Andhra Pradesh BIEAP AP Inter 1st Year Physics Study Material 1st Lesson భౌతిక ప్రపంచం Textbook Questions and Answers.
AP Inter 1st Year Physics Study Material 1st Lesson భౌతిక ప్రపంచం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భౌతికశాస్త్రం అంటే ఏమిటి?
జవాబు:
ప్రకృతి మూలనియమాలు, ప్రకృతి సహజమైన విభిన్న దృగ్విషయాల్లో వాటి స్వయం వ్యక్తీకరణ అధ్యయనమే భౌతికశాస్త్రం.
ప్రశ్న 2.
సి.వి. రామన్ ఆవిష్కరణ ఏమిటి? [Mar. ’14]
జవాబు:
అణువుల ద్వారా కాంతి యొక్క అస్థితిస్థాపక పరిక్షేపణను C.V. రామన్ కనుగొన్నాడు. దీనినే రామన్ ప్రభావం అంటారు.
ప్రశ్న 3.
ప్రకృతిలోని ప్రాథమిక బలాలు ఏవి?
జవాబు:
- గురుత్వాకర్షణ బలం
- విద్యుదయస్కాంత బలం
- బలమైన కేంద్రక బలాలు
- బలహీన కేంద్రక బలం.
ప్రశ్న 4.
కింది వాటిలో దేనికి సౌష్ఠవం ఉంటుంది?
a) గురుత్వ త్వరణం
b) గురుత్వాకర్షణ నియమం.
జవాబు:
గురుత్వాకర్షణ నియమం. ఉదాహరణకు చంద్రుడిపై గురుత్వ త్వరణం విలువ, భూమిపై విలువలో 6వ వంతు ఉంటుంది.
కాని గురుత్వాకర్షణ నియమం చంద్రుడిపై మరియు భూమిపై ఒకే విధంగా ఉంటుంది.
ప్రశ్న 5.
భౌతికశాస్త్రానికి ఎస్. చంద్రశేఖర్ చేసిన అంశదానం (contribution) ఏమిటి? [May., Mar. ’13]
జవాబు:
నక్షత్రాల నిర్మాణమును అధ్యయనం చేసినపుడు, సూర్యుడి ద్రవ్యరాశికి 1.4 రెట్లు కన్నా ఎక్కువ ద్రవ్యరాశి గల తెల్లని మరగుజ్జు నక్షత్రాలను ఇతను నిరూపించాడు. ఈ ద్రవ్యరాశిని చంద్రశేఖర పరిమితి అంటారు. ఈ పరిమితిని దాటితే నక్షత్రం నాశనమైపోతుంది.
అదనపు అభ్యాసం
ప్రశ్న 1.
శాశ్వత కీర్తి గడించి సుప్రసిద్ధులైన శాస్త్రజ్ఞులలో ఒకడైన ఆల్బర్ ఐన్స్టీన్ విజ్ఞానశాస్త్ర స్వభావం గురించి అపారజ్ఞానయుతమైన కొన్ని వ్యాఖ్యలు (statements) చేశాడు. ‘ప్రపంచం అత్యంత నిగూఢత (The most incomprehensible thing about the world is that it is comprehensible) ఏమిటంటే – అది విస్తృతార్థ బోధకమైనట్టిది’ – ఐన్స్టీన్ ఈ విధంగా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకొంటున్నారు !
జవాబు:
లేమన్ దృష్టిలో భౌతిక ప్రపంచంలో ఉన్న వాటిని మనం అర్థం చేసుకోలేనివి చాలా ఉన్నాయి. వైజ్ఞానిక పురోగతిని బట్టి శాస్త్రజ్ఞుల పరిశోధనలు పరిమాణంలో పరమాణువుల కంటే చిన్నవైన కణాల నుంచి, అనంతదూరంలో ఉన్న నక్షత్రాల వరకు వ్యాప్తిని కలిగి ఉంటాయి. పరిశీలన, ప్రయోగాలు చేయడం ద్వారా సత్యాలను కనుక్కోవడమే గాక, ఈ సత్యాలను సారాంశీకరించే నియమాలను ఆవిష్కరించే ప్రయత్నం భౌతిక శాస్త్రజ్ఞులు చేస్తారు.
ప్రశ్న 2.
‘ప్రతి గొప్ప భౌతిక సిద్ధాంతం అంగీకృత అభిప్రాయానికి విరుద్ధవాదంగా మొదలై హేతుబద్ధంకాని అభిప్రాయంతో అంతమవుతుంది’. ఈ తీక్షణమైన వ్యాఖ్య చెల్లుబాటు అయ్యేలా కొన్ని ఉదాహరణలను విజ్ఞానశాస్త్ర చరిత్ర నుంచి పేర్కొనండి.
జవాబు:
పై నిర్వచనం సరియైనది. ఉదాహరణకు పూర్వకాలం టాలెమీ భావనల ప్రకారం సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాల వంటివి భూమి చుట్టూ పరిభ్రమిస్తాయి. తర్వాత ఇటాలియన్ శాస్త్రజ్ఞుడు గెలీలియో భావనల ప్రకారం సూర్యుడు నిశ్చలంగా ఉండి, సూర్యుడి చుట్టూ భూమి, మిగిలిన గ్రహాలు తిరుగుతాయి. తప్పుడు భావనలు ప్రవేశపెట్టాడని గెలీలియోను పై అధికారులు శిక్షించారు. తర్వాత న్యూటన్ మరియు కెప్లర్ గెలీలియో సిద్ధాంతంను బలపరిచారు మరియు ఇది నిశ్చిత సిద్ధాంతము.
ప్రశ్న 3.
రాజకీయ శాస్త్రం (Politics)’ అనేది సాధ్యమయ్యే వాటికి చెందిన కళ’ అదే విధంగా ‘పరిష్కరించ గలిగే వాటికి చెందిన కళయే విజ్ఞానశాస్త్రం’. విజ్ఞానశాస్త్ర స్వభావం, అభ్యాసానికి చెందిన ఈ అందమైన, సూక్ష్మమైన సుభాషితాన్ని వివరించండి.
జవాబు:
రాజకీయ నాయకులు ఓట్లతో గెలిచి, ఏదైనా సాధించగలరు. అంటే రాజకీయ శాస్త్రం అనేది సాధ్యమయ్యే వాటికి చెందిన కళ. అలాగే సైన్స్ కూడా కొన్ని ప్రాథమిక నియమాలను అనుసరించి పరిష్కరించగలిగే వాటికి చెందిన కళయే విజ్ఞానశాస్త్రం.
ప్రశ్న 4.
అత్యంత వేగంగా వ్యాపిస్తున్న విజ్ఞానశాస్త్ర, సాంకేతిక శాస్త్రాలకు భారతదేశం విస్తృతమైన ఆధారమూలంగా (large base) నెలకొన్నప్పటికీ, విజ్ఞానశాస్త్రంలో ప్రపంచానికే నాయకత్వం వహించగలిగే స్థాయికి చేరడానికి చాలా కాలం పడుతుందని అనిపిస్తోంది. మీ దృష్టిలో భారతదేశంలో విజ్ఞానశాస్త్రం ఉన్నతస్థితికి (advancement) చేరుకోకుండా ప్రతిబంధకాలవుతున్న కొన్ని ముఖ్య కారకాలను పేర్కొనండి.
జవాబు:
భారతదేశంలో సైన్స్ అభివృద్ధి చెందాలంటే నా దృష్టిలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి.
- నిరక్షరాస్యత
- పేదరికం వల్ల వనరులు లేకపోవడం మరియు సరైన సౌకర్యాలు లేకపోవడం.
- జనాభా పెరుగుదల వల్ల
- సైన్స్పరంగా సరైన ప్రణాళిక లేకపోవడం
- స్వీయక్రమశిక్షణ మరియు పనిచేసే సంస్కృతి అభివృద్ధి చెందకపోవడం వల్ల.
ప్రశ్న 5.
ఏ భౌతికశాస్త్రజ్ఞుడూ ఇంత వరకు ఎలక్ట్రాను ‘చూడ’ లేదు. అయినప్పటికీ, భౌతిక శాస్త్రజ్ఞులందరూ కూడా ఎలక్ట్రాన్ ఉన్నదనే నమ్ముతారు. తెలివి ఉండీ, మూఢ విశ్వాసం ఉన్న ఒక మనిషి ‘భూతాల’ను ఎవ్వరూ ‘చూడకపోయినా’ అవి ఉన్నాయనే వాదనను ఈ సాదృశ్యం ద్వారా ముందుకు తెస్తాడు. ఈ వాదనను మీరు ఎలా ఖండిస్తారు?
