AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 12th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers.

AP Inter 1st Year Civics Study Material 12th Lesson ప్రభుత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటో తెలిపి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు:
పరిచయం: ఏ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసనసభ నుండి ఎన్నుకోబడి శాసనసభ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నంతకాలం అధికారంలో కొనసాగుతుందో ఆ ప్రభుత్వ వ్యవస్థనే ‘పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ’ అని అంటారు. ఈ పార్లమెంటరీ ప్రభుత్వానికి పుట్టినిల్లుగా ‘బ్రిటన్ ‘ ను పేర్కొనవచ్చు.

నిర్వచనం: ప్రొఫెసర్ గార్నర్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఈ విధంగా నిర్వచించారు. “పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం 1) తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు 2) అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడినది”.

పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు: పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది. అవి:
1) నామమాత్రమైన, వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు: పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. వీరిలో నామమాత్రపు వాస్తవ కార్యనిర్వహణ అధిపతులు ఉంటారు. నామమాత్రపు కార్యనిర్వహణ అధిపతికి చక్కటి ఉదాహరణ ‘బ్రిటిష్ రాణి’, జపాన్ చక్రవర్తి, భారత రాష్ట్రపతి. వాస్తవానికి ఈ దేశాలలో కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి. అందువల్ల ఈ తరహా ప్రభుత్వంలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ పేరుకు మాత్రమే ఉనికిలో ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ విధానంలో ఒక వ్యక్తి గాని, కొద్దిమంది వ్యక్తుల బృందం గానీ నిజమైన కార్యనిర్వాహకవర్గంగా ఉంటుంది. కార్యవర్గం ఆచరణలో అన్ని కార్యనిర్వాహక అధికారాలను చలాయిస్తుంది.

2) సమిష్టి బాధ్యత: సమిష్టి బాధ్యత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ మౌళిక లక్షణం. మంత్రులందరూ శాసననిర్మాణ శాఖలోని దిగువ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వాన మంత్రులు అందరూ సమిష్టిగా విధాన నిర్ణయాలను తీసుకొంటారు. శాసనశాఖలోని దిగువసభ విశ్వాసాన్ని కోల్పోయినపుడు మంత్రిమండలి తన బాధ్యతల నుంచి విరమించుకొంటుంది. కేబినెట్ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కాని అంతిమంగా కేబినేట్ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించాల్సిందే. సదరు మంత్రి వ్యక్తిగతంగా, సమిష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకొనే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

3) రాజకీయ సజాతీయత: పార్లమెంటరీ ప్రభుత్వపు సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం రాజకీయ సజాతీయత. పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రులందరూ సాధారణంగా ఒకే పార్టీకి చెందినవారై ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీకి మెజారిటీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంపూర్ణ మెజారిటీ సీట్లు దిగువ సభలో లేనట్లయితే, అటువంటి సందర్భాలలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు. ఉదా: ఐక్య ప్రగతి కూటమి (UPA – United Progressive Alliance) లేదా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA – National Democratic Alliance) వంటివి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పర్చాయి. ఇటువంటి సందర్భాలలో సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.

4) శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం: పార్లమెంటరీ ప్రభుత్వం కార్యనిర్వాహక, శాసననిర్మాణ శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఆ రెండు శాఖలకు చెందిన సభ్యులు ఒకేసారి శాసనసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. ప్రథమంగా శాసన సభ్యులందరూ ఏదో ఒక సభలో సభ్యులుగా ఉంటారు.
అటు తరువాత కేబినేట్లో మంత్రిగా కొనసాగుతారు. శాసనసభ ఆమోదించిన సంక్షేమ పథకాలను, విధానాలను అమలుచేస్తుంటారు. అదే విధంగా, అనేక విషయాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. ఈ కారణాల రీత్యా రెండు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

5) పార్టీ క్రమశిక్షణ: నిజమైన పార్లమెంటరీ ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రభుత్వ విధానంలో ప్రతి రాజకీయపార్టీ తమ సభ్యులందరి మీద తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను చేపడుతుంది. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతానికి, సూత్రాలు, నియమ నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇటువంటి విధానం వల్ల సభ్యులందరూ వినయవిధేయతలతో పార్టీకి, ప్రభుత్వానికి అనుగుణంగా నీతినిజాయితీలతో, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పనిచేసేటట్లు సభ్యులకు శిక్షణ ఇస్తుంటారు. ఈ చర్యల వల్ల రాజకీయ పటిష్టత ఏర్పడి రాజ్యం కొనసాగుతుంది.

6) ప్రధానమంత్రి నాయకత్వం: పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ’మని కూడా వర్ణిస్తారు. ఈ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తాడు. ఇతడు దిగువసభలో మెజారిటీ పార్టీ నాయకుడుగా లేదా సంకీర్ణ మంత్రిమండలి అధిపతిగా చాలామణి అవుతుంటాడు. ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి మూలవిరాట్గా నిలబడతాడు. మంత్రిమండలి నిర్మాణం, ఉనికి, కొనసాగింపుకు ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉంటాడు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహించటమే కాకుండా ఎజెండాను కూడా నిర్ణయిస్తాడు.

ప్రశ్న 2.
అధ్యక్ష తరహా ప్రభుత్వ ప్రయోజనాలను, లోపాలను వివరించండి. [Mar. 2016]
జవాబు:
పరిచయం: అధ్యక్షపాలనను బాధ్యతాయుతముకాని ప్రభుత్వమని కూడా అంటారు. ఈ విధానంలో ఆ దేశాధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వానికి కూడా అధినేత. ఆయనకు నిజమైన అధికారాలు ఉంటాయి. ఇది ఏకపాలక వర్గ విధానము. అధ్యక్షుడు నియమించుకునే మంత్రులకు శాసనశాఖతో సంబంధం ఉండదు. మంత్రులు ఆయనకు విధేయులై పనిచేసే తాబేదారులు, వారికి శాసనసభ సభ్యత్వం ఉండదు. అధ్యక్షుడు ప్రజలచేత లేదా ఎన్నికలగణాల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షునకు ఒక నిర్ణీత పదవీకాలం ఉంటుంది. ఆయనను తొలగించడం తేలికకాదు. అధ్యక్షపాలనా విధానానికి అమెరికా మంచి ఉదాహరణ (U.S.A.)

నిర్వచనం: ప్రొఫెసర్ గార్నర్: “అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ కాలపరిమితి, రాజకీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన స్వతంత్రతను కలిగి ఉంటుంది”.

ప్రయోజనాలు:
1) నియంతృత్వానికి తక్కువ అవకాశం అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్దాంత ప్రాతిపదికన ఏర్పడినందున ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రమైనవిగా ఉంటాయి. అధికారాలన్నీ వివిధ శాఖల మధ్య, ఆయా అంగాల మధ్య విభజించబడి ఉండటం వలన ఈ ప్రభుత్వంలో నియంతృత్వానికి తావులేదు.

2) సుస్థిర ప్రభుత్వం: ఈ ప్రభుత్వ విధానంలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి (అధ్యక్షుడు) ఒక నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతాడు. అతడి కాలపరిమితి శాసనసభ విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి పూర్తి కాలపరిమితి వరకు అధ్యక్ష హోదాలో అతడు కొనసాగుతాడు. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండగలదని విశ్వసించవచ్చు.

3) చర్యలలో జాప్యం ఉండదు: అధ్యక్ష ప్రభుత్వ విధానంలో కార్యనిర్వహణాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం వల్ల అతడు సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలుంటాయి. అందువల్ల ప్రజల సమస్యలను తీర్చే సందర్భంలో కార్యదర్శులను (మంత్రులు) సంప్రదించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చును.

