SCERT AP 9th Class Social Studies Guide Pdf 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం
9th Class Social Studies 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
పటం 1 : 1900 – 1950లలో ప్రజాస్వామ్య దేశాలు.
పటం 2 : 2011లో ప్రజాస్వామిక దేశాలు
ప్రశ్న 1.
అ) ఇచ్చిన పటాల ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలోని ఖండాలలో ప్రజాస్వామిక దేశాల పేర్లు రాయండి. (AS5)
ఆ) 2011లో ప్రజాస్వామికంగా ఉన్న ఆఫ్రికా దేశాలను గుర్తించండి.
జవాబు:
- దక్షిణాఫ్రికా
- నమీబియా
- బోట్సువానా
- మొజాంబిక్
- నైజీరియా
- జాంబియా
- టాంజానియా
- కెన్యా
- మడగాస్కర్
- మాలి
- సూడాన్
ఇ) 2011లో ప్రజాస్వామికం లేని పెద్ద దేశాలను గుర్తించండి.
జవాబు:
- చైనా
- కజకిస్థాన్
- సౌదీ అరేబియా
- అల్జీరియా
- జైరా
- అంగోలా
- ఇథియోపియా
- సోమాలియా
ప్రశ్న 2.
పటాలను అధ్యయనం చేసి కింది విషయాల గురించి ఆలోచించండి. (AS5)
అ) పటాల ఆధారంగా 20వ శతాబ్దం ప్రజాస్వామ్య విస్తరణకు ముఖ్యమైన యుగంగా పేర్కొనవచ్చా?
జవాబు:
అవును
ఆ) 20వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా ……………….. ఖండాలలో ఉండింది. ఇంకోవైపు ……………., ………… ఖండాలలో దాదాపుగా ప్రజాస్వామిక దేశాలు లేవు.
జవాబు:
ఉత్తర అమెరికా, ఐరోపా ; ఆఫ్రికా, ఆసియా.
ఇ) ఈనాటికి కూడా ప్రజాస్వామిక ప్రభుత్వాలు లేని …………………… వంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
జవాబు:
నైరుతీ ఆఫ్రికా, ఉత్తర ఆసియా.
ప్రశ్న 3.
చాలా దేశాలు ఎన్నికలు నిర్వహిస్తూ తాము ప్రజాస్వామిక దేశాలమని పేర్కొంటాయి. ఈ ఎన్నికలు మయన్మార్, లిబియాలలో ఎలా జరిగాయి? (AS1)
జవాబు:
లిబియా వలస పాలన నుండి, రాచరిక పాలన నుండి గఢాఫి, సైనిక నియంతృత్వ పరిపాలన కొనసాగింది. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది సామాజిక సంక్షేమంలో లిబియా అత్యున్నత స్థానాన్ని సాధించింది. ప్రజా సంఘాలను ఏర్పాటు చేయటం, కేంద్రంలో ఎన్నికైన ప్రజా శాసనసభ ద్వారా ప్రజా వ్యవహారాలలో సాధారణ ప్రజలు పాలుపంచుకోటాన్ని లిబియాలో ప్రోత్సహించారు. 2010 ద్వితీయార్ధం అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి అనేక ఉద్యమాలు చెలరేగాయి. అందులో లిబియా ఒకటి. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 2012 నుండి లిబియాలో ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికలు జరుగుతున్నాయి.
బర్మాలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రజలందరి హక్కులు కాపాడాలని బర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ కృషి చేశాడు. కాని ఆయనను చంపేశారు. తదుపరి బర్మా సైన్యాధిపతి జనరల్ నెవిన్ అధీనంలోకి వెళ్ళిపోయింది. బర్మాలో సంక్షేమం జరగలేదు. సైన్యాధిపతులు హక్కులు ఉల్లంఘించారు. 1988 నుండి బర్మాలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి ఆంగ్ సాన్ సూకి కేంద్ర బిందువుగా మారారు. 2011లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగగా 45 పార్లమెంట్ స్థానాలకు గాను 43 సీట్లు ఆంగ్ సాన్ సూకి సారథ్యం గల ఎన్ఎల్ డి గెలుచుకుంది. భవిష్యత్తులో పలు పార్టీలు పోటీచేసే ఎన్నికలు జరుగుతాయని ఆశిద్దాం.
