Andhra Pradesh BIEAP AP Inter 1st Year Accountancy Study Material 3rd Lesson జంటపద్దు పుస్తక నిర్వహణ విధానం Textbook Questions and Answers.
AP Inter 1st Year Accountancy Study Material 3rd Lesson జంటపద్దు పుస్తక నిర్వహణ విధానం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జంటపద్దు విధానాన్ని నిర్వచించి, ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
వ్యాపార సంస్థలో ప్రతిరోజు అనేక వ్యాపార వ్యవహారాలు రికార్డు చేయాల్సి ఉంటుంది. ప్రతి వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ‘వచ్చిన అంశం’ లేదా ‘ఖర్చు / నష్టం అంశం’, దీన్నే డెబిట్ అంశం అంటారు. రెండవది ‘ఇచ్చిన అంశాన్ని’ ‘క్రెడిట్’ అని వ్యవహరిస్తారు. జంటపద్దు విధానానికి ఈ రెండు అంశాలే మూలాధారం. వ్యాపార వ్యవహారాల్లో ఇచ్చి, పుచ్చుకునే రెండు అంశాలను పుస్తకాల్లో నమోదు చేసే పద్ధతిని జంటపద్దు విధానం అంటారు.
ప్రతి వ్యాపార వ్యవహారములో రెండు విభిన్న అంశాలు ఉంటాయి. అవి
- ప్రయోజనాన్ని పొందే అంశము
- ప్రయోజనాన్ని ఇచ్చే అంశము.
ఈ రెండు అంశాలు రెండు వేర్వేరు ఖాతాలకు సంబంధించి ఉంటాయి. కాబట్టి ఒక వ్యవహారానికి చెందిన రెండు అంశాలు రెండు ఖాతాలలో విరుద్ధముగా వ్రాయవలసి ఉంటుంది. గణక శాస్త్రములో పుచ్చుకునే ప్రయోజనాన్ని సూచించడానికి ‘డెబిట్’ అనే పదాన్ని, ఇచ్చే ప్రయోజనాన్ని సూచించడానికి ‘క్రెడిట్’ అనే పదాన్ని వాడతారు. ఉదా: నగదుకు సరుకులు కొన్నట్లయితే సరుకులు సంస్థలోకి వస్తాయి. నగదు సంస్థ నుంచి పోతుంది. అనగా సరుకుల ఖాతా ప్రయోజనాన్ని పొందుతుంది. నగదు ఖాతా ప్రయోజనాన్ని ఇస్తుంది. అదేవిధముగా జీతాలు చెల్లిస్తే, జీతాల ఖాతా ప్రయోజనాన్ని పుచ్చుకోవడం నగదు ఖాతా ప్రయోజనాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యాపార వ్యవహారము జరిగినపుడు అది మార్పును కలిగించే రెండు అంశాలను రెండు వేర్వేరు ఖాతాలలో వ్రాయడాన్ని ‘జంటపద్దు విధానము’ అంటారు.
జంటపద్దు విధానము – ముఖ్య లక్షణాలు:
- వ్యాపార వ్యవహారము రెండు ఖాతాలను ప్రభావితం చేస్తాయి.
- రెండు అంశాలను డెబిట్, క్రెడిట్గా వ్యవహరిస్తారు.
- గణక భావనలు, సంప్రదాయాలు, సూత్రాల ఆధారముగా జంటపద్దు విధానములో లెక్కలను వ్రాయడం జరుగుతుంది.
- ఈ విధానము గణక ఖచ్చితాన్ని నిరూపించడానికి, అంకణా తయారు చేయడానికి దోహదం చేస్తుంది.
- అంకణా సహాయముతో వ్యాపార సంస్థ ముగింపు లెక్కలను తయారు చేస్తుంది.
ప్రశ్న 2.
వివిధ ఖాతాలు, ఆ ఖాతాల డెబిట్, క్రెడిట్ సూత్రములు వ్రాయండి. [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
ఒక వ్యాపారములో జరిగే వ్యవహారములన్నింటిని సంపూర్ణముగా రికార్డు చేయడమే అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కాబట్టి వ్యక్తికిగాని, ఆస్తికిగాని, అప్పుడుగాని, ఖర్చుకుగాని లేదా ఆదాయానికిగాని సంబంధించిన అన్ని వ్యవహారముల సంక్షిప్త స్వరూపము లేదా రికార్డును ఖాతా అనవచ్చు.
ఖాతాలను స్థూలముగా రెండు రకాలుగా విభజించవచ్చు.
- వ్యక్తిగత ఖాతాలు
- వ్యక్తిగతము కాని ఖాతాలు
1) వ్యక్తిగత ఖాతాలు: వ్యాపార సంస్థ ఏఏ వ్యక్తులతో వ్యవహారాలు జరుపుతుందో లేదా సంస్థలతో వ్యవహారాలు జరుపుతుందో ఆ ఖాతాలను వ్యక్తిగత ఖాతాలు అంటారు. ఈ ఖాతాలు సాధారణముగా సహజ వ్యక్తులు. ఉదా: రాముని ఖాతా, గోవింద్ ఖాతా లేదా న్యాయాత్మక లేదా కృత్రిమ వ్యక్తులు కావచ్చు. ఉదా: స్టేట్ బ్యాంక్ ఖాతా, జీవిత భీమా సంస్థ ఖాతా మొదలైనవి.
వ్యక్తిగత ఖాతాలలో డెబిట్, క్రెడిట్ సూత్రాలు: “పుచ్చుకునే వాని ఖాతాకు డెబిట్ చేయండి. ఇచ్చేవాని ఖాతాకు క్రెడిట్ చేయండి”. అనగా ప్రయోజనము పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. ప్రయోజనము ఇచ్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి.
2) వ్యక్తిగతం కాని ఖాతాలు: ఈ ఖాతాలను మరల రెండు రకాలుగా విభజించవచ్చు.
- వాస్తవిక ఖాతాలు
- నామమాత్రపు ఖాతాలు
i) వాస్తవిక ఖాతాలు: సంస్థకు చెందిన ఆస్తుల ఖాతాలు వాస్తవిక ఖాతాలు. ఈ ఆస్తులు కనిపించే ఆస్తులకు సంబంధించినవి కావచ్చు. ఉదా: యంత్రాలు, భవనాలు, ఫర్నిచర్ మొదలైనవి లేదా కనిపించని ఆస్తులకు సంబంధించిన ఖాతాలు కావచ్చు. ఉదా: గుడ్విల్, పేటెంటు హక్కులు మొ॥.
వాస్తవిక ఖాతాకు సంబంధించిన సూత్రము: “వచ్చే ఆస్తిని డెబిట్ చేయండి. పోయే ఆస్తిని క్రెడిట్ చేయండి”.
ii) నామమాత్రపు ఖాతాలు: వీటికి రూపము, చలనము ఉండదు. ఈ ఖాతాలు ఖర్చులు, నష్టాలు, లాభాలు, ఆదాయాలకు సంబంధించినవి. ఉదా.: జీతాల ఖాతా, అద్దె ఖాతా, వచ్చిన డిస్కౌంట్ ఖాతా మొ॥.
సౌమమాత్రపు ఖాతాలకు సంబంధించిన సూత్రము: “వ్యయాలను, నష్టాలను డెబిట్ చేయండి. ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయండి.
ప్రశ్న 3.
జంటపద్దు విధానంలోని ప్రయోజనాలు వివరించండి.
జవాబు:
జంటపద్దు విధానము అవలంబించుట ద్వారా దిగువ ప్రయోజనాలు కలుగుతాయి.
1) వ్యవహారాల సంపూర్ణ నమోదు: జంటపద్దు విధానములో వ్యవహారములోని రెండు అంశాలను రెండు విభిన్న ఖాతాలలో నమోదు చేస్తారు. కాబట్టి లెక్కలు వ్రాయడములో సంపూర్ణత చేకూరుతుంది.
2) శాస్త్రీయ పద్ధతి: ఈ విధానములో వ్యాపార వ్యవహారాలను గణకసూత్రాలు. అనుసరించి వ్రాయటం జరుగుతుంది. కాబట్టి అకౌంటింగ్ ధ్యేయము నెరవేరుతుంది.
3) అంకగణితపు ఖచ్చితము: ఈ పద్ధతిలో ఖాతాల నిల్వలతో అంకణాను తయారు చేస్తారు. ఇది అంకగణితపు ఖచ్చితాన్ని ఋజువు చేస్తుంది.
4) దోషాలను కనుగొని నివారించవచ్చు: అంకణాలో డెబిట్, క్రెడిట్ నిల్వలు సమానము కాకపోతే, లెక్కలు వ్రాయడములో దోషాలు జరిగినవని భావించవచ్చు. వాటిని సరిచేసి, నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు.
5) వ్యాపార ఫలితాలు: లాభనష్టాల ఖాతాను తయారుచేయుట ద్వారా వ్యాపార నికర ఫలితాన్ని కనుగొనవచ్చును.