4) పాలనా సామర్థ్యం పెరుగుతుంది: ఈ ప్రభుత్వ విధానంలో పాలనా సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు వారి వారి అనుభవం, సామర్థ్యాలతో పాలనారంగం భాగస్వామ్యం కలిగి ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.

5) బాధ్యతాయుతమైన ప్రభుత్వం అధ్యక్షతరహా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా బాధ్యతారహిత ప్రభుత్వమైనప్పటికీ వాస్తవానికి ఇది ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ విధానాలను రూపొందించే సందర్భంలో అధ్యక్షుడు దూరదృష్టితో ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొంటాడు. అధ్యక్షుడు తన అధికారాలను ఉపయోగించే సమయంలో స్వార్థపర వ్యక్తుల పట్ల, స్వప్రయోజనాలను కోరుకునే వ్యాపార వర్గాల పట్ల అప్రమత్తంగా ఉంటాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

6) అత్యవసర సమయాలకు తగిన ప్రభుత్వం: అధ్యక్షతరహా ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను, సంఘటనలను పరిష్కరించటంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అనూహ్య పరిణామాలు సంభవించినపుడు అధ్యక్షుడు సత్వర నిర్ణయాలు తీసుకొంటాడు. అత్యవసర సమయాలలో శాసనసభ లేదా మంత్రివర్గం అమోదానికై ఎదురుచూడకుండా తానే స్వయంగా తగిన నిర్ణయాలు తీసుకొంటాడు. దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు వీలైనంత సున్నితంగా ఉండే విధంగా చూస్తాడు.

లోపాలు:
1) శాసన – కార్యనిర్వాహక శాఖల మధ్య వైరుధ్యాలు: అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినప్పటికీ వివిధ ప్రభుత్వ అంగాల మధ్య వైరుధ్యాలు జనిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా జరగడానికి ప్రభుత్వం విధుల పరంగా విడివిడిగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. పెండింగ్ బిల్లులను అమోదించటంలో, ప్రభుత్వ విధి విధానాలను అమలు పర్చటంలో అధ్యక్షుడికి, శాసనసభ్యులకు మధ్య అవగాహన లోపం ఉండటం కూడా రెండు శాఖల మధ్య వివాదాలకు దారితీస్తుంది.

2) బాధ్యతారహితం: అధ్యక్ష ప్రభుత్వ ఆచరణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. అధ్యక్షుడు గానీ, శాసనసభ్యులు గానీ, ప్రభుత్వ అంగాలకు పూర్తి బాధ్యత వహించరు. ప్రత్యక్ష ఎన్నికలు, నిర్ణీత కాలపరిమితి, అధికారాల విభజన మొదలైన అంశాలు శాసనాల రూపకల్పనలోను, వాటి అమలులోను బాధ్యతారహితంగా వ్యవహరించే పరిస్థితులను కల్పిస్తాయి.

3) సంపూర్ణ ప్రాతినిధ్యాన్ని కల్పించటంలో విఫలం: అధ్యక్ష ప్రభుత్వం సమాజంలోని భిన్న సమూహాలకు సరియైన ప్రాతినిధ్యాన్ని కల్పించలేదు. ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడుగా ఎన్నికై పక్షపాతరహితంగా వ్యవహరిస్తాడని నమ్మలేము. అన్ని సందర్భాలలో, సమయాలలో ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమై నీతి నిజాయితీలతో వ్యవహరిస్తాడని చెప్పలేము.

4) ప్రజాభిప్రాయానికి స్థానం లేదు: ఈ ప్రభుత్వ విధానంలో ప్రజాభిప్రాయానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది. ఎన్నికల అనంతరం అధ్యక్షుడితో పాటు శాసనసభ్యులు సైతం అనేక విషయాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయరు. ప్రజామోదం గాని, ప్రజల విశ్వాసం గాని, ప్రజా మద్దతు గాని వారి చర్యలకు అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తారు.

5) శాసనసభకు అప్రధాన హోదా: అధ్యక్ష ప్రభుత్వ విధానం, శాసన సభకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తుంది. కార్యనిర్వాహక శాఖ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అధ్యక్షుడిని అత్యంత శక్తివంతమైన, మిక్కిలి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు. దేశానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో అతి ముఖ్యమైన ప్రచారకర్తగా భావిస్తారు. అధ్యక్షుడు శాసనసభ సమావేవాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేనందున సభా సమావేశాలు పేలవంగా అప్రాధ్యానతను సంతరించుకుంటాయి.

6) సంప్రదాయ రాజ్యాంగం: సాధారణంగా అధ్యక్ష ప్రభుత్వ రాజ్యాంగ సంప్రదాయకమైనదై ఉంటుంది. ఈ ప్రభుత్వంలో స్వభావరీత్యా దృఢ రాజ్యాంగాన్ని సవరించటం అంత సులభం కాదు. మారిన ప్రజావసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడం వీలుపడదు. ఈ కారణంవల్ల అనేకమంది రాజనీతిశాస్త్ర విమర్శకులు ఈ తరహా రాజ్యాంగాన్ని ప్రగతికి, అభివృద్ధికి వ్యతిరేకమైనదానిగా భావిస్తారు.

ప్రశ్న 3.
ఏకకేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను, లోపాలను వివరించండి. [Mar 2018]
జవాబు:
అర్థము: ఏకకేంద్ర ప్రభుత్వమంటే ఒకే ఒక్క ప్రభుత్వమని అర్థము. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో ‘Unitary Government’ అంటారు. ‘Uni’ అంటే ఒకటి, ”tary’ అంటే అధికారం అని అర్థం. అంటే ఒకే ఒక్క అధికార కేంద్రమున్న ప్రభుత్వమని అర్థము.

నిర్వచనాలు:

డైసీ: “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే” దానిని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు.
విల్లోబి: ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే చెంది ఉంటాయి. తరువాత కేంద్ర ప్రభుత్వమే అధికారాలను తన ఇష్టం వచ్చినట్లు ప్రాంతీయ ప్రభుత్వాలను ఇస్తుంది” ఉదా: బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు.

ప్రయోజనాలు (లేదా) సుగుణాలు:
i) శక్తివంతమైన ప్రభుత్వం (Powerful Government): ఏకకేంద్ర ప్రభుత్వం శాసన మరియు పాలనాపరమైన అంశాలను ఒకేతాటిపై నడిపిస్తుంది. ఒకే ఒక కేంద్రప్రభుత్వ ఆధీనంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన శాఖలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కారణంచేత, ఏకకేంద్ర ప్రభుత్వం సమగ్రమైన సుస్థిర పాలనను అందిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ii) సమర్థవంతమైన పాలన (Efficient Rule): ఏకకేంద్ర పాలనా వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అన్ని రకాల పాలనా పరమైన అంశాలను అత్యంత శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకే ప్రభుత్వంలో అన్ని అధికారాలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది.

iii) తక్కువ వ్యయం, తక్కువ సమయం (Less expensive and Time saving): ఏకకేంద్ర వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తత్ఫలితంగా, ఏకకేంద్ర ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణకు తక్కువ ఆర్థిక వనరులు సరిపోతాయి. అంతేకాదు, సంస్థల నిర్మాణంలో నకిలీ ఏర్పాటు ఉండదు. అదేవిధంగా కాలయాపన లేకుండా నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవడానికి అవకాశమెక్కువ. దీనివల్ల ప్రజాధనం, |సమయం ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో వృధాకావు.

iv) పాలనా పరమైన ఏకత (Administrative uniformity): ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యక్షపాలన ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకొంటుంది. ఈ కారణం వల్ల, ఒకే తరహా శాసనాలు, చట్టాలు, నియమ, నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని వల్ల శాసనాల రూపకల్పన, పాలనా ప్రక్రియలలో సారూప్యత ఏర్పడుతుంది.

