Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం Textbook Questions and Answers.
AP Inter 1st Year Zoology Study Material 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జీవన చర్యలను నిర్వచించి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జీవుల దేహములో జరిగే అన్ని రకాల రసాయన చర్యలనే సంక్షిప్తంగా జీవన క్రియలు అంటారు.
ఉదా : కిరణజన్య క్రియ జీవనచర్యకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
ప్రశ్న 2.
నిర్జీవుల, సజీవుల పెరుగుదలలో భేదాలను ఎలా గుర్తిస్తారు?
జవాబు:
పెరుగుదల సజీవులలో ఒక ముఖ్య లక్షణముగా పేర్కొనవచ్చు. ఈ జీవులలో పెరుగుదల అంతర్గతముగా జరుగును. నిర్జీవులలో పెరుగుదల ఉండదు. కాని కొన్ని నిర్జీవులు బాహ్యముగా పదార్థము సమకూరటం వల్ల పెరుగుదల చూపును.
ప్రశ్న 3.
బయోజెనిసిస్ అంటే ఏమిటి?
జవాబు:
జీవులు, జీవుల నుండి ఉద్భవించినాయని తెలుపుటయే బయోజెనిసిస్. ప్రాణులు వాటిని పోలిన పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. జన్యు అణువులను ఉపయోగించుకొని వాటి సంతానమును వృద్ధి చేయును.
ప్రశ్న 4.
కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి. దీనికి గల మరొక పేరు ఏమిటి?
జవాబు:
వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణము, వాటి అమరికను గురించి తెలిపే శాస్త్రము. దీనినే సూక్ష్మ అంతర నిర్మాణశాస్త్రము అని కూడా అందురు.
ప్రశ్న 5.
పిండోత్పత్తి శాస్త్రానికీ, ప్రవర్తనా శాస్త్రానికీ (ఇథాలజీ) మధ్య భేదమేమిటి?
జవాబు:
జీవులలో జరిగే ఫలదీకరణం, సంయుక్త బీజములో జరిగే విదళనాలు, వివిధ పిండాభివృద్ధి దశలను అధ్యయనం చేయు శాస్త్రము.
జంతువు ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రము. దీనినే ప్రవర్తనా జీవశాస్త్రము అని కూడా అంటారు.
ప్రశ్న 6.
ప్రాచీన కాలములో నివసించిన జీవి అవశేషాలను ఒక (నిర్దిష్ట) ప్రదేశములో తవ్వి తీయటము జరిగింది. ఇలాంటి అధ్యయనాన్ని జరిపే జీవశాస్త్ర శాఖను ఏమంటారు?
జవాబు:
ప్రాచీన కాలములో నివసించిన జీవుల అవశేషాలయిన శిలాజాలను గురించి అధ్యయనాన్ని పురాజీవశాస్త్రము అంటారు.
ప్రశ్న 7.
‘జంతు ప్రదర్శనశాలలు వర్గీకరణకు ఉపకరణాలు’ వివరించండి.
జవాబు:
జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన మొదలయిన వాటిని పరిశీలించడానికి వాటి ఆధారముగా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు అవకాశం కలిగిస్తాయి.
ప్రశ్న 8.
పొడి నమూనాలు (Dry specimens) అస్థిపంజరాలను ఎక్కడ, ఎట్లా పరిరక్షిస్తారు?
జవాబు:
పక్షులు, క్షీరదాల వంటి పెద్ద జంతువుల లోపలి అవయవాలను తీసివేసి, వాటి స్థానములో పొట్టు, ఊకలాంటి పదార్థములను దట్టించి ప్రదర్శనశాలలో భద్రపరుస్తారు. వివిధ అస్థి పంజరాలను కూడా భద్రపరిచేదరు.
ప్రశ్న 9.
త్రినామ నామీకరణ అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఒక శాస్త్రీయ నామములో ప్రజాతి, జాతి, ఉపజాతులను పేర్కొనుటను త్రినామ నామీకరణ అంటారు.
