AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

These AP 7th Class Social Important Questions 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 10th Lesson Important Questions and Answers రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 1.
గవర్నర్ నియామకం మరియు విధులను గురించి వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రి మండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి అయిదు సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ ని నియమిస్తారు. ఒక్కోసారి రెండు లేక మూడు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 158 (3a) ప్రకారం రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు.

గవర్నర్ విధులు :

  1. శాసనసభ : మెజారిటీ పార్టీ నాయకుణ్ణి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం.
  2. రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి, దాని గోప్యతను కాపాడతామని వారి చేత ప్రమాణం చేయించటం.
  3. శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇవ్వడం.
  4. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులను నియమించటం.
  5. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదించటం.

ప్రశ్న 2.
శాసన సభ నిర్మాణం మరియు శాసన సభకు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
జవాబు:
శాసనసభ :
రాష్ట్ర శాసనసభ ఒక శాసన నిర్మాణ విభాగం. దిగువ సభగా భావించే ఈ సభలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభ్యులందరు సమావేశమై, రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చిస్తారు. ప్రతి రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజక వర్గాలుగా విభజించారు.

శాసనసభకు ఎన్నికలు :
సాధారణంగా, ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి మ్యానిఫెస్టోలతో ఎన్నికలలో పోటీ చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను మ్యానిఫెస్టో అంటారు.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
శాసన సభ సభ్యుని ఎన్నిక ప్రక్రియను వివరించండి.
జవాబు:

  1. శాసన సభ నియోజక వర్గాలలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది.
  2. 18 సం|| పైబడి ఓటు హక్కు కలిగిన ఓటర్లందరూ ఎన్నికల రోజున ఆ నియోజక వర్గంలో ఓటు వేస్తారు.
  3. ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డును బూత్ స్థాయి అధికారికి చూపించాలి.
  4. రహస్య ఓటింగు విధానం ప్రకారం, ఓటర్లు వారు ఎవరికి ఓటు వేసినది తెలియపరచరాదు.
  5. పోలింగ్ పూర్తి అయిన తరువాత, ప్రకటించిన తేదీ నాడు ఓట్లను లెక్కిస్తారు.
  6. ఓట్ల లెక్కింపు తరువాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు (Majority) వస్తాయో వారిని ఆ నియోజకవర్గ యం.ఎల్.ఏ. (శాసనసభ సభ్యుడు) (Member of Legislative Assembly) గా ప్రకటిస్తారు.

ప్రశ్న 4.
శాసన మండలి సభ్యుల కూర్పు, నిర్మాణం గురించి వివరంగా తెలియజేయండి.
జవాబు:
శాసన మండలి :

  1. శాసన నిర్మాణ శాఖలోని ఎగువసభను శాసన మండలి అంటారు.
  2. ద్విసభా విధానములో, శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది.
  3. ప్రతి 2 సంవత్సరాలకు 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నిక అవుతారు.
  4. ఇది శాశ్వతసభ ఎందుకంటే ఈ సభ రద్దు కాదు. ప్రతి శాసన మండలి సభ్యుడు (MLC) ఆరు సంవత్సరములు పదవిలో కొనసాగుతాడు.

శాసన మండలి నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది :

  1. 1/3 వ వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు.
  2. 1/3 వ వంతు మంది సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యులచే ఎన్నుకోబడతారు.
  3. 1/12 వ వంతు మంది సభ్యులు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు.
  4. 1/12 వ వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు.
  5. 1/6 వ వంతు మంది సభ్యులు రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడతారు.

ప్రశ్న 5.
ముఖ్యమంత్రి అధికారాలు మరియు మంత్రి మండలి గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ముఖ్యమంత్రి అధికారాలు :

  1. మంత్రిమండలి జాబితాను తయారుచేసి గవర్నర్‌కు పంపిస్తారు.
  2. మంత్రులకు శాఖలను కేటాయిస్తారు.
  3. మంత్రిమండలి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తారు.
  4. ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు.

ఆర్టికల్ 163 (1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రికి మంత్రి మండలి ఉండాలి.

మంత్రిమండలి :

  1. ముఖ్యమంత్రి క్యాబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.
  2. ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తారు.
  3. ఈ విధానాలను ఆయా విభాగాల అధికారులు నిబంధనల ప్రకారం అమలు చేస్తారు.
  4. సభ ఆమోదం కోసం సమర్పించవలసిన విధానాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రిత్వశాఖపై ఉంది.
  5. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
రాష్ట్రంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్మాణం గురించి వివరణాత్మకంగా తెలియజేయండి.
జవాబు:
న్యాయశాఖ – రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం :

  1. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాలలో ఇది ఒకటి. ఇది చట్టాలను వ్యాఖ్యానించటంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది.
  2. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం.
  3. స్వతంత్ర న్యాయవ్యవస్థలో భాగంగా, దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు క్రింద పనిచేస్తుంది.
  4. రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
  5. భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు.
  6. ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో అతనికి / ఆమెకి 62 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు కొనసాగుతారు. రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు ఉన్నాయి.
  7. న్యాయవ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ (ప్రజా న్యాయస్థానం)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ప్రశ్న 7.
చట్టాలను ఎవరు తయారుచేస్తారు? ఆధారమేమి?
జవాబు:
చట్టాలను ఎవరు తయారు చేస్తారంటే

  1. రాష్ట్రంలో వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి మనకు చట్టాలు అవసరం.
  2. రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందడానికి మరియు ప్రగతి పథంలో పయనించడానికి చట్టాలు సహాయపడతాయి.
  3. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది.
  4. ఒక రాష్ట్ర పరిధిలోని పరిపాలన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే.
  5. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు మూడు జాబితాలుగా విభజించబడ్డాయి.
  6. అవి 1. కేంద్ర జాబితా, 2. రాష్ట్ర జాబితా, 3. ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది.

ప్రశ్న 8.
చట్ట సభలలో ఒక బిల్లు శాసనం (చట్టం)గా ఎలా రూపొందుతుందో విశదీకరించండి.
జవాబు:

  1. సాధారణంగా, అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేక శాసనమండలిలో బిల్లును ప్రవేశపెడతారు.
  2. ఆర్థిక బిల్లును గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తరువాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు. సభలోని ప్రతి సభ్యునికి బిల్లు ప్రతులను పంచుతారు.
  3. బిల్లుపై సవివరమైన చర్చలు జరిపి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిన తరువాత ఓటింగ్ జరుపుతారు.
  4. మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తరువాత, ఆ బిల్లును రెండవ సభకు పంపుతారు.
  5. మొదటి సభలో జరిగిన విధంగానే రెండవ సభలో కూడా అదే విధానం బిల్లును ఆమోదించడం కొనసాగుతుంది.
  6. రెండు సభల ఆమోదం పొందిన తరువాత బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుంది.
  7. గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తరువాతనే బిల్లు చట్టంగా మారుతుంది.
  8. చట్టాన్ని గెజిట్ లో ప్రచురిస్తారు. చట్టాన్ని అమలు చేయడానికి, గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖకు పంపడం జరుగుతుంది.

ప్రశ్న 9.
ఒక అంశంపై బిల్లు చట్టంగా ఎలా రూపొందుతుందో ‘ఫ్లో చార్టు ద్వారా వర్ణించండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 1

ప్రశ్న 10.
ఈ క్రింది వారి విధులు, అధికారాలు తెలియజేయండి.
ఎ) పోలీసు సూపరింటెండెంట్, బి) RDO, సి) తహసీల్దార్, డి) VRO
జవాబు:
ఎ) పోలీసు సూపరింటెండెంట్ :
ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీసు సూపరింటెండెంట్ ఉంటారు. అతను జిల్లా ముఖ్య పోలీసు అధికారి. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా కలెక్టర్‌కు సహాయం చేస్తారు.

