These AP 7th Class Social Important Questions 2nd Lesson అడవులు will help students prepare well for the exams.
AP Board 7th Class Social 2nd Lesson Important Questions and Answers అడవులు
ప్రశ్న 1.
ప్రపంచంలోని శీతోష్ణస్థితి మండలాల గురించి క్లుప్తంగా వివరింపుము.
జవాబు:
ప్రపంచములో వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత, అవపాతం ఆధారముగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణస్థితి మండలాలను నిర్వచించారు. వీరి ప్రకారం ప్రపంచములో ఏడు శీతోష్ణస్థితి మండలాలు కలవు.
1. భూమధ్యరేఖ / ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం :
భూమధ్యరేఖకు ఇరువైపులా 5° – 10° ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఈ ప్రాంతం సగటున 150 సెం.మీ.లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతములో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారముగా ఉన్నాయి. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అల్ప జనాభా గల ప్రాంతాలలో ఇది ఒకటి. ఆమెజాన్లోని రెండియన్లు, కాంగో పరీవాహకంలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతములో నివసిస్తున్నారు. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారు.
2. సవన్నాలు :
భూమధ్యరేఖకు ఇరువైపులా 10° – 20° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడి సహజ వృక్షజాలం భూమధ్యరేఖకు సమీపముగా ఉన్నచోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్ళే కొద్దీ ఎత్తైన గడ్డిభూములుగా (1-6 మీ.) మారుతాయి. పశుపోషణ ఇక్కడి ప్రజల ప్రధాన జీవనోపాధి.
3. ఎడారి ప్రాంతాలు :
ఖండాలకు పశ్చిమ వైపున 15° – 30° ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి వున్నాయి. సహారా ఎడారి ఈ ప్రాంతములో అతి పెద్ద ఎడారి. ఇక్కడి వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా వుంటాయి. ఇక్కడి ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు.
4. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు :
అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమతీరాలలో ఈ విధమైన శీతోష్ణస్థితి విస్తరించి వున్నది. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలములో ఒక మాదిరినుండి అధిక వర్షపాతం ఇక్కడి ప్రధాన లక్షణము. ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడి వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. ఇక్కడి విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు.
5. స్టెప్పీ శీతోష్ణస్థితి :
శీతోష్ణస్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి వున్నాయి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్థ శుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. కావున ఇక్కడి వృక్షజాలం గడ్డిభూములు, చిన్నపొదలుగా వుంటుంది. విస్తృత వ్యవసాయం ఇక్కడ అమలులో వుంది.
6. టైగా ప్రాంతం :
ఇవి ఉత్తరార్ధ గోళంలో 55° – 70° ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి వుంది. ప్రపంచములో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి. ఇది ప్రపంచంలో అతి పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. ఇక్కడ ఫర్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపము.
7. టండ్రా శీతోష్ణస్థితి :
ఆర్కిటిక్ – ధృవ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతములో చలి చాలా ఎక్కువ. చెట్లు పెరగడానికి ఇవి అననుకూలం. ఇక్కడి ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు.
ప్రశ్న 2.
అడవి అనగానేమి? అడవుల యొక్క ఉపయోగాలను తెల్పండి.
జవాబు:
- విశాల ప్రాంతంలో సహజ పరిస్థితులలో చెట్లు, పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు.
- ఒక ప్రాంతములోని వర్షపాతము, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ సమతౌల్యత మొదలైన వాటిని అడవులు ప్రభావితము చేస్తాయి.
- ఆదిమ జాతుల మనుగడకు అడవులు ప్రధాన స్థావరాలు.
- కలప, ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు మనకు లభిస్తాయి.
- అడవులు వన్యప్రాణులకు సహజ నివాసాలు మరియు మానవ జీవనోపాధులకు నిలయాలు.
- ముడి పదార్థాలైన కలప, వెదురు, బీడీ ఆకులు, తేనె, లక్క మూలికలు, రంగుల వంటి ఉత్పత్తులను అడవుల నుండి పొందుతున్నాము.
- పశువుల మేత కొరకు, ఆటవిక జాతులకు నివాసాలుగా, పోడు వ్యవసాయం చేయు భూములుగాను మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా అడవులు ఉపయోగపడుతున్నాయి.
ప్రశ్న 3.
భారత ప్రభుత్వం అడవులను ఎన్ని రకాలుగా విభజించింది? అవి ఏవి?
జవాబు:
భారత ప్రభుత్వము పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను మూడు రకాలుగా విభజించింది.
- రిజర్వు అడవులు
- రక్షిత అడవులు
- వర్గీకరించని అడవులు
1. రిజర్వు అడవులు :
వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వము ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల ఆధీనములో ఉంటాయి.
2. రక్షిత అడవులు :
ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించవు.
3. వర్గీకరించని అడవులు :
ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చును.
ప్రశ్న 4.
మడ అడవులు లేదా తీర ప్రాంత అడవుల గురించి వివరించుము.
జవాబు:
మడ అడవులు / తీరప్రాంత అడవులు :
- ఈ అడవులను చిత్తడి అడవులు అని కూడా అంటారు.
- సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగిన తీర ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి.
- ఇక్కడి చెట్లు సముద్రపు లవణీయతను, అలల తాకిడిని తట్టుకునేలా వుంటాయి.
- శ్వాసవేళ్ళు, తీగ జాతి చెట్లు ఇక్కడ ప్రధానమైనవి. మడ వృక్షాలు, తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి.
- ఈ అడవుల సమీపములో చేపలు విరివిగా లభిస్తాయి.
- తీర ప్రాంతాలలోను, వెనుకకు మరలిన జలాలలోనూ, పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ప్రాంతాలలోను ఈ అడవులు విస్తరించాయి.
ప్రశ్న 5.
భారతదేశ అవుట్ లైన్ పటంలో మడ అడవులు గల ప్రాంతాలను గుర్తించుము.
జవాబు:
ప్రశ్న 6.
పర్వత ప్రాంత అడవుల గురించి వివరించుము.
జవాబు:
పర్వత ప్రాంత అడవులు :
- పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి.
- చల్లని శీతోష్ణస్థితి గల ప్రాంతాలలో ఈ అడవులు విస్తరించాయి.
- ఇక్కడి వృక్షాల ఆకులు సన్నని సూదంటు ఆకారములోనూ, త్రిభుజాకారంలోనూ ఉంటాయి.
- మంచు, వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి. హిమాలయ ప్రాంతంలో వివిధ రకాలైన శృంగాకారపు అడవులు ఉన్నాయి.
- స్పర్, ఫర్, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు, ధృవపు జింక, మంచు చిరుత ఇక్కడి ప్రధాన జంతు జాలము.
ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్ లోని అడవుల గురించి విపులంగా తెలియజేయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని అడవులను ప్రధానంగా వర్షపాతం, వాతావరణం మరియు నేలల రకం ఆధారంగా నాలుగు రకాలుగా విభజించారు.
- తేమతో కూడిన ఆకురాల్చే అడవులు
- శుష్క (పొడి) ఆకురాల్చే అడవులు
- పొద అడవులు (ముల్లు అడవులు)
- టైడల్ అడవులు / డెల్టా అడవులు
1. తేమతో కూడిన ఆకురాల్చు అడవులు :
125 నుండి 200 సెం.మీ వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టెగి మరియు సాల వృక్షాలు ఈ అడవులలో పెరిగే చెట్లు.
2. శుష్క ఆకురాల్చు అడవులు :
75 నుంచి 100 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. వై.యస్.ఆర్ కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు జిల్లాలలో ఈ అడవులు కలవు. ఇక్కడి ముఖ్య వృక్షాలు మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ మరియు ఎర్రచందనం.
3. చిట్టడవులు :
75 సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలయిన కడప, కర్నూలు, అనంతపూర్ మరియు చిత్తూరు జిల్లాలలో (రాయలసీమ) ఈ అడవులు పెరుగుతాయి. ఈ అడవులలో తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప మొదలగు చెట్లు పెరుగుతాయి.
4. మడ అడవులు / డెల్టా అడవులు :
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం 974 కి.మీ. ఈ తీరం వెంబడి ఈ అడవులు ఉన్నాయి. ఉదాహరణ, తూర్పు గోదావరిలోని కోరంగి ప్రాంతం. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్ల మడ, పత్రి తీగ, బలబండి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతాయి.
ప్రశ్న 8.
అటవీ జాతి అనగానేమి? ఆంధ్రప్రదేశ్లో గిరిజన తెగలు ఏవి?
జవాబు:
- సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు సంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగాన్ని అటవీ జాతి అంటారు.
- కొన్ని సమూహాలను ఆదిమ జాతులుగా గుర్తిస్తారు. వారు బోండోలు, చెంచులు, కొండ రెడ్లు, కొండ సవరలు. వీరు కాక గోండు, ఎరుకల మరియు యానాదులు అనబడే మరికొంత మంది ఆదిమ జాతుల వారు కూడ కలరు.
ప్రశ్న 9.
బ్రిటిషు వారి పాలనలో అడవుల యాజమాన్యం గురించి తెల్పండి.
జవాబు:
- బ్రిటిష్ వారు 1864లో అటవీశాఖను ఏర్పాటు చేశారు.
- ఇది ఆటవిక జాతుల వారిని అడవులలో స్వతంత్రంగా సంచరించడాన్ని నిరోధించింది.
- బ్రిటిష్ అటవీశాఖ అధికారులు వీరి నిస్సహాయతను ఆసరాగా చేసుకొని నిరంతరం మోసం చేసి హింసించారు.
- అడవులపై తమ హక్కుల కోసం గిరిజనులు పోరాటం చేశారు.
- గిరిజనుల కీలక పాత్ర లేనిదే వన సంరక్షణ సాధ్యం కాదని చివరకు ప్రభుత్వం గుర్తించింది.
ప్రశ్న 10.
సామాజిక అడవుల పెంపకం అనగానేమి? దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
- బంజరు భూములలో, ఇతర ప్రదేశాలలో మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని సామాజిక మరియు గ్రామ అభివృద్దులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అనవచ్చు.
- స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే సామాజిక అడవుల పెంపకం. ఇందులో భాగంగా వాయుకాలుష్యాన్ని తగ్గించి వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహించడం కొరకు ప్రభుత్వం సామాజిక వనీకరణను చేపట్టింది. పారిశ్రామిక ప్రాంతాలు, బంజరు భూములలో పచ్చదనాన్ని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
ప్రశ్న 11.
అటవీ హక్కుల చట్టం-2006 గురించి వివరించండి.
జవాబు:
అటవీ హక్కుల చట్టం-2006 :
- అటవీ హక్కుల చట్టం, భారతదేశం లేదా షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజన భూ చట్టం వంటి ఇతర పేర్లతో కూడా పిలువబడుతుంది.
- ఇది అడవులలో నివసించే సమాజాల హక్కులతో వ్యవహరిస్తుంది.
- హక్కులు దేశంలో వలస రాజ్యాల కాలం నుండి అటవీ చట్టాలను కొనసాగించడం వల్ల సంవత్సరాలుగా వారికి భూమి మరియు ఇతర వనరులపై హక్కులు నిరాకరించబడ్డాయి.
- డిసెంబర్ 2006లో, అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది.
- ఇది సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపును ఇచ్చింది. వలస రాజ్యాల కాలం నాటి అటవీ చట్టాల వల్ల జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా సరిచేసింది.
6) అటవీ హక్కుల చట్టం ప్రాముఖ్యత -2006 :
తరతరాలుగా ఇటువంటి అడవులలో నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్డ్ తెగలు (ఎఫ్ డిఎటి) మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (ఒటిఎడ్జి) అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది.
7) ఈ చట్టం FDST, OTFD లకు సుస్థిర ఉపయోగము, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతౌల్య నిర్వహణా బాధ్యతలను, అధికారాన్ని కట్టబెడుతుంది.
8) అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైన ఎడిఎస్, ఒటిఎడిలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇది ప్రయత్నిస్తుంది.
ప్రశ్న 12.
వన సంరక్షణకై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు/పథకాలు ఏవి?
జవాబు:
- భూమిపై అడవులు కీలక పాత్రను పోషిస్తాయి. కనుక సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
- అడవుల సంరక్షణ, చెట్లను నాటడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందింపచేస్తున్నది.
- ప్రజల సహకారంతో జనావాసాలు, బంజరు భూములలో చెట్లను నాటే కార్యక్రమం చేపట్టాలి. వన సంరక్షణ కొరకు వన మహోత్సవం, వనం-మనం వంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి.
- వన మహోత్సవంలో భాగంగా మొక్కలను, విత్తనాలను పంపిణీ చేస్తున్నారు.
ప్రశ్న 13.
చెంచు తెగ గురించి నీకు ఏమి తెలుసు?
జవాబు:
చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు చెంచు భాష మాట్లాడుతారు. వీరు నల్లమల అడవిలో ఉంటారు.
మీకు తెలుసా?
7th Class Social Textbook Page No. 43
భారత ప్రభుత్వము పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను మూడు రకాలుగా విభజించింది.
1. రిజర్వు అడవులు
2. రక్షిత అడవులు
3. వర్గీకరించని అడవులు
1. రిజర్వు అడవులు :
వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వము ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల ఆధీనములో ఉంటాయి.
2. రక్షిత అడవులు :
ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ ‘నష్టం కలిగించడానికి అనుమతించబడవు.
3. వర్గీకరించని అడవులు :
ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చును.
7th Class Social Textbook Page No. 47
ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) – 2019 ప్రకారము * భారతదేశములో 8,07,276 చ.కి.మీ. విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతములో కప్పబడి వుంది. ఇవి మొత్తము భూభాగములో 24.56% ప్రపంచ అటవీ విస్తీర్ణములో భారతదేశము 10వ స్థానంలో వుంది.
7th Class Social Textbook Page No. 53
ఎర్రచందనం కడప, చిత్తూరు జిల్లాలలోని శేషాచలం అడవులలో పెరిగే అరుదైన వృక్ష జాతి. ఉత్పత్తి మరియు ఎగుమతులలో ఈ వృక్షానికి ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం ఉంది.
7th Class Social Textbook Page No. 53
కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివి కోడిని ఐయుసిఎన్ (ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్) అరుదైన జాతులుగా తెలియజేసింది.
7th Class Social Textbook Page No. 55
చెంచులు ఒక అదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు చెంచు భాష మాట్లాడుతారు. వీరు నల్లమల అడవిలో ఉంటారు.
చెంచులు
స్వాతంత్ర్యానికి ముంది భారతదేశాన్ని పాలించిన బ్రిటీష్ వారు 1864 మరియు 1878లలో రెండు చట్టాలు చేసి అటవీశాఖను ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణను అప్పగించారు. అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను ఈ చట్టాలు అనుమతించలేదు. రిజర్వ్ అడవులలోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు. రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వారు తమ స్వంత ఉపయోగం కోసం కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులను తీసుకోవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. కాని, ఇక్కడ కూడా చెట్లను కొట్టడం పై అనేక షరతులు ఉన్నాయి. అటవీశాఖ విధించిన పరిమితికి మించి పశువులను మేపకూడదు. 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాములను చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో-టూరిజం (పర్యావరణ పర్యాటకం) పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుత ఎకో-టూరిజం విధానాన్ని బలోపేతం చేసింది.
7th Class Social Textbook Page No. 59
సంవత్సరం | చట్టం / సంఘటన |
1894 | అడవుల చట్టం |
1950 | అడవుల పండుగ |
1952 | జాతీయ అటవీ విధానం |
1980 | వన సంరక్షణ చట్టం |
2006 | అటవీ హక్కులు చట్టం |