AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి Textbook Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి
10th Class Telugu 2nd Lesson అమరావతి Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
సీ॥ సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి
కరముల స్పృశియించు పురము నిలను
కృష్ణాతరంగిణీ కృతశుద్ధ పావన
గంభీరత నలరు కనక నగరి
బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో
పరమపావనమైన పురము భువిని
రాజాధిరాజుల రాజధానిగ వెల్గి
యాంధ్ర జాతికి వన్నె యమరపురము
తే॥గీ॥ తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి
కలుములవెలది నిలయమై బలిమిబెంచి
సకలసురల యాశీస్సుల సారమౌచు
విశ్వయవనికపై వెల్లు వీటిఁగనుడు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
పై పద్యములోని నగరం ఏ నది ఒడ్డున ఉంది?
జవాబు:
పై పద్యంలోని నగరం కృష్ణానది ఒడ్డున ఉంది.
ప్రశ్న 2.
పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు?
జవాబు:
పద్యంలో అమరావతి పట్టణం గురించి చెప్పారు.
ప్రశ్న 3.
పద్యంలోని పట్టణం ఏ భాషాప్రాంతంలో ఉండి ఉంటుంది?
జవాబు:
పద్యంలోని పట్టణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కృష్ణానదీ తీరంలో “ఆంధ్ర” భాషా ప్రాంతంలో ఉంది.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
1. ఈ కింది అంశాలను గురించి చర్చించండి.
అ) ఇప్పటివరకు మీరు ఏఏ నగరాలు చూశారు? మీరు చూసిన నగరాలలో మీకు నచ్చిన అంశాలను, నచ్చని అంశాలను తెలుపండి.
జవాబు:
నేను మా తాతగారితో మార్చి 2వ తేదీన విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకు చాలా నచ్చింది. మరునాడు మార్చి 3వ తేదీన కళాభారతికి వెళ్ళాము. అక్కడ సంగీత కచేరీ జరుగుతోంది.
కళాభారతిని 1991 మార్చి 3వ తేదీన స్థాపించారని మా తాతగారు చెప్పారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు సుసర్ల శంకర శాస్త్రిగారి కలలకు ప్రతీకగా కళాభారతి 11 మే, 1991న ప్రారంభించబడిందని కూడా మా తాతగారు చెప్పారు. ఇంకా కైలాసగిరి, రామకృష్ణా బీచ్, షిప్ యార్డు మొ||వి చూశాను. అన్నీ బాగున్నాయి.
కాని, రోడ్లన్నీ గతకులమయంగా ఉన్నాయి. మురికికాలువ కంపు కూడా ఎక్కువ. ట్రాఫిక్ చాలా ఎక్కువ. అది నాకు నచ్చలేదు.
నేను మా మావయ్యతో మేలో చెన్నై వెళ్ళాను.
చెన్నైలో మెరీనా బీచ్, గాంధీ బీచ్, ప్లానిటోరియం, జంతు ప్రదర్శన శాల, క్వీర్లాండ్, మహాబలిపురం మొదలైనవి చూశాను. చాలా బాగున్నాయి. కాని, ఎండ వేడి ఎక్కువ. ఆటోరేట్లు ఎక్కువ. అదే నాకు నచ్చలేదు.
నేను మా బావతో ఏప్రిల్ లో ఒకసారి విజయవాడ వెళ్ళాను.
అక్కడ కృష్ణానది, ప్రకాశం బ్యారేజి చాలా బాగున్నాయి. అక్కడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నివసించిన ప్రాంతం చూశాను, చాలా పొంగిపోయేను.
కాని, జనాభా చాలా పెరిగి పోతున్నారు. కులాల పట్టింపు కొందరిలో కన్పించింది. అది నాకు నచ్చలేదు.
ముందు సంవత్సరం జూన్లో బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో ఎటుచూసినా పచ్చదనం, ఉద్యానవనాలు కనిపిస్తాయి. అందుకే దానిని భారతదేశపు ఉద్యానవనాల, నగరం అంటారట. లాల్ బాగ్, కబ్బన్ పాలు చాలా బాగున్నాయి. బెంగళూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.
కాని, రోడ్లపై రద్దీ ఎక్కువ. జీవన వ్యయం కూడా చాలా ఎక్కువ. సిటీ బస్సులు, ఎ.సి. బస్సులు కూడా ఎక్కువగా కనిపించాయి. వాటి చార్జీలు కూడా మామూలు బస్సుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకు నచ్చలేదు.
ఆ) నగర నిర్మాణంలో ఏఏ మౌళిక వసతులు ఏర్పాటు చెయ్యాలి?
జవాబు:
నగర నిర్మాణంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేయాలి. మంచినీటి వసతి కల్పించాలి. భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం కలిగించాలి. జనాభాకు తగిన ఆసుపత్రులు నిర్మించాలి. విద్యా సదుపాయం కలిగించాలి. భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ యార్డులు నిర్మించాలి. పటిష్టమైన రోడ్లు ఉండాలి. రవాణా వ్యవస్థ ఉండాలి. నివసించడానికి, కార్యాలయాలకు ప్రమాణాలననుసరించి భవంతులు నిర్మించాలి. పార్కులు ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకు నిలబడే విధంగా నగర నిర్మాణం జరగాలి.
2. ఈ పాఠం ఆధారంగా కింది విషయాలను వివరించండి.
అ) శాతవాహనులు,
అ) భిక్షువు,
ఇ) చైత్యం,
ఈ) శిల్పకళ,
ఉ) ఆరామం
జవాబు:
అ) శాతవాహనులు :
క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. శాతవాహన వంశస్థాపకుని సోదరుడు కన్హు (కృష్ణ) క్రీ.పూ. 207 నుండి క్రీ.పూ. 189 వరకు పాలించాడు.
కన్షుని వారసుడైన మొదటి శాతకర్ణి అశ్వమేధంతోబాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. శాతవాహన వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా పురాణాలలో ఉంది.
గౌతమీపుత్ర శాతకర్ణినే శాలివాహనుడు అంటారు. ఇతను శాతవాహనుల ప్రతిష్ఠను బాగా పెంచాడు. ఈయన గొప్ప హిందూ మతాభిమాని. 78లో విక్రమాదిత్యుని ఓడించి శాలివాహనయుగం లేదా శకయుగానికి నాంది పలికాడు. ఇప్పటికీ మారాఠీ ప్రజలు శాలివాహన యుగాన్నే అనుసరిస్తున్నారు. శాతవాహన చక్రవర్తులలో హాలుడు గాథా సప్తశతిని రచించి ప్రసిద్ధిపొందాడు.
శాతవాహనులు కట్టించిన కట్టడాలు, స్తూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్నాయి. అమరావతిలోని బౌద్ధస్తూపం చాలా ప్రసిద్ధిచెందింది. మహాయాన బౌద్ధం, ఆంధ్ర శిల్పకళ శాతవాహనుల వర్తక వాణిజ్యాల వలన ఆగ్నేయాసియాకు వ్యాపించాయి.
ఆ) భిక్షువు :
భిక్షువు అంటే యాచకుడు అని అర్థం. అంటే యాచన చేసి జీవించు సన్యాసి. భిక్షువుకు ఇల్లు, సంసారం మొదలైనవేమీ ఉండవు. కేవలం దైవ ధ్యానంతో సమయాన్ని గడుపుతాడు. తక్కువగా భుజిస్తాడు.
ఇ) చైత్యం :
చైత్యం అంటే బౌద్ధాలయం. ఈ బౌద్ధాలయంలో బౌద్ధ భిక్షువులు బుద్ధుని బోధనలను గూర్చి ఉపన్యాసాలు ఇస్తారు. ధ్యానం చేసుకొంటారు. బుద్ధుని ధర్మబోధనలను, జీవితాన్ని తెలియజేసే కీర్తనలు పాడతారు.
ఈ) శిల్పకళ :
శిల్పము అంటే రాతితో కాని, కర్రతో కాని, లోహాలతో కాని తయారుచేసే బొమ్మలు. ఆ బొమ్మలను తయారుచేయడంలో ప్రదర్శించే నైపుణ్యాన్ని శిల్పకళ అంటారు. శిల్పాలను రకరకాల ఆకారాలలో తయారుచేస్తారు. రకరకాల భంగిమలలో కూడా శిల్పాలను తయారుచేస్తారు.
ఉ) ఆరామం :
ఆరామం అంటే తోట, విహరించే ప్రాంతం లేదా విశ్రాంతి తీసుకొనే ప్రాంతం. బౌద్ధారామాలంటే బౌద్ధులు విశ్రాంతి తీసుకొనే ప్రాంతాలు.
3. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
మా గ్రామానికి ప్రభుత్వం రవాణా సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం, తపాలా, టెలిఫోన్ సౌకర్యం కలిగించింది. ఒక గ్రంథాలయం కూడా ఉంది. సామూహిక టెలివిజన్ కార్యక్రమాలు చూసే అవకాశముంది. రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా ఉంది. మా గ్రామంలో ప్రతి ఇంట్లో చెట్లున్నాయి. మా గ్రామ మహిళామండలి, యువజన సంఘాలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. మా ఊరిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో అన్ని మతాలవాళ్ళూ కలిసి పాల్గొంటారు.
జవాబు:
ప్రశ్నలు:
- గ్రామానికి ఏయే సౌకర్యాలున్నాయి?
- గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న సంస్థలేవి?
- గ్రామంలోని దేవుడు పేరేమిటి?
- ఆ గ్రామంలో టెలివిజన్ ఉందా?
- పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
II. వ్యక్తీకరణ సృజనాత్మకత
1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) రాజధాని నగరమంటే ఏమిటి? రాజధాని నగరానికి, మామూలు నగరాలకు గల తేడా ఊహించి రాయండి.
(లేదా )
రాజధాని నగరానికి, మామూలు నగరాలకు తేడాలుంటాయి’ – సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
ఒక రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ పరిపాలించే పాలక వ్యవస్థ కేంద్రీకృతమై ఉండే నగరాన్ని రాజధాని నగరం అంటారు.
రాజధాని నగరం | మామూలు నగరం |
1) అత్యున్నత స్థాయి పరిపాలకులు, అధికారులు నివాసం ఉంటారు. | 1) పాలకుల ప్రతినిధులు, క్రిందిస్థాయి అధికారులు ఉంటారు. |
2) పరిపాలనా కార్యాలయాలు ఉంటాయి. | 2) చిన్న కార్యాలయాలు ఉంటాయి. |
3) జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. | 3) జనాభా కొంత తక్కువ ఉంటుంది. |
4) సందర్శకుల సంఖ్య ఎక్కువ. | 4) సందర్శకుల సంఖ్య తక్కువ. |
5) రాష్ట్రం లేదా దేశానికి నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉంటుంది. | 5) ఎక్కడైనా ఉంటుంది. |
6) భద్రత ఎక్కువ. | 6) సామాన్యమైన భద్రత కలిగి ఉంటుంది. |
7) విద్యా, వైద్య మొదలైన సదుపాయాలు ఆధునికంగా ఉంటాయి. | 7) సామాన్యమైన విద్యా, వైద్య సదుపాయాలుంటాయి. |
8) రహదారులు పటిష్టంగా ఉంటాయి. | 8) రహదారులు సామాన్యంగా ఉంటాయి. |
ఆ) వివిధ పరిపాలకుల ఆశయాలూ, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ఎలా ప్రభావం చూపాయి?
