AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 9th Lesson కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగం కూడా అన్ని సమాఖ్య రాజ్యాంగాల వలె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజించింది. భారత రాజ్యాంగం 11, 12 భాగాలలోని 245 నుంచి 300 వరకు గల అధికరణాలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల సంబంధాలను ప్రస్తావించాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను స్థూలంగా మూడు శీర్షికల క్రింద అధ్యయనం చేయవచ్చు. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు.

1. శాసన సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 245 నుంచి 255 వరకు గల 11 అధికరణాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు వివరించబడ్డాయి. శాసనపరమైన అంశాలను మూడు జాబితాల క్రింద వర్గీకరించారు. అవి:

  1. కేంద్ర జాబితా
  2. రాష్ట్ర జాబితా
  3. ఉమ్మడి జాబితా.

i) కేంద్ర జాబితా: జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఇవ్వడం జరిగింది. ఉదా: దేశరక్షణ, సాయుధ దళాలు, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, తంతితపాలా, ఆకాశవాణి, దూరదర్శన్ మొదలగునవి.

ii) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి. ఉదా: శాంతి భద్రతలు, పోలీసు, జైళ్ళు, గ్రంథాలయాలు, వ్యవసాయం, పశుపోషణ మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

iii) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉంది. అయితే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఈ జాబితాలోని ఏదైనా ఒకానొక అంశంపై శాసనం రూపొందిస్తే, పార్లమెంటు రూపొందించిన శాసనానికి ఆధిక్యం ఇవ్వడం జరుగుతుంది. ఉదా: వివాహం, విడాకులు, ధర్మాదాయ, దేవాదాయ సంస్థలు, విద్య, విద్యుచ్ఛక్తి. వార్తాపత్రికలు మొదలగునవి.

పై మూడు జాబితాల్లో లేని అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ అంశాలను అవశిష్టాధికారాలు అంటారు.

  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేసే అధికారం పొందుతుంది.
  • ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రానికి అవసరమైన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. శాసన వ్యవహారాల్లో రాష్ట్రాలకంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలున్నాయి.

2. పరిపాలనా సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలు వివరించబడ్డాయి.

  • కేంద్ర ప్రభుత్వం తన విధులను కొన్నింటిని రాష్ట్రాలకు అప్పగించవచ్చు. వాటికి అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుంది.
  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు పరిపాలనకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారానికి భంగం వాటిల్లని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యనిర్వహణాధికారాన్ని వినియోగించుకోవాలి.
  • కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది.

3. ఆర్థిక సంబంధాలు: భారత రాజ్యాంగంలోని 264 నుండి 300 వరకు అధికరణలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల ఆర్థిక సంబంధాలు వివరించబడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో సంఘర్షణలు నివారించడానికి ఏయే పన్నులను ఏయే ప్రభుత్వాలు వసూలు చేయాలో, ఎలా పంచుకోవాలో అనే విషయాలపై ప్రత్యేక వివరణ ఇచ్చారు.

  • కేంద్ర ప్రభుత్వానికి 12 రకాల పాలనాంశాలపై విధించే పన్నుల ద్వారా ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు 19 రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి.
  • అభివృద్ధి కోసం ఉద్దేశించిన కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేస్తుంది.
  • రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమ్మతి లేనిదే ఎటువంటి ఋణాలు పొందకూడదు. ఆర్థిక విషయాలలో రాష్ట్రాలు, కేంద్రంపై ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలలోని మూడు జాబితాలను చర్చించండి.
జవాబు:
భారతరాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనాధికారాల పంపిణీని మూడు రకాలుగా విభజించింది. అవి: మొదటి జాబితా (కేంద్ర జాబితా), రెండవ జాబితా (రాష్ట్ర జాబితా), మూడవ జాబితా (ఉమ్మడి జాబితా) కేంద్ర జాబితా: కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో విభజించడం జరిగింది. కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. భారతరాజ్యాంగ ప్రారంభంలో ఇందులో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం ఇందులో 100 అంశాలు కలవు. ఈ జాబితాలోని అంశాలపైనా చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మాత్రమే అధికారం కలదు. ఈ జాబితాలోని కొన్ని ముఖ్యాంశాలు: దేశభద్రత, ఐక్యరాజ్య సమితి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు, విదేశాలతో సంధులు చేసుకోవడం, యుద్ధం, శాంతి, పౌరసత్వం, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానయానం, నౌకాయానం, విమానయాన నియంత్రణ, తపాలా, టెలిఫోన్, నాణెములు, వాణిజ్యం, బ్యాంకింగ్, అంతర్ రాష్ట్ర వ్యాపారం, బీమా, విదేశీ అప్పులు, పేటెంట్లు, తూనికలు, జలాలు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, అఖిల భారత సర్వీసులు, పార్లమెంటుకు ఎన్నికలు, అణుశక్తి, ఆయుధాల తయారీ, నౌక, వైమానిక, సైనికదళాలు, కేంద్ర భద్రతా దళాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, వైమానిక రవాణా నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ మొదలగునవి. ఈ అంశాలపై తయారుచేసిన చట్టాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు దేశ పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

రాష్ట్ర జాబితా: సాధారణ పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను తయారుచేయడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో స్థానిక ప్రాముఖ్యత కలిగిన 66 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటి సంఖ్యను 62కు కుదించడం జరిగింది.

ఈ జాబితాలోని కొన్ని ముఖ్య అంశాలు: శాంతిభద్రతలు, న్యాయం, జైళ్ళు, పోలీసులు, వ్యవసాయం, నీటిపారుదల, ప్రజారోగ్యం, స్థానిక స్వపరిపాలన సంస్థలు, తీర్థయాత్రలు, గ్రంథాలయం, ఫిషరీస్, మార్కెట్లు, సంతలు, భూమిశిస్తు మొదలగునవి. వీటిపై చేసిన చట్టాలు రాష్ట్రంలోని వ్యక్తులకు మరియు సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి.

ఉమ్మడి జాబితా: ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంట్కు మరియు రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు. ఇందులో జాతీయ మరియు స్థానిక ప్రాధాన్యత గల 47 అంశాలు ఉంటాయి. 42వ రాజ్యాంగ సవరణ తరువాత వీటి సంఖ్య 52కు పెరిగింది. ఈ అంశాలపై పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసినప్పటికీ ఏదైనా సమస్య ఉత్పన్నమయినపుడు పార్లమెంటు తయారుచేసిన చట్టాలు మాత్రమే అమలులో ఉంటాయి.

ఈ జాబితాలోని ముఖ్యాంశాలు: అడవులు, అడవి జంతువులు మరియు పక్షుల పరిరక్షణ, జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ, విద్య (సాంకేతిక మరియు వైద్య విద్య), నేర విచారణ విధానం, వివాహం మరియు విడాకులు, ధార్మిక సంస్థలు మరియు ధర్మకర్తృత్వ మండళ్ళు, కల్తీలు, కార్మిక సంఘాలు, విద్యుచ్ఛక్తి, ముద్రణాలయాలు, వార్తాపత్రికలు, తూనికలు మరియు కొలతలు (ప్రమాణముల నిర్థారణ మినహాయించి) మొదలగు ఈ జాబితాలో పొందుపరచిన అంశాలను సవరించుటకు మరియు రద్దు చేయుటకు, రాష్ట్ర శాసనసభలు ఈ అంశాలపై చేసిన చట్టాలను సవరించుటకు, రద్దు చేయుటకు పార్లమెంటు అధికారం కలదు. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలలో పేర్కొనని ఏ అంశంపైన అయినా శాసనాలు తయారు చేయుటకు పార్లమెంట్కు ప్రత్యేక అధికారం కలదు. రాష్ట్ర శాసనసభలు తయారుచేసిన రాష్ట్ర జాబితాలోని అంశాలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో రద్దు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలోని కేంద్ర – రాష్ట్రాల మధ్య గల పరిపాలన సంబంధాలను తెలపండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల 8 అధికరణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా సంబంధాల గురించి వివరించాయి. ప్రగతి సాధనకు పాలనా వ్యవస్థ గుండెకాయ వంటిది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనా వ్యవహారాల్లో ఎటువంటి ఘర్షణలు రాకుండా చూసేందుకు మన రాజ్యాంగం తగిన విధంగా రూపొందించబడింది.

  1. కేంద్ర ప్రభుత్వ శాసనాల అమలుకు అనుగుణంగా రాష్ట్రాలు తమ పరిపాలనను నిర్వహించుకోవలెను.
  2. అవసరమని భావించినప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలనా సంబంధమైన ఆదేశాలను ఇస్తుంది.
  3. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ విషయంలో కేంద్రం రూపొందించి, అమలుపరిచే పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉండాలి.
  4. సైనిక లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన రహదారులను నిర్మించి, వాటిని రక్షించుటలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇస్తుంది. వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది.
  5. రైల్వేలు మొదలైన ఆస్తుల రక్షణకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. 6) అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాలను పరిష్కరించే అధికారం కేంద్ర పార్లమెంటుకు ఉంది.
  6. ఏదైనా ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా జరగనప్పుడు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించవచ్చు.
  7. రాష్ట్ర పాలకులైన గవర్నర్లను రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నియమిస్తాడు. రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు వారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.
  8. విదేశీ దురాక్రమణల నుంచి, అల్లకల్లోలాల నుంచి రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది.
  9. కేంద్రం అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య ఏర్పడే తగాదాలను పరిష్కరిస్తుంది మొదలైనవి.
  10. కేంద్ర, రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్రమైన రాజ్యాంగబద్ధ ఎన్నికల కమీషన్ను నియమిస్తుంది.
  11. రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన వచ్చే ఆరోపణలను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం కలదు.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలను వివరించండి.
జవాబు:
రాజ్యాంగంలోని 12వ భాగంలోని 268 నుంచి 293 వరకు గల ప్రకరణలు కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను గూర్చి వివరిస్తాయి. ఈ క్రింది శీర్షికల ద్వారా కేంద్ర, రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలను తెలుసుకోవచ్చు.
a) కేంద్ర విధించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధిస్తుంది. దిగుమతి సుంకాలు, కస్టమ్స్, పొగాకు, జనపనారపై ఎక్సైజ్ సుంకం, కార్పొరేషన్ పన్ను, మూలధన విలువపై పన్ను, వ్యవసాయేతర ఎస్టేట్లపై పన్ను, రైల్వేలు, తంతితపాలా, టెలిఫోన్స్, వైర్లెస్, విదేశీ మారకద్రవ్యం, కరెన్సీ, నాణేల ముద్రణ, ప్రసార మాధ్యమాలు, ఇతర రకాల కమ్యూనికేషన్లు మొదలైనవి ఇందులోకి వస్తాయి.

b) రాష్ట్రం విధించి, ఉపయోగించే పన్నులు, సుంకాలు: కొన్ని రకాల పన్నులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధి క్రిందకు మాత్రమే వస్తాయి. భూమిశిస్తు, రోడ్డు మరియు దేశీయ జలమార్గాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులు మరియు వస్తువులపై పన్నులు, విద్యుత్ వినియోగం మరియు అమ్మకంపై పన్ను, టోల్యాక్స్, మద్యపానంపై పన్ను, వినోదపు పన్ను, పందాలపై, జూదాలపై, విలాసాలపై పన్నులు మొదలగునవి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

c) కేంద్రం విధించి, రాష్ట్రాలు సేకరించి ఉపయోగించుకునే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రంచే విధించబడతాయి. అయితే వాటిని రాష్ట్రాలు సేకరించి, ఉపయోగించుకుంటాయి. బిల్లుల మారకం, చెక్కులు, ప్రామిసరీ నోటులు, బిల్స్ ఆఫ్ లెండింగ్, కంపెనీ వాటాల బదలాయింపు, టాయ్లెట్ సంబంధ వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీలు, మత్తుపదార్థాలు మొదలగునవి ఈ కోవకు చెందుతాయి.

d) కేంద్రం విధించి, సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నులు: ఈ క్రింద తెలిపిన పన్నులు కేంద్రం విధించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. వ్యవసాయేతర ఆస్తిపై ఎస్టేట్ సుంకం, రైల్వే ఛార్జీలు, రైల్వే వస్తువుల రవాణా ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను, రైలు, సముద్ర, వైమానిక, సాధనాల ద్వారా పంపే వస్తువులు, ప్రయాణీకులపై విధించే టెర్మినల్ పన్నులు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

e) కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర – రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు: ఈ పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేస్తుంది. కానీ రాష్ట్రాలతో కలిసి పంచుకుంటుంది. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, టాయ్లెట్, ఔషదేతర వస్తువులపై విధించే ఎక్సైజ్ సుంకాలు మొదలగునవి.

ప్రశ్న 3.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలను పరిశీలించండి.
జవాబు:
భారత రాజ్యాంగం 11వ భాగంలోని మొదటి అధ్యాయంలోని 245 నుంచి 255 ప్రకరణలు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలను తెలియజేస్తాయి. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య గల శాసన | సంబంధాలను ప్రాదేశిక పరిధి ప్రాతిపదికపై ఈ విధంగా తెలపవచ్చు.
ఎ) పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు.

బి) కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది.

సి) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని మొదటి జాబితా (కేంద్ర జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం కలదు.

డి) భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని తృతీయ జాబితా (ఉమ్మడి జాబితా) నందు పేర్కొన్న ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు అధికారం కలదు.

ఇ) భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని ద్వితీయ జాబితా (రాష్ట్ర జాబితా) నందు తెలియజేయబడిన ఏదైనా అంశం మీద చట్టాలు చేయడానికి రాష్ట్ర శాసన సభలకు మాత్రమే అధికారం కలదు.

ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపలున్న భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎటువంటి చట్టాలైన (రాష్ట్ర జాబితాలో వున్నప్పటికి చేయవచ్చు.

జి) మూడు జాబితాలలో పేర్కొనని ఏ అంశాల పైన అయినా చట్టాలు తయారు చేయడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారం కలదు.

హెచ్) కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ద్వితీయ జాబితాలోని (రాష్ట్ర జాబితా) అంశాలపైన చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం కలదు. అవి: జాతీయ ప్రాధాన్యత గల అంశాలు; జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి పార్లమెంట్ను చట్టాలు చేయమని అడిగినప్పుడు; అంతర్జాతీయ సంధులు, ఒప్పందాలు అమలు చేసేటప్పుడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 4.
ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
నిర్మాణం: భారత రాజ్యాంగం 280వ ప్రకరణలో ఆర్థిక సంఘ నిర్మాణం, అధికారాలు మరియు విధులను గూర్చి చర్చించడం జరిగింది. పాక్షిక న్యాయాధికారాలు గల ఈ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇందులో ఒక అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని ఐదు సంవత్సరాల పదవీ కాలానికి రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ సభ్యులు తిరిగి నియమింపబడటానికి అర్హులు. ఈ సంఘ అధ్యక్ష మరియు ఇతర సభ్యుల అర్హతలు నిర్ణయించడానికి పార్లమెంటుకు రాజ్యాంగం అధికారం కల్పించింది. అందుకు అనుగుణంగా పార్లమెంట్ ఆర్థిక సంఘ అధ్యక్షునితో పాటు ఇతర సభ్యుల అర్హతలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సంఘం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ గురించి రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తుంది. ఈ సంఘ అధ్యక్షుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞుడై ఉండాలి. మిగిలిన నలుగురు సభ్యులు

ఈ క్రింది రంగాల నుండి నియమించబడుతారు.

  • హైకోర్టు న్యాయమూర్తి (లేదా) హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హత గల వ్యక్తి అయి ఉండాలి.
  • మరో సభ్యుడు ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు మరియు ఖాతాలలో అనుభవం కలిగి ఉండాలి.
  • మూడవ సభ్యుడు విత్త విషయాలలో నిష్ణాతుడై ఉండాలి.
  • నాల్గవ సభ్యుడు ఆర్థికశాస్త్రంలో నిపుణుడై ఉండాలి.

అధికారాలు విధులు: ఆర్థిక సంఘం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించి భారత రాష్ట్రపతికి తగు సిఫార్సులు ఈ క్రింది విషయాలలో చేయవలసి ఉంటుంది.

  1. కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఏ నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలో సిఫార్సులు చేస్తుంది.
  2. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు సహాయక నిధులకు సంబంధించి ఏ సూత్రాల ఆధారంగా పంపిణీ చేయాలో తగు మార్గదర్శక సూత్రాలను సూచిస్తుంది.
  3. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలను కొనసాగించాలా లేదా మార్పులు చేయాలా అనే విషయంలో ఈ సంఘం సిఫార్సులు చేస్తుంది.
  4. దేశ ఆర్థిక పటిష్టతకు సంబంధించి రాష్ట్రపతి కోరినప్పుడు తగిన సూచనలిస్తుంది.
  5. 73 మరియు 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఆర్థిక సంఘ విధులు మరింత విస్తృతం అయ్యాయి. రాష్ట్రాలలోని పంచాయితీలకు మరియు మున్సిపాలిటీలకు ఆర్థిక వనరులు అందజేయుటకు భారత సంఘటిత నిధికి వనరులను ఏ విధంగా పెంచాలో చర్యలను సూచిస్తుంది.
  6. పటిష్టమైన ఆర్థిక స్థిరత్వం కొరకు పరిపాలన మరియు రాజకీయ రంగాలలోని ఉన్నతాధికారులతో ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతుంది. దేశంలోని వివిధ ఆర్థిక సంఘాల అధినేతల సూచనలను ఆహ్వానిస్తుంది.

ఆర్థిక సంఘం తన నివేదిక రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దీనిని సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. రాష్ట్రపతి ఆర్థిక సంఘం చేసిన కొన్ని లేదా అన్ని సిఫార్సులను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ సిఫార్సులు ఐదు సంవత్సరాల కాలం అమలులో ఉంటాయి.

ప్రశ్న 5.
సర్కారియా కమీషన్ సిఫార్సులను మూల్యాంకనం చేయండి. [Mar. ’17]
జవాబు:
సర్కారియా కమిషన్ (1983 – ’87): 1983, జూన్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిషను ఒకదానిని ఏర్పరచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునఃపరిశీలన జరిపి తగిన సిఫారసులు చేయవలసిందిగా ఆ కమిషన్ను కోరడమైంది. ఆ కమిషన్లో బి. శివరామన్, ఎస్. సేన్ అనే ఇద్దరు సభ్యులు ఉన్నారు. కమిషన్ కార్యదర్శిగా ఎమ్.ఆర్. సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుడిగా ఎల్.ఎన్. సిన్హా వ్యవహరించారు. 1987, అక్టోబరు 27వ తేదీన 247 సిఫారసులతో కూడిన 5000 పేజీలకు పైగా ఒక అంతిమ నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫారసులు: సర్కారియా కమిషన్ పేర్కొన్న సిఫారసులలో కింద పేర్కొన్నవి అత్యంత ప్రధానమైనవి.

  1. రాజకీయేతర రంగాలకు చెందిన, వివాదాస్పదం కాని ప్రముఖ వ్యక్తులు, సాధ్యమైనంతవరకు మైనారిటీలకు చెందిన వ్యక్తులను రాష్ట్ర గవర్నర్లుగా నియమించాలి.
  2. రాష్ట్ర గవర్నర్ల నియామకంలో ముఖ్యమంత్రులను సంప్రదించాలి.
  3. ముఖ్యమంత్రి నియామకం, రాష్ట్ర మంత్రివర్గం కొనసాగింపు విషయాలలో విధానసభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి.
  4. అరుదైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టాలి.
  5. అఖిల భారత సర్వీసు సిబ్బందికి సంబంధించిన విషయాలలో కేంద్రం రాష్ట్రాలను సంప్రదించాలి.
  6. జోనల్ కౌన్సిళ్ళను పునర్వ్యవస్థీకరించాలి.
  7. శాశ్వత ప్రాతిపదికపై అంతర్ ప్రభుత్వ మండలిని ఏర్పాటు చేయాలి.
  8. జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చి, దాని అస్థిత్వాన్ని పరిరక్షించాలి.
  9. ఆర్థిక నిపుణులను ఆర్థిక సంఘ సభ్యులుగా నియమించాలి.
  10. భారతదేశ సమిష్టి సంస్కృతిని సంరక్షించేందుకు ప్రాంతీయ భాషలలో జాతీయ కార్యక్రమాలను ప్రసారం చేయాలి.
  11. జాతీయ వ్యవహారాల విషయంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరగాలి.
  12. అవశిష్టాంశాలపై పన్నులు విధించే శాసన నిర్మాణాధికారాన్ని పార్లమెంటుకు అప్పగించాలి.
  13. రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ హెల్త్ సర్వీసు, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసులను ఏర్పాటు చేయాలి.
  14. కార్పొరేషన్ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి.
  15. రాష్ట్రాలకు సైన్యాన్ని పంపేముందు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్ర – రాష్ట్రాల మధ్య గల ఏవైనా మూడు సంబంధాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్రాల మధ్య గల సంబంధాలను మూడు రకాలుగా వర్గీకరించటం జరిగింది. అవి:

  1. శాసన సంబంధాలు
  2. పరిపాలనా సంబంధాలు
  3. ఆర్థిక సంబంధాలు

ప్రశ్న 2.
కేంద్ర జాబితా.
జవాబు:
కేంద్ర జాబితా చాలా సుదీర్ఘమైనది. ప్రస్తుతం ఈ జాబితాలో 100 పరిపాలనాంశాలు ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. ఈ జాబితాలో దేశభద్రత, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు, విదేశీ వ్యవహారాలు, దౌత్య సంబంధాలు మొదలైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ప్రశ్న 3.
అత్యవసర పరిస్థితులలో పరిపాలన సంబంధాలు.
జవాబు:
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో, కేంద్ర ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వం వలె అధికారాలు చెలాయించడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కాకుండా, కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆధీనంలో పనిచేస్తాయి. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్రపతి తరుఫున గవర్నర్ చెలాయిస్తాడు.

ప్రశ్న 4.
కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు.
జవాబు:
పార్లమెంటు భారతదేశం మొత్తానికి గానీ లేదా దేశంలో కొంత ప్రాంతానికి గానీ చట్టాలు చేయవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటే చట్టాలు చేస్తుంది. కేంద్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడని అంశాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది.

ప్రశ్న 5.
అవశిష్ట అధికారాలు.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. వీటి పై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు.
ఉదా: ఆర్థిక వ్యవస్థలోని సేవారంగంపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ప్రశ్న 6.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు రాజ్యాంగేతర సాధనాలు.
జవాబు:

  1. నీతి అయోగ్.
  2. జాతీయ అభివృద్ధి మండలి.

1) నీతి అయోగ్ జాతీయ ప్రణాళికా సంఘం స్థానంలో రాజ్యాంగేతర సంస్థగా ఏర్పాటు చేయబడింది. దీనినే 2015 జనవరి 1వ తేదీన ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏర్పాటు చేయడం జరిగింది.

2) జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయటంలో సహాయపడుతుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 7.
నీతి ఆయోగ్. [Mar. ’17, ’16]
జవాబు:
నీతి ఆయోగ్ జాతీయ ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి చేత | 2015 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఇది విధాన, ఆర్థిక విషయాలకు సంబంధించిన సాంకేతిక, వ్యూహాత్మక సలహాలతో కూడిన జాతీయ అజెండాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. గ్రామీణస్థాయి ప్రణాళికల యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు వివిధ స్థాయిలలోని ప్రభుత్వాల ప్రణాళికలకు సంబంధించి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి
పరుస్తుంది.

ప్రశ్న 8.
జాతీయ అభివృద్ధి మండలి.
జవాబు:
జాతీయ అభివృద్ధి మండలి రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది ప్రణాళికలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఈ సంస్థను 1952లో ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సభ్యులందరూ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ దీనికి కార్య నిర్వాహక శాఖగా పనిచేస్తుంది.

ప్రశ్న 9.
జాతీయ సమగ్రత మండలి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో “భిన్నత్వంలో ఏకత్వం” పై జరిగిన జాతీయ సదస్సులో తీసుకొన్న ఒక నిర్ణయం మేరకు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి 1961లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షులు కాగా, కేంద్ర హోంశాఖామంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన ఏడుగురు నాయకులు. యు.జి.సి. అధ్యక్షుడు, ఇద్దరు విద్యావేత్తలు మొదలగు వారు ఇందులో సభ్యులుగా ఉంటారు. మతవాదం, కులవాదం, ప్రాంతీయవాదం, భాషావాదం మరియు జాతీయ సమగ్రతకు సంబంధించి సంకుచిత భావనలు మొదలగు వాటికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, వ్యవహరించవలసిన విధానం గూర్చి సిఫారసు చేస్తుంది.

ప్రశ్న10.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మూడు ఉద్రిక్త పరిస్థితులు.
జవాబు:

  1. గవర్నర్ల నియామక పద్ధతి
  2. గవర్నర్ల పక్షపాత వైఖరి
  3. రాష్ట్రాలపై 356 నిబంధనను ప్రయోగించడం.

ప్రశ్న 11.
పూంఛీ కమీషన్.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనానికై ఏర్పాటైన మరొక కమీషన్లే పూంఛీ కమీషన్.
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్మోహన్ పూంఛీ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి UPA ప్రభుత్వం ఏప్రిల్ 28, 2007న ఈ కమీషన్ ను ఏర్పాటు చేసింది. భారత రాజకీయ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర – రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయవలసిందిగా ప్రభుత్వం కమీషన్ను కోరింది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సర్కారియా కమీషను సమీక్షించి దాదాపు దశాబ్దాలు గడిచిపోయాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలలో ప్రాధాన్యత కలిగిన అంశాలతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంపై కమీషన్ దాదాపు 310 సిఫార్సులు చేసింది. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఏప్రిల్ 20, 2010న సమర్పించింది. పూంఛీ కమీషన్ చాలా అంశాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా పరిశీలించి, భారతదేశ సమైక్యతను, సమగ్రతకు భావితరాల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి మెరుగు పరచడానికి భారతదేశం ఒక సహకార సమాఖ్యగా ఉండాలని సూచించింది. సహకార సమాఖ్య సూత్రాలు భారత రాజకీయ వ్యవస్థకు మరియు సుపరిపాలనకు ఆచరణలో మార్గదర్శకంగా ఉండాలని వివరించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 9 కేంద్ర – రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 12.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
జవాబు:
కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు, విధులు మరియు బాధ్యతలు ప్రధానాంశంగా నిలుస్తాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలను గూర్చి భారత రాజ్యాంగంలోని 11 మరియు 12 భాగాలలో 245 – 300 వరకు గల ప్రకరణలలో వివరించడమైంది. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మూడు శీర్షికల క్రింద చర్చించవచ్చు. అవి: i) శాసన సంబంధాలు ii) పరిపాలన సంబంధాలు. iii) ఆర్థిక సంబంధాలు.