v) సత్వర నిర్ణయాలకు అవకాశం (Quick decisions possible): ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒకే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉండటం వల్ల అది సమయానుకూలంగా సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, ఏకకేంద్ర ప్రభుత్వం ఊహించని, అకస్మిక పరిణామాలు ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

vi) ఒకే పౌరసత్వం (Single Citizenship): ఏకకేంద్ర వ్యవస్థలో పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. దీనివల్ల దేశంలోని ప్రజలందరినీ ఎటువంటి వివక్ష ఏ రూపంలోను చూపకుండా అందరినీ సమానమైన పౌరులుగా గుర్తించటం జరుగుతుంది. ఒకే పౌరసత్వం వల్ల అంతిమంగా ప్రజలలో జాతీయ ఐక్యత, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వ | భావాలు పెంపొందించుట జరుగుతుంది.

vii) చిన్న దేశాలకు ప్రయోజనకారి (Useful for small countries): ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న దేశాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ జనాభా పరిమితమైన భౌగోళిక ప్రాంతం ఉండటం వల్ల అదేవిధంగా జాతి, భాష, సంస్కృతి, ప్రాంతీయపరంగా సజాతీయతను రూపొందించే అవకాశం ఉంటుంది.

లోపాలు (లేదా) దోషాలు:
i) నియంతృత్వానికి అవకాశం (Scope for Despotism): ఏక కేంద్ర వ్యవస్థలో అన్ని రకాల అధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నియంతృత్వ | ధోరణిలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తత్ఫలితంగా, వ్యక్తుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా, ఈ పరిణామాలు నియంతృత్వ ధోరణులు ప్రబలడానికి అవకాశాలను కల్పిస్తాయి.

ii) కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం (More burden on Central Government): ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అన్ని రకాల విధులను నిర్వహిస్తుంది. తత్ఫలితంగా, కేంద్ర ప్రభుత్వంపై భారం పెరిగి నిర్ణయాలు తీసుకోవటంలో నిర్లక్ష్యం, ఆలస్యం కావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

iii) అసమర్థత పెరుగుతుంది (Growth of Inefficiency): ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిగానీ, స్వయం నిర్ణయాధికారం గానీ ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వాలు అన్నీ కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల స్థానిక పాలన వ్యవహారాలలో ప్రజలు రాజకీయంగా చొరవ చూపించటం కుదరదు. ఈ కారణం వల్ల పాలనాపరంగా అసమర్థత పెరగడానికి అవకాశం ఉంది.

iv) పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు (Not suitable for large Countries): విభిన్న జాతులు, పలు మతాలు, అనేక భాషలు, బహుళ భౌగోళిక పరిస్థితులు, వివిధ సంస్కృతులు నెలకొని ఉన్న దేశాలకు ఏక కేంద్ర ప్రభుత్వ విధానం అనువైంది కాదు. అంతేకాదు, అధిక జనాభా, విస్తారమైన ప్రదేశం గల దేశాలకు ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఎంతమాత్రం ఉపయోగపడదు. పెద్ద దేశాల్లో భిన్నత్వంలో ఏకత్వం సాధించటం అంత సులువైన పనికాదు.

v) బాధ్యతారాహిత్యం (Irresponsibility): ఏకకేంద్ర వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దేనికి బాధ్యత వహించదు. అంతేకాదు ప్రాంతీయ ప్రభుత్వాలు ఏ విషయంలోనైనా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేవు. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి.

ప్రశ్న 4.
శాసన నిర్మాణశాఖ విధులు ఏవి ? [Mar 2017]
జవాబు:
శాసనశాఖ ప్రభుత్వాంగాలలో ఒకటి. ఇందులో రెండు సభలుంటే దానిని ద్విశాసనసభ అంటారు. ఉదా: భారత పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనే రెండు సభలున్నాయి. అనేక దేశాలలో ద్విశాసనసభ ఉంది. ఉదా: బ్రిటన్, అమెరికా మొదలగునవి. ఇందులో దిగువ సభ ప్రజలచే ఎన్నుకోబడే ప్రతినిధులతో కూడి ఉంటుంది. ఉదా: లోక్సభ (ఇండియా), హౌస్ ఆఫ్ కామన్స్ (ఇంగ్లాండ్) మొదలగునవి. ఎగువ సభ ఒక్కొక్క దేశంలో ఒకరకంగా నిర్మాణమవుతుంది. కొన్ని దేశాలలో వారసత్వం ఆధారంగా, కొన్ని దేశాలలో కార్యనిర్వాహక శాఖచే నియమించడం, కొన్ని దేశాలలో ప్రజలే ఎన్నుకోవడం, కొన్ని దేశాలలో పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడటం ఉన్నది.

శాసనసభ విధులు: ప్రభుత్వంలో మూడు ప్రధానాంగాలుంటాయి. వాటిలో శాసనసభ ఒకటి. ఇది శాసనాలను రూపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో దీనికి ప్రముఖ స్థానం ఉంటుంది. శాసనసభ అధికారాలు ప్రభుత్వ స్వరూపాన్ని బట్టి ఉంటాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి శాసనసభ శాఖలో చర్చలు జరిపి, పరిష్కారం కనుక్కోబడుతుంది. అంతేగాక ఆధునిక రాజ్యాల విధులు పెరగడం చేతకూడా శాసనశాఖలు ఈ క్రింద వివరించిన అనేక అధికారాలు కలిగి ఉన్నాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

1. శాసన సంబంధమైన విధులు: శాసననిర్మాణ శాఖ చట్టాలను తయారుచేస్తుంది. అమలులో ఉన్న చట్టాలను సవరిస్తుంది. అదేవిధంగా, మారుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా కొన్ని పాత చట్టాలను రద్దు చేస్తుంది. శాసనాల రూపకల్పనలో సభ్యులు ఎక్కువ సమాయాన్ని కేటాయించటంతోపాటు అంకితభావాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. శాసన నిర్మాణ శాఖ ప్రజాప్రయోజనాల కోసం సభ్యులు చర్చా సమాలోచలను స్వేచ్ఛగా, పక్షపాతరహితంగా బిల్లులను రూపొందించడానికి సహకరిస్తుంది.

2) కార్యనిర్వాహక విధులు: శాసననిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖపై ప్రత్యక్ష నియంత్రణను కలిగి ఉంటుంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పాలనాపరమైన అంశాలమీద శాసనసభ్యులు ప్రశ్నలను, ఉపప్రశ్నలను మంత్రులపై సంధించడం ద్వారా తగిన సమాధానాలను, సమాచారాన్ని రాబడతారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలో భాగంగా శాసనసభ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చలను తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు. అదే విధంగా మంత్రిమండలికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు.

3) ఆర్థికాధికారాలు: శాసననిర్మాణ శాఖకు కొన్ని ఆర్థికపరమైన అధికారాలు కూడా ఉన్నాయి. ఒకరకంగా శాసననిర్మాణ శాఖ జాతీయ నిధికి సంరక్షకుడిగా ఉంటుంది. సంక్షేమం, పాలన మరియు వివిధ రకాల ప్రాజెక్టుల ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని శాసననిర్మాణ శాఖ నియంత్రిస్తుంది. శాసనసభ్యులు ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయకుండా అధికార పార్టీని అప్రమత్తం చేస్తారు.