జవాబు:
అమరావతిని మొదట పాలించిన వారు శాతవాహనులు. వీరి ప్రభావం వల్ల హిందూ సంస్కృతి పరిఢవిల్లింది. క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. మొదటి శాతకర్ణి యజ్ఞయాగాదులకు చాలా ధనం ఖర్చు పెట్టాడు. అశ్వమేధంతో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈ విధంగా శాతవాహనుల వైదిక సంస్కృతి అమరావతిపై ప్రభావం చూపింది.
ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినుల హిందూమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావాన్ని చూపాయి. అమరేశ్వరాలయ ప్రతిష్ఠ అమరారామంగా విఖ్యాతి కలగడం జరిగింది.
కోట బేతరాజు పాలనలో ఓరుగల్లుతో కూడా సంబంధ బాంధవ్యాలేర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, వంటి అనేక మంది పాలనలో ముస్లిం సంస్కృతి కూడా వేళ్ళూనుకొంది.
గౌతమబుద్ధుని సందర్శనతో బౌద్ధమతం, తర్వాతి కాలంలో జైనమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఇ) ఆచార్య నాగార్జునుని గురించి మీకు తెలిసిన విషయాలను రాయండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధ మతాచార్యుడు. శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. సుహృల్లేఖ, రత్నావళి అనే గ్రంథాలు వారి స్నేహబంధానికి గుర్తులు. ఆ గ్రంథాలలో ప్రకటించిన. భావాలు వారి ఆత్మీయతను తెలియజేస్తాయి. నాగార్జునుడు ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలో గల బౌద్దారామాల్లో నివసించేవాడు. ఆయన విజయపురిలో శ్రీ పర్వత విద్యాపీఠం స్థాపించాడు. అక్కడ దేశ విదేశాల విద్యార్థులు విద్యార్జన చేసేవారు. ఆ విశ్వవిద్యాలయంలో 7700 మంది బౌద్ధ భిక్షువులుండేవారట. అక్కడ ఆచార్య బుద్ధ ఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ధర్మశాస్త్రం, రాజనీతి, సాహిత్యం మొదలైనవి బోధించేవారు.
ఈ) అమరావతిలోని శిల్పాల గొప్పతనమేమిటి?
జవాబు:
శరీరధర్మ శాస్త్రాన్ని అనుసరించి, శిల్పాలు, చిత్రాలు రూపొందించడం అనేది, ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం అయ్యింది. కాగా అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే, శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ ప్రదర్శింపబడడం, అమరావతి శిల్పాల విశిష్టత.
అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉన్నాయని పురావస్తు శాఖవారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో మంచి నైపుణ్యం ఉన్న ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, గొప్పగా ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందం, క్రోధం, విషాదం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి
భావాలు స్పష్టంగా కన్పిస్తాయి. గాంధార, మధుర, శిల్పకళ రీతులతో సమానంగా, అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది.
2. ఈ కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానం రాయండి.
అ) అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి.
జవాబు:
అమరావతిని అనేక మంది పరిపాలించారు. వారి విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువల్లనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటారు.
అమరావతిలో బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.
అమరావతిని శాతవాహనులు తొలిసారిగా పాలించారు. వారు వైదిక సంప్రదాయాన్ని అనుసరించారు. యజ్ఞయాగాదులు చేశారు. దానితో అమరావతిలో వైదిక సంస్కృతి వెల్లివిరిసింది.
క్రీస్తు పూర్వం గౌతమబుద్ధుడు అమరావతిని సందర్శించాడు, దానితో అమరావతి పరమ పవిత్రమైంది. బౌద్ధమత సంస్కృతీ సంప్రదాయాలు కూడా అమరావతిలో నెలకొన్నాయి. తర్వాతి కాలంలో శైవమతం వ్యాపించింది. ఆ కాలంలోనే పంచారామాలలో ఒకటైన ‘అమరారామం ‘లో ‘అమరలింగేశ్వరాలయం’ ఏర్పడింది. శైవమత సంస్కృతి కూడా కలిసింది.
రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి దగ్గరలో వైకుంఠపురంలో వేంకటేశ్వరాలయం నిర్మించాడు. అది వైష్ణవ మత సంస్కృతికి సంకేతం.
ఇదే విధంగా జైన, ముస్లిం, క్రైస్తవ మత సంస్కృతులు కూడా అమరావతి సాంస్కృతిక వైభవంలో పాలుపంచుకొన్నాయి.
ఆ) రాజధానిగా వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.
జవాబు:
శాతవాహనుల రాజధానిగా క్రీస్తు పూర్వమే అద్భుతంగా అభివృద్ధి చెందిన మహానగరం అమరావతి. అశోకునికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉంది. మెగస్తనీసు తన ‘ఇండికా’ గ్రంథంలో అమరావతి గురించి ప్రస్తావించాడు.
ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు మొదలైన వారి పరిపాలనలో అమరావతి దినదినాభివృద్ధి చెందింది. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు కూడా అమరావతిని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అంటే సుమారు 1800 సంవత్సరాలు రాజధానిగా విరాజిల్లింది అమరావతి.
అమరావతిని రాజధానిగా చేసుకొని చాలామంది పరిపాలన సాగించారు. ఆయా ప్రభువుల పాలనలలో కాలానుగుణంగా అనేక మార్పులు పొందింది. అనేక మంది పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందుచేత అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన, క్రైస్తవ మత సంప్రదాయాలతో సర్వమత సమ్మిళిత నగరంగా అమరావతి రాజధానిగా వెలుగొందింది.
ఇ) “అమరావతీ నగర అపురూప శిల్పాలు …….” అనడంలోని ఔచిత్యాన్ని వివరించండి.
(లేదా)
“అమరావతీ నగర అపురూప శిల్పాలు” గురించి వ్యాసం రాయండి.
జవాబు:
అమరావతిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శిల్ప సంపద సృష్టించబడింది. అమరావతిలోని శిల్పకళా నైపుణ్యాన్ని చూసి, ‘ఫెర్గూసన్’ ఆశ్చర్యపడ్డాడు. ఫెర్గూసన్ శిల్పకళా నిపుణుడు. ప్రపంచంలోని అనేక రకాల శిల్పాలను పరిశోధించాడు. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణికి చెందిన శిల్పాలుగా అమరావతీ శిల్పాలను ఋజువులతో నిరూపించాడు.
శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దిలో ప్రారంభమయింది. కాని, అమరావతిలో ఒకటవ శతాబ్దిలోనే ప్రదర్శించారు. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు అమరావతి శిల్పాలలో కనిపిస్తాయి.
ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు అమరావతీ శిల్పాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అమరావతీ శిల్పాలు గాంథార, మధుర శిల్పాలతో సమానంగా ప్రసిద్ధిచెందాయి.
అంతటి మహోన్నతమైన శిల్పాలు అమరావతిలో ఉన్నందువల్లనే ఒక సినీ కవి “అమరావతీ నగర అపురూప శిల్పాలు” అన్నారు.
3. ఈకింది అంశాల గురించి సృజనాతకంగా/ప్రశంసిస్తూ రాయండి.
అ) అమరావతిలో అద్భుత శిల్పసంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:
(లేఖ ) అమలాపురం, గౌరవనీయులైన శిల్పిగారికి, అమరావతికి వేసవి సెలవులలో వెళ్ళాను. అక్కడ శిల్పాలు చూశాను. అద్భుతమైన మీ శిల్పకళా నైపుణ్యాన్ని అక్కడి సందర్శకులందరూ వేనోళ్ళ పొగుడుతున్నారు. కోపం, ప్రేమ, ఆరాధన మొదలైన హావభావాలన్నీ ఆ శిల్పాలలో స్పష్టంగా కన్పించాయి. ఫెర్గూసన్ వంటి , గొప్ప పరిశోధకుని ప్రశంసలు అందుకొన్న మీరు చాలా గొప్పవారు. మీ వంటి గొప్ప శిల్పులను కన్న ఆంధ్రమాత ధన్యురాలు. మళ్ళీ దసరా సెలవులలో మా స్నేహితులతో వస్తాను. మా పాఠ్యపుస్తకంలోని ‘అమరావతి’ పాఠంలో మీ శిల్ప నైపుణ్యం తెల్పారు. మీరు తయారుచేసిన శిల్పాల గొప్పతనాన్ని కూడా తెలుసుకొన్నాం. నమస్కారాలతో, చిరునామా : |
(లేదా)
అమరావతి పాఠం చదివినప్పుడు మీకు కలిగిన అనుభూతిని వివరిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
కవిత :
మన అమరావతి
తరతరాల వైభవాల చిరునామా !
నవ్యాంధ్ర జాతి కలల సిరుల పంట
భావితరాల సౌభాగ్యాల ఖరారు నామా !
పెట్టుబడుల ప్రవాహాల నిలయమంట
అపురూప శిల్పకళా స్వరూపాల ఖజానా !
అదే మన అమరావతి
కృష్ణా తరంగిణీ పావన జమానా !
అదే అదే మన అజరామరమైన అమరావతి.
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
అమరావతీ శిల్పాల చిత్రాలను సేకరించండి, ప్రదర్శించండి.
III. భాషాంశాలు
పదజాలం
1. ఈ కింది పదాలకు అర్ధాలు గ్రహించండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : చేరువ = దగ్గర
సొంతవాక్యం : ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది.
అ) జగజేగీయమానం : లోకముచే మిక్కిలి కొనియాడబడినది.
సొంతవాక్యం : ఆగ్రాలోని తాజ్ మహల్ సౌందర్యము జగజేగీయమానమైనది.
ఆ) వైభవోపేతం = వైభవంతో కూడినది
సొంతవాక్యం : రాణివారి వైభవోపేతమైన క్రొత్త బంగళా, ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.
ఇ) పునీతం = పవిత్రం
సొంతవాక్యం : గంగానదీ స్నానంతో, మా శరీరం పునీతం అయ్యింది.
ఈ) ముగ్గులు = మురిసిపోయినవారు
సొంతవాక్యం : తాజ్ సౌందర్యాన్ని చూసి యాత్రికులు నేటికీ ముగ్గులు అవుతున్నారు.
2. ఈ కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : కీర్తి : యశస్సు, ఖ్యాతి
1) మన ఆంధ్రప్రదేశ్ కీర్తిపతాకం వినువీథులలో రెపరెపలాడాలి.
2) ఎంతోమంది ఖ్యాతి గడించినవారు ఆంధ్రప్రదేశ్ యశస్సును పెంచినారు.
అ) కాణాచి : 1) నివాసం, 2) స్థావరం, 3) నెలవు, 4) బస
1) కాణాచి : ఆంధ్రప్రదేశ్ కళలకు కాణాచి.
2) నివాసం : మేరు పర్వతం దేవతల నివాసం.
3) స్థావరం : గిర్ అడవులు సింహాలకు స్థావరం.
4) నెలవు : వ్యవసాయం కష్టాలకు నెలవు.
5) బస : కైలాసం శివునికి బస.
ఆ) శ్రేణి : 1) పరంపర, 2) పంక్తి, 3) వరుస
1) శ్రేణి : శ్రీరాముడు అత్యుత్తమ శ్రేణిలోని పరిపాలకుడు.
2) పరంపర : కవుల పరంపరలో మొదట లెక్కింపదగినవారు నన్నయగారు.
3) పంక్తి : భోజనాలకు పంక్తిలో కూర్చున్నారు.
4) వరుస : ప్రార్థనా సమావేశంలో విద్యార్థులు వరుసలలో నిలుచున్నారు.
ఇ) రాజు : 1) భూపాలుడు 2) జనపాలుడు 3) ప్రభువు 4) నృపాలుడు 5) ఏలిక
1. రాజు : అయోధ్య దేశానికి రాజు దశరథుడు.
2. భూపాలుడు : ప్రజల కష్టాలను భూపాలుడు తీర్చాలి.
3. జనపాలుడు : కరవు కాటకాలు రాకుండా జనపాలుడు నదులకు ఆనకట్టలు కట్టించాలి.
4. ప్రభువు : ప్రజలు ప్రభువులను గౌరవించాలి.
5. నృపాలుడు : మథిలా నగరానికి నృపాలుడు జనక మహారాజు.
6. ఏలిక : ఈ దేశానికి ఏలిక ధర్మాత్ముడు.
ఈ) పురము : 1) పురి 2) పట్టణము 3) నగరము
1. పురము : మీ పురములో కాయకూరలు చౌకగా దొరుకుతున్నాయి.
2. పురి : అయోధ్యాపురిలో ప్రజలు సుఖసంతోషాల్లో తేలిపోయేవారు.
3. పట్టణము : మీ పట్టణములో అన్ని వస్తువులూ కొరతగా ఉన్నాయి.
4. నగరము : మీ నగరములో పాడిపంటలకు లోటు లేదు.
ఉ) సందేహం : 1) సంశయము 2) శంక 3) అనుమానము
1. సందేహం : నీకు సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి.
2. సంశయము : ఈ సంశయములను మీ గురువులనడిగి తీర్చుకో.
3. శంక : ఈ విషయంలో నీకు శంక ఏమిటో చెప్పు.
4. అనుమానము : దేవుడు ఉన్నాడనే విషయంలో అనుమానము లేదు.
వ్యాకరణాంశాలు
1. కింది వాక్యాల్లో ఉన్న ‘అనునాసిక’, ‘పడ్వాది’ సంధుల పదాలను గుర్తించి విడదీయండి. సూత్రం రాయండి.
అ) ఎక్కడ కూర్చున్నది మరచిపోయి తన్మయులమై చూసేవాళ్ళం.
జవాబు:
తన్మయులమై : తత్ + మయులమై = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’ గాని, ‘మ’ గాని, పరమైనపుడు, వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.
ఆ) నీవు సందేహపడనవసరం లేదు.
జవాబు:
సందేహపడవలసిన = సందేహము + పడవలసిన = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనప్పుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.
ఇ) పురాణ వాజ్మయం చూసి భయపడకు. చదివి ఆనందపడు.
జవాబు:
1. వాజ్మమం = వాక్ + మయం (అనునాసిక సంధి)
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని పరమైనపుడు వానికి అనునాసికములు ఆదేశంగా వస్తాయి.
2. భయపడక = భయము + పడక (పడ్వాది సంధి) (మువర్ణలోప సంధి)
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బంధువులు విభాషగా వస్తాయి.
3. ఆనందపడు = ఆనందము + పడు = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.
ఈ) సన్నుతి చేయి.
జవాబు:
సన్నుతి = సత్ + నుతి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.
ఉ) రాణ్మణి యుద్ధంలో భంగపడడు.
జవాబు:
రాణ్మణి = రాట్ + మణి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.
2. కింది వాక్యాలను ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చండి.
అ) ‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’, అని అమ్మతో అన్నాను.
జవాబు:
నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను. (పరోక్ష కథనం)
ఆ) ‘నీకివ్వాల్సింది ఏమీలేదు’, అని నాతో అతడన్నాడు.
జవాబు:
నాకివ్వాల్సింది ఏమీలేదని నాతో అతడన్నాడు. (పరోక్ష కథనం)
ఇ) సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
“సుందరకాండ చదువు” అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)
ఈ) వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికెళ్ళాడు” అని (ప్రత్యక్ష కథనం)
ఉ) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
అందరనుకుంటున్నారు “ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని (ప్రత్యక్ష కథనం)
3. అర్థాలంకారాల్లోని మరొక అలంకారాన్ని తెలుసుకుందాం.
ఉదా :
i) వాడు తాటిచెట్టంత పొడవు ఉన్నాడు.
ii) దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి
పై వాక్యాల్లో వాడి ఎత్తును, గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కదా ! అంటే అతిశయంగా చెప్పడం అన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.
అతిశయోక్తి అలంకార లక్షణం : విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం.
కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీత అశోకవనంలో హనుమంతుని విరాడ్రూపం చూసిన సందర్భంలోనిది.)
అ) కం. చుక్కలు తల పూవులుగా ,
నక్కజముగ మేనుబెంచి యంబర వీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నత్మస్థితిలోన్
భావము :
నక్షత్రాలు, తన తలలో ధరించిన పువ్వుల వలె కనబడే విధంగా ఆశ్చర్యం కలిగేటట్లు హనుమంతుడు తన శరీరాన్ని పెంచి ఆకాశవీధిలో గొప్పగా కనబడ్డాడు. అప్పుడు సీత చూచి ఆనందాన్ని పొందింది.
గమనిక :
హనుమంతుడు ఆకాశాన్ని తాకేలా, ఆకాశంలో నక్షత్రాలు ఆయన తలలోని పువ్వుల వలె కనబడ్డాయి అని అతిశయంగా చెప్పడం వల్ల ఇది “అతిశయోక్తి” అలంకారం.
ఆ) మా పొలంలో బంగారం పండింది.
గమనిక :
మంచి పంట పండింది అని చెప్పడానికి బదులు, బంగారం పండిందని అతిశయోక్తిగా చెప్పడం జరిగింది. అందువల్ల “అతిశయోక్తి అలంకారం”.
అదనపు సమాచారము
సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి:
1. విద్యాలయములు = విద్యా + ఆలయములు = సవర్ణదీర్ఘ సంధి
2. మహితాభిమానము = మహిత + అభిమానము = సవర్ణదీర్ఘ సంధి
3. మహావేశము = మహా + ఆవేశము = సవర్ణదీర్ఘ సంధి
4. నవ్యాంధ్ర = నవ్య + ఆంధ్ర = సవర్ణదీర్ఘ సంధి
5. శతాబ్ది = శత + అబ్ది = సవర్ణదీర్ఘ సంధి
6. శతాబ్దం = శత + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
7. కాలానుగుణంగా = కాల + అనుగుణంగా = సవర్ణదీర్ఘ సంధి
8. మతాచారాలు = మత + ఆచారాలు = సవర్ణదీర్ఘ సంధి
9. అమరారామం = అమర + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
10. మతాచార్యుడు = మత + ఆచార్యుడు = సవర్ణదీర్ఘ సంధి
11. బౌద్దారామాలు = బౌద్ధ + ఆరామాలు = సవర్ణదీర్ఘ సంధి
12. విద్యాలయం = విద్యా + ఆలయం = సవర్ణదీర్ఘ సంధి
13. విద్యార్థులు = విద్యా + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి
14. విద్యార్జన = విద్య + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
15. బోధనాంశములు = బోధన + అంశములు = సవర్ణదీర్ఘ సంధి
16. మతానుయాయులు = మత + అనుయాయులు = సవర్ణదీర్ఘ సంధి
17. జ్ఞానార్జన = జ్ఞాన + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
18. పంచారామాలు = పంచ + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
19. పట్టాభిషేకము = పట్ట + అభిషేకము = సవర్ణదీర్ఘ సంధి
20. చిరాయువు = చిర + ఆయువు = సవర్ణదీర్ఘ సంధి
21. అజరామరత్వము = అజర + అమరత్వము = సవర్ణదీర్ఘ సంధి
22. పరమావధి = పరమ + అవధి = సవర్ణదీర్ఘ సంధి
23. అశేషాంధ్రులు = అశేష + ఆంధ్రులు = సవర్ణదీర్ఘ సంధి
2. గుణ సంధి :
24. అమరలింగేశ్వరస్వామి = అమరలింగ + ఈశ్వరస్వామి = గుణసంధి
25. వైభవోపేతము = వైభవ + ఉపేతము = గుణసంధి
26. మహోజ్జ్వలము = మహా + ఉజ్జ్వలము = గుణసంధి
3. యణాదేశ సంధి:
27. అత్యాధునికము = అతి + ఆధునికము = యణాదేశ సంధి
28. అత్యద్భుతము = అతి + అద్భుతము = యణాదేశ సంధి
29. అత్యున్నతశ్రేణి = అతి + ఉన్నత శ్రేణి = యణాదేశ సంధి
4. పుంప్వాదేశ సంధి :
30. రాష్ట్రపు రాజధాని = రాష్ట్రము + రాజధాని = పుంప్వాదేశ సంధి
31. సున్నపురాయి = సున్నము + రాయి = పుంప్వాదేశ సంధి
5. పడ్వాది సంధి:
32. భద్రపఱచిన = భద్రము + పఱచిన = పడ్వాదిసంధి (మువర్ణలోప సంధి)
6. జశ్వ సంధి :
33. తదనంతరము = తత్ + అనంతరము = జత్త్వసంధి
7. ఆమ్రేడిత సంధి :
34. చెల్లాచెదరు = చెదరు + చెదరు = ఆమ్రేడిత సంధి
సమాసాలు
వ్యుత్పత్యర్థాలు
1. హర్మ్యము : మనోహరముగా ఉండేది (మేడ)
2. చైత్యం : పాషాణాదులచే కట్టబడేది (బౌద్ధస్తూపం)
3. ఆరామం : ఇందులో క్రీడిస్తారు (ఉపవనము)
4. కవి : చాతుర్యంగా వర్ణించేవాడు (కవి)
5. అక్షతలు : క్షతము లేనివి (అక్షింతలు)
6. సాక్షి : ఏదేని ఒక కార్యాన్ని స్వయంగా చూసినవాడు
7. శరీరము : రోగాదులచే హింసింపబడి శిధిలమయ్యేది (దేహము)
8. విద్యార్థులు : విద్యలను కోరి వచ్చేవారు (శిష్యులు)
ప్రకృతి – వికృతి
పట్టణము – పట్నము
అక్షతలు – అక్షింతలు
కవి – కయి
కీర్తి – కీరితి
యాత్ర – జాతర
భక్తులు – బత్తులు
ఫలక – పలక
విద్య – విద్దె
ద్వీపము – దిబ్బ
సాక్షి – సాకిరి
స్వామి – సామి
పర్వము – పబ్బము
ప్రాంతము – పొంత
రూపము – రూపు
విశ్వాసము – విసువాసము
వక్రము – వంపు
హృదయాలు – ఎడదలు
చిత్రము – చిత్తరువు
పర్యాయపదాలు
1. పట్టణము : నగరము, నగరి, పత్తనము, పురము, పురి, ప్రోలు
2. సన్న్యా సి : భిక్షువు, యతి, ముని, మౌని, పరివ్రాజకుడు
3. హృదయము : ఎడ, ఎడద, డెందము
4. పేరు : నామధేయము, ఆఖ్య, సంజ్ఞ, అభిధానము
5. గురువు : ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఒజ్జ, ఆచార్యుడు
6. దీపము : దివియ, దివ్వె, దివిటీ, తిల్లిక, దీపిక
7. రాజు : ఏవిక, ప్రభువు, రాయలు, టేడు, జనపాలుడు
8. కీర్తి : యశస్సు, యశము, పేరు, సమాఖ్య
9. కానుక : కానిక, బహుమతి, ఉపద, బహుమానము
10. యవనిక : తెర, పరదా, తిరస్కరిణి
11. గాథ : కథ, కథానిక, ఆఖ్యాయిక
12. ప్రభువు : . రాజు, ఏలిక, జేడు, భూపాలుడు
13. సంపద : సిరి, లచ్చి, విభూతి, ఐశ్వర్యము
14. శరీరము : కళేబరము, గాత్రము, తనువు, మెయి
నానార్థాలు
1. అవధి : హద్దు, కాలము, ఏకాగ్రత
2. ఇంద్రుడు : దేవేంద్రుడు, శ్రేష్ఠుడు, ప్రభువు, ఈశ్వరుడు
3. ఈశ్వరుండు : ప్రభువు, శివుడు, పరమాత్మ, భర్త
4. కవి : కావ్య కర్త, శుక్రుడు, వాల్మీకి, ఋషి, నీటికాకి
5. కళ : శిల్పము, అందము, వడ్డీ, చంద్రుడిలో 16వ భాగము, చదువు
6. గురువు : ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, తాత
7. చైత్యము : గుడి, భవనము, సభ, బౌద్ధాలయము, శిశువు
8. తీర్థము : పుణ్యోదకము, పుణ్యనది, ఘట్టము, పుణ్యక్షేత్రం
9. పేరు : నామము, ప్రసిద్ధి, భూషణము, పెద్దది
10. రాజు : ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు, ఇంద్రుడు
11. యాత్ర : జాతర, ముట్టడి, ఉత్సవము, పోవుట
12. శాసనము : రాజు దానము చేసిన భూమికి, వ్రాసియిచ్చే కవులు, ఆజ్ఞ, శాస్త్రము, అధికారము
కఠిన పదాలకు అర్థాలు
సంతతి = సంతానము
మహిత = గొప్పదైన
అభిమానము = ఆత్మగౌరవము
దివ్యము = శ్రేష్ఠమైనది
ఆముఖము = ప్రారంభము
స్ఫూర్తి = పరిపూర్ణత
తీవరించు = త్వరితపరచు
నవ్యము = క్రొత్తది
వైభవం = గొప్పతనము
ప్రబలం = ప్రసిద్ధి
వంశజులు = వంశములో జన్మించినవారు
వైభవ + ఉపేతము = వైభవోపేతము గొప్పతనముతో కూడినది
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
శాతవాహనులకంటే పూర్వమే అమరావతిని పరిపాలించిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని కొన్ని రాజవంశాలు పరిపాలించాయి. వారిలో సమగోప, గోబధ, నరన, కంవాయల రాజవంశాలు ప్రముఖమైనవి.
ప్రశ్న 2.
అమరావతిని అభివృద్ధిపరచిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోటబేతరాజ వంశాలు అమరావతిని అభివృద్ధి పరిచారు.
ప్రశ్న 3.
అమరావతిపై ఏయే మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి?
జవాబు:
బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు అమరావతిపై కనిపిస్తాయి.
స్పర్శ = తాకిడి
పునీతం = పవిత్రం
ధాతువు = వాతము మొదలైనవి. ఇవి 7 విధాలు : శుక్లము, శోణితము, మాంసము, ఎముక, చర్మము, చీము, మెదడు.
చైత్యం = బౌద్ధాలయము
ఆరామం = తోట (విశ్రాంతి కొరకు నిర్మించే కట్టడం)
ఆర్జన = సంపాదన
తీర్థంకరులు = జైనులు
అలరారడం = ప్రకాశించడం
పంచారామాలు = ఐదు శైవ క్షేత్రాలు –
- ద్రాక్షారామము
- భీమారామము
- సోమారామము
- అమరారామము
- కొమరారామము
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
బుద్ధుడి ధాతువుల మీద ఎలాంటి నిర్మాణం కట్టారు?
జవాబు:
బుద్ధుడి ధాతువుల మీద మహాచైత్యం నిర్మించారు. దాని చుట్టూ అద్భుతమైన కళాఖండాలున్నాయి. బుద్ధుని జీవిత గాథను చెక్కారు.
ప్రశ్న 2.
ఆచార్య నాగార్జునుణ్ణి గురించి చెప్పండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధమతాచార్యుడు. శాతవాహనుల కుల గురువు. ఆయన ధరణికోట, నందికొండ ప్రాంతాలలో ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు.
ప్రశ్న 3.
అమరావతి దగ్గరలోని వైకుంఠపురంలో ఏ ఆలయం ఉంది?
జవాబు:
వైకుంఠపురంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాడు.
ప్రశ్న 4.
అమరావతిని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరు?
జవాబు:
క్రీ.శ. 640లో చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ అమరావతి సందర్శించాడు. క్రీస్తు పూర్వంలో గ్రీకు రాయబారి మెగస్తనీసు అమరావతిని సందర్శించాడు.
కాణాచి = ఆటపట్టు, నిలయం
స్తూపం = మట్టి మొదలగు వాని దిబ్బ
సమున్నతం = గొప్పదైన (ఎత్తైన)
కాలగర్భంలో కలిసిపోవడం = నశించిపోవడం
ప్రస్ఫుటం = వికసించునది (స్పష్టం)
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
దీపాల దిన్నె గురించి చెప్పండి.
జవాబు:
అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నపుడు అక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజూ అక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. అందువలన ఆ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. ఇది అమరావతి శివారు ప్రాంతంలో ఉంది. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని దీపాల దిన్నెపై చెక్కించాడు. ఈ విధంగా అనేకమంది శిల్పాలను చెక్కడానికి వితరణ ఇచ్చారు – వారి పేర్లు కూడా దీపాల దిన్నె వద్ద శాసనాలలో చెక్కారు.
ప్రశ్న 2.
అమరావతి శిల్పకళకు సంబంధించిన శిల్పాలు ఎక్కడెక్కడ లభించాయి?
జవాబు:
కొన్ని శిల్పాలు అమరావతి శివారు ప్రాంతంలో దీపాల దిన్నె వద్ద మెకంజీకి లభించాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని నాగార్జున కొండ, దంతగిరి, నేల కొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో కొన్ని శిల్పాలు లభించాయి.
ప్రశ్న 3.
అమరావతి శిల్పాలలోని గొప్పతనం ఏమిటి?
జవాబు:
అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. కేవలమూ చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ చూపించడం, అమరావతి శిల్పాల విశిష్టత. శిల్పకళా పరిశోధనలో గొప్ప నైపుణ్యం కల ‘ఫెర్గూసన్’ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందము, క్రోధము, విషాదము, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు సుస్పష్టంగా కనిపిస్తాయి.
చిరాయువు = దీర్ఘాయుర్దాయము కలది
అజరామరం = శాశ్వతం (ముసలితనం, మరణం లేని)
సంప్రోక్షణ = పరిశుద్ది చేయుట
అహర్నిశలు = పగలూ, రాత్రీ (ఎల్లప్పుడూ)
అశేషాంధ్రులు = మొత్తం ఆంధ్రులంతా
భాసిల్లు = ప్రకాశించు
ఆకాంక్ష = కోరిక
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
అమరావతి పేరులో చిరాయువును ఎలా నింపుకుంది?
జవాబు:
అమరావతి అంటే ‘చావు లేనిది’ అని అర్ధము. అమరులు అంటే దేవతలు. వారు చిరాయువు కలవారు. అమరావతి అనే పేరులో అమర శబ్దము చిరాయువు అనే అర్థాన్ని తెలుపుతుంది.
2. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘అమరావతి పేరులో చిరాయువును నింపుకొంది. వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లింది. నవ్యాంధ్రకు కేంద్ర బిందువు అమరావతి. అనేక మతాల సామరస్యం గల ప్రాంతం అమరావతి. పవిత్రమైన కృష్ణానదీ తీరంలో ఉన్న పరమపావనమైనది కనుకనే అమరావతిని నవ్యాంధ్రకు రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది.
3. నవనగరాలు ఏవి?
జవాబు:
1. పర్యాటక నగరంగా ‘ఉండవల్లి’
2. ఆరోగ్య నగరంగా ‘కృష్ణయ్య పాలెం’
3. ఎలక్ట్రానిక్ నగరంగా ‘బేతపూడి’
4. విజ్ఞాన నగరంగా ‘శాఖమూరు’
5. విద్యానగరంగా ‘అయినవోలు’
6. పరిపాలనా నగరంగా ‘రాయపూడి’
7. న్యాయ నగరంగా ‘నేలపాడు’
8. క్రీడా నగరంగా ‘అబ్బరాజుపాలెం’
9. ఆర్థిక నగరంగా ‘ఉద్దండరాయపాలెం’
10. ఆధ్యాత్మిక నగరంగా “అనంతవరం పరిసరాలు”
కొత్త హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. వీటినే నవనగరాలు అంటారు.