AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మెసపిటోమియా నాగరికత ప్రధాన లక్షణాలు రాయండి.
జవాబు:
నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేధాసంపత్తి, సాంస్కృతిక, నిత్యజీవన విధానంలో వచ్చిన అభివృద్ధి. అతి ప్రాచీన ప్రపంచ నాగరికతలలో మెసపిటోమియా నాగరికత మొదటిది. హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలు కూడా దాదాపుగా వీటి సమకాలీన నాగరికతలు. మెసపిటోమియా, ఈజిప్ట్ నాగరికతలు అక్కాచెల్లెళ్ళుగా ప్రసిద్ధికెక్కాయి. గ్రీకు భాషలోని ‘మెసోస్’, ‘పోటమస్’ అనే పదాల కలయికతో మెసపిటోమియా ఏర్పడింది. ఈ పదాలకు ‘రెండు నదుల మధ్య ప్రదేశం’ అని అర్థం. మెసపిటోమియా యూఫ్రిటిస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం ‘ఇరాక్’ అని పిలువబడుతున్న దేశమే మెసపిటోమియా నాగరికత కేంద్రం.

భౌగోళిక పరిస్థితులు: మెసపిటోమియాలో భిన్న భౌగోళిక పరిస్థితులుండేవి. పచ్చని మైదానాలు, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, జలపాతాలు, సెలయేర్లు, పూదోటలు, చక్కని వర్షపాతంతో, పంటలతో ఆహ్లాదకరంగా ఉండేది. వ్యవసాయం, పశుపోషణ ప్రజలకు ప్రధానాధారాలు. మెసపిటోమియా దక్షిణ దిక్కున ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఈ నదుల ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి.

రాజకీయ పరిస్థితులు: ‘గిల్గిమిష్’ అనే రాజు గురించి రెండు టేబ్లెట్స్ ద్వారా వివరించబడింది. గిల్గి మిష్ “ఉర్క్’ అనే నగర రాజ్య పాలకుడు. ఎంతోమంది ప్రజలకు సహాయపడిన నాయకుడు, గొప్ప స్నేహశీలి. తన ప్రియమిత్రుని మరణంతో విచారానికిలోనై, ప్రపంచంలో సుఖ, దు:ఖాలకు మరణానికి కారణాలు తెలుసుకోవాలని దేశ సంచారం చేసాడు. ఇతడు నగర నిర్మాణంలో ప్రసిద్ధిచెందాడు.

మెసపిటోమియా నగరాలు: 1930లో పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అనేక ప్రాచీన నగరాలు బయల్పడ్డాయి.

‘ఉర్’ పట్టణం: ఈ పట్టణంలో వీధులు అతి సన్నగా ఉండేవి. కొన్ని ప్రాంతాలలో బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. ఈ పట్టణ నిర్మాణానికి సరైన ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) లేదని తెలుస్తుంది.

బాబిలోనియా నగరం: ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ 333లో అలెగ్జాండర్ ఆక్రమించినప్పటికీ గొప్ప నగరంగా పేరొందింది.

అబూసలాభిక్ పట్టణం: క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ పట్టణ తవ్వకాలలో చేప ఎముకలు, పంది ఎముకలు లభించాయి.

ఉరుక్ పట్టణం: క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా పేరొందింది. ఇది దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ఆర్థిక పరిస్థితులు: మెసపీటోమియా నాగరికత ప్రపంచంలో వ్యవసాయ ప్రక్రియను ప్రారంభించిన నాగరికత. యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల వలన వ్యవసాయం విస్తృతంగా సాగింది. గోధుమ, బార్లీ, వేరుశనగ పంటలు విస్తారంగా పండేవి. ప్రజలు గొర్రెలు, మేకలను విస్తృతంగా పోషించేవారు. ఖర్జూరం, తాటికాయలు వేసవిలో సమృద్ధిగా లభించేవి.