4) చర్చాపరమైన విధులు: శాసననిర్మాణ శాఖ చర్చాపరమైన సంస్థగా కూడా వ్యవహరిస్తుంది. సమాజంలోని వివిధ వర్గాల, సమూహాల భిన్నప్రయోజనాలను వ్యక్తపరచడంలో ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అదే విధంగా, విధాన నిర్ణయాల రూపకల్పనలో, వాటిని అమలు చేయడంలో కార్యనిర్వాహక శాఖకు సహాయకారిగా ఉంటుంది.

5) న్యాయపరమైన విధులు: శాసననిర్మాణ శాఖ కొన్ని న్యాయసంబంధమైన విధులను కూడా నిర్వహిస్తుంది. రాజ్యాల తమ శాసనశాఖలకు రాజ్యాంగపరమైన సూత్రాలను అతిక్రమించి లేదా దుర్వినియోగపరిచే సందర్భంలో విచారణలు చేపట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా సదరు వ్యక్తులను పదవి నుండి తొలగించే అధికారాన్ని ఇచ్చాయి. ఉదా: భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైన వారిని రాజ్యాంగబద్ధ ప్రక్రియ ద్వారా పార్లమెంటు తొలగిస్తుంది.

6) రాజ్యాంగపరమైన విధులు: శాసననిర్మాణ శాఖ కొన్ని రాజ్యాంగపరమైన విధులను సైతం నిర్వహిస్తుంది. శాసననిర్మాణ శాఖ రాజ్యాంగ అధికరణలను సవరించవచ్చు. భారతదేశంలో అన్నిరకాల రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టబడతాయి. ఇదే పద్దతి అమెరికా, బ్రిటన్ దేశాలలో సైతం కొనసాగుతూ ఉంది. వీటన్నింటికి సంబంధించి శాసనసభ తనకుగల రాజ్యాంగపరమైన అధికారాలను అనుసరించి అమలులో ఉన్న పద్ధతుల ప్రకారం వ్యవహరిస్తుంది.

7) ఎన్నికపరమైన విధులు: ప్రపంచంలోని అనేక దేశాల శాసనసభలు కొన్ని రకాల ఎన్నికల విధులను నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి భాగస్వామ్యం కలిగి ఉంది. అదేవిధంగా, పలురకాల కమిటీల సభ్యుల నియామకంలో కూడా పార్లమెంటు కీలకపాత్ర పోషిస్తుంది. సభాపతులు, ఉపసభాపతులను ఎన్నుకొనే అధికారం ఉంది.

ప్రశ్న 5.
కార్యనిర్వాహకశాఖ విధులను చర్చించండి.
జవాబు:
పరిచయం: ప్రభుత్వ నిర్మాణంలో కార్యనిర్వాహకశాఖ అతిముఖ్యమైన రెండవ అంగం. రాజ్య విధానాలను అమలుపరచడంలో కార్యనిర్వాహకశాఖ ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. కార్యనిర్వాహకశాఖ అంటే రాజ్యాధిపతులు, వారి మంత్రులు, సలహాదారులు, పరిపాలనాశాఖాధిపతులు కలిసికట్టుగా కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు.

కార్యనిర్వాహకశాఖ విధులు (Functions of Executive): ఆధునిక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ పలురకాల విధులు నిర్వహిస్తుంది. సైద్ధాంతికంగా, ఈ శాఖ శాసననిర్మాణశాఖ రూపొందించిన చట్టాలను అమలుపరుస్తుంది. అయితే ఆయా ప్రభుత్వ రూపాలను బట్టి ఈ శాఖ నిర్వహించే విధుల్లో మార్పు ఉంటుంది. సాధారణంగా * కార్యనిర్వాహకశాఖ ఈ కింది విధులను నిర్వహిస్తుంది.
1) పాలనాపరమైన విధులు (Administrative Functions):

  • చట్టాలను, న్యాయశాఖ తీర్పులను అమలుపరచడం
  • విధివిధానాలను రూపొందించడం.
  • శాంతిభద్రతలను కాపాడటం
  • సివిల్ సర్వెంట్స్ నియామకం, పదోన్నతి, తొలగింపు, (ఉద్యోగంలో నుండి తొలగించడం) మొదలైన విధులు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

2) దౌత్యపరమైన విధులు (Diplomatic Functions): కార్యనిర్వాహకశాఖ విదేశీ సంబంధాలను నెరపడము, విదేశాల్లో దౌత్యాధికారులను నియమించడం, దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడం, అదేవిధంగా, దేశాల మధ్య జరిగే చర్చా సమాలోచనలను, అంతర్జాతీయ ఒప్పందాలను, సదస్సు తీర్మానాలను అమలుపరచడం. అయితే, ఈ చర్యలన్నింటిని శాసన నిర్మాణశాఖ ధృవపరచవలసి ఉంటుంది.

3) సైనికపరమైన విధులు (Military Functions): ప్రపంచ దేశాలలోని అనేక రాజ్యాలలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి రక్షణశాఖకు అత్యున్నత దేశాధికారిగా ఉంటాడు. ఇతర దేశాలతో యుద్ధాన్ని గాని, లేదా శాంతి సంధినిగాని కార్యనిర్వాహకశాఖ ప్రకటించవచ్చు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో ఈ శాఖ దేశవ్యాప్తంగా మార్షల్ లా (Martial Law) ను విధించి పౌరుల హక్కులను సైతం రద్దు చేయవచ్చు.

4) ఆర్థికపరమైన విధులు (Financial Functions): కార్యనిర్వాహకశాఖ కొన్ని ఆర్థికపరమైన విధులను కూడా నిర్వహిస్తుంది. అవి వరుసగా, ఈ శాఖ వార్షిక ఆదాయ వ్యయపట్టికను ఎంతో జాగరూకతతో తయారుచేస్తుంది. వివిధ రకాల రూపాలలో వచ్చే ప్రభుత్వ రాబడులను గుర్తించేందుకు కృషిచేస్తుంది. పన్నుల వసూళ్ళకు కావలసిన యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది.

5) న్యాయపరమైన విధులు (Judicial Functions): అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంతోపాటు వారిని బదిలీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. అదేవిధంగా దోషులుగా నిర్ధారించబడ్డ వారి శిక్షలను తగ్గించడం లేదా తొలగించడం, రద్దుచేయడం వంటి విధులను సైతం ఈ శాఖ చేపడుతుంది. అయితే ఇలాంటి అధికారాన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే వినియోగిస్తుంది.

6) రాజ్యాంగపరమైన విధులు (Constitutional Functions): చాలా దేశాల్లో కార్యనిర్వాహకశాఖ రాజ్యాంగ సవరణలకు సంబంధించి శాసననిర్మాణశాఖకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ సూత్రాలను అమలుపరిచే క్రమంలో సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వాటిని అధిగమించి ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమని భావించినట్లయితే వాటిని చేయవలసిందిగా శాసననిర్మాణశాఖకు విన్నవిస్తుంది. అలాంటి చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకతను తెలియజేయడానికి ముందస్తు సర్వేలు నిర్వహించి వాటి నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. సందర్భంగా, కార్యనిర్వాహకశాఖ శాసనసభ్యుల మద్దతును కూడగట్టి తగిన రాజ్యాంగ సవరణలను చేస్తుంది.

7) ఆర్డినెన్స్ జారీ (Promulgation of Ordinances): అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఆర్డినెన్స్లను జారీ చేస్తుంది. క్లిష్టమైన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ తరహా బాధ్యతలను అది నిర్వహిస్తుంది. శాసనసభల సమావేశం జరిగేంతవరకు ఈ ఆర్డినెన్స్లు అమలులో ఉంటాయి. అంతేకాకుండా నియోజిత శాసనం (delegated legislation) అనేది శాసననిర్మాణశాఖ తరపున చట్టాలను రూపొందించేందుకు కార్యనిర్వాహక శాఖకు వీలు కల్పిస్తుంది. శాసన సభ్యులు కొన్ని బిల్లులను సంపూర్ణమైన వివరాలతో తయారు చేసేందుకు కార్యనిర్వాహకశాఖకు అధికారమిచ్చేందుకు తమ సమ్మతిని తెలియజేస్తారు.

