Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 3rd Lesson జాతీయవాదం Textbook Questions and Answers.
AP Inter 1st Year Civics Study Material 3rd Lesson జాతీయవాదం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటో నిర్వచించి, జాతీయత మౌలిక అంశాలను వివరించండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేషియో’ అనే (Natio) లాటిన్ భాష నుండి గ్రహించబడినది. దీనికి “పుట్టుక” లేదా “జన్మ” అని అర్ధము. సంస్కృతంలో ‘జా’ అంటే ‘పుట్టుక’ అని అర్థం కలదు.
నిర్వచనం :
1. బర్జెస్ : “మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్కృతిక సముదాయమే జాతీయత”. 2. జె.డబ్ల్యు గార్నర్ : “తెగవంటి అనేక ప్రజాబంధాలతో ఐక్యమైన ప్రజా సముదాయంలో భాగమే జాతీయత”. 3. ఆర్.జి.గెటిల్ : “ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత”.
జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.
2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లలంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.
3) ఉమ్మడి భాష (Common Language) : ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది. ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.
4) భౌగోళిక ఐక్యత (Geographical Unity) : జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శ్రీ నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.
5) ఉమ్మడి చరిత్ర (Common History) : జాతీయతాభావ ఆవిర్భావంలో ఉమ్మడి చరిత్రను ఇంకొక | ప్రధాన అంశంగా పరిగణించవచ్చు. ఉమ్మడి చరిత్ర ప్రజానీకంలో ఎంతో ఉత్తేజాన్ని నింపి, వారిని కలిపి ఉంచుతుంది. కొన్నిసార్లు, చారిత్రక సంఘటనలు ప్రజలలో జాతీయతాభావాల వ్యాప్తికి దోహదపడతాయి. ఉదా : బ్రిటిష్ పాలన నుంచి భారతీయులు జాతీయతకు సంబంధించిన అనేక పాఠాలను నేర్చుకున్నారు.
6) ఉమ్మడి సంస్కృతి (Common Culture) : సంస్కృతి అంటే విస్తృతార్థంలో జీవనవిధానం. సంస్కృతి అనేది కొన్ని ఉమ్మడి అంశాలైన దుస్తులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలు, నైతిక విలువలు మొదలైన వాటి ద్వారా వెల్లడించబడుతుంది. ఈ ఉమ్మడి అంశాలు ప్రజలను ఒక త్రాటిపైకి తెచ్చి కలిపి ఉంచుతాయి.
7) ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు (Common Political Aspirations) : ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు ఉమ్మడి రాజకీయ ఆర్థిక ఆకాంక్షలచే ప్రేరణ పొందుతారు. అటువంటి ఆకాంక్షలు జాతి అవతరణలో శక్తివంతమైన పాత్రను పోషిస్తాయి. ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటై రాజ్యాన్ని నిర్వహించే సామర్థ్యం గల ప్రజలు తగినంత మంది ఉంటే, అటువంటివారు స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా రూపొందాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు. విభిన్నమైన అంశాలతో కూడిన ప్రజానీకం కూడా ఉమ్మడి జాతీయతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. జర్మనీ, ఇటలీలలోని ఏకీకరణ ఉద్యమాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా దేశాల ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలిచాయి.
ప్రశ్న 2.
జాతి – జాతీయవాదం మధ్య సంబంధాన్ని చర్చించండి.
జవాబు:
ఆధునిక ప్రపంచ వ్యవహారాలలో జాతి, జాతీయవాదం అనేవి చాలా శక్తివంతమైన అంశాలు. ఈ రెండు భావనలు ప్రపంచవ్యాప్తంగా సర్వసత్తాక, సార్వభౌమాధికార రాజ్యవ్యవస్థలు ఏర్పరచుకొనేలా ప్రజలను ఉత్తేజపరిచాయి.
అర్థం : జాతి, జాతీయవాదం అనే ఈ రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడబడతాయి. ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.
జాతి (Nation) : ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశములో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.
జాతీయవాదం (Nationalism) : జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్య్రాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయవాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య ‘భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం హానికరము.
జాతి, జాతీయవాదం మధ్య సంబంధం :-
1) జాతీయవాదం ఒక మానసిక భావన. ఒక ప్రజా సమూహం స్వతంత్రంగా వేరుపడి, ప్రత్యేక రాజ్యం కలిగి ఉండటం అనే అంశం ఇందులో ఇమిడి ఉంటుంది.