6) ఆర్థిక స్థితి: సంవత్సరాంతాన ఆస్తి – అప్పుల పట్టికను తయారు చేయుట ద్వారా సంస్థ ఆర్థిక స్థితిగతులను కనుక్కోవచ్చు.
7) నియంత్రణ: అన్ని ఖాతాలు సక్రమముగా నిర్వహించుట ద్వారా యజమానికి వ్యాపార వ్యవహారాలపై నియంత్రణ ఉంటుంది.
8) ఫలితాలను పోల్చడం: వ్యాపార సంస్థ ప్రస్తుత ఆర్థిక ఫలితాలను గత సంవత్సరం ఫలితాలతో లేదా ఇతర సంస్థల ఫలితాలతో పోల్చి, సాధించిన ప్రగతిని కనుగొనవచ్చు.
9) నిర్ణయాలు: జంటపద్దు విధానము ద్వారా యజమానులు సకాలములో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక సమాచారము తోడ్పడుతుంది.
10) నమ్మదగిన సమాచారము: ఈ పద్ధతి వ్యాపారస్తులకు నమ్మదగిన సమాచారాన్ని అందజేస్తుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జంటపద్దు విధానం. [T.S. Mar. ’15]
జవాబు:
జంటపద్దు విధానం ఇటలీ దేశ వర్తకుడైన లూకాస్ పాసియోలి కనుగొన్నాడు. వ్యాపార వ్యవహారములోని రెండు అంశాలు రెండు ఖాతాలను ప్రభావితం చేస్తాయి. ఈ పద్ధతిలో అన్ని వ్యాపార వ్యవహారములను సంపూర్ణముగా రికార్డు చేయవలెనంటే ప్రయోజనము పొందే అంశాన్ని (డెబిట్), ప్రయోజనము ఇచ్చే అంశాన్ని (క్రెడిట్) నమోదు చేయాలి. ఈ విధముగా వ్యవహారములలోని రెండు అంశాలను రెండు విభిన్న ఖాతాలలో రాసే పద్ధతిని జంటపద్దు విధానమని జె. ఆర్. బాట్లిబాయ్ నిర్వచించారు. ‘
ప్రశ్న 2.
ఖాతా అంటే ఏమిటి ?
జవాబు:
ప్రతి వ్యాపార వ్యవహారములోని రెండు అంశాలు రెండు ఖాతాలుగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఒక సంక్షిప్త రికార్డును ఖాతా అనవచ్చు. ఖాతాలో దిగువ అంశాలు ఉంటాయి.
- ప్రతి ఖాతాపైన పేరు ఉంటుంది.
- ఖాతా ఎడమవైపు భాగాన్ని డెబిట్ అంటారు.
- ఖాతా కుడివైపు భాగాన్ని క్రెడిట్ అంటారు.
ఖాతా స్వరూపము దిగువ విధముగా T ఆకారములో ఉంటుంది.
ప్రశ్న 3.
అకౌంటింగ్ సమీకరణ
జవాబు:
అకౌంటింగ్ సమీకరణ ద్వందరూప భావనపై (డెబిట్, క్రెడిట్) ఆధారపడి ఉన్నది. అకౌంటింగ్ సమీకరణ సంస్థ ఆస్తుల మొత్తానికి, అప్పుల మొత్తానికి మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది.
ఆర్థిక వనరులు (ఆస్తులు) = బాధ్యతలు (అప్పులు)
సమీకరణ దిగువ విధముగా ఉంటుంది.
ఆస్తులు = సంస్థకున్న బాధ్యతలు
లేదా
ఆస్తులు = మూలధనము + అప్పులు
ప్రశ్న 4.
వ్యక్తిగతం కాని ఖాతాలు.
జవాబు:
వ్యక్తిగతం కాని ఖాతాలను రెండు రకాలుగా విభజిస్తారు.
- వాస్తవిక ఖాతాలు
- నామమాత్రపు ఖాతాలు
1) వాస్తవిక ఖాతాలు: సంస్థకు చెందిన ఆస్తుల ఖాతాలు వాస్తవిక ఖాతాలు. ఈ ఖాతాలో కనిపించే, కనిపించని ఆస్తులకు సంబంధించినవి.
ఉదా: భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్, గుడ్విల్, పేటెంట్లు మొదలైనవి.
2) నామమాత్రపు ఖాతాలు: వీటికి రూపము, చలనము ఉండదు. ఇవి సాధారణముగా వ్యయాలు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించిన ఖాతాలు.
ఉదా: జీతాల ఖాతా, అద్దె ఖాతా, డిస్కౌంట్ ఖాతా, వచ్చిన కమీషన్ ఖాతా మొదలైనవి.