8) సంక్షేమ విధులు (Welfare Functions): నేడు అనేక రాజ్యాలు సంక్షేమ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. తద్వారా ప్రజాసంక్షేమంలో వాటి కర్తవ్యాలు నానాటికి విశేషంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, సంక్షేమంలో పూర్తిగా విస్మరించబడ్డ వర్గాలు, నిరాకరించబడ్డ, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని ప్రజలను ఉద్దేశించి శాసనాలను రూపొందించి అమలుపరుస్తుంది. ఫలితంగా ఈ శాఖ అనేక బహుళ విధులను, చర్యలను చేపడుతుంది.

9) పాలనాపరమైన న్యాయనిర్ణయ విధులు (Administrative Adjudication Functions): అనేక సందర్భాలలో పరిపాలనకు సంబంధించిన కేసులలో, వివాదాలలో కార్యనిర్వాహకశాఖ పాలనాపరమైన న్యాయనిర్ణేతగా ప్రముఖపాత్రను నిర్వహిస్తుంది. ఇలాంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ శాఖ కొన్ని న్యాయ సంబంధమైన అధికారాలను సైతం కలిగి ఉందని చెప్పవచ్చు.

10) అత్యవసర కార్యక్రమాలు (Emergency Operations): శాంతి భద్రతలు క్షీణించడం, ప్రకృతివైపరీత్యాలు, విదేశీ చొరబాట్లు లేదా మరేవిధమైన అత్యవసర పరిస్థితులు వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో ఉత్పన్నమైనట్లయితే వాటిని చక్కబెట్టే బాధ్యతను కార్యనిర్వాహకశాఖ చేపడుతుంది. గతకొన్ని సంవత్సరాల నుంచి అనేక దేశాలలో తీవ్రవాదం ఒక ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇలాంటి సమస్యలను కార్యనిర్వాహకశాఖ సందర్భానుసారంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరే ఇతర ప్రభుత్వ అంగం కూడా ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టలేదు.

11) ఇతర విధులు (Miscellaneous Functions): ప్రభుత్వానికి కార్యనిర్వాహకశాఖ నాయకత్వాన్ని అందిస్తుంది. శాసననిర్మాణ శాఖ, అధికారంలో ఉన్న పార్టీతోపాటుగా మొత్తం జాతికి నాయకత్వం వహిస్తుంది. ఈ శాఖ రాజ్యానికి నాయకత్వాన్ని అందిస్తూ అంతర్జాతీయ సదస్సులు, సంస్థల కార్యకలాపాలలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 6.
న్యాయశాఖ విధులను పేర్కొనండి. [Mar. 2016]
జవాబు:
ప్రభుత్వాంగాలలో న్యాయశాఖ మూడవది. ఇది శాసనాలను వ్యాఖ్యానిస్తుంది. అవి న్యాయసమ్మతంగా ఉన్నదీ, లేనిదీ నిర్ణయిస్తుంది. “పక్షపాతరహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడంపై దేశ శ్రేయస్సు, ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటాయని” లార్డ్ బ్రైస్ అభిప్రాయం. న్యాయస్థానాలు న్యాయశాఖలో భాగం.

న్యాయశాఖ ప్రజాస్వామ్యంలో ప్రజల స్వేచ్ఛను రక్షిస్తుంది. ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేసేటట్లు చూస్తుంది. ఆధునిక కాలంలో అనేక విధులను నిర్వహిస్తున్నది. ప్రజల హక్కులను కాపాడి, శాసనాలను వ్యాఖ్యానించి, న్యాయం చేయడమే న్యాయస్థానాల ముఖ్య కర్తవ్యం.

విధులు:
1) శాసనాలను వ్యాఖ్యానించడం: శాసనశాఖ చేసిన శాసనాలకు అర్థవివరణ ఇవ్వడం న్యాయశాఖ ప్రధాన కర్తవ్యం. న్యాయమూర్తులు చట్టాలను వ్యాఖ్యానించి, వివిధ అంశాలపై తమ నిర్ణయాలు తెలుపుతారు. శాసనాల అభివృద్ధికి న్యాయస్థానాలు పరోక్షంగా దోహదం చేస్తాయి.

2) రాజ్యాంగ రక్షణ: రాజ్యాంగ రక్షణ చేసి, దాని మౌలిక స్వరూపానికి భంగం లేకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. శాసనశాఖ చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లవని కొట్టివేసే “న్యాయసమీక్షాధికారం” న్యాయస్థానాలకు ఉంది.

3) హక్కుల రక్షణ: న్యాయస్థానాలు ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయి. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు భంగం కలిగితే వారు న్యాయస్థానాల ద్వారా వాటిని రక్షించుకుంటారు. వ్యక్తి స్వేచ్ఛను రక్షించడానికి హెబియస్ కార్పస్ వంటి రిట్లు (writs) జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది.

4) సమాఖ్య సమతౌల్యత సమాఖ్యలో న్యాయశాఖ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. న్యాయశాఖ కేంద్రం-రాష్ట్రాల మధ్యగాని, పలు రాష్ట్రాల మధ్యగానీ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిమితులను దాటకుండా ఇది చూస్తుంది.

5) సలహారూపక విధులు: కార్యనిర్వాహక లేదా శాసననిర్మాణశాఖల కోరిక మేరకు న్యాయశాఖ తగిన సలహాలిస్తుంది. ఉదా: భారత రాష్ట్రపతి రాజ్యాంగపర చట్టాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉత్పన్నమైనట్లయితే, భారత సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు. ఇంగ్లాండులో ఇలాంటి సలహా సంప్రదింపులు జరపడం సర్వసాధారణం. చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు బ్రిటిష్ రాణి ప్రీవీకౌన్సిల్ న్యాయ కమిటీల సలహాలను తీసుకుంటుంది.

6) అప్పీళ్ళ విచారణ పరిధి: కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై అత్యున్నత కోర్టు అప్పీళ్లను స్వీకరిస్తుంది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులను అన్నివేళల పునఃసమీక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో వాటికి వ్యతిరేకంగా కూడా తీర్పులను వెలువరిస్తుంది.

7) రికార్డుల నిర్వహణ న్యాయశాఖ తన తీర్పులకు సంబంధించిన రికార్డులతోపాటు ఇతర కేసులకు సంబంధించిన రికార్డులను సైతం భద్రపరుస్తుంది. సదరు రికార్డులు భవిష్యత్తులో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అదే తరహా కేసులు వాదించడానికి లేదా తీర్పులు వెలువరించడానికి ప్రాతిపదికగా ఉపయోగపడతాయి.

8) రాజ్యాధిపతిగా వ్యవహరించడం అత్యున్నత న్యాయస్థానాలలోని ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని దేశాలలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆయా స్థానాలలో లేనప్పుడు రాజ్యాధిపతిగా వ్యవహరిస్తాడు.