2) ఈ భావం ప్రజలలో బలంగా నాటుకుపోవటంతో ప్రజలు తమ జాతి మనుగడ కోసం వారి సమస్త ప్రయోజనాలను పణంగా పెడతారు.
3) జాతీయత అనేది ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష జాతిరాజ్య ఆవిర్భావానికి దోహదపడుటయే జాతీయవాదం.
4) 16వ శతాబ్దంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం జాతీయవాదానికి బీజాలు వేసింది.
5) 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం జాతీయవాదాన్ని ఐరోపాలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. దాని నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఐరోపా జాతీయులలో తీవ్రమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి.
6) వియన్నా సమావేశం (1815) ఐరోపాలో జాతీయవాదాన్ని మరింత బలపరచింది.
7) ఇటలీ ఏకీకరణ మరియు జర్మనీ ఏకీకరణ జాతీయవాదానికి మరింత బలాన్నిచ్చాయి.
8) 1774లో సంభవించిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ప్రజలలో జాతీయవాద వ్యాప్తికి బాగా తోడ్పడింది.
9) 1917లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన “జాతుల స్వయం నిర్ణయహక్కు” ప్రపంచ ప్రజలలో ప్రతి జాతీయ సముదాయం ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలనే భావాన్ని బలంగా నాటింది.
10) రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలోని దేశాలలో జాతిరాజ్య ఆవిర్భావం కోసం స్వాతంత్ర్యోద్యమాలు ఊపందుకున్నాయి.
11) 1885 నుండి 1947 మధ్య సాగిన భారత జాతీయోద్యమం భారత్, పాకిస్థాన్లు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించటానికి దోహదం చేసింది.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే జాతీయవాదం అనే భావం ఎప్పుడైతే ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని సాధిస్తుందో, అప్పుడు అది సార్వభౌమాధికార జాతిగా రూపొందుతుంది.
కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రెండింటిని పర్యాయపదాలుగా పరిగణించారు.
ప్రశ్న 3.
జాతుల స్వయం నిర్ణయాధికారం డిమాండ్ గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంత హక్కు ఉన్నది – ‘అని చెప్పేదే జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం.
అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచయుద్ధ కాలంలో తాను ప్రతిపాదించిన 14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. అప్పటి నుంచి –
1) ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జాతుల స్వయం నిర్ణయాధికార డిమాండ్లు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వాటిలో ఒకటి, స్పెయిన్లోని బాస్క్ అనే ప్రాంతం పర్వతాలతో కూడిన సంపన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని స్పెయిన్ ప్రభుత్వం సమాఖ్య పరిధిలో స్వయంపాలిత ప్రాంతంగా గుర్తించింది. అయితే అటువంటి ఏర్పాటు పట్ల బాస్క్ ప్రాంత ప్రజలు ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. తమ ప్రాంతం ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలని వారు గట్టిగా ఆకాంక్షించారు.
2) ప్రపంచ రాజ్యాలలోని ప్రజలు అనేక తెగలు, భిన్న సంస్కృతుల సముదాయాలకు చెందినవారు. ఇటువంటి సముదాయాలలోని ప్రజలు ఎన్నో నష్టాలకు గురి అయ్యామనే భావనను వ్యక్తీకరించారు. దాంతో మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలకు జాతీయ జీవనస్రవంతిలో భాగస్వామ్యం కల్పించడమనేది విషమసమస్యగా మారింది. అయితే ఇక్కడ ఆసక్తిదాయక అంశం ఏమిటంటే విభిన్న సంస్కృతులకు చెందిన సముదాయాలకు ఆయా రాజ్యాలు రాజకీయ గుర్తింపును ప్రసాదించాయి. దీంతో ఆ సముదాయాలు పాలనలో భాగస్వామ్యం పొందేందుకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకొనేందుకు ప్రయత్నించసాగాయి.
3) జాతీయ స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ఆసియా, ఆఫ్రికాలో జాతీయ విముక్తి పోరాటాలకు మద్దతు పలికింది. వలసప్రాంతాల ప్రజలు తమకు తగిన హోదా, గుర్తింపులు లభించాలనే హామీకై పట్టుబట్టారు. తమ సమిష్టి ప్రయోజనాల పరిరక్షణకై ఈ ఉద్యమాలు ప్రజలకు అండగా నిలిచాయి. జాతి ఔన్నత్యం, న్యాయసాధన అనే లక్ష్యాల సాధనకై అనేక జాతీయ ఉద్యమాలు నిర్వహించబడ్డాయి.