ఉదా : హోమో సెపియన్స్ సెపియన్స్
ప్రజాతి జాతి ఉపజాతి
ప్రశ్న 10.
టాటోనిమీ అంటే ఏమిటి ? రెండు ఉదాహరణలు ఇవ్వండి. [Mar. ’14]
జవాబు:
ఒక శాస్త్రీయ నామములో జాతిపేరు, ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని టాటోనిమీ అంటారు.
ప్రశ్న 11.
ప్రోటోస్టోమియా, డ్యుటిరోస్టోమియాలను విభేదీకరించండి.
జవాబు:
జీవులలో అది అంత్ర రంధ్రము నోరుగా అభివృద్ధి చెందే యుమెటాజోవన్లను ప్రొటోస్టోమియా జీవులు అందురు. జీవులలో అది అంత్ర రంధ్రము పాయువుగా అభివృద్ధి చెందే యుమెటాజోవన్లను డ్యుటిరోస్టోమియా అందురు.
ప్రశ్న 12.
ఇకైనోడెర్మేటా జీవులు ఎంటిరోసీలోమేట్లు” వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇకైనోడెర్మేటా జీవులలో ఎంటిరోసీలోమ్ అనే నిజ శరీర కుహరం ఉంటుంది. ఇది ఆది ఆంత్రం నుంచి పార్శ్వ సంచుల రూపములో ఏర్పడుతుంది.
ప్రశ్న 13.
ICZN ను విపులీకరించండి.
జవాబు:
ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ నామెన్ క్లేచర్.
ప్రశ్న 14.
ప్రొటోస్టోమియాకు చెందిన నాలుగు వర్గాలను తెలపండి.
జవాబు:
వర్గము : నిమటోడా, అనెలిడా, ఆర్థ్రోపొడా, మొలస్కా
ప్రశ్న 15.
నిమటోడా ప్రొటోస్టోమియా సమూహానికి చెందింది కానీ యూసీలోమేట్ కాదు. ఈ వ్యాఖ్యానాన్ని సమర్థించండి.
జవాబు:
నిమటోడా జీవులు యుసీలోమేటా జీవులు కాకపోవుటకు కారణము వీటి శరీర కుహరము మధ్యస్త్వచ ఉపకళా స్తరములతో ఆవరింపబడి ఉండదు. కాబట్టి దీనిని నిజశరీర కుహరముగా పేర్కొనరు. అందువలన దీనిని మిధ్యా శరీర కుహరముగా గుర్తించెదరు.
ప్రశ్న 16.
జీవావరణ వైవిధ్యం అంటే ఏమిటి? వివిధ రకాల జీవావరణ వైవిధ్యాలను పేర్కొనండి.
జవాబు:
జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నతస్థాయి వ్యవస్థలలో ఉండే వైవిధ్యాన్ని “జీవావరణ వైవిధ్యం” అని అందురు. జీవావరణ వైవిధ్యాలు మూడు రకాలు.
- ఆల్ఫా వైవిధ్యము
- బీటా వైవిధ్యము
- గామా వైవిధ్యము.
ప్రశ్న 17.
జాతి సమృద్దతను నిర్వచించండి.
జవాబు:
ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతములో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత అని అందురు.
ప్రశ్న 18.
ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి.
జవాబు:
- విల్లాస్టిన్ అనే యాంటి క్యాన్సర్ ఔషధాన్ని వింకారోజియా అనే మొక్క నుంచి తయారుచేస్తారు.
- ‘డిజిటాలిన్’ అనే మందును ‘ఫాక్స్ వ్’ అనే ‘డిజిటాలిస్ పర్పూరియా’ అనే మొక్కల నుండి తయారుచేస్తారు. దీనిని హృద్రోగ సమస్యలను నివారించుటకు ఉపయోగిస్తారు.
ప్రశ్న 19.
స్థానికేతర జాతుల చొరబాటు (invasion) స్థానిక జాతుల విలుప్తతకు కారణమవుతుంది. రెండు ఉదాహరణలతో ఈ వాక్యాన్ని నిరూపించండి.
జవాబు:
- “నైల్పెర్చ్” అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని “లేక్ విక్టోరియా” సరస్సులోకి ప్రవేశపెట్టడం వల్ల ఆ సరస్సులో 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించినవి.
- “క్లారియస్ గారీపైనస్” అనే ఆఫ్రికన్ పిల్లిచేపను జల సంవర్థనం కోసం ప్రవేశపెట్టడం వల్ల స్థానిక పిల్లిచేపల జీవనానికి హానికరంగా మారింది.
ప్రశ్న 20.
భారతదేశంలోని ఏవైనా నాలుగు పావన వనాలను పేర్కొనండి.
జవాబు:
- ఖాసీ, జైంటియా కొండలు – మేఘాలయ
- ఆరావళి పర్వతాలు – రాజస్థాన్, గుజరాత్
- పశ్చిమ కనుమల ప్రాంతం – కర్ణాటక, మహారాష్ట్ర
- సద్గుజ, బస్తర్ – చత్తీస్ ఘడ్
- చందా – మధ్యప్రదేశ్
ప్రశ్న 21.
IUCN ను విపులీకరించండి. అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారు?
జవాబు:
“ఇంటర్ నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిస్సోర్సెస్”.
అంతరించిపోతున్న జాతులను IUCN ప్రచురించే “రెడ్ డేటా” పుస్తకంలోని పట్టికలో పేర్కొంటారు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వర్గవికాస జీవవర్గీకరణను వివరించండి.
జవాబు:
వర్గవికాస వర్గీకరణ :
ఉమ్మడి వంశపారంపర్యంను ఆధారంగా చేసుకొన్న వర్గీకరణను వర్గవికాస వర్గీకరణ అంటారు. ఈ వర్గీకరణలో జాతుల మధ్యగల ‘జన్యుఅంతరాన్ని’ లెక్కించడం ద్వారా ‘వర్గవికాస వృక్షాన్ని’ తయారుచేస్తారు. జీవుల క్రియాసామ్య లక్షణాలు, నిర్మాణసామ్య లక్షణాల ఆధారంగా చేసేదే వర్గవికాస వర్గీకరణ. అభిసారి పరిణామం వల్ల ఏర్పడిన ఒక జత జీవులు పంచుకొనే లక్షణాలను క్రియాసామ్య లక్షణాలు అంటారు. ఉదాహరణకు పిచ్చుక రెక్క; ఎగిరే ఉడుత, గబ్బిలంలోని పెటాజియం అనే రెక్కలాంటి చర్మ విస్తరణ నిర్మాణం. ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకొనే లక్షణాలను నిర్మాణసామ్య లక్షణాలు అంటారు. ఉదాహరణకు పిచ్చుక రెక్క (ఫించ్) కాకిరెక్క, వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా గానీ లేదా శాఖీయుత రేఖాచిత్రం గానీ సూచించే పద్ధతిని ఎర్నెస్ట్ హెకెల్ ప్రవేశపెట్టాడు.
ప్రశ్న 2.
వర్గీకరణలో వివిధ అంతస్తులను వివరించండి.
జవాబు:
వర్గీకరణలో ఏడు అవికల్ప అంతస్తులు ఉంటాయి. అవి రాజ్యం, వర్గం, విభాగం, క్రమం, కుటుంబము, ప్రజాతి, జాతి.
1) రాజ్యము :
అన్ని విషమపోషక బహుకణ జీవులను ఏనిమేలియా అనే రాజ్యములో చేర్చినారు.
2) వర్గము :
ఒకటి లేదా ఎక్కువ విభాగములు కలిసి ఒక వర్గము ఏర్పడును. ఉదాహరణకు ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదములు మొదలగు విభాగములను కార్డేటా వర్గములో చేర్చినారు.
3) విభాగము :
సన్నిహిత సంబంధం గల ఒకటి లేదా ఎక్కువ క్రమాలను కలిసి ఒక విభాగము ఏర్పడును. ఉదాహరణకు రోడెన్షియా, కైరాఫ్టెరా, సిటేసియా, కార్నివోరా మొదలగు క్రమములను క్షీరద విభాగములో చేర్చిరి.
