Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 2nd Lesson గోపాల్ తెలివి Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 2 గోపాల్ తెలివి
Textbook Page No. 7
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.
ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి ?
జవాబు:
చిత్రంలో ఐదు గొట్టెలు, వల, వల పైన మేత, చెట్లు, గొయ్యి, ఎండు కొమ్మలు.
ప్రశ్న 2.
పై చిత్రాల ఆధారంగా కథను చెప్ప౦డి?
జవాబు:
అది ఊరి చివరి ప్రదేశం. పశువులకు చక్కటి మేత దొరికే ప్రదేశం. అక్కడికి రోజూ ఐదు గొట్టెలు మేత కోసం వస్తూ ఉంటాయి.
ఒకరోజు అవి – చక్కగా పరచిన కంబళి మీద – సిద్ధంగా ఉన్న ఆహారాన్ని చూసి తింటానికి సిద్ధపడ్డాయి. కానీ అందులో ఒక గొట్టె వద్దని, ఆపాయం పొంచి ఉందని – దాని కోసం ఆ కంబళి మీదకు వెళ్ళ వద్దని, వారించింది.
కాని మిగిలిన నాలుగు గొట్టెలు ఆమాటలు పెడ చెవిన పెట్టాయి. ఆనాయాసంగా దొరికిన ఆ ఆహారం కోసం ఆ కంబళి మీదకు వెళ్ళాయి. వాటి బరువుకు – కంబళి కింద వాటికోసం త్వా ఉన్న గొయ్యిలో పడిపోయాయి.
అప్పుడు బాధపడుతూ…. ఆ నాలుగు గొట్టెలు వద్దని చెప్పిన ఆ ఐదో గొట్టెతో ఎలాగొలా రక్షించు మిత్రమా! అని కోరాయి.
తెలివైన ఆ ఐదో గొట్టె….. గబాగబా ఎక్కడినుంచో…కొన్ని ఎండిపోయిన కొమ్మలను తెచ్చి ఆ గోతిలో నుండి పై దాకా పడేసింది.
లోపల పడ్డ గొట్టెలు .ఎక్కటానికి అనుకూలంగా పడేసింది.
వెంటనే… లోపల నుండి ఒక్కొక్క గొట్టె గోతిలోంచి ఆ కంపమీదుగా గట్టెక్కాయి.. . .
నీతి:
‘1. ఆశ అనర్ధానికి కారణం.
2. కష్టపడకుండా వచ్చేది ఏదైనా నష్టానికి దారితీస్తుంది.
3. ఆలోచన లేని ఆచరణ అనర్ధదాయకం.
4. ఉపాయంతో అపాయాన్ని దాటగలం
5. ‘మంచి మిత్రుడే మనకు బలం.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
ఢిల్లీ సుల్తానుకు వచ్చిన ఆలోచన ఏమిటి ?
జవాబు:
సామంత రాజులను రెండు ప్రశ్నలు అడగాలని ఢిల్లీ సుల్తాన్ కి ఆలోచన వచ్చింది.
అవి :
- ఈ భూమి పొడవు ఎంత ? వెడల్పు ఎంత ?
- ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి ?
ప్రశ్న 2.
సుల్తాను అడిగినది చిక్కు సమస్య. చిక్కు సమస్య అంటే ఏమిటి ? ఇలాంటివి మీరు విన్నవి చెప్ప౦డి.
జవాబు:
సూటిగా జవాబు చెప్పడానికి వీలులేని ప్రశ్నలు చిక్కు ప్రశ్నలు. ఇలాంటివి మరికొన్ని :
- రావి చెట్టుకు ఆకులెన్ని?
- వర్షంలో నీమీద పడే చినుకులెన్ని?
- ఎకరం పొలంలో ఎన్ని బియ్యపు గింజలు పండుతాయి. “
- ఒక లారీలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి ?
ప్రశ్న 3.
‘గోపాల్ తెలివి’ కథను మీ సొంత మాటల్లో చెప్ప౦డి.
జవాబు:
ఒకసారి ఢిల్లీ సుల్తాన్ కి రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది. వెంటనే సామంత రాజులందరినీ పిలిపించాడు. సభ తీర్చాడు. వచ్చిన సభలోని సామంతరాజులని ” ఈ భూమి పొడవు, వెడల్పు ఎంత?” ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. అని రెండు ప్రశ్నలడిగాడు. ఆ ప్రశ్నలకు వారంతా ఆశ్చర్యపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకొని – కావాలనే ఈ చిక్కు సమస్య ఇచ్చాడనుకున్నారు.
