Students can go through AP Board 7th Class Science Notes 8th Lesson కాంతితో అద్భుతాలు to understand and remember the concept easily.
AP Board 7th Class Science Notes 8th Lesson కాంతితో అద్భుతాలు
→ కాంతి ఒక శక్తి స్వరూపం.
→ కాంతి వివిధ రకాల వస్తువుల నుండి విడుదల అవుతుంది. వాటిని కాంతి జనకాలు అంటారు.
→ వాటంతట అవే కాంతిని విడుదల చేసే కాంతి జనకాలను సహజ కాంతి జనకాలు అంటారు.
→ మానవ ప్రమేయంతో కాంతిని విడుదలచేసే జనకాలను మానవ ప్రమేయ కాంతి జనకాలు లేదా కృత్రిమ కాంతి జనకాలు అంటారు.
→ కాంతి ప్రయాణించే దారి లేదా మార్గాన్ని కాంతి కిరణం అంటారు.
→ కాంతి కిరణాన్ని బాణపు గుర్తుతో కూడిన సరళరేఖతో సూచిస్తారు.
→ కాంతి కిరణాల సముదాయాన్ని కాంతి కిరణపుంజం అంటారు.
→ ఒకదానికొకటి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాల సముదాయాన్ని సమాంతర కాంతి కిరణపుంజం అంటారు.
→ వివిధ దిశల నుండి ప్రయాణిస్తున్న కాంతికిరణాలు ఒక బిందువు వద్ద చేరితే అలాంటి కాంతికిరణ సముదాయాన్ని ‘అభిసరణ కాంతి కిరణపుంజం’ అంటారు.
→ ఒక కాంతి జనకము నుండి వివిధ దిశలలో ప్రయాణించే కాంతికిరణ సముదాయాన్ని ‘అవసరణ కాంతికిరణ పుంజం’ అంటారు.
→ వస్తువుల మీద పడిన కాంతి వెనుకకు మరలుతుంది. ఆ మరలిన కాంతి కంటిని చేరుటవలన ఆ వస్తువులను మనం చూడగలుగుతాం.
→ కాంతి జనకాల నుండి వచ్చిన కాంతికిరణాలు నునుపు లేదా గరుకు తలాలను తాకి వెనుకకు మరలే ప్రక్రియను ‘కాంతి పరావర్తనం’ అంటారు.
→ పరావర్తనలు రెండు రకాలు.
- క్రమ పరావర్తనం
- క్రమరహిత పరావర్తనం
→ క్రమ పరావర్తనం నునుపైన మరియు మెరుస్తున్న తలాల నుండి జరుగుతుంది.
→ క్రమరహిత పరావర్తనం గరుకుతలాలపై జరుగుతుంది.
→ పతనకోణం, పరావర్తన కోణానికి సమానం.
→ పతనకిరణం, పరావర్తన కిరణం, తలానికి లంబం ఒకే తలంలో ఉంటాయి.
→ రెండు దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య కనుగొనుటకు సూత్రం,
n = ( 360°/θ ) – 1, θ అనేది దర్పణాల మధ్య కోణం.
→ సమతలాలపై కాంతి పరావర్తనం సూత్రం ఆధారంగా పెరిస్కోప్ తయారు చేయబడింది.
→ పుటాకార, కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు.
→ వస్తువు యొక్క స్థానాన్ని బట్టి పుటాకార దర్పణాలు నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను, పెద్ద, సమాన పరిమాణం గల మరియు చిన్నదైన ప్రతిబింబాలను నిటారు, తలకిందులైన ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి.
– కుంభాకార దర్పణాలు కేవలం మిథ్యా, నిటారైన మరియు చిన్నదైన ప్రతిబింబాలను మాత్రమే ఏర్పరుస్తాయి.
→ పుటాకార దర్పణాలు దంతవైద్యులు, కంటివైద్యులు, చెవి, ముక్కు, గొంతు వైద్యనిపుణులు వాడతారు మరియు వాహనాల హెడ్ లైట్లలో కూడా వాడుతారు.
→ కుంభాకార దర్పణాలను వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్లను, రోడ్డు మలుపుల వద్ద భద్రత దర్పణాలుగా వాడుతారు.
→ వక్రతలాన్ని కలిగి ఉండి కాంతిని తన ద్వారా పంపించగలిగే ఏదైనా పారదర్శక పదార్థాన్ని ‘కటకం’ అంటారు.
→ మధ్యభాగం మందంగా ఉండి అంచులు పలుచగా ఉన్నటువంటి కటకాన్ని కుంభాకార కటకం అంటారు. ఆ మధ్యలో పలుచగా ఉండి అంచుల వెంబడి మందంగా ఉన్న కటకాన్ని ‘పుటాకార కటకం’ అంటారు.
→ సహజ కాంతి జనకాలు : తమంతట తాము కాంతిని విడుదలజేయు జనకాలను సహజ కాంతి జనకాలు అంటారు.
→ కృత్రిమ కాంతి జనకాలు : మానవ ప్రమేయంతో కాంతిని విడుదల చేయు జనకాలను కృత్రిమ కాంతి జనకాలు అంటారు.
→ కాంతి పరావర్తనం : వస్తువులపై పడిన కాంతి అదే యానకంలో తిరిగి వెనుకకు రావడాన్ని కాంతి పరావర్తనం అంటారు.
→ పతన కిరణం : పరావర్తన తలం మీద పడే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు.
→ పరావర్తన కిరణం : పరావర్తన తలం నుండి వెనుకకు మరలే కాంతికిరణాన్ని పరావర్తన కిరణం అంటారు.
→ క్రమ పరావర్తనం : నునుపైన తలాలపై జరుగు పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. దీని వలన స్పష్టమైన ప్రతిబింబము ఏర్పడుతుంది.
→ క్రమరహిత పరావర్తనం : గరుకు తలం నుండి జరుగు పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. దీనిలో ప్రతిబింబాలు అస్పష్టంగా ఏర్పడతాయి.
→ పతన కోణం : పతన కిరణం పరావర్తనం తలం వద్ద చేయు కోణాన్ని పతన కోణం అంటారు.
→ పరావర్తన కోణం : పరావర్తన కిరణం పరావర్తన తలం వద్ద చేయు కోణాన్ని పరావర్తన కోణం అంటారు.
→ లంబము : పరావర్తన బిందువుకు నిలువు కోణాన్ని లంబము అంటారు. ఇది పరావర్తన తలానికి 90° కలిగి ఉంటుంది.
→ పుటాకార దర్పణం : లోపలికి వంచబడిన పరావర్తన తలాలను పుటాకార దర్పణం అంటారు.
→ కుంభాకార దర్పణం : బయటకు వంచబడిన పరావర్తన తలాలను కుంభాకార దర్పణం అంటారు.
→ నిజ ప్రతిబింబం : తెరమీద పట్టగలిగిన ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు.
→ మిథ్యా ప్రతిబింబం : తెర మీద పట్టలేని ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అంటారు.
→ కటకం : వక్రతలాలు కలిగిన కాంతి పారదర్శక యానకాన్ని కటకం అంటారు.
→ కాంతి విశ్లేషణ : కాంతి ఏదైనా యానకం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు దానిలోని రంగులు విడిపోయే ప్రక్రియను కాంతి విశ్లేషణ అంటారు.