జవాబు:
ఏ భౌతిక శాస్త్రజ్ఞుడు ఇంత వరకు ఎలక్ట్రాను చూడలేదు. కాని ఎలక్ట్రాన్ ఉనికిని తెలిపే అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కాని భూతాలు ఉన్నట్లుగా ఎలాంటి సాక్ష్యాలు లభించవు.
ప్రశ్న 6.
జపాన్ లోని సముద్రతీరంలోని ఒక ప్రత్యేక ప్రదేశంలో కనిపించే పీతల గుల్లలు (కర్పరాలు) ఒక ‘సమురాయ్’ యొక్క చిరస్మరణీయమైన ముఖాన్ని దాదాపు పోలి ఉన్నట్లుగా అగుపిస్తాయి. అందరూ పరిశీలించగలిగే ఈ ‘సత్యాని’కి రెండు వివరణలను కింద ఇచ్చాం. ఈ రెండింటిలో ఏది వైజ్ఞానిక వివరణ అని’ మీ మనస్సుకు తట్టుతుంది?
(a) చాలా శతాబ్దాల క్రితం విషాదకరమైన ఒక సముద్ర ప్రమాదం యువ ‘సమురాయ్’ ను ముంచివేసింది. అతని సాహసానికి ప్రశంసా సూచకంగా ప్రకృతి తనకున్న అనేక అతి గూఢమైన మార్గాల ద్వారా అతని ముఖాన్ని ఆ ప్రదేశంలోని పీత గుల్లలపై ముద్రించి అతని ముఖానికి అమరత్వాన్ని ప్రసాదించింది.
(b) సముద్ర విషాద సంఘటన తరువాత, ఆ ప్రాంతంలోని జాలర్లు, మరణించిన తమ ప్రసిద్ధ యోధుడికి గౌరవ సూచకంగా, తాము పట్టుకున్న పీతగుల్లలపైన యాదృచ్ఛికంగా సమురాయ్ ముఖాన్ని పోలిన ఆకారాన్ని కలిగి ఉంటే వాటిని స్వేచ్ఛగా వదలి వేస్తారు. తత్ఫలితంగా, పీతగుల్లలకు ఉండే ఆ ప్రత్యేక ఆకారం ఎంతో కాలం నిలదొక్కుకోగలిగింది. కాలక్రమేణా జన్యురీత్యా ఆ ఆకారం ఆ జాతికి పరంపరగా సంక్రమిస్తూ ఉంది. కృత్రిమ వరణం (artificial selection) వల్ల కలిగే
పరిణామానికి ఇది ఒక ఉదాహరణ.
[సూచన : పైన చెప్పిన ఆసక్తిదాయకమైన సోదాహరణ కార్ల్సగన్ (Carl Sagan) యొక్క ‘ది కాస్మోస్’ (The Cosmos) నుంచి తీసుకోవడమైంది. ఇది ఒక సత్యాన్ని ప్రాధాన్యంలోకి తెస్తుంది. మనకు తరచుగా, కారణాలతో మనం వివరింపలేని, వింతైన సత్యాలు మొట్టమొదట దృష్టిలో పడగానే అవి ‘మానవాతీతమైనవి’ గా తోస్తాయి. కాని వాటికి సరళమైన శాస్త్రీయ వివరణ ఉందని తరువాత తెలియడమే ! ఈ రకమైన మరికొన్ని ఉదాహరణల కోసం ఆలోచన చేయండి !]
జవాబు:
b) వివరణ పరిశీలించిన వాస్తవంకు సైంటిఫిక్ వివరణ.
ప్రశ్న 7.
రెండు శతాబ్దాల కంటే పూర్వం ఇంగ్లాండు, పాశ్చాత్య యూరప్ లో ఏర్పడిన పారిశ్రామిక విప్లవం నిజానికి కొన్ని కీలకమైన వైజ్ఞానిక, సాంకేతికశాస్త్ర పురోగతుల వల్ల ప్రారంభమైందే ! ఈ పురోగతు
లేమిటి?
జవాబు:
1750 A.Dలో సైంటిఫిక్ మరియు టెక్నాలజీలలో వచ్చిన అభివృద్ధి మూలంగా ఇంగ్లాండ్ మరియు తూర్పు యూరోపియన్ దేశాలలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనది. ఆవిరియంత్రము, నిప్పుల కొలిమి, పత్తి జిన్నింగ్ యంత్రం మరియు మరమగ్గాలు మొదలగునవి అభివృద్ధి చెందిన కొన్నింటికి ఉదాహరణలు.