ప్రశ్న 4.
ప్రసార మాధ్యమాల (మీడియా)ను నియంత్రించటానికి పాలకులు ఎందుకు ప్రయత్నించేవాళ్ళు? మీ ప్రాంతంలో ప్రసార మాధ్యమాలపై నియంత్రణ ఏవిధంగా ఉందో మీకు తెలుసా? (AS4)
జవాబు:
ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజలలో రాజకీయ అవగాహన కల్గించి, విజ్ఞానవంతులను చేయడానికి ప్రసార మాధ్యమాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ప్రసార మాధ్యమాలను పాలకులు తమ అధీనంలో ఉంచుకొని, వాటి ద్వారా ప్రజలను తమ పాలనపై మంచి అభిప్రాయం కలిగేటట్లు కార్యక్రమాలు రూపొందించేవాళ్ళు.
ప్రసార మాధ్యమాలను నియంత్రించకపోతే అవి పాలకుల అవినీతి, నిరంకుశత్వ నిర్ణయాలు, దోపిడీ పరిపాలన, ప్రజలను ఏవిధంగా మోసం చేసి పరిపాలిస్తున్నదీ తెలియజేసి ప్రజలను, ముఖ్యంగా యువత, మహిళలను చైతన్యపరిచినట్లైతే వారు నిరసనలు, ఉద్యమాల ద్వారా పాలకుల పాలనకు చరమగీతం పాడగలరు. చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు కలవు. అందుకే ప్రసార మాధ్యమాలను నియంత్రించేవాళ్లు.
మా ప్రాంతంలో రేడియో, దూరదర్శన్లు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ మాధ్యమాల కార్యక్రమాలు అమలుచేయటానికి వీలులేదు.
ప్రశ్న 5.
తమ దేశాలలోని ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాలు, ఘటనల గురించి లిబియా, మయన్మార్‌కు చెందిన పౌరుల మధ్య సంభాషణను ఊహించి రాయండి. (AS6)
సంభాషణ
జవాబు:
లిబియా పౌరులు : వలస పాలనను ఎదిరించి, రాచరికాన్ని కాదని, సైనిక పాలనను తలదన్ని, మేం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించాం…… చరిత్రలో గొప్పవాళ్ళమయ్యాం.
మయన్మార్ పౌరులు : ఆగండి…. ఆగండి… ఏమీ మీ ప్రేలాపనలు. మీదొక పేద దేశం…. తినడానికి తిండి లేని దేశం. ఎడారులలో పశువులతో సంచరిస్తూ గడిపే మీ జీవితం. మీదొక చరిత్ర. ప్రజాస్వామ్యం కోసం పోరాటం…..
లిబియా పౌరులు : మీరు సాధించినది ఏమిటి? మీలో ఐక్యత లేదు. ప్రజలకు హక్కులు లేవు. బానిస బతుకులు వేలాదిమంది చావులు. ప్రజాస్వామ్యానికొక విధానం లేదు.
మయన్మార్ పౌరులు : ప్రజాస్వామ్యం కోసం పరితపించాం. సైనిక పాలనను ఎదిరించాం. ఆంగ్ సాన్ సూకిలాంటి వాళ్ళు తమ జీవితాలనే త్యాగం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు.
లిబియా పౌరులు : మా ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రపంచ మద్దతు ఉంది. ఐక్యరాజ్య సమితి సైతం మా పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతున్నాయి.
మయన్మార్ పౌరులు : మా దేశంలో ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇదే మా ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తికి నిదర్శనం.
