Students can go through AP Board 10th Class Social Notes 11th Lesson ఆహార భద్రత to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 11th Lesson ఆహార భద్రత
→ 1943-45 సం||రాలలో బెంగాల్ కరవు వల్ల బెంగాల్, అసోం, ఒడిశాలలో 30-50 లక్షల మంది చనిపోయారు.
→ ‘ఆహార భద్రతకు’ సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయటం ముఖ్యమైన అవసరం.
→ హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచటానికి అవసరమైన ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకోవాలి. (గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉంది కాబట్టి)
→ తలసరి ఆహార ధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి; కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి. కాని ఆహారధాన్యాల ఉత్పత్తి, లభ్యతల మధ్య తేడా ఉంది.
→ సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు = సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (ఉత్పత్తి – విత్తనం, దాణా, వృథా) + నికర దిగుమతులు (దిగుమతులు – ఎగుమతులు) – ప్రభుత్వ నిల్వలలో తేడా (సంవత్సరం ముగిసేనాటికి ఉన్న నిల్వలు – సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు).
→ సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు = (సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు ÷ జనాభా)/ 365.
→ ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెంచటానికి దిగుమతులు ఒక మార్గం.
→ ఆహార లభ్యతను పెంచటానికి ప్రభుత్వ నిల్వలను ఉపయోగించుకోవటం ముఖ్యమైన మార్గం.
→ వంటనూనెలు, ధాన్యాలు (ప్రధాన, చిరు లేదా తృణధాన్యాలు), పప్పుదినుసులు మొ||వాటిని ఆహార ధాన్యాలుగా పిలుస్తారు.
→ బియ్యం, గోధుమల తెల్లరంగు ఇష్టపడే వలస పాలకులతో (జొన్న, రాగి, సజ్జ మొ|| వాటికి) తృణ ధాన్యాలన్న పేరు వచ్చింది. ప్రస్తుతం వీటిని ‘పోషక ధాన్యాలు’గా వ్యవహరిస్తున్నారు.
→ వినియోగదారులు రకరకాల ఆహార పదార్థాలతో సమతుల ఆహారం తీసుకోవాలి.
→ గత రెండు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ లో ఆహార ధాన్యాలు పండించే భూమిని పత్తి వంటి వాణిజ్య పంటలకు మళ్లిస్తున్నారు.
→ భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రా|| కూరగాయలు, 100 గ్రా||ల పళ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. అయితే వీటి లభ్యత వరుసగా 180 గ్రా||లు, 58 గ్రా||లు మాత్రమే ఉంది.
→ అదే విధంగా సగటున ప్రతి వ్యక్తి సం||లో 180 గుడ్లు తీసుకోవలసి ఉండగా వీటి లభ్యత 30 మాత్రమే.
→ రోజుకు ప్రతి వ్యక్తి 300 మి.లీ. పాలు తీసుకోవలసి ఉండగా లభ్యత 210 మి.లీ మాత్రమే ఉంది.
→ ఆహారంలో మాంసం సగటున ప్రతి వ్యక్తి సం||రానికి 11 కిలోలు తీసుకోవలసి ఉండగా లభ్యత 3.2 కిలోలు మాత్రమే.
→ ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టటానికి రైతులకు ఉత్పాదకాలు, మార్కెటు అవకాశాల రూపంలో మద్దతు కావాలి.
→ అధునాతన పద్ధతులు, విధానాలు అవలంబించి ఆహార మరియు వాణిజ్య పంటల సాగు చేయటం మరియు వ్యవసాయ అనుబంధ (పాడి పరిశ్రమ, మొ||న) పరిశ్రమలను అభివృద్ధి చేయటంను వ్యవసాయ వైవిధ్యీకరణ అని పిలువవచ్చు.
→ వ్యవసాయ వైవిధ్యీకరణ ఆహారధాన్యాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందన్న విషయం గుర్తించాలి.
→ తలసరి ఆహార ధాన్యాల లభ్యతలో యూరపు (700 గ్రాములు), అమెరికా (850 గ్రాములు) వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో తక్కువ.
→ ఆహారధాన్యాల తలసరి లభ్యత తగ్గుతూ ఉండటం భారతదేశం ఆహార భద్రత విషయంలో ఆందోళన కలిగించే విషయం.
→ మనం తినే ఆహారం శరీరంలో జీర్ణమై శక్తిని ఉత్పత్తి చేస్తుంది, శక్తిని కాలరీలలో కొలుస్తారు.
→ రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి.
→ తీసుకోవలసిన కాలరీల కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల జాతీయ సగటు తక్కువగా ఉంది.
→ కాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి తగ్గింది.
→ భారతదేశ గ్రామీణ ప్రాంతంలో 80 శాతం ప్రజలు కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు.
→ గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత పేదల కాలరీల వినియోగం అందరికంటే తక్కువగా ఉంది.
→ భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండటానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
→ భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.
→ అంత్యోదయ కార్డు ఉన్నవాళ్ళకు ప్రతి కుటుంబానికి, నెలకు 35 కిలోల ఆహారధాన్యాలు అందుతాయి.
→ భారత ప్రభుత్వం FCI ద్వారా కొని నిల్వ చేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు.
→ వడ్లు, గోధుమలను FCI అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలలో ముందుగా ప్రకటించిన ధరల ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. ఈ ధరను కనీస మద్దతు ధర (Minimum Support Price) అంటారు.
→ ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి MSP ప్రకటిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడింట ఒక వంతు ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. అవసరమైన ప్రజలకు ఈ ఆహార ధాన్యాలను పంపిణీ చేయటం లేదన్న విమర్శ ప్రభుత్వంపై ఉంది. 2013లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం అనే కొత్త చట్టం చేసింది. ఇది ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చింది.
→ భారతదేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు ఇది వర్తిస్తుంది.
→ ఈ చట్టం ప్రకారం తక్కువ ఆదాయ కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోలు, అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి.
→ కొన్ని సం||రాల పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ, చిరుధాన్యాలను వరసగా 3, 2, 1 రూపాయలకు అందిస్తుంది.
→ ఈ చట్టం ప్రకారం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75%కి, పట్టణ జనాభాలో 50%B PDS నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసే హక్కు ఉంది.
→ ఈ చట్టం ప్రకారం గర్భిణి. స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్‌వాడీకి వచ్చే 1 – 6 సం||రాల పిల్లలకు, బడికి వచ్చే 6-14 సం||రాల పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టాలి.
→ పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్న భోజనం తింటున్నారు.
→ ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం.
→ శరీరం అన్ని విధులను నిర్వహించడానికి – శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి ఆహారం కావాలి.
→ మనం తినే ఆహారాన్ని పిండి పదార్ధాలు (గోధుమలు, బియ్యం, రాగులు, జొన్నలు, నూనెలు, పంచదార మొ||వి) మాంస కృత్తులు (చిక్కుళ్లు, పప్పులు, మాంసం, గుడ్లు మొ||నవి), విటమిన్లు (పళ్లు, ఆకుకూరలు, మొలకలు, ముడిబియ్యం), ఖనిజ లవణాలు (ఆకుకూరలు, రాగులు) మొ|| వాటిగా విభజించారు.
→ ప్రజలు పోషకాహారం తీసుకుంటున్నారో లేదో తెలుసుకోవటానికి వాళ్ళ ఎత్తు, బరువును సూచికగా ఉపయోగించే విధానాన్ని పోషకాహార శాస్త్రజ్ఞులు రూపొందించారు.
→ హైదరాబాదులోని జాతీయ పోషకాహార సంస్థ దేశ వ్యాప్తంగా పలురాష్ట్రాలలో చేసిన పోషకాహార సర్వే భారతదేశంలో పోషకాహార స్థాయి ఆందోళనకరంగా ఉందని వెల్లడి చేస్తోంది.
→ పిల్లల పోషకాహార స్థాయిని పరిశీలించటానికి ఎత్తు, బరువు కొలతలను ఉపయోగిస్తారు.
→ దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1-5 సం||రాల వయసున్న 7000 మంది పిల్లల్లో 45% మంది తక్కువ బరువు ఉన్నారు. 1-3 సం||రాల పిల్లలతో పోలిస్తే 3-5 సం||రాల పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది.
→ గుజరాత్ (58%), మధ్యప్రదేశ్ (56.9%), ఉత్తరప్రదేశ్ (53.2%) వంటి రాష్ట్రాలలో ఇది 50% మించి ఉంది.
→ బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద 16% పిల్లల్లో ఉంది.
→ వయోజనులైన స్త్రీ, పురుషులలో పోషకాహార స్థాయిని శరీర బరువు సూచిక (BMI) తో కొలుస్తారు.
→ BMI = బరువు కిలోలలో మీటర్లలో ఎత్తు వర్గం.
→ జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం, పురుషులలో తీవ్ర శక్తి లోపం (BMI < 18.5) 35%, అధిక బరువు// ఊబకాయం (BMI > 25) 10%గా ఉంది. 35% మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉండగా, 14% మహిళలలో అధిక బరువు/ఊబకాయం కన్పిస్తుంది.
→ తీవ్ర శక్తి లోపం ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధికంగా ఉంది. ఆ తరువాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో 33-38% మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉంది.
→ ప్రజా పంపిణీ సామర్థ్యం, ఆహార పంటలను పండించటానికి ప్రాధాన్యత, ప్రజల కొనుగోలు శక్తి వంటి వాటినన్నింటిని ప్రజల ఎత్తు, బరువు వంటి సూచికల ఆధారంగా అంచనా వేయవచ్చు.
→ ఉత్పత్తి : వనరులను వస్తువులుగా మార్చే విధానం ఉత్పత్తి. ఉత్పత్తి అంటే ఒక వస్తువును సృష్టించడం, స్థూలంగా ఉత్పాదకాలను (Inputs) ఉత్పత్తిగా (Output) మార్చే ప్రక్రియ. ఇక్కడ ఉత్పత్తి అనగా ఆహారధాన్యాల దిగుబడి.
→ లభ్యత : అందరికీ సరిపడా ఆహారం ఉందో లేదో తెలియజేయునది లభ్యత. ఆహార ధాన్యాల లభ్యత సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తిని తెలియజేస్తుంది.
→ అందుబాటు : ఏదైనా వస్తువు కొనడం, తినడం, ఉపయోగించడం మొదలైనవాటికి చేరువలో ఉండటం.
→ పోషకాహారం : శరీరానికి (శరీరం అన్ని విధులను నిర్వహించటానికి, శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి) అవసరమయిన పోషక పదార్థాలు అన్నీ తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్ని “పోషకాహారం” అంటారు.
→ బఫర్ నిల్వలు : భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ (Food Corporation of India) ద్వారా కొని నిల్వ చేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు.
→ ఆకలి : తినటానికి సరిపోయేటంత ఆహారం దొరక్క, వాళ్లు తినవలసిన దాని కంటే తక్కువ ఆహారం తినటం ఆకలి. ఈ పరిస్థితినే దీర్ఘకాలికంగా తీవ్ర ఆకలి అంటారు.
→ ప్రజాపంపిణీ వ్యవస్థ (Public Distribution System) : ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను సబ్సిడీపై సరఫరా చేయటాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) అంటారు.
→ కనీస మద్దతు ధర : ఆహార ధాన్యాలను (వరి, గోధుమ, వేరుశెనగ మొ||నవి) ప్రభుత్వం కొనుగోలు చేయు ధర, రైతుల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు ఈ ధర నిర్ణయిస్తుంది.
→ శరీర బరువు సూచిక (Body Mass Index) : వయోజనులైన స్త్రీ, పురుషులలో పోషకాహార స్థాయిని శరీర బరువు సూచిక తెలియజేస్తుంది. (BMI = బరువు కిలోలలో (మీటర్లలో ఎత్తు వర్గం)
→ జాతీయ ఆహార భద్రత చట్టం : ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చిన చట్టం.
→ వ్యవసాయ వైవిధ్యీకరణ : ఆధునిక పద్ధతులు, విధానాలు అవలంబించి ఆహార మరియు వాణిజ్య పంటలు మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయుట.