographs) :
ఒక ప్రదేశంలో ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటాయి.
4) కాటలాగ్ (Catalogues) :
మొక్కలను ఖచ్చితంగా గుర్తించడానికి కావలసిన సమాచారాన్ని ఇచ్చే పుస్తకము.
ప్రశ్న 5.
ద్వినామ నామీకరణను వివరించండి.
జవాబు:
గుర్తించిన మొక్కను రెండు పదాలతో కూడిన పేరు పెట్టుటను ద్వినామ నామీకరణ అంటారు. దీనిని “కరోలస్ లిన్నేయస్” ప్రవేశపెట్టారు. జీవులకు శాస్త్రీయ నామాలు సమాకూర్చునప్పుడు సార్వత్రికంగా ఆమోదించిన సూత్రాలను అనుసరిస్తారు. అవి :
- జీవశాస్త్ర నామాలు లాటిన్ భాషలో ఉండి, ఇటాలిక్ వ్రాయబడతాయి.
- జీవశాస్త్ర నామంలోని మొదటి పదం ప్రజాతిని, రెండోది జాతి నామమును తెలియజేస్తుంది.
- జీవశాస్త్ర నామంలోని రెండు పదాలను చేతితో వ్రాసినప్పుడు వేరువేరుగా పేరుకింద గీతగీయాలి. లేదా ముద్రణలో అయితే ఇటాలిక్లలో సూచించాలి.
- ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతోను, జాతి నామాన్ని సూచించే రెండోపదం చిన్న అక్షరంతోను ప్రారంభమవుతాయి.
- శాస్త్రీయ నామం చివర ఆ జీవిని వర్ణించిన కర్త పేరు క్లుప్తంగా ఉంటుంది.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘జీవించడం’ (living) అంటే ఏమిటి? జీవరూపాలను నిర్వచించే ఏవైనా నాలుగు లక్షణాలను వివరించండి.
జవాబు:
పెరుగుదల, జీవక్రియలు, పునరుత్పత్తి సామర్థ్యం వంటి లక్షణాలను స్వతహాగా ప్రదర్శించుటను “జీవించడం” అంటారు. జీవరూపాలను నిర్వహించే లక్షణాలు
1) పెరుగుదల :
జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన అద్వితమైన వృద్ధిని పెరుగుదల అంటారు. మొక్కలలో పెరుగుదల కణవిభజనల ద్వారా జీవితకాలమంతా నిరంతరం కొనసాగుతుంది. కణవిభజనలు జరిగే వరకు ఏకకణ జీవులు కూడా పరిమాణంలో పెరుగుతాయి.
2) ప్రత్యుత్పత్తి :
జనకుల లక్షణాలను పోలిన లక్షణాలు కల సంతతిని ఉత్పత్తి చేయుటను ప్రత్యుత్పత్తి అంటారు. జీవులు లైంగికంగాను, అలైంగికంగాను కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శిలీంధ్రాలు అలైంగికంగా సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. తంతూరూప శైవలాలు నాచులో ప్రథమ తంతువులు ముక్కలవడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. ఏకకణజీవులైన బాక్టీరియా, ఏకకణ శైవలాలులాంటి జీవులలో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయము. ప్రత్యుత్పత్తి జరుపుకోలేని జీవులు కూడా చాలా ఉన్నాయి. కావున ప్రత్యుత్పత్తిని జీవులను నిర్వచించే లక్షణాలలో చేర్చడానికి వీలులేదు.
3) జీవక్రియలు :
జీవులలో జరిగే రసాయన చర్యలు అన్నింటిని కలిపి జీవక్రియలు అంటారు. అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు జీవక్రియలను ప్రదర్శిస్తాయి. ఏ నిర్జీవి జీవక్రియను ప్రదర్శించదు.
4) పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్థ్యం :
అన్ని జీవులు భౌతిక, రసాయనిక లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణలకు అనుక్రియను చూపుతాయి. పర్యావరణ ప్రేరణలకు జీవి చూపే ఈ అనుక్రియను “క్షోభ్యత” అంటారు. మొక్కలు, కాంతి, నీరు, ఉష్ణోగ్రత ఇతర జీవరాశులు, కాలుష్యకారకాలు వంటి కారకాలకు అనుక్రియను చూపుతాయి. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీనిని స్పృహ (Consciousness) అంటారు. మనిషి మాత్రమే తనను గురించిన గుర్తింపు కలిగి ఉంటాడు. దీనిని స్వయం స్పృహ అంటారు. ఇది రోగికి ఉండదు.
ప్రశ్న 2.
ఈ కింది పదాలను సోదాహరణలతో నిర్వచించండి.
i) తరగతి ii) కుటుంబం iii) క్రమం iv) ప్రజాతి v) విభాగం
జవాబు:
i) తరగతి :
పోలికలు కల క్రమాల సముదాయమును తరగతి అంటారు. వృక్షరాజ్యంలో మాల్వేలిస్, రోజేలిస్, పోనిమోలియేలిస్ వంటి క్రమాలను డైకాటిలిడనే (ద్విదళబీజాలు) తరగతిలో ఉంచారు.
ii) కుటుంబం :
సన్నిహిత సంబంధం కల ప్రజాతుల సమూహాన్ని కుటుంబం అంటారు. జాతుల శాకీయ ప్రత్యుత్పత్తి లక్షణాలు ఆధారంగా కుటుంబ లక్షణాలను పేర్కొంటారు. ఉదా : మొక్కలలో సొలానమ్, నికోటియానా, దతూర అను మూడు వేరు వేరు ప్రజాతులను సొలనేసి అనే కుటుంబంలో చేర్చారు.
iii) క్రమము :
తక్కువ లక్షణాలలో మాత్రమే సారూప్యత కలిగిన వేర్వేరు కుటుంబాల సముదాయమును క్రమం అంటారు. ఉదా : కన్వాల్వులేసి, సొలనేసి వంటి కుటుంబాలు పుష్పలక్షణాలు ఆధారంగా పోలిమోనియేలిస్ క్రమంలో చేర్చబడ్డాయి.
iv) ప్రజాతి :
దగ్గర సంబంధం కల జాతుల సముదాయమును ప్రజాతి అంటారు. ఉదా : మొక్కలలో పొటాటో (బంగాళాదుంప), వంకాయ వంటి రెండు జాతులు సొలానమ్ అను ప్రజాతిలో చేర్చబడినాయి.
v) విభాగము :
పోలికలు కల తరగతులను కలిపి విభాగము అంటారు. డైకాటలిడే (ద్విదళబీజాలు) మోనోకాటిలీడనే (ఏకదళబీజాలు) అను రెండు తరగతులను స్పెర్మటోఫైటా అనే విభాగమును ఏర్పరిచారు.
Intext Question and Answers
ప్రశ్న 1.
కణజాలాల లక్షణాలలో కొన్ని వాటి అనుఘటకాలైన కణాలవి కావున. ఈ వ్యాఖ్యను బలపరచడానికి రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:
కణజాలాల ధర్మాలు వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాలలో ఉండవు కాని వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల మధ్యజరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. కణాంగాల ధర్మాలు ఆ కణాంగాల నిర్మాణంలో పాల్గొన్న అణువులలోగాక వాటి నిర్మాణంలో పాల్గొన్న అనుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. అనుఘటకాల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్యలు “పిండిపదార్థం” వంటి బృహదణువులలో చూడవచ్చు.
ప్రశ్న 2.
విడిజీవుల, జనాభాల గుర్తింపు నుంచి మనం ఏం నేర్చుకుంటాం ?
జవాబు:
విడిజీవుల, జనాభాల గుర్తింపు వర్గీకరణ అధ్యయనాలకు ప్రాథమిక సూత్రం మరియు వాటివల్ల జీవవనరులు, వాటి వైవిధ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
ప్రశ్న 3.
మామిడి శాస్త్రీయనామాన్ని కింద ఇవ్వడమైంది సరిగ్గా రాసిన నామాన్ని గుర్తించండి.