4) అయినప్పటికి ప్రతి సాంస్కృతిక సముదాయం ప్రత్యేక జాతిగా రూపొందాలనే ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ రాజకీయ స్వాతంత్ర్యం, రాజత్వం పొందేటందుకు ప్రయత్నించటం సాధ్యంకాదని తేలిపోయింది. ఫలితంగా ప్రజలు వలస వెళ్ళడం, సరిహద్దుల్లో యుద్ధాలు, హింస అనేవి అనేక దేశాలలో సర్వసాధారణమయ్యాయి. దాంతో అనేక జాతి రాజ్యాలలో విచిత్రమైన ప్రత్యేక పరిస్థితులు తలెత్తాయి. జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని కోరుతూ తమ భూభాగాలలో ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాలను సాధించిన దేశాలు, నేడు తమ దేశాలలోని మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రవర్తించటాన్ని జాతీయ స్వయం నిర్ణయాధికారంగా ప్రకటించుకోవటం విడ్డూరంగా ఉంది.
ప్రశ్న 4.
భారతదేశం జాతిరాజ్యమా ? అనే విషయం గురించి సంగ్రహంగా వివరించండి.
జవాబు:
పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్లు ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.
2) భారతదేశ స్వాతంత్ర్య సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో బాధలకు, దోపిడీలకు ఓర్చి ఉద్యమాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వహయాంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.
3) భారతదేశంలో నెలకొన్న మిశ్రమ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయభావాల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతమాత పట్ల నిబిడీకృతమైన భక్తిశ్రద్ధలు పెరిగి అంతిమంగా అది రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.
4) అనాదిగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ తామంతా మొదట భారతీయులమనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారు. ఆ తరువాత తమ భాష, ప్రాంతాల పట్ల ఎంతో మమకారాన్ని పెంచుకొని ప్రకృతి ఉపద్రవాలు, రాజకీయ సంక్షోభాలు సంభవించినప్పుడు వారు ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంతో వ్యవహరించారు.
5) కన్నతల్లి, జన్మభూమి అనేవి స్వర్గం కంటే గొప్పవని భారతీయులు విశ్వసించారు. భారతదేశ చరిత్ర వారిని ఎంతగానో ఉత్తేజితులను గావించింది. జాతీయ వారసత్వం, సంస్కృతి, రాజ్యాంగం, ప్రభుత్వం వంటి ఉమ్మడి మౌలిక అంశాలు భారతీయులలో జాతీయభావాలను ప్రోగుచేసి జాతీయసమైక్యతను పెంపొందించాయి.
భారతజాతి విశిష్టత : ఒక జాతిగా భారతదేశం ఎన్ని ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగం, పండుగలు, జాతీయ వేడుకలు, ఉమ్మడి ఆశయాలు వంటి అంశాల ప్రభావం వల్ల భారతీయులు ఎంతగానో స్ఫూర్తిని పొందుతున్నారు. సువిశాలమైన భారతదేశంలో సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని పెంపొందించుకొంటూ, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాలకు ధీటుగా ఒక శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. కాబట్టి భారతదేశాన్ని జాతిరాజ్యంగా పరిగణించవచ్చు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జాతీయత మౌలిక అంశాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.
2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.
3) ఉమ్మడి భాష (Common Language) : ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది. ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.
4) భౌగోళిక ఐక్యత (Geographical Unity) : జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం. ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.
ప్రశ్న 2.
జాతి, రాజ్యం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉంటాయి ?
జవాబు:
జాతి, రాజ్యం ఒక్కటే అన్న భావాన్ని చాలామంది వ్యక్తపరిచారు. హేస్ అనే శాస్త్రజ్ఞుడి దృష్టిలో రాజకీయ ఐక్యత, సార్వభౌమత్వంతో కూడిన స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక జాతీయ సముదాయం జాతి అవుతుంది. అలా ఏర్పడిన జాతినే జాతిరాజ్యం లేదా జాతీయరాజ్యం అని అనవచ్చునని హేస్ పేర్కొన్నాడు. అందువలన జాతి, రాజ్యం రెండు సమానార్థకాలుగా భావించవచ్చు. ఐక్యరాజ్యసమితి అనే అంతర్జాతీయ సంస్థను ఇంగ్లీషులో United Nations Organisation అంటారు. ఇక్కడ జాతి (Nation) అనే పదానికి రాజ్యం అనే అర్థం.