ప్రశ్న 8.
ప్రపంచం ఈనాడు రెండో పారిశ్రామిక విప్లవానికి గురవుతోందని తరచుగా అంటున్నారు. ఈ రెండో విప్లవం, మొదటి దానివలె మానవ సమాజాన్ని ఆమూలాగ్రంగా మార్చగలిగేదే! ఈ విప్లవానికి కారణభూతాలైన కొన్ని కీలకమైన, సమకాలీన వైజ్ఞానికశాస్త్ర, సాంకేతికశాస్త్ర రంగాల జాబితా తయారుచేయండి !
జవాబు:
సైన్స్ మరియు టెక్నాలజీలలో సమకాలీన మార్పులను సమాజానికి వేగంగా అందించే కొన్ని ప్రాంతాలు.
- గది ఉష్ణోగ్రత వద్ద అతివాహక పదార్థాలను అభివృద్ధి చేయడం.
- సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లను అభివృద్ధి చేయడం.
- సమాచార టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులను తేవడం.
- బయోటెక్నాలజీని అభివృద్ధి చేయడం.
- రోబోట్లను అభివృద్ధి చేయడం.
ప్రశ్న 9.
ఇరవై రెండవ శతాబ్దంలోని విజ్ఞానశాస్త్ర, సాంకేతికశాస్త్రాలపై ఒక కల్పానాత్మక కథను (fiction piece) సుమారు 1000 పదాలలో రాయండి.
జవాబు:
ఒక అంతరిక్ష నౌక 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రం వైపు ప్రయాణిస్తుందనుకొనుము. అది ముందుకు కదలడానికి అవసరమైన విద్యుత్, విద్యుదయస్కాంత ప్రేరణ ద్వారా జనిస్తుంది.
అంతరిక్ష నౌక అయస్కాంత క్షేత్రంను దాటునప్పుడు, అతివాహక తీగలతో చేసిన విద్యుత్ మోటార్కు విద్యుత్ను అందిస్తుంది. అంతరిక్ష నౌక మొత్తం ప్రయాణంలో ఎలాంటి శక్తిని అందించనవసరం లేదు.
అంతరిక్షంలో ఒకచోట, ఉష్ణోగ్రత అధికంగా ఉంటే, మోటారు తీగలలోని అతివాహక ధర్మం నాశనమవుతుంది. ఈ కారణంచేత అంతరిక్ష నౌకలో మోటారు ద్వారా విద్యుత్ జనించదు.
క్షణకాలంలో, మరొక అంతరిక్ష నౌక, మొదటి నౌకలో శక్తిని జనింపచేయడానికి ద్రవ్యం మరియు విరుద్ధ ద్రవ్యం గల వేరువేరు కంపార్ట్మెంట్లను నింపాలి. మొదటి అంతరిక్ష నౌక తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ప్రశ్న 10.
వైజ్ఞానికశాస్త్ర ఆచరణ (practice) పై మీ ‘నైతిక’ దృక్పథాలను సూత్రీకరించడానికి ప్రయత్నించండి. మీకు అనుకోకుండా ఒకానొక ఆవిష్కరణ అకస్మాత్తుగా తారసపడిందని ఊహించండి; ఈ ఆవిష్కరణ కేవలం తాత్త్విక ఆసక్తిని కలిగించేంత గొప్పదేకాని, మానవ సమాజానికి నిశ్చయంగా అపాయాన్ని కలిగించే పర్యవసానాలకు మాత్రమే దారితీస్తుందని అనుకోండి. ఇలాంటి సందిగ్ధావస్థను మీరే గనుక ఎదుర్కొనేట్లయితే దాన్ని ఎలా పరిష్కరిస్తారు?
జవాబు:
సైన్స్ నిజాన్ని అన్వేషిస్తుంది. ఆవిష్కరణ అనేది ఒక మంచి అభిలాష, కాని కొన్నిసార్లు మానవ సమాజానికి దాని పర్యవసానాలు ప్రమాదభరితంగా మారతాయి. నిజాన్ని వెలికితీయడం, అది తప్పుదారి పట్టకుండా చూడటం సైంటిస్ట్ల బాధ్యత. ఉదాహరణకు కేంద్రక విచ్ఛిత్తి ద్వారా విద్యుత్ శక్తిని తయారుచేయవచ్చు మరియు అణుబాంబును కూడా అభివృద్ధి చేయవచ్చు. ఈ ఆయుధం మానవాళిని తుడిచిపెడుతుంది. అందువల్ల అణుశక్తిని శాంతి సామరస్యాలకు వినియోగించేలా ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలి.
ప్రశ్న 11.
తక్కిన ఇతర జ్ఞాన సంచయాల్లాగే (knowledge) విజ్ఞానశాస్త్రాన్ని కూడా మంచికీ, చెడుకీ వాడుకోవచ్చు. ఇది వాడుకొనే మనిషిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కొన్ని వైజ్ఞానికశాస్త్ర అనువర్తనాలను ఇచ్చాం. వీటిలో ఒక ప్రత్యేక అనువర్తనం మంచిదా, చెడుదా లేదా అట్లా స్పష్టంగా వర్గీకరించడానికి వీలులేనిదా అన్నదానిపై మీ దృక్పథాలను సూత్రీకరించండి.
a) మశూచికి వ్యతిరేకంగా దాన్ని అణచివేయడానికి గానీ లేదా ఆ వ్యాధిని అంతిమంగా జనాభా నుంచి సమూలంగా నిర్మూలించడానికి గానీ వాడే సామాన్య టీకా (Mass vaccination) (నిజానికి ఇప్పటికే భారతదేశంలో విజయవంతంగా పూర్తిచేయడం జరిగింది.)
b) నిరక్షరాస్యతను నిర్మూలించడానికీ, వార్తలనూ, సమాలోచనలనూ విస్తృతంగా ప్రచారం చేయడానికీ టెలివిజన్.
c) కాన్పుకు ముందే చేసే లింగ నిర్ధారణ.
d) పని దక్షత పెంచడానికి కంప్యూటర్లు.
e) భూమి చుట్టూ కక్ష్యల్లో కృత్రిమ ఉపగ్రహాలను ఉంచడం.
f) న్యూక్లియర్ మారణాయుధాలను సమకూర్చుకోవడం.
g) రసాయనిక, జీవశాస్త్ర యుద్ధతంత్రాలను ప్రయోగించడానికి సరికొత్త, సమర్ధవంతమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం.
h) తాగడానికి కావలసిన నీటి శుద్ధీకరణ.
i) ప్లాస్టిక్ సర్జరీ.
j) క్లోనింగ్ (జీవ ప్రతిరూపాలను కృత్రిమంగా సృష్టించడం)
జవాబు:
a) ఉమ్మడిగా టీకాలు వేయడం చాలా మంచిది.
b) నిరక్షరాస్యతను నిర్మూలించడానికి, ఉమ్మడి ఆలోచనలు, వార్తలు టెలివిజన్ ద్వారా తెలుసుకోవడం నిజంగా చాలా మంచిది.
c) కాన్పుకు ముందే లింగనిర్ధారణ తప్పు కాదు. కాని దానిని దుర్వినియోగం చేయరాదు. దానివలన ఆడ, మగ జనాభా నిష్పత్తిలో తేడా వస్తుందని ప్రజలకు తెలియజేయాలి.
d) పని దక్షతను పెంచడానికి కంప్యూటర్లు వాడటం మంచిది.
e) భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం మంచిది.
f) న్యూక్లియర్ మారణాయుధాలను అభివృద్ధి చేయడం మంచిది కాదు. అవి అందరినీ నాశనం చేస్తాయి.
g) రసాయనిక, జీవశాస్త్ర యుద్ధ తంత్రాలను ప్రయోగించడానికి, సరికొత్త సమర్థమైన సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం మంచిది కాదు. ఇవి మానవాళిని అంతం చేస్తాయి.
h) తాగడానికి కావలసిన నీటిని శుద్ధీకరణ చేయడం మంచిది.
i) ప్లాస్టిక్ సర్జరీ మంచిది.
j) క్లోనింగ్ కూడా మంచిది.
ప్రశ్న 12.
భారతదేశం గణిత, ఖగోళ, భాషా, తర్క, నీతిశాస్త్రాల్లో సుదీర్ఘమైన అవిచ్ఛిన్నమైన పాండిత్య సంప్రదాయాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, దీనికి సమాంతరంగా అనేక మూఢవిశ్వాసపూరిత, వికాస వ్యతిరేక ధోరణులూ, ఆచారాలూ మన సమాజంలో ఉండేవి. దురదృష్టవశాత్తూ, ఈనాటికీ విద్యావంతులైన అనేక ప్రజల్లోనూ ఇంకా కొనసాగుతున్నాయి. మీకు కలిగే వైజ్ఞానికశాస్త్ర జ్ఞాన సంచయంతో ఈ ధోరణులను ఎదుర్కోవడానికి, వ్యతిరేకించడానికి మీరు ఎలాంటి వ్యూహాలను అభివృద్ధి చెందించదలచుకున్నారు?