Mangifera Indica లో i పెద్ద అక్షరం
Mangifera Indica లో i చిన్న అక్షరం
జవాబు:
Mangifera Indica i.
ప్రశ్న 4.
వర్గీకరణ స్థాయిల సరైన క్రమాన్ని మీరు గుర్తించగలరా !
a) జాతి క్రమం, విభాగం, రాజ్యం
b) ప్రజాతి, జాతి క్రమం, రాజ్యం
c) జాతి, ప్రజాతి, క్రమం, ఫైలం
జవాబు:
“C” సరి అయినది.
ప్రశ్న 5.
ఈ కింది పదాలను నిర్వచించండి
జవాబు:
జాతి :
మౌళికమైన పోలికలు కల జీవుల సముదాయమును “జాతి” అంటారు.
తరగతి :
“పోలికలు కల క్రమాల సముదాయము”.
కుటుంబము :
సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలను కుటుంబం అంటారు.
క్రమము :
తక్కువ లక్షణాలలో మాత్రమే సారూప్యత కల వేర్వేరు కుటుంబాల సముదాయము.
ప్రజాతి :
దగ్గర సంబంధం గల జాతుల సముదాయము.
ప్రశ్న 6.
తగిన ఉదాహరణలతో ఒక మొక్క వర్గీకరణ స్థాయి క్రమాన్ని వివరించండి.
జవాబు:
వృక్షరాజ్యము
విభాగము = స్పెర్మటోఫైటా
తరగతి = ద్విదళ బీజాలు
క్రమం = సాపిండేల్స్
కుటుంబం = అనకార్డియేసి
ప్రజాతి = మాంజిఫెరా
జాతి = ఇండికా
ప్రశ్న 7.
జీవులు ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాలు ఏవి? వాటిని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
పెరుగుదల :
“జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన అద్విగతమైన వృద్ధి”.
ప్రత్యుత్పత్తి :
“తల్లిదండ్రులతో దాదాపు సమానమైన లక్షణాలు కల సంతతిని ఉత్పత్తి చేయుట”.
జీవక్రియలు :
ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయిన చర్యలను కలిపి జీవక్రియ అంటారు.
ప్రశ్న 8.
జీవరూపాలు ‘భిన్నత్వంలో ఏకత్వం’ ప్రదర్శిస్తాయి. మీ అధ్యాపకుడితో చర్చించండి.
జవాబు:
జీవరూపాలు వైవిధ్యాన్ని చూపుతాయి. ఉదా: బాక్టీరియా, మానవుడు, ఓక్ (oak) వృక్షము మూడు వేర్వేరు జీవులైనప్పటికి, అవి ఒకే ప్రాథమిక, నిర్మాణాత్మక మూలకము అయిన “కణం” తో నిర్మితమై, ఏకత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఆ కణంలో మరల సారూప్యత కల వివిధ ఉపకణాంగాలు, అనుఘటకాలు ఉంటాయి.
ప్రశ్న 9.
కొత్తగా కనుగొన్న జీవికి శాస్త్రీయ నామాన్ని ఇవ్వడానికి పాటించే సూత్రాలను పేర్కొనండి.
జవాబు:
- జీవశాస్త్ర నామాలు లాటిన్ భాషలో ఉండి, ఇటాలిక్ వ్రాయబడతాయి.
- జీవశాస్త్ర నామంలోని మొదటి పదం ప్రజాతిని, రెండోది జాతి నామమును తెలియజేస్తుంది.
- జీవశాస్త్ర నామంలోని రెండు పదాలను చేతితో వ్రాసినప్పుడు వేరువేరుగా పేరుకింద గీతగీయాలి. లేదా ముద్రణలో అయితే ఇటాలిక్లలలో సూచించాలి.
- ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతోను, జాతి నామాన్ని సూచించే రెండోపదం చిన్న అక్షరంతోను ప్రారంభమవుతాయి.
- శాస్త్రీయ నామం చివర ఆ జీవిని వర్ణించిన కర్త పేరు క్లుప్తంగా ఉంటుంది.