9) పరిపాలనా విధులు: సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు కింది న్యాయస్థానాలు న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక అధిపతికి సలహా ఇస్తాయి. అదేవిధంగా అవి కింది న్యాయస్థానాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఉదా: భారతదేశంలోని హైకోర్టులు తమ పరిధిలోని అధీన న్యాయస్థానాల కార్యక్రమాలను పర్యవేక్షించే కర్తవ్యాన్ని కలిగి ఉంటాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రభుత్వాల సాంప్రదాయ వర్గీకరణను చర్చించండి.
జవాబు:
అరిస్టాటిల్ వర్గీకరణను సాంప్రదాయ వర్గీకరణగా భావిస్తారు. అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించాడు. అవి: i) రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి ii) రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ (Aristotle’s classification of Governments)
AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం 1

అరిస్టాటిల్ అభిప్రాయంలో రాజరికం, కులీనపాలన, మధ్యతరగతి పాలన (Polity) అనేవి మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు. అరిస్టాటిల్ ప్రకారం ఒక వ్యక్తి చేతిలో రాజ్యాధికారముండి ఆ అధికారాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగించినట్లయితే దానిని రాజరికమంటారు. ఆ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తన స్వప్రయోజనాన్ని ఆశించినప్పుడు నియంతృత్వమవుతుంది. సమాజంలోని కొద్దిమంది వ్యక్తులు, వారి పుట్టుక, శక్తి సామర్థ్యాలు, సంపద, హోదాల పరంగా రాజ్యాధికారంలో ఉన్నట్లయితే అది కులీన ప్రభుత్వం. ఈ కులీన వర్గం ప్రజాహితాన్ని కోరి పరిపాలించినంత కాలం కొద్దిమంది వ్యక్తుల ప్రభుత్వం అయినప్పటికీ అది మంచి ప్రభుత్వమే కానీ ‘కులీన ప్రభుత్వం ప్రజాహితాన్ని విస్మరించినప్పుడు అల్పజనపాలన’గా మారుతుందన్నాడు. అదే విధంగా సమాజంలోని ఉత్తమ లక్షణాలు కలిగిన అనేక మంది మధ్యతరగతి వ్యక్తులు నిజాయితీగా, నిస్వార్థంగా, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా దూరదృష్టితో లక్ష్యసాధన కోసం పరిపాలించినట్లయితే అటువంటి ప్రభుత్వం ”పాలిటీ’ (Polity) అని అది ప్రభుత్వాలన్నింటి కంటే ఉత్తమమైందన్నాడు. మధ్యతరగతి ప్రభుత్వం (పాలిటి) వికృత రూపంగా మారి స్వార్థపరుల చేత పరిపాలించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం లేదా మూకపాలన (Mobocracy) అన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రయోజనాలు, కోరికలను విస్మరించి పాలకులు తమ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తారని అరిస్టాటిల్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలేవి ?
జవాబు:
‘యూనిటరి’ (Unitary) అనే పదం రెండు ఆంగ్ల పదాల కలయిక. ‘యూని’ (Uni), ‘టరి’ (Tary) అను రెండు ఆంగ్ల పదాల కలయిక. యూని అనగా ‘ఒక్కటి’, టరీ అనగా ‘పాలన’ అని అర్థం. అందువల్ల యూనిటరీ గవర్నమెంట్ను ఏకకేంద్ర ప్రభుత్వం’గా వ్యవహరిస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలనాధికారాలన్నీ సమీకృతంగా ఒకే ఒక ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాజ్యాంగం సర్వాధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలో ఉంచుతుంది. కేంద్రప్రభుత్వం ఒక్కటే అధికారాలన్నింటిని అనుభవిస్తుంది. అయితే, కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాజకీయ ఉపశాఖలను (Political subdivisions) ఏర్పరచి వాటికి కొన్ని అధికారాలను నిర్వహించే అవకాశాన్ని కల్పించవచ్చు. వివిధ రాష్ట్రాల పాలనాధికారాలను ఆయా ప్రాంతీయ మండళ్ళు (Provincial Units) ద్వారా చక్కబెట్టవచ్చు. ఈ ప్రాంతీయ మండళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సహాయక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏకకేంద్ర ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ బ్రిటన్.

ఏకకేంద్ర ప్రభుత్వ నిర్వచనాలు (Definitions of Unitary Government):

  1. ఏ.వి. డైసీ: “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించేదే ఏకకేంద్ర ప్రభుత్వం.”
  2. హైర్మన్ ఫైనర్: “కేంద్ర స్థాయిలో అన్ని రకాల అధికారాలు, ఆధిపత్యం ఇమిడీకృతమై, తన ఇష్టానుసారంగా లేదా దాని అనుబంధశాఖల ద్వారా భౌగోళిక ప్రాంతానికంతటికి న్యాయపరంగా సర్వశక్తి గల అధికారం గల ప్రభుత్వమే ఏకకేంద్ర ప్రభుత్వం.”
  3. ప్రొఫెసర్. జె.డబ్ల్యు. గార్నర్: “ప్రభుత్వానికి గల సర్వాధికారాలు రాజ్యాంగపరంగా ఒకే ఒక కేంద్ర వ్యవస్థ లేదా వ్యవస్థలకు చెంది ఉండి, వాటి నుంచి స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను పొందినట్లయితే అటువంటి ప్రభుత్వమే ‘ఏకకేంద్ర ప్రభుత్వం’ అంటారు.

ఏకకేంద్ర ప్రభుత్వం లక్షణాలు (Features of Unitary Government):
ఏకకేంద్ర ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. ఏకకేంద్ర వ్యవస్థలో ఒకే ప్రభుత్వముంటుంది (Single Government): దీనినే కేంద్ర ప్రభుత్వమని వ్యవహరిస్తారు.. కేంద్ర ప్రభుత్వం రాజ్య పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారాలను నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధికారం దేశంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది.

2. ప్రాంతీయ ప్రభుత్వాలు (Provincial Government): ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఏర్పాటు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నట్లయితే, వాటి అధికారాలు మరియు ఉనికి కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటాయి. పాలనా సౌలభ్యం కొరకు వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అవి కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అవసరమైన అధికారాలను పొందుతాయి.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

3. సరళ రాజ్యాంగం (Flexible Constitution): ఏకకేంద్ర ప్రభుత్వం సాధారణంగా సరళ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఈ కారణం వల్ల, వివిధ రాజ్యాంగ వ్యవస్థలు శక్తివంతంగా పనిచేస్తాయి.

4. ఏక పౌరసత్వం (Single Citizenship): ఏకకేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో జన్మించినా ప్రత్యేక గుర్తింపునిచ్చే పౌరసత్వం కలిగి ఉంటారు. అంతిమంగా ఏక పౌరసత్వం జాతీయ ఏకత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని ప్రజలలో పెంపొందిస్తుంది.

5. ఏక శాసన సభ (Unicameralism): ఏకకేంద్ర ప్రభుత్వం ఒకే శాసన సభను కలిగి ఉంటుంది. ఆ శాసన సభకు అన్ని రకాల శాసనాధికారాలుంటాయి. ప్రాంతీయపరమైన శాసనసభలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే అవి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమ విధులను నిర్వహిస్తాయి.

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వ లక్షణాలను చర్చించండి. [Mar, ’18, ’17]
జవాబు:
‘ఫెడరేషన్’ (Federation) అనే ఆంగ్ల పదం ఫోడస్ (Foedus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ‘ఫోడస్’ అనగా ఒడంబడిక లేదా అంగీకారం అని అర్థం. ఆధునిక రాజకీయ వ్యవస్థలో ‘సమాఖ్య విధానం’ ఒక రాజకీయ ఆలోచనా ప్రక్రియగా మారింది. ఈ విధానం అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికా (1789), స్విట్జర్లాండ్ (1848), ఆస్ట్రేలియా (1901), కెనడా (1931) వంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకు మంచి ఉదాహరణలు.

నిర్వచనాలు:

  1. ఎ.వి. డైసీ: “జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం.”
  2. జె.డబ్ల్యు. గార్నర్: “సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి గల మొత్తం అధికారాలను కేంద్రం- రాష్ట్రాల మధ్య జాతీయ రాజ్యాంగం ద్వారా పంపిణీ చేసేది.”

సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు (Features of Federal Government): సమాఖ్య ప్రభుత్వం అనేక లక్షణాలను కలిగి ఉంది. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

1. లిఖిత రాజ్యాంగం (Written Constitution): సాధారణంగా సమాఖ్య వ్యవస్థ ఉనికిలో ఉన్న దేశాల్లో. లిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశం మొత్తానికి అత్యున్నత శాసనంగా పరిగణించబడుతుంది. ఆ రాజ్యాంగమే అధికారాలను నిర్వచించి, నిర్ణయించి కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఆ విధంగా సమాఖ్య వ్యవస్థ అవసరమైన, ఆచరణయోగ్యమైన ప్రభుత్వ విధానంగా ఉంటుంది.

2. ద్వంద్వ పౌరసత్వం (Duel Citizenship): సమాఖ్య రాజ్య వ్యవస్థలో పౌరులకు ద్వంద్వ (రెండు) పౌరసత్వం ఉంటుంది. (ఒకటి జాతీయస్థాయి, రెండు సంబంధిత రాష్ట్రస్థాయి) అందువల్ల పౌరులు కేంద్రం, రాష్ట్రాల పౌరసత్వాన్ని పొందుతారు. తత్ఫలితంగా, పౌరులు జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల ఎన్నిక ప్రక్రియలో ప్రాతినిధ్యం వహిస్తారు.

3. అధికార విభజన (Division of Powers): సమాఖ్య విధానంలో ప్రభుత్వ అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజింపబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడే అంశాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఉదాహరణకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, సుంకాలు, ఎగుమతులు-దిగుమతులు వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నియంత్రిస్తుంది. అదేవిధంగా, వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి పారుదల విషయాలను ప్రాంతీయ ప్రభుత్వాలకు అప్పగించటం జరుగుతుంది.

4. ద్విసభా విధానం (Bicameralism): ద్విసభా విధానమనేది సమాఖ్య వ్యవస్థకు మరో ముఖ్య లక్షణం. సమాఖ్య రాజ్యంలో రెండు సభలు ఉంటాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఎగువ సభలో రాష్ట్రాల జనాభాననుసరించి ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుంది. దిగువసభ ప్రజలకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తుంది.

5. దృఢ రాజ్యాంగం (Rigid Constitution): సాధారణంగా, సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఈ కారణం వల్ల, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ రాజ్యాంగ సూత్రాలను ఏకపక్షంగా సవరించలేవు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

6. స్వతంత్ర న్యాయశాఖ (Independent Judiciary): సమాఖ్యప్రభుత్వ విధానంలో అతి ముఖ్యమైన లక్షణమేమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ. ఎందుకంటే, కేంద్రం, రాష్ట్రాల మధ్యగల వివాదాలను ఒక్క న్యాయశాఖ మాత్రమే తీర్చగలదు. అందువల్ల న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా సంక్రమించిన స్వతంత్ర హోదాను
సంతృప్తిగా అనుభవిస్తారు. సాధారణంగా న్యాయమూర్తుల నియామకం ఒకసారి జరిగిన తరువాత వారిని తొలగించడం అంత సులభం కాదు. వారు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తారు. అంతేకాదు శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు అమలుపరిచే అధికారాలు దుర్వినియోగం జరుగుతున్నట్లు భావించినట్లయితే, ఆ అధికారాలను నియంత్రించేది న్యాయశాఖ మాత్రమే.

ప్రశ్న 4.
పార్లమెంటరీ ప్రభుత్వ ప్రయోజనాలేవి ?
జవాబు:
పార్లమెంటరీ ప్రభుత్వ ప్రయోజనాలను క్రింది విధంగా వివరించవచ్చు.
1. శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం
(Co-ordination between Legislature and Executive): పార్లమెంటరీ ప్రభుత్వంలో శాసన మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సహకారం, సమన్వయం ఉంటుంది. శాసన సభ్యులను విశ్వాసంలోకి తీసుకొని చట్టాలను రూపొందించటం జరుగుతుంది. ఈ సందర్భంగా శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి సమన్వయంతో ప్రభుత్వ కార్యకలాపాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తాయి. ఈ రెండు |శాఖలు పరస్పరం సహాయ, సహకారాలతో దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమన్వయాన్ని పాటిస్తాయి.

2. నియంతృత్వానికి అవకాశం లేదు (No Scope for Despotism): పార్లమెంటరీ ప్రభుత్వంలో మెజారిటీ పార్టీ నిరంకుశత్వానికి శాసననిర్మాణ శాఖలోని దిగువసభలో బలమైన అడ్డుకట్ట వేయటం జరుగుతుంది. ఎందుకంటే శాసన సభ్యులు ప్రశ్నలు – అనుబంధ ప్రశ్నలు వేయటం ద్వారా, అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా అధికారంలో ఉన్న పార్టీని నియంత్రిస్తారు.

3. అధికారాల పంపిణీకి అవకాశాలు (Scope for distribution of Powers): పార్లమెంటరీ ప్రభుత్వంలో రాజకీయ, పరిపాలనాపరమైన అధికారాల పంపిణీ ఉంటుంది. ఈ విధానంలో రాజ్యాంగ యంత్రాంగం ప్రభుత్వ అధికారాలను ప్రజాస్ఫూర్తి, నిబద్ధత, సహేతుక నిర్ణయ సామర్థ్యాలుగల వ్యక్తుల మధ్య విభజిస్తుంది. ఈ తరహా ప్రభుత్వం ఒక వ్యక్తి చేతిలోనో (ప్రధానమంత్రి) లేదా కొద్ది మంది వ్యక్తుల చేతులలోనో (మంత్రిమండలి) అధికారం కేంద్రీకృతం కావటాన్ని అనుమతించదు.

4. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు సులభం (Formation of alternative government easy): పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ మార్పులను సులభంగా ప్రవేశపెట్టవచ్చు. సాధారణంగా, ఏ ఒక్క పార్టీ లేదా పార్టీలు సార్వత్రిక ఎన్నికల ద్వారా దిగువ సభలో మెజారిటీని సంపాదిస్తాయో ఆ పార్టీ లేదా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. తదుపరి వెంటనే ప్రభుత్వ పథకాలు, విధానాలు కూడా సులభంగా మార్చటం జరుగుతుంది. అదేవిధంగా, ఎప్పుడైతే అధికారక పార్టీ రాజీనామా చేయటమో లేదా అధికారం నుంచి తొలగించబడుతుందో జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటువంటి చర్యలు రాజకీయ, పార్టీలపరమైన అస్థిరతలు ఏర్పడకుండా కాపాడతాయి. అంతేకాకుండా మధ్యంతర ఎన్నికలకు దారితీసే పరిస్థితుల పట్ల ప్రజలకు గల భయాందోళనలను తొలగిస్తాయి.

5. తగిన ప్రాతినిధ్యం (Adequate representation): పార్లమెంటరీ ప్రభుత్వం సమాజంలోని విభిన్న వర్గాలకు, ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఈ ప్రభుత్వంలో భిన్న స్వరాలకు సంబంధించిన వ్యక్తులందరికీ శాసననిర్మాణ – కార్యనిర్వాహకశాఖలందు ప్రాతినిధ్యం కల్పించడమవుతుంది. ఈ విధానంలో మైనారిటీలతో సహా ఎవ్వరూ కూడా మినహియించబడరు. దీని ఫలితంగా జాతీయ స్ఫూర్తి, ఐకమత్యం ప్రజలలో పెంపొందుతుంది. వివిధ పదవులను కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతును అందిస్తారు.

6. రాజకీయ చైతన్యం (Political Dynamism): పార్లమెంటరీ ప్రభుత్వం ప్రజలలో రాజకీయ విషయాల పట్ల చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఈ వ్యవస్థలో నిర్వహించే ఎన్నికల వలన వివిధ ప్రాతినిధ్యం సంస్థల ద్వారా పాల్గొనే ప్రజలలో రాజకీయ చైతన్యం వృద్ధి చెందుతుంది. పార్టీ నాయకులు, అభ్యర్థులు స్థానిక ప్రజలతో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించటం ద్వారా ప్రజలలో రాజకీయ అవగాహన ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో, పార్టీలు లేదా నాయకులు ప్రజల నుంచి పూర్తి మద్దతును పొంది సుస్థిరమైన, పటిష్టమైన ప్రభుత్వాన్ని అందివ్వగలుగుతారు. అదేవిధంగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రచారాన్ని బట్టి ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తుంటారు. గ్రామీణ ప్రాంతపు నిరుపేద నిరక్షరాస్యులు సైతం ఎన్నికల సమయంలో సరైన రాజకీయ తీర్పును వెల్లడిస్తారు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 5.
అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
అధికారాల వేర్పాటువాద సిద్ధాంతానికి ఫ్రెంచి రాజనీతి కోవిదుడైన మాంటెస్క్యూ మూలపురుషుడు. తన గ్రంథమైన “ద స్పిరిట్ ఆఫ్ లాస్” (The Sprit of Laws 1748) లో ఈ సిద్ధాంత సూత్రాలను వివరించాడు. స్వాభావికంగా మాంటెస్క్యూ మానవ విలువలకు, ఔన్నత్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. ఈ నేపథ్యంలో అతను వ్యక్తుల స్వేచ్ఛలను సంరక్షించే విధంగా అధికారాలు వేర్పాటువాద సిద్ధాంతాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ప్రభుత్వానికి గల సర్వ అధికారాలను ప్రభుత్వ అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య విభజించాలని వివరించాడు. ప్రతి ప్రభుత్వ అంగం నిర్దిష్ట అధికారాలను, ప్రత్యేక విధులను కలిగి ఉండాలన్నాడు. ప్రతి అంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదన్నాడు. ఆ విధంగా ప్రతి ప్రభుత్వ అంగం పాటించటం వల్ల వ్యక్తుల స్వేచ్ఛలను సంరక్షించుకోగలదని భావించాడు.

మాంటెస్క్యూ ఈ సిద్ధాంతాన్ని అధికారాల దుర్వినియోగాన్ని నిరోధించటానికి, వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడటానికి ప్రతిపాదించాడు. ఆయన అభిప్రాయంలో వ్యక్తుల రాజకీయ స్వేచ్ఛలు కేవలం “ఆధునిక మితవాద ప్రభుత్వాల్లో” మాత్రమే కాపాడబడతాయి. ఇతని సిద్ధాంతం అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయటమే కాకుండా ప్రతి అంగం తన పరిధికిలోబడి చర్యలు చేపట్టే విధంగా తీర్చిదిద్దింది. మాంటెస్క్యూ తన సిద్ధాంతం ద్వారా నిరోధ, సమతౌల్య సూత్రాన్ని (Checks and Balances) ప్రతి అంగం పాటించే విధంగా చెప్పాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రభుత్వాన్ని నిర్వచించండి. [Mar. 2017]
జవాబు:
రాజ్యము యొక్క లక్ష్యాలను, ఆశ్రయాలను రూపొందించి అమలుచేసేందుకు తోడ్పడే సాధనమే ప్రభుత్వం. ప్రజలకు సంబంధించి సమిష్టి విధానాలను, ప్రయోజనాలను, చర్యలను చేపట్టి వాటిని నిర్వహించటానికి ఒక సాధనంగా లేదా యంత్రంగా పనిచేసేదే ప్రభుత్వం” అని ప్రొఫెసర్ జె.డబ్ల్యు. గార్నర్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ గురించి రాయండి.
జవాబు:
అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించారు. అవి

  1. రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి
  2. రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి

మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా వర్గీకరించటం జరిగింది. రాజరికం, కులీన పాలన, మధ్యతరగతి పాలన అనేవి అరిస్టాటిల్ దృష్టిలో మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
కులీనస్వామ్యం అర్థాన్ని వివరించండి.
జవాబు:
రాజ్యాధికారాన్ని సమాజంలో కొద్దిమంది వ్యక్తులకు, వారి పుట్టుక, శక్తిసామర్థ్యాలు, సంపద, హోదా ప్రాతిపదికగా ఇచ్చినట్లయితే అటువంటి ప్రభుత్వ వ్యవస్థను కులీనస్వామ్యం అని అంటారు. ఈ కులీన వర్గం ప్రజాహితాన్ని విస్మరించినట్లయితే ‘అల్పజనపాలన’గా మారుతుందని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించండి.
జవాబు:
మధ్యతరగతి ప్రభుత్వం వికృతరూపంగా మారి స్వార్థపరులచేత పరిపాలించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం లేదా మూకపాలన (Mobocracy) అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. స్టీఫెన్ లీకాక్ ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పాలకులు వయోజనులైన పౌరుల చేత ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నుకోబడతారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి మెజారిటీ ప్రజల మద్దతు లభిస్తుంది.

ప్రశ్న 5.
ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు:
“ఏ వ్యవస్థలో రాజ్యము యొక్క సర్వాధికారాలను ఒకే కేంద్రీయ అధికార వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో, ఆ అధికార వ్యవస్థనే ఏకేంద్ర ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటుంది. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించబడి ఉంటాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం తన అవసరం మేరకు ఏర్పాటు చేసుకొనే వీలుంది.

ప్రశ్న 6.
సమాఖ్య ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకొంటావు ?
జవాబు:
“జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. సమాఖ్య ప్రభుత్వానికి ప్రధానంగా మూడు లక్షణాలుంటాయని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు.

  1. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన, నిర్దిష్టమైన అధికారాల పంపిణీ.
  2. లిఖిత, దృఢ, ఉన్నత రాజ్యాంగం 3) స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన న్యాయవ్యవస్థ.

ప్రశ్న 7.
అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి. ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

ప్రశ్న 8.
ప్రభుత్వ అంగాలు ఎన్ని ? వాటి పేర్లను తెలపండి.
జవాబు:
ప్రభుత్వ అంగాలు మూడు. అవి 1) శాసననిర్మాణశాఖ 2) కార్యనిర్వాహకశాఖ 3) న్యాయశాఖ. శాసననిర్మాణ శాఖ శాసనాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహకశాఖ శాసనాలను అమలుచేస్తుంది. న్యాయశాఖ ఈ రెండు శాఖల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలందరికి నిష్పక్షపాతంగా న్యాయాన్ని ప్రసాదిస్తుంది.

ప్రశ్న 9.
పార్లమెంటరీ ప్రభుత్వాన్ని గురించి నీకు ఏమి తెలియును ?
జవాబు:
పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యనిర్వాహకవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం

  1. తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు
  2. అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడుకొన్నది” అని ప్రొఫెసర్ గార్నర్ నిర్వచించటం జరిగింది.

AP Inter 1st Year Civics Study Material Chapter 12 ప్రభుత్వం

ప్రశ్న 10.
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి గల ఇతర పేర్లు ఏవి ?
జవాబు:
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసననిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ‘ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం’ అని, ‘నిర్ణీత కాలపరిమితిగల ప్రభుత్వమని’, ‘బాధ్యతారహిత ప్రభుత్వమని’ సంబోధిస్తారు.