జాతి : లార్డ్ బ్రైస్ ప్రకారం, “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్య్రం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలే జాతి”.
రాజ్యం : ఉడ్రోవిల్సన్ ప్రకారం, “నిర్ణీత భూభాగంలో శాసనబద్ధులై నివసించే ప్రజలే రాజ్యం”.
జాతి, రాజ్యం మధ్య వ్యత్యాసాలు (Differences between Nation and State) :
జాతి (Nation)
- జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగమైందిగా పరిగణించవచ్చు.
- రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.
- ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి.
- జాతి అనేది చారిత్రక, సాంస్కృతిక పరిణామాన్ని కలిగి ఉంటుంది.
- జాతి అనే భావన సుదీర్ఘకాలం పాటు జీవనం సాగించిన ప్రజలతో కూడిన సముదాయం.
రాజ్యం (State)
- రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
- రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.
- ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధులైన ప్రజా సముదాయమే రాజ్యం.
- రాజ్యమనేది ఒకే రకమైన రాజకీయ, చట్టబద్ధమైన నిర్మితిని కలిగి ఉంటుంది.
- రాజ్యం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండక పోవచ్చు. స్వాతంత్ర్యం గల కొన్ని చిన్న రాజకీయ సమాజాలు లేదా విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ సమాజాల ఏకీకరణ ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది.
ప్రశ్న 3.
జాతీయవాదంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు:
జాతీయవాదం అనే భావన ప్రపంచ వ్యవహారాలలో కీలకపాత్ర పోషించినది. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది.
జాతీయవాదం (Nationalism) : జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయతావాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం హానికరము.
జాతీయవాదం వివిధ దశలు (Different Phases of Nationalism) : జాతీయవాదాన్ని కాలానుగుణంగా, దేశాల వారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. హేయస్ (Hayes) అనే రచయిత ప్రకారం జాతీయవాదంలో ఐదు దశలు ఉన్నాయి. అవి :
- మానవతావాద దశ
- సాంప్రదాయక దశ
- సమీకృత దశ
- అధికారధిక్కారవాద దశ (జాకోబియన్ దశ)
- ఉదారవాద దశ
మొదటి నాలుగు దశలు 18, 19వ శతాబ్దాలలో సంభవించాయి. ఫ్రెంచ్ విప్లవం దాని పర్యవసానాలు ఐదోదశలో సంభవించాయి. ఈ దశలో సమీకృత జాతీయవాదం ఆవిర్భవించింది. నాలుగో దశ సంపూర్ణాధికారవాద రాజ్య లక్షణాలతో పాటు ప్రజాస్వామ్య రాజ్య విధానాలను అవలంబించినదిగా చెప్పవచ్చు.
జాతీయవాదం గురించి స్నైడర్ చేసిన పరిశీలనలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇతని అభిప్రాయం ప్రకారం జాతీయవాదంలో నాలుగు దశలు ఉన్నాయి. వాటిని కింది విధంగా తెలపవచ్చు.
1) సమీకృత జాతీయవాదం (Integrative Nationalism – 1815 – 1871) : ఈ దశలో జాతీయవాదం అనేది సమైక్యతాశక్తిగా పరిణమించి, అది ఇటలీ, జర్మనీల ఏకీకరణలో ప్రస్ఫుటంగా గోచరించింది.
2) విధ్వంసకర జాతీయవాదం (Disruptive Nationalism – 1871 – 1890) : ఈ దశలో ఆస్ట్రియా – హంగేరీలకు చెందిన జాతీయతా ప్రజా సముదాయాలు, ఇతర బహుళజాతి రాజ్యాల ప్రజలు స్వాతంత్ర్యం కోసం విశేషంగా కృషి చేయడమైంది.
3) తీవ్రవాద జాతీయవాదం (Aggressive Nationalism – 1890 – 1945): ఈ దశలో జాతీయవాదాన్ని తీవ్రమైన సామ్రాజ్యవాదంతో సమానమైన భావనగా గుర్తించడమైంది. దాంతో రెండు ప్రపంచయుద్ధాల రూపంలో జాతీయ ప్రయోజనాలకై తీవ్రమైన ఘర్షణలు ఏర్పడినాయి.
4) సమకాలీన జాతీయవాదం (Contemporary Nationalism – 1945 తరువాత) : ఈ దశ ప్రారంభంలో రాజకీయ జాతీయవాదం అనేది ఐరోపా దేశాల అధినేతలపై తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికి పూర్వపు సోవియట్ యూనియన్ ఆధ్వర్యాన స్టాలిన్ కమ్యూనిస్టు తరహా ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి జాతీయవాదంలో తీవ్రమైన ధోరణులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్యదేశాల అంతర్జాతీయ రాజకీయాలకు ఈ దశలో ఊతం లభించింది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కొత్తగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలపై జాతీయవాదం విశిష్టమైన ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయ కమ్యూనిజంతో జాతీయవాదం అనుసంధానమైంది.
ప్రశ్న 4.
జాతి, జాతీయతల ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
జాతి, జాతీయత అనేవి పర్యాయపదాలుగా వాడబడుతున్నాయి. ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.
జాతి అనే పదం రాజకీయ సంస్థను సూచిస్తుండగా, జాతీయత అనేది ఆధ్యాత్మిక, మానసిక సంబంధమైన విశ్వాసంగా పేర్కొనవచ్చు.
జాతి (Nation) : జాతిని ఆంగ్లంలో (Nation) ‘నేషన్’ అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారం “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్య్రం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.
జాతీయత (Nationality) : జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ అంటారు. ఇది (Natio) ‘నేషియో’ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి ‘పుట్టుక’ అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్తసంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకులోనై ఉన్న జనసమూహం” జాతీయత అని లార్డ్ బ్రైస్ నిర్వచించాడు.
జాతి, జాతీయతల ప్రాముఖ్యత (Importance of Nation and Nationality) : అనేక ఆధునిక రాజకీయ వ్యవస్థలకు జాతి, జాతీయతా భావనలు పటిష్టమైన పునాదులను వేశాయి. ఒక నిర్ణీత ప్రదేశానికి చెందిన ప్రజలలో ఈ రెండు భావనలు ఐక్యత, సౌభ్రాతృత్వం, సమైక్యతలను పెంపొందించాయి. జాతీయత, జాతీయవాదం తమ రాజ్యాలను నిర్మించుకోవడంలోనూ, స్వీయ ఆర్థిక ఔన్నత్యాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ ఈ రెండు భావనలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. వాస్తవానికి ఈ రెండు భావనలు అనేక ఆధునిక రాజ్యాలలో ప్రజల మధ్య ఐక్యత భావాల వ్యాప్తిలో కీలక పాత్రను పోషించాయి. కుటుంబ సభ్యులపట్ల ప్రేమానురాగాలు, జాతిపట్ల విశ్వాసం, ఇరుగుపొరుగు వారిపట్ల సహకార భావం మొదలైనవి ఆయా దేశాల ప్రజలలో జాతి, జాతీయతలు అనే భావనలచే పెంపొందాయని చెప్పవచ్చు. ఆధునిక రాజ్యాల నిర్మాణం, మనుగడ అనేవి చాలావరకు పైన పేర్కొన్న అంశాల ప్రేరణతో కూడిఉన్నాయని చెప్పవచ్చు.
జాతి, జాతీయత అనే రెండు భావనలు ఒకే రకమైన ఆవిర్భావాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు భావనలకు అర్థం ఒక్కటే. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్, హేయస్ వంటి రాజనీతిశాస్త్ర రచయితలు రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని సాధించిన ప్రజలే జాతిగా రూపొందుతారని వర్ణించారు. ప్రజలలో జాతీయపరమైన విశ్వాసాలు ఉంటే వారు జాతిగా రూపొందుతారు. ఉమ్మడి అవగాహన ప్రాతిపదికగా సజాతీయ సంస్థగా ప్రజలు ఏర్పడటం ద్వారా జాతి, జాతీయత అనే రెండు భావనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.