4) క్రమము :
ఒకటి లేదా దగ్గర సంబంధము గల కొన్ని కుటుంబాలను కలిసి ఒక క్రమము ఏర్పడుతుంది. ఉదాహరణకు ఫెరిడే, కానిడే, ఉర్సిడే కుటుంబాలను కార్నివోరా అనే క్రమములో చేర్చిరి.
5) కుటుంబము :
సన్నిహిత సంబంధము గల కొన్ని ప్రజాతులను ఒక కుటుంబముగా పేర్కొనెదరు. ఉదాహరణకు ఫెరిడే కుటుంబములో పిర్లి ప్రజాతి అయిన ఫెకిస్, చిరుత ప్రజాతి అయిన ఫాంథెరాను చేర్చిరి.
6) ప్రజాతి :
దగ్గర సంబంధము కలిగి, కొన్ని లక్షణములలో పోలికలున్న జాతులు కలిపి ప్రజాతి ఏర్పడును. ఉదాహరణకు పాంథీరాలియో (సింహము), పాంథీర టైగ్రిస్ (పులి) మొదలగునవి పాంథీరా ప్రజాతికి చెందును.
7) జాతి :
వర్గీకరణ వ్యవస్థలో జాతి ఒక ప్రాథమిక ప్రమాణము. ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొంటూ స్వేచ్ఛగా అంతర ప్రజననం జరుపుకొని “ఫలవంతమైన” సంతానాన్ని ఉత్పత్తి చేసి ఒకే రకమైన జంతు సమూహాన్ని జాతి అందురు.
ప్రశ్న 3.
వర్గీకరణ అంటే ఏమిటి? వర్గీకరణ ఆవశ్యకతను తెలియజేయండి.
జవాబు:
ప్రపంచంలోని అన్ని సజీవుల గురించి అధ్యయనం చేయడం అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి జీవులను వర్గీకరిస్తారు. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అంటారు. ఈ అనుకూలమైన సమూహాలనే శాస్త్రీయ పరిభాషలో టాక్సా (ఏకవచనం : టాక్సాన్) అంటారు. టాక్సా వర్గీకరణలోని వివిధ స్థాయిలను సూచిస్తుంది. ఉదాహరణకు రాజ్యస్థాయి టాక్సాన్ – ఏనిమేలియా, వర్గస్థాయి టాక్సాన్ – కార్డేటా, విభాగస్థాయి టాక్సాన్ – మమ్మేలియ మొదలైనవి.
జీవులను వర్గీకరించే పద్ధతినే వర్గీకరణ శాస్త్రం అంటారు. జీవుల ఆధునిక వర్గీకరణ వాటి బాహ్య, అంతర నిర్మాణాలు, కణాల నిర్మాణం, అభివృద్ధి ప్రక్రియలు పరిసరాలతో సంబంధం మొదలైన అంశాలు ఆధారం. జీవుల లక్షణీకరణం, గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అనే ప్రక్రియలు జీవ వర్గీకరణలోని ప్రధాన అంశాలు.
వర్గీకరణ సాధనాలుగా జంతు ప్రదర్శనశాలలు :
వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలను జంతు ప్రదర్శనశాలలు అంటారు. (స్థల బాహ్య సంరక్షణ) ఆ జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన (ఇథాలజీ) మొదలైన వాటిని పరిశీలించడానికి వాటి ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు అవకాశం కలిగిస్తాయి.
ప్రదర్శనశాలలు :
మరణించిన జీవుల నమూనాలను గాజుపాత్రలు, గాజు జాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాలే ప్రదర్శనశాలలు. వీటిలో కొన్ని జంతువులను పొడినమూనాలుగా చేసి భద్రపరుస్తారు. కీటకాలను సేకరించి చంపి, కాగితపు షీట్లపై గుచ్చి గాజుపెట్టెలలో భద్రపరుస్తారు. పక్షులు, క్షీరదాలు లాంటి పెద్ద జంతువుల లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు, ఉనక / ఊక లాంటి పదార్థాలను దట్టించి భద్రపరిచి ప్రదర్శిస్తారు. వివిధ జంతువుల అస్థిపంజరాలను కూడా సేకరించి ప్రదర్శిస్తారు. వీటి ఆధారంగా కూడా జంతువులను వర్గీకరించవచ్చు.
