SCERT AP Board 7th Class Telugu Guide Answers 9th Lesson హితోక్తులు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 9th Lesson Questions and Answers హితోక్తులు
7th Class Telugu 9th Lesson హితోక్తులు Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రాన్ని గమనిస్తే మీకు ఏమి అర్థమయ్యింది?
జవాబు:
చిత్రంలో ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఉన్నారు. అది ఒక తరగతి గది. ఆదర్శవంతమైన తరగతి గది. విద్యార్థులు అల్లరి చేయకుండా క్రమశిక్షణతో కూర్చొన్నారు. ఉపాధ్యాయుడు చెప్పేది శ్రద్ధగా వినాలని కూర్చొన్నారు. విద్యార్థులందరూ ఏకరూప దుస్తులు ధరించారు. ఉపాధ్యాయుడు కూడా పాఠం చెప్పడానికి సిద్ధమౌతున్నాడు.
ప్రశ్న 2.
మీకు తెలిసిన మహనీయుల హితోక్తులు కొన్నింటిని చెప్పండి. వ్రాయండి)
జవాబు:
- ప్రార్థించే పెదవులకన్నా సేవించే చేతులు మిన్న – మథర్ థెరిస్సా
- చెడు వినవద్దు. చెడు కనవద్దు. చెడు మాట్లాడవద్దు – గాంధీజీ
- చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో – కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
- సత్యం పలుకు ధర్మంగా ప్రవర్తించు – ఉపనిషత్తు
- మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ – ఉపనిషత్తు
- మనిషికి మంచి మనసుండాలే కాని, నానా విధాల సంపదలూ వాటంతట అవే వస్తుంటాయి – తులసీదాసు
- తెలివైనవారు తమ మాటలతో విలువైన కాలాన్ని హరించరు. వాళ్లెప్పుడూ కాలాన్ని కాపాడటానికి మాటల పొదుపు పాటిస్తారు. – బ్రూస్ బర్టన్
- ఎంతటి కాళరాత్రిలోనైనా గంటకి అరవై నిమిషాలే. కనుక మనసు చతికిలబడకూడదు. – ఎడ్మండ్ బర్క్
- రేపటిది ఈ రోజు. ఈ రోజు చేయవలసినది ఇప్పుడే చేయాలి – కబీరు
- మనం ఓ మనిషి గురించి తెలుసుకోవాలంటే, అతను దూరంగా పెట్టే వ్యక్తులను గురించి తెలుసుకోవాలి. – జోసఫ్. పి. సాలక్
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
దివ్యాంగుల పట్ల ఎలాంటి మానవత్వం చూపాలి?
జవాబు:
దివ్యాంగులను హేళన చేయకూడదు. వారి బలహీనతలను చూసి నవ్వకూడదు. అనుకరించకూడదు. వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలి. కాళ్లు సరిగా లేక నడవడానికి ఇబ్బందిపడేవారికి చేయూత నివ్వాలి. అంధులకు దారి చూపాలి. ఈ విధంగా వారికి అడుగడుగునా సహాయం అందిస్తూ అండగా నిలబడాలి. ధైర్యం చెప్పాలి.
ప్రశ్న 2.
‘పంచతంత్ర కథలు’ ఎలాంటి నీతిని బోధించాయి?
జవాబు:
పంచతంత్ర కథలు చక్కటి నీతులను బోధించాయి. దీనిలో
1) మిత్రభేదం :
మిత్రులని విడదీయడం ద్వారా కావలసింది సాధించడం ఎలాగో ఈ కథలలో ఉంటుంది.
2) మిత్రలాభం :
మిత్రులని సంపాదించడం. దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఈ కథలలో ఉంటుంది.
3) కాకోలూకీయం :
కాకులు, గుడ్లగూబలు ప్రధాన పాత్రలుగా ఈ కథలు నడుస్తాయి.
4) లోభ ప్రణాశం :
ఈ కథలలో సంపదలను కోల్పోవడానికి రకరకాల పరిస్థితులు వివరించబడతాయి.
5) అసంప్రేక్ష్యకారిత్వం :
బుద్దిహీనతతో చెడు చేయాలని కోరడం, దాని పర్యవసానాలు ఉంటాయి.
పై వానిలో మొదటి నాలుగు భాగాలలో అంటే మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయం, లోభ ప్రణాశములలో జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా కథలు ఉంటాయి. 5వ దైన అసంప్రేక్ష్యకారిత్వంలో మాత్రం మానవులు ప్రధాన పాత్రలుగా కథలుంటాయి.