జాతి, జాతీయత అనే భావాల ప్రభావం వల్ల రాజ్యం అవతరిస్తుంది. ఐరోపాలోని అనేక దేశాల ప్రజలు నియంతృత్వపు కోరలలో చిక్కుకొన్న సమయంలో, జాతీయత భావాలు వారిని విశేషంగా ప్రభావితం చేశాయి. ఆయా దేశాల చక్రవర్తుల కబంధహస్తాల నుంచి విముక్తి పొంది, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొనే దిశగా ప్రజలలో జాతి, జాతీయత భావనలు ప్రేరణ కలిగించాయి. అంతేకాకుండా తమ భాష, మతం, ఆచారాల పట్ల ప్రజలలో ప్రగాఢమైన ప్రేమ, అభిమానం, గౌరవాలను అవి పెంపొందించాయి. స్వీయ సంస్కృతులను సంరక్షించుకొనేందుకు ప్రజలను ప్రోత్సహించాయి. కాబట్టి జాతి, జాతీయత భావనలు ప్రజలలో ఐక్యత, అవగాహనలను పెంపొందించే దిశలో కీలక పాత్ర వహించాయని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
జాతి, జాతీయతల మధ్య వ్యత్యాసాలు ఏవి ? [Mar. ’18]
జవాబు:
జాతి, జాతీయతల మధ్య కింద అంశాలలో వ్యత్యాసాలు ఉన్నాయి.
జాతి (Nation)
- జాతి అనేది రాజకీయ భావన.
- జాతి అనేది ఎల్లప్పుడూ రాజకీయంగా సంఘటితమైన రాజ్యాన్ని సూచిస్తుంది.
- జాతి అనే భావన ఎల్లప్పుడూ స్వతంత్రతను కలిగి ఉంటుంది.
- జాతీయత లేకుండా జాతి అనేది ఉండదు.
- జాతిగా ఏర్పడిన ప్రజలు రాజ్య శాసనాలకు విధేయులుగా ఉంటారు.
జాతీయత (Nationality)
- జాతీయత అనేది మానసిక భావన.
- జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన, అతి సులభమైన భావన.
- జాతీయత అనే భావన స్వతంత్రతను కలిగి ఉండదు.
- జాతి లేకుండా జాతీయత ఉంటుంది.
- జాతీయతగల ప్రజలు జాతిగా రూపొందేవరకు, రాజ్యాంగ చట్టాలు ఉండవు. అయితే స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు కొన్ని ఉమ్మడి నియమాలను అనుసరిస్తారు.
ప్రశ్న 6.
జాతుల స్వయం నిర్ణయాధికారం గురించి రాయండి.
జవాబు:
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంతహక్కు ఉన్నది. అని చెప్పేదే జాతి స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం. వియన్నా కాంగ్రెసు (1815) కాలం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు ‘ఒకే జాతీయ సముదాయం ఒకే జాతి రాజ్యం’ అనే సిద్ధాంతం యూరప్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని కారల్మార్క్స్, ఏంజల్స్, లెనిన్ మొదలగువారు బలపరిచారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తాను ప్రతిపాదించిన ’14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి రాజ్యాంగం ఈ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చింది. ధర్మకర్తృత్వ మండలి ఉద్దేశ్యం జాతీయ సముదాయాలకు క్రమంగా స్వయం పాలన కలుగజేయటమే. ఒక్కోక్క జాతీయ సముదాయం ఒక్కొక్క జాతీయ రాజ్యంగా అవతరించినందువల్ల పెక్కు ప్రయోజనాలు ఉన్నమాట నిజమే. అయితే దానివలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ భావాన్ని ఖండిస్తూ దానిని మొత్తం ప్రజల వ్యవస్థీకృతమైన స్వార్థ ప్రయోజనంగా (Organised self interest of whole people) అభివర్ణించాడు. ఆధునిక కాలంలో జాతీయ భావం ఒక మత భావనకు దారితీస్తున్నదని షిలిటో (Schillito) హెచ్చరించాడు. లార్డ్ యాక్టన్ అభిప్రాయంలో ఏకజాతి రాజ్యం కన్నా బహుళ జాతిరాజ్యమే అన్ని విధాల మెరుగైనది.
ప్రశ్న 7.
భారతదేశం జాతిరాజ్యమా ? వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్లు ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.
2) భారతదేశ స్వాతంత్ర్య సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో బాధలకు, దోపిడీలకు ఓర్చి ఉద్యమాలు చేశారు. |బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.
3) భారతదేశంలో నెలకొన్న మిశ్రమ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయభావాల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతమాత పట్ల నిబిడీకృతమైన భక్తిశ్రద్ధలు పెరిగి అంతిమంగా అది రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.
4) అనాదిగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ తామంతా మొదట భారతీయులమనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారు. ఆ తరువాత తమ భాష, ప్రాంతాల పట్ల ఎంతో మమకారాన్ని పెంచుకొని ప్రకృతి ఉపద్రవాలు, రాజకీయ సంక్షోభాలు సంభవించినప్పుడు వారు ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంతో వ్యవహరించారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటి ?
జవాబు:
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఇది (Natio) ‘నేషియో’ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి “పుట్టుక” అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్త సంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకులోనై ఉన్న జనసమూహం” జాతీయత అని ‘లార్డ్ బ్రైస్’ నిర్వచించాడు.
ప్రశ్న 2.
జాతిని నిర్వచించండి.
జవాబు:
జాతిని ఆంగ్లంలో (Nation) ‘నేషన్’ అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బడ్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.
ప్రశ్న 3.
జాతి – రాజ్యాల మధ్య రెండు వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
జాతి (Nation)
- జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగం అయినదిగా పరిగణించవచ్చు.
- రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.
రాజ్యం (State)
- రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
- రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.
ప్రశ్న 4.
జాతీయతకు గల రెండు అర్థాలను పేర్కొనండి.
జవాబు:
- జాతీయత అనేది ఒక రాజ్యంలో పౌరుల చట్టబద్ధమైన హోదాలకు సంబంధించినది. పౌరులహోదా జాతీయతను సూచిస్తుంది.
- ఒక నిర్ణీతమైన దేశంలో వ్యక్తుల సముదాయానికి గల ప్రత్యేక గుర్తింపుకు జాతీయత చిహ్నంగా ఉంటుంది.
ప్రశ్న 5.
జాతీయత మౌలిక అంశాలలో రెండింటిని తెలపండి.
జవాబు:
జాతీయత లక్షణాలు :
1) స్వచ్ఛమైన తెగ (Purity of Race) : దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది. ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం. కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.
2) ఉమ్మడి మతము (Common Religion) : ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు. ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.
ప్రశ్న 6.
జాతీయవాదం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
జాతీయవాదాన్ని సూక్ష్మంగా పరిశీలించినచో ప్రపంచ వ్యవహారాలలో ఈ భావన కీలకపాత్ర పోషించినదని చెప్పవచ్చు. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది. అయితే జాతీయవాదం ఒకవైపు ప్రపంచ ప్రజలను | ప్రభావితం చేయగా మరొకవైపు ప్రపంచ ప్రజానీకం మధ్య విద్వేషాలను కూడా సృష్టించింది. నియంతృత్వ పాలకుల ప్రతిఘటనల నుంచి ప్రజలకు విముక్తి గావించి అనేక సామ్రాజ్యాలు, పలు రాజ్యాల విభజనలలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అనేక రాజ్యాల సరిహద్దులను నిర్ణయించడంలో సైతం కీలకపాత్ర పోషించింది.
ప్రశ్న 7.
జాతీయవాదంలోని రెండు సుగుణాలను రాయండి.
జవాబు:
1) జాతీయవాదం ప్రజల మధ్య నెలకొన్న పరస్పర వైరుధ్యాలు, వ్యక్తిగత విద్వేషాలు, అంతర్గతమైన ఘర్షణలను నిలువరించగలిగింది. ఒక జాతికి సంబంధించిన ప్రజలలో ఐక్యత, సమగ్రత, సంఘీభావాన్ని పెంపొందించింది. ఇరుగుపొరుగు ప్రజల ఉద్దేశ్యాలను తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. కాబట్టి ప్రజల మధ్య చక్కని
అవగాహనను పెంపొందించింది.
2) ప్రజలు ప్రభుత్వం పట్ల విధేయత చూపించేలా జాతీయవాదం దోహదపడింది.
ప్రశ్న 8.
జాతీయవాదంలోని రెండు దోషాలను తెలపండి.
జవాబు:
- జాతీయవాదం ప్రజలలో అహంకారం, అసూయ, గర్వాలను ప్రోత్సహిస్తుంది. ఇటువంటి ధోరణులను జర్మన్, ఇటాలియన్ల చరిత్ర ద్వారా మనం గమనించవచ్చు.
- ఇరుగు పొరుగు రాజ్యాల ప్రజలపై మరొక రాజ్యం ప్రజలు ఆధిక్యతను ప్రదర్శించే ధోరణిని రెచ్చగొడుతుంది.