లిబియా పౌరులు : ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి నేడు మేం ప్రజాస్వామ్య సంబరాలకు దగ్గరౌతున్నాం…..
మయన్మార్ పౌరులు : మేము కూడా ఎన్నెన్నో పోరాట పతాకాలు ఎగురవేసి ప్రజాస్వామ్య వేడుకలకు వెళుతున్నాం…….
ప్రశ్న 6.
ప్రజాస్వామ్యం పనిచేయటంలో అక్షరాస్యత, అందరికీ చదువు ఏ విధంగా దోహదం చేస్తాయి? (AS6)
(లేదా)
ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పని చేయటంలో అక్షరాస్యత ఏ విధంగా దోహదం చేస్తుంది?
జవాబు:
ఏ దేశంలో అక్షరాస్యత అందరికీ చదువు అందుతుందో, ఆ దేశం ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తుంది. ప్రజలు అక్షరాస్యులై విజ్ఞానవంతులైనచో పౌరహక్కుల వినియోగం, పౌరుల బాధ్యతలు సక్రమంగా అమలు జరుగుతాయి. ప్రజలలో పాలకులను ప్రశ్నించే తత్వం అలవడుతుంది. జవాబుదారీ పాలన కనపడుతుంది. అక్షరాస్యత, చదువుకున్న వాళ్ళలో కుటుంబ నిర్వహణ కాకుండా, తమ పనులలో, వృత్తులలో నైపుణ్యం చూపించి, ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగములలో అభివృద్ధి కనపడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి.. ఇవన్నీ సక్రమ వినియోగం జరగాలంటే ప్రజలు ఖచ్చితంగా అక్షరాస్యులవ్వాలి. మహిళా చట్టాలు, సమన్యాయపాలన, వివక్ష, దోపిడీ పాలన వంటి వాటిని దూరం చేయడానికి అక్షరాస్యత అవసరం. చదువుకున్న, చైతన్యవంతులైన యువత ఉండే ఆ దేశంలో ప్రజాస్వామ్య ఫలాలు పదికాలాలు నిలుస్తాయి.
ప్రశ్న 7.
ప్రజాస్వామ్యం, నియంతృత్వాల మధ్య తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
ప్రజాస్వామ్యం | నియంతృత్వం |
1. స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలుంటాయి. | 1. రాచరిక, సైనికపాలన ఉంటుంది. |
2. పౌరులకు హక్కులు కల్పించబడతాయి. | 2. పౌరులకు హక్కులు అందించబడవు, నియంత్రించబడతాయి. |
3. పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. | 3. పత్రికలపై ఆంక్షలు విధించబడతాయి. |
4. ప్రజలే పాలకులు. | 4. వంశపారంపర్య పాలన గాని, బలవంతంగా ఆక్రమించుకున్న పాలకులు. |
5. లౌకిక రాజ్యం అమలులో ఉంటుంది. | 5. అధికారిక మతం ఉంటుంది. |
6. పాలకులకు జవాబుదారీ తనం ఉంటుంది. | 6. జవాబుదారీ తనం ఉండదు. |
ప్రశ్న 8.
మయన్మార్ లో ప్రజాస్వామ్యానికై పోరాడటంలో ఆంగ్ సాన్ సూకి పాత్ర ఏమిటి?
జవాబు:
తన తండ్రిగారైన బర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ ఆశయాలు నిలబెట్టడానికి, బర్మాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆ నాటి నుంచి నేటి వరకు ఆంగ్ సాన్ సూకీ కేంద్రబిందువయ్యారు. పౌరహక్కులు విస్తరింపజేయాలని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పాలని, సైనిక ప్రభుత్వంపై ప్రపంచదేశాల ఒత్తిడికి కారణం సూకీ నిరంతర పోరాటదీక్షే. 2008 నుండి బర్మాలో స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిపించటానికి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సూకీ తన జీవితాన్ని ఫణంగా పెట్టారు. కాని సైనిక ప్రభుత్వం ఆమెను గృహ నిర్బంధంలో ఉంచి, తన కొడుకులను కలుసుకోకుండా, తన భర్త చనిపోయిన సందర్భంలో కూడా ఆమెకు స్వేచ్ఛ కల్పించలేదు.
అయినా ఆమె బర్మాలో స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి కృషిచేస్తూ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసి) “ జాతీయ ప్రజాస్వామ్య కూటమి” ద్వారా నిరంతరం పరితపిస్తూ, ప్రజాస్వామ్య ఫలాలు అందించడానికి తపిస్తున్నారు. ఈమె కృషికి 1991 లోనే ప్రపంచ శాంతి బహుమతి అందుకుంది.
ప్రశ్న 9.
ఈ అధ్యాయం చివరి పేరా చదివి కింది ప్రశ్నకు సమాధానమివ్వండి.
నూతన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది? (AS2)
జవాబు:
దేశాలు ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలలో కొన్నింటిని పరిష్కరించటానికి ప్రజలందరి స్వేచ్ఛను, హక్కులను గౌరవించే
ప్రజాస్వామ్యమే సరైన మార్గమని అందరికీ స్పష్టమవుతుంది. అత్యంత పేద ప్రజలు, బలహీన వర్గాలు కూడా తమ గొంతుక వినిపించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయం, శాంతిని అందించగల నూతన ప్రజాస్వామిక విధానాన్ని రూపొందించటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది.
9th Class Social Studies 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం InText Questions and Answers
9th Class Social Textbook Page No.235
ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచటంలో ఈ రకమైన పరిస్థితులు ఎటువంటి సమస్యలను సృష్టిస్తాయి?
జవాబు:
జాతుల ప్రాబల్యం, సంచారజీవనం, నిరక్షరాస్యత, మహిళలపై ఆంక్షల నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పాలు పంచుకునేలా చేయటం చాలా కష్టమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో ప్రజా సంఘాలను ఏర్పాటుచేయటం, కేంద్రంలో ఎన్నికైన ప్రజా శాసనసభ ద్వారా ప్రజా వ్యవహారాలలో సాధారణ ప్రజలు పాలుపంచుకోవటం చాలా సమస్యతో కూడుకున్న వ్యవహారం.
9th Class Social Textbook Page No.237
ప్రశ్న 2.
గఢాఫి ప్రభుత్వం వల్ల ఎంతో ప్రయోజనం పొందినప్పటికీ దానికి వ్యతిరేకంగా ఎందుకు తిరుగుబాటు చేశారు?
జవాబు:
గఢాఫి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి లిబియాను అన్ని రంగాలలో ముందుంచింది. ఎన్నికైన ప్రజాసంఘాలు ద్వారా పరిపాలనకు మధ్యతరగతి వర్గం ప్రోత్సహించింది. కాని గఢాఫి ప్రజాస్వామ్యాన్ని నమ్మలేదు. గఢాఫి ప్రజా సంఘాలకు సమాంతరంగా విప్లవ సంఘాల నాయకత్వ వ్యవస్థను ఏర్పరిచారు. రాజకీయ ప్రత్యర్థులను చంపటానికి, చిత్రహింసలు పెట్టడానికి, చంపేయటానికి గఢాఫి ప్రభుత్వం సంకల్పించింది. రాజకీయ పార్టీలకు అవకాశం లేదు. పత్రికా స్వేచ్ఛ లేదు. కనుకనే వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
ప్రశ్న 3.
గఢాఫి తనది ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకున్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఉండవలసిన ఏ అంశాలు అందులో లోపించాయి? ప్రజాస్వామిక ప్రభుత్వంలోని ఏ అంశాలు అందులో ఉన్నాయి?
జవాబు:
గఢాఫి రాచరికాన్ని రద్దుచేసి సైనిక పాలనలో ప్రభుత్వాన్ని ఏర్పరచినప్పటికీ ప్రజాసంక్షేమంకై అనేక సంస్కరణలు, పథకాలు అమలుచేసినప్పటికీ అందులో ప్రధానంగా ప్రజా సంఘాలను నమ్మటానికి సాహసించలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రధానపాత్ర పోషిస్తాయి. కాని గఢాఫి ఏ రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించలేదు. కార్మిక సంఘాలు, ఇతర స్వతంత్ర సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయ ప్రత్యర్థులను హింసించటానికి పూనుకున్నారు. పత్రికలకు స్వేచ్ఛలేదు.
ప్రజాస్వామిక అంశాలు కూడా ఉన్నాయి.
- అందరికీ విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు.
- వివక్షతను దూరం చేసి మహిళలకు స్వేచ్ఛ, సమాన హెూదా కల్పించటానికి కృషి చేశారు.
- భూపంపిణీ, భూసంస్కరణలు అమలుచేశారు.
- సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు.
ప్రశ్న 4.
ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండటం ఎందుకు ముఖ్యం? లిబియా అనుభవం నేపథ్యంలో వివరించండి.
జవాబు:
లిబియాలో పౌరహక్కులకు భంగం కలిగించే అనేక అంశాలు గమనించవచ్చు. మహిళలపై అణచివేత దృశ్యాలు, ప్రజల సంక్షేమం కంటే పాలకులకు జాతి సంక్షేమం, గౌరవం ప్రధానంగా ఉండేవి. ప్రభుత్వంపై విమర్శలను, వ్యతిరేకతను సహించే అవకాశం లేదు. పత్రికా స్వేచ్ఛ, సమన్యాయ పాలన లేకపోవడం పౌరహక్కులు ముఖ్యమని వివరించవచ్చు.
ప్రశ్న 5.
పత్రికలు, టివి వంటి ప్రసార సాధనాలను నియంత్రించటానికి నిరంకుశ పాలకులు ప్రయత్నిస్తారు. ప్రజలు తమ ఆలోచనలను, సమాచారాన్ని పంచుకోగల ఇతర మాధ్యమాలు మీకు తెలుసా?
జవాబు:
సమావేశాలు, వారం వారం జరిగే సంతలు, వివిధ జానపద కళారూపాలు, బుర్రకథ, నాటకాలు, బృందగానాలు, జముకుల కథలు, వివిధ కళారూపాలు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, ఫేస్ బుక్కులు వగైరా.
ప్రశ్న 6.
ఒక వ్యాపారి చనిపోవటంతో ట్యూనీసియా పోరాటం మొదలైంది. అంతర్జాల వేదికలైన “ఫేస్ బుక్” వంటి వాటి ద్వారా ఉద్యమం బలోపేతం అయ్యింది. ప్రభుత్వం ఇటువంటి వాటిని నియంత్రించటం అంత తేలిక ఎందుకు కాదు?
జవాబు:
ఒకప్పుడు ప్రసార మాధ్యమాలు ద్వారానే ప్రజాచైతన్యం, అవగాహన కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు జరిగేవి. అంతేకాకుండా . వాటి నియంత్రణతో ఎటువంటి చైతన్యం ప్రజలలో వచ్చేది కాదు. కాని కాలగమనంలో వచ్చిన అనేక సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధితో ప్రజల ఆలోచనలలో చాలా మార్పు వచ్చినది. ఇతరులకు తెలియకుండా, ప్రభుత్వ పరిశీలనకు అందకుండా ఒకరి భావాలు ఒకరు తెలుసుకుని పాలకులపై సమర శంఖం పూరించడానికి అవకాశాలు మెరుగయ్యాయి. ఇటువంటి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని నియంత్రించడం అంత తేలిక కాదు.
9th Class Social Textbook Page No.240
ప్రశ్న 7.
స్వాతంత్ర్యం తరువాత బర్మాలో ప్రజాస్వామ్యం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది?
జవాబు:
బర్మా మనకు స్వాతంత్ర్యం లభించిన 5 నెలల తరువాత స్వాతంత్ర్యం పొందినప్పటికీ వివిధ జాతులకు తమ హక్కులు, స్వయం నిర్ణయ హక్కుల కొరకు కృషి చేసిన బర్మన్ నాయకుడు ఆంగ్ సాన్ని చంపేశారు. ఆ తదుపరి బర్మా సైన్యం సైనిక బలగంతో పాలన చేజిక్కించుకుంది. బర్మాను పాలించిన సైన్యాధిపతులు మానవహక్కులు కాలరాసారు. ప్రజలు, పిల్లలు అనే తేడా. లేకుండా వెట్టిచాకిరి చేయించారు. ప్రజాస్వామ్యభావాలు, ఉద్యమాలు ప్రజలలోకి వెళ్ళకుండా సైనిక పాలకులు నియంతృత్వ పాలన కొనసాగించడంతో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేక పోయింది, ప్రజాస్వామ్య పోరాట పటిమ కనపరిచిన ఆంగ్ సాన్ సూకీ లాంటి వారిని గృహ నిర్బంధం చేశారు.
ప్రశ్న 8.
స్వాతంత్ర్యం తరువాత లిబియాలో ప్రజాస్వామ్యం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది?
జవాబు:
1951లో లిబియా స్వాతంత్ర్యం పొందినప్పటికీ పేద దేశం. రాచరికం తరువాత దేశ అభివృద్ధి కొరకు ప్రజల సంక్షేమం కొరకు యువత తీవ్రంగా కృషి చేసింది. 1969 నుండి మువమ్మర్ గఢాఫి రాచరికాన్ని కాదని, సైనిక పాలనలో ప్రజాస్వామ్య కార్యక్రమాలతో లిబియాను అన్ని రంగాలలో ముందుంచాడు. అయితే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజా సంఘాల ఏర్పాటును గఢాఫి నేతృత్వంలో తిరస్కరించారు. ప్రజలకు హక్కులు ఇవ్వక, స్వేచ్చలేక నిరంకుశ పాలనకు పూనుకున్నారు. ఉద్యమాలు, తిరుగుబాట్లు, హింసాత్మక ఘటనలు వలన లిబియాలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేకపోయింది.
ప్రశ్న 9.
లిబియా, బర్మాలలో స్వాతంత్ర్యం తీసుకురావటంలో విద్యార్థులు, యువత ప్రముఖ పాత్ర ఎందుకు పోషించారు?
జవాబు:
రెండు దేశాలలో యువత, విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారు. రెండు దేశాలలో కూడా సైనిక పాలనతో పౌరహక్కులు దూరమై, దేశ సంపదలు కొల్లగొట్టడమే కాకుండా వలస శక్తులు వలన దేశాలు నిర్వీర్యమయ్యాయి. విజ్ఞానవంతులైన యువత తమ దేశంలో గల దుర్భర పరిస్థితులు, బానిసత్వం, స్త్రీలకు గల కట్టుబాట్లు, అణచివేత ధోరణులు, వివిధ జాతుల మధ్య యుద్ధ వాతావరణం నుండి తమ దేశాలను రక్షించడానికి విద్యార్థులు, యువత ముందుకు వచ్చారు. దేశంలో శాంతిని, ఐక్యతను కాపాడి ప్రపంచ దేశములలో అగ్రగామిగా ఉండాలని యువత పూనుకున్నారు.
ప్రశ్న 10.
లిబియా, బర్మా ఘటనలలో ఎటువంటి పోలికలు మీకు కనపడ్డాయి? వీటిని దృష్టిలో ఉంచుకోండి – నాయకత్వం, పోరాట స్వరూపం, మార్పు ప్రక్రియ.
జవాబు:
నాయకత్వం :
- రెండు దేశాల నాయకులు సైనికపాలనే అమలుచేశారు.
- స్వేచ్ఛగా భయంలేని వాతావరణంలో జరిగిన ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాన్ని రెండుదేశాల ప్రజలు కోరుతున్నారు.
- గఢాఫి సైనిక పాలనలో ప్రజాస్వామ్య భావాలు అమలుచేయడానికి ప్రయత్నించాడు.
- ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు, నాయకత్వం కొరకు ఆంగ్ సాన్ సూకీ ప్రయత్నం చేశారు.
- లిబియా సైన్యాధిపతి గఢాఫి అయితే బర్మా సైన్యాధిపతి జనరల్ నెవిన్ దేశ అధికారాన్ని ఆక్రమించుకున్నారు.
- రెండు దేశాలను సైన్యం నుంచి ప్రధాన మద్దతు పొందిన వ్యక్తులు పాలించారు.
పోరాట స్వరూపం :
- లిబియాలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చెలరేగాయి.
- బర్మాలో సైనికపాలనకు వ్యతిరేకంగా నిరసనలు ఉద్యమాలు జరిగాయి.
- లిబియాలో నిరసనకారులు, ఉద్యమకారులపై బెంఘాజి వంటి పట్టణాలలో భద్రతాదళాలు కాల్పులు జరిపి చంపించారు.
- బర్మాలో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు నిరసనలో వేలమందిని చంపించారు.
మార్పు ప్రక్రియ :
- సైనిక ప్రభుత్వ పాలన నుండి రెండు దేశాలు మార్పు కోరుకోవాలి.
- రెండు దేశాలలో చివరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు కారణమైంది.
- ప్రజలు రెండుదేశాల సైనిక పాలనకు చరమగీతం పాడాలని, దానికి అనుగుణంగా మార్పు జరిగింది.
ప్రశ్న 11.
ఆ రెండు దేశాలలో ప్రజాస్వామ్యంగా మారే. నేపథ్యంలో ప్రధాన తేడాలు ఏమిటి?
వీటిని దృష్టిలో ఉంచుకోండి. నాయకత్వం, పోరాట స్వరూపం, మార్పు ప్రక్రియ.
జవాబు:
నాయకత్వం :
బర్మా తన ప్రస్థానాన్ని ప్రజాస్వామిక దేశంగా మొదలు పెట్టి సైనికపాలనలోకి మారితే, లిబియా రాచరికాన్ని వదిలించుకుని, సైనికపాలనతో అంతం అయింది. లిబియాలో సైనిక ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు గఢాఫీ నేతృత్వంలో ప్రవేశపెట్టింది.
కాని బర్మాలో పాలకులు ఎటువంటి అభివృద్ధికి అవకాశం ఇవ్వలేదు.
లిబియాలో నాయకులను గృహ నిర్బంధం చేయలేదు. కాని బర్మాలో ప్రజాస్వామ్య పోరాటం కొరకు కృషి చేస్తున్న ఆంగ్ . సాన్ సూకిని గృహ నిర్బంధం చేశారు.
పోరాట స్వరూపం :
- ప్రజాసంఘాలను వ్యతిరేకిస్తూ గఢాఫి రివల్యూషనరీ కౌన్సిల్ ద్వారా విప్లవసంఘాలను ఏర్పరిచాడు.
- జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్వారా ప్రజా ఉద్యమాలు.
- రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయటానికి, చిత్రహింసలు పెట్టడానికి, సైనికశక్తిని ఉపయోగించుకుంది లిబియా.
- బర్మాలో పాలకులు గృహ నిర్బంధంలో ఉంచి పోరాటస్ఫూర్తిని అడ్డగించాలని చూసింది.
- లిబియా పోరాటంలో. యువత ప్రధాన పాత్ర పోషించగా బర్మాలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారు.
- లిబియా పోరాటానికి, నిరసనలకు, ఐక్యరాజ్యసమితి మద్దతు పలకగా, బర్మా పోరాటానికి ప్రపంచం అంగీకారం తెలిపింది.
మార్పు ప్రక్రియ :
- లిబియాలో సంక్షేమ ఫలాలు అందించి, తమ ప్రభుత్వ ప్రాబల్యం పెంచుకోడానికి కృషి చేసింది.
- బర్మాలో సంక్షేమ ఫలాలు అందించకుండా ప్రజలను పేదరికంలోకి నెట్టారు.
- లిబియాలో మార్పు చాలా ఆలస్యమైంది.
- బర్మాలో మార్పు కొరకు స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మొదలైంది.
- బర్మాలో ఎన్నికలు ద్వారా ప్రజాస్వామ్య విధానంలో పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
- లిబియాలో రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఇవ్వలేదు.
- లిబియాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు ఉపయోగించుకున్నారు.
- బర్మాలో ఆ వాతావరణం ఇంకా అభివృద్ధి చెందలేదు.
ప్రశ్న 12.
రెండు దేశాల వివరణలలో రాజకీయ పార్టీలు, ఓటింగ్ కి సంబంధించిన వాక్యాలను గుర్తించండి.
జవాబు:
రెండు దేశాలలో రాజకీయ పార్టీలు రావాలని, ప్రజాస్వామ్య పద్దతిలో ఓటింగ్ జరగాలని వాంఛించాయి. లిబియాలో పార్టీలు ప్రతినిధులను లిబియాలో 200 మందిని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. బర్మాలో కూడా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్వారా జరిగిన ఓటింగ్ లో 80 శాతం సీట్లు సాధించాయి.
2011లో బర్మాలో 45 పార్లమెంట్ స్థానాలకు 43 స్థానాలు సూకి పార్టీ అయిన ఎన్ఎల్ డి గెలుచుకుంది.
రెండు దేశాలలో రాజకీయపార్టీలు ద్వారా, ఓటింగ్ ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్య భావాలు, పౌరహక్కులు పొందవచ్చని తలంచి ఆ దిశగా పయనిస్తున్నాయి.
ప్రశ్న 13.
2012 సంవత్సరంలో లిబియా, బర్మాలలో వచ్చిన మార్పులను రాయండి.
జవాబు:
విప్లవం విజయవంతం, గఢాఫి మరణం తరువాత లిబియాలో వంద రాజకీయ పార్టీలు పోటీచేయగా ప్రజలు స్వేచ్చగా ఎన్నికలలో పాల్గొని 200 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. 2012 నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది. ఒక తాత్కాలిక రాజ్యాంగం ఏర్పడింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య మనగలిగి, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడే దారులు కనిపిస్తున్నాయి.
బర్మాలో 2008 నుంచి మార్పులు సంభవించి ప్రజాస్వామిక గణతంత్రంగా మారింది. 2010లో ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఎన్నికలు జరిగాయి. ఆ తదుపరి 2011లో జరిగిన ఎన్నికలలో ఆంగ్ సాన్ సూకి ఎస్ఎల్ విజయవంతంగా విజయం పొందడం ప్రజాస్వామ్యానికి ఆరంభంగా చెప్పవచ్చు. లిబియాలాగా బర్మా కథ ఇంకా పూర్తికాలేదు. దేశం పూర్తి ప్రజాస్వామికంగా మారుతుందని, భవిష్యత్తులో పలు పార్టీలు పోటీచేసే ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నారు.
ప్రాజెక్టు
ప్రశ్న 1.
వార్తాపత్రికలు చదివి లిబియా, ఈజిప్టు లేదా ఇతర దేశాలలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వార్తలను కత్తిరించండి. వీటిని కాగితాలపై అంటించి తరగతిలో ప్రదర్శించండి.
పటనైపుణ్యం
ప్రశ్న 1.
ప్రపంచ పటంలో లిబియా, మయన్మార్ లను గుర్తించండి. అవి ఏ ఖండాలలో ఉన్నాయి?
ఇవి ఆఫ్రికా, ఆగ్నేయాసియా ఖండాలలో ఉన్నాయి.