ప్రశ్న 4.
జాతిని నిర్వచించండి. ‘జాతి’ అనే భావనలను వివరించండి.
జవాబు:
జాతి భావన :
జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణం. లాటిన్ భాషలో ‘స్పీసీస్’ (జాతి) అంటే ‘రకం’ లేదా ‘దృశ్యరూపం’ అని అర్థం. జాన్ రే, తన గ్రంథమైన ‘హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటేరమ్’ లో ‘స్పీసీస్’ అనే పదాన్ని ‘ఉమ్మడి వంశపారంపర్యం’ లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయంగా వర్ణించాడు. లిన్నేయస్, తన గ్రంథం ‘సిస్టమా నేచురే’ లో జాతిని, వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడు. బ్యూఫోన్ తన గ్రంథమైన ‘నేచురల్ హిస్టరీ’ లో జాతి పరిణామ భావనను వివరించాడు. డార్విన్ రచించిన “జాతుల ఉత్పత్తి” ప్రచురణతో జీవశాస్త్రీయ “జాతిభావన” (జాతి గతిక స్వభావం) ప్రాముఖ్యం సంతరించుకొన్నది.
ఈ భావనే బ్యూఫోన్ – జీవజాతి భావన అంటారు. దీని ప్రకారం, ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని, అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు.
జాతిని నిర్వచించేందుకు డబీజాన్స్కీ ‘మెండీలియన్ జనాభా’ అనే భావనను ప్రవేశపెట్టాడు. ఉమ్మడి జన్యు సముదాయంను పంచుకొంటూ వరణాత్మక కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొనే ఒకే సమూహానికి చెందిన జీవులను మెండీలియన్ జనాభా అంటారు. భిన్న భౌగోళిక ప్రాంతాలలో నివసించే, ఒక జాతికి చెందిన జీవులు, వాటి పరిసరాలకు అనుగుణంగా నిరంతరం అనుకూలనాలను పొందుతూ ఉంటాయి. దీనివల్ల కాలక్రమేణా, కొత్తజాతి పరిణామం చెందుతుంది. కాబట్టి జాతి అనేది గతిశీల ప్రమాణం.
ఒక జాతికి చెందిన జీవులు :
- ఇతర జాతికి చెందిన జీవులతో ప్రత్యుత్పత్తి వివిక్తత ప్రదర్శిస్తాయి – కాబట్టి ఒక జాతి ఒక ప్రజనన ప్రమాణం.
- ఒకే ‘జీవావరణ స్థానాన్ని (నిచే) పంచుకొంటాయి. కాబట్టి జాతి ఒక జీవావరణ ప్రమాణం.
- ఒకే రకమయిన క్రోమోజోముల పటంను చూపిస్తాయి. కాబట్టి జాతి ఒక జన్యు ప్రమాణం.
- నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాలలో సారూప్యతను కలిగి ఉంటాయి. కాబట్టి జాతి ఒక పరిణామ ప్రమాణం.
ప్రశ్న 5.
జన్యు వైవిధ్యం అంటే ఏమిటి ? వివిధ జన్యు వైవిధ్యాలను తెలపండి.
జవాబు:
జన్యు వైవిధ్యం :
ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యం అంటారు. వాటి విస్తరణా పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఉదాహరణకు రావుల్ఫియ వోమిటోరియా అనే ఔషధ మొక్క హిమాలయాల్లో వ్యాప్తి చెందింది. దానినుంచి లభించే క్రియాశీల రసాయనం (రెసర్పిన్ – అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది) యొక్క సామర్థ్యం, గాఢత ఆధారంగా అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అదే విధంగా భారతదేశంలో 50,000 కంటే ఎక్కువ రకాల వరి, 1000 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. జన్యు వైవిధ్యం వాతావరణ మార్పులకు అనుగుణంగా అధికమవుతూ జీవుల మనుగడకు లాభదాయకమవుతుంది.
ప్రశ్న 6.
ఉష్ణమండలాల్లో అధిక బయోడైవర్సిటీకి గల కారణాలు తెలపండి.
జవాబు:
ఉష్ణమండలాల్లో అధిక జీవవైవిధ్యానికి కారణాలు :
కారణం 1 :
ఇతర మండలాలతో పోలిస్తే ఉష్ణమండల అక్షాంశాలు దీర్ఘకాలంగా ప్రకృతి అలజడులకు గురికాకపోవడం వల్ల ఆ ప్రాంతాలలో జీవపరిణామం జరగడానికి అవసరమైన సుదీర్ఘ కాలవ్యవధి లభించింది. ఇలాంటి ‘దీర్ఘ పరిణామ కాలం’ జాతుల ఉత్పత్తికీ, తద్వారా జాతుల భిన్నత్వానికి దారితీసింది (గమనిక : సమశీతల మండలాలు గతంలో తరచూ మంచుతో కప్పబడటం జరిగింది.
కారణం 2 :
సమశీతల మండలాలతో పోలిస్తే ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి భవిష్యత్ మార్పులను అంచనావేసే విధంగా ఉంటాయి. ఇటువంటి స్థిర వాతావరణం గల పరిసరాలలో నివసించే జీవులు వాటి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను సంతరించుకోవడం వల్ల వాటిలో అ వివిధ్యత మరింతగా విస్తరించింది.
కారణం 3 :
ఈ ఉష్ణమండలాల్లో గల అపరిమిత సౌరశక్తి, నీరు మొదలైన వనరుల లభ్యత వల్ల ఆహారోత్పత్తి అధికంగా జరిగి జీవ వైవిధ్యతకు కారణమయింది.
ప్రశ్న 7.
“అరిష్ట చతుష్టయం” అంటే ఏమిటి?
జవాబు:
కింద పేర్కొన్న నాలుగు ప్రధాన కారణాలు (అరిష్ట చతుష్టయం) జాతుల విలుప్తత త్వరితంగా జరగడానికి దోహదపడతాయి.
1) ఆవాస క్షీణత – శకలీకరణం (లేదా) ముక్కలవడం :
ఇవి జీవవైవిధ్య క్షీణతకు ముఖ్య కారణాలు.
ఎ) అడవుల నరికివేత జాతుల విలుప్తతకు దారితీస్తుంది. ఉదా : భూమండలాన్ని 14 శాతం ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్రస్తుతం 4 శాతానికి పరిమితమయ్యాయి.
బి) అటవీ భూములను సాగుభూములుగా మార్చివేయడం. ఉదా : భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ వర్షాధార అడవులు ఒకప్పుడు అసంఖ్యాక జాతులకు ఆవాసంగా ఉండేవి. ఇటీవల వీటి వృక్ష సంపదను నాశనం చేసి, ఆ ప్రాంతాన్ని సోయాబీన్ మొక్కల సాగుకు లేదా మాంసంగా ఉపయోగపడే పశువుల ఆహారం కోసం గడ్డిభూములుగా మార్చివేశారు.
సి) వాతావరణ కాలుష్యం జీవుల ఆవాస నాశనాన్ని ఉధృతం చేస్తుంది. అంతేకాకుండా కాలుష్య కారకాలు వాతావరణ నాణ్యతను మార్చడం వల్ల జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది.
డి) ఆవాసం శకలీకరణం దానిలోని జనాభా క్షీణతకు దారిస్తుంది. ఉదా : విశాల ఆవరణాలలో నివసించే పక్షులు, క్షీరదాలు వలస ధర్మాన్ని ప్రదర్శించే జీవులు దీని ద్వారా అధికంగా ప్రభావితమవుతాయి.