అందరూ, సుల్తాన్ – ఈ ప్రశ్నలకు జవాబులు – పండితులతో చిర్చించి చెప్తామన్నారు. అందుకు సరే వెళ్ళమన్నాడు సుల్తాన్. రాజులంతా వారి పట్టణాలకు వచ్చారు.
సామంతరాజుల్లో ‘మాల్వారాజు’ – జయచంద్రుడు. తన రాజ్యంలో పండితులందరిని పిలిపించి – సుల్తాన్ అడిగిన ప్రశ్నలను వినిపించి జవాబు చెప్పమన్నాడు. పండితులందరూ ఖంగు తిన్నారు. ఇంతలో జయచంద్రుడి ఆస్థాన విదూషకుడు గోపాల్ – ఆ ప్రశ్నలు విని ఒక్క క్షణం ఆలోచించి- ‘రాజా! నన్ను సుల్తాన్ దగ్గరకు పంపండి. నేను చూసుకుంటాను’ అన్నాడు.
అందుకు జయచంద్రుడు – గోపాల్ లో ” ఇది తమాషా కాదు తలలు పోతాయి.” . అని హెచ్చరించాడు. – అయినా ఫరావాల్లేదు పంపమని కోరాడు గోపాల్ – రాజు గోపాలను సుల్తాన్ దగ్గరకు పంపాడు.
గోపాల్ సుల్తాన్ వద్దకు వెళ్ళి వందనం చేసి, తానెవరో ఎందుకొచ్చాడో చెప్పాడు. మహాప్రభూ! ఇంతటి చిక్కు ప్రశలకు జవాబు చెప్పాలంటే – బోలెడంత ధనమూ, సమయమూ ఖర్చు అవుతుంది. అని చెప్పాడు. వెంటనే సుల్తాన్ తగినంత డబ్బు ఇచ్చి సంవత్సరం గడువు ఇచ్చి పంపాడు. తగిన జవాబులతో రాకపోతే కఠినశిక్ష తప్పదన్నాడు.
డబ్బుతో తన పట్టణానికి వచ్చిన గోపాల్ రాట్నాల వాళ్ళని పిలిచి చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు.
సంవత్సర కాలం పూర్తి కావచ్చింది. రాట్నం వాళ్ళు వడికిన దారం మొత్తం (16)
పదహారు బళ్ళకు ఎక్కించి – (25) పాతిక గొట్టెలను తీసుకుని సరిగ్గా గడువు. రోజున గోపాల్ సుల్తాన్ గారి ముందు ప్రత్యక్షమయ్యాడు.
ప్రభూ! ఈ ఎనిమిది బళ్ళ దారం – భూమి నిలువు కొలత – ఈ ఎనిమిది బళ్ళ దారం భూమి అడ్డకొలత – ఇహ ఈ పాతిక గొట్టెల వంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో! అవి నక్షత్రాలు. అని సుల్తాన్ గారి చిక్కు ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పాడు. ఆ జవాబులను సుల్తాన్ నవ్వుకొని గోపాల్ ని సన్మానించి పంపాడు. తిరిగి వచ్చి గోపాల్ తన రాజైన జయచంద్రకి జరిగినదంతా చెప్పాడు.
ఎంతటి అపాయమునైనా – ఉపాయంతో జయించవచ్చని నిరూపించాడు.
పదజాలం
అ) పాఠం చదవండి. పాఠంలోని గుణింతాక్షర పదాలను రాయండి.
ఉదా.
1. పొడుగు ________
_____________
జవాబు:
1. పొడుగు
2. ఆలోచన
3. రాజు
4. సమాధానాలు
5. ముఖాలు.
6. వేసిన
7. విదూషకుడు
8. ఉపాయంతో
9. విషయం
10. భూమినంతా
11. ఆకాశంలో
12. పాతిక
ఆ) పాఠం చదవండి. పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
1. వచ్చింది.
2. ఢిల్లీ
3. నిశ్శబ్దంగా
4. వాళ్ళు
5. చెప్పగలం
6. ఉన్న
7. పట్టణాలకు
8. సామంతుల్లో
9. చిక్కు
10. తప్పుడు
11. లెక్క
12. ఇక్కడికి
ఇ) పాఠం చదవండి. పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
1. ఆశ్చర్యం
2. నిశ్శబ్దం
3. ఆలస్యం
4. ప్రభూ
5. దర్బారు
6. పూర్తి
7. ఇస్తున్నాను
8. నక్షత్రాలు
9. ప్రశ్న
10. నిశ్చింత
11. సుల్తాను
12. కూర్చున్నారు
పదాలు – అర్థాలు
దర్బారు = రాజసభ
విదూషకుడు = హాస్యగాడు
సామంతులు = రాజుకింద ఉండే చిన్న రాజులు
ఈ మాసపు గేయం
చూడగంటి
రాగం: బృందావని
తాళం : ఖండ
పల్లవి : కంటి నఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||
చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజనవరత్న కాంచనవేదికలు గంటి
రహివహించిన గోపురంబులవె కంటి||
చ|| పావనంబైన పాప వినాశనము గంటి
కైవసంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి
కోవిదులు కొనియాడు కోనేరు గంటి |
చ|| పరమయోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి
తిరువేంకటాచలాధిపు చూడగంటి ||
కవి పరిచయం
కవి : తాళ్ళపాక అన్నమయ్య
కాలము : (9-5-1408 – 23-2-1503)
విశేషాలు : పద కవితా పితామహులు. 32వేల సంకీర్తనలను రాశారని ప్రతీతి. వెంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ఠ సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతుంటాయి.
విందు
ఈ మాసపు కథ విందు
ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్ళారు. వాళ్ల తల్లి నక్షత్రం, వాళ్లు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదరు చూడసాగింది.
సూర్యుడు, వాయువు అక్కడ విందులో వడ్డించినదల్లా కడుపునిండా మెక్కారు. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని సుష్టుగా బోంచేసారు. వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒకసారి కూడా గుర్తుకు రానేలేదు. కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచనే లేదు. అయితే చంద్రుడు మాత్రం తల్లిని మరచిపోలేదు. తన ముందుంచిన రుచికరమైన కొన్నింటిని తల్లికోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు. ఈ అని వాళ్లు విందు ముగించి ఇంటికి వెళ్లేసరికి అర్థరాత్రి దాటింది. అయినా తల్లి నక్షత్రం వాళ్లకోసం మేలుకునే ఉంది. బిడ్డలు ముగ్గురూ ఇంటికి రాగానే “ నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు?” అని అడిగింది ఆశగా.
అమ్మమాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పడుతూ “అయ్యో! నీకోసం నేనేమీ తేలేదమ్మా. వాళ్లు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా!” అన్నాడు. కొడుకు మాటలు విన్న చుక్క తల్లి గుండె కలుక్కుమంది. ఆమె వాయువు వైపు చూసింది. అతడు ఇలా సమాధానమిచ్చాడు. “నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా!” నేను సుష్టుగా భోంచేయడానికి వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు” ఆ తల్లి హృదయం మరింత గాయపడింది. ఆమే వీడేం చెబుతాడో చూద్దామనికొని చంద్రుని వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు. “అమ్మా! నువ్వొక పళ్ళెం తీసుకురా! నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము” చంద్రుడి మాటలు విన్న చుక్క తల్లి హృదయం నిండిపోయింది.
చుక్కతల్లి తర్వాత సూర్యుడివైపు తిరిగి ఇలా శపించింది. ” నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకురానందుకు నువ్వు సిగ్గుపడాలి. నువ్వు వట్టి స్వార్థపరుడవి. కనుక ప్రజలు నిన్నెప్పుడూ తిట్టుకుంటారు. నీ కిరణాల వేడి ప్రజలను బాధ పెట్టుగాక, నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవరూ చూడరుగాక చూడరు. నిన్ను చూడగానే నెత్తిమీద గుడ్డయినా వేసుకుంటారు లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు”.
తర్వాత చుక్క తల్లి వాయువువైపు చూస్తూ ఇలా శపించింది. “నువ్వు కూడా స్వార్థజీవివి. విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు. ఎండాకాలం నీ వడ సోకి ప్రజలు బాధపడతారు. సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధ పెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు. నిన్నెవ్వరూ అభిమానించరుగాక!”
చివరన చుక్కతల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది. “బిడ్డా, విందు తింటున్నప్పుడు కూడా నన్ను మరువలేదు. తల్లిపట్ల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన, అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా వుంటావు. నీ కిరణాలు ప్రజలకు హాయి, ఆనందం కలిగిస్తాయి. నిన్ను అందరూ ప్రశంసిస్తారు. నీ రాకకోసం ప్రజలు నిరీక్షిస్తారు. –
కవి పరిచయం
కవి : సోదుం రామ్మోహన్
కాలము : 2.03.1939 – 12.11.2008
విశేషాలు పత్రికా రచయిత, పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేసారు. రెండు దశాబ్దాల పాటు ‘విశాలాంధ్ర’లో ఒక దశాబ్దం పాటు ‘ఉదయం’లో పని చేసారు.