మెసపిటోమియా ప్రజలు టర్కీ, ఇరాన్ దేశాల వారితో ఎక్కువగా విదేశీ వ్యాపారాలు ఉండేవి. ఆహార పదార్థాలు, వస్త్రాలను టర్కీ, ఇరాన్లకు ఎగుమతి చేసి వారి నుండి కలప, రాగి, వెండి, బంగారం, సముద్రగవ్వలు, విలువైన రాతి ఆభరణాలు దిగుమతి చేసుకునేవారు. ఎగుమతి, దిగుమతులకు మెసపిటోమియాలోని సహజసిద్ధమైన నదీ మార్గాలు వారికెంతగానో ఉపయోగపడ్డాయి. నాడు ‘మేరీ పట్టణం’ ప్రముఖ నౌకా రవాణా పట్టణంగా వెలుగొందింది.

సాంఘిక పరిస్థితులు: మెసపిటోమియా నాగరికత నగర జీవనానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. ఉర్ అబూసలాభిక్, ఉరుక్ ఇటువంటి నగరాలే, బాబిలోనియా నాటికే ప్రసిద్ధి చెందిన మహానగరం.

నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా సామాన్యులు తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు.

మెసపిటోమియా నాగరికత నాటి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహసమయంలో కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఉండేవి. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు. కుమారైలకు బహుమతులు ఇచ్చేవారు.

మెసపిటోమియా నాగరికతలో ప్రజలు స్థానిక దేవతలను పూజించడానికి నిర్మించుకున్న దేవాలయాలను జిగూరత్లను నిర్మించుకున్నారు. వీటిని స్వర్గానికి, భూమికి మధ్య వారధిగా భావించేవారు. ప్రజలకు మూఢనమ్మకాలు ఎక్కువని తెలుస్తుంది.

శాస్త్ర – సాంకేతిక అభివృద్ధి:
వ్రాత విధానం అభివృద్ధి: ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు మనుపు రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలు, అర్థాలకు తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని ‘క్యూనిఫారమ్’ అంటారు. వీటిని మట్టిబిళ్ళలు సున్నపుముద్ద బిళ్ళలపై రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని ‘టేబ్లెట్స్’ అంటారు. వీటి వలన అనేక వివరాలు చరిత్రకారులు గ్రహించగలిగారు.

మెసపిటోమియా ప్రజలు ప్రపంచానికి అందించిన గొప్పకానుకలలో గణితశాస్త్ర అభివృద్ధి, కాలనిర్ణయ శాస్త్రం ప్రధానమైనవి. సంఖ్యాశాస్త్రంలో 6 మరియు 10 గుణకాలకు ప్రాధాన్యం ఉండేది. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్రూటు వంటివి మట్టిబిళ్ళలలో లభించాయి. మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిముషాలు అనే కాల నిర్ణయ విభజనను కనుగొన్నారు. ఈ విధానం ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు వ్యాపించింది. ఈ విధంగా నగర జీవనానికి, శాస్త్రీయ అభివృద్ధికి మెసపిటోమియా నాగరికత నాంది పలికింది.

ప్రశ్న 2.
వ్రాత విధానంలో మెసపిటోమియా నాగరికత పాత్ర తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు. మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదు వేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్దతిని ‘క్యూనిఫారమ్’ అంటారు.

వేల సంవత్సరాల క్రితం మెసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైన వాటిని మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని టేబ్లెట్స్ అంటారు. క్రీ.పూ 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమయింది. ఈ బిళ్ళలు మట్టితోను, రాళ్ళతోను తయారుచేయబడ్డాయి. వాటి మీద చిహ్నాలు, అంకెలు ఎక్కువగా కనపడేవి. దక్షిణ మెసపిటోమియా ప్రాంతంలోని ‘ఉరుక్’ నగరంలో ఇటువంటి ‘మట్టిబిళ్ళలు’ లభించాయి. సమాజం అభివృద్ధి చెందే కొద్దీ మానవ వ్యవహారాలను రాసి భద్రపరుచుకోవలసిన అవసరం పెరుగుట వలన వ్రాత విధానం ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. మెసపిటోమియా నాగరికత నగర జీవితానికి సంబంధించినందు వలన ప్రజల మధ్య అనేక రకాలైన వ్యవహారాలు, వృత్తులు, వస్తువిక్రయాలు జరిగి వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరచుకోవలసిన అవసరం ఏర్పడింది.

మట్టిబిళ్ళలు – టేబ్లెట్స్: మెసపిటోమియా వాసులు సున్నపు ముద్దతో తయారుచేసిన బిళ్ళలను ఉపయోగించారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్దబిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా తయారుచేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్నప్పుడు రాసిన ఈ పలకలను ఎండబెడితే అవి చెరగని ముద్రలతో బిళ్ళలుగా తయారయ్యేవి. అనేక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు ఇటువంటి బిళ్ళలపై చెక్కుట వలన వేల సంఖ్యలో బిళ్ళలు లభించాయి. వీటి ద్వారా చరిత్రకారులు అనేక విషయాలు తెలుసుకోగలిగారు.

క్యూనీఫారమ్: క్రీ.పూ. 2600 నాటికి మెసపిటోమియాలో రాత విధానం ‘క్యూనిఫారం’గా రూపొందింది. వారు వాడిన భాష సుమేరియన్ల అనేక రకాలైన పత్రాలు, నిఘంటువుల తయారీకి ఉపయోగపడింది. రాజపత్రాలు, భూముల, బదలాయింపు, స్థానిక సంప్రదాయాలు మొదలైనవి క్యూనిఫారమ్లో ఉపయోగించబడ్డాయి.

క్రీ.పూ. 2400 నాటికి సుమేరియా లిపికి బదులు అక్కాడియన్ లిపి వాడుకలోకి వచ్చింది. క్రీ.శ మొదటి శతాబ్ది వరకు మెసపిటోమియా ప్రజలు ఉపయోగించింది అక్కాడియన్ లిపి మాత్రమే. సుమారు రెండువేల సంవత్సరాలు ఈ అక్కాడియన్ లిపి వాడుకలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 3.
మెసపిటోమియా నగర జీవన విధానాన్ని గురించి రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నగరజీవితానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. పట్టణ ప్రజలు నగరరాజ్యాల పరిధిలో జీవించారు. సాధారణ నగరాలు 20వేల జనాభాతో ఉంటే అంతకంటే పెద్ద నగరాలలో జనాభా 50 వేల వరకు ఉండేది. బాబిలోనియా నాడు అతి పెద్ద నగరం. ఆ నగరంలో జనాభా లక్షమందికి పైన ఉండేవారు.

1930లో పురావస్తుశాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అతి ప్రాచీన నగరాలు బయటపడ్డాయి. అందులో ‘ఉర్’ పట్టణం ఒకటి. ఈ పట్టణ నిర్మాణంలోని లక్షణాలను పరిశీలిస్తే వీధులు అతి సన్నగా ఉండుట వలన కొన్ని ప్రాంతాలకు మాత్రమే బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. పట్టణ ప్రాంతంలో ఆహార ధాన్యాలు, కట్టెలు చేరవేయుటకు కంచరగాడిదలు ఉపయోగించేవారు. పట్టణ నిర్మాణానికి సరి అయిన ప్రణాళిక లేదు. మెసపిటోమియా నగర నిర్మాణంలో మూఢవిశ్వాసాలు ఎక్కువ. ‘ఉర్’ నగర శ్మశానవాటికలో రాజులు, సామాన్యుల సమాధులు లభించాయి.

ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు, క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించాడు. నాటికే ఇది గొప్ప నగరంగా పేరుగాంచింది.

మెసపిటోమియా నాగరికతలో లభించిన మరొక ప్రముఖ పట్టణం ‘అబూసలాభిక్’ క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో చేపల ఎముకలు, పందుల ఎముకలు లభించాయి. కాబట్టి నాడు ఈ ప్రాంతంలో పందిని కూడా ఆహారంగా స్వీకరించినట్లు తెలుస్తుంది.

మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం ఉరుక్. క్రీ.పూ. 3000 సంవత్సరాలకు చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్ల విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ. 2800 ప్రాంతాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో ఈ నగర విస్తీర్ణం 400 హెక్టార్లుకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. వీరికి రాజు ఉపాధి కల్పించేవాడు. దేవాలయ నిర్మాణానికి రోజుకు 4500 మంది కూలీలను ఐదు సంవత్సరాల వరకు పనిచేయించారు. నాటి శిల్పులు కూడా నైపుణ్యం కలిగి ఉండేవారు. కుమ్మరి చక్రం ద్వారా అనేక కుటీర పరిశ్రమలు వృద్ధి చెంది, కుండల తయారీ పెద్ద ఎత్తున చేపట్టబడింది.

రవాణా రంగం: పట్టణ నాగరికత అభివృద్ధిలో ప్రధాన అంశం రవాణా సౌకర్యం. అతి చౌకగా రవాణా చేయుటకు నదుల, సముద్ర రవాణా అతి ముఖ్యమైనవి. మెసపిటోమియా ప్రజలు నదుల ద్వారా పడవలలో ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు. ప్రాచీన మెసపిటోమియాలోని సహజసిద్ధ నదీమార్గాల ద్వారా వస్తురవాణా జరిగేది. |జమరిలియిన్ రాజు కాలంలో మేరీ పట్టణం ప్రముఖ నౌకా రవాణా కేంద్రం.

సమాజం: మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు, దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత పరికరాలు అనుభవించేవారు. ఉర్ నగరం రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

కుటుంబ జీవనం: నాడు కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సంబంధం విషయంలో వధువు, వరుని కుటుంబాల పెద్దలు ఒక ప్రకటన ద్వారా సమ్మతిని తెలిపేవారు. ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి సంపాందించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప, ఆస్తిలో హక్కు ఉండేది కాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులు తెలుపుము.
జవాబు:
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులలో ఎంతో వైవిధ్యముండేది. పచ్చని మైదానాలతో, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, కొండల నుండి జాలువారే జలపాతాలు, సెలయేర్లు, అందమైన పూదోటలు, వర్షపాతం తద్వారా పండే పంటలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే నీటి వనరులు వంటి అంశాలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది.
మెసపిటోమియాకు దక్షిణాన ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఆ నదులు ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి. క్రీ.పూ. 7000 6000 సంవత్సరాల మధ్య కాలంలో ఇక్కడ వ్యవసాయం ఆరంభమయిందని చరిత్రకారులు అంచనా. ఇక్కడి ప్రజలు వందలు, వేల సంఖ్యలో గొర్రెలను పెంచుతూ ఉత్తర మెసపిటోమియా పచ్చికబైళ్ళని ఉపయోగించుకుంటూ ప్రజలు జీవించారు.

ప్రశ్న 2.
బాబిలోనియా నగర ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనములు, దేవాలయములు ఉండేవి. ఆనాటి దేవాలయాన్ని ‘జిగూరత్’ అంటారు. ఈ జిగూరత్లు మెట్లు కలిగిన ఎత్తు నిర్మాణాలు. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు ఆక్రమించారు. ఆ తరువాత కాలంలో క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించారు. అప్పటికే బాబిలోనియా గొప్ప నగరంగా ప్రసిద్ధిగాంచింది.

ప్రశ్న 3.
మట్టిబిళ్ళలను టేబ్లేట్స్ అని ఎందుకంటారు ?
జవాబు:
వేల సంవత్సరాల క్రితం మొసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైనవి మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. అరచేతిలో సరిపోయే విధంగా ఈ |బిళ్ళలను మట్టితోను, రాతితోను, సున్నపు ముద్దలతోను తయారుచేసేవారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్ద బిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా చేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్న వీటిని ఎండబెడితే అవి చెరగని బిళ్ళలుగా మారేవి. అనేక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు ఈ బిళ్ళలపై చెక్కుట వలన వేలాదిగా టేబ్లెట్స్ లభిస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 4. మెసపిటోమియా సామాజిక పరిస్థితులు రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత | పరికరాలు అనుభవించేవారు. ‘ఉర్’ నగర రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

మెసపిటోమియా నాగరికతలో కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సమయంలో ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు, కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి ఆస్తి హక్కు లేదు. నాటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణ చేసేవారు. టర్కీ, ఇరాన్ వంటి దేశాలతో విదేశీ వ్యాపారం జరిగేది.

ప్రశ్న 5.
మెసపిటోమియా వ్రాత విధానం గురించి తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైనవి రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు.
సుమారు ఐదువేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరుచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించాయి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు, వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారమ్ అంటారు. క్రీ.పూ. 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమైనట్లు చరిత్రకారులు నిర్ధారించారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్యూనిఫారమ్.
జవాబు:
క్రీ.పూ. 3500 – 3200 సంవత్సరాల నాడే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అక్షరాలు రాసే విధానం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. వారు ప్రారంభించిన వ్రాత విధానంలో తొలినాళ్ళలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలకు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారం
అంటారు.

ప్రశ్న 2.
అక్కాడియన్ నాగరికత
జవాబు:
మెసపిటోమియా నాగరికత కాలక్రమంలో సమర్ ‘అక్కడ్’ ప్రాంతాలకు విస్తరించింది. తరువాత అక్కాడియన్ రాజ్యంగా రూపొందింది. అక్కాడియన్ రాజ్యం మెసపిటోమియాను చాలాకాలం పరిపాలించారు. ఈ నాగరికత సెమెటిక్ సుమేరియన్ భాషల వారిని ఒక పాలన క్రిందకు తెచ్చారు. క్రీ.పూ. 2400 నాటికి ఈ భాష అక్కాడియన్ భాషగా పిలవబడింది. ఈ కాలానికి ఈ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉంది.

ప్రశ్న 3.
మేరీ భవనం.
జవాబు:
పురావస్తు త్రవ్వకాలలో లభించిన మరొక గొప్ప నిర్మాణం ‘మేరీ భవనం’. ఈ భవనం క్రీ.పూ. 1810-1760 మధ్య కాలంలో పరిపాలించిన జీమరిలియన్ నివాస భవనం. ఈ భవనం ఎంతో విలాసవంతమైనది, విశాలమైనది. ఇందులోని విశాలమైన హాలులో దేశ, విదేశీ అతిధులతో చర్చలు జరిగేవి. ఈ రాజభవనం అందమైన అలంకరణలతో సమారు రెండు నుండి నాలుగు హెక్టార్లలో విస్తరించి ఉండేది. ఇందులో 260 గదులుండేవని తెలుస్తోంది.

ప్రశ్న 4.
ఉరుక్ నగరం.
జవాబు:
మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం. ‘ఉరుక్’. క్రీ.పూ. 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్లు విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ 2800 మధ్య కాలంలో అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుక్ నగరాన్ని విస్తరించారు. దీనిలో నగర విస్తీర్ణం 400 హెక్టార్లకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానికులను వాడుకునేవారు.

ప్రశ్న 5.
గణితశాస్త్ర పరిస్థితులు.
జవాబు:
మెసపిటోమియా ప్రజలు గణితశాస్త్రంలో అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వారి సంఖ్యాశాస్త్రంలో మరియు 10 గుణకాలకు ప్రాధాన్యత ఉండేది. మొదటి క్రమంలో 10 సంఖ్య వరకు ప్రాధాన్యత ఉండేది. తరువాత 6తో కూడిన గుణకాలు ఉపయోగించి 60 నుండి 600 వరకు లెక్కించేవారు. బహుశా 60 అనే సంఖ్య అనేక సంఖ్యలతో విభజనకు అనుకూలంగా ఉండేది. క్రీ.పూ. 1800 సంవత్సరం నాటి మట్టిబిళ్ళలు మెసపిటోమియా గణితశాస్త్ర పరిశోధనకు నిదర్శనం. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్టు విధానాలు ఈ బిళ్ళలలో కనిపిస్తాయి.

ప్రశ్న 6.
యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు.
జవాబు:
మెసపిటోమియా యూఫ్రిటస్, టైగ్రిస్ నదుల మధ్య విలసిల్లిన నాగరికత. తూర్పు టర్కీలోని టారస్ పర్వతాలలో పుట్టి సిరియా మీదుగా ఇరాక్లో ప్రవేశిస్తాయి. తమ ఉపనదులతో కలిపి మెసపిటోమియా (నేటి ఇరాక్)లో సారవంతమైన మట్టిగల మైదాన ప్రాంతాలను ఏర్పరచాయి. దీనితో ఈ ప్రాంతం వ్యవసాయయోగ్య మైదానాలుగా మారాయి. ఈ విధంగా ప్రవహించి ఈ నదులు పర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 7.
కాల నిర్ణయ విధానం.
జవాబు:
మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిమిషాలు అనే కాల నిర్ణయ విభజన విధానాన్ని కనుగొన్నారు. ఈ కాల నిర్ణయ విధానం అలెగ్జాండర్ అనంతర కాలం నుండి ఎక్కువగా వాడుకలోకి వచ్చి రోమన్ సామ్రాజ్యానికి, అటు మహమ్మదీయ రాజ్యాలకు, మధ్య ఐరోపా దేశాలకు వ్యాపించింది.