2) వనరుల అతి వినియోగం :
అవసరం, అంతులేని ఆశకు దారితీస్తున్నప్పుడు అది వనరుల అతి వినియోగానికి కారణమవుతుంది. ఉదా : స్టాలర్ సముద్ర ఆవు (స్టాలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్త గౌరవార్ధం నామకరణం చేయబడిన సముద్రపు ఆవు), ఉత్తర అమెరికాలో నివసించే పాసింజర్ పావురం మానవుల దుర్వినియోగం అధికమవడం కారణంగా విలుప్తం అయ్యాయి. మితిమీరిన చేపల వేట కారణంగా అనేక ఆర్థిక ప్రాముఖ్యం గల సముద్ర చేపలు అంతరించిపోయే అవకాశం ఉంది.
3) స్థానికేతర జాతుల చొరబాటు :
స్థానికేతర (విదేశీ) జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి, స్థానిక జాతుల మీద పైచేయి సాధించి, స్థిరపడి, స్వయం సమృద్ధమైన జనాభాలుగా ఎదుగుతాయి. (సహజసిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని స్థానిక జాతి అంటారు).
ఉదా 1:
నైల్ పెర్చ్ అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వల్ల, ఆ సరస్సులోని 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించాయి.
ఉదా 2 :
కార్లియస్ గారీపైనస్ అనే ఆఫ్రికన్ పిల్లిచేపను చట్టవిరుద్ధంగా జలజీవ సంవర్ధన కోసం ప్రవేశపెట్టడం అనేది స్థానిక పిల్లిచేపల జీవనానికి హానికరంగా మారింది.
4) సహ విలుప్తతలు :
పరాన్నజీవి ఆతిథేయిల అవికల్ప సహజీవనంలో ఆతిథేయి విలుప్తత పరాన్నజీవ విలుప్తతకు దారితీస్తుంది. అలాగే మొక్కలు – జంతువుల మధ్యగల అవికల్ప (విడదీయలేని) సహజీవనంలో మొక్క విలుప్తత జంతువు విలుప్తతకు కారణమవుతుంది. మొక్కలు – పరాగ సంపర్కకారుల సహజీవనం కూడా సహ విలుప్తతలకు ఉదాహరణ. దీనిలో కూడా ఒక జీవి విలుప్తత మరొక జీవి విలుప్తతకు దారితీస్తుంది. ఇలాంటి వాటిని సహవిలుప్తతలు అంటారు.
ప్రశ్న 8.
‘బయోడైవర్సిటీ హాట్స్పాట్స్’ గురించి లఘుటీక రాయండి.
జవాబు:
ముప్పు వాటిల్లుతున్న జంతుజాతులను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంరక్షణ వల్ల కోలుకొంటున్న జనాభాలు అవి ప్రత్యేక లక్షణాలు పొందిన వాటి సహజ ఆవాసాలలోనే రక్షించబడతాయి. అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ఠ సంరక్షణను కల్పించేందుకు ఆ ప్రాంతాలను ‘బయోడైవర్సిటీ హాట్ స్పాట్’ లుగా పర్యావరణ సంరక్షణకారులు గుర్తించారు. మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవవైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండే జీవభౌగోళిక ప్రదేశాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పిలుస్తారు. జీవజాతుల పరంగా వీటిని ‘అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న’ జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా గుర్తిస్తారు.
బయోడైవర్సిటీకి హాట్స్పాట్లు :
ప్రపంచంలో సుమారు 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలు నాశనానికి గురికావడం వల్ల ఆ ఆవాసాలు అతి త్వరితంగా కుచించుకొని పోతున్నాయి. ఉదా : 1. భారతదేశంలోని పశ్చిమకనుమలు, శ్రీలంక భూభాగం, 2. ఇండో బర్మా ప్రాంతం, 3. ప్రస్తుతం హిమాలయ ప్రాంతం. మనదేశంలో ఉండే 17 జీవగోళపు సురక్షిత కేంద్రాలు 14 జీవగోళపు సురక్షిత కేంద్రాలు, 90 జాతీయపార్కులు; 448 అభయారణ్యాలు చట్టపరంగా జీవ వైవిధ్య కేంద్రాలుగా రక్షించబడుతున్నాయి.
ప్రశ్న 9.
“రివెట్ పాపర్” దృగ్విషయాన్ని వివరించండి.
జవాబు:
కొన్ని జాతులు నశించడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది? అది మానవ జీవితాన్ని ప్రభావితం చేయగలదా? పాల్ ఎన్రిచ్ ప్రతిపాదించిన రివెట్ పాపర్ దృగ్విషయం ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. ఇతడు పర్యావరణాన్ని విమానంతోనూ, ఆ పర్యావరణ జాతులను ఆ విమాన రివెట్లతోనూ పోల్చి ఒక్కొక్క రివెట్ తొలగించడం వల్ల ఆ విమానానికి కలిగే దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెలియజేశాడు. విమానంలోని కుర్చీ లేదా ఇతర అప్రాధాన్య వస్తువుల రివెట్లను తొలగించడం వల్ల విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవచ్చు. కానీ విమానం రెక్కకు, విమాన దేహానికి మధ్య గల రివెట్ తొలగిస్తే విమానం కూలిపోతుంది. అలాగే జీవసమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వల్ల ఆ జీవావరణ వ్యవస్థ నాశనమవుతుంది.
ప్రశ్న 10.
‘సహజస్థానంలో సంరక్షణ’ పై లఘుటీక రాయండి.
జవాబు:
జీవగోళపు సురక్షిత కేంద్రాలు :
జీవగోళ వనరుల సంరక్షణార్థం కనిష్ఠ అలజడి కలిగి ప్రత్యేకంగా వేరుచేయబడిన ప్రదేశాలను జీవగోళపు సురక్షిత కేంద్రాలు అంటారు. భారతదేశంలోని జీవగోళపు సురక్షిత కేంద్రాలలో 17వదిగా శేషాచల కొండలని ఇటీవల ప్రకటించారు.
జాతీయ పార్కులు :
ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజసిద్ధమైన ఆవాసాన్ని జాతీయ పార్కు అంటారు. వీటిలో మనదేశంలోని వృక్షసంపద, జంతుసంపదల ఆకర్షణీయ వైవిధ్యాన్ని ఈ జాతీయ పార్కులలో దర్శించవచ్చు. భారతదేశంలోని ముఖ్యమైన జాతీయపార్కులు – జిమ్ కార్బెట్ జాతీయ పార్కు (ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొల్పిన భారతదేశపు మొట్టమొదటి జాతీయపార్కు, కజిరంగా జాతీయ పార్కు (అసోం), కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు (ఆంధ్రప్రదేశ్), కియోలాడియో ఘనా జాతీయ పార్కు (రాజస్థాన్) మొదలగునవి.
అభయారణ్యాలు :
అంతరించిపోతున్న నిర్దిష్ట జంతుజాతుల్ని సంరక్షించే ప్రాంతాలను వన్యప్రాణి అభయారణ్యాలు అంటారు. జీవజాతుల జీవనానికి అడ్డురానంతవరకూ వీటిలోకి పర్యాటకులను అనుమతిస్తారు. భారతదేశంలోని (ఆంధ్రప్రదేశ్) కొన్ని ముఖ్యమైన అభయారణ్యాలు – కోరింగా అభయారణ్యం, ఏటూరునాగారం అభయారణ్యం, పాపికొండలు అభయారణ్యం.
పావన వనాలు :
- అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాన్ని వనం అంటారు.
- మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహాన్ని పావన వనాలు అంటారు. ఇవి ఏ ప్రత్యేక సంస్కృతీ, సంప్రదాయానికైనా చెందవచ్చు.
- ఈ ప్రాంతాల వన్యజాతుల వృక్షాలన్నిటికీ తగిన గౌరవం, సంపూర్ణ సంరక్షణ కల్పించడం జరుగుతుంది.