ఈ కథలన్నీ లోకజ్ఞానం కల్గించేవి. మానవుడు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాలంటే ఎలా ప్రవర్తించాలో వివరిస్తాయి. ఈ కథలు చదివితే కచ్చితంగా సమాజంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది.
ప్రశ్న 3.
మీకు తెలిసిన గొప్ప శతక కవుల పేర్లు కొన్ని చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
- పోతన – భాగవతము
- పక్కి అప్పల నరసయ్య – కుమార శతకం
- మారద వెంకయ్య – భాస్కర శతకం
- పోతులూరి వీరబ్రహ్మం – కాళికాంబ సప్తశతి
- గువ్వల చెన్నడు – గువ్వలచెన్న శతకం
- ఏనుగు లక్ష్మణకవి – సుభాషిత రత్నావళి
- చుక్కా కోటి వీరభద్రమ్మ – నగజా శతకం
- గద్దల శాంయూల్ – హితోక్తి శతకం
ప్రశ్న 4.
కింది అపరిచిత పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
తే॥ ఒక్క రోజీవు వీడుల సూడ్వకున్న
తేలిపోవును మా పట్టణాల సొగసు !
బయటపదునమ్మ ! బాబుల బ్రతుకులెల్ల
ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప.
ప్రశ్నలు – జవాబులు :
అ) ఈ పద్యం ఎవరి గురించి చెబుతోంది?
జవాబు:
ఈ పద్యం పారిశుద్ధ్య కార్మికుల గురించి చెబుతోంది.
ఆ) పట్టణాల అందానికి కారణం ఏమిటి?
జవాబు:
వీథులను శుభ్రంగా ఊడ్వడమే పట్టణాల అందానికి కారణం.
ఇ) పట్టణపు అందాన్ని చూసి గర్వపడేది ఎవరు?
జవాబు:
పట్టణపు అందాన్ని చూసి గర్వపడేది పరిపాలకులు.
ఈ) ‘నిముషం’ అనే అర్థాన్ని కలిగిన పదం ఏది?
జవాబు:
పై పద్యంలో ‘నిముషం’ అనే అర్థాన్ని కలిగిన పదం క్షణము.
వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి గురించి రాయండి.
జవాబు:
కవి పేరు : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
తల్లిదండ్రులు : అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు గార్లు
జననం : అనంతపురం జిల్లా, కంబదూరు మండలం, రాళ్లపల్లి గ్రామంలో 23. 1. 1893న జన్మించారు.
రచనలు :
సారస్వతాలోకము, అన్నమాచార్య కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం, నిగమశర్మ అక్క నాచన సోముని నవీన గుణములు, రాయలనాటి రసికత మొదలైనవి ప్రసిద్ధ రచనలు.
బిరుదులు :
గానకళాసింధు, సంగీత కళారత్న; కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి 1970లో ఫెలోషిప్, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
ప్రత్యేకతలు :
రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ’ పాట రచించారు. తండ్రి గారి వద్ద సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకొన్నారు. తల్లిగారు సంగీత గురువులు, ఆమె వద్ద సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కీర్తనలు, పాటలు నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు కూడా నేర్చుకొన్నారు.
ప్రశ్న 2.
మంచి వారితో స్నేహం ఎలాంటిది?
జవాబు:
మంచి వారితో స్నేహం రాతిమీద గీసిన గీత వంటిది. ఎప్పటికీ పోదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆ స్నేహం చెడిపోదు. ఎన్ని వివాదాలు వచ్చినా ఆ స్నేహం పాడవ్వదు.
ప్రశ్న 3.
లోభితనం పనికిరాదని కవి ఎందుకు అన్నాడు?
జవాబు:
లోభితనం అంటే అవసరమైనచోట కూడా ఖర్చు పెట్టకపోవడం. అవసరమైన ఖర్చులను మానేస్తే అనవసరమైన ఇబ్బందులు పడాలి. ఉదాహరణకు డబ్బులు ఖర్చైపోతాయని సరైన ఆహారం తినకపోతే పోషకాహార లోపం వలన అనేక అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యాలను మొదటే గుర్తించి, వైద్యుని వద్దకు వెళితే, తక్కువ ఖర్చుతో తగ్గుతాయి. డబ్బులు ఖర్చేతాయని వైద్యం చేయించుకోకపోతే ప్రాణం మీదకి వస్తుంది. అప్పుడు లక్షలు ఖర్చౌతాయి. అందుకే పెద్దలు ‘లోభికి ఖర్చెక్కువ’ అన్నారు. కాబట్టే కవిగారు లోభితనం పనికి రాదన్నారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని కవి ఎందుకు అభిప్రాయపడ్డాడు?
జవాబు:
రాహువు నోటిలో చిక్కినా చంద్రుడు అమృత కిరణాల్ని కురిపిస్తాడు. నిజానికి చంద్రునికి అది మరణావస్థ, అయినా అమృతాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఇతరులకు మంచి చేయాలి అనేది చంద్రుని పద్ధతి. తనకు మరణం వస్తున్నా తన మంచి పద్ధతిని తాను విడిచి పెట్టలేదు. అలాగే గొప్పవారు లోక క్షేమం కోసం తమ బాధల్ని లెక్క చేయరు. చిట్టచివరి క్షణం వరకూ ఇతరులకు ఉపకారాలు చేస్తూనే ఉంటారు. తమకు ప్రాణం పోయే స్థితిలో కూడా లోకక్షేమాన్నే కోరుకొంటారు. లోకం మేలు కోసమే తపిస్తారు. అది మంచివాళ్ల లక్షణం. అందుకే కవిగారు చంద్రుడి గురించి చెప్పారు.
ప్రశ్న 2.
మనిషికి ‘ఆత్మాభిమానం’ ఎందుకు ఉండాలి?
జవాబు:
మనిషికి ఆత్మాభిమానం చాలా అవసరం. ఆత్మాభిమానం అంటే తనపై తనకు గౌరవం. ఆత్మాభిమానం కలవారు ఎవరి దగ్గరా దేనికీ ఎప్పుడూ చేయి చాపరు. ప్రాధేయపడరు. తమ పనిని తాము చేసుకొంటారు. దేన్నైనా సాధిస్తారు. ఎంత కష్టాన్నైనా భరిస్తారు. కానీ, ఇతరులకు లోకువకారు. గౌరవంగా జీవిస్తారు. ఆత్మాభిమానం కలవారు మోసం చేయరు. అబద్దాలాడరు. ఎవరినీ నొప్పించరు. ఇతరులు బాధపడేలా ప్రవర్తించరు. ఉచితంగా దేనినీ ఆశించరు. ఎవరైనా ఇచ్చినా తీసుకోరు. అటువంటి ఆత్మాభిమానం కలవారి వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం సుసంపన్నం అవుతుంది.
భాషాంశాలు
అ) పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి.
గహ్వరము, కిరణములు, సజ్జనుడు, స్నేహము, సంపద, చివరి, కొంచెం, దారి
1. మైత్రి = స్నేహము
2. సిరి = సంపద
3. కరములు = కిరణములు
4. మంచివాడు = సజ్జనుడు
5. సుంత = కొంచెం
6. తెరువు = దారి
7. గుహ = గహ్వరము
8. అంత్య = చివరి
ఆ) కింది పదాలకు పర్యాయపదాలు పదవిజ్ఞానంలో వెతికి రాయండి.
1. స్నేహము = నేస్తం, మిత్రుడు
2. మనిషి = నరుడు, మానవుడు
3. పుడమి = భూమి, భువి
4. సంపద = ఐశ్వర్యం, ధనం
5. మూర్ఖుడు = అవివేకి, అజ్ఞాని
6. ధనం = డబ్బు, సిరి
7. యధార్థం = సత్యం, నిజం
వ్యాకరణాంశాలు
అ) కింది వాక్యాలను గమనించండి.
1. రామలక్ష్మణులు రాక్షసులఁజూసిరి.
2. రాజు రోజూ బడికి రాఁగలడని అనుకుంటున్నాను.
3. అర్జునుడు కర్ణుని ప్రాణముఁదీసెను.
4. ప్రవరుడు ఆకులఁబసరు పూసుకొని హిమాలయాలకు వెళ్ళాడు.
గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : రాక్షసులఁజూసిరి = రాక్షసులన్ + చూసిరి
1. రాఁగలడని = రాస్ + కలడు + అని
2. ప్రాణముఁదీసెను = ప్రాణమున్ + తీసెను
3. ఆకులఁబసరు = ఆకులన్ + పసరు
పై ఉదాహరణల్లో పూర్వపదం చివర ‘S’ అనే ద్రుతము ఉన్నది. పరపదంలో క-చ-ట-త-ప అనే పరుషాలు ఉన్నాయి. సంధి జరిగిన తరువాత క-గ, చ-జ, ట-డ, త-ద, ప-బ గా మారడాన్ని గమనించవచ్చు. ఇలా పరుషముల స్థానంలో సరళములు ఆదేశంగా వచ్చాయి. కావున ఇది సరళాదేశ సంధి అవుతుంది.
ఆపుడు : రాక్షసులన్ + జూచిరి
రాన్ + కలడని
ప్రాణమున్ + దీసెను
ఆకులన్ + బసరు – అని ఏర్పడ్డాయి కదా !
పైన వచ్చినవి ‘ఆదేశ సరళములు’ అని మీకు తెలుసు కదా ! అలా ఆదేశంగా వచ్చిన సరళాలకు ముందు ద్రుతము(న్) ఉంది కదా ! ఇప్పుడది బిందు, సంశ్లేషలుగా మారుతుంది. బిందువు రెండు రకాలు అవి.
1) అర్ధబిందువు (c), 2) పూర్ణ బిందువు (0) సంశ్లేష అంటే నకారపు పొల్లు (ద్రుతము) పక్కనున్న హల్లుతో కలిసి పోతుంది. ఈ 3 మార్పులు రాకుండా అలాగైనా ఉండిపోతుంది. క్రింద నిచ్చిన రూపాలను గమనించండి.
ఆ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా : చేయుచుండగ = చేయుచున్ + ఉండగా – ఉకార వికల్ప సంధి
1. గొన్ననేమి = కొన్నను + ఏమి – ఉత్వసంధి
2. వానికెపుడు = వానికి + ఎపుడు – ఇత్వసంధి
3. సజ్జనాళి = సజ్జన + ఆళి – సవర్ణదీర్ఘ సంధి
4. అళించుచూడ = అళించు + చూడ – గసడదవాదేశ సంధి
5. నోటనెట్లు = నోటను + ఎట్లు – ఉత్వసంధి
షష్ఠీ విభక్తి
ఇ) కింది పట్టికను గమనించండి. జతపరచండి.
పై పట్టికలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేయండి.
ఉదా : 1. సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి.
2. భీముని యొక్క భుజ బలము గొప్పది.
3. నా యొక్క పుస్తకములు ఎక్కడ ఉన్నాయని అంబేడ్కర్ అన్నాడు.
4. దశరథుని యొక్క కుమారులు నలుగురు.
5. రాజు యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
6. చంద్రుని యొక్క కాంతికి కలువలు వికసించాయి.
పై వాక్యాల్లో పదాల మధ్యన చేరిన ‘యొక్క’ అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలో పదాల మధ్య చేరే కిన్-కున్-యొక్క-లోన్-లోపలన్ అనే ప్రత్యయాలను షష్ఠీ విభక్తి అంటారు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ‘యొక్క’, జాతి, గుణాల గురించి తెలిపేటప్పుడు ‘లో-లోపల’, క్రియతో సంబంధాన్ని కలుగచేసేటప్పుడు ‘కి’ ప్రత్యయాలను ఉపయోగించాలి.
ఈ) కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి.
ఉదా : మానవ మానసము = మానవుని యొక్క మానసము
1. కోకిలశాబకము= కోకిల యొక్క శాబకము
2. కింకిణీ ధ్వనులు = కింకిణి యొక్క ధ్వనులు
3. సూర్యాత్మజ = సూర్యుని యొక్క ఆత్మజ
ప్రాజెక్టుపని
ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి రచనలు సేకరించండి. పరిశీలించండి.
జవాబు:
1941లో పెనుగొండలో జరిగిన రాయలసీమ మహాసభలలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు స్వయంగా రచించి, ఆలపించిన పెనుగొండ గేయం.
చనిన నాళుల తెలుగుకత్తులు
సానవెట్టిన బండ ఈ పెనుగొండ కొండ
రంధ్రముల ప్రవహించు శత్రుల
రక్తధారల త్రావిత్రేచిన
ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల కరితినీలపు దండ
ఈ పెనుగొండ కొండ.
వెరపు లెరుగని బిరుదు నడకల
విజయనగరపు రాచ కొడుకులు
పొరల బోయగ కరడు కట్టిన పచ్చినెత్తురు కొండ
ఈ పెనుగొండ కొండ.
తిరుమలేశుని కీర్తి తేనెలు,
బెరసిదించిన కాపు కవనపు నిరుపమ .
ద్రాక్షా రసంబులు నిండి తొలికెడు కుండ ఈ
పెనుగొండ కొండ……
ప్రశ్న 2.
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవుల చిత్రాలు సేకరించండి. వాటిని తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
సభాషితం
తే.గీ. || వెలది మాతా పితృ పరాయణులకు స్వర్గ
లోక గోలోకములు బ్రహ్మలోక మైన
గృచ్ఛములు గావు సూవె తర్పితుల వెంట
దల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి.
తాత్పర్యం :
సీతా ! తల్లిదండ్రుల్ని సేవించే బిడ్డలకు స్వర్గలోకం, గోలోకం, బ్రహ్మలోకం కూడా అందలేదనే బాధ ఉండదు. తల్లిదండ్రులను సేవించడం తోటే త్రిలోకాలు సాధ్యమవుతాయి.
ఉపాధ్యాయులకు సూచనలు
ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ స్వర పరచిన అన్నమయ్య సంకీర్తనలను సేకరించండి.
జవాబు:
1. పల్లవి : అలరులు గురియగ – నాడెనదే
అలకల గులుకుల – నలమేలు మంగ ||అలరు||
చరణము :
1. అరవిర సొబగుల – నతివలు మెచ్చగ
అరతెర మరుగున – నాడెనదే
వరుసగ పూర్వదు – వాళపు తిరుపుల
హరిఁగరగింపుచు – నలమేలు మంగ ||అలరు||
2. మట్టపు మలపుల – మట్టెల కెంపుల
తప్పెడి నడపుల – దాచెనదే
పెట్టిన వజ్రపు – పెండెపుదళుకులు
అట్టిటు చిమ్ముచు – నలమేలు మంగ ||అలరు||
3. చిందుల పాటల – శిరిపాటల యాటల
అందెల మ్రోతల – నాడెనదే
కందువ తిరువెం – కటపతి మెచ్చగ
అందపు తిరువుల – నలమేలు మంగ ||అలరు||
2. పల్లవి : ఆకటివేళల నలపైన వేళలను
వేకువ హరినామమే దిక్కు మతిలేదు ||ఆకటి||
చరణము :
1. కొఱమాలి ఉన్నవేళ కులము చెడిన వేళ
చెఱవడి వొనరులచేఁ జిక్కిన వేళ
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక
మఱచి తప్పినవైన మతిలేదు తెరగు ||ఆకటి||
2. ఆపద వచ్చిన వేళ యారడిఁ బడిన వేళ
పాపపు వేళ భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాకా బొరలిన మరిలేదు తెలుగు ||ఆకటి||
3. సంకెలఁ బెట్టిన వేళ చంపఁ బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గలిగాక
మంకు బుద్ది బొరలిన మరిలేదు తెరగు ||ఆకటి||
ప్రశ్న 2.
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ రాసిన వ్యాసాలు సేకరించండి.
కవి పరిచయం
కవి పేరు : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
తల్లిదండ్రులు : అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు గార్లు
జననం : అనంతపురం జిల్లా, కంబదూరు మండలం, రాళ్లపల్లి గ్రామంలో 23.1. 1893న జన్మించారు.
రచనలు :
సారస్వతాలోకము, అన్నమాచార్య కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం, నిగమశర్మ అక్క నాచన సోముని నవీన గుణములు, రాయలనాటి రసికత మొదలైనవి ప్రసిద్ధ రచనలు.
బిరుదులు :
గానకళా సింధు, సంగీత కళారత్న, కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి 1970లో ఫెలోషిప్, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
ప్రత్యేకతలు :
రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ పాట రచించారు. తండ్రి గారి వద్ద సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకొన్నారు. తల్లిగారు సంగీత గురువులు, ఆమె వద్ద సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కీర్తనలు, పాటలు నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు కూడా నేర్చుకొన్నారు.
పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు
1. ఆ.వె. నీటిమీది వ్రాత నిజము దుర్జనమైత్రి,
చేయుచుండఁగనె నశించుచుండు
అదియె సజ్జనాళియందుఁజల్పితి మేని
రాతగీచినట్టి గీత గాదె?
అర్థాలు :
దుర్జన మైత్రి = చెడ్డవారితో స్నేహం
నిజము = నిజంగా
నీటిమీది వ్రాత = నీటిమీద వ్రాసిన అక్షరాల వంటిది
చేయుచుండగనె = స్నేహం చేస్తుంటేనే
నశించుచుండు = నశించిపోతుంది
అదియే = ఆ స్నేహమే
సజ్జనాళియందున్ = మంచివారితో
సల్పితిమి + ఏని = చేసినట్లయితే
రాతిమీది = రాతిమీద
గీచినట్టి = గీసినటువంటి
గీతగాదె = గీత వలె (శాశ్వతంగా) ఉంటుంది
భావం :
చెడ్డవాడితో స్నేహం నీటిమీద వ్రాత వంటిది. ఆ స్నేహం చేస్తుంటేనే నీటి మీది వ్రాతలా నశిస్తుంది. అదే స్నేహాన్ని మంచివారితో చేస్తే ఱతిమీద గీతలాగా శాశ్వతంగా ఉంటుంది.
2. ఆ.వె. లోభివాని చేతిలో సిరి యెంతగా
వెలయుచున్న సుంత ఫలములేదు
తెరువు నడుచు వేళఁగఱకు వేసవి యెండ
మాడు వానికిఁ దననీడవోలె
అర్థాలు :
లోభివాని = ఖర్చు పెట్టనివాని
చేతిలో = చేతిలో ఉన్న
సిరి = డబ్బు (సంపద)
ఎంతగా = ఎంత ఎక్కువగా
వెలయుచున్న = ప్రకాశిస్తున్నా
తెరువు = మార్గంలో
నడుచువేళ = నడుస్తున్న సమయంలో
కఱకు = కఠినమైన, దట్టమైన
వేసవి ఎండ = వేసవికాలపు ఎండలో
మాడువానికి = మాడిపోతున్న వానికి
తన నీడవోలె = అతని నీడవలనే
సుంత = కొంచెం కూడా
ఫలములేదు = ప్రయోజనం లేదు
భావం :
దట్టమైన వేసవికాలపు ఎండలో ప్రయాణించే వాడికి తన నీడ వలన ప్రయోజనం లేనట్లే లోభి వాని చేతిలోని డబ్బు వలన కూడా ఏ ప్రయోజనం ఉండదు.
3. ఆ.వె. ఎంత యలుకగొన్న నేమి సత్పురుషుల
నోటనెట్లు చెడ్డమాట వెడలు
రాహువదన గహ్వరమున నున్నను జంద్రు మీది
కరములమృతరసమె కురియుఁగా గాదె !
అర్థాలు :
రాహు = రాహువు యొక్క
వదన = ముఖమునందలి
గహ్వరమున = గుహలో (నోటిలో)
ఉన్నను = చిక్కినా
చంద్రు = చంద్రుని యొక్క
కరములు = కిరణాలు
అమృతరసమె = అమృత వర్షాన్ని
కురియుగాన్ + కాదె = కురిపిస్తాయి కదా
అలాగే = అలాగే
ఎంత అలుకన్ + కొన్నన్ + ఏమి = ఎంత కోపం వచ్చినా
సత్పురుషులు = మంచివారి
నోటన్ = నోటి నుండి
ఎట్లు = ఏ విధంగా
చెడ్డమాట = చెడుమాట
వెడలు = వస్తుంది? (రాదు కదా !)
భావం :
రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు తన కిరణాలతో అమృతవర్షం కురిపించినట్లుగా గొప్పవారికి కోపం వచ్చినా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కాని, చెడ్డమాటలు రావు.
4. ఆ.వె. మానవంతుఁడై నవాని మనం బంత్య
దశలఁగూడ నున్నతంబె యగును
మునిగిపోవు వేళలను సూర్యకిరణముల్
మీఁది ప్రక్కఁగాదె మెఱయుచుండు !
అర్థాలు :
మానవంతుడైన = పౌరుషవంతుడైన
వాని = వాని యొక్క
అంత్యదశలన్ = చివరిదశలో
కూడ = కూడా
మనంబు = మనస్సు
ఉన్నతంబె = ఉన్నతంగానే
అగును = ఉంటుంది (ఎలాగంటే)
మునిగిపోవు వేళలను= అస్తమించే సమయంలో కూడా
సూర్యకిరణముల్ = సూర్యకిరణాలు
మీది= పైన,
ప్రక్కన్ = ప్రక్కలను
మెఱయుచుండు = కాంతులను వెదజల్లుతాయి
కాదె = కాదా !
భావం :
పౌరుషవంతుని చివరి దశలో కూడా అతని మనస్సు ఉన్నతంగానే ఉంటుంది. ఎలాగంటే అస్తమించే సూర్యుడు కూడా అన్ని వైపులకు తన కాంతులను వెదజల్లుతాడు కదా !