బి) రెవెన్యూ డివిజనల్ అధికారి :
సబ్ డివిజన్లో శాంతిభద్రతల నిర్వహణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ మొదలగునవి రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యతలు. భూ సేకరణ మరియు పునరావాస పనులను మరియు జిల్లా కలెక్టర్ సూచించిన ఇతర పనులను నిర్వహిస్తారు.

సి) తహసీల్దార్ :
మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణాధికారి. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు మరియు భూ రికార్డుల నిర్వహణకు బాధ్యత వహిస్తారు.

డి) గ్రామ రెవెన్యూ అధికారి :
గ్రామ రెవెన్యూ రికార్డులు మరియు అకౌంట్లను కచ్చితంగా నిర్వహించడం. గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన భూమి శిస్తు; పన్నులు మరియు ఇతర మొత్తాల వసూళ్ళతో పాటు సర్వే రాళ్లను తనిఖీ చేయడం, స్థానికత, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడం మొదలగు విధులు నిర్వహిస్తారు.

ప్రశ్న 11.
జిల్లా మరియు దిగువ స్థాయిలోని న్యాయస్థానాల ఏర్పాటు గురించి వివరించండి.
జవాబు:
జిల్లాలో న్యాయశాఖ :
జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజిన్ కోర్టులు ఉంటాయి. డివిజన్ కోర్టులు డివిజన్ స్థాయిలోను జిల్లా కోర్టు జిల్లా స్థాయిలోను న్యాయ పరిపాలన చేస్తాయి.

జిల్లా కోర్టు :
జిల్లా స్థాయిలో ఉన్న కోర్టును జిల్లా కోర్టు అంటారు. జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులు ఉంటారు. జిల్లాలోని వివిధ కేసులను విచారించి తుది తీర్పు ఇవ్వడం ప్రధాన విధి. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ చేయవచ్చు.

సబార్డినేట్ కోర్టు :
జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ కోర్టులు తమ అధికార పరిధిలో పౌర (సివిల్) మరియు నేర (క్రిమినల్) వివాదాలలో CPC (సివిల్ ప్రొసీజర్ కోడ్) మరియు CrPC కోడ్ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), లకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 12.
AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 2
పై పటమును పరిశీలించి క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములివ్వండి.
ఎ) ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని శాసనసభ నియోజక వర్గాలు కలవు?
బి) అత్యధిక శాసనసభా స్థానాలు కల జిల్లా ఏది?
సి) అత్యల్ప శాసనసభా స్థానాలు కల జిల్లా ఏది?
డి) మీ పాఠశాల ఏ శాసన సభా నియోజక వర్గ పరిధిలో కలదు?
జవాబు:
ఎ) 175
బి) తూర్పు గోదావరి (19)
సి) విజయనగరం (9)
డి) ప్రత్తిపాడు

ప్రశ్న 13.
ఈ పదాలను మీ తరగతిలో చర్చించండి: మెజారిటీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, నియోజక వర్గం, రహస్య ఓటింగ్ విధానం, సార్వత్రిక వయోజన ఓటు హక్కు.
జవాబు:
1) మెజారిటీ :
జరిగినటువంటి ఎన్నికల్లో అధిక ఓట్లు / సీట్లు వచ్చినవారు.

2) అధికార పార్టీ :
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన సభకు (చట్ట సభలకు) జరిగిన ఎన్నికల్లో మెజారిటీ పొంది (ఎక్కువ సీట్లు గెలుచుకుని) అధికారం పొందిన పార్టీ.

3) ప్రతిపక్ష పార్టీ :
రాజకీయంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగానీ పార్టీలు అధికార పార్టీని వ్యతిరేకించే పార్టీలు.

4) నియోజక వర్గం :
అక్కడ నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతం.

5) రహస్య ఓటింగు విధానం :
ఎన్నికల సమయంలో ఓటరు తాను ఓటు వేసే విషయంలో గోప్యతను కల్గి ఉండటం.

6) సార్వత్రిక వయోజన ఓటు హక్కు :
ఒక నిర్దిష్ట వయస్సు (18 సం||లు) నిండిన భారతదేశ పౌరులందరికి ఎటువంటి తారతమ్యం లేకుండా ఓటు హక్కు కల్పించటం.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 14.
జిల్లా కలెక్టర్ మిగతా విధుల జాబితా తయారుచేయండి.
జవాబు:
రెవెన్యూ పాలన

  1. భూమి శిస్తు వసూలు
  2. రెవెన్యూ రికార్డుల నిర్వహణ పర్యవేక్షణ.
  3. వ్యవసాయ గణాంక సేకరణ.
  4. బంజరు భూముల విస్తీర్ణం అంచనా,
  5. పబ్లిక్ ఎస్టేట్స్ నిర్వహణ మొదలైన రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ.

మెజిస్టీరియల్ అధికారాలు

  1. అల్లర్లు సంభవించినపుడు నిషేధాజ్ఞల విధింపు,
  2. సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ.
  3. పోలీసు స్టేషన్ల తనిఖీ.
  4. ఖైదీలకు కనీస సదుపాయాల కల్పన.
  5. కార్మిక సమస్యల పరిష్కారం.
  6. వార్తా పత్రికల ప్రారంభానికి అనుమతివ్వడం.
  7. పేలుడు పదార్థాల తయారీకి, పెట్రోలు బంకులు, సినిమా హాళ్ళ నిర్మాణానికి NOC జారీ చేయుట మొదలైనవి.

ఎన్నికల పర్యవేక్షణ అధికారం

  1. జిల్లా స్థాయిలో ముఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తాడు.
  2. ఓటర్ల జాబితా తయారీ, సవరణ, తుది జాబితా ప్రకటన మొదలగు విధుల పర్యవేక్షణ.
  3. రిటర్నింగ్ అధికారుల నియామకం.
  4. జిల్లా సహకార బ్యాంకులు, పాల కేంద్రాలు, నీటి వినియోగ సంఘాలు మొదలైన సంస్థల్లో ఎన్నికల నిర్వహణ.
  5. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ చేయుట.

ప్రకృతి ఉపద్రవాలను ఎదుర్కోవడం (డిజాస్టర్ మేనేజ్ మెంట్) అభివృద్ధి కార్యక్రమాల అమలు

  1. తుఫానులు, వరదలు, భూకంపాలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తాడు.
  2. ఉపశమన, సహాయక చర్యలు చేపడతాడు.
  3. వివిధ అధికారుల మధ్య సమన్వయ కార్యకర్తగా వ్యవహరిస్తారు.
  4. జిల్లాలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాడు.
  5. వివిధ ప్రభుత్వరంగ సంస్థల నిర్వాహకులతో సమీక్షించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించేలా చేయడం.
  6. జిల్లాలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేటట్లు చూస్తాడు.

జనాభా లెక్కలు

  1. కలెక్టరు జిల్లా స్థాయిలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా వ్యవహరిస్తాడు.
  2. జిల్లాలో జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకొంటాడు.
  3. అలాగే జిల్లాలో పాడి గేదెలు, పెంపుడు జంతువులు, ఫల వృక్షాలకు సంజా. సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తారు.

వివిధ పథకాలకు అధ్యక్షులు

  1. కుటుంబ సంక్షేమం, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్యంల పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తారు.
  2. MGNREGA అమలుకు కృషి.
  3. SSA, DRDA మొదలగు పథకాల అమలు.

స్థానిక సంస్థల పర్యవేక్షణ

  1. జిల్లాలోని స్థానిక సంస్థల సమావేశాలకు కలెక్టరు పదవీ రీత్యా సభ్యుడిగా, శాశ్వత ఆహ్వానితుడి హోదాలో పాల్గొంటాడు.
  2. జిల్లా పరిషత్తు సమావేశాలను ఏర్పాటు చేస్తాడు.
  3. ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారి (Special Officer) గా వ్యవహరిస్తాడు.

ఇతర అధికారాలు

  1. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సమీక్ష జరపడం.
  2. నీటి పారుదల వసతుల కల్పన.
  3. ట్రెజరీలపై పర్యవేక్షణ.
  4. కేంద్ర ప్రభుత్వ శాఖల విధుల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం.
  5. నిత్యావసర వస్తువుల సక్రమ సరఫరా.
  6. శాంతిభద్రతలపై పర్యవేక్షణ.
  7. ముఖ్య ప్రోటోకాల్ అధికారిగా వ్యవహరించడం.
  8. జిల్లాలోని అన్ని జిల్లా సంస్థల అధికారులపై పర్యవేక్షణ.

ప్రశ్న 15.
ఎన్నికలలో నిలబడిన అభ్యర్థి ఏవిధంగా ప్రచారం చేస్తాడో, సమాచారం సేకరించండి.
జవాబు:

  1. ఎన్నికల సంఘం విధించిన ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలలో నిలబడిన అభ్యర్థి ప్రచారం చేస్తాడు.
    ఉదా : ఎన్నికల ఖర్చు వగైరా.
  2. అభ్యర్థి తన నియోజకవర్గ ప్రజలను కలుస్తూ, వాగ్దానాలను చేస్తూ కాలిబాట, వాహనాల ద్వారా ప్రచారం చేస్తాడు.
  3. వివిధ రకాల మీడియాలలో టివి, యూట్యూబ్, ఫేస్ బుక్ లో ప్రచారం చేస్తాడు.
  4. వార్తా పత్రికలలో ఇంటర్వ్యూల ద్వారా, ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తాడు.
  5. పోస్టర్లు అంటించటం, గోడ పత్రికలు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తాడు.

ప్రశ్న 16.
అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు గవర్నరు పేరు మీద వెలువడతాయి. ఎందుకు?
జవాబు:

  1. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు.
  2. గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగపరమైన అధిపతి.
  3. గవర్నర్ కార్యనిర్వాహక అధిపతి. పరిపాలన అంతా ఆయన పేరు మీద కొనసాగుతుంది.
  4. అతని అనుమతి తర్వాత మాత్రమే అన్ని బిల్లులు చట్టంగా మారుతాయి.
  5. గవర్నర్ తన అధికారాన్ని ప్రత్యక్షంగా కాని లేదా తను నియమించిన అధికారుల ద్వారా కాని ఉపయోగించవచ్చు.

ప్రశ్న 17.
ప్రజలు ఎన్నికలలో ఓట్లు ఎందుకు వేస్తారు?
జవాబు:
ప్రజలు తమ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడి తమ అభివృద్ధికి పాటుపడే నాయకుడిని ఎన్నుకోవటం కోసం ఓట్లు వేస్తారు.

ప్రశ్న 18.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల కూర్పును గురించి మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు మొత్తం : 58 వీరిలో
శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడినవారు (1/3 వ వంతు) : 20
స్థానిక సంస్థల సభ్యులచే ఎన్నుకోబడినవారు (1/3 వ వంతు) : 20
రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడినవారు : 08
పట్టభద్రులచే ఎన్నిక కాబడినవారు : 05
ఉపాధ్యాయులచే ఎన్నిక కాబడినవారు : 05

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 93

సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. ఎన్నికల తరువాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడమే అటువంటి ఏర్పాటుకు సాధారణ కారణం.

7th Class Social Textbook Page No. 95

ఆర్టికల్ 171 (1) ప్రకారం ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య, ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4వ వంతుకు మించరాదు.

7th Class Social Textbook Page No. 99

ఆర్టికల్ 163 (1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉండాలి.

 AP 7th Class Social Important Questions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

7th Class Social Textbook Page No. 101

కోర్ట్ ఆఫ్ రికార్డు :
హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిక్రీలు ముద్రించబడతాయి. ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్ సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి.