AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 7th Lesson శిల్పి Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 7th Lesson శిల్పి

7th Class Telugu 7th Lesson శిల్పి Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రాన్ని చూడండి. చిత్రంలోని వేటితో తయారయ్యాయి?
జవాబు:
పై చిత్రంలో పూలతీగలు చెక్కిన జాతిస్తంభం నిలబడియుంది. అలాగే బాతిపై చెక్కిన ‘నంది’ విగ్రహం ఉంది. చిత్రంలోనివి జాతితో తయారయ్యాయి.

ప్రశ్న 2.
ఈ చిత్రాలు ఏ కళకు సంబంధించినవి? దాన్ని గురించి మీకు తెలిసినది చెప్పండి.
జవాబు:
ఈ చిత్రాలు శిల్పకళకు సంబంధించినవి. శిల, లోహం, మట్టి మొదలైన పదార్థాలతో ప్రతిమలనూ, మందిరాలనూ నిర్మించే విద్య శిల్పకళ.

కళలు అరవైనాలుగు. అందులో

  1. కవిత్వం
  2. సంగీతం
  3. చిత్రలేఖనం
  4. శిల్పం
  5. నాట్యం -అన్నవి లలితకళలు.

శిల్పకళలో మన తెలుగువారు ప్రసిద్ధి పొందారు. అమరావతి, అజంతా, లేపాక్షి, హంపిలో ఏకశిలా రథం, – మహాబలిపురంలో శిల్పాలు ఆంధ్రుల శిల్పకళా వైభవాన్ని చాటి చెపుతాయి.

గమనిక :
పై చిత్రంలో నంది విగ్రహం, లేపాక్షిలోని బసవన్న విగ్రహం.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

ప్రశ్న 3.
శిల్పాలను తయారు చేసేవారిని ఏమంటారు? వారిని గురించి మీకు తెలిసింది చెప్పండి.
జవాబు:
శిల్పాలను తయారు చేసేవారిని ‘శిల్పులు’ అంటారు. శిల్పులలో ‘అమరశిల్పి జక్కన’ సుప్రసిద్ధుడు. హలీబేడులో ఆయన చెక్కిన హోయసలేశ్వర దేవాలయం ఉంది. అక్కడి శిల్పం అద్భుతం. హంపి-విజయనగరంలోని శిల్పాలు చాలా ప్రసిద్ధము. జాషువ కవి ఈ పద్యాలను హంపీలోని శిల్పాలను చూచి, ఆ ప్రభావంతో శిల్పిని మెచ్చుకుంటూ రాశాడట.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలో ఉండే పద్యాలనూ రాగయుక్తంగానూ, భావయుక్తంగానూ పాడండి.
జవాబు:
సాధన చేయండి. పద్యాలను చక్కగా చదవడంలో మీ గురువుల సాయం తీసుకోండి.

ప్రశ్న 2.
‘కవి, శిల్పిని శాశ్వతుడనీ, ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయమని చెప్పాడు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
‘శిల్పి’ శాశ్వతుడు. అనగా చిరంజీవి. అంటే చాలాకాలం అంటే అతడు చెక్కిన శిల్పాలు ఉన్నంతకాలం, ప్రజలు అతడిని గుర్తు చేసుకుంటారు. ఆతని శిల్పకళా చాతుర్యానికి మెచ్చుకొని జోహార్లు సమర్పిస్తారు. అందువల్ల శిల్పి ‘శాశ్వతుడు’. గొప్ప శిల్పాన్ని చెక్కిన శిల్పికి మనము ఈయగలిగిన కానుక మరొకటి ఏమీ ఉండదు. తలవంచి మనం ఆయన శిల్పకళా ప్రొఢికి నమస్కారం చేయడమే. శిల్పి యొక్క శిల్పకళను మెచ్చుకొని ఆయనకు జోహార్లు సమర్పించడమే మనం చేయాలి.

ప్రశ్న 3.
శిల్పి రాతిని శిల్పంగా మార్చడంలో పడే శ్రమను గూర్చి మీరేమనుకుంటున్నారు?
జవాబు:
‘శిల్పి’ ముందు శిల్పాన్ని చెక్కడానికి తగినరాయిని ఎంచుకోవాలి. ఆ రాయి మెత్తగా శిల్పి ,ఉలి నాటడానికి అనుకూలంగా ఉండాలి. ఆ శిలను ఎంతో జాగ్రత్తగా చెక్కాలి. బొమ్మ అంతా చెక్కాక ఏ ముఖమో చెక్కేటప్పుడు, ఏ ముక్కుకో దెబ్బతగిలితే మొత్తం ఆ శిల్పం అంతా పాడవుతుంది. మళ్ళీ మొదటి నుంచి చెక్కాలి – రాతిని అతికించడానికి వీలుకాదు కదా ! కాబట్టి ‘శిల్పి’ నిజంగా గొప్ప. ప్రజ్ఞాశాలి అని నేను అనుకుంటున్నాను.

II. చదవడం – రాయడం

1. కింది పద్యపాదాలు పాఠంలోని ఏ ఏ పద్యాలలో ఉన్నాయి. వాటి సందర్భమేమిటి?

అ) బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు.
జవాబు:
ఈ పద్యపాదం “సున్నితంబైన నీ చేతి సుత్తెనుండి’ అనే రెండో పద్యంలో ఉంది. శిల్పి తన సుత్తితో బండరాళ్ళను చెక్కగా, ఆ రాళ్ళు, దేవుళ్ళుగా మారి అవి పుణ్యక్షేత్రాలయి, ఆ విగ్రహాలు పసుపు కుంకుమలతో పూజింపబడ్డాయని కవి జాషువ చెప్పిన సందర్భంలోనిది.

ఆ) తారతమ్యంబు లే దబద్దంబు గాదు.
జవాబు:
ఈ పద్యపాదం ‘ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత’ అనే నాలుగవ పద్యంలోనిది. ‘కవిత్వంలో చిత్రాలు కూర్చే కవికీ, శిల్పికీ తేడాలేదు. కవికీ శిల్పికీ తేడా లేదు అనే మాట అబద్ధంగాదు’ అని కవి జాషువ – చెప్పిన సందర్భంలోనిది.

ఇ) బాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
జవాబు:
ఈ పద్యపాదం, ‘జాల నిద్రించు ప్రతిమల మేలుకొల్పి’ అనే ఐదవ పద్యంలోనిది. శిల్పి రాళ్ళలో నిద్రించే శిల్పాలను లేపి ఉలిని తగిలించి బయటికి పిలుస్తాడనీ, శిల్పి శాశ్వతుడనీ కవి జాషువ చెప్పిన సందర్భంలోనిది.

ఈ) జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో గల
జవాబు:
ఈ పద్యపాదం ‘తెలిజాతి జాలువార’ అనే ఎనిమిదవ పద్యంలోనిది. శిల్పి తెల్లని రాతిపై అప్సరస స్త్రీని చెక్కి, దాని ప్రక్క తన్ను తాను దిద్దుకొని సంతోషిస్తాడు. శిల్పి జగత్తులో అతడు చిరంజీవత్వమును కల్పించుకుంటాడు – అని, కవి జాషువ శిల్పిని గూర్చి చెప్పిన సందర్భంలోనిది.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. కవికి-శిల్పికి మధ్య పోలికలున్న పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏ ఏ పద్యాలలో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి.
జవాబు:
కవికి – శిల్పికి మధ్య పోలికలు ఉన్నాయి అని చెప్పే పద్యాలు ఇవి.
1) “కవికలంబున గల యలంకార రచన –
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున” – అనే మూడవ పద్యం మొదటిది.

2) కవనమున చిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్దంబు గాదు” – అనే నాలుగవ పద్యం రెండవది.

3. కింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలు రాయండి.

“జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించేవాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను జానపద కళలు అంటారు. యక్షగానం, వీధి నాటకం, వీరభద్రవిన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ వంటివి కొన్ని జానపద కళారూపాలు. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉంది.

చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకొనే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గానకళ సంగీతం. మనలను కదలకుండా అనేక భావాలను మనసుకు అందించే కళ ‘శిల్పకళ’. రాగ, తాళ, లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా, మాటల వెనుక మరుగుపరచి, మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.

ప్రశ్నలు రాయండి.
1) ‘జానపద కళలు’ అని వేటిని పిలుస్తారు?
2) కొన్ని ఆనపద కళారూపాలను పేర్కొనండి.
3) లలిత కళలు ఏవి?
4) చిత్రలేఖనం అంటే ఏమిటి?
5) సంగీతం అంటే ఏమిటి?
6) ‘శిల్పకళ’ అంటే ఏమిటి?
7) ‘నృత్యకళ’ అంటే ఏమిటి?
8) ‘కవిత్వం’ లక్షణం పేర్కొనండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

4. కింది ప్రశ్నలకు పాఠం చదివి జవాబులు రాయండి.

అ) కవికి – శిల్పికి గల పోలికలు ఏమిటి?
(లేదా)
కవితలు అల్లే కవికి, శిలను చెక్కే శిల్పికి పోలికలను తెల్పండి.
జవాబు:
కవి కలములో అలంకార రచన ఉంటుంది. అటువంటి అలంకార రచన శిల్పి ఉలిలో కూడ ఉంటుంది. ఆ . అందువల్లనే శిల్పి, రాతిస్తంభాలపై పూలగుత్తులు చెక్కుతాడు.

శిల్పి బొమ్మలు చెక్కి ఒక రాజు కథను చూపరులచే చెప్పించగలడు. కవిత్వంలో చిత్రాలు కూర్చే కవికీ, శిల్పికీ నిజంగా తేడా లేదు. కవిత్వం ద్వారా కవి రాజు కథ రాయగలడు. శిల్పి తన శిల్పం ద్వారా రాళ్ళపై రాజుకథ చెక్కగలడు.

ఆ) శిల్పిని గురించి “నిశ్చయముగా చిరంజీవి” అని కవి ఎందుకన్నాడు?
జవాబు:
శిల్పి రాళ్ళల్లో నిద్రపోతున్న బొమ్మలకు, తన ఉలిని తాకించి, వాటిని మేల్కొలిపి, బయటకు పిలుస్తాడు. ఆ బొమ్మలు బయటకు వచ్చి శిల్పి పేరును శాశ్వతంగా నిలుపుతాయి. అందువల్ల శిల్పి నిశ్చయంగా చిరంజీవి అని కవి అన్నాడు.

ఇ) “సుత్తి నుండి మొలచునవి” అని కవి వేటిని ఉద్దేశించి చెప్పాడు?
జవాబు:
కేవలం బండరాళ్ళ యందు, జీవకళను నిలుపగల శిల్పి సుత్తె నుండి మానవవిగ్రహాలు మొలుస్తాయని కవి చెప్పాడు. శిల్పి సుత్తి దెబ్బలతో ఎన్నో దేవాలయాలు బయటపడతాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు మీ సొంతమాటల్లో జవాబులు రాయండి.

అ) శిల్పి రాళ్ళలో ఏ ఏ రూపాలను చూసి ఉంటాడు?
జవాబు:
శిల్పి రాళ్ళలో దేవతామూర్తులను చూసి ఉంటాడు. అందమైన రాతిస్తంభాలపై పూలగుత్తులను చూసి ఉంటాడు. దేవాలయాలను చూసి ఉంటాడు. ఏనుగునూ, గున్నఏనుగులనూ చూసి ఉంటాడు. అజంతా చిత్రాలను చూసి ఉంటాడు. అప్సరస స్త్రీలను చూసి ఉంటాడు. భయంకర సింహాల తలలను చూసి ఉంటాడు.

ఆ) నల్లని రాళ్ళకు శిల్పిమీద కృతజ్ఞత ఎందుకుండాలి?
జవాబు:
నల్లని రాళ్ళు కొండలమీదనే పడి ఉంటే, అవి బండరాళ్ళగానే మిగిలిపోయేవి. కాని శిల్పి చేతిలో పడి అవి దేవతా మూర్తులయ్యాయి, దేవాలయాలయ్యాయి. అవి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి నల్లని రాళ్ళు, శిల్పి మీద కృతజ్ఞత చూపాలి.

ఇ) శిలకూ, శిల్పానికీ ఉండే భేదం ఏమిటి?
జవాబు:
కొండలపై ఉన్న రాయిని ‘శిల’ అంటారు. అదే శిలను శిల్పి తన సుత్తితో అందమైన బొమ్మగా చెక్కితే అది శిల్పం అవుతుంది.

ఈ) కవికీ, చిత్రకారుడికీ ఉండే పోలికలు, భేదాలు ఏమిటి?
జవాబు:
కవి కవిత్వంలో మాటలతో చిత్రా’ . గీస్తాడు. కవి వర్ణనలతో ఎంతటి విషయాన్నైనా పాఠకుల మనస్సుల “ముందు నిలిచేటట్లు చిత్రాలను నిర్మిస్తాడు. కాగా చిత్రకారుడు కాగితం పైననో, కాన్వాసుపైనో రంగులతో చిత్రాలు గీస్తాడు. కవి గీసే చిత్రాలకు కవి మనస్సే హద్దు. దానికి ఎల్లలు లేవు. కాని చిత్రకారుడు గీసే చిత్రానికి, కొన్ని పరిమితులు ఉంటాయి.

ఉ) చూసే వాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవని కవి అంటున్నాడు. కవి ఎందుకు అలా అన్నారు?
జవాబు:
ఒక మహారాజు చరిత్రను శిల్పాలుగా చెక్కితే, వాటిని చూసేవారికి ఆ మహారాజు చరిత్ర తెలుస్తుంది. ఆ శిల్పాలను చూచి ఆ రాజు చరిత్రను తెలుసుకోవచ్చు. ఆ శిల్పాలు ఆ రాజుల కథలను కళ్ళకు కట్టిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయ రాజులు వంటివారి శిల్పాలు చూపరులకు వారి చరిత్రలను నేటికీ గుర్తుకు తెస్తాయి. అందువల్ల చూసేవారికి, శిల్పాలు రాజుల కథలను చెప్పగలవని కవి చెప్పాడు.

ఊ) “కవి” ఈ గేయంలో ఒకచోట శిల్పి దారిద్ర్యాన్ని చూసి, తెలుగుదేశం కంట తడిపెడుతుందని అన్నాడు కదా ! దీన్ని గురించి మీ అభిప్రాయం. ఏమిటి?
జవాబు:
గొప్పగా శిల్పాలు చెక్కిన అమరశిల్పి జక్కన వంటి శిల్పుల శిల్పాలు, నేటికీ అద్భుతంగా ఉండి, అవి నిజమైన మూర్తులే అనే భ్రాంతిని కల్గిస్తాయి. అంతటి శిల్పం సృష్టించిన శిల్పులు మాత్రం నేడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. వారిని పోషించి సంపదలు ఇచ్చే రాజులు నేడు లేరు. అందువల్ల శిల్పుల దరిద్రాన్ని చూచి తెలుగుదేశం ‘అంటే తెలుగు ప్రజలు కన్నీరు కారుస్తున్నారని కవి చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ)మన రాష్ట్రంలోని శిల్పకళా సంపదను గూర్చి వ్యాసం రాయండి.
(ఆంధ్రరాష్ట్రం – శిల్ప సంపద)
జవాబు:
రాయి, లోహం, కట్ట, మట్టి మొదలయిన వాటితో దేవతా విగ్రహాలనూ, మందిరాలనూ నిర్మించే విద్య శిల్పకళ.

“కృష్ణాతీరంలో అమరావతిలో శాతవాహనుల నాటి అందమైన శిల్పాలు ఉన్నాయి. శిల్పుల చేతిలో బండరాళ్ళు వెన్నముద్దల్లా కరిగి, కావలసిన రూపం ధరిస్తాయి. అమరావతిలో, హంపిలో, అజంతా గుహల్లో, తెలుగు శిల్పుల ఉలి దెబ్బలచే రాళ్ళు, పూర్ణకుంభాలుగా, పద్మశాలలుగా, ధర్మచక్రాలుగా రూపం ధరించాయి. ఎల్లోరాలోని కైలాస దేవాలయం, శిల్పుల గొప్పతనానికి నిదర్శనం. అక్కడి విగ్రహాలు, దేవాలయాలు, ప్రాకారాలు, … ధ్వజస్తంభాలు, అన్నీ ఒకే రాతిలో చెక్కారు.

మన శిల్ప. విద్యలో స్తంభాల నిర్మాణం గొప్పది. హంపి విఠలాలయంలోనూ, మధుర మీనాక్షి దేవాలయంలోనూ సప్తస్వరాలు పలికే రాతిస్తంభాలు నిర్మించారు. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మన కాకతీయ చక్రవర్తుల పాలనలో శిల్పకళ పొందిన వైభవాన్ని తెలుపుతుంది.

మైసూరు, హనుమకొండ, లేపాక్షి దేవాలయాల్లోని నంది విగ్రహాలు అందాలు చిందిస్తూ ఉంటాయి. ఆ నంది విగ్రహాలు, ప్రాణాలతో కూర్చున్న పెద్ద ఎద్దులవలె ఉంటాయి. దానిని చూసి ‘లేపాక్షి బసవన్న లేచి రావన్న’ అంటూ అడవి బాపిరాజు గారు గీతం రాశారు.

ఆ) శిల్పి గొప్పదనాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
రాళ్ళలో నిదురపోతున్న బొమ్మలకు ప్రాణం పోసే శిల్పి గొప్పదనాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
శిల్పి గొప్పవాడని నిరూపిస్తూ సవివరంగా రాయండి.
జవాబు:
శిల్పి చిరంజీవి. అతడు ,చెక్కిన శిల్పాలు జీవకళతో నేటికీ నిల్చియున్నాయి. అతడు సింహాల శిల్పాలను చెక్కితే, అవి నిజమైన సింహాలేమో అనే భ్రాంతిని కల్గిస్తాయి. పూర్వం మహారాజులు శిల్పకళను పోషించారు. ఎన్నో దేవాలయాలు కట్టించేవారు. అందువల్ల శిల్పులకు ఆనాడు దారిద్ర్యము లేదు. ఈ శిల్ప విద్యలో ఒక్కొక్క రాజు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు.

హోయసలరాజులు ‘హలీబేడ్’లో అందమైన శిల్పాలు చెక్కించారు. అక్కడే ‘జక్కన’ శిల్పాలున్నాయి. కోణార్క శిల్పాలు గాంగరాజులవి. ఓరుగల్లులో శిల్పం కాకతీయ రాజులది. ఈ ‘శిల్ప విద్య నేర్చుకొనే కళాశాలలు నేడు స్థాపించాలి. ప్రభుత్వం శిల్ప విద్యకు ప్రోత్సాహం. ఇవ్వాలి. శిల్పారామాలు నిర్మించాలి. పూర్వం శిల్పులు చెక్కిన శిల్పాలను రక్షించాలి. లేపాక్షిలోని బసవన్న వంటి విగ్రహ శిల్పులు ఇక పుట్టరని నా నమ్మకం.

IV. పదజాలం

1. కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను మరో సందర్భంలో ఉపయోగించి రాయండి.

అ) మాలో కొత్త ఆశలు చిగురించాయి.
జవాబు:
వసంత ఋతువురాగానే, పూలమొక్కలన్నీ చిగురించాయి.

ఆ) శిల్ప కళ ఎన్నటిక ఆరిపోయేది కాదు.
జవాబు:
బీదల కడుపుమంట ఎప్పటికీ ఆరిపోయేది కాదు.

ఇ) ఆ సంగతి నాకు తెలియదు.
జవాబు:
నా మిత్రుడు పాట పాడతాడన్న సంగతి నాకు తెలియదు.

ఈ)ఆయన కీర్తి పదికాలాలపాటు నిలిచి ఉంటుంది.
జవాబు:
వాల్మీకి రామాయణము ఆదికావ్యంగా కీర్తికెక్కింది.

ఉ) ఆయనది రాతిగుండె కాదు.
జవాబు:
ఔరంగజేబు రాతిగుండె సుల్తాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. కింది వాక్యాలు మీ పాఠంలోవే. వీటిలో గీత గీసిన పదాల అర్థాన్ని తెలుసుకొని వాక్యాలను తిరిగి రాయండి.

అ) భయద సింహముల తలలు
జవాబు:
భయంకరమైన సింహాల తలలు

ఆ) వసుధ గన్పట్టు పర్వతములందు
జవాబు:
భూమిపై కనబడే పర్వతములలో

ఇ) శాశ్వతుడవోయి నిశ్చయముగాను
జవాబు:
నిర్ణయంగా నీవు చిరంజీవివి.

ఈ) తెనుంగుదేశము నిన్ను వంటి పనివానిం జూచి యుప్పొంగుచుండును.
జవాబు:
నీ వంటి పనిమంతుణ్ణి చూసి ఆంధ్రదేశం ఉప్పొంగుతుంది.

ఉ) నీ సుత్తెలో మొలుచున్మానప, విగ్రహంబు
జవాబు:
నీ సుత్తె నుండి మనుష్యరూపాలు పుడతాయి.

3. కింది పదాలు చదివి, వాటికి సరిపడే అర్థం వచ్చే పదాన్ని ఉపయోగించి, మీ మాటలతో వాక్యాలు రాయండి.
ఉదా : చూసేవారు = చూపరులు
(అక్కడి శిల్ప కళాఖండాలు చూపరులను ఆకట్టుకున్నాయి.)

అ) దేవాలయాలు = దేవ స్థలములు.
మన ఆంధ్రదేశంలో ఎన్నో దేవస్థలములు ఉన్నా, తిరుపతిని మించినది లేదు.

ఆ) గుహలశ్రేణి = గహ్వరశ్రేణి.
హిమాలయాల గహ్వరశ్రేణి మంచుతో నిండియుంటుంది.

ఇ) ఏడవడం = కంటతడి పెట్టడం.
గాంధీజీ మరణవార్త విని అఖిలభారతం కంటతడి పెట్టింది.

ఈ) ఎప్పుడూ ఉండేవాడు = శాశ్వతుడు.
“నన్నయ తెలుగుపద్య కవులలో శాశ్వతుడు.

4. కింది వాక్యాలలో ఉన్న ప్రకృతి, వికృతులను గుర్తించండి. వాటిని ఉపయోగిస్తూ మరో వాక్యాన్ని రాయండి.

అ) సింగం బావిలో తన మొహాన్ని చూసి అది మరో సింహం ముఖమని అనుకుంది.
జవాబు:
సింహం అడవిలో ఓ పులి ముఖాన్ని చూసి, అది మరో సింగం మొహమని భ్రాంతి పడింది.

ఆ) కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాకూడదు.
జవాబు:
మధురలో రాతి కంబములు, సంగీత స్తంభములుగా మారాయి.

ఇ) నిద్ర మనకు అవసరమే కాని, మనమే నిద్దుర మొహాలం కాగూడదు.
జవాబు:
పగలు నిద్ర మంచిది కాదు కాని, రాత్రి నిద్దుర అత్యవసరం.

ఈ) పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనను నిలుపుతుంది.
జవాబు:
పుణ్యం కోసం మొగుణ్ణి ఉపవాసాలతో మాడ్చడం పున్నెం కాదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

5. సూచనల ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గళ్ళు నింపండి. (గళ్ళనుడికట్టు)

ఆధారాలు :
AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి 2

అడ్డం :

  1. శిల్పాలు చూపరుల చేత ఇలా చేయించగలవు.
  2. కవి చేతిలోనిది.
  3. దేవళంలో ‘ళం’ తీసేస్తే.
  4. మూడో పద్యం రెండో పాదంలో మొదటి పదం చివరి అక్షరం లోపించింది.
  5. శిల్పంగా మారేది.
  6. శిల్పి ప్రజ్ఞకు ………….

నిలువు :

  1. ఈ పదం భూమికి మరో అర్థం.
  2. కవిత్వం చెప్పడాన్ని ఇలా అంటారు.
  3. రాతికి మరోపదం తలకిందులైంది.
  4. చివరిపద్యం చివరి పాదంలోని మొదటి పదంలోని మొదటి అక్షరం మారింది.
  5. శిలను’ శిల్పంగా మలిచేవాడు.
  6. బొమ్మలు’ అని అర్థమున్న పదంలో మొదటి అక్షరం లోపించింది.

జవాబు:
AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి 3

6. అ) కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

1) నేను ఐ.ఎ.యలో ఉత్తీర్ణుడనయినందున, నా జీవితం సార్థకమయ్యింది.
2) కొండలు మీద అన్నీ పాషాణాలే ఉంటాయి.
3) చెరువు మధ్య కంబమును పాతారు.
4) శిల్పి ప్రతిమలను చెక్కుతాడు.
5) నన్నయగారి కవనము ఆంధ్ర కవిత్వానికి నాంది.
6) కొండలలోని గహ్వరములలో కంఠీరములు ఉన్నాయి.
7) ఊర్వశి అచ్చరలలో శ్రేష్ఠురాలు.
8) నా మిత్రుని శిరోగ్రముపై టోపీ ఉంది.
జవాబు:
1) ప్రయోజనం కలది
2) బండరాళ్ళు
3) స్తంభము
4) బొమ్మ
5) కవిత్వము
6) గుహ, సింహము
7) అప్సరస
8) తలపైన

ఆ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) సార్థకము :
మంచి ర్యాంకు సాధించడంతో, నా జీవితం సార్థకమయ్యింది.

2) పసుపు కుంకాలు :
అమ్మవారిని పసుపుకుంకాలతో పూజించాలి.

3) వల్లెవేయించు :
గురువుగారు వేదమంత్రాలను శిష్యులచే వల్లె వేయించారు.

4) మేలుకొలుపు :
ఉదయము వేంకటేశ్వరునికి మేలుకొలుపులు పాడాలి.

5) చిందిపడు :
నా మిత్రుని ముఖములో ఆనందము చిందిపడుతూ ఉంది.

6) ఉప్పొంగు :
గాలివానకు సముద్రము ఉప్పొంగుతుంది.

7) కంటఁతడిపెట్టు :
గాంధీ మరణవార్త విని, దేశ ప్రజలు కంటఁతడి పెట్టారు.

8) పేరునిలుపు :
నా కుమారుడు మా వంశం పేరు నిలుపగలడు.

ఇ) కింది పదాలకు వ్యతిరేకపదాలు రాసి, వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి.

1) అబద్దంబు × నిజము
నేను ఎప్పుడూ నిజమే మాట్లాడతాను.

2) మేలుకొలుపు × నిద్రపుచ్చు
మా అమ్మ మా తమ్ముణ్ణి నిద్రపుచ్చుతోంది.

3) శాశ్వతుడు × అశాశ్వతుడు.
జీవితము అశాశ్వతమని గ్రహించాలి.

4) సంతోషించు × ఏడ్చు
భయంకర దృశ్యాలు చూసి. నా మిత్రుడు ఏడుస్తాడు.

మఱికొన్ని వ్యతిరేక పదాలు :
కలదు × లేదు
మహాపుణ్యండు × మహాపాపాత్ముడు
నిద్రించు × మేల్కొను
ముగ్ధ × ప్రౌఢ
నిశ్చయము × అనిశ్చయము :
కలిమి × లేమి

ఈ) ఈ కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.

1. రమ లక్ష్మి ……………… ఆడుకుంటోంది. .
2. ఎండ ………………. దాహమేస్తోంది.
3. చలి ……………… వణకుపుడుతోంది.
4. రవి ……………… అమ్మ మిఠాయి తెచ్చింది.
జవాబు:
1) తో
2) కి
3) వల్ల
4) కొఱకు

V. సృజనాత్మకత

* శిల్పి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా ప్రదర్శించండి.
జవాబు:
నేను మీకు తెలుసా ! నేను రాళ్ళను బొమ్మలుగా చెక్కే శిల్పిని. నేను రాళ్ళను దేవుడి బొమ్మలుగా చెక్కితే, మీరు వాటిని పసుపు కుంకాలతో పూజిస్తున్నారు. పూర్వం మహారాజులు మాకు ఎంతో డబ్బు ఇచ్చి దేవాలయాల్లో శిల్పాలు చెక్కించేవారు. మీరు మేము చెక్కిన నంది విగ్రహాలూ, నాట్య ప్రతిమలూ లొట్టలు వేసుకుంటూ చూస్తారు. ఆ చూసినంతసేపూ ఓహో, ఆహా అని అంటారు. కానీ మీలో ఏ ఒక్కరూ నన్ను పోషించరు. మరి నన్ను ఎవరు చూస్తారు? దేవుడు బొమ్మలు చెక్కే నాకు, ఇంక దేవుడే దిక్కు. నేను సంగీతం వచ్చే స్తంభాలు చెక్కాను. అందమైన స్త్రీమూర్తులను చెక్కాను. నా శిల్పాన్ని పోషించిన రాజులను మీరు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నారు. కాని నా . శిల్పాలు శాశ్వతంగా నిలుస్తాయి.

VI. ప్రశంసలు

1) శిల్పాలు చెక్కడంలాగా చిత్రాలు గీయడం, పాటలు పాడడం, నాట్యం చేయడం, సంగీతం పాడడం వంటివి కూడా కళలే. వీటిలో నైపుణ్యమున్నవాళ్ళు మీ పాఠశాలలో ఎవరెవరున్నారు? వాళ్ళను గురించి చెప్పండి.
(లేదా )
మీ గ్రామం/ప్రాంతంలోని కళలను గురించి, కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ గొప్పదనాన్ని గురించి వివరించండి.
జవాబు:
విద్యార్థికృత్యం

VII. ప్రాజెక్టు పని

* శిల్పం, సంగీతం ………. ఇలాంటి వాటికి సంబంధించిన అదనపు సమాచారం లేదా చిత్రాలు సేకరించండి. వాటిని గురించి రాసి గోడపత్రికలో ప్రదర్శించండి.
జవాబు:
కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేవి లలితకళలు :

ఎ) ప్రపంచ ప్రసిద్ధుడైన చిత్రలేఖన కళాకారుల వివరాలు :
1) వడ్డాది పాపయ్య :
ఆంధ్రదేశంలో శ్రీకాకుళంలో 1921లో పుట్టాడు. ఈయన భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు. ఈయన తొలి గురువు తండ్రి. తరువాత గురువు రవివర్మ. చందమామ, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో చిత్రాలు గీశారు. ఈయన చిత్రాలలో తెలుగుదనం, తెలుగు సంస్కృతి ఆచారవ్యవహారాలు, పండుగలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

2) లియోనార్డో డావిన్సి :
ఈయన ఇటలీ దేశస్థుడు. ఈయన ‘మొనాలిసా’ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని ఎవరు – చూసినా మంత్ర ముగ్ధులవుతారు. ఇప్పుడు ఈ చిత్రం పారిస్ నగరంలో ‘టావ్’ అనే వస్తు ప్రదర్శనశాలలో ఉంది.

3) పాబ్లో పికాసో (1881 – 1973) :
పికాసో 20వ శతాబ్దిలోని. చిత్ర కళాకారులలో మిక్కిలి’ ప్రసిద్ధుడు. 1901లో ఈయన చిత్రించిన “తల్లి ప్రేమ (మాతా, శిశువు” చిత్రం అద్భుత కళాఖండం. తన బుగ్గను శిశువు తలకు ఆనించి, కళ్ళు మూసి తన్మయత చెందుతున్న తల్లి చిత్రం ఇది.

4) రాజా రవివర్మ :
దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులకు ఇచ్చాడు. గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను తన చిత్రకళ ద్వారా ఇళ్ళకు తెచ్చిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. రవివర్మ చిత్రించిన దేవుళ్ళ బొమ్మలు ప్రసిద్ధి పొందాయి. ఈయన చిత్రించిన కావ్యస్త్రీలందరిలో దమయంతి గొప్ప అందాల రాశి.

బి) సంగీతం :
మన తెలుగుదేశంలో వెలసిన ప్రసిద్ధ సంగీత విద్వాంసులను గూర్చి తెలుసుకుందాం.
1) కాకర్ల త్యాగరాజు (1798 – 1883) :
ఈయన సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. నాదబ్రహ్మ, గాన చక్రవర్తి. గొప్ప రామభక్తుడు తంజావూరు జిల్లాలోని తిరువారూరులో జన్మించాడు. ఎన్నో కీర్తనలు తెలుగులో రాశాడు. నేడు 600 కీర్తనలు దొరుకుతున్నాయి.

2) తాళ్ళపాక అన్నమాచార్యులు :
ఈయన ఆంధ్రలో కడప జిల్లా తాళ్ళపాక నివాసి. ఈతడు తిరుపతి వేంకటేశ్వరునిపై తెలుగులో సంకీర్తనలు రచించాడు. ఈయన 1408 – 1503 వరకు జీవించాడు. 32 వేల కీర్తనలు చక్కని చిక్కని తెలుగులో రచించాడు.

3) కంచర్ల గోపన్న :
17వ శతాబ్ది చివరివాడు. రామదాసుగా ప్రఖ్యాతి పొందాడు. దాశరథి శతకం, కీర్తనలు రచించాడు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. ఈ కింది పదాలను విడదీయండి.

1. ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ)
ఆ) మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ)

2. ఉదా : పరోపకారం = పర + ఉపకారం – (అ + ఉ = ఓ)
ఇ) మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ = ఓ)
ఈ) దేశోన్నతి = దేశ + ఉన్నతి , (అ + ఉ = ఓ)

3. ఉదా : మహర్షి = మహా + ఋషి = (ఆ + ఋ = అర్)
ఉ) రాజరి = రాజ + ఋషి = (అ + ఋ = అర్)

గమనిక :
పైన పేర్కొన్న పదాలను మూడు రకాలుగా విడదీయడం సాధ్యమయ్యింది. అవి. అ / ఆ + ఇ / ఈ = ఏ; అ / ఆ + ఉ / ఊ = ఓ; అ / ఆ + ఋ / ఋ = అర్

ఈ మూడు సందర్భాల్లోనూ, పూర్వస్వరం, ‘అ’ ఆ; పరస్వరం స్థానంలో ఇ, ఉ, ఋ లు వచ్చాయి. ‘ఇ’ కలిసినపుడు ‘ఏ’ ; ‘ఉ’ కలిసినపుడు ‘ఓ’ ; ‘ఋ’ కలిసినపుడు ‘అర్’ ఆదేశంగా వచ్చాయి. ఇందులో ఏ, ఓ, అర్లను గుణాలు అంటారు. ఇలా ఏర్పడే సంధిని ‘గుణసంధి’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. ఈ కింది పదాలను కలిపి రాయండి. సంధి ఏర్పడ్డ విధానాన్ని చర్చించండి.
ఉదా : రాజ + ఉత్తముడు = (అ + ఉ = ఓ) = రాజోత్తముడు

1) సుర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = సురేంద్రుడు
2) దేవ + ఋషి = (అ + ఋ = అర్) = దేవర్షి
3) స్వాతంత్ర్య + ఉద్యమం = (అ + ఉ = ఓ) = స్వాతంత్ర్యోద్యమం

3. అ) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1) ఇగురొత్త = ఇగురు + ఒత్త = (ఉ + ఒ = ఒ) – ఉత్వసంధి
2) సున్నితంబైన = సున్నితంబు + ఐన = (ఉ + ఐ = ఐ) – ఉత్వసంధి
3) కలదోయి = కలదు + ఓయి = (ఉ + ఓ = ఓ) – ఉత్వసంధి
4) నీకెవ్వరు = నీకున్ + ఎవ్వరు – ఉత్వసంధి
5) నిలుపకున్నె = నిలుపక + ఉన్నె – (అ + ఉ = ఉ) – అత్వసంధి
6) పసుపుగుంకాలు = పసుపు + కుంకాలు – గసడదవాదేశ సంధి
7) నునుపుల్ దీర్చి : నునుపుల్ + తీర్చి – గసడదవాదేశ సంధి
8) అబద్ధంబు గాదు = అబద్ధంబు + కాదు – గసడదవాదేశ సంధి
9) సార్థకము = స + అర్థకము = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
10) కిరీటాకృతి . . = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి

ఆ) కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1) గహ్వరశ్రేణి గహ్వరముల యొక్క శ్రేణి షష్ఠీ తత్పురుష సమాసం
2) మానవ విగ్రహాలు మానవుల యొక్క విగ్రహాలు షష్ఠీ తత్పురుష సమాసం
3) శిల్పి కంఠీరవుడు శిల్పులలో కంఠీరవుడు షష్ఠీ తత్పురుష సమాసం
4) దేవస్థలములు దేవతల యొక్క స్థలములు షష్ఠీ తత్పురుష సమాసం
5) కవి కలము కవి యొక్క కలము షష్ఠీ తత్పురుష సమాసం
6) కుసుమ వల్లరులు కుసుమముల యొక్క వల్లరులు షష్ఠీ తత్పురుష సమాసం
7) శిరోగ్రము శిరస్సు యొక్క అగ్రము షష్ఠీ తత్పురుష సమాసం
8) కిరీటాకృతి కిరీటము యొక్క ఆకృతి షష్ఠీ తత్పురుష సమాసం
9) విద్యానిధి విద్యలయందు నిధి సప్తమీ తత్పురుష సమాసం
10) సోగకన్నులు సోగయైన కన్నులు విశేషణ పూర్వపద కర్మధారయం
11) సర్వ పర్వతములు సర్వములైన పర్వతములు విశేషణ పూర్వపద కర్మధారయం
12) పసుపు కుంకాలు పసుపూ, కుంకుమా ద్వంద్వ సమాసం

ఇ) ఈ కింది పదాలకు ప్రకృతి, వికృతులు రాయుము.

ప్రకృతి – వికృతి
1. సింహము – సింగము
2. చిత్రము – చిత్తరువు
3. స్థలము – తల
4. స్తంభము – కంబము
5. అప్సర – అచ్చర
6. పశ్చాత్ – పజ్జ
7. విద్య – విద్దె
8. కవి – కయి
9. ముఖము – మొగము
10. గహ్వరము – గవి
11. నిద్ర – నిద్దుర
12. పుణ్యం – పున్నెం

కవి పరిచయం

పాఠం : శిల్పి
కవి : గుఱ్ఱం జాషువ
పాఠం దేని నుండి గ్రహింపబడింది : జాషువ రచించిన “ఖండకావ్యం” మొదటి భాగం నుండి
కవి జననం : సెప్టెంబరు 28వ తేదీ 1895. (28-09-1895)
మరణం : జులై 24, 1971. (24-07-1971)
జన్మస్థలం : గుంటూరు జిల్లా వినుకొండ’.
ప్రసిద్ధి : జాషువ ఆధునిక పద్యకవులలో అగ్రశ్రేణి కవి.
రచనలు : 1) పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, కాందిశీకుడు, స్వప్నకథ, ఖండకావ్యాలు 7 భాగాలు; మొదలైన పద్యకావ్యాలు. 2) రుక్మిణీ కల్యాణం, తెరచాటు, మీరాబాయి వంటి నాటకాలు.
బహుమతులు : వీరు రాసిన ‘క్రీస్తు చరిత్ర’ కు – కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
బిరుదులు : కవికోకిల, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవిచక్రవర్తి.
సత్కారాలు : 1) ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదును ఇచ్చింది.
2) భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ బిరుదుతో సత్కరించింది.
3) గజారోహణం
4) గండపెండేరం
5) కనకాభిషేకం వంటి సత్కారాలు పొందారు.

1. ‘శిల్పి’ ప్రజ్ఞకు నమస్కారం పెట్టిన జాషువ కవిని పరిచయం చెయ్యండి.
జవాబు:
గుఱ్ఱం జాషువ 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. జాషువ తన ఖండకావ్యం మొదటి భాగంలో ‘శిల్పి’ని గురించి ప్రశంసించాడు. ఈయన పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహలు, స్వప్నకథ, ఖండకావ్యాలు 7 భాగాలు, రుక్మిణీ కల్యాణము వంటి నాటకాలు రచించాడు.

ఈయనకు కవికోకిల, పద్మభూషణ్, నవయుగ కవిచక్రవర్తి, కళాప్రపూర్ణ వంటి బిరుదులు ఉన్నాయి.. ఈయన రాసిన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.

ఈయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ఇచ్చింది. గజారోహణం, గండ పెండేరం వంటి సన్మానాలు వీరికి లభించాయి.

కొత్త పదాలు-అర్థాలు

అచ్చర = అప్సరస
ఇగురొత్తు = చిగురించు
ఉప్పొంగు = పైకి పొంగు
కంబము
కంఠీరవము = సింహం
కవనము = కవిత్వం
కుసుమములు = పుష్పాలు
గహ్వరము = గుహ
చాతురి = నేర్పు
చాతుర్యము = నేర్పు
చిరజీవత్వము = చాలాకాలం జీవించుట
చేతము = మనస్సు
తారతమ్యము = తేడా
దేవస్థలము = దేవాలయం
ప్రతిమ = బొమ్మ; విగ్రహం
పాషాణము = బండరాయి
పజ్జ = దగ్గర, వెనుక
ప్రజ్ఞ = తెలివి, నేర్పు, ప్రతిభ
మలచు = చెక్కు
వల్లరులు = తీగలు
వసుధ = భూమి
విగ్రహము = ప్రతిమ
వల్లెవేయు = తిరిగి తిరిగి చదువు
శిరోగ్రము = తలపైన
సోగ = పొడవైన
సోకించి = తగిలించి
శ్రేణి = వరుస
హరిత్తులు = దిక్కులు, (లేక) సింహాలు

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యం :

తే॥గీ॥ చేత మిగురొత్త నొక నల్లజాతియందు
మలచినాడవు, భయద సింహముల తలలు
వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
జిత్రముల నెన్ని గతులఁ జూచెదవో నీవు !
అర్థాలు :
చేతము = మనస్సు
ఇగురొత్తన్ (ఇగురు + ఒత్తన్) = చిగురించేటట్లు
ఒక నల్ల జాతియందున్ = ఒక నల్లని ఱాయిపై
భయద సింహముల = భయంకరమైన సింహాల యొక్క
తలలు = తలలు
మలచినాడవు = చెక్కినావు
నీవు = నీవు
వసుధన్ = భూమిపై
కన్పట్టు = కనబడే
సర్వ పర్వతములందున్ = అన్ని పర్వతాలలోనూ
ఎన్ని గతులన్ = ఎన్ని విధాలుగా
చిత్రములన్ = శిల్పాలను
చూచెదవో (చూచెదవు + ఒ) = చూస్తావో !

భావం :
ఓ శిల్పీ ! నీవు మనసు చిగురించేటట్లు నల్లరాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కావు. భూమి మీద కనిపించే కొండలలోని రూపాలను నీవు ఎన్ని విధాలుగా చూస్తావో !

విశేషం :
నిజమైన సింహం అనే భ్రాంతి కల్గించేటట్లు సింహాల తలలు చెక్కాడని భావం.

2వ పద్యం :

తే॥గీ॥ సున్నితంబైన నీచేతి సుత్తెనుండి
బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
సార్ధకము గాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ !
ప్రతిపదార్థం :
సున్నితంబైన (సున్నితంబు + ఐన) = కోమలమైన
నీ చేతి = నీ చేతిలోని
సుత్తె నుండి = సుత్తి నుంచి
ఎన్ని, ఎన్ని = ఎన్నెన్నో
దేవస్థలములు = దేవాలయాలు
బయలుపడెన్ = వెలువడ్డాయి
సార్థకము + కాని = ప్రయోజనము లేని (వ్యర్థమైన)
ఎన్ని పాషాణములకు = ఎన్నో బండఱాళ్ళకు
పసుపు కుంకాల పూజ = పసుపు, కుంకుమలతో పూజ;
ఈనాడు = ఈ రోజు
కలిగెన్ = లభించిందో కదా !

భావం :
మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్నో దేవాలయాలు బయటపడ్డాయి. ఒకనాడు వ్యర్థంగా పడియున్న ఎన్నో బండబాళ్ళకు, నీవల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం నేడు లభించింది.

(అంటే శిల్పి ఆ బండటాళ్ళను, దేవతా విగ్రహాలుగా చెక్కాడని, ఆ దేవతా విగ్రహాలను ప్రజలు పసుపు, కుంకుమలతో నేడు పూజిస్తున్నారనీ భావం.)

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

3వ పద్యం :

తే॥గీ॥ కవికలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున;
గాకపోయినఁ బెను జాతికంబములకు
గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు?
ప్రతిపదార్థం :
ఓయి శిల్పి – ఓ శిల్పీ !
కవి = కవి యొక్క
కలంబున + కల = కలమునందున్న
అలంకార రచన = అలంకార రచనాశక్తి (అందముగా తీర్చిదిద్దే శక్తి)
నీ + ఉలి ముఖమున = నీ ఉలి అనే ఇనుప పనిముట్టు నందు కూడ
కలదు కలదు = నిశ్చయంగా ఉంది
కాకపోయిన = అలా నీ ఉలిలో (అలంకార రచన శక్తి) లేకపోతే
పెను = పెద్ద
ఱాతికంబములకు = రాతి స్తంభములకు
కుసుమ వల్లరులు = పూలగుత్తులు (పూల తీగలు)
ఏ రీతిన్ = ఏ విధంగా
గ్రుచ్చినావు = చెక్కగలిగావు (నాటినావు)

భావం :
కవి కలానికి వర్ణించే శక్తి ఉంది. అటువంటి
అలంకార రచనా శక్తి నీ ఉలికి కూడా ఉంది. లేకపోతే కఠినమైన రాతిస్తంభంలో పూసిన లేత కొమ్మలను (పూలగుత్తులను) నీవు ఎలా చెక్కగలిగావు?

(ఉలి = శిల్పి రాళ్ళను చెక్కుటకు ఉపయోగించే ఇనుప పనిముట్టు.)

4వ పద్యం :

తే॥గీ॥ ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింప గలవు చూపరులచేత;
గవనమునఁ జిత్రములు గూర్చు కవికి నీకుఁ
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
ప్రతిపదార్థం :
ప్రతిమలు = శిల్పములు (ఱాతిపై బొమ్మలు)
రచించి = చెక్కి
ఒక మహారాజు చరితన్ = ఒక మహారాజు కథను
చూపరుల చేత = చూచేవారి చేత
వల్లెవేయింపగలవు = చెప్పించగలవు
కవనమునన్ = కవిత్వమందు
చిత్రములు + కూర్చు = బొమ్మలను చూపే
కవికిన్ = కవికీ
నీకున్ = నీకూ
తారతమ్యంబు లేదు = తేడా లేదు
అబద్ధంబు కాదు = ఈ మాట అబద్ధం కాదు.

భావం :
నీ శిల్పాలు చూసేవారిచేత నీ శిల్పాలు, ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో చిత్రాలను చెక్కే కవికీ, నీకూ ఏ మాత్రమూ తేడా లేదు. ఇది నిజమైన మాట.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

5వ పద్యం

తే॥గీ॥ ఱాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
యులిని సోకించి బయటికిఁ బిలిచినావు;
వెలికి రానేర్చి నీ పేరు నిలపకున్నె
శాశ్వతుడ వోయి నీవు నిశ్చయముగాను.
ప్రతిపదార్థం :
ఱాలన్ = రాళ్ళల్లో
నిద్రించు = నిద్రపోతున్న (దాగి ఉన్న)
ప్రతిమలన్ = శిల్పాలను (బొమ్మలను)
ఉలిని = నీ ఉలిని
సోకించి = రాళ్ళకు తగులునట్లు చేసి
బయటికిన్ = వెలుపలికి
పిలిచినావు = ఆ బొమ్మలను పిలిచావు (రప్పించావు)
వెలికిన్ = బయటకు
రానేర్చి = ఆ చిత్రాలు రాగలిగి (వచ్చి)
నీ పేరున్ = నీ పేరును
నిలపకున్న (నిలపక + ఉన్నె) = నిలబెట్టకుండా ఉంటాయా?
నీవు = నీవు
నిశ్చయముగాన్ = తప్పకుండా
శాశ్వతుడవు + ఓయి = శాశ్వతత్వం కలవాడవు (చిరంజీవివి)

భావం :
బాళ్ళల్లో దాగియున్న (నిద్రపోతున్న) బొమ్మలను, నీ ఉలిని తాకించి వాటిని మేల్కొలిపి బయటకు పిలిచావు. ఆ శిల్పాలు బయటకు వచ్చి, నీ పేరు నిలబెట్ట కుండా ఉండవు. నీవు నిశ్చయంగా చిరంజీవివి.

6వ పద్యం :

మ|| తలయెత్తెన్ గద, నీదు చాతురి యజంతాగహ్వరశ్రేణి గే
వల పాషాణములందు; జీవకళ నిల్పంజాలు నీ సుత్తిలో
మొలుచు న్మానవ విగ్రహంబులు; మహాపుణ్యుండవయ్యా ! హరి
త్తులు, నీ బొమ్మలచెంత ముగ్ధగతినందున్; శిల్పికంఠీరవా!
ప్రతిపదార్థం :
శిల్పి కంఠీరవా = శిల్పులలో సింహం వంటి గొప్పవాడా ! (శిల్పి శ్రేష్ఠా!)
అజంతా గహ్వర శ్రేణిన్ = అజంతా గుహల సముదాయంలో
నీదు చాతురి = నీ నైపుణ్యం
తలయెత్తైన గద (తల + ఎత్తైన్ + కద) = తలఎత్తుకొని నిలబడింది కదా! (వెల్లడి అయినది కదా!)
కేవల పాషాణములందున్ = వట్టి బండరాళ్ళలో
జీవకళ నిల్పంజాలు = సజీవత్వంను చూపగల
నీ సుత్తెలోన్ = నీ సుత్తెలో నుండి
మానవ విగ్రహంబులు = మనుష్యుల బొమ్మలు
మొలుచున్ = మొలుస్తాయి (రూపుదిద్దుకుంటాయి)
అయ్యా = ఓ శిల్పీ !
మహా పుణ్యుండవు = నీవు గొప్ప పుణ్యమూర్తివి,
నీ బొమ్మల చెంతన్ = నీ బొమ్మల ప్రక్కన
హరిత్తులు = సింహాలు
ముగ్గగతిన్ + అందున్ = ముగ్గములు అవుతాయి (సంతోషముతో ఉక్కిరి బిక్కిరవుతాయి) (నీ శిల్ప నైపుణ్యాన్ని చూచి మెచ్చుకుంటాయి).

భావం :
ఓ శిల్పి శ్రేష్ఠుడా ! అజంతా గుహలలో నీ శిల్పనైపుణ్యం వెల్లడయ్యింది కదా ! నీ సుత్తి, వట్టి బండరాళ్ళలో కూడా జీవకళను నిలుపగలదు. నీ సుత్తిలో నుండి మానవ విగ్రహాలు పుడతాయి. నీవు పుణ్యమూర్తివి. నిజమైన సింహాలు సైతం, నీ శిల్పాలను చూచి ముగ్ధములు అవుతాయి.

విశేషం :
‘హరిత్తులు అంటే ‘సింహాలు’ అని, దిక్కులు అని అర్థం. శిల్పంగా చెక్కిన సింహాలను చూచి సింహాలు ఆనందిస్తాయి. అంటే నిజమైన సింహాల కన్న సింహాకృతిలో ఉన్న శిల్పమే అందంగా చెక్కబడిందని భావం.

7వ పద్యం :

మ|| నునుపుల్ దీర్చి మదంబు చిందిపడ నేన్గున్ గున్నలన్ జెక్కి వై
చిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్సత్కిరీటాకృతిన్;
తెనుగుందేశము నిన్నువంటి పనివానిం జూచి యుప్పొంగుచుం
డును; నీ లేమి దలంచి కంటఁ దడిబెట్టున్; శిల్పవిద్యానిధీ !
ప్రతిపదార్థం :
శిల్ప విద్యానిధీ = శిల్ప విద్యలో గొప్పవాడా !
నునుపుల్ + తీర్చి = ,బాతిని నున్నగా చేసి
మదంబు + చిందిపడన్ = బొమ్మలలో మదము ఉట్టిపడేటట్లు
ఎన్గున్ = ఏనుగునూ
గున్నలన్ = ఏనుగు పిల్లలనూ
చెక్కివైచిన = చెక్కిన
చాతుర్యము = నేర్పు
నీ శిరోగ్రము = నీ తలపై
సత్కిరీటాకృతిన్ (సత్ + కిరీట + ఆకృతిన్) = మంచి కిరీటము యొక్క ఆకారం వలె
నిల్చెన్ = నిలబడింది
తెనుగుం దేశము = తెలుగు దేశం
నిన్ను వంటి = నీ వంటి
పనివానిన్ = పనివాడిని (శిల్పం చెక్కడంలో నేర్పుగలవాడిని)
చూచి = చూచి
ఉప్పొంగుచుండును = సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది
ఆ నీ లేమి + తలంచి = నీ దరిద్రాన్ని చూచి
కంట + తడి పెట్టున్ = కన్నీరు కారుస్తుంది.

భావం :
శిల్ప విద్యలో నిధివంటివాడా ! రాతిని నునుపు చేసి మదం చిందేటట్లుగా ఏనుగునూ, దాని పిల్లలనూ చెక్కిన నీ నేర్పు, నీ తలపై మంచి కిరీటం వలె నిలిచింది. తెలుగునేల నీ వంటి పనివాళ్ళను చూసి ఉప్పొంగిపోతూ ఉంటుంది. నీ దారిద్య్రాన్ని చూచి కన్నీరు కారుస్తుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

8వ పద్యం :

మ|| తెలిజాతిన్ జెలువార నచ్చరపడంతిం దిద్ది యా సోగ క
న్నుల పజ్జన్ నిను నీవు దిద్దుకొని, సంతోషించుచున్నాడవా!
భళిరే ! శిల్పిజగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో
గల నీకెవ్వడు సాటివచ్చును? నమస్కారంబు నీ ప్రజ్ఞకున్.
ప్రతిపదార్థం :
తెలిఱాతిన్ = తెల్లని చంద్రకాంత శిలపై;
చెలువారన్ = అందంగా
అచ్చర పడంతిన్ = అప్సరసను
దిద్ది = చెక్కి
ఆ సోగకన్నుల = ఆ అప్సరస యొక్క పొడవైన కన్నుల యొక్క
పజ్జన్ = వెనుక
నినున్ = నిన్ను
నీవు = నీవు
దిద్దుకొని = మలచుకొని;
సంతోషించుచున్నాడవా ! = సంతోషిస్తున్నావా !
భళిరే = ఆశ్చర్యము
శిల్పి జగంబులోన = శిల్పి ప్రపంచంలో
చిరజీవత్వంబు = శాశ్వతత్వాన్ని
సృష్టించుకోగల = కల్పించుకోగలిగిన
నీకున్ = నీకు
ఎవ్వడు = ఎవడు
సాటి వచ్చును = సాటి రాగలడు .
నీ ప్రజ్ఞకున్ = నీ ప్రతిభకు (తెలివికి)
నమస్కారంబు = నమస్కారాలు.

భావం :
ఓ శిల్పీ ! తెల్లని చంద్రకాంత శిలలో అప్సరసను చెక్కి, ఆమె దీర్ఘమైన కన్నులకు ప్రక్కగా నిన్ను నీవు మలచుకొని సంతోషపడుతున్నావా ? భళా ! శిల్పి ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగలిగిన నీకు, ఎవరూ సాటిరారు. నీ ప్రజ్ఞకు నా నమస్కారాలు.