జవాబు:
సాధారణ మనిషిని విద్యావంతుడిని చేయడం ద్వారా మూఢనమ్మకాలను, వికాస వ్యతిరేక ధోరణులను పారద్రోలవచ్చు. పత్రికలు, మ్యాగజైన్లు, రేడియో మరియు T.V ల ద్వారా పాఠశాలలలోని విద్యార్థులకు తెలియజెప్పటం ద్వారా ఉపాధ్యాయులు సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలవచ్చు.
ప్రశ్న 13.
భారతదేశంలో స్త్రీలకు చట్టం స్త్రీలకు సమానస్థాయిని కల్పిస్తున్నా, ఆమెకు ఉండే సహజ స్వభావం పట్ల అనేకమంది ఇతర అశాస్త్రీయమైన దృక్పథాలనే పట్టుకు వేలాడుతున్నారు. వారి సామర్థ్యాన్ని, బుద్ధి సూక్ష్మతనూ (intelligence) (వివేకాన్ని) గుర్తించకుండా జీవితంలో రెండో తరగతి హోదాను, అప్రధానమైన పాత్రను మాత్రమే స్త్రీలకు ఇస్తున్నారు. శాస్త్రీయమైన వాదనలతో, విజ్ఞానశాస్త్రం ఇతర రంగాల్లో రాణించిన గొప్ప మహిళల ఉదాహరణలను ఉటంకిస్తూ మీరు ఈ అభిప్రాయాలను కూల్చివేయండి (Demolish), వారి శక్తియుక్తుల పట్ల మీరు విశ్వాసాన్ని పెంపొందించుకొని సమానావకాశాలు కల్పిస్తే, స్త్రీలు పురుషులతో సమానంగా, సరితూగగలుగుతారని, మిమ్మల్ని మీరు స్వయంగానే గాక ఇతరులనూ ఒప్పించగలగే నేర్పును తెచ్చుకోండి.
జవాబు:
పురుషులకు మరియు స్త్రీలకు సమాన అవకాశాలను కల్పించాలి. మానవుని మెదడు మనం తీసుకునే న్యూట్రిషన్స్ మరియు పోషకాహారం వలన అభివృద్ధి చెందుతుంది. దీనిలో లింగ భేదానికి తావులేదు. పురుషుని మెదడు వలెనే స్త్రీల మెదడు కూడా సమానంగా అభివృద్ధి చెందింది. మేడమ్ క్యూరీ భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. మదర్ థెరిస్సా సెయింట్గా నిరూపించుకున్నారు. రాజకీయాలలో శ్రీమతి ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, శ్రీమతి బండారునాయికే మొదలగువారు రాణించారు.
ప్రశ్న 14.
‘భౌతికశాస్త్ర సమీకరణాల్లో సౌందర్యం ఉండటమనేది అవి ప్రయోగాలతో అంగీకారాన్ని కలిగి ఉండటం కంటే ఎక్కువ ప్రధానమైంది’ ఇది గొప్ప బ్రిటిష్ భౌతికశాస్త్రవేత్త పి.ఎ.ఎమ్.డిరాక్ (P.A.M. Dirac) కు ఉన్న అభిప్రాయం. ఈ కథనాన్ని మీరు విమర్శించండి. ఈ పుస్తకంలో సౌందర్యవంతమని (మిమ్మల్ని హత్తుకున్నట్లు) కనిపించే కొన్ని సమీకరణాలు, ఫలితాల కోసం వెతకండి.
జవాబు:
గొప్ప బ్రిటిష్ శాస్త్రవేత్త పి.ఎ.ఎమ్. డిరాక్కు ఉన్న అభిప్రాయం నిజం. ఉదాహరణకు F = ma; E = mc² సరళ మరియు సౌంధర్యవంతమైన భౌతిక సమీకరణాలు. వీటిని సార్వత్రికంగా అన్వర్తించవచ్చు.
కాని కొన్ని సందర్భాలలో సాపేక్ష సిద్ధాంతంలోని సమీకరణాలు కొన్ని సరళంగాను, ‘సౌందర్యవంతంగాను ఉండవు. వీటిని అర్థం చేసుకోవడం కష్టం.
ప్రశ్న 15.
పైన పేర్కొన్న విషయం వివాదాస్పదమైనదే కావచ్చు. కాని అత్యధిక సంఖ్యలో ఉండే భౌతికశాస్త్రజ్ఞులకు భౌతికశాస్త్ర ప్రసిద్ధ నియమాలు యదార్థంగానే సరళం, సౌందర్యపూరితమైనవనే ఒక అనుభూతి ఉంది. డిరాక్తోపాటు, ఈ విధంగా విస్పష్టంగా మాట్లాడిన మరికొందరు సుప్రసిద్ధ భౌతికశాస్త్రజ్ఞులు : ఐన్స్టీన్, బోర్, హైసన్బర్గ్, చంద్రశేఖర్, ఫైర్ మ్యాన్. భౌతికశాస్త్రంలో నిష్ణాతులైన వీరితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను, రచనలను సంపాదించడానికి లేదా చదవడానికి ప్రత్యేకయత్నాలు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. (ఈ పుస్తకం చివరలో గ్రంథసూచిని చూడండి). వారి రచనలు నిజంగానే మీలో స్ఫూర్తిని నింపడంతోపాటు, మీకు పునరుత్తేజాన్ని కలిగిస్తాయి !
జవాబు:
విద్యార్థులు మంచి గ్రంథాలయంకు వెళ్ళి భౌతికశాస్త్రంలో మంచి పుస్తకాలను చదవాలి. ఫైర్మన్ రచించిన పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరికొన్ని ఆసక్తికరమైన పుస్తకాలు రోగర్ E.M. రచనలు, G. గ్యామో రచనలు.
ప్రశ్న 16.
‘విజ్ఞానశాస్త్ర అధ్యయనం చప్పగానూ, ఎప్పుడూ మరీ గంభీరమైనదిగానూ ఉండటమే గాక శాస్త్రవేత్తలంతా అదో లోకంలో లేదా అన్యమనస్కులూ, అంతర్ముఖులై ఉంటారు. అంతేకాదు, హాయిగానే కాదు వెర్రినవ్వు అయినా నవ్వని వాళ్ళై ఉంటారనే’ దురభిప్రాయాన్ని విజ్ఞానశాస్త్ర పాఠ్యపుస్తకాలు మీకు కలిగించవచ్చు. విజ్ఞానశాస్త్రంపైనా, శాస్త్రవేత్తలపైనా కలిగే ఈ అభిప్రాయం ఒక ‘బహిరంగ అసత్యం’. ఇతర వర్గాల్లోని మనుషుల్లాగే, శాస్త్రజ్ఞుల్లో కూడా హాస్యస్ఫోరకులూ, పరిహాసశీలురూ ఉన్నారు, వాళ్ళలో వినోదం, ఉల్లాసపూరితమైన సాహసకృత్యాలతో కూడిన భావాలతో జీవితం గడిపిన వారు ఉన్నారు. ఇలాంటి జీవితం గడుపుతూనే, వారు ఎంతో గంభీరంగా, వైజ్ఞానిక క్రియాన్వేషణలో మునిగి ఉండేవారు. ఈ రీతి జీవనశైలి గడిపిన సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్తల్లో గ్యామో, ఫైర్మన్లను చెప్పుకోవచ్చు. గ్రంథ సూచి జాబితాలో ఇచ్చిన వారి గ్రంథాలను చదివితే మీరు ఎంతో ఉత్తేజానికి లోనవుతారు !
జవాబు:
నిజం. శాస్త్రవేత్తలు కూడా, ఇతర వర్గాల్లోని మనుషుల్లాగే హాస్యస్ఫోరకులు, పరిహాసశీలురూ ఉన్నారు. వాళ్లలో వినోదం, ఉల్లాసపూరితమైన సాహసకృత్యాలతో కూడిన భావాలతో జీవితం గడిపిన వారు ఉన్నారు. ఇలాంటి జీవితం గడుపుతూనే వారు ఎంతో గంభీరంగా, వైజ్ఞానిక క్రియాన్వేషణలో మునిగి ఉండేవారు. గ్యామో, ఫైర్మన్ రచనలు విద్యార్థులు చక్కగా చదువుకొని ఉత్తేజానికి